Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మూడు డిటెక్టివ్ నవలలు, మూడు డిటెక్టివ్ కథలు, ఇద్దరు రచయితలు – ఒక పరిశీలన

[భువనచంద్ర గారి మూడు డిటెక్టివ్ నవలలను, కస్తూరి మురళీకృష్ణ రచించిన ‘క్రైమ్ స్టోరీస్’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు ప్రొ. సిహెచ్. సుశీలమ్మ.]

(17 ఆగస్ట్ శ్రీ భువన చంద్ర గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలతో..)

శేష పూర్ణానంద ప్రభాకర పెద గురురాజు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ 3,500 పైచిలుకు సినీ గీతాలు వ్రాసిన ‘భువనచంద్ర’ అంటే అందరికీ అభిమానం. చాలా చిన్న వయసులోనే సినిమా పాటలు రాయాలని, పేరు తెచ్చుకోవాలనే అభిలాషతో గోడలమీద పోస్టర్స్ మీద ఉన్న నాటి ప్రముఖ సినీ గేయ రచయితలు ఆరుద్ర, ఆత్రేయ వంటి వారి ప్రక్కన తన పేరు కూడా రాసుకునేవారు.

ఆశ, కోరిక చాలామందికి ఉంటాయి. కానీ అవి ఎందరు సాధించగలరు! పైగా చిన్న వయసులోనే ఎయిర్‌ఫోర్స్‌లో చేరి, ఎడారి లోని ఎండ, హిమాలయాల్లోని చలి అనుభవిస్తూ, జీవించడమే ఓ పోరాటం గా బ్రతికే రోజులు – ఆశలు, కోరికలు గురించి ఆలోచించే సమయం ఉంటుందా! కానీ మొదటి నుండి అసాధ్యాలను సుసాధ్యం చేసుకునే బలమైన మనస్తత్వం ఆయనది. ఉత్తర భారతదేశంలో డిఫెన్స్ సర్వీసెస్‌లో ఔత్తరాహికులే ఎక్కువ. ఏ రాష్ట్రవాసులైనా హిందీలోనే మాట్లాడుకుంటారు. ఆ రోజుల్లో ట్రాన్సిస్టర్‌లో హిందీ పాటలు వింటూ, ఆ బాణీలో తెలుగులో పాట రాసుకుని తృప్తి పడేవారు. ఎక్కడ ఉన్నా మనదైన అభిరుచిని వదులుకోవలసిన అవసరం లేదు కదా!

ఎయిర్ ఫోర్స్ నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చి, తన చిన్ననాటి కలను సాకారం చేసుకోవాలని మద్రాసు చేరారు. సినీ లోకం లోకి ఎలా అడుగుపెట్టాలో, ఎవరిని ఎలా అప్రోచ్ కావాలో తెలీని సమయంలో దేవునిలా అక్కున చేర్చుకున్నారు డాక్టర్ గోపాలకృష్ణ గారు. ఆర్మీ వ్యక్తి కి ఊరికే ఉండడం, కాలాన్ని వృధా చేయడం రాదు. మామూలు మనుషులు, వారి మనస్తత్వం తెలీదు. సమయం వృధా పుచ్చడం ఎందుకు, పైగా తనకు తెలిసిన విద్య ‘వ్రాయడం’ మాత్రమే. తన స్నేహితుడిలా తను కూడా డిటెక్టివ్ నవల వ్రాయాలని సంకల్పించుకుని ఒక రాత్రంతా కూర్చుని మొదటి నవల రాశారు. అదే ‘బ్లూ బుల్స్’. రకరకాల ఆయుధాలు, వాటిని ఉపయోగించే విధానాలు కరతలామలకం కనుక అలవోకగా రాసారు. తన స్నేహితుడు రాసినవి ఎప్పుడూ ఇచ్చే పబ్లిషర్ కు చూపితే, 50 రూపాయలు ఇస్తానన్నారు. డబ్బు కోసమో, పేరు కోసమో తన శ్రమను, కష్టాన్ని ధారపోయడం ఇష్టం లేక నిరాకరించారు. తర్వాత మరో పబ్లిషర్ వచ్చి, పుస్తకం చదివి 300 రూపాయలు ఇస్తానన్నారు. ఇలా భువన చంద్ర ఐదు డిటెక్టివ్ నవలలు రాసారని ఆయన చెప్తే గానీ ఎవరికీ తెలీదు ఇప్పటి వరకు. ఇటీవల చెన్నై వెళ్ళి ఆయనను కలిసినప్పుడు తను రాసిన డిటెక్టివ్ నవలల్లో మూడే ఉన్నాయని, అదీ ఒక్క కాపీయే ఉన్నాయని నాకు ఇచ్చేసారు. ఆ నవలల విశేషాలు చెప్పే ముందు ఒక విషయం ప్రస్తావించాలి.

