Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బహుమతి

[తాటికోల పద్మావతి గారు రచించిన ‘బహుమతి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

రెండు రోజుల్లో భర్త సూర్యం పుట్టినరోజు వస్తున్నది. ఇప్పటినుంచే భార్య అరుణ హడావిడి చేస్తున్నది. భర్తకి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఆఫీసు స్టాఫ్ అందరిని పిలిచి ఈసారి ఇంట్లోనే గ్రాండ్‌గా పార్టీ చేయాలనుకుంది. ఆ విషయమే భర్తతో చెప్పింది.

“సాయంత్రం ఆఫీసు నుంచి త్వరగా రండి. షాప్‌కి వెళ్ళాలి. మంచి డ్రస్సు సెలెక్ట్ చేసుకోండి” అన్నది. పదేళ్ల కొడుకు శ్యాము “నేను కూడా వస్తాను” అన్నాడు. ముగ్గురూ కలిసి కారులో రేమండ్స్ షోరూమ్‌కి వెళ్లారు.

“మీరు డబ్బు కోసం వెనక ముందు చూడద్దు. నలుగురిలోను దర్జాగా, హోదాగా ఉండాలి. మీ డ్రస్ చూడగానే అందరి కళ్ళు మీ డ్రస్ మీదనే పడాలి. కాస్త ఖరీదైన మంచి డ్రస్సే కొనుక్కోండి” అంది.

“చూసేవాళ్ళు డ్రస్సును బట్టి గౌరవించరు. మన సంస్కారాన్ని బట్టి గుర్తిస్తారు” అన్నాడు సూర్యం.

చివరికి షాప్ అంతా వెతికి తల్లీ కొడుకు కలిసి మంచి డ్రస్సు సెలెక్ట్ చేశారు. ఖరీదు ఎక్కువే. “మమ్మీ! డాడీ బర్త్‌డేకి అక్క కూడా వస్తుందా?” అన్నాడు ఆశగా శ్యాము.

“అక్క చదువుకునేది పెద్ద రెసిడెన్షియల్ స్కూల్. చీటికిమాటికి పంపరు.. ఎలాగో సంక్రాంతి హాలిడేస్‌కి వస్తుందిలే” అని నచ్చచెప్పింది.

“తాతయ్య బామ్మ కూడా ఉంటే బాగుండేది. ఎవరూ లేకుండా డాడీ బర్తడే ఎలా జరుపుకోవటం?” అన్నాడు దిగులుగా.

“ఆఫీసు నుంచి చాలామంది వస్తారు. వాళ్ళందరూ నాన్నకి ముఖ్యమైన వాళ్ళు. గొప్ప గొప్ప వాళ్లంతా వస్తారు” అన్నది.

తల్లి చెప్పిన మాటలకి శ్యామ్ మనసులో బాధ అనిపించింది.

సూర్యం కొలీగ్స్‌నీ, ఫ్రెండ్స్‌నీ తన బర్త్‌డే సందర్భంగా ఇంటికి ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికీ స్వీటు, హాటు కూల్ డ్రింక్స్ అందించారు. అందరి మధ్యలో నిలబడి సూర్యం కేక్ కట్ చేస్తుంటే, ‘హ్యాపీ బర్తేడే’ అంటూ కోరసుగా పలికారందరూ.

ఫ్రెండ్స్ అంతా రకరకాల గిఫ్టులు పట్టుకొచ్చి అందిస్తుంటే సూర్యం వాళ్లకు షేక్‌హ్యాండ్ ఇచ్చి థాంక్స్ చెప్తున్నాడు.

అరుణ బెనారస్ సిల్క్ చీర కట్టుకొని మెడలో నగలు వేసుకుని హోదా వలకపోస్తూ అటు ఇటు తిరుగుతున్నది. వచ్చిన వాళ్లలో పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఉన్నారు.

“మీ పాప కూడా వస్తే బాగుండేది” అన్నారు కొంతమంది.

“హాస్టల్‌లో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఏదైనా అర్జెంట్ అయితేనే గాని పంపరు. చదువు ముఖ్యం కదా అని తీసుకు రాలేదు” అంది అరుణ.

