[శ్రీ వేదాంతం శ్రీపతి శర్మ రచించిన ‘బంధువు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
‘చెయ్యి చూపిస్తే ఈ బస్సు ఆగుతుంది’ అని అద్దం మీద ఉంది. చూపించకపోయినా గంటల తరబడి ఆగిపోగలదనీ అర్థం చేసుకోవాలని చాలా మందికి తెలియదు. ఓ చిన్న కుదుపుకి నా భుజాన్ని దిండులా వాడుకుని నిదురిస్తున్న మిత్రుడు రమణుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఇంత ప్రేమ మిత్రుల మధ్య ఈ మధ్య చూడలేదు. లేస్తే బాగుండు అనుకుని కొంత ప్రక్కకి జరిగినా ఇంకా నా పైకి ఒరిగి ఒక చెయ్యి అటు వైపు నుండి పోనిచ్చి కదలకుండా నన్ను కాపాడుకుంటూ మరీ నా భుజాన్ని కైవసం చేసేసాడు.
“సారీ బ్రదర్..”, అన్నాడు, “..నీ భుజం మీద నిద్ర బాగా పడుతోంది..”
“నీకో చిన్న సమాచారం.”
“చెప్పు “
“శరీరంలోని నా ఈ భాగం పూర్తిగా చలనరహితంగా మారింది. తిరుగు ప్రయాణంలో అటు ప్రక్కదీ అలాగే మారగలదు. చిన్న సహాయం చెయ్యాలి..”
“తప్పకుండా.”
“కళ్యాణదుర్గంలో కానీ, దురదకుంటలో కానీ ఒక శాలువా, లేదా ఒక చిన్న దుప్పటీ కొని పెట్టు.”
“ఓ యస్! తెచ్చుకోవటం మరచావా?”
“కాదు. ఇంటికి వెళ్లేసరికి నా పరిస్థితి షోలేలో సంజీవ్ కుమార్ పరిస్థితిగా మారవచ్చు. అది కప్పుకుని కాలితో కాలింగ్ బెల్ కొట్టేస్తాను!”
“అన్యాయం. ఏదో నిద్ర వచ్చేసింది మాష్టారూ. ఇంతకీ ఈ దురదకుంట ఇంకా ఎంత దూరమో!”
~~~***~~~
‘నిలువుటద్దం’ నాటికలో కైలాసం చెప్పిన సంవాదాలు ఈ రోజుకీ నేను మరచిపోలేదు. అతని టైమింగ్ అద్భుతంగా ఉండేది.
“అద్దం ముందు నిలబడికూడా అందమైన ఆలోచనని తప్ప మరొకటి చూడలేనివాడు కవి..”, అద్దాన్నీ చూడకుండా, తన వైపూ చూసుకోకుండా మరేదో చూస్తున్నట్లు అద్దం ముందర నిలబడి చెప్పేవాడు,” ..ఆలోచనలు ఎక్కువగా ముసురుకున్నప్పుడు వయసు మీద పడినట్లుంటుందో తెలియదు, వయసు మీద వాలినందుకు ఆలోచనలు తెగ బాధిస్తాయో తెలియదు.. అద్దం ముందు నిలబడే వయసూ లేదు, అబద్ధాన్ని నిలదీయగలిగే మనసూ లేదు.. నాకూ వయసొచ్చింది!”
ఈ పాత్రలు పోషించినప్పుడు కైలాసానికి నిజంగా అంత వయసు లేదు. కలసి ఎన్నో నాటకాలు ఆడేసాం. నిజంగా వయసు మీద పడ్డాక ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. కలసి గానీ, మాట్లాడి కానీ దాదాపు ఒక పుష్కరం అయిపోయింది.
“ఇంతకీ ఈ అవార్డు ఏమిటి?”,రమణ అడిగాడు.
“నాకు తెలిసిన ఒక మెరిక ఇటీవల కైలాసం కోసం పట్టు పట్టటం జరిగింది.”
“మెరిక ఎవరు?”
“అమెరికాలో మెరుపులు పూసుకున్న ఒక మిత్రుడులే. ఆయనను కాదనలేక ఇలా బయలుదేరాను.”
