అమరావతి… ప్రస్తుతం శరవేగంతో రూపొందుతున్న ఆంధ్రుల రాజధాని. ఇది రాజధాని కావటానికన్నా ముందునుంచే పంచారామాలలో ప్రసిధ్ధి చెందిన అమరారామంగా దాదాపు అందరికీ తెలుసు. దీనిని ఎన్ని సార్లు దర్శించామో లెక్కలేదు. మీలో చాలామందే చూసి వుంటారు. అయితే ఈ అమరావతికి అనేక వేల ఏళ్ళ చరిత్ర వున్నది. భావి తరాల కోసం ఒక్కసారి దానిని కూడా పునశ్చరణ చేసుకుందాము. నేడు అమరావతి, ధరణికోట అనే పేర్లతో పిలవబడుతున్న ప్రాంతాలే ఆనాటి ధాన్యకటకము. ఈ ప్రాంతము నదీతీరమవటంతోనూ, సారవంతమైన భూమి వున్నందునా, ఇక్కడ ప్రజలు ఎక్కువగా నివసించేవాళ్ళు. మొదట ఇక్కడ నాగులు అనే అతి ప్రాచీన జాతివాళ్ళు నివసించేవారు. తర్వాత యక్షులు. వీరి కాలంలోనే ఇక్కడ శైవ మతాభివృధ్ధి చెందింది. అంతేకాదు, బౌధ్ధ, జైన మతాలు కూడా ఇక్కడ ప్రాచుర్యాన్ని పొందాయి. అశోక చక్రవర్తి బౌధ్ధమత ప్రచారానికి మహాదేవస్ధవీరుడు అనే ఆయనను ఈ ప్రాంతానికి పంపించాడు. అతడు ధాన్యకటకమును కేంద్రముగా చేసుకుని తన ప్రచారాన్ని సాగించాడు. శాతవాహనుల కాలంలో ఇప్పడున్న స్తూప ప్రాంతములో అతి పెద్ద స్తూపము రమ్యమైన శిల్పాలతో అలరారింది. దీని నిర్మాణం నాగరాజులనుండి నాగార్జుని కాలం వరకు మొత్తం నాలుగు దశలలో పూర్తయింది.
అమరావతి విద్యా విషయంలో కూడా చాలా ప్రసిధ్ధికెక్కింది. ఆచార్య నాగార్జునుడు స్ధాపించిన విశ్వ విద్యాలయంలో చైనా, జపాను, టిబెట్టు, సింహళ దేశాలనుంచి వచ్చిన విద్యార్థులు విద్యని అభ్యసించేవాళ్ళు. ఇలాంటి విద్యాపీఠాలు ఇంకా వున్నందువల్ల విద్యనభ్యసించేవారి సంఖ్య వేలలో వుండేది. వాటి నిర్వహణ, విద్యార్ధుల వసతి, భోజనాలన్నీ రాజులే ఏర్పాటు చేయించారు. తర్వాత ధాన్యకటకం నుంచి శ్రీ కొండకి విద్యాపీఠాన్ని మార్చి ఆ కొండకు నాగార్జున కొండ అని, ఆ విద్యా పీఠానికి నాగార్జున విద్యాపీఠమని పేరు పెట్టారు.
తర్వాత కాలంలో ఇక్ష్వాకులు తెలుగు నేలను పరిపాలించారు. కానీ వారు శ్రీ కొండను (నేటి నాగార్జున కొండ) రాజధానిగా చేసుకున్నారు. దానితో ధాన్యకటకము ప్రాబల్యము తగ్గింది. శంకరాచార్యుల వారి కార్య దీక్షతో వైదిక మతం మళ్ళీ బలపడింది. క్రీ.శ. 5వ శతాబ్దములో చైనా యాత్రికుడు హుయాన్ చాంగ్ కూడా ధాన్యకటకము గురించి వ్రాశాడు. క్రీ.శ. 1526లో హంద్రికల పెదప్పంగారు ఆలయాన్ని మూడోసారి పునరుధ్ధరించారు. తురుష్కుల దాడులలో ధాన్యకటకము అతలాకుతలమయింది. స్తూపము నేలమట్టమయింది. కోట పాడుపడింది. అయినా అమరేశ్వరుడు మాత్రం ఆంధ్రరాజులకు ఆరాధ్యదైవంగానే వున్నాడు.
