ఖాద్రి కొండ
కదిరిలో శ్రీ నరసింహస్వామి ఆలయానికి ఎంత ప్రాముఖ్యం వుందో, అంత ప్రాముఖ్యం కదిరికి 2 కి.మీ.ల దూరంలో వున్న ఖాద్రి కొండకి వున్నది. ఇక్కడ కూడా శ్రీ నరసింహస్వామికి చిన్న ఆలయం వున్నది. స్వామి తన పాదం ఈ కొండపై మోపారని భక్తుల విశ్వాసం. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత స్వామిని బ్రహ్మాదులంతా సౌమ్యమూర్తిగా దర్శనమివ్వవలసినదిగా ప్రార్ధించగా, స్వామి అంగీకరించి, ముందుకు వెళ్ళి ఒక కొండ మీద తన పాదం మోపి, దగ్గరలోనే అర్చామూర్తిగా వెలిశారనీ భక్తుల నమ్మకం.
కొండమీద వున్న పాదం స్వామిదనీ, కింద పట్టణంలో అర్చామూర్తి అనీ భక్తులు విశ్వసిస్తారు. సంస్కృతంలో ఖ అంటే విష్ణుపాదం అనే అర్ధం, అద్రి అంటే కొండ అనే అర్ధం. విష్ణు పాదం వుండటం వలన ఈ కొండ ఖ + అద్రి, ఖాద్రి అయింది. వాడుక భాషలో పట్టణం పేరు నెమ్మది నెమ్మదిగా ఖాద్రినుంచి కదిరి అయినా, కొండని మాత్రం ఇప్పటికీ అక్కడివారు ఖాద్రి కొండ అనే అంటారు.
ఈ ప్రాంతంలో పూర్వం వేదవ్యాసుడు వేద ప్రబోధం చేసినందుకు ఈ ప్రాంతానికి వేదారణ్యం అనే పేరు వచ్చింది. ఇక్కడ ఖదిర (చండ్ర) వృక్షాలు అధికంగా వుండటంవలన కూడా ఈ ప్రాంతానికి ఖద్రి అనే పేరు వచ్చిందంటారు.
ఉత్సవాలు
ఈ కొండమీద స్వామి పాదం, సప్త ఋషులు తపస్సు చేసిన ప్రదేశం వగైరాలున్నాయి. ఉత్సవం సమయంలో స్వామి ఉత్సవ విగ్రహాలను ఇక్కడికి తీసుకు వచ్చి పూజలు జరిపి తిరిగి ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు.
అక్కడినుంచి బసకి వచ్చి (గుళ్ళోనే కదా) కొంచెం సేపు గుళ్ళోనే తిరిగి ఆలయం తెరిచిన తర్వాత దర్శనానికి వెళ్ళాము.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.