Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

బేహ్ అజ్-మహ్‌-తే ఎశ్-ఘశ్ తొహ్-హీన్ నహ్-కోన్!

[ఈ విమర్శ, అఫ్సర్ కవిత్వ ప్రతిభపట్ల కాదు. కేవలం అతడిని ఆధునిక సూఫీ కవిగా అభివర్ణించి ఒక పీఠంపై కూర్చోబెట్టటం పట్ల ఇది నిరసన మాత్రమే, ఇది సాహిత్య సంబంధి మాత్రమే. వ్యక్తిగతం కాదు. ఈ విమర్శ రచయిత కవిత్వ ప్రతిభపై వ్యాఖ్య కూడా కాదు.]

ఇటీవలె కవి అఫ్సర్‌కు ఒక బహుమతి ప్రకటించగానే, ‘రోచిష్మాన్’ అనే రచయిత, విమర్శకుడు ఆ బహుమతిని కవి అఫ్సర్‌కు ఇవ్వటం పట్ల నిరసన వ్యక్తం చేశాడు. దానికి ప్రతిగా, ఒక సీనియర్ జర్నలిస్టు, ‘రజా హుస్సైన్’,  అఫ్సర్‌ను సూఫీ కవి అని సంబోధిస్తూ సమర్థించాడు. అది చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగులో ఎవరిని పడితే వారిని కవిసమ్రాట్ అనవచ్చు. సరస్వతీ పుత్రుడనవచ్చు. పుంభావ సరస్వతి అనవచ్చు. చివరికి బ్రహ్మశ్రీ అని కూడా అనవచ్చు. ఎందుకంటే, అలా అలవాటయిపోయింది. ఆయా పదాల అర్థాలు మారిపోయాయి. ఆరంభంలో ఇలా అన్నప్పుడు ఎవ్వరూ ఖండించలేదు. ఈ పదాల అర్థమిది, దీన్ని ఎవరికి పడితే వారికి వాడకూడదని ఎవ్వరూ చెప్పలేదు. అందుకని అవి స్థిరపడిపోయాయి. అలవాటయి పోయాయి. ఇప్పుడు ఆ పదాల అసలు అర్ధాలు చెప్పి, ఎవరిని పడితే వారిని అలా అనకూడదని చెప్పినా ఎవ్వరూ వినరు. కానీ, ఇంకా ఈ ‘సూఫీ’ అన్న పదం మన తెలుగు విశేషణ పదాల్లా భ్రష్టుపట్టలేదు. కాబట్టి ఈ సూఫీ అన్న విశేషణం మాత్రం తొందరపడి, తెలిసీ తెలియక వాడకూడదన్న ఉద్దేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో  ఈ వ్యాసం రాయాల్సివచ్చింది.

తెలుగు సాహిత్య ప్రపంచంలో అధ్యయనము, విశ్లేషణ అన్నవి అడుగంటి ఎనో దశాబ్దులయింది. సాహిత్య మాఫియా ముఠాల పిడికిళ్ళ నీడలో వున్నది సాహిత్య ప్రపంచం ప్రస్తుతం. వీరు ఎవరిని రచయిత అంటే వాడే రచయిత. ఏది రచన అంటే, అదే రచన. ఎవరిని విమర్శకుడంటే, వాడే విమర్శకుడు. విమర్శకుడన్న పేరు పెట్టుకుని, విదూషక  వందిమాగధభట్రాజ (వృత్తి సూచకము) గణ భజనబృందాలు, విశృంఖలంగా విచ్చలవిడిగా నిర్లజ్జగా తమ పాండిత్య ప్రదర్శనతో సాహిత్యాన్ని పాతాళలోకం కూడా అందుకోలేని లోతుల లోకాల్లోకి తొక్కేస్తున్నారు. ఇలా విమర్శకుడి ముద్ర పొందినవారు నచ్చినవాడిని పొగడేస్తారు. నచ్చనివాడీ లోకంలో ఉన్నట్టు కూడా గ్రహించినట్టుండరు. నచ్చినవాడిని పొగడటంలో కూడా రకరకాల లెక్కలుంటాయి. అవి ప్రస్తుతం అప్రస్తుతం. కానీ, ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో నిజానిజాలు నిక్కచ్చిగా చెప్పి, ఒక రచన నిగ్గుతేల్చి నిర్మొహమాటంగా, నిష్పాక్షికంగా, నిజాయితీగా రచనను విశ్లేషించే వ్యవస్థ లేదు.