శ్రీకృష్ణదేవరాయలు కూడా అమరావతిని సందర్శించి అనేక కానుకలు ఇచ్చారు. ఆయన ఇక్కడ బంగారంతో తులాభారం తూగి ఆ బంగారాన్ని పేదలకి పంచారుట. ఆ మంటపం ఇప్పటికీవున్నది.
పురాణ కథ:
పంచారామాలుగా ప్రసిధ్ధి చెందిన శైవ క్షేత్రాలలో ఒకటి ఈ అమరారామం, అదే నేటి అమరావతి. పూర్వం తారకుడు అనే రాక్షసుడు మహా విష్ణువు మూలంగా తమ జాతివారంతా నశించిపోతున్నారని, విష్ణువుని చంపి తమ జాతిని రక్షించాలనే కోరికతో శివుడి కోసం తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివుడిని తనకు చావులేకుండా వరమివ్వమని కోరాడు. శంకరుడు సరేనని దేవ దానవులు అమృతం కోసం మథనం చేసినప్పుడు లభించిన అమృత లింగాన్ని తారకుడికిచ్చి, ఈ అమృత లింగం యథాతథంగా వున్నంత మటుకు నీ ప్రాణానికి ఏ భయమూ లేదు అని వరమిచ్చాడు. తారకుడు ఆ లింగాన్ని గొలుసుతో తన మెడలో ధరించాడు.
శివుడి నుంచి తనకు చావులేకుండా వరమేకాకుండా అమృత లింగాన్ని కూడా పొందిన గర్వంతో తారకుడు తన ధ్యేయం నెరవేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇంద్రలోకంమీద దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించాడు. దేవతలంతా మహా విష్ణువు దగ్గరకి వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారుట. విష్ణువు తారకుడు శివ వరము పొందినవాడు, నేనేమీ చేయలేను, ఆ శంకరుణ్ణే ఉపాయమడుగుదామనగా అందరూ మహా శివుడి దగ్గరకెళ్ళి తారకుని దుష్కృత్యాల గురించి విన్నవించుకున్నారు. శివుడు ప్రసన్నుడయ్యాడు. తారకుడికి తానే వరమిచ్చినా, లోకోధ్ధరణకోసం దుష్ట సంహరణ, శిష్ట సంరక్షణ చేయాలి గనుక దేవతలకు ఒక ఉపాయం చెప్పాడు. తన కుమారుడైన కుమారస్వామి ఈ కార్యానికి తగినవాడని, అతనిని దేవ సైన్యానికి సర్వ సేనానిని చేసి వానిని వెంటపెట్టుకుని తారకుని పై యుధ్ధానికి వెళ్ళండి మీకు జయం కలుగుతుందని.
శివుని ఆదేశాన్ని దేనతలు పాటించారు. కుమారస్వామి శరపరంపరల ధాటికి రాక్షస సైన్యం చెల్లాచెదరయ్యింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దాన్తో ఉద్రిక్తుడయిన తారకుడు స్వయంగా కుమార స్వామితో యుధ్ధానికి దిగాడు. ఆ యుధ్ధములో తారకునిదే పై చెయ్యి అయింది. దానితో కుమారస్వామి ధాన్య కటకము చేరుకుని అక్కడ కొంతకాలం వున్నాడు. ఈ విషయాన్ని దేవతలు శివునికి తెలియజేశారు. ఇంకొకసారి కుమార స్వామి తారకుని మీదకు దండెత్తి మహా బలోపేతమైన శక్తిని వాని మీద ప్రయోగించాడు. అది కూడా వానినేమీ చేయలేక పోవటంతో బాధతో తిరిగి ధాన్యకటకం చేరాడు. ఈ వార్త తెలిసిన శివుడికి తానిచ్చిన ఆత్మలింగం సంగతి గుర్తువచ్చి ఆ విషయం కుమారస్వామికి తెలిపి ఆత్మలింగాన్ని గురిచూసి ఛేదించమనండి తప్పక విజయం లభిస్తుందని తెలిపాడు.
తర్వాత జరిగిన యుధ్ధంలో కుమారస్వామి తారకుని మెడలోనున్న ఆత్మ లింగాన్ని ఛేదించగా అది ఐదు ముక్కలయి ఐదు ప్రాంతాల్లో పడ్డది. వెంటనే తారకుడు ప్రాణాలొదిలాడు. అందులో పెద్దముక్క అమరారామంలో పడ్డది. ఆత్మ లింగం అమృత లింగం కనుక అవి పెరుగ సాగాయి. పరