Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘బియాండ్ కాఫీ’ మరింత చేదు — కక్కుకునేంత!!!!!! – పుస్తక విశ్లేషణ

కొంచెం పాలు, కొంచెం పంచదార, కొంచెం బ్రూ (ఫిల్టర్ తీసిన డికాషన్) కలిపి పొద్దు పొద్దున్నే వేడి పొగలు గక్కే కాఫీ తాగటం ఓ అందమైన అనుభూతి. ఆ పాళ్ళను కలిపే చేతి నైపుణ్యం వల్ల కూడా మరింత అద్భుతమైన రుచిగల కాఫీ తయారవుతుంది.

ప్రముఖ రచయిత మహమ్మద్ ఖదీర్ బాబు ‘బియాండ్ కాఫీ’ అన్న కథా సంపుటి చదివితే నోరంతా, మనసంతా చేదుగా మారిపోయింది. ‘దర్గామిట్టా కథలు’, ‘పోలేరమ్మ బండ కథలు’ రాసి దిగువ మధ్యతరగతి ప్రజలకు (పాఠకులకు) చేరువైన ఖదీర్ బాబు ఈ తలా తోక లేని కథలు రాయటం ఆశ్చర్యం అనిపించింది. దర్గామిట్ట కథలలో మానవ సంబంధాలు, మనిషి గుండె చప్పుడు, కన్నీటి ఉప్పదనం, చిరునవ్వు మెరుపుతనం (కన్నీటికి, చిరునవ్వుకి కులమతాలు ఏమిటి? అందరికీ ఒకటే. అందుకే అందరూ ఓన్ చేసుకున్నారు) అందించి రచయితగా పైమెట్టు ఎక్కారు.

‘బియాండ్ కాఫీ’లో ఉన్న పది కథలూ దాదాపు ఒకటే ఇతివృత్తం. ‘స్త్రీ’ చుట్టూ తిరిగే ఇతివృత్తం. అడ్డులేని విశృంఖలత, కట్టలు తెంచుకొన్న స్వేచ్ఛ, అవాంఛనీయ కోరికలు, శారీరక వాంఛతో కాలిపోయే కరిగిపోయే ‘స్త్రీ’ ఇతివృత్తం. సెక్స్ కోసం పడి చచ్చిపోయేది ‘స్త్రీ’ అని వర్ణిస్తూ, వివరిస్తూ, నిర్ధారిస్తూ, నిశ్చయంగా, ఏకబిగిన (డైరెక్ట్ పుస్తక రూపంలో) రాసిన ఖదీర్ బాబు తన అభిమాన పాఠకుల ఆదరణను చాలావరకు పోగొట్టుకున్నారని చెప్పాలి. రెండు వేల కాపీలు వెంటనే అమ్ముడు పోవటం గొప్ప విషయమూ కాదు, పుస్తకం లోని ‘గొప్ప విషయం’ వల్లా కాదు.

పోలేరమ్మ బండ కథలు లాంటి గతంలో రాసిన కథలు కావు ఈ పది కథలు. అన్నిటిలోనూ బాగా డబ్బున్న స్త్రీలు. ఏదో కారణంతో భర్తతో సెక్స్ సుఖం పొందలేక తపించిపోయే స్త్రీలు. ఆ కోరిక తీర్చుకోవటానికి ఎదురుగా.. ఎవరైనా.. డ్రైవర్ కావచ్చు.. స్టూడెంట్ కావచ్చు.. ముక్కు మొహం తెలియని వాడు కావచ్చు.. ‘మగాడు’ అయితే చాలు అనుకునే స్త్రీలు. ఈ విచ్చలవిడితనం ఏ సొసైటీలో, ఎక్కడ ఉంది రచయిత గారు! ఎంత హై క్లాస్ స్త్రీలైనా ఇంత నీతి భాహ్యమైన పనులు చేస్తారా శారీరిక సౌఖ్యం కోసం!