శ్యామ్‌కి అక్క రాలేదని మనసులో బాధగా ఉంది. ఇంట్లో ఒక్కడికే బోర్ కొడుతుంది. స్కూలు ఇల్లు తప్ప బయటకి ఎక్కడికి పంపించరు. ఎవరితోనూ ఆడుకోనివ్వరు. ఎప్పుడూ చదువుకోవాలన్నా విసుగే. ‘మా ఫ్రెండ్ గోపికి బామ్మ తాతయ్య ఉన్నారుట. రాత్రికి కబుర్లు కథలు తెప్పించుకుంటాడట. తాతయ్యతో కలిసి పార్కులకు వెళ్తాడట. నాకు మా తాతయ్య బామ్మ ఇంట్లో ఉంటే ఎంతో హాయిగా ఉండేది’ అనుకున్నాడు బాధగా. ఆ పసివాడి మనసులో అక్క తాత బామ్మ దగ్గర ఉండాలని ఎంతో ఆరాటంగా ఉంది.

ఆ చిన్నారి మనసులో ఎన్నో ఆలోచనలు. పెద్దవాళ్లు విషయాల్లో తల దూర్చవద్దంటారు. అమ్మ డాడీతో పాటు తను కూడా కొత్త డ్రస్ వేసుకున్నాడు.

“డాడీ నీకో గిఫ్ట్” అంటూ ఒక కవర్లో నుంచి మరో అందంగా రంగులు కాగితాలతో ప్యాక్ చేసి ఉన్న ఒక చార్ట్‌ని బయటకు తీశాడు.

“హ్యాపీ బర్త్‌డే డాడీ” అంటూ ఆ గిఫ్ట్ ని తండ్రి చేతిలో పెట్టాడు శ్యామ్.

అతిథులంతా ఆ కవరులో ఏముందోనని ఆశ్చర్యంగా చూస్తున్నారు. చిన్నపిల్లవాడు ఏదో గ్రీటింగు ఇచ్చి ఉంటాడు అనుకున్నారు. అందులో ఏముందో చూడాలని కొంతమందికి ఆత్రంగా ఉంది. సూర్యంని కవర్ విప్పి చూడమన్నారు.

అందరి ముందు తీస్తే బాగుండదని “ఇప్పుడు ఎందుకు లేమ్మా! డాడీయే కదా! తర్వాత ఇవ్వచ్చుగా” అంటూ అరుణ భర్త చేతిలో నుంచి కవరు అందుకోబోతుంటే “చూడనివ్వు. ప్రేమగా ఇచ్చిన దాన్ని చూడకుండా ఎందుకు” అంటూనే కవరు నెమ్మదిగా ఓపెన్ చేశాడు సూర్యం.

చార్ట్ మీద అందంగా గీసిన రంగురంగుల బొమ్మలు ఉన్నాయి.

ఒక అందమైన ఇల్లు. పైన ఇద్దరు వృద్ధుల బొమ్మ ఆశ్రమంలో ఉన్నట్టు గీశాడు. దాని కింద అమ్మానాన్న బెంచి మీద కూర్చున్నట్టు, పక్కన జైలు కటకటాలు ఉన్న రూములో ఒక ఆడపిల్ల బొమ్మ దిద్దాడు. వాటి కింద ఒక పిల్లవాడు దీనంగా నిలబడి ఉన్నట్టు ఉన్నది ఆ చిత్రం.

‘ఇంత చిన్న పిల్లవాడి మనసులో ఇంత ఆలోచన’ అని అందరూ చప్పట్లు చరిచారు.

“ఇంత అద్భుతంగా ఎలా గీయగలిగాడు. మీ అబ్బాయి త్వరలో మంచి చిత్రకారుడు అయిపోతాడు” అంటూ అందరూ మెచ్చుకున్నారు.

అరుణ ముఖంలో చిరునవ్వులు మాయమయ్యాయి. ‘శ్యామ్ మనసులో ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది’ అనుకుంది.

సూర్యం చేతిలో నుంచి అతని ఫ్రెండ్ ఆ చిత్రాన్ని తీసి అందరికీ చూపిస్తున్నాడు. “ఇది ఏదో రంగుల బొమ్మలు అనుకుంటున్నారు. నిజానికి ఈ చిత్రం సమాజంలో ప్రతి ఇంట్లో జరుగుతున్న వాస్తవాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించాడు ఈ పసివాడు. ఈపాటికి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను” అంటూ అందరి వైపు చూశాడు.

కొంతమంది అర్థం కానట్లు ముఖాలు పెట్టారు. శ్యామ్ తండ్రి పక్కనే నిలబడి భయం భయంగా చూస్తున్నాడు.

“తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో, పిల్లలు హాస్టల్లో, అమ్మానాన్నలు ఆఫీస్ వర్క్ లో బిజీ అయిపోతుంటే, జైలు జీవితం లాగా గడపాల్సి వచ్చినందుకు ఆ పసివాడు దీనంగా నిలబడి చూస్తున్నాడు” అని చెప్పి,

“ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను” అన్నాడు మళ్ళీ ఒకసారి అందరు వైపు చూస్తూ. సూర్యం మనసులో అపరాధ భావం తొంగి చూసింది. అరుణ గిల్టీగా ఫీల్ అయింది.