అందుకే ఎవరికి వారు తమతోనే సాహిత్యం ఆరంభమయిందని ప్రకటించేసుకుంటున్నారు. అడిగేవారు లేరు. మరింకో ఆడుగు ముందుకువేసి ఇంకొందరు నీచోత్తములు ‘తామే సాహిత్యం’ అని బల్లలు గుద్ది మరీ చెప్పటమేకాదు, తమకు నచ్చనివారిని ‘సాహిత్య నిషేధానికి గురయినవార’ని, ‘సాహిత్యం వారిని బహిష్కరించింద’నీ ఇళ్ళెక్కి కోళ్ళయి కూయటమే కాదు, వంతుగా కూయని కోళ్ళ కీళ్ళు విరిచి వంటకాలుగా మలచి తమను సమర్థించినవారికి దావత్‌లు  కూడా చేస్తున్నారు.

అందరూ దావత్ కోసం పరుగులిడేవారేకానీ, ‘ఇదేమిటి?’ అని ప్రశ్నించేవారు లేరు. ప్రశ్నిస్తే పుట్టగతులుండవన్న భయంతో, ఏదెటుపోతే మనకెందుకన్న భావనతో మౌనం వహిస్తున్నారు. లేకపోతే, జీవితచరిత్ర రచనకూ, కాల్పనిక కథకూ తేడా తెలియని దుస్థితిలో తెలుగు సాహిత్యం ఎందుకుంటుంది?

ఒక రచయిత తన బాల్యానుభవాలను, అవే పేర్లతో, అవే ప్రాంతాలను వర్ణిస్తూ, తన దోస్తులపేర్లూ మార్చకుండా, కథనాత్మకంగా రచిస్తే, మన విదూషక విమర్శకులు, ఆ జీవితచరిత్రాత్మక కథనాలను కథగా పరిగణించటమే కాదు, ఆ రచయితను ఉత్తమ కథకుడిగా పరిగణిస్తున్నారు. ఆ కథకుడు సైతం తనని తాను అత్యుత్తమ కథకుడిగా ప్రచారం చేసుకుంటూ కథలు రాయటం ఇతరులకు నేర్పిస్తున్నాడు. కాల్పనికేతర రచనలకూ, కాల్పనిక రచనలకూ నడుమ హద్దులు చెరిపేస్తున్నారు తెలుగు సాహిత్య పెద్దలు.

ఒక రచన ఆత్మ చరిత్రాత్మకమయితే, ఆ రచయిత పుట్టిపెరిగిన స్థలాలు, ప్రాంతాలు, దోస్తులు అందరూ దానిలో కనిపిస్తే, అది కథ కాదు. కథ కాల్పనిక రచనా ప్రక్రియ. ఒకవేళ అది కథ అయితే, అది కాల్పనిక రచన అవుతుంది తప్ప, ఆత్మచరిత్రాత్మక రచన కాదు. ఈ నిజం తెలుగు విమర్శకులకు తెలియదు. తెలిసినా చెప్పరు. పాఠకులకు పట్టింపు లేదు. అందుకని, నేను అనుభవించిందే అలానే, ఉన్నది ఉన్నట్టు, కాల్పనిక పాత్రలు లేకుండా, ఎలాంటి కల్పన లేకుండా  రాస్తాననే ఆత్మచరిత్రాత్మక రచనల కాల్పనికేతర కథకులు బయలుదేరారు తెలుగు సాహిత్యంలో. ప్రస్తుతం ఇసకేస్తే రాలనంత మంది ఆత్మచరిత్రాత్మక కుహనా కథకోత్తములున్నారు తెలుగు సాహిత్యంలో. ఇటీవలే ఒక ఆత్మకథాత్మక నవల కూడా వచ్చింది. నవల కల్పన. ఆత్మచరిత్ర రచన కాల్పనికేతర రచన. అంటే, కాల్పనికేతర కాల్పనిక రచనలన్నమాట ఇవి!!!

ఇలాంటి దుస్థితిలో జ్ఞానాంధకారమే అసలయిన జ్ఞానమనుకునే అజ్ఞానాంధారబంధురమయిన తెలుగు సాహిత్య ప్రపంచంలో, అవార్డులకు సాహిత్యం నాణ్యత, రచనా నైపుణ్యం తప్ప ఇతరాలన్నీ ప్రామాణికాలవటంలో ఆశ్చర్యం లేదు. కానీ, కవి అఫ్సర్‌ను సూఫీ కవి అనటం మాత్రం, ఎంతగా అనుభవించే  అశ్చర్యాలన్నీ అయిపోయాయనుకున్న  తరువాత కూడా ఆశ్చర్యాన్ని అనుభవానికి తెచ్చింది.