మొదటి కథ ‘ఆస్తి’. బాగా డబ్బున్న సంపన్నవంతమైన హై క్లాస్ కుటుంబంలో- ఆ ఇంటి వారసుడు డ్రగ్స్‌కి బానిస అయి బక్కగా అయిపోయి, కళ్ళ కింద నల్లటి వలయాలతో, పూచిక పుల్లలా, చాలా వీక్‌గా ఉంటాడు. అతడి తల్లికి కొడుకు డ్రగ్స్‌కి బానిస అయిన బాధ కంటే – అతడు సంసారానికి పనికిరాకుండా పోయాడు అన్న ఆవేదనకంటే – కోడలు ఎవరితోనో సంబంధం పెట్టుకొని విచ్చలవిడిగా తిరుగుతోంది అన్న ఆక్రోశం ఎక్కువగా ఉన్నట్టుంది. దర్గా లోని మంత్రగాడు హుజూర్‌ని ఇంటికి పిలిపించి, కన్నీళ్లు పెట్టుకొని, తన ‘బంగారు తండ్రి’కి ఫ్రెండ్స్ పాడు అలవాట్లు చేశారని వాపోయింది. పెళ్లి చేస్తే మారతాడని ఆ మహాతల్లి ఇంకో ఆడదాన్ని గొంతు కోసింది. ఒక కొడుకు పుట్టాడు. ఆ పెద్దమనిషి ఇంకా ‘వీక్’గా తయారయ్యాడు. మంత్రం ద్వారానో, తంత్రం ద్వారానో కొడుకుని ఆరోగ్యవంతుడిగా మారేలా చెయ్యమనటంలో ఆ తల్లి ఆవేదన కరెక్టే. కానీ డ్రగ్స్ అలవాటు ఉన్న కొడుక్కి పెళ్లి చేయటం ఆమె తప్పు కాదా! తన పరిస్థితి తెలిసీ పెళ్లి చేసుకొని ఇంకో ఆడదాని బతుకు బండలు చేసిన ఆ కొడుకు తప్పు లేదా! కానీ కోడలు ఎవరితోనో పోతోంది, ఆ ‘ముండ’ పొగరు అణచాలి అంటుందామె. ఆ పెద్ద బంగాళా, ఖరీదైన వస్తువులు, వజ్రాల నగలు అన్నీ ఉన్న ఆ పెద్దామె నోటి నుండి ఎటువంటి పదం వచ్చింది! అంతేకాక “మీరు నా కొడుక్కి మగతనం తేకపోయినా పర్వాలేదు. వాళ్ళని మాత్రం విడగొట్టాలి. నా కోడలితో సంబంధం పెట్టుకున్న వాడు నెత్తురు కక్కుకొని చావాలి” అంటుంది కసిగా. తల్లీ కొడుకుల తప్పులేదుట. ఏ తల్లి కన్న బిడ్డో ఆ ఇంటికి వచ్చిన ఆ కోడలు, అతను ఎవరో.. వాళ్ళిద్దరి మీద కక్ష. ఇదేం న్యాయం!

ప్రయత్నిస్తాను అన్న హుజూర్ అక్కడి నుంచి జారుకున్నాడు. మళ్ళీ రాకూడదు అనుకున్నాడు. ఇక్కడ చివరి ట్విస్ట్ ఏమిటంటే – అంత గొప్ప ఇంటి కోడలు తమ స్ధాయికి సమానమైన ఏ పారిశ్రామికవేత్త తోనో, మేనేజర్ తోనో కాదు సంబంధం పెట్టుకుంది – ఆ ఇంటి డ్రైవర్ శేఖర్‌తో. ఆ శేఖర్ అంటే తల్లి కొడుకులు మాటిమాటికి భయపడటం చిత్రంగా అనిపిస్తుంది. భర్త సంసారానికి పనికిరాకపోతే డ్రైవర్‌తో శారీరక సంబంధం పెట్టుకుంది ఆ పెద్దింటి కోడలు. ఈ కథలో ఏ పాత్రా నిస్సహాయంగా కనిపించదు. ఏ పాత్ర మీద పాఠకుడికి సానుభూతి కలగదు. తల్లీ కొడుకులను సమర్థించలేం. శారీరక సుఖం కోసం డ్రైవర్‌తో సంబంధం పెట్టుకుని, ధైర్యంగా తిరుగుతున్న కోడలిపట్ల సానుభూతి చూపలేం.

రెండో కథ ‘ఘటన మరీ చిత్రం. బాగా డబ్బున్న ఓ భర్త ఎప్పటిలా బాగా తాగి, డ్రైవ్ చేయలేక, ఆటో కోసం రోడ్డు మీదకి వచ్చి యాక్సిడెంట్‌కి గురవుతాడు. ఇలా చాలాసార్లు జరిగినట్టుంది. విషయం తెలిసిన భార్య హాస్పిటల్‌కి విసవిస మంటూ విచ్చేసింది భర్తని “బాస్టర్డ్” అని తిడుతూ.

“సడెన్‌గా రోడ్ మీదకు వచ్చారు. అప్పటికి చాలా గట్టిగా బ్రేక్ వేశాను మామ్” అన్నాడు అతన్ని హాస్పిటల్లో చేర్చిన కుర్రాడు బెరుకుగా. అప్పటికే అక్కడికి వచ్చిన వయసు మళ్ళిన బావగారిని, అతని స్నేహితుడిని చూస్తూ “యూ డ్రంకెన్ బాస్టర్డ్స్! ఏమి ఫ్యామిలీ రా మీది” అంటూ తిట్టిందా హై క్లాస్ విమెన్. “ఐ యాం అట్టర్లి ఫెడప్. గుడ్ బై” గట్టిగా అరుస్తూ టక టకా బయటికి వెళ్ళిపోయింది- ‘చేయి విరిగి, మైల్డ్‌గా హెడ్ ఇంజరీ’ అయిన భర్తని చూడకుండానే.

“బరువుగా ఉన్న మనిషి – ప్రతి కదలిక లోను పరిణితి (?) కనిపిస్తున్న మనిషి – భర్తకు యాక్సిడెంట్ అయిందని తెలిసాక కూడా హడావుడిగా కాకుండా నాలుగైదు నిమిషాల్లో (రచయితకి ఎలా తెలుసో) శుభ్రంగా తయారై వచ్చిన మనిషి – తేలిక రంగు చీర అదే రంగు బ్లౌజ్ – గ్లాస్ బ్యాంగిల్స్, కంఠానికి రెండించుల దిగువన సన్నటి డైమండ్ లాకెట్, తెల్లని ఛాయ. యాభై ఉంటాయా!”.. ఇదీ ఆమె గురించి రచయిత చేసిన వర్ణన. అక్కడ సందర్భం ఏమిటి! పరిస్థితి ఏమిటి! రచయిత చేసే ఈ వర్ణన ఏమిటి! ఏమి చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రత్యేక వర్ణన ద్వారా!

ఆమె డ్రైవ్ చేయలేనంత అస్థిమితంగా ఉంది. అదే పైకి అనేసింది. ఆయన్ని హాస్పిటల్‌లో చేర్చి, తన బాధ్యత పూర్తయినా – ఆ కుర్రవాడు వెళ్లిపోలేదు. “నేను డ్రైవ్ చేయనా” అనటం ఓ చిత్రం. కారులో వెనక సీట్లో కూర్చున్న ఆమెను చూస్తూ డ్రైవ్ చేస్తున్న ఆ కుర్రాడు “మామ్.. రిలాక్స్..” పదేపదే ఓదార్చుతూ అంటూ ఉండడం మరింత విచిత్రం. చాలా అస్థిమితంగా, ఆందోళనగా, పిచ్చిగా ఉందామె. సీట్ చివరికి కూర్చుంది. సీటును చేతితో కొడుతూ ఉంది. ఏమాత్రం పరిచయం లేని ఆ కుర్రాడి ముందు “ఇలాంటి బాస్టర్డ్స్..” అని భర్తని తిట్టింది. పిడికిలిని నోటి దగ్గర పెట్టుకొని గట్టిగా కొరుక్కుంది. “ఎవరి అబ్బాయివి” అని అడిగింది. “వీసీ గారి అబ్బాయి నండి” అన్నాడు.

ఇంటికి వచ్చారు. అప్పటికీ అతను వెళ్ళిపోలేదు. తాళం కూడా తీయలేక ఆమె చేయి వణుకుతోంది. గబగబా వచ్చి తాళం తీశాడు. ఆమె లోపలికి వెళ్ళింది. అయినా అతను వెళ్ళిపోలేదు. “మీ హస్బెండ్‌ని వదిలి రాకుండా ఉండాల్సింది” అన్న సలహా కూడా ఇచ్చాడు.

“వెళ్రా బాస్టర్డ్” అంది తన ఊతపదాన్ని మళ్లీ ఉపయోగిస్తున్నట్లు. “సరే.. మంచినీళ్ళు.. కనీసం కాఫీ అయినా ఇవ్వండి” అన్నాడు. ‘ఆ స్ధితిలో కూడా’ ఆమె కాఫీ తెచ్చి ఇచ్చిందట, పాపం అతిథి మర్యాద కోసం.

“ఒక్కసారి నా మాట వినండి మామ్. మీరు హాస్పిటల్‌కి వెళ్ళండి. ఆయన ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు. మీ సంగతే నాకు వర్రీగా ఉంది (ఎందుకు బ్రో)! నేను ఇంటికి వెళ్లి నిద్రపోలేను (వై?) మీరు కూల్ అయ్యే వరకు!” అన్నాడతను.

(ఈ సన్నివేశం అంతా కృతకంగా లేదూ!)

ఆమెను చూశాడు. ఆమే చూసింది. చటుక్కున కుర్రాడు ముందుకొచ్చి ఆమెను పట్టుకున్నాడు.. “వైద్యుడు రోగిని పట్టుకున్నట్టు! పురుషుడు స్త్రీని పట్టుకున్నట్టు!” ట.

ఇద్దరికీ ఏం పరిచయం ఉందని! ఈ మొత్తం ఉదంతం చిరాగ్గా ఉంటుంది పాఠకుడికి.

తర్వాత వాక్యం మరీ ఘోరం- “ఆ తర్వాత వాళ్లు ఇంటి నుండి బయట పడటానికి మరి కొంత సమయం పట్టింది”.

మళ్లీ ఆ కుర్రాడు ముందు సీట్లో ఆమె కూర్చోగా (చనువు, దగ్గరితనం వచ్చిందిగా) కారు డ్రైవ్ చేస్తూ హాస్పిటల్ కి తెచ్చాడు. “ఆమె ప్రశాంతంగా ఉంది”. ఎందుకు రచయిత గారు!

“బై మామ్” అన్నాడు.

“మళ్ళీ నాకు కనబడకూడదు” అంది. హమ్మయ్య. “ఇప్పుడు” వెళ్ళిపోయాడు. ఆమె ప్రశాంతంగా వెళ్లి భర్త పక్కన కూర్చుంది. ఇద్దరు చక్కగా మాట్లాడుకోసాగారు.

ఏం కథ ఇది! భర్త యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నాడు. ఆమె అసహనంగా ఉంది. ‘ఎందుకో’! భర్త గురించి అయితే కాదు. కనీసం అతన్ని చూడను కూడా లేదు హాస్పిటల్‌లో. ఎవరో అపరిచిత కుర్రాడుతో ఇంటికి వచ్చింది. ఎన్ని సమస్యలు, ఎంత ఒత్తిడి ఉంటే మాత్రం చిన్నవాడైన ఆ కుర్రాడితో సెక్స్ చేస్తుందా! ఎలాంటి నైతికత గాని లాజికల్‌గా గాని లేని వ్యక్తిత్వం, ప్రవర్తన. కేవలం ఆ ఒక్క ‘చర్య’ వల్లే ఆమె ‘ప్రశాంతంగా’ మారిపోయింది అనడం దుర్మార్గం. “సమస్యల నుండి పారిపోయే వెధవలంటే అసహ్యం” అని దృఢంగా పలికిన ఆమె – కొన్ని క్షణాల తర్వాత ఎక్కడ నుంచి, దేని నుండి పారిపోవాలి అనుకుంది? పారిపోయింది? ఓడిపోయింది? ఇదో వ్యక్తిత్వం లేని సెక్స్ కోసం తపించే మరో స్త్రీ కథ.

టాక్ టైం. భర్త రియల్ ఎస్టేట్‌లో వర్క్ చేస్తూ బిజీగా ఉంటాడు. కూతురు ఎక్కడో హాస్టల్‌లో చదువులో బిజీగా ఉంటుంది. తీరుబాటు బాగా ఉన్న, ఏమీ తోచని ఆమె ఫోన్లో భారీగా రీఛార్జ్ చేసుకొని న్యూస్ పేపర్ ముందేసుకుని కనపడ్డ నెంబర్‌కి ఫోన్లు చేస్తూ ఉంటుంది. అపరిచిత వ్యక్తితో “మీతో మాట్లాడవచ్చా ఒక్క నిమిషం” అని మొదలు పెడుతుంది. “మీతో మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉంది. మీరేం చేస్తుంటారు?.. ఇప్పుడు ఏం చేస్తున్నారు?.. మీకు నా చేత్తో వండి వడ్డిస్తే ఎంత బాగుంటుంది” అంటూ సంభాషణ కొనసాగిస్తుంది. అవతలి వ్యక్తి కోపంతో ఫోన్ పెట్టేస్తే మళ్ళీ చేస్తుంది. మళ్ళీ మళ్ళీ. మర్నాడు, మర్నాడు. చివరికి అతను కోపంతో ఫోన్ విసిరికొడితే పగలిన శబ్దం వినగానే.. మళ్లీ న్యూస్ పేపర్ తీసుకొని కనపడ్డ ఏదో నెంబర్‌కి ఇంకో అపరిచితుడికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఖాళీగా, ఏమీ తోచని, ఒంటరి స్త్రీలు ఇలా చేస్తారా? ఈ కథలో చెప్పింది శారీరక వ్యభిచారం కాదు. మానసిక వ్యభిచారం. స్త్రీ అంటే ఇంత చులకనా రచయితకి!

నాలుగో కథ వహీద్. పక్కింటి అక్కలాంటి జంషీద్ అపా అంటే వహీద్‌కి ఎంతో ఇష్టం, గౌరవం, ప్రేమ.. బహుశా పేదరికం వల్ల, పనుల ఒత్తిడి వల్ల తల్లి దగ్గర దొరకని ఆప్యాయత అపా దగ్గర దొరకటం వల్ల కాబోలు! ఆమెకి పెళ్లి అయి, వెళ్లి పోతుందని తెలిసి సహజంగానే దుఃఖం వచ్చింది. ఏడ్చాడు. అన్నం మీద అలిగాడు. అమ్మ మీద అలిగాడు. సరే. అంతవరకు బాగానే ఉంది కానీ, ఈ సవివరమైన వర్ణనకి అర్థం ఏమిటి..?

“అసలు జంషీద్ అపాను ఎవరైనా సరిగ్గా చూసారా! తనే చూసాడు. బావి దగ్గర గొంతు క్కూర్చొని, గాజులు వెనక్కి జరుపుకొని, చప్టా మీద చేపలు పడేసి, ఊగి ఊగి తోముతూ ఉంటే, ఎగిరి ఎగిరి పడే అంచును తనే చూసాడు. దొడ్లోని చిక్కుడు తీగ ఇబ్బడి ముబ్బడిగా కాపుకొచ్చి నప్పుడు ‘హమీద్ రారా’ అని పిలిచి, ఎగిరి ఎగిరి కాయలు తుంచుతుంటే, ఆ పందిరి నీడతో పాటు ఆమె ఛాతి నీడను కూడా తనే చూసాడు. ఒకసారి ఇంటికెళితే.. అమ్మ బాబోయ్.. ఎవరూ లేకపోతే.. గోరింటాకు పెట్టుకుని నులక మంచం మీద నిద్రపోతుంటే ఆ ఆదమరపు రూపం తనే చూసాడు. అసలు చాలాసార్లు నీళ్లు చేది ఆఖరి బిందె పూర్తయ్యాక పావడ పైకెత్తి కాళ్ళు కడుక్కుంటుంటే ఆ పాదాల తెలుపు తను మాత్రమే చూశాడు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె స్నానం చేస్తోంది అని విని చాలా సంతోష పడ్డాడు. స్నానం చేస్తుంటే వాడికెందుకు సంతోషమో! కానీ సంతోషం వేసింది.”

రచయిత ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాలేదు.

ఐదో కథ మచ్చ. ఆమె చాలా శుభ్రంగా ఉంటుంది. ఇల్లంతా శుభ్రంగా ఉంచుతుంది. భర్తకి, పిల్లలిద్దరికీ అన్ని శ్రద్ధగా అమరుస్తుంది. పద్ధతిగా ఉంటుంది. ఉంచుతుంది. కానీ ఆ పద్ధతి అటు ఇటు అయితే తట్టుకోలేదు. గట్టిగా అరుస్తుంది.. షాపింగ్‌కి వెళ్తే ఎవరైనా మగాడు కాస్త భుజానికి తగిలితే బిగ్గరగా అరుస్తుంది. తిడుతుంది. ఎదురింటి కొడుకు కోడలు వస్తే వాళ్ళమ్మ గురించి నిర్దయగా కొట్టినట్టు మాట్లాడుతుంది. ఆమెకి శరీరం మీద నల్లగా ఏదో మచ్చ వచ్చింది. లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్లింది. తర్వాత మళ్ళీ ఇంకో మచ్చ. ఇంతలో ఎదిరింటి అబ్బాయి ఫోన్ చేశాడు, ఫ్లాట్ అమ్మేస్తున్నామని ఆమెకు ఇబ్బంది కలిగించిన తల్లిని తీసుకువెళ్లిపోతానని చెప్పాడు. క్షమాపణలు అడిగాడు. ఎందుకో ఆమె బాగా ఏడ్చింది. “ఆ కన్నీళ్లు ఆమె హృదయాన్ని కడిగేస్తున్నాయా! ఆమె దేహాన్ని క్షాళనం చేస్తున్నాయా?” తర్వాత ఆమెకు కోపం తగ్గింది. ఒంటిమీద మచ్చలు రాలేదు. మానసికంగా కుదురు, పద్ధతిలేని స్త్రీ కథ ఇది. అసలు మానసికంగా ఎందుకు అలా తయారయింది అన్న విషయం రచయిత చెప్పలేదు.

ఏకాభిప్రాయం. ఈ కథలో అతను ఒక మంచివాడు. మంచితనాన్ని ప్రదర్శించేవాడు. కనపడ్డవాళ్ళ కల్లా సహాయం చేసేవాడు. సలహాలు ఇచ్చేవాడు. మగవాళ్ళకి, ఆడవాళ్ళకి తన స్కూటర్‌పై లిఫ్ట్ ఇచ్చేవాడు. భార్యని పిల్లల్ని ప్రేమగా చూసుకునేవాడు. భక్తి గలవాడు. తల్లిదండ్రులని బాగా చూసుకునేవాడు. సమాజంలో ‘మంచివాడు’ అని అనిపించుకునేవాడు. ముఖ్యంగా స్త్రీలకు సహాయం చేసేటప్పుడు “మీ ఆయన మీతో బాగా ఉంటాడా, పనిలో వంటలో సహాయం చేస్తాడా, సినిమాలకు తీసుకువెళ్తాడా” అని ఆసక్తిగా అడిగేవాడు. ‘స్త్రీ పురుష సంబంధాలు ఒకసారో, రెండుసార్లో అయితే పర్వాలేదు. ఎక్కువ అయితే ప్రమాదం’ అని మనసా నమ్మే జాగరూకత, ఎరుక కలవాడు. ఆ సహాయ పరంపరలో ఎప్పటిలా ఒకరోజు ఓ స్త్రీకి తన స్కూటర్‌పై లిఫ్ట్ ఇస్తాడు. దారిలో చిన్న తోట ఎదురవుతుంది. చిన్న అడవి లాంటి దారి. స్కూటర్ స్లో చేశాడు. ఇంకా స్లో చేశాడు. “కాసేపు రెస్ట్ తీసుకొని పోదాం అండి” అని స్కూటర్ ఆపాడు. ఆమెకీ అతనితో ‘ఏకాభిప్రాయం’ కలిగింది.

ఆడవాళ్ళ పట్ల రచయితకి చాలా చిన్న చూపు అని అభిప్రాయం పాఠకుడికి కలగటంలో ఆశ్చర్యం లేదు. ఒకసారో, రెండుసార్లో.. తప్పులేదు అన్నది రచయిత ఏకాభిప్రాయమా! అని పాఠకుడు అనుకోవడంలో తప్పు లేదు.

ఏడవది పట్టాయ.. ఘోరమైన కథ. థాయిలాండ్‌లో మసాజ్ చేసే స్త్రీల కథ. డబ్బు కోసం తాపత్రయం. అదే మరి వారి సంపాదన. హృదయ విదారకమైన స్థితి. కానీ ఎక్కడా ఆ స్త్రీల పట్ల సానుభూతి మనకు కలుగనట్లు.. జాగ్రత్తగా.. స్త్రీల వ్యక్తిత్వాన్ని విధ్వంసం చేస్తున్నట్లుగా సాగుతుంది కథనం. అన్ని కథల లాగే ఈ కథలో కూడా ఎవరికి, ముఖ్యంగా స్త్రీలకు పేర్లు పెట్టలేదు రచయిత. చెప్పేటప్పుడు – పంజాబీ ముండ, కాఫీ కలర్ స్కర్ట్ ది, లేస్ స్కర్ట్ పిల్ల, బండది..! ఈ సంబోధనలు, బాడీ షేమింగ్ దుర్మార్గం! థాయిలాండ్‌లో బాడీ మసాజ్ సహజమే. కానీ గత్యంతరం లేక, అక్కడ దాదాపు అందరు స్త్రీలు మసాజ్ చేస్తామని బేరాలు ఆడటం ఎంత జుగుప్సగా వర్ణించారు రచయిత! “బోడి ముండ, గుంటదాన..” లాంటి పదాలు యథేచ్చగా వాడారు. ఒకరితో బేరం ఆడి, తర్వాత తక్కువ వెలకి వచ్చిన అమ్మాయితో పోబోయేసరికి అక్కడ పెద్ద గొడవ జరిగింది. ఆడవాళ్లు తిట్లు. కొట్లాట. “ఎవరితో బేరం చేశారో దానితోనే పోవాలి”- ఇది అక్కడ నియమం.

ఇంత బీభత్సకర వర్ణన అవసరమా..

“ఎక్కడ చూసినా ఆడపిల్లలు. ప్రతి బార్ బయట అద్దాల గదులు. ప్రతి అద్దాల గదిలో సర్పాల్లాగా ఆడపిల్లలు. గుట్టలు గుట్టలుగా ఆడపిల్లలు. పోల్స్ పట్టుకొని నడుము తిప్పుతూ.. వంగుతూ లేస్తూ.. కాళ్లు చీల్చి విన్యాసాలు చూపుతూ.. ఏం వింటున్నామో అర్థం కానంత పెద్దగా మ్యూజిక్.. కొన్నిచోట పెట్టెల్లో బాతుల్లాగా అద్దాల గదుల్లో ఉత్తినే అలా నిలబడి చేతులు ఊపుతూ.. మొత్తం కనిపించే భుజాలు.. మొత్తం కనిపించే వీపు.. మొత్తం కనిపించే కాళ్లు.. మొత్తం కనిపించే పొట్ట..”

మొత్తం ఇలాంటి వర్ణనలే. ఈ వర్ణనలు చదువుతుంటే కడుపులో తిప్పేస్తుంది. వారి దయనీయ పరిస్థితిని రచయిత వర్ణించినట్టు లేదు. వారి పట్ల సానుభూతి కలిగించలేదు. అసలు ఈ కథ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో తెలియదు. ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్పినట్టుంది.

తర్వాతి కథ అపస్మారకం. ఎవరో ముక్కు మొహం తెలియని పదహారేళ్ల అమ్మాయి. లిఫ్టులోకి వచ్చింది. తర్వాత అతని కారులోకి వచ్చింది. ఫోన్ చూసుకుంటుంది. “ఫోన్ నెంబర్ కావాలా” అని అడిగింది. “పైసల కోసం వచ్చినా” అంది. అబ్బే, మరీ అంత బరితెగించి తిరగలేదట. “ఇనార్బిట్ మాల్‌లో తిప్పి, మూవీ చూపించి, లెగ్గిన్స్ టాప్ కొనిపిస్తే ఒకసారి, సెల్ ఫోన్ కొనిపిస్తే ఒకసారి మాత్రం బాయ్ ఫ్రెండ్స్‌తో వెళ్లిందట. అతనూ కన్వీనియంట్‌గా ఊరికి దూరంగా కారు తీసుకువెళ్లాడు. ఆపాడు. కానీ ఆ కారును అనుసరిస్తూ వచ్చిన కొందరు కుర్రాళ్ళు డోర్‌ని బాదసాగారు. “మాకూ అమ్మాయిని షేర్ చేయమ”ని డోర్ అద్దాలు బద్దలు కొట్టసాగారు. భయంతో అమ్మాయి ఏడవసాగింది. ధైర్యం చేసి, కారును వేగంగా ముందుకు దూకించి, రోడ్డు మీదకి తెచ్చాడు. వాటర్ బాటిల్ తెచ్చి అమ్మాయికి ఇచ్చాడు. ‘పోనీలే’ అనుకునే లోపునే – ఆ అమ్మాయి కారు దిగి వెళ్ళిపోగానే, కనీసం ఇంటికి సమీపంలో వదిలిపెట్టడం కానీ, పిల్ల వెళ్ళగలదో లేదో అనే ఆలోచన కానీ లేకుండా, కారును ఇంటి వైపు తిప్పాడు. ఫోన్‌లో భార్య ఇచ్చిన పదిహేడు మిస్సెడ్ కాల్స్ చూసుకుంటూ ఇంటికి చేరాడు – ‘స్మారకం’ లోకి వచ్చాడు. అపస్మారకంలో ఏమైనా చేసేస్తావా గురుడా! ( అన్ని కథల్లో లానే ఇతనికీ పేరు పెట్టలేదు)

తర్వాతి కథ ‘ఇంకోవైపు’. చిన్నప్పటి నుంచి అన్ని పనులు శుభ్రంగా చేసుకుంటూ, పెళ్లయ్యాక భర్తని అత్తమామల్ని ప్రేమగా చూసుకుంటూ, ఒక్క తప్పు చేయకుండా, మాట పడకుండా నెట్టుకొచ్చే మంచి ఇల్లాలు ఆమె. చాలా రోజులకి ఓ పిల్లాడు పుట్టాడు. కానీ వాడికి ఆటిజం. ఏళ్లు గడుస్తున్నాయి, కానీ మానసికంగా ఎదగలేదు. తండ్రి కూడా కొడుకుని ప్రేమగానే చూసుకుంటాడు. కానీ ఎంతకాలం! విసిగిపోయాడు. పిల్లాడి అల్లరి భరించలేక భార్యని తిట్టడం మొదలుపెట్టాడు. “అన్నీ పర్ఫెక్ట్‌గా చేసేదానివి. ఇది ఎందుకిలా తగలేశావ్” అన్నాడు. భరించలేక పోయింది. “తనే కాదుగా, ఇద్దరు కలిసి చేసిన పని ఇది”. తనని మాత్రమే తప్పు పడతాడు ఏమిటి? అందుకే విడాకులు తీసుకోవాలనుకొంది. పిల్లవాన్ని తీసుకొని వెళ్ళి పోవాలనుకుంది. తెలిసిన వాళ్ళు చెప్పిన లాయర్‌ని కలవాలని బయలుదేరింది.( పొద్దునే బయలుదేరవచ్చుగా) చీకటి పడింది. ఆ వీథిలో స్ట్రీట్ లైట్స్ లేవు. నలుగురు వచ్చారు. ఆమె అణువణువూ.. కణకణమూ.. గబగబా చుట్టుముట్టేసారు. దడి కట్టేశారు. చేతులు పడుతున్నాయి. ఎక్కడెక్కడో పడుతున్నాయి. తాకుతున్నారు. ఎక్కడెక్కడో తాకుతున్నారు. వత్తేసి.. నలిపేసి.. పిసికేసి.. ఒకడు ఆన్చుకున్నాడు. ఒకడు తగిలించాడు. ఒకడు ఇంకేమిటో చేశాడు. ఎంగిలి పడుతూ ఉంది. ఉమ్మి తాకుతూ ఉంది. పాము పాకుతూ ఉంది.. రెండు మూడు నిమిషాలు. కళ్ళు మూసి తెరిచేంతలో పరిగెత్తుకు వెళ్ళిపోయారు.

ముప్పై రెండేళ్ల ఆమెని గ్యాంగ్ రేప్ చేశారు. కథ ఎక్కడ ఎలా మొదలైంది? ఎక్కడ ఎలా ముగిసింది? ఈ సమాజంలో రేప్ జరగటం లేదు అనను. కానీ ఆటిజం పిల్లాడి ప్రసక్తి ఏమిటి? డైవోర్స్ తీసుకోవాలని లాయర్ దగ్గరికి బయలుదేరడం ఏమిటి? రేప్‌తో కథ ముగించటం ఏమిటి? కథ ఎలా మొదలు పెట్టినా, ‘స్త్రీ శరీరం’ దగ్గరే ముగుస్తోంది.

ఇంత వికృత, బీభత్స వర్ణన లేకపోతే ఏమైంది! ఎక్కడో రచయితలో ఏదో అశాంతి! ఏదో ధిక్కార ధ్వని! ఏదో కసి! ఎవరి మీద అక్కసు! అనిపిస్తుంది ఈ కథలు చదువుతుంటే.

చివరిదైనా – ముఖ్యమైనది ‘బియాండ్ కాఫీ’. ఆమెకి ఏదో అస్థిమితం. భర్తకు ఏదో ఆందోళన లేదా ఏదో ప్లాన్. ఆమె సాక్షిలో పని చేసే ఈ రచయిత (ఖదీర్ బాబు)ను కలుసుకొని తన గోడంతా వెళ్ళబోసుకుంటుంది.

ఎక్కడా! బియాండ్ కాఫీ అనే ప్లేస్. “అక్కడకి ఉత్త కాఫీ కోసం జనాలు రారు. అక్కడ మాట్లాడుకోవచ్చు. బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలు ఉంటే ఇక్కడే లాగించేయవచ్చు. ఉద్యోగం ఊడిపోయిందనుకోండి, మళ్ళీ దొరికేవరకూ ఇక్కడే ఒక నాలుగైదు వందలు ఖర్చు పెట్టుకొంటే రోజంతా గ్రీన్ టీ తాగుతూ ఉండిపోవచ్చు. సుఖంగా లేదూ! అందుకే ఇది బియాండ్ కాఫీ” అంటాడు రచయిత.

బియాండ్ కాఫీ. అక్కడ కూర్చుని ఎన్నో కాఫీలు, గ్రీన్ టీలు తాగుతూ, ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. మొగుడు గురించి, మొగుడు పెట్టే టార్చర్ గురించి ముక్కు మొహం తెలియని మగాడితో ఎంతైనా వెళ్లబోసుకోవచ్చు. పక్కటేబుల్స్ వాళ్ళు వినేలా బిగ్గరగా అరవొచ్చు.

