Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భాషోద్ధారకుడు గిడుగు

[ఆగష్టు 29 శ్రీ గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘భాషోద్ధారకుడు గిడుగు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

గ్రాంథికమైన భాషను
ప్రజలకు చేరువ చేయడానికి
సంప్రదాయవాదులకు
ఎదురు నిలిచి భాషోద్ధరణకు
నడుము కట్టాడు గిడుగు
వ్యావహారిక భాషా ఉద్యమానికి
శ్రీకారం చుట్టిన పిడుగు
మాతృభాషలో విద్యావ్యాప్తి వలన
జ్ఞానం అభివృద్ధి చెందునన్న గురుడు
తెలుగు భాష పట్టాభిషేకానికి
జనం మాట్లాడే భాషకు
పట్టాడు గొడుగు
సవర భాషాభివృద్ధికి చేశాడు వడుగు
వ్యావహారిక భాషా ద్వేషులతో
ఆడాడు చెడుగుడు
తెలుగు భాషావికాసానికి
ప్రథమ శాస్త్రవేత్త గిడుగు
భాషా సంస్కరణలను గావించి
ఆధునికయుగాన అయ్యాడు ఘనుడు
అందుకే అందరూ వెయ్యాలి
ఆయన అడుగులో అడుగు
తెలుగు భాష మనినంత కాలం
భాషాభిమానుల గుండెల్లో
నిలిచి ఉండే భాషోద్ధారకుడు
భావితరాల బుడుగులకు
మాతృభాషా వికాసాన్ని కలిగించడమే
తెలుగు భాషాభిమానులు
గిడుగు వారికి అందించే
నిజమైన ఘననివాళి
గిడుగు బాటఅందరికీ వెలుగు బాట
ఆనందాల ఊట మన తెలుగు
గిడుగువారి పుట్టినరోజు
తెలుగు భాషకు జన్మదిన వేడుక

Exit mobile version