అఫ్సర్ కవిగా గుర్తింపు పొందుతున్నాడన్నవిషయంలో ఎలాంటి సందేహం లేదు. అఫ్సర్ కవిత్వం బాగా వుంటుందన్న విషయంలోనూ అభ్యంతరాలేమీలేవు. ఆయన కవిత్వంలో సున్నిత భావాలు, ఆలోచనలు వుంటాయన్న విషయంలోనూ ఎలాంటి సందేహాలు లేవు. కానీ, అఫ్సర్‌ను సూఫీ కవిగా భావించటంలో మాత్రం, సూఫీ కవిత్వం తెలిసినవారు జీర్ణించుకోవటం కష్టం.

ఈ విశ్లేషణ సాహిత్య సంబంధి మాత్రమే.. ఇందులో వ్యక్తిగతం ఏమీ లేదు.

ఒక కవిని సూఫీ కవిగా, ఒక కవితను సూఫీ కవితగా నిర్ణయించేందుకు నిర్దుష్టమైన లక్షణాలూ, ప్రామాణికాలూ ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా రెండు పాదాలు రాసిన ప్రతిదాన్నీ షేర్ గానూ, ప్రతి గానాన్నీ గజల్ గానూ పరిగణించినట్టు సూఫీ కవిత్వాన్ని పరిగణించం. ఎందుకంటే, సూఫీ కవిత్వం భగవంతుడికి సంబంధించినది. సూఫీలు భగవంతుడినే నిరంతరం ధ్యానిస్తూ వుంటారు. వారికి ప్రపంచం అంతా భగవంతుడే. ప్రేమ కవిత్వం, భగవంతుడిపైని ప్రేమ కవిత్వం సూఫీ కవిత్వం.

‘నిశ్శబ్దపు ప్రతిధ్వనిలో, భగవంతుడి గుసగుసలు వినిపిస్తాయి

విశ్వం ఆలపిస్తున్న, శబ్దాలు లేని, మధుర గీతాలు వినిపిస్తాయి’ అంటాడు రూమీ.

నా ఖుదా దర్ కష్తి-ఎ-దర్ గర్ న-బాశద్ గో మ-బాష్

మా ఖుదా దారెమ్ మా రా నా-ఖుదా దర్కార్ నీస్త్

పడవలో పడవ నడిపే నావికుడు లేడా? లేకపోతే పోనీ, మన వెంట దేవుడున్నాడు, ఇక సముద్రంతో మనకు  పనేముంది.  ఇది సూఫీల తత్త్వం. ప్రపంచంతో పనిలేదు వారికి. వారి ప్రతి క్షణం, ప్రతి శ్వాస దైవమే. అమీర్ ఖుస్రో రాసిన ఈ శేర్   సూఫీల తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

మామూలు మైనారిటీ కవితలు, వేదనలు, బాధలు, కన్నీటి కవితలు, పరాయిధర్మ దూషణ కవితలను సూఫీ కవితలుగా పరిగణించటం ఘోరమేకాదు, అన్యాయం కూడా.

సూఫీ కవితకు ఉండవలసిన ప్రథమ లక్షణం అది భగవత్ సంబంధి అయివుండాలి. దైవంపై తీవ్రమయిన, మార్మికమయిన ప్రేమ కవిత అయివుండాలి. ఆ కవితలో ప్రతీకలుండాలి. పరమాత్మను చేరేందుకు ఆత్మ పడే తపన వుండాలి. పరమాత్మతో లయమొందే మార్గంలో ఆత్మప్రయాణాన్ని మార్మికంగా ప్రదర్శించాలి. సాధారణంగా సూఫీ కవితల్లో ప్రేయసి, మద్యం, మధుశాల వంటి వాటిని దైవత్వానికి ప్రతీకలుగా వాడతారు.

మచ్చుకి కొన్ని ప్రామాణికమైన సూఫీ కవితలు ఇవి;

ఖబరమ్ రశీదా ఇమ్శబ్ కీ నిగాహ్ ఖ్వాహీ ఆమద్

సర్-ఎ-మన్  ఫిదా-ఎ-రాహే  కి సవార్ ఖ్వాహి ఆమద్

ఈ రాత్రి నా ప్రియుడు వస్తున్నాడని తెలిసింది. నా తల తెగిపడినా ఫరవాలేదు, ఆయన వచ్చే దారిలో నేను నిలుచుని ఎదురుచూస్తూంటాను.

–అమీర్ ఖుస్రూ

అఖ్ల్ పిన్హానస్త్ -ఓ-జాహిర్ ఆలమే

సూరత్-ఎ-మా మౌజ్ యా అజ్ వాయ్ నామె

అసలు కారణం కనిపించదు.  కనిపిస్తున్న ప్రపంచం ఫలితం. కనిపించే ప్రపంచం,  కనబడని సముద్రం నుండి ఎగసి పడే అలల నురుగు.