ఆమెలో ఏదో తేడా ఉంది అనుకొంటాడతను. కానీ వెళ్ళిపోడు. శాంతమూర్తి మరి. వింటూ చూస్తూ ఉంటాడు. (ఆమె లాగే పాఠకులూ పిచ్చోళ్ళా!) ఆమె ఒళ్ళో పెట్టుకున్న బ్యాగ్ హ్యాండిల్స్‌ని పదేపదే కదుపుతోంది. లేదా టేబుల్ అంచుని తడుముతోంది. తుడుస్తోంది. తన లోపల రగులుతున్న అలజడిని, అక్రోశాన్నంతా ఈ రచయిత అనే వ్యక్తికి ఎందుకు చెప్పాలనుకుంటుందో తెలియదు. మొత్తానికి పిచ్చిది అనిపిస్తుంది. ప్రతి కథలో శారీరక సుఖం కోసం వెంపర్లాడే స్త్రీని వర్ణించిన రచయిత ఈ కథలో మానసికంగా తడబడే, తన్నుకులాడే, అన్‌రెస్ట్‌గా ఉన్న స్త్రీని వర్ణించాడు. తన భర్త ఎవరో అమ్మాయిని నగ్నంగా ఫోన్లో తీసాడని అతనికి చూపిస్తుంది. టెన్త్ క్లాస్ చదివే కొడుకు అనుకోకుండా చూసాడని బెంగ పడుతుంది. ముక్కు మొహం తెలియని వ్యక్తితో చనువుగా ఇవన్నీ చెప్తుంది. అన్నీ మాట్లాడుతుంది. మర్నాడు మళ్లీ అక్కడే కలుస్తుంది. ఈలోపు ఆమె భర్త ఫోన్ చేసి అతనితో చెప్తాడు ఆమెను కలవద్దని. కానీ ఆ మర్నాడూ కలుస్తారు అక్కడే. “మొబైల్స్‌లో కెమెరాలు బ్యాన్ చేయాలని మూమెంట్ మీ సాక్షి పేపర్లో తీసుకు రాగలరా” అని అడుగుతుంది. సంతకం పెట్టిన చెక్ ఇస్తుంది. “షి ఈజ్ మ్యాడ్” అనుకుంటూనే అతను చెక్ ఎందుకు తీ‌సుకొన్నట్టు! అతనికి వ్యక్తిత్వం, నిజాయితీ లేదా? పిచ్చిదేలే అనా!

ఖదీర్ భాయ్ ఏం చెప్పాలనుకున్నారు ఈ కథల్లో! మంచి కథకుడిగా పేరు తెచ్చుకున్న ఈ రచయిత స్త్రీల పట్ల కక్షతో రాసిన కథలు అన్నట్లు ఉన్నాయి. స్త్రీల పట్ల చిన్నచూపు, తూష్ణీ భావం ఉన్నట్టు, సెక్స్ కోసం ఉచ్చం నీచం పట్టించుకోరు స్త్రీలు – అన్న నిశ్చిత భావాలు వెలిబుచ్చినట్లు అనిపిస్తోంది.

గుణ దోష విచారణ సద్విమర్శ. సారీ. ఈ కథల్లో గుణం ఏమీ కనపడలేదు. మరి కనబడిందే చెప్పాలి కదా! స్త్రీలలోని అరుదుగా ఉండే దోషాన్ని రచయిత పట్టుకొని, పనికొట్టుకొని రాసినట్టు అనిపిస్తోంది. పాఠకులు మరికొందరు కూడా ఇలానే ఆశ్చర్యపోయినట్టు విన్నాను. నిరసనగా పెదవి విరిచినట్లు విన్నాను. ఒక ప్రాంతంలోని మనుషుల మనస్తత్వాలని, హిందూ ముస్లింల కుటుంబాలు కలిసిమెలిసి బ్రతికిన మానవ సంబంధాలను కథలుగా, సహజంగా, జీవితాలని చిత్రించిన ఖదీర్ బాబు పనిగట్టుకుని స్త్రీలోని శారీరక మానసిక బలహీనతల్ని భయంకరంగా, విధ్వంసంగా వెళ్ళగక్కినట్టు అనిపిస్తుంది.

రివ్యూ అంటే కథని పూర్తిగా చెప్పటం కాదు కథలోని విశేషాన్ని చెప్పి, పాఠకుడు చదివేలా ఆసక్తి కలిగేలా వదిలేయాలి. కానీ నేను ఈ కథలని పూర్తిగా ఎందుకు వివరించానంటే – కథ ఎత్తుగడ, నడక, ముగింపు అంతటా స్త్రీలను కించపరుస్తూ రాయటం ఎలా జరిగిందో (ఆవేదనతో) చెప్పటం కొరకే. సామాన్య పాఠకుడికి రచయితలతో వ్యక్తిగత పరిచయం వుండదు. వారు రచనలోనే రచయితను దర్శిస్తారు. ఈ రచనలో పాఠకులకు ఎలాంటి ఖదీర్ బాబు కనబడతాడో ఊహిస్తేనే భయం కలుగుతుంది. ఈ కథలు చదివిన ఒక సామాన్య మహిళ రచయిత  ముందుకు రావాలంటేనే అసహ్యభావనతో ముడుచుకుపోతుంది.

కాఫీ ఎంత ఇష్టమైనా – మరీ ..ఎక్కువగా.. బాగా.. మిక్కుటంగా.. విపరీతంగా.. చేదెక్కిన కాఫీని ఎవరు మాత్రం ఇష్టపడతారు! బియాండ్ కాఫీ మరింత చేదు.. కక్కుకునేంత!

Exit mobile version