భువనచంద్ర దంపతులతో ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

ఐదేళ్ల క్రితం సంచిక లో వెయ్యిన్నొక్క నవలలు రాసిన కొవ్వలి లక్ష్మీ నరసింహారావు (భయంకర్) గురించి నేను రాస్తున్నప్పుడు ఒకాయన, పెద్ద పదవిలో ఉన్న పెద్ద మనిషి “కొవ్వలి తర్వాత టెంపోరావు గురించి రాస్తుందా ఆమె” అన్నారట. కౌముది అంతర్జాల పత్రికలో పాత సినిమా పాటల విశ్లేషణ రాస్తున్న కస్తూరి మురళీకృష్ణను “సినిమా పాటలూ ఒక సాహిత్యమా” అన్నారు. అదీ ఆయన సంస్కారం, అహంకారం.

60, 70 ఏళ్ల క్రితం యువతరం అందరూ డిటెక్టివ్ నవలలే చదివేవారు. పాకెట్ సైజ్ లో 60, నుండి 100 పేజీలలో ఉండే పుస్తకాన్ని ఆసక్తితో “కాణీ” అద్దెకి బడ్డీకొట్టు లో తెచ్చుకొని ఒక్కరోజు లో చదివేసేవారు మధ్యతరగతి యువత.

ఈ ప్రక్రియ కూడా ఆంగ్ల భాష నుండే మనవారు తెచ్చుకున్నారు.

తెలుగులో మొదట డిటెక్టివ్ నవలలు ఆంగ్ల అనువాదాలే. ఆర్థర్ కానన్ డాయిల్ 1887లో ఎ స్టడీ ఇన్ స్కార్లెట్ అనే నవలలో సృష్టించిన పాత్ర ‘షర్లాక్ హోమ్స్’. గొప్ప సంచలనం సృష్టించిన పాత్రయే కాక పాఠకులు నెత్తినపెట్టుకోవడానికి ఏమాత్రం సంకోచించలేదు. వారికి ఫాల్స్ ప్రిస్టేజ్ ఉండదు. భారతీయ భాషల్లో కూడ షర్లాక్ హోమ్స్ వలే పాత్రలు సృష్టించబడ్డాయి. పాఠకాదరణ కూడ లభించడంతో నాటి మేటి పండితులు కూడ అపరాధ పరిశోధక నవలలు రాసారు.

తిరుపతి వేంకట కవులు కూడా రాసారంటే ఆనాటి క్రేజ్ తెలుస్తుంది. మొదటి డిటెక్టివ్ నవల దేవరాజు వెంకట కృష్ణారావు రచించిన ‘వాడే వీడు’ (1912) అని ఆరుద్ర గారి పరిశీలన. అలాగే చింతా శంకర దీక్షితులు వ్రాసిన ‘చిత్రలేఖ’ (1914) కూడా అపరాధ పరిశోధక నవల. ‘పేటికాంతర శవము’ అంతకు పూర్వమే రచింపబడిందని అంటారు కానీ రచయిత పేరుతో సహా ఏ ఆధారాలు లభించలేదు.