కండక్టర్ వచ్చి ప్రక్కనే ఉన్న రాడ్‌కు ఆనుకున్నాడు. సంచీలోని డబ్బులన్నీ లెక్క చూసుకున్నాడు. మాకు ఏదో చెప్పబోతుండగా ఆవులింత వచ్చినట్లుంది. చాలా సేపు ఆవులిస్తూనే చూపుడు వ్రేలు క్రిందకి చూపిస్తూ కదిలించాడు.
“కుంటా..”, డ్రైవర్ అరిచాడు.
అర్థమైపోయి ఇద్దరం లేచాం. గబ గబా క్రిందకి దిగిపోయాం. గాలీ వెలుతురుకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన బస్ స్టాప్ అది.
“ఊరు పేరు దురదకుంట అని ఎందుకు పెట్టారో తెలియటం లేదు”, రమణుడు గొణిగాడు.
“దురద పుట్టించే ఆకు ఏదైనా ఇక్కడ పండవచ్చు లేదా ఏ దురదైనా పోగొట్టే ఆకు ఇక్కడ దొరకవచ్చు.”
వెనుకనుంచి వినిపించింది, “అదేమీ లేదండీ.. ఎక్కడికెళ్లాలి?”
అటు తిరుగాం. ఓ పెద్దాయనకి మా బాధ అర్థమైనట్లుంది.
“ఇక్కడ కైలాసం గారని నాటకాల్లో నటించే కళాకారుడు. హైదరాబాదు నుంచి వచ్చేసి కొన్నేళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు అని తెలిసింది.”
“అంతటోళ్లు ఇక్కడెక్కడండీ? కళ్యాణదుర్గంలో కనుక్కున్నారా?”
“లేదండీ. ఇక్కడే అన్నారు.”
“ఓ.. చూడండి మరి ఊళ్లోకెళ్లి కనుక్కోండి”, అతను ఎందుకైనా మంచిదని త్వరగా నిష్క్రమించాడు. ఊళ్లోకి వెళ్లమన్నాడు. అసలు ఊరేది?!
ఇద్దరం నాలుగడుగులు వేసి దారిలో ఓ టీ షాపు దగ్గర ఆగాం. బల్ల మీద కూర్చుని టీ సేవిస్తుండగా రమణుడు అడిగాడు, “మన దగ్గరున్న ఫొటో చూపించి తెలుసునేమో కనుక్కుంటే?”
నిజమే! అతిగా నిద్ర పోయేవారికి చక్కని ఆలోచనలొస్తాయని నిదురనీతిలో చెప్పారని నిద్రలో కూడా ప్రవచనం చెప్పేవారొకరిద్దరు చెప్పినట్లు గుర్తు! కైలాసం ఊళ్లోనే ఉంటే బస్ స్టాండ్‌కి వచ్చినప్పుడల్లా ఇక్కడ టీ సేవిస్తాడు కదా? లేచి జేబులోంచి ఫొటో తీసి చూపించాను.
“పేరేంటండీ?”, అడిగాడు.
“కైలాసం.”
పెదవి చరిచాడు. “ఆ పేరు..”, అన్నాడు, “..ఏమో! కానీ ఈ మొహం.. అవును. ఇతను బంధువు!”
ఇద్దరం నోళ్లు వెళ్లబెట్టాం.
“సార్, బంధువంటే నాకు బంధువని కాదు. నాకు తెలిసి ఇతన్నిక్కడ చాలా మంది బంధువు అని పిలుస్తారు. అసలు పేరు ఎవరికీ తెలియదు.”
“ఎక్కడుంటాడు?”
“తెలియదండీ.”
“అదేంటి?”
“ఓ పని చెయ్యండి. రామాలయం దగ్గర ఒక వృద్ధాశ్రమం ఉంది. అక్కడ అడగండి. గారంటీగా తెలిసిపోతుంది. కాకపోతే కైలాసం అని చెప్పకండి. బంధువు అని అడగండి.”
“బంధువు.”
~~~***~~~
ఈయనకెవరూ లేరా? ఇక్కడికి చేరాడా.. అనుకుంటూ ఆశ్రమం లోకి అడుగు పెట్టాం. ఏదో భజన కార్యక్రమం సాగుతున్నట్లుంది. ఆ హాలుని పరికించి చూస్తుండగా గోడల మీద ఉన్న ఎన్నో పటాల చివర కైలాసం ఫొటో కనిపించింది. ప్రాణం లేచి వచ్చినట్లయింది. అయినా ఏదో శంక బాధించింది..