–రూమీ

ఆ మిల్ యార్ సర్లే , మేరి జాన్ దిఖాన్  నే గ్యేహెరి

ఓ ప్రియతమా, నేను తీవ్రమైన బాధలో ఉన్నాను. వచ్చి, నన్ను నీ దరి చేర్చుకుని బాధను తీర్చవా?

–బుల్లేహ్ శాహ్

ఇవి మచ్చుకి మాత్రమే కానీ, వీటిని బట్టి సూఫీ కవిత్వం అంటే, భగవంతుని మీది ప్రేమను ప్రదర్శించేది, భగవంతుని చేరే మార్గాన్ని అన్వేషించేది, భగవంతుని విరహాన్ని ఓపలేనిది, భగవంతుడిని ప్రియుడిగా భావించి, అతనితో లయమవ్వాలన్న తీవ్ర వేదనను, తపనను కవిత్వంలో పొందుపరచేది సూఫీ కవిత్వం అన్నది గ్రహించవచ్చు. మామూలు సాంఘిక ఇతర భావాల కవితలను ఎంత మార్మికమైన కవితలైనా సూఫీ కవితలుగా పరిగణించే వీలు లేదు. ఎందుకంటే, సూఫీలు తమ కవితలలో తమ హృదయంలోని భావాలనే పొందుపరుస్తారు. వారే భావాలు వ్యక్తపరుస్తారో, అలానే జీవిస్తారు.

అమీర్ ఖుస్రో మామూలు రచనలు రాశాడు. రాజుల చరిత్రలు రాశాడు. కానీ, ఆయనను సూఫీ కవిగా పరిగణిస్తారు. ఎందుకంటే, ఆయన ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, ఆయన నిజాముద్దీన్ ఔలియా గురించే గానం చేశాడు. తాను నిజాముద్దీన్ ఔలియా శిష్యుడు (మురీద్) అని చెప్పుకున్నాడు. ఎల్లప్పుడూ భగవధ్యానంలో గడిపేవాడు. ఔలియా పట్ల ఆయనకు ఎంత భక్తి అంటే ఆయన ఎడబాటును ఒక్క క్షణం భరించలేకపోయేవాడు. చివరికి తన గురువు మరణించిన ఆరునెలల్లో అమీర్ ఖుస్రో కూడా మరణించాడు.  అమీర్ ఖుస్రో, మన దేశంలో జన్మించాడు కాబట్టి, అతని తల్లి హిందువు కాబట్టి అతనిపై  జయదేవుడి ‘గీతా గోవిందం’ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణుడి, గోపికల సరస సల్లాపాల ప్రభావం కనిపిస్తుంది.

బహుత్ కఠిన్ హై డగర్ పన్‌ఘట్ కీ

కైసే మై భర్ లావూన్ మధ్వా సే మట్కీ

లాజ్ రఖో మెరే ఘూంఘట్ పట్కీ

ఖుస్రో నిజామ్ కే బల్ బల్ జాయియే

నదీతీరానికి వెళ్ళి, కుండలో నీళ్ళు నింపుకురావటం చాలా కఠినం. నిజామ్ (నిజాముదీన్ ఔలియా, అమీర్ ఖుస్రో గురువు) కోసం ప్రాణాలు అర్పించేందుకూ సిద్ధం.

ఇక్కడ నది, బావి, కుండ, నీరు నింపటమూ, కఠిన మార్గమూ.. సర్వం ఆధ్యాత్మిక భావనల ప్రతీకలమయమే! పైపై అర్థం ఇస్తే.

ఎంతో మార్మికమూ, ఆధ్యాత్మికమూ, సూఫీ ప్రేమ తత్వమూ పొదుగుకున్న గీతం ఇది. ఇదీ సూఫీ కవిత్వము, గీతమూనూ.

భగవంతుడు, భక్తి తప్ప ఇతర రచనలేవీ సూఫీ రచనలు కావు. అలా పరిగణించటం అన్యాయం. అసలు ఇతరాలు రాసేవారు, భగవంతుని నిరంతర ధ్యానంలో జీవించని వారు సూఫీలు కారు. వారిని సూఫీగా పరిగణించేవీలు లేదు.

నిజాముద్దీన్ ఔలియా తాను నమ్మిన సత్యం కోసం సుల్తాన్ మహమ్మద్ బిన్ తుఘ్లక్ ను సైతం ఎదిరించి నిలబడ్డాడు.    పిచ్చివాడిగా, క్రూరుడిగా భావించే తుఘ్లక్ సైతం, తనతో విభేదించినా  ఔలియాను  గౌరవించాడు.  ఆయన ఇవేవీ పట్టించుకోలేదు. దైవ ధ్యానంలో మునిగిపోయాడు. ఇవేవీ తెలియక తెలుగు విమర్శక వందిమాగధభట్రాజగణ భజనబృందాలు అఫ్సర్‌ను సూఫీ కవి అంటున్నాయి. దీన్ని కవి కూడా కాదనకపోవటం వల్ల కవికి సూఫీలంటే సంపూర్ణంగా  తెలియదని అనుకోవచ్చు, లేదా, కవి తనని తాను సూఫీ కవిగా వీరు అనటాన్ని అమోదించి వుండచ్చు  అనిపించటంలో  తప్పులేదు.

తరచి చూస్తే, కవి అఫ్సర్‌ను సూఫీతో పోల్చి,  ‘ఇంటివైపు’ అన్న కవిత్వ సంపుటి ముందుమాటలో వాడ్రేవు చినవీరభద్రుడు ‘మన కాలపు సూఫీ’ అని కితాబిచ్చారు. ఆ ముందుమాట చదివితే, ముందుమాట రాసినాయనకు రూమీ ఎంతగా అర్ధమయ్యారో నన్న అనుమానం వస్తే దాన్లో రూమీ దోషం ఏమీలేదు.

‘ఇంద్రియాలు భూతలానికి సోపానాలు

ఆధ్యాత్మిక పరిజ్ఞానం స్వర్గానికి సోపానాలు’ అంటాడు రూమీ.

‘ధిక్ర్’ అంటే, కేవలం నిరంతర స్మరణ కాదు. అది నిరంతరం భగవంతుని స్మరణ. భగవంతుని స్మరణ కాకపోతే,  సూఫీల ప్రకారం అది ‘ధిక్ర్’ కాదు.

‘ఇంటివైపు’ సంపుటిలో కవిత్వంలో భగవంతుని ప్రసక్తి మార్మికంగానైనా వెతుక్కోవాల్సివుంటుంది. ఆలోచన వుంది. సున్నితత్వం ఉంది. తనను తాను వెతుక్కోవటం ఉంది. తన మూలాలను స్మరించటం ఉంది. అంతే.

ముందుమాటలోనే సూఫీ అని నిర్ధారించేందుకు ఉదహరించిన కవితలను పరిశీలిస్తే దైవం ప్రసక్తి ఎక్కడా కనిపించదు. ఉద్యమాలు, ఆకళ్ళు, రక్తాలు, హింసలు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తాయి.

విగ్రహాలు, విధ్వంసాలూ, ఆత్మహత్యలూ హత్యలూ

కరువులూ నిరుద్యోగాలూ

ఆకలి కడుపులూ వీధులమీద

పోస్టర్లయి తిరుగుతున్న మనుషులూ వూరేగింపులవుతున్న

అసహనాలూ..

ఈ కవిత్వాన్ని సూఫీ కవిత్వం అనే వీలే లేదు. సూఫీ కవిత్వం అంటే, ఏ కాలం లోనయినా, ఆధ్యాత్మిక తపన, ఆలోచనలున్న మార్మిక ప్రేమ కవిత్వం. అది కానిదేదీ సూఫీ కవిత్వం కాదు. దాన్ని సూఫీ కవిత్వంగా ప్రకటించేవారు ఎంత పండితులయినా, ఎన్నెన్ని పుస్తకాలను అనర్గళంగా వల్లించినా వారికి సూఫీ అంటే తెలియదని నిస్సంకోచంగా చెప్పవచ్చు. లేదా, తెలిసినా, వారికే తెలిసిన కారణాలవల్ల తాత్కాలిక పొగడ్తల బాజా బజాయించినట్టున్నారని అనుకోవచ్చు. ముందుమాటల  మొహమాటాలు.

నమ్మరా బాబూ నమ్మరా నన్ను

యీ పాస్పోర్టు సాక్షిగా ( నా పేరు)

‘మై నేమ్ ఈజ్ ఖాన్’ సినిమాకు ప్రతిబింబంలాంటి కవిత.  ఇది ఎయిర్పోర్టుల్లో ప్రతి  ముస్లిం పాడుకోవాల్సిన ఆత్మ శోక గీతం అని రచయిత స్వయంగా చెప్పుకున్నాడు. ఇదొక రాజకీయ, సామాజిక కవిత.. దీన్ని ఆధునిక సూఫీ కవిత అంటే, ఎలా ఒప్పుకుంటాం?

ఎప్పటికప్పుడు చావు కొత్త అద్దం తొడుక్కుంటోంది

చొక్కా మార్చినంత తేలిగ్గా

మాటల్ని విడిచేస్తోంది సర్కార్ (కొన్ని నిముషాలు)

ఇది పక్కా రాజకీయోద్యమ కవిత. ఆధ్యాత్మిక సూఫీ కవిత కాదు. లేక ఉద్యమ, రాజకీయ, మైనారిటీ కవిత్వమే ఆధునిక సూఫీ కవిత అంటే, ఆధునిక నినాద, ఉద్యమ,  వచన కవులందరినీ ఆధునిక సూఫీ కవులుగానే పరిగణించాల్సివుంటుంది. లేకపోతే, ‘కవిత్వ వివక్ష’ అవుతుందది.

నువ్వు నేర్పిన మర్యాదలేవీ నాకు వద్దులే, రామన్నా!

కోటి శంబూక వధల తరువాత

నీ తీర్పరితనమేమీ నాకు వద్దులే రామన్నా!

****

****

నీ పునర్నిర్మిత ఆత్మ గౌరవ నరకంలో

భూమ్యాకాశాల్ని అంటుకునే ఆగ్రహాన్ని నేను.

నా నిలువెత్తు ఆగ్రహ విగ్రహాన్ని నువ్వింకా చూడనే లేదు! (విగ్రహవాక్యం)

సూఫీ ఆధ్యాత్మిక, మార్మిక, ప్రతీకాత్మక ప్రేమ పొంగిపొర్లుతున్న కవితనా ఇది? అందుకేనా ఈ కవిని మన కాలపు సూఫీ కవి అంటున్నారు. ‘నా నిలువెత్తు ఆగ్రహ విగ్రహాన్ని నువ్వింకా చూడనే లేదు’.

‘ష్యేక్ ముహమ్మద్ నాజిమ్’ అనే సూఫీ, “కోపం విష సర్పం వంటిది. ముందుగా హృదయంలో దైవంపట్ల విశ్వాసమనే జ్యోతిని ఆర్పేస్తుంది ఆగ్రహం” అంటాడు.

సూఫీ కవిత్వంలో ప్రేమ తప్ప మరొకటి వుండదు. అది భగవంతుడిపై ప్రేమ.

“నెనే మతానికీ చెందినవాడిని కాను. ప్రేమ నా మతం. ప్రతి హృదయం   మందిరం” అంటాడు రూమీ.

కొన్ని శతాబ్దాలుగా అబధ్ధంగానే

బతుకుతున్నా.

ఇప్పుడు నిజం చెప్తున్నా

నేను పదహారణాల పదహారో శతాబ్దం బిడ్డని. ( పదహారో నదికి మళ్ళీ చలో..)

2.

కొత్త పదాల అందాన్ని అద్ది, హత్యని  lynching అన్నారు. యింకోసారి అది  encounter కావచ్చు. చట్టరాహిత్యపుటడవిలో పేరు తెలియని చెట్లకి వేలాడేసి, ప్రాణాల్ని చివరంతా వేటాడవచ్చు. నగరం నడిమధ్యలోనే యేదో వొక నిషిద్ధ మాంసం ఎరగా విసిరి, యేకంగా మనిషినే నిషిద్ధ పదార్ధం చేయచ్చు. పదమొక్కటే మార్తుంది. వేట అదే! హత్యా అదే!

4.

యింకా కొన్ని పేజీల తరువాత అదే కథ మన దాకా వస్తుంది.

“గొంతెత్తిన ఆ దళితుల్ని చంపి, గోతాముల్లో చుట్ట చుట్టి కట్టేశాం”

“యింకో తురకని కనబోతున్న ఆ తురకదాని గర్భంలో పిండాన్ని శూలంతో పొడిచేశాం. జై హింద్!”

“తరిమి తరిమి కొట్టి మరీ చంపాం ఆ తురక వాణ్ణి గోమాంసం కొని తీసుకు వెళ్తున్నప్పుడు”

“మా గోమాతని యెట్లా ముక్కలు చేశాడో వాణ్ణీ అన్ని ముక్కలు చేశాం తెలుసా?!.”

ఇది సూఫీ కవిత్వం ఎలా అవుతుంది?  ఇదే ఆధునిక సూఫీ కవిత్వం అనుకోవాలా?

ఆధునిక సూఫీ కవి అని అన్నందుకు ఇచ్చిన వివరణలో ‘ఇదొక సూక్ష్మలోక యాత్ర’ అన్నారు ముందుమాటలో. వంద కవితల్లో ఒకటో రెండో కవితల్లో కాస్త చక్కటి భావన కనిపిస్తేనే మురిసి ఆధునిక సూఫీ కవి అనటం భావ్యమా? ఆధునిక సూఫీ కవి అయితే, యీ హింస ఏమిటి? విషయాన్ని తనవైపునుంచే చూసి వివరించటం ఏమిటి? దీన్లో ఏదీ సార్వజనీన ఆలోచన? దీంలో ఏదీ ప్రేమ? భగవంతుడికోసం తపన ఏది?

దేవుళ్ళు దిగిరారు కామ్రేడ్!

దేవుళ్ళు తయారయ్యే మట్టిబొమ్మలే

మనమే దిద్ది తీర్చే దిష్టిబొమ్మలు దేవుళ్ళు

మన అర్ధమూర్ఖత్వాలకూ, మన అర్ధజ్ఞానానికీ

మనమే తొడిగించిన పట్టువస్త్రం – దేవుడు

మన భయల్నీ మన భ్రమల్నీ దాచుకోడానికీ

మనమే కట్టుకున్న ఆలయం – దేవుడు. ( దేవుడు మరణించలేదు)

ఈ కవిత చివరలో అంటాడు కవి,

పదేపదే వల్లించడానికి

పూజిస్తూ కూర్చోడానికి

తారకమంత్రమైతేనేం

కాపిటల్ అయితేనేం!

తారకమంత్రాన్నీ స్మరించటాన్నీ , కాపిటల్‌ను వల్లెవేయటాన్నీ సమానం అనటమే ఆధునిక సూఫీ కవిత్వమా? అప్పటి సూఫీలు అజ్ఞానులు వాళ్ళు దేవుడిని పట్టుకుని వ్రేళ్ళాడేరు. ఆధునిక సూఫీ కవిత్వం ఇలాగేవుంటుందనుకోమంటారా?

వందేమాతరంలో నా తరం లేదు

జనగణమనలో నా జనం లేరు

కంఠనాళాలు తెగిపోయాయి

నా గొంతు జెండాలా పూరా విచ్చుకోదు

నా ఆగస్టు పదిహేనులన్నీ

స్మశానవాటికలోనే..

ఇది మామూలుగా అలవాటయిన అనేకానేక వచన కవితల్లో ఒకటి. ఇదంతా  ఆధునిక సూఫీ కవిత్వమేనా?

రాజకీయం మతమో

మతం రాజకీయమో

మతం నేరమో

రాజకీయం నేరమో నాకు తెలీదు

నాకు నేర్పిన శాంతి వచనాలన్నీ

కరుణామయుడైన అల్లా!

నీ కనిపించని విశాల వక్షంలోనే దాచుకో..

నమాజ్‌లో నీముందు మోకరిల్లిన

శిరస్సులన్నీ వరసాగ్గా

తెగనరుకుతూ పోతున్న కాఫిర్ల మధ్య

నేనొట్టి కాటికాపరినై పడి వుండలేను..

……………………

……………………….

అమ్మా,

నువ్వు ఆయుధ కల్మా పఠించు

నేను సమాధి గోడల్ని చీల్చుకుని పునర్జన్మిస్తాను

పాఠాలూ, పదే పదే పఠనాలూ కాదు

ఖడ్గవిహారం నేర్పిన వాడిముందే ఇక నా సిజ్దా.

ఆధ్యాత్మిక ప్రేమనూ, భగవంతుడి ప్రేమనూ వదలి ఖడ్గ విహారం నేర్పే వాడికి సిజ్దా చేసే వాడు సూఫీ కానేకాడు. సిధ్దాంతాల ప్రేమికుల దృష్టిలో గొప్ప కవి కావచ్చు. కానీ, సూఫీ కవిగా నిర్ణయించటం కష్టం.

సూఫీ కవిత్వమంతా ‘ఇష్క్ -ఎ- హకీఖీ’ అంటే, భగవంతునిలో ఐక్యమవ్వాలన్న తపన. సూఫీ కవులు ప్రేమే నిజమైన మతమని నమ్ముతారు.  “ప్రేమికులకు మతం, కులం ఉండవు, ప్రేమ ఒక్కటే వారి మతం” అనేది వారి కవిత్వ సారాంశం.

ఆయమ్ బే సర్‌-ఎ-కూయె తొ పూయాన్ పూయాన్

రుఖ్సార్ బే అబ్‍-ఎ-దీదె శూయాన్ శూయాన్

బిచారే రాహ్‌ -ఎ-వస్ల్‌-ఎ  తొ జూయాన్ జూయాన్

జాన్ మీ దెహమ్ ఒ నామ్-ఎ గూయాన్ గూయాన్

పరుగు పరుగున నీవుండే వీధి చివరివరకూ వచ్చాను. కన్నీళ్ళు కారుతూ కారుతూ ప్రక్షాళన చేస్తున్నాయి. నీ కలయిక కోసం పిచ్చివాడిలా ప్రాధేయపడుతున్నాను. ప్రాధేయపడుతున్నాను. నీ పేరును స్మరిస్తూ స్మరిస్తూ నా ఆత్మను నీకు అర్పిస్తున్నాను.