కొడుకుని తీసుకుని గదిలోకి వెళ్లి “ఏమిటి నువ్వు చేసిన పని?” అని కోప్పడేసరికి శ్యామ్ వెక్కిళ్లు పెట్టి ఏడవడం మొదలుపెట్టాడు.

“వచ్చిన వాళ్లంతా ఏమనుకుంటారు. ఇలాంటి గిఫ్ట్ ఇస్తున్నామని ముందే తెలిస్తే నేను వద్దని చెప్పేదాన్ని” అంటూ కొడుకు మీద అరిచింది.

“అరుణా! వాడిని ఏమీ అనకు. వాడు నా కళ్ళు తెరిపించాడు” అంటూ కొడుకు చేతిని పట్టుకొని హాల్లోకి తీసుకొచ్చాడు తండ్రి సూర్యం.

సూర్యం పశ్చాతాపంతో కుమిలిపోతున్నాడు.

“నా పుట్టినరోజు సందర్భంగా నాకిచ్చిన బహుమతితో నా కళ్ళు తెరిపించాడు. నేను చేసిన తప్పుని తెలుసుకున్నాను. నా మనసులో చీకటి తెరలు తొలగిపోయాయి. ఇన్నాళ్లు నా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచి చాలా పొరపాటు చేశాను. అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమైంది. కుటుంబంలో అందరూ ఉంటే ఇంటికి శుభం కలుగుతుంది. పిల్లలకి పెద్ద వాళ్ళ ఆప్యాయత అనురాగం కావాలి. తాత నాయనమ్మల మీద ప్రేమాభిమానాలు కలగాలంటే పిల్లలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. వాళ్లు పంచిపెట్టే ప్రేమ కోసం పిల్లలు తపించి పోతారు. పిల్లలకి తల్లిదండ్రుల మీద కన్నా పెద్ద వాళ్ల దగ్గర చనువు ఎక్కువగా ఉంటుంది. పెద్ద వాళ్ళు చెప్పే ప్రతి విషయం వెనుక ఒక అర్థం దాగి ఉంటుంది. వాళ్లతో కబుర్లు చెప్పించుకోవడం కథలు చెప్పించుకోవడం కోరుకుంటారు. అమ్మానాన్న కొట్టినా తిట్టినా వెళ్లి బామ్మకో తాతయ్యకో చెప్పుకుంటారు. వాళ్లు ప్రేమగా దగ్గరికి తీసుకొని ఓదార్చుతుంటే ఆ బాధను సైతం మర్చిపోతారు.”

సూర్యం చెప్తున్న మాటలకు అందరికీ పశ్చాత్తాప భావం కలిగింది. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో ఉంచి, పిల్లల్ని హాస్టల్లో చేర్పించి, అమ్మానాన్నలు ఉద్యోగానికి వెళ్ళిపోతే చివరికి మిగిలిన ఒంటరి పసివారికి ఆలన, పాలన లేక పలకరించేవారు కరువై తన మనసులోని బాధను చెప్పుకోలేక దిగమింగుకోలేక మానసికంగా కృంగిపోయే పిల్లలు చివరికి డిప్రెషన్‌కి లోనై ఒంటరిగానే బతకడానికి అలవాటు పడిపోతున్నారు. మన పిల్లలకి మనం అందించే ఆస్తిపాస్తుల కన్నా ఆప్యాయతతో ఆదరించే తాత బామ్మ అమ్మమ్మ అందరూ కావాలి. పెద్దవాళ్ల సంఘర్షణలకు లోనై పిల్లలు ఎదురు చెప్పలేని పరిస్థితి.

“శ్యామ్ వేసిన చిత్రం మీకు బహుమతిగా అందించి మా అందరి కళ్ళు తెరిపించాడు” అన్నాడొకాయన. అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు.

సూర్యం కొడుకుని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. “రేపే మనం వృద్ధాశ్రమానికి వెళ్లి తాతయ్య బామ్మని ఇంటికి తీసుకొచ్చుకుందాం” అనగానే శ్యామ్ ముఖంలో ఆనందం వెల్లి విరిసింది.

కొడుకు ఇచ్చిన బహుమతి విలువని గుర్తించి చెమరించిన కళ్లను కర్చీఫ్‌తో తుడుచుకున్నాడు సూర్యం.

మర్నాడు సూర్యం భార్యని, కొడుకుని వెంటబెట్టుకుని కారులో ఆశ్రమానికి బయలుదేరాడు.

Exit mobile version