“గాలికెగిరేవి గాలిపటాలు..”, కైలాసం స్టేజ్ మీద చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి, “..లోన గాలి బయట గాలిలో కలిసాక కొద్ది సేపు అదిగో.. అలా గోడ మీద గాలికి చిన్నగా కదిలేవి ఈ పటాలు..”, ఒక నిట్టూర్పు విడచి, కళ్లజోడు సద్దుకుని ఒక పుస్తకాన్ని మరో పాత్ర చేతిలో పెడతాడు, “..సంపదలు తేలేని సంపుటాలు నాయనా! దయ ఉంచి చిత్తు కాగితాల వాళ్ల సంచీలో పడెయ్యకు..”, జనం వైపు తిరిగే వాడు.. “ఆలోచనల అంతరార్థాలు పుస్తకాలు. కొండరాళ్లను సైతం కదిలించేవి పుస్తకాలు. చరిత్ర గురించి చెప్పేవి కావు పుస్తకాలు. చరిత్రలోని పాత్రలు పుస్తకాలు..”
ప్రక్కనున్న కుర్రాడు పుస్తకం తిరగేస్తుంటే అంటాడు, “..పుస్తకం ఎందుకు చదవాలి? గతించిన కాలంలోని మేధస్సును తెలుసుకుని ఒక దారంలా, కావలిస్తే ఒక ఆధారంలా వాడుకుని నీ మేధస్సును స్వతంత్రంగా అనంతమైన ఆకాశంలో విహరింపజెయ్యటానికి పుస్తకం చదవాలి. ఈ దారం లేనప్పుడు కొద్ది సేపు బాగుంటుంది. కానీ త్వరలోనే గాలిపటం చిరిగిపోతుంది. జీవితం ఆలోచింపజేసే పుటల సంపుటి కావాలి. పెట పెటలాడిపోయే సంపదల పుట్ట కాదు!”
“ఏం కావాలండీ?”,ఎదురుగా నిలబడినావిడ అడుగుతోంది.
“ఆ పటంలో ఉన్నది మా మిత్రుడు కైలాసం.”
“కాదండీ. ఆయన పేరు బంధువు.”
“కావచ్చు. ఇప్పుడు ఎక్కడ కలుసుకోవచ్చండీ?”
“ఓ. ఆయన కోసం వచ్చారా? ఆయన ఉన్న ఆస్తిలో చాలా మటుకు ఈ ఆశ్రమానికే వ్రాసేసారు. కొన్నాళ్లు ఇక్కడే ఉండేవారు. తరువాత ఎక్కడికో వెళ్లిపోయారు. కనిపించి చాలా కాలం అయింది.”
“వారి బంధువులెవరైనా?..”, అంటుండగా ఓ పెద్దాయన భుజానికి సంచీ తగిలించుకుని వచ్చాడు.
“ఆయన ఇల్లు నాకు తెలుసు. రండి.”, అన్నాడు.
~~~***~~~
అది చాలా చిన్న ఇల్లు. మూడు గదులు వరుసగా ఉన్నట్లున్నాయి. ముందు గదిలో బట్టలు మడతలు పెడుతూ ఒకమ్మాయి కనిపించింది. మమ్మల్ని గేటు దగ్గర చూసి మెట్లు దిగి “ఎవరు కావాలండీ?” అని అడిగింది. మమ్మల్ని తీసుకుని వచ్చినాయన సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. ఆ ముందు గదిలోని గోడ మీద కైలాసం ఫొటో ఉంది.
“ఆయన నీకేమవుతారమ్మా?”, రమణ అడిగాడు.
అటు చూసి మరల ఇటు తిరిగింది.”రండి”, అంటూ లోపలికి తీసుకుని వెళ్లింది. ఊపిరి పీల్చుకుని కూర్చున్నాం. బట్టలు లోపల పెట్టి మంచినీళ్లతో వచ్చింది.
“ఆయన మా బంధువు”, అంది.
“అంటే.. ఆయన ఇక్కడుండరా?”