సూఫీ నిజాముద్దీన్ ఔలియా కవిత ఇది.. సర్వం భగవదార్పణం చేసి, దివ్య సన్నిధి తప్ప మరేమీ కోరని సూఫీలెక్కడ, ఖడ్గ విహారం నేర్పితే సిజ్దా చేసే ఆధునిక కవి ఎక్కడ? వారు సూఫీ వర్గీకరణలో.. ఆధునిక కవి ఆధునిక కవి ఆధునిక వర్గీకరణలో…  ఆధునిక వచన, నినాద, ఆవేశ, అన్యాయ, అణచివేత, మైనారిటీ, అరస విరస కురస నీరస నోరస కవులెవ్వరికయినా  సూఫీ అన్న పదం వాడటమే blasphemous.

యివాళ

జైశ్రీరామ్ అనిపించగలరు వేల గొంతులతో.

వొక్క శరీరంలో గుక్కెడు ప్రాణం పోయగలరా,

దయచేసి చెప్పండి

అనేక అన్సారీలు నడివీధుల్లో శవాలు కాకముందే! (ఆ పేరే యెందుకువుందో?)

జైశ్రీరామ్ అని అనిపించేవారేకాదు, ‘సర్ తన్సే జుదా’, ‘అల్లాహ్-ఒ-అక్బర్’ అనేవారూ చుక్కెడు ప్రాణం కూడా పోయలేరు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ తత్వాన్నీ, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్నీ, భగవంతుడిలో లయమవ్వాలన్న తీవ్ర తపననూ ప్రదర్శించేవాడే సూఫీ. అలాంటి వాడు రాసేదే సూఫీ కవిత్వం.. ఆధునిక ఆవేశాల, ద్వేషాల, ఉద్యమాల, విధ్వంసక, విచ్ఛిన్నవాద కవిత్వం ఎన్నటికీ సూఫీ కవిత్వం కాదు. వారెన్నడూ సూఫీ కవులు కారు.

పొగడాలి కాబట్టి, అక్షరం రాసిన వాడిని కాళిదాసుతో, వాక్యం రాసినవాడిని వాల్మీకితో పేరా రాసినవాడిని పతంజలితో పోల్చి,  పొగిడేసే  వందిమాగధభట్రాజగణభజనబృందాలు విమర్శకుల్లా, మేధావుల్లా చలామణీ అయినంతకాలం, తెలుగు సాహిత్యంలో ఆధునిక రూమీలు, అభినవ ఖుస్రోలూ, ఘాలిబ్‌లూ, చలంలు, శ్రీశ్రీలు, జాషువాలకు కొదువ వుండదు. ఉండే కొదువ అల్లా, చక్కని సాహిత్యానికే! ఇకపై ఏ కవికి, రచయితకి అయినా ఏదో విశేషణం వాడేముందు, తమ పొగడ్తలకు తాము జవాబుదారీ అన్న గ్రహింపు వందిమాగధభట్రాజభజనబృందాలు ప్రదర్శించాలి. ఆయా రచనలు చదివి నిక్కచ్చిగా నిజానిజాలు చూపి విశ్లేషించే విమర్శ వ్యవస్థ తెలుగులో రావాలి. లేకపోతే, ఇప్పటివరకూ తెలుగు బిరుదులయిపోయాయి, ఇక, పర్షియన్, అరబ్బు, ఫ్రెంచ్ బిరుదులు మొదలవుతాయి,  పదాలను, భాషనూ, సాహిత్యాన్నీ  అపహాస్యం చేస్తూ.

‘నువ్వూ’, ‘నేనూ’, అన్నవి 

స్వర్గానికీ, భూమికీ నడుమ తెరలు.

ఈ తెరలు తొలగించి చూడు

జాతులు, మతాల తేడాలు లేవు

ఈ తెర తొలగించి చూడు

‘నువ్వూ’ ‘నేనూ’  అన్న తేడాలేనప్పుడు

మసీదేమిటి? 

ప్రార్ధనా మందిరమేమిటి?

అగ్ని దేవాలయమేమిటి?

–మహమూద్ శబిస్తారి

ముకుళిత హస్తాలతో, అభ్యర్ధిస్తున్నాను.. సూఫీల భగవంతుడి అమర ప్రేమను అవమానించకండి. బేహ్ అజ్-మహ్‌-తే ఎశ్-ఘశ్ తొహ్ -హీన్ నహ్ -కోహ్న్!

(బేహ్ అజ్ -మహ్‌ – తే ఎశ్-ఘశ్ తొహ్ -హీన్ నహ్ -కోన్!- ఇది సూఫీ కవి రూమీ కవితలోని ఒక పాదం. అతని ప్రేమ గొప్పతనాన్ని అవమానించకండి అన్నది అర్ధం)

Exit mobile version