Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 11

“భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 11” వ్యాసంలో గూటిబయలు గ్రామం లోని ‘తిమ్మమ్మ మర్రిమాను’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి.

తిమ్మమ్మ మర్రిమాను

వైనా గొప్ప వస్తువులుగానీ, గొప్ప మనుషులుగానీ మన ప్రాంతం వారయితే మనకెంత గర్వకారణంగా వుంటుందో కదా. ఫలానావారు మా ఊరు వారేనండీ, లేక పోతే ఫలానా వింత మా ప్రాంతంలోదేనండీ అని అదేదో మన స్వంతమయినట్లు అందరకూ చెప్పుకుంటాము కదా. అలాగే ప్రపంచంలోకే అతి పెద్ద మర్రిమానుగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన తిమ్మమ్మ మర్రిమాను అనంతపురం జిల్లా కదిరికి 25 కి.మీ. ల దూరంలో, గూటిబయలు గ్రామంలో వున్నది. 8.50 ఎకరాల్లో విస్తరించిన ఈ వృక్షం కదిరి- రాయచోటి జాతీయ రహదారి మార్గమధ్యంలో రెక్కమాను నుంచి 10 కిమీల దూరంలో ఉంది.

ఈ మర్రిమాను 1989లో ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిమానుగా గిన్నిస్‌ రికార్డు సాధించింది. తాజా సర్వేలో 6,869 ఊడలతో ఎనిమిదిన్నర ఎకరాల్లో విస్తరించి ఉందని తేలింది. మర్రిమానుకు దాదాపు 700 సంవత్సరాల వయసు వుంటుంది. మర్రిమాను కిందికి వెళ్తే.. ఏదో అరణ్యంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అడుగడుగునా ఓ ఊడ కనిపిస్తుంది. దేనికదే ఇదే చెట్టు మొదలేమో అనిపిస్తుంది. ఆకాశమంత హరిత పందిరి, భూమంతా ఆక్రమించిన ఊడలని చూసిన ఆశ్చర్యంలో గంటలు నిముషాల్లా గడిచిపోతాయి.

 

రాయలసీమలో అనంతపురం జిల్లాలో నీటి కొరత ఉన్నప్పటికీ తిమ్మమ్మ మర్రిమాను ఆకాశం కనిపించనంత గుబురుగా పెరిగి, పచ్చని ఆకులతో పక్షుల కిలకిలరావాలతో చూపరులను చకితుల్ని చేస్తుంది.

తిమ్మమ్మ అనే పతివ్రత సహగమనం చేసిన ప్రదేశంనుంచి ఉద్భవించిన ఈ మానును ఆ దేవతగానే భావించి కొలుస్తారు భక్తులు.

ఆ కధేమిటంటే….

పూర్వం బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతుల కుమార్తె తిమ్మమాంబను గూటిబయలుకు చెందిన బాలవీరయ్యతో వివాహం జరిపించారు. బాల వీరయ్య గంగరాజు ఆస్థానంలో గూటిబయలు సంస్థానానికి ప్రతినిధిగా ఉండేవాడు. అంత పురాతన కాలంలోనే ఆమె భర్తకు చేదోడు వాదోడుగా తన సంస్థాన కార్యక్రమాలను చక్కగా నిర్వహించేది. సామాజిక సంక్షేమానికి కృషిచేసేది. సంస్ధానంలోని ప్రజలనందరినీ కన్నబిడ్డల్లా చూసింది. అయితే కొంతకాలానికి కుష్ఠువ్యాధిగ్రస్తుడైన బాల వీరయ్యని గంగరాజు వెలివేస్తాడు. అప్పుడు వూరిబయట ఉన్న తమ పశువుల పాకనే కుటీరంగా చేసుకుని భర్తకు సేవ చేస్తూ జీవిస్తుంది తిమ్మమ్మ. తన పాతివ్రత్య మహిమతో తమకు ద్రోహం చేసిన గంగరాజును శపిస్తుంది. ఫలితంగా గంగరాజు వాళ్ళు ఆ కోటను వదిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతారు.

కొంతకాలం అనంతరం వీరయ్య మరణించాడు. భర్త మరణంతో తిమ్మమాంబ సతీ సహగమనానికి సిద్ధమైంది. చితిలోకి దూకేందుకు ఎత్తుకోసం నాలుగు ఎండిన మర్రి గుంజలను (కట్టెలు) నాటారు. ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ చిగురించి మహా వటవృక్షంగా ఎదిగుతుందని తిమ్మమ్మ సహగమనానికి ముందే చెప్పిందట..

తిమ్మమాంబ పాతివ్రత్య మహిమవల్లనే ఎండిన మోడు చిగురించి అంత పెద్ద వృక్షమైందని స్ధానికులు విశ్వసిస్తారు. తిమ్మమ్మ మర్రిమానుగా ప్రాచుర్యం పొందిన ఈ చెట్టును ఆమెకు ప్రతిరూపంగా చెబుతారు. వీరనాయకునితోపాటు సహగమనం చేసిన తిమ్మమ్మకు స్థానికులు భక్తిభావంతో అక్కడే ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి తవ్వకాలు జరిపేటప్పుడు లభించిన తిమ్మమ్మ అస్తికలు, చితా భస్మము మీద ఆలయం నిర్మించి పైన శివలింగాన్ని ప్రతిష్టించారు. అక్కడ వున్న శిలా ఫలకం మీద “తిమ్మమ్మ 1394లో శెట్టి బలిజ శెన్నాక్క వేంకటప్ప, మంగమ్మలకు జన్మించింది. 1434 లో సతీ సహగమనం చేసింది” అని చెక్కబడింది.

పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజ చెయ్యడం వలన పిల్లలు కలుగుతారు అని భావిస్తారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. అప్పుడీ అమ్మవారిని సేవించుకోవటానికి వేలకొద్దీ భక్తులు వస్తారు.

 

తిమ్మమ్మ మర్రిమాను వృక్షము పైన ఏ పక్షీ మల విసర్జన చెయ్యదని చెపుతారు. అంతే కాకుండా సాయంత్రము ఆరు గంటలకల్లా పక్షులేవీ ఈ చెట్టు పై ఉండవుట.

ఆ వృక్షాన్ని అక్కడ ఎంత భక్తి భావంతో చూస్తారంటే, మాకు తెలియక కిందకి వంగిన ఒక కాండం మీద ఎక్కి కూర్చున్నాం. వెంటనే అక్కడవున్నవారెవరో చెప్పారు ఆ చెట్టు అమ్మవారి రూపం అని అలా ఎక్కకూడదని.

తిరిగి వెళ్తుంటే మా ఆటో అతను ఇంకో విశేషం చెప్పాడు. ఆ చెట్టునుంచి ఒక పుల్లగానీ, ఆకుగానీ ఎవరూ బయటకి తీసుకెళ్ళరట. తెలియక తీసుకెళ్ళినా వెంటనే తిరిగి వెళ్ళి అవి అక్కడ పెట్టేసి వచ్చేదాకా ఏదో ఒక చికాకు ఎదురవుతుందట.

మర్రిమానును 1992లో అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. మర్రిమాను అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రూ.34 లక్షలతో అతిథి భవనం, అటవీశాఖచే వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు, రూ.12 లక్షలతో శివఘాట్ నిర్మించారు.

 

ఇటీవల కర్ణాటకకు చెందిన కైవారం ట్రస్టు ఆధ్వర్యంలో పది లక్షలరూపాయలతో అభివృద్ధి పనులు చేశారు. తిరుమల తిరుపతి దేవస్ధానం వారు వెంకటేశ్వర ఆలయం నిర్మాణం చేపట్టారు.

 

అక్కడివారందరూ అంత భక్తి భావంతో చూసుకునే ఒక అద్భుతమైన వృక్షరాజాన్ని చూశామన్న తృప్తితో తిరిగి బయల్దేరాము.

Exit mobile version