[మణి గారు రచించిన ‘భావనవా? భవానీవా?’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
మోహాల దారుల్లో, ఎండమావులతో
విసిగి వేసారినప్పుడు,
అలసి సొలసినప్పుడు,
నీ కోసం గట్టిగా ఏడుస్తాను!
నువ్వు తప్ప నాకు ఇంకో ప్రపంచం లేదని,
నువ్వు తప్ప ఏదీ నిజం కాదని,
అంతా మిథ్య అని తెలుసుకున్నా అని,
నిన్ను వదలి వెళ్ళనని,
ఎన్ని ఒట్లు పెడతాను?!
నవ్వి వూరుకుంటావు!
ప్రేమగా తల నిమిరి, దగ్గరకి తీసుకుంటావు!
నును వెచ్చని నీ ఒడిలో,
కాలం గడిచిందీ తెలియదు!!
ఎక్కడినుంచో కోకిల మృదు మనోహర రాగాలు
పుష్పాల సుగంధాలతో చిరుగాలుల సండడిలు
ఆసక్తిగా తల ఎత్తి చూసా!
చుట్టూ అందంగా సడి చేస్తూ రుతువుల సందడి!
మమతల రాగాలతో మెరుపులు దిద్దుకుని మోహాలు!!
రమ్మని మురిపిస్తూ, చేతులు చాస్తూంటే,
ఆ చేతులు అందుకోబోతూ,
సంశయంతో నీకేసి చూస్తాను!
మౌనంగా నవ్వుతావు!
వేసిన ఒట్లు గుర్తుకు రావు.
ఎండమావులా అని సంశయం రాదు!
మోహాల దారుల్లో, ఎండమావుల వెనక
కొత్త రాగాలు గుండెలో నింపుకుని,
నేను ఆశల వెనక, మళ్ళీ పరుగులు పెడతాను!
నువ్వున్నావన్న ధైర్యమేమో?
నీ కరుణ పై నమ్మకమేమో?
ఎవరివి నువ్వు? నాలో వున్నావా?
నాతో వున్నావా?
నువ్వు కూడా మిథ్యేనా?..
ప్రశ్నకు అందని సమాధానానివా?
ప్రశ్న లేని సమాధానానివా?
నా ఈ మిథ్యా ప్రపంచానికి నువ్వే మహారాజ్ఞివా?
మిథ్యగా వ్యాపించేది నువ్వే, ముక్తి చేసేది నువ్వేనా?
ఎప్పటికప్పుడు నాకు ఊపిరి పోస్తూ,
నన్ను ఉత్తేజపరుస్తూ నడిపించే, శక్తివి నువ్వేనా?
భావనవి నువ్వే, భవానీవి, నువ్వేనా??
నువ్వు, భావనవా? భవానీవా??
నా పేరు సూర్య మణి భూషణ్. స్వంత వూరు అమలాపురం. నేను స్టేట్ బేంక్ ఆఫ్ ఇండియాలో ఛీఫ్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం; కవితలు కథలు రాయడం నాకు అలవాటు. కానీ, వృత్తి రీత్యా, బిజీగా వుండడంతో.. నా రచనా వ్యాసంగం కొనసాగించడానికి సమయం దొరికేది కాదు.
రిటైర్ అయ్యాక, తీరిక దొరకడంతో, ఏదో ఒకటి రాస్తూ, ఇప్పుడు, నన్ను నేను పేంపర్ చేసుకుంటున్నాను.
ఈ మధ్య, వెబ్ మేగజైన్స్ వచ్చాక కథలు, కవితలు, మేగజైన్స్కి పంపడం సులభమయింది. నా కథలు, కవితలు వెలుగు చూడగలగడానికి అది ఒక కారణం. సంచిక టీమ్ కొత్త రచయితలని ప్రోత్సహించే విధంగా వుండడం వల్ల, నా కవితలు, కథలు సంచికకి పంపుతూ, సంచికకి దగ్గర అయ్యాను.
ఇంకా, గోతెలుగులో కూడా, కొన్ని కథలు చోటు చేసుకున్నాయి. ఆ విధంగా, నేనూ రచయితల జాబితాలో చేరాను.