“ఇది ఆయనిల్లు కాదండీ. కాకపోతే ఈ ఫొటో చాలా ఇళ్లల్లో ఉంటుంది. ఆయన ఏదో ప్రక్క ఊళ్లో ఉండేవారో ఏమో కానీ ఇక్కడికి ఎక్కువ సార్లు వచ్చేవారు. అదుగో ఆ మెట్ల మీద కూర్చుని ఏవేవో కబుర్లు చెబుతూ ఉండేవారు. పల్లీలు తింటూ ఉండేవారు. అందుకేనేమో చాలా మంది ఇది ఆయనిల్లే అనుకుంటారు.”
“మీ బంధువు కదా? ఎక్కడుంటారో తెలిసుండాలి”, అన్నాను.
అమ్మాయి నిట్టూర్చింది.
“విడాకుల దాకా వెళ్లిన మా ఇద్దరినీ ఎంతో ఓర్పుతో కలిపి మాకు చెప్పకుండానే ఎక్కడికో వెళ్లిపోయారు. నాకు ఒక అన్నగా ఎన్నో సంగతులు చెప్పారు. ఆయనకి ఒక నాన్నగా చాలా విషయాలు చర్చించారని తరువాత తెలిసింది.”
నా కళ్లల్లో మరో సారి గడచిన కాలంలోని స్టేజ్ కదిలింది..
ఆ హాస్యనాటికలో కైలాసం తగువులాడుకుంటున్న భార్యాభర్తల ఇంటికి బంధువులా వస్తాడు. ఆమె వైపు వాడో తెలియదు, అతని వైపు వాడో తెలియదు. అర్థం కాని భాషలో తిక్క తిక్కగా మాట్లాడి ఇద్దరినీ తికమక పెడతాడు. చివరికి ఇద్దరూ ఒక వైపు వచ్చి ఇతన్ని నిలదీస్తారు. అప్పుడు గట్టిగా నవ్వి “నేను మాట్లాడింది ఏ భాషా కాదు.. ఇదిగో, అనవసరపు ఆవేశాలలో మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి. వాటిని పట్టుకుని గొడవలు చేసుకోకూడదు సుమా! నా సంగతి తేల్చుకోవటానికి ఎంచక్కా ఒకరై మాట్లాడారో చూడండి..” అంటూ ఇద్దరి చేతులూ కలిపి వెళ్లిపోతాడు. వెళుతూ వెళుతూ ప్రేక్షకుల వైపు తిరుగుతాడు..
“పెంచుకున్నవన్నీ పంచాయితీకి పోతాయి. చక్కగా పంచుకున్న జీవితం పంచామృతమవుతుంది”, అంటూ చప్పట్ల కోసం ఎదురు చూడకుండా వెళ్లిపోయేవాడు.
“చివరి సారి ఎప్పుడు, ఎక్కడ చూసి ఉండవచ్చు?”, రమణ అడిగాడు.
“చాలా కాలమైంది. నేనూ, మా వారూ ఇక్కడి దగ్గరి పార్కులో నడుస్తున్నాం. ఆయన ఎదురుగా వస్తూ కనిపించేసరికి ఇద్దరం చేతులు వదిలేసి సిగ్గుతో “నమస్తే” అన్నాం. ఆయన నవ్వి నా చిటికెన వేలును ఆయన ఎడమ చేతిలో పెట్టి “ఏమ్మా? నేనే కదా ఇలా నడవాలని చెప్పాను? నా ముందరే వదిలేస్తే ఎలైస్తారు. ఆ? దాంపత్యమంటేనే ఎనిమిదవ అంకె. అంటే లింకు. ఎనిమిది అంటేనే బాధ్యత! వాహనాన్ని ఎనిమిది ఆకారంలో నడిపితేనే లైసెన్స్ ఇస్తారు. ఎనిమిదిని పడుకోపెట్టి నువ్వా నేనా కాకుండా నువ్వూ నేనూ అనుకోండి..” అన్నారు.
ఆమె సిగ్గుతో తల వంచుకుంది.
ఇద్దరం లేచాం. గేటు దాకా వచ్చాం. ఆమె కూడా గేటు దాకా వచ్చింది. “ఈ వీధి చివర గణపతి మాష్టారుంటారు. ఆయనకేమైనా తెలిసి ఉండవచ్చు.” అని చెప్పి వెళ్లిపోయింది.
~~~***~~~
గణపతి మాష్టారు మాకు అరుగు మీదనే దొరికారు. అన్నీ విన్నారు. లోపలికెళ్లి ఒక టేప్ రికార్డర్ తెచ్చారు. ఈ రోజుల్లో ఇంకా దీనిని వాడుతున్నారా అనుకున్నాను. దానిని ఆన్ చేసారు. ఏదో సభ తాలూకు శబ్దాలు వినిపిస్తున్నాయి. కైలాసం దగ్గుతూ మాట్లాడుతున్నాడు. “..స్టేజ్ మీద ఏ పాత్రనైనా పోషించవచ్చు.. తల్లి, కొడుకు, తండ్రి, కూతురు, భార్యా, భర్త, సోదరుడు, సోదరి.. ఎన్నైనా. కొద్దిగా కష్టపడి ఒక గురువు పాత్ర కూడా పోషించవచ్చు. కానీ ఒక్క నిజమైన మిత్రుని పాత్ర మటుకు పోషించటం కష్టం. ఎందుకంటే అందులో అందరూ ఉంటారు. ఎప్పుడెలా మారి నటించాలో తెలియదు. తెలుసుకోవటం కష్టం. ఏ రోజూ వేదిక మీద నటించని నా ఈ చిరకాల మిత్రుడు గణపతి నాకు తెలియకుండానే ఈ పాత్రలన్నీ నా జీవితంలో పోషించి చూపించాడు. ఈ ఊరికే పాఠాలు చెప్పిన ఈయన ఈ రోజు మాట పడిపోయి తన స్థానంలో నన్ను తనలా మాట్లాడమని అడిగాడు. అది సాధ్యం కాదు. వీడు రసహృదయుడు. నేను ఈ మిత్రుని పాత్ర ఏ రోజూ పూర్తిగా పోషించదలచుకోలేదు. మైత్రి అనేది ఏ రోజూ పూర్తి కాకూడదు. మౌనంగా ఈ గణపతి మునిలా మారి ఆనింటినీ సముద్రంలా తనలో కలుపుకున్నాడు. అన్ని వేళలా నాతో ఉండి నాలా ఆలోచించాడు..”
టేప్ రికార్డర్ ఆపేసి మమ్మల్ని జాలిగా చూసారు. ఒక కాగితం తీసి ఏదో వ్రాసి ఇచ్చారు.
“ఊరి చివర ఒక పాత దేవాలయాన్ని పునరుద్ధరిస్తున్నారు. అక్కడ ఎందుకో వాచ్‌మన్‌గా చేరాడని వినికిడి. నేను ఇల్లు కదలలేని పరిస్థితి. “
ఇదేంటి? ఇన్ని దానధర్మాలు చేస్తున్నవాడు ఆఖరుకి ఒక గుడికి వాచ్‌మన్‌గా చేరటం ఏమిటి? ఆలోచించుకుంటూ అటు పయనం సాగించాం. ఆ గుడి కనిపించింది. హమ్మయ్య అనుకుని లోపలికి వెళ్లాం. అది పెద్ద దేవాలయమే. పని చేసుకుంటున్న వారడిగారు,” ఎవరు కావాలండీ?”
“వాచ్‌మన్ “
“గుడి ఎనక్కెళ్లండి.”, అని దారి చూపించారు. పరుగు తీసాం. ఒక నులక మంచం మీద వాచ్ మన్ అటు తిరిగి పడుకునున్నాడు. జాగ్రత్తగా లేపాం. మాసిన గెడ్డంతో ఉన్నాడు.
“ఎవరు?”, అడిగాడు. అతను కైలాసం కాదు. ఫొటో తీసి చూపించాం. జాగ్రత్తగా చూసాడు.
“ఇతను నా ముందరున్న వాచ్‌మన్.”
“ఇప్పుడెక్కడున్నాడు?”
“తెలియదు. ఆ పెంకుటింట్లో పంతులు గారుంటారు. చాలా పెద్దాయన. ఆయన్ని అడగండి.”
ఆ ఇంట్లోకి వెళ్లాం. కైలాసం ఫొటో చూసి కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు. మాకు భయం వేసింది.
“బంధువు. ఇంతకీ ఇతని అసలు పేరేమిటండీ?”
“కైలాసం.”
“ఓ. అర్థమైంది. అడుగు పెట్టిన ప్రతి ప్రాంతాన్నీ కైలాసంగా మార్చాడు. పుత్రునిలా మమ్మల్ని సేవించుకున్నాడు. పేరు అడిగినప్పుడల్లా బంధువని చెప్పాడు కానీ కైలాసం అని చెప్పలేదు. అతనూ వయసులో పెద్దవాడే, అయినా మా ఇద్దరి కాళ్లూ పిసుకుతూ పడుకునే వాడు..”