తరువాతి తరంలో విశ్వప్రసాద్ (డిటెక్టివ్ భగవాన్), కొమ్మూరి సాంబశివరావు (డిటెక్టివ్ యుగంధర్), టెంపో రావు (డిటెక్టివ్ వాలి) ప్రసిద్ధాలు. ఇంకా గిరిజశ్రీ భగవాన్, భయంకర్ విస్తృతంగా రాసేవారు. నేరం, నేరస్తుడు, డిటెక్టివ్ పరిశోధన, చివరకు నిందితుణ్ణి ఎలా పట్టుకున్నారు అనే ఉత్కంఠతో సాగే నవలలను విపరీతంగా చదివేవారు. కావ్యాలను పఠించేందుకు పెద్ద చదువులు లేక, గ్రాంథిక భాష రాకపోవడం ఒక కారణం. వాటిని కొనే ఆర్థిక స్తోమత లేకపోవడం మరో కారణం. హుషారు కలిగించే కాలక్షేపం కొరకు విస్తృతంగా చదివేవారు. అంటే సాధారణ పాఠకులలో ‘పఠనాసక్తి’ని, రీడబిలిటీని పెంచింది కచ్చితంగా ఇవే.

పైన పేర్కొన్న రచయితలందరి నవలలు తాను ఆసక్తిగా చదివానని భువన చంద్ర చెప్తారు.

బ్లూ బుల్స్:

లేడీ తల లాంటి తల, భారీ శరీరంతో ఎడారి ప్రాంతాల్లో మందలుగా తిరిగే చతుష్పాద జంతువులు బ్లూ బుల్స్. వాటిని ఆ ప్రాంతాలవారు ‘నీల్ ఘాయ్’ అంటారు. అవి ఎప్పుడూ మందులు గానే తిరుగుతూ ఉంటాయి. మనిషిని చూస్తే చాలు పరుగు మొదలుపెడతాయి. మైళ్ళకు మైళ్ళు విపరీతమైన వేగంతో ఆగకుండా దూసుకుపోతూ ఉంటాయి. గోడలున్నా, వైర్ ఫెన్సింగ్ ఉన్నా చిన్నాభిన్నం చేసుకుంటూ దూసుకుపోతాయి కానీ పక్కకు తొలిగి డైరెక్షన్ మార్చి పరిగెత్తవు. మహాబలిష్టమైన జంతువులవి. మానవుడికి ఈనాటి వరకు మచ్చిక కానీ అతికొద్ది జీవుల్లో బ్లూ బుల్స్ ఒకటి.

భువనచంద్ర తన మొదటి డిటెక్టివ్ నవలకు ‘బ్లూ బుల్స్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే – సరిగ్గా బ్లూ బుల్స్ లానే ఎవరికీ లొంగనివారే ‘టాప్ సీక్రెట్ ఆర్గనైజేషన్లోని ఏజెంట్స్’. ఆ ఏజెంట్స్ లోని స్మార్టెస్ట్ బ్లూ బుల్ భువన చంద్ర సృష్టించిన డిటెక్టివ్ ‘స్టిక్కర్’.

అతి సమర్థుడు, అత్యంత ప్రతిభాశాలి. ఫాస్టెస్ట్ కమాండో.

శత్రుదేశం డిఫెన్స్ ఆఫీసర్స్ మెస్‌లో డిష్ వాషర్‌గా పనిచేసి అతి చాకచక్యంగా రహస్యాలు కనుక్కున్నాడు స్టిక్కర్. అది గతం. దానిని ఉటంకిస్తూ, ఆ తర్వాత మరొక కేసులో అతని పాత్రను ఈ నవలలో ప్రవేశపెడతారు భువన చంద్ర.

స్టిక్ అయ్యేవాడే స్టిక్కర్. లక్ష్యానికి స్టిక్ అయి ఉండేవాడు ఈ డిటెక్టివ్ స్టిక్కర్.

అర్జున్ సింగ్ ఎక్స్ డిఫెన్స్ ఆఫీసర్. భారత దేశపు టాప్ సీక్రెట్ బ్లూ బుల్స్ ఆర్గనైజేషన్‌కి అతడు డైరెక్టర్. పాకిస్తాన్ నుండి ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏజెంట్లు నలుగురు యువకులను స్టిక్కర్ మట్టుపెట్టడంతో ఈ కథ ప్రారంభం అవుతుంది.

పూర్వకాలంలో లాగా కత్తులు, గదా యుద్ధాలు ఇప్పుడు లేవు. తర్వాత కాలంలోని తుపాకులు, బాంబులు వంటివి కూడా ఇప్పుడు లేవు.

