Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అవధానం ఆంధ్రుల సొత్తు-1

తెలుగువారి వెయ్యేండ్ల సారసత్వంలో అవధాన ప్రక్రియ విశిష్టమైనది. ఈ శీర్షిక ద్వారా అవధాన విద్య గూర్చిన సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నారు డా. అనంత పద్మనాభరావు.

‘అవలీలగా అవధానం’ అనగానే కించిత్తు ఆశ్చర్యం వేస్తుంది. అష్టావధాన, శతావధానాదికాలు తెలుగువారి సొత్తు. ఇతర భాషలలో లేని ఈ వినూత్న ప్రక్రియ పురాతనం. 13వ శతాబ్ది నాటికే అవధాన విద్య ప్రాచుర్యంలో వున్నట్టు జక్కన విక్రమార్క చరిత్రలో చెప్పబడింది. అవధానాలు పాత చింతకాయ పచ్చడి – అని ఆధునికులు అవహేళన చేయవచ్చు.

యువతలో ధారణాశక్తి:

ఎంసెట్, నీట్, సివిల్స్ పోటీ పరీక్షలలో ర్యాంకులు సాధించడానికి అవధానం (Concentration) అవసరం. అభ్యాసం కూసువిద్య – అన్నారు పెద్దలు. ధారణ అనేధి అవధాన ప్రక్రియలో ముఖ్యం. ధారణ, ధోరణి – రెండూ రెండు కళ్ళు అవధానికి. ఇంటర్ చదివిన తర్వాత బ్రతుకుబడిలోకి అడుగుపెట్టే విద్యార్థికి తెలివితేటలకు తోడు కుశాగ్రబుద్ధి అవసరం. ఎన్ని గంటలు చదివాం? అనేది ప్రధానం కాదు. బుర్రలోకి ఎంత ఎక్కించుకొన్నాం? ఎక్కించుకొన్నవి ఎంత స్ఫురణలో వుంది? అనేది ముఖ్యం.

సినిమాల పేర్లు గుర్తుంటాయి:

ఏ యాక్టర్ ఈ సంవత్సరం ఏ ఏ సినిమాలలో నటించాడో, ఎలాంటి స్టెప్పు వేశాడో, ఏ డ్రెస్ మార్చాడో ఠపీమని చెప్పగల సామర్థ్యం చాలామందికి అలవాటు. నటీమణుల విషయంలో మరీ ముదురు. బి.ఎ.లో హిస్టరీ పాఠంలో అశోకుడు చెట్లు నాటించెను – అని చెప్పగలడు కానీ, ఏ ఏ రాజులు ఏ ఏ సంవత్సరాలలో పరిపాలించారో గుర్తుండి చావదు. హిస్టరీ బోర్. మాథమెటిక్స్ కొరుకుడుపడదు. జాగ్రఫీలో జిరాఫీలా మెడను  ముందుకు చాచడం తప్ప, నైనిటాల్ ఎక్కడుందో, నాగర్‌కోయిల్ ఏ రాష్ట్రంలో వుందో గుర్తుకురాదు. దాని మీద శ్రద్ధ తక్కువ. నటుల జన్మతేదీలు కంఠతా వచ్చు. ఇదీ యువత పరిస్థితి. దానికీ, అవధానానికి లంకె ఏమిటని మీ సందేహం. అష్టావధానంలో ఎనిమిది మందికి సమాధానం చెప్పడం అవధాని ఏకాగ్రతకు నిదర్శనం. మీరు క్రికెట్ స్కోర్ గుర్తుపెట్టుకొంటారు. ఆయన గంటాగణనంలో ఎన్ని గంటలు కొట్టారో చెప్పగలడు.

నెల్లూరు వేదసంస్కృతకళాశాలలో అనంతపద్మనాభరావు అవధానం 1973 జూన్

వందమంది వ్రాయసగాళ్లు:

నూరుమంది వ్రాయసగాళ్లు వరుసలో కూర్చుని వుంటే ఆ కవి ఆశువుగా నూరుమందికీ పద్యాలు చెప్పగలడు. రామరాజ భూషణుడు అనే 16వ శతాబ్ద కవి – ‘శతలేఖినీ పద్యసంధాన ధౌరేయుడు’. అంతేకాదు, ఘటికా శతగ్రంథకరణధుర్యుడు – అంతే ఒక ఘడియలో నూరు గ్రంథాలు రచించగల నేర్పరి. వినడానికి ఆశ్చర్యంగాను, అబ్బురంగాను, అతిశయోక్తిగాను వుండవచ్చు. అలాంటి పండితులు నడయాడిన ప్రదేశం ఆంధ్రదేశం.

రంగాజమ్మ, మధురవాణి వంటి విదుషీమణులు తంజావూరు నాయకరాజుల కాలంలో అవధాన విద్యను ప్రదర్శించి రఘునాధనాయకుని ప్రశంసలు, బహుమానాలు అందుకొన్నట్లు చరిత్ర చెబుతోంది. అవి పుక్కిటి పురాణాలని నేటి యువత కొట్టిపారవేస్తారు.

తిరుపతి వేంకట కవులు:

జంటకవులుగా ప్రసిద్ధులై 20వ శతాబ్ది తొలి దశకాలలో అవధాన విద్యతో జైత్రయాత్రలు చేశారు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, దివాకర్ల తిరుపతి శాస్త్రి అనే ఇద్దరు పండితులు. వారొక సభలో ఘనంగా చెప్పుకొన్నారు:

“వానలో తడియని వారు, మత్కవి వధాన మృదూక్తి మరందధారలో తడియని వారు లేరు” అన్నారు. వారితో సమానంగా పోటాపోటీగా మరో జంటకవులు కొప్పరపు సోదరకవులు బయలుదేరారు. ‘స్పర్థయా వర్ధతే విద్యా’. పోటీతత్వం వుంటే విద్య రాణిస్తుంది.

సివిల్స్‌లో ర్యాంకులు:

ఎన్నడో 1972లో సివిల్స్ పరీక్షలలో దువ్వూరు సుబ్బారావు టాపర్‍గా నిలిచి ఐ.ఎ.ఎస్. సాధించారు. ఆ తరువాత చాలా కాలానికి గాని తెలుగువాడైన ముత్యాలరాజు 2006లో టాపర్‍గా నిలిచారు. పోటీతత్వం గల పరీక్షలలో ర్యాంకు సాధించడానికి బుద్ధి కుశలత అవసరం. అది అభ్యాసంతో సిద్ధిస్తుంది. మతిమరపు, ఏమరుపు వ్యక్తికి సహజ లక్షణాలు. శ్రద్ధాసక్తులు, దీక్షాదక్షతలు వుంటే సాధించలేదిని ఏదీ లేదు. తల్లిదండ్రుల పెంపకం, వ్యక్తి కర్తవ్య నిష్ఠ, నిశిత దృష్టి – త్రివేణిసంగమంలా కలిసిపోవాలి. ‘కృషి వుంటే మనుషులు ఋషులవుతారు’ అన్నది ఆప్తవాక్యం. అవధానులు అలా తెలివితేటలు ఎలా సంపాదించారో గమనిద్దాం.

ఛందో బంధనాలు:

ఒక గాడిలో నడిస్తే విజయం సులభం. పట్టాల మీద రైలు పరుగులు తీసినంత కాలం ప్రమాదాలు రావు. అలానే తెలుగు భాషలో ఛందో నియమాలు ‘యమాతారాజభానసలగం’ అని మొదలుపెట్టి ‘నజ-భ-జ-జ-జ-ర’  చంపకమాల అని తెలుగు మేస్టారు కంఠతా పట్టిస్తారు. అర్థమెటిక్స్‍లో సూత్రాలు వల్లె వేయిస్తారు లెక్కల మేస్టారు. ఫిజిక్స్ మేస్టారు కొన్ని సూత్రాలు చెబుతారు. బుర్ర బద్దలు కొట్టుకొని వాటిని రుబ్బుడు పొత్రంలో మినపపొట్టు రుబ్బినట్టు రుబ్బుతారు. పరీక్ష హాలు నుంచి బయటపడగానే మెదడు ఖాళీ. దానికి కారణం ముక్కున పెట్టుకున్న సూత్రాలు మెదడుకెక్కలేదు.

కుర్తాళంపీఠాధిపతి సమక్షంలో

అవధానులు ఎలా నేర్చుకొన్నారు?:

జాన దుర్గా మల్లికార్జునరావు అనే 14 ఏళ్ళ కుర్రవాడు అవధానాలు చేయడం మొదలెట్టాడు. నేను ఆ అవధాని తొలి సభకు అధ్యక్షత వహించాను. అది 1980 ప్రాంతం. ఇప్పుడు పెద్దవాడై అవధాన విద్య కొనసాగిస్తూ వున్నారు. ఆయన తల్లిదండ్రులు పండితులు కాదు. స్వయం ప్రతిభతో నేర్చుకొన్న విద్య. సరస్వతీ కటాక్షం.

అష్టావధానం నేర్పించే పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు లేవు. ధూళిపాళ మహాదేవమణి కొందరిని తయారు చేయగలిగారు. దేవీ ఉపాసన వలన ఈ విద్య సాధించామని కొందరు ఇంటర్వ్యూలలో చెబుతుంటారు. ‘ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాః’ అన్నాడు కాళిదాసు. పురాకృత పుణ్యఫల విశేషం వల్ల విద్య లభిస్తుంది. లలితకళలలో ప్రవేశం సునాయాసమవుతుంది.

ఆశువుగా పద్యం చెప్పడం అలవరుచుకోవాలి.

“ఆంధ్రపత్రిక ఇచ్చట అమ్మబడును
అప్పికట్లకు పొన్నూరు ఆరుమైళ్లు
సామవేదము జానకీరామశర్మ” –

ఇలా పద్యపాదాలు నింపవచ్చు. అది వ్యర్థం. ఛందస్సుపై అధికారం సంపాదించాలి. ఆశువేగం అలవర్చుకోవాలి. నిఘంటువుపై పట్టు సాధించాలి. చమత్కారయుతమైన సమాధానాలు అప్రయత్నంగా రావాలి. సభాజనరంజకత నేర్చుకోవాలి.

అష్టావధాన ప్రక్రియ:

“అవధానంబున పాకశాసనన సుతుం డర్ధేందుకోటీరు సంగవ కాలంబున పూజసేయు” అని హరవిలాసంలో శ్రీనాథుడు అర్జునుడి తపస్సు సందర్భంలో ‘అవధానం’ అనే పదం వాడాడు. ఏకాగ్రత (Concentration) అని అర్థం. ఎనిమిది విషయాల మీద నిష్ఠ గలిగి ఉండడం అష్టావధానం. ఎనిమిది మంది ప్రశ్నించేవాళ్ళు వేదికపై అవధానికి రెండు వైపులా నలుగురేసి కూర్చుంటారు. మధ్యలో అవధాని. ఆయన పక్కనే సభాధక్షులు/సంచాలకులు.

దైవ ప్రార్థనతో, గురుస్తుతితో, పృచ్ఛక ప్రశంసతో అవధాని ప్రారంభం చేస్తారు. రాగయుక్తంగా పద్యాలు పాడి సభికులను మంత్రముగ్ధులను చేస్తాడు. సరస్వతీ సాక్షాత్కారం జరుగుతుంది. ప్రశ్నలు వేసే వారిని పృచ్ఛకులు అంటారు. వాళ్ళూ పండితులే. ఛందోనియమాలు, యతి, గణ, ప్రాసలు తెలిసినవారే. ఒక్కొక్కరికీ ఒక్కొక్క అంశం నిర్దేశిస్తారు. అందులో ఎనిమిది అంశాలు ఉంటాయి – నిషిద్ధాక్షరి, సమస్య, వర్ణన, దత్తపది, ఆశువు, పురాణ పఠనం, గంటాగణనము, అప్రస్తుత ప్రసంగం – అని ఎనిమిది అంశాలు.

న్యస్తాక్షరి, వ్యస్తాక్షరి, పుష్పతాడనము, చదరంగం తదితర అంశాలలో ఏ ఎనిమిదింటినైనా అవధాని ఎంచుకొంటారు.

సమయపాలన:

సాధారణంగా అష్టావధానం 60 నుండి 90 నిముషాల వ్యవధిలో పూర్తి అవుతుంది. పద్యానికి నాలుగు పాదలు. నాలుగు వరుసలలో (రౌండ్లు) అవధాని పూరణ చేస్తాడు. పృచ్ఛకులిచ్చిన అంశానికి మొదటి రౌండులో తొలి పాదం పూర్తి చేస్తాడు. రెండో పృచ్ఛకుని ప్రశ్న. ఆ తరువాత పూరణ. ఇలా నడుస్తూ వుంటుంది. మధ్యలో అప్రస్తుత ప్రసంగం చేసే వ్యక్తి –

“మీకు ఐశ్వర్యారాయ్ అంటే అభిమానమా?” అని చమత్కరిస్తాడు.

అవధాని చమత్కారంగా “ఐశ్వర్యం వస్తుంటే కాదంటామా?” అని సమాధానం చెప్పి సభను  నవ్విస్తాడు. సాధారణ జనానికి ఈ అప్రస్తుత ప్రసంగమే ఆసక్తిదాయకం. ఇలా మూడు రౌండ్లు పూర్తి చేసి నాలుగో రౌండు స్వేచ్ఛగా పూరిస్తాడు. ఇంతటితో పూరణ పూర్తి. మిగిలింది ధారణ! ఇక్కడే అసలు ఘట్టం!

(మళ్ళీ వచ్చే వారం)

Exit mobile version