నా కళ్లు చెమర్చాయి. బల్ల గుద్ది చెప్పినట్లు కైలాసం చెప్పిన స్టేజ్ మీది మాటలు గుర్తుకొచ్చాయి..
అప్పులు తీర్చలేని మధ్య తరగతి వ్యక్తి పాత్ర అది. నలుగురూ వెంబడించి అమ్మ, అయ్యతో నిందిస్తారు. వాళ్ల కాళ్ల మిద పడి లేచి నాలుగు దెబ్బలు తిని మెల్లగా అంటాడు, “..కొట్టండి. నన్ను తిట్టండి. కానీ సార్, అమ్మ, అయ్య అనునవి ఈశ్వరుని మొదటి నామాలు. అలా మాట్లాడకండి సార్.. ఏ రోజూ హమ్మయ్య అనుకోలేని జీవితాలు మావి. అ.. అమ్మ కంటే ఆ.. ఆకలి అన్న పదం ముందు నేర్చుకున్న జీవితాలు మావి. దారిద్ర్యం అనే జీవితసత్యాన్ని శోధించే అవసరమే లేని సత్యాన్ని. సత్యం నా మొదటి పేరు. కలసిరాని కాలంలోని విషాన్ని మౌనంగా మ్రింగే శివుడిని. శివం నా రెండవ పేరు. భీషణమైన అంతరంగాలని ఆభూషణాలుగా ధరించి, రంగరించి సుందరంగా తీర్చి దిద్దే రచయితను. సుందరం నా మూడవ పేరు. ఇంత గొప్ప తత్వాన్ని కని పెంచే స్తోమత లేక బాధలను దిగమ్రింగి నన్ను పసితనంలోనే వదిలేసిన ఆ సన్న జీవాలను దయ ఉంచి దూషించకండి.. దయ.. ఉంచి ..దూ..” ఆ చివరి మాట దగ్గర లైట్లు ఆఫ్ అవుతాయి.
పెద్దాయన చెబుతున్నాడు, “..అతను వెళ్లిపోయాక ఈ ఇంట్లో అంతా చీకటైపోయింది. ఈ గుడికి ఒకరో ఇద్దరో వచ్చేవారు. రాత్రి హారతి అయ్యాక తాళం అతను వేసేవాడు. ఎందుకో ఒక్కో రోజు ఎక్కువ సేపు తీసుకునేవాడు. ఎందుకయ్యా అని అడిగితే, ‘ఏం లేదు, ఈ రోజు ఒకరింట్లో తండ్రి పాత్ర పోషించాను. వాళ్ల సమస్య తీర్చమని ఈ తండ్రిని వేడుకున్నాను’, అనేవాడు. ”
“ఎక్కడికెళ్లాడో తెలుసా?”
పెద్దావిద కాఫీ తీసుకుని వచ్చింది.
“ఎక్కడికెళ్లాడో తెలియదు కానీ వెతకటం కూడా అనవసరం అని నేను అన్నానండీ.”
“ఎందుకండీ?”
“ఒక రోజు రాత్రి విపరీతంగా వర్షం కురిసిందండీ.ఈయన కూడా మర్నాడు కొద్దిగా ఆలస్యంగానే వెళ్లారు. గర్భగుడి తాళంలో బీగాలు దూర్చి ఉన్నాయి. అందులో ఒక కాగితం ఉంది. కాగితంలో “దేవుని పాత్రను కొద్దిగా దగ్గరగా చూడాలనుకున్నాను. చూసాను. ఉంటాను మరి”, అని ఉంది. అతన్ని దగ్గరగా చూసినవారు అతను ఏదో తొందరలో ఉన్నాడు, ఎక్కడికో వెళ్లిపోవాలని అనేవాడు అన్నారండీ. ఇది జరిగి రెండు సంవత్సరాలవుతోంది.
~~~***~~~
“నిద్ర రావటం లేదు”, రమణుడు అంటున్నాడు. బస్సు కిటికీలోంచి చల్లని గాలి వీస్తోంది.
“ఓ విధంగా మంచిదే. నా భుజానికి నీ బాధ తప్పింది.”
“కైలాసం గురించి ఆలోచిస్తే ఇంటికెళ్లాక కూడా నిద్ర పట్టదు.”
“నిజమే! దైవం గురించి ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఆ ఒక్క పాత్ర ఎందుకో ఎన్నడూ వెయ్యననేవాడు. ఆ నిజమైన ప్రదర్శన ఒక్క సారే ఇవ్వాలి, తనకు తాను ఒక్క సారి దైవంలా కనిపించి మాయమైపోవాలి.. అనేవాడు.”
ఫోన్ మ్రోగింది.
“హలో?”
“సార్, కైలాసం గారిని వెతికే ప్రయత్నం ఆపెయ్యవచ్చు. ఇక్కడ ఆయన తాలూకు మనిషి ఒకతను చెప్పాడు. ఆయన లేరు. సారీ.. ఉంటాను.”
నవ్వుకున్నాను.
“ఏంటి?”, రమణుడు అడిగాడు.
“కైలాసం లేడని వాళ్లకి మొన్ననే తెలిసిందట.”
“ఓ.”
“ఎక్కడెక్కడో ఉన్నాడని మనం తెలుసుకున్నాం.”
“కరెక్ట్!”
~~~***~~~
ఇది జరిగిన చాలా కాలం తరువాత ఒక విచిత్రం జరిగింది. హైదరాబాదులో బాగా దూరంలో ఒక సంస్థవారు కైలాసం నటించిన చివరి నాటికను ప్రదర్శిస్తున్నారని తెలిసి వెళ్లాం. గేటు దగ్గర బానర్ చూసి ఆశ్చర్యం వేసింది- ‘బంధువు’ అవార్డ్ ప్రదానోత్సవం అని ఉంది. ఆడిటోరియమ్ మెరిసిపోతోంది. తెర ముందుకు ఒక యువకుడు మైకుతో వచ్చాడు.
“అందరికీ నమస్కారం. నా పేరు నిరంజన్..”, కొద్దిగా చిత్రమైన ఉచ్చారణ వినిపిస్తోంది. “..నాకు తెలుగు అంతగా రాదు. నాకు ఎవరూ లేరు. వాంకూవర్‌లో ఉంటాను. అక్కడే స్థిరపడిపోయాను. ఈ మధ్యనే హైదరాబాదులో కొత్త పరిశ్రమ స్థాపించాను. నన్ను, నా చదువునూ స్పాన్సర్ చేసిన కైలాసం సర్‌తో ఎన్నడూ మాట్లాడలేదు. ఆయన్ని కలవనూ లేదు. ఎస్.ఒ.ఎస్ సంస్థలలోని నియమాలు ఇలాగే ఉంటాయి. కాకపోతే ఈ మధ్యనే ఆయన ఊరు గురించి తెలిసి అక్కడికి వెళ్లి ఇదంతా ఏర్పాటు చేసాను. ఒక గుడిలో ఉంటూ ఏదో వ్యాధి వలన ఎక్కువ కాలం ఉండరని తెలుసుకుని ఇక్కడికి వచ్చేసారు. కానీ నాకు ఇక్కడా కలవలేదు.. మీ ముందుకు వస్తున్న వ్యక్తి పేరు గణపతి మాష్టారు. ఈయన ఆయన ఆత్మబంధువు..”
ఇంతలో గణపతి మాష్టారుని ఇద్దరు జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చారు. ఆయన కష్టం మీద నిలబడ్డారు.
“..ఈయన ప్రస్తుతం మాట్లాడలేరు. కాకపోతే కైలాసం గారు ఆయన చివరి కోరిక ఈయనకు చెప్పారు, అదేమిటంటే ఈయన పేరు మీద ఒక బహుమతి ప్రదానం ఉందాలి అని. ఈ ఆడిటోరియమ్ కైలాసం గారి స్థలంలోనే ఆయన కట్టటం ప్రారంభించారు, పూర్తి చెయ్యకుండానే వెళ్లిపోయారు. ఈ పనిని నా చేత పూర్తి చెయ్యించాలనే సార్ వెళ్లిపోయారనుకుంటాను. ఇక్కడ మొదటి ప్రదర్శన తరువాత గణపతి అవార్డ్ ఇవ్వమని ఆయన డెయిరీలో వ్రాసారు. కానీ గణపతి మాష్టారు గారు పట్టుపట్టి బంధువు అవార్డుగా మార్చమన్నారు..”