కేవలం ఒక ఇంజక్షన్ బాటిల్లో ఉన్న కోటానుకోట్ల సూక్ష్మజీవులు. మూత తీస్తే క్షణాల్లో నగరమే నాశనమైపోతుంది, మనుషులు జంతువులతో సహా. భయంకరమైన క్రిమి యుద్ధం తయారు చేయవచ్చు ఈనాడు. ముఖాముఖి యుద్ధాలు లేవు క్షణాల్లో శ్వాసక్రియ ద్వారా శరీరంలోకి ప్రవేశించి రెండు గంటల్లో గుండెను ఊపిరితిత్తులను కాలేయాన్ని తినివేస్తాయి. దీనిని కనిపెట్టిన సైంటిస్ట్ ‘ఇర్విన్ టన్’. ఈ మారణ హోమం ఆపడానికి గత్యంతరం లేక ఆ నలుగురిని చంపేశాడు స్టిక్కర్.

ఇక్కడ విలన్ పాకిస్థాన్ ‘రసూల్ ఖాన్’. సామాన్యమైన వాడు కాదు. అత్యంత ప్రతిభావంతుడే. అతడు మిలిటరీ ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ బ్రెయిన్ అత్యంత రహస్యమైన రక్షణ వ్యూహం నిర్మించగలవాడు. డిఫెన్స్ మినిస్టరీలో ప్లానింగ్ వింగ్‌లో నియమించింది ప్రభుత్వం. పాకిస్తాన్ ఆర్మీలో మేజర్‌గా ఉంటూ తన బలహీనతల్ని మెయింటైన్ చేయడానికి జీతం చాలక ప్రభుత్వానికి ధనాన్ని దుర్వినియోగం చేసి కోర్టు మార్షల్‌కి గురై బయటకు నెట్టబడి ఎం.ఐ.జి.లో చేరాడు.

కరోనా క్రిమి ప్రపంచాన్ని వణికించిన రోజుల కంటే 30 ఏళ్ల క్రితమే సూక్ష్మ క్రిమి ద్వారా విధ్వంసం జరగటాన్ని ఊహించి రచించారు భువన చంద్ర.

స్టిక్కర్ టీంలో ఉన్న బ్లూ బుల్స్‌కి ఇచ్చే ట్రైనింగ్‌లో డిజాస్టర్ లైఫ్ కూడా ఓ భాగమే. కొన్ని నెలలు డిసర్ట్ లోనూ కొన్ని నెలలు మంచు ప్రదేశాల్లోనూ అస్సాం అరణ్యాలలోనూ కూడా వారికి ట్రైనింగ్ ఉంటుంది. అన్ని ప్రాంతాల్లో కూడా తమ ఫిజికల్ ఫిట్నెస్‌ని పోకుండా కాపాడుకోగలరు.

కల్నల్ ఏజెంట్ సలావుద్దీన్. ఇర్విన్ టన్ భార్యను బంధించి, అతన్ని బంధించి మానవ సంక్షేమం కోసం కృషి చేసే ఆ సైంటిస్ట్ చేత మానవ నాశనం చేసే క్రిముల్ని తయారు చేయించాడు. సైంటిస్ట్ కూతురు దిల్షాద్‌ని కొన్నాళ్ళు తన దగ్గర ఉంచుకుని ప్రేమగా పెంచాడు. కానీ ఆ అమ్మాయి జరగబోయే విధ్వంసాన్ని తెలుసుకుని అతి కష్టం మీద ‘స్టిక్కర్’కి మెసేజ్ అందేలా చేసింది.

ముగింపులో – అర్జున్ సింగ్‌తో స్టిక్కర్ అంటున్నట్లు రచయిత అనే మాటలు ఎన్నేళ్ళయినా, ఏ దేశ పౌరులైనా గుర్తుంచుకోదగ్గవి..

“ఎక్కడో హిందూ ముస్లిం కొట్లాట హిందూ సిక్కు కొట్లాట జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న మతపెద్దలు తామే ముందుగా కలుగజేసుకొని విషయాన్ని తెలుసుకొని సమగ్రంగా చర్చించుకుని రాబోయే సమస్యలు రాకుండా చూసుకుంటే ఎంత చక్కని మతసామరస్యం ఏర్పడుతుంది నేను హిందూ, మీరు సిక్కు, దిల్షాద్ ముస్లిం. కానీ మనం ప్రయత్నిస్తున్నది మానవతను పెంపొందించడానికి, మానవాళిని మారణ హోమం నుంచి రక్షించడానికి. ముందు మనిషి అని, ఆ తర్వాతే మతం అని గుర్తిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందీ లోకం!”

మిస్టర్ మిస్సైల్

మొదటి నవలలో శత్రువులు క్రిమిద్వారా విధ్వంసం సృష్టించాలనుకుంటే ఈ నవలలో అమానవీయంగా పవర్ ఫుల్ కాంతి కిరణాల ద్వారా నాశనం చేయాలని శత్రువులు ప్రయత్నిస్తారు. ఆకాశంలో ఏదో భయంకరమైన విస్పోటనం జరగబోతుందని తెలిసిన ఇంటలిజెన్స్ వారు టీవీల ద్వారా ప్రజలకు హెచ్చరికలు పంపిస్తారు – తల ఎత్తి ఎవరు ఆకాశమైతే చూడవద్దు అని. ప్రజలకు ఏమి అర్థం కాక అయోమయంలో ఉన్న సమయంలోనే ఆకాశంలో కోట్ల సూర్యుళ్లు కలిస్తే ఎంత వెలుగు వస్తుందో అంత కాంతి మెరుపులా మెరిసింది. ఆ భయంకరమైన ప్రేలుడికి భవనాలు కూలిపోయాయి కొన్ని వందల మంది పడ్డారు ఇంకొన్ని వందల మంది మరణించారు. ఈ సంఘటనతో నవల ప్రారంభమవుతుంది. ఈ కేసుని పరిశీలించమని బ్లూ బుల్స్ డైరెక్టర్ అర్జున్ సింగ్ డిటెక్టివ్ స్టిక్కర్‌కి అప్పగించాడు.

వెపన్ గాలరీ

మొదటి రెండు నవలలు విదేశ శత్రువులు భారత దేశంపై చేసే కుట్రలు, అనేక విధాలైన దాడులు. ఈ నవల భారతదేశాన్ని కుదిపివేయాలనుకుంటున్న టెర్రరిస్టుల గురించి. అత్యాధికమైన, అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను ఇతర దేశాల నుండి తెప్పించుకుని, ఎవరూ ఊహించలేని విధంగా రకరకాల మార్గాల్లో దేశం నలుమూలలకి సరఫరా చేసి తద్వారా అల్లకల్లోలం సృష్టించే టెర్రరిస్టులు ఆఖరికి పోలీసు స్టేషన్ల మీద దాడి చేసి ఆయుధాలు ఎత్తుకుపోతారు. ఆ క్రమంలో ఎందరో పోలీసులు హతమవుతారు.

చీఫ్ అర్జున్ సింగ్ అప్పగించిన ఈ కేసు కొరకు భారతదేశంలో ఉన్న అన్ని సెక్యూరిటీ వింగ్స్ చీఫ్ లతో సమావేశం ఏర్పాటుచేసాడు డిటెక్టివ్ స్టిక్కర్.

అందరూ స్పెషల్లీ ట్రెయిన్డ్ ఆఫీసర్స్. మార్షల్ ఆర్ట్స్‌లో ఎక్స్‌పర్ట్ లైన మోస్ట్ డిసిప్లిన్డ్ ఆఫీసర్స్.

ఎం.ఐ.జి. (మిడిల్ ఈస్ట్ ఇంటలిజెన్స్ గ్రూప్) హెడ్ క్వార్టర్స్‌లో రసూల్ ఖాన్‌తో, సలావుద్దీన్‌తో ఉన్న కల్నల్ మాలిక్ భారతదేశంలోని నిరుద్యోగులను, పేదరికంలో మగ్గుతున్నవారిని వేలాదిగా విప్లవకారులుగా మార్చాలని ప్రణాళికలు వేస్తున్నాడు. కానీ ఈసారి రసూల్ వేషంలో వచ్చి ఆ ప్రణాళికలన్నీ విని బైటకు వచ్చాడు డిటెక్టివ్ స్టిక్కర్.

తన దగ్గరకు వచ్చింది రసూల్ వేషంలో పచ్చింది డిటెక్టివ్ స్టిక్కర్ అని తెలుసుకున్న కల్నల్ అతన్ని చంపేయమని మనుషుల్ని పంపిస్తాడు. తప్పించుకునే ప్రయత్నంలో, దాదాపు చచ్చిపోయే స్థితిలో టెర్రరిస్టుల చేతికి చిక్కుతాడు స్టిక్కర్. వారి నాయకుడు మహంత్. స్పృహలో లేని స్టిక్కర్ దగ్గర ఉన్న ‘త్రిబుల్ జీరో’ కార్డ్ చూసి ఆశ్చర్యపోతాడు. దాని విలువ తెలిసినవాడు కనుక తాను తీసుకుని వెళతాడు.

కాపలా తక్కువగా ఉన్న సమయంలో ఉన్న ఒక్కతన్ని స్పృహ తప్పించి పారిపోయాడు స్టిక్కర్. బయట చూస్తే ఎడారి. పరిగెత్తుతూ ఒక ఒంటెను చూసి ఎక్కటానికి ఎంతో ప్రయత్నస్తూండగా పైన ఇండియన్ ఏర్ ఫోర్స్ రికనైజెన్స్ ఫ్లయిట్ లో వెళ్తున్నవారు అతన్ని రక్షించారు.

తాంబో దేశప్రథానికి ప్రథాన కార్యదర్శి మోండా భార్యా సమేతంగా భారతదేశం రావడం, తిరిగి వెళ్ళేటప్పుడు ఒక స్టూడెంట్ వేషంలో ఆశా వెళ్లడం, ఆ రైలుని పేల్చేయాలనే కుట్రను నివారించడం స్టిక్కర్ బృందం చేసింది. ఇమ్రాన్‌ని బంధించి స్థావరాల వివరాలన్నీ తెలుసుకుంటారు. ఆశా టెర్రరిస్టుగా నటించి బిరాదర్, మహావీర్ లను నమ్మించి వారితో పాటు వాళ్ళ చీఫ్ ని కలవడానికి వెళ్తుంది. ఆశాను వెంబడిస్తు వెళ్ళిన వందలాది కమెండోలు టెర్రరిస్టులందరిని బంధించారు.

“కల్నల్ మాలిక్ మాత్రం ఆచూకీ లేకుండా పోయాడు”.

మరో నవల రాస్తే బహుశా కల్నల్ మాలిక్‌తో ప్రారంభించే వారేమో భువన చంద్ర. కానీ అది తన మార్గం కాదనుకుని, ఆఫర్ ఇచ్చిన పబ్లిషర్ని కాదని సినిమా రంగంలోకి వెళ్లి విజయ బాపినీడు గారి ‘నాకు పెళ్ళాం కావాలి’ సినిమాలో రెండు పాటలు రాసి, ఇప్పటికి 3500 పాటలు రాసి, ఇంకా రాస్తూనే ఉన్న గొప్ప సినీ గేయ రచయిత భువనచంద్ర ని మన మిస్సయ్యేవారమేమో!

ఆయన చిరకాల వాంఛ, ప్రేక్షకుల ఆనందం ఈవిధంగా విజయవంతంగా నెరవేరింది..

భువన చంద్ర గారి డిటెక్టివ్ నవలలు తర్వాత కస్తూరి మురళీకృష్ణ గారి ‘క్రైమ్ స్టోరీస్’ పరిశీలిద్దాం. వార్త ఆదివారం అనుబంధంలో 1999 – 2005 వరకు ధారావాహికంగా వచ్చిన ఈ కథలు పాఠకుల విశేష ఆదరణ పొందాయి.

పత్రిక నిబంధన ప్రకారం 2 పేజీలలో కథ రాయాలి. నేరం, పరిశోధన, నిందితులను పట్టుకోవడం చెప్పేయాలి. నిబంధన కాదు కానీ మురళీకృష్ణ గారి ఉద్దేశం హత్య, నెత్తుటి మడుగు, హింసను వర్ణించడం కాదు. నేరం జరిగిన తర్వాత బాధితుల ఆవేదన నుండి కథను మొదలుపెడతారు. మురళీకృష్ణ గారి డిటెక్టివ్ పేరు ‘శరత్’. డిటెక్టివ్ శరత్ కి అసిస్టెంట్ రాము. ఇన్‌స్పెక్టర్ విజయ్.

దాగని నేరం

తన భర్త మరణించిన తర్వాత నళిని అనే స్త్రీ డిటెక్టివ్ శరత్‌ని కలిసి తన భర్తది సహజ మరణం కాదని, హత్య అని, అది నిరూపించమని వేడుకుంటుంది. నళిని భర్త శశికాంత్ గుండెకు సంబంధించిన చికిత్స విదేశాల్లో చేయించుకుని వచ్చి, ఆరోగ్యంగా తన వ్యాపారం చూసుకుంటున్నాడు. కానీ హఠాత్తుగా గుండె ఆగిపోయి మరణించాడు. అతని వ్యాపార భాగస్వామి రంగరాజు. శశికాంత్ గుండె మార్పిడి తర్వాత చాలా జాగ్రత్తగా సమయానికి మందులు తీసుకునేవాడు. చావుకు ముందు వారం రోజులు ఆఫీసు లోనే ఉన్నా టైం కి మందులు వేసుకునేవాడు. కానీ ఆ క్యాప్యుల్స్ డమ్మీవి. అంటే దానిలో ఉన్న మందు తీసేసి తెల్ల రవ్వను ఉంచారు. శశికాంత్ గతం లోని రక్త పరీక్ష రిపోర్ట్, చనిపోయాక రిపోర్ట్ చూస్తే అతను మందులు వేసుకోలేదని తెలిసింది. అలా మందులు మార్చే అవకాశం కేవలం రంగరాజుకే ఉందని నిర్థారించాడు డిటెక్టివ్ శరత్.

అన్నీ అనుకున్నట్టే జరగవు

సునీత, నందకుమార్ దంపతులు విడాకులు తీసుకున్నారు. కోర్టు అనుమతితో బాబుని వారానికి రెండు రోజులు తన దగ్గర ఉంచుకునే నందకుమార్ ఒకసారి బాబుని పార్క్‌కి తీసుకొనివెళ్ళాడు. ఒక్క క్షణం దృష్టి మరలి, చూసేసరికి బాబు కనబడలేదు. అతనే మాయం చేసి ఉంటాడని పోలీసు రిపోర్టు ఇచ్చింది సునీత. నందకుమార్ డిటెక్టివ్ శరత్‌ని ఆశ్రయించాడు. తన ఇల్లు, కారుని కూడా పరిశోధించారు పోలీసులు అని చెప్పాడు. శరత్ ఇన్‌స్పెక్టర్ విజయ్‌కి ఫోన్ చేస్తే కారు తాము చెక్ చేయలేదని చెప్తాడు. శరత్, రాము కారుని చెక్ చేస్తుంటే ఒక చిన్న రిసీట్ దొరుకుతుంది. అది కోల్డు స్టోరేజ్‌ది. జగన్ అనే పేరు చూసి అతను పనిచేసే కోల్డ్ స్టోరేజ్ దగ్గరకు వెళ్లి యజమాని సాయంతో లాకర్ తీసి చూస్తే ఖాళీ. రిలీఫ్‌గా ఫీలయ్యారు. జగన్ ఇంటికి వెళ్తే అతని మనస్తిమితం లేని భార్య కనిపిస్తుంది. ఆమెకు పిల్లలంటే ఇష్టం, కానీ వారి ఏడుపు అంటే కోపం, అసహ్యం. అందుకే స్వంత బిడ్డలిద్దరిని కొట్టి చంపేసింది. అనేక ప్రశ్నలు వేసి చివరకు కనుక్కున్నాడు డిటెక్టివ్ శరత్ ఆమే పార్క్‌లో ఆడుకుంటున్న నందకుమార్ కొడుకుని ఎత్తుకొచ్చిందని, కానీ వాడి ఏడుపు భరించలేక కొట్టి చంపేసిందని. భార్య మీద ప్రేమతో నేరం ఆమె మీదకు రాకూడదని పిల్లవాడి శవాన్ని నందకుమార్ కారులో పెడుతుండగా పోలీసులు పట్టుకుంటారు జగన్‌ని.