అతను ఒక కాగితం తీసాడు. జాగ్రత్తగా విప్పి చదివాడు.
“..ఇది కైలాసం సార్ వ్రాసి పెట్టి గణపతి మాష్టారు సమక్షంలో చదవమని సూచన చేసారు.. నేను చదువుతున్నాను. తప్పులు ఉంటే క్షమించండి.. ఈ గణపతి మాట పోయినప్పుడు వాడిలా మాట్లాడమన్నాడు. నాకు చేతకాదని చెప్పాను. ఎందుకంటే ఎంతో కాలంగా నేను నటించిన నాటికలలో నేను చెప్పినవన్నీ వీడి మాటలే! వీడు వ్రాయాలి, నేను చెప్పాలి. చాలా మందికి తెలియదు. సుందరం అనే పేరుతో వ్రాసిన నాటికలన్నీ నా ఈ గణపతివే! వాడి మాట పడిపోలేదు. మేమిద్దరం కలసి సూపర్ నోవా స్థాయిలో ఉన్నాము. నేను లేకపోయినా వీడు వ్రాస్తూనే ఉండాలి. వీడి గళం నేను కాను. వీడి మాటలలో నేను బ్రతికుండాలి.. ఒరేయ్, నేను నీ మాటల కోసం, అవి వినిపించే చప్పట్ల కోసం స్టేజ్ ఎక్కాను. అందుకే ఈ ఆడిటోరియమ్! అందుకే ఈ అవార్డు. గణపతీ.. బాయ్.. ఉంటాను మరి. నువ్వు నన్ను బ్రతికించెయ్! మనం మిత్రులం ఇద్దరం కాము.”
చప్పట్లు మ్రోగుతుంటే ఎప్పుడు లేచి నిలబడ్డానో నాకే తెలియదు.
ఏంటి? ఇన్ని సంవాదాలూ సుందరం అనే రచయితవి అనుకున్నది ఈయనవా? ఒక్కసారి పాదాభివందనం చేద్దామనుకున్నాను.. రమణ నన్ను కూర్చో పెట్టాడు. హాలు చీకటైంది. “ఈ స్టేజ్ ఆయన సమాధి మీదనే కట్టారుట.. ఆయన కోరికట అది!”
తెర మెల్లగా పైకి లేస్తోంది. ముందర అంతా చీకటిగానే ఉంది. దురదకుంటలో అంతటా చూసిన ‘బంధువు’ పటం మీద కాంతి మెల్ల మెల్లగా పెరుగుతోంది.
కైలాసం చివరి నాటిక ఇప్పుడు ఉంటుంది. అది గుర్తుకొస్తోంది.. ఒక పేవ్మెంట్ మీద కైలాసం రకరకాల అవార్డులనీ, కప్పులనీ, బహుమతులనీ పైన గుడ్డ తీసి ఒక పోలీసుకి చూపిస్తూ ఉంటాడు. “ఇవి అమ్మటం లేదు సార్. నేను ఎక్కడికీ వెళ్లటానికి జాగా లేదు.”
“నీ బొంద. ఇవన్నీ నీవా? నేను నమ్మాలా? ఎక్కడినుండి కొట్టుకొచ్చావ్?”
అవన్నీ లాగి విసిరి కొడతాడు ఎస్.ఐ. పిచ్చి పిచ్చిగా నవ్వుతాడు.
కాన్స్టేబల్ వచ్చి “సార్, వీడు డ్రగ్ మాఫియా సార్..”, అంటాడు. జైల్లో ఉంటాడు కైలాసం. ప్రైజులన్నీ పోలీసు స్టేషన్లో అందంగా అమరుస్తారు. బాగా దెబ్బలు తిన్న కైలాసం చువ్వలు పట్టుకుని అంటాడు, “..కనిపించని నా ప్రాణానికి కనిపించే నా జీవితం ఇచ్చే ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. మృత్యువు ఒక అద్భుతం, ఒక మాస్టర్ పీస్ డ్రామా.. దాని మీదనుండే తెర తీసేసాక నా ఈ జీవితం మీద ఏనాడూ తెర పడదు!”
తెర పూర్తిగా పైకి లేచింది.
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.