ఒక క్రైం కథలో మానసిక ఒత్తిడి కల స్త్రీ చేష్టలు వర్ణించడం ప్రత్యేకంగా ఉంది. హంతకురాలు అయినా ఆ పాత్ర మీద సానుభూతి కలిగేలా చిత్రించడం రచయిత నైపుణ్యం.

ఫేస్ ‘బుక్కై’ పోయారు

సోషల్ నెట్‌వర్కింగ్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. పైకి వ్యక్తీకరించలేని విషయాలను, కోరికలను మారుపేరుతో బయటపెట్టి సంతృప్తి చెందే వీలు లభిస్తుంది. ఇది ఒకసారి ప్రాణాంతకం అయ్యే ప్రమాదము ఉంది. ఇదే ముఖ్యంగా చెప్పాలనుకున్నారు రచయిత.

50 ఏళ్ల మృదుల, ఆమె భర్త ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే. పెద్దమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోంది. రెండో అమ్మాయి డిగ్రీ చదువుతోంది. అలాంటి ఆమెను ఎవరో యువకుడు ఒకరోజు పొద్దున్నే ఇంటి ముందే కత్తితో పొడిచి చంపేసి పారిపోయాడు. అతడు ఎవరో తెలియడం లేదు. అతన్ని చూసినవారు చెప్పారు – అతని వయసు 25, 30 ఉంటాయని, ఆ ప్రాంతంలో ఎప్పుడు చూసిన గుర్తు లేదని.

ఆమె మరణానికి ఫేస్‌బుక్‌లో 500 మంది పైన స్పందించారని కూతురు తండ్రితో అంటుండగా అక్కడే ఉన్న డిటెక్టివ్ శరత్ లాప్‌టాప్‌ని పరిశీలించటానికి తీసుకున్నాడు.

దానిలోని అన్ని పోస్టులను చూసిన ఉమేష్ చెప్పాడు – మృదుల తన పేరుతో ఒకటి, మోహిని అనే పేరుతో తన కూతురు ఫోటో ఉంచి మరొక ఫేస్‌బుక్ అకౌంట్ మెయింటైన్ చేస్తోందని. చాలామందితో చాటింగ్ చాలా పచ్చిగా చేస్తోంది. అందులో ఎక్కువగా ఉన్న పేరు చరణ్. 25 ఏళ్ళ మోహిని అనుకున్నాడతను.

మృదుల ఇంటికి నాలుగు వీధులు అవతలే ఉన్న అతని అడ్రస్ కనుక్కుని వెళ్ళారు డిటెక్టివ్ శరత్, ఇన్‌స్పెక్టర్ విజయ్. నడివయసు దాటిన వ్యక్తి తలుపు తీసాడు. అతని పేరు వెంకటేశ్వర్లు. చరణ్ పేరుతో ఛాట్ చేసింది ఇతనే. పాతికేళ్ళ అమ్మాయి, అడ్రస్ ప్రకారం తన కొలీగ్ కూతురు అని తెలిసే, హద్దుమీరి ఛాటింగ్ చేస్తూ ఇంటిని పట్టించుకోవడం మానేశాడు. ప్రశ్నించిన భార్యపై డైవోర్స్ ఇస్తానని అరిచాడు. కొడుకు దినేష్ తండ్రి ఫేస్‌బుక్, మెయిల్స్ అన్నీ చూసాడు. కూతురు కాదు, తల్లే ఈ దుర్మార్గం చేసి, తమ కుటుంబంలో చిచ్చు రగిల్చిందని తెలుసుకుని కసితీరా కత్తితో పొడిచి చంపేసాడు.

“ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరో ముఖమే ఇది. పరిణతి లేని వారి చేతికి అందిన పాశుపతం లాంటిది ఫేస్‌బుక్” అని ముగించారు రచయిత.

క్రైం కథల్లో కేవలం ఏదో హత్య, హింస, పరిశోధన ఉంటుంది. పైగా అక్రమ సంబంధాలు, సహజీవనంని గ్లోరిఫై చేసిన రచనలు వస్తున్న రోజుల్లో క్రైం కథల్లో కూడా కుటుంబ విషయాల్ని, సామాజిక సమస్యల్ని రాసిన కస్తూరి మురళీకృష్ణ గారు అభినందనీయులు.

Exit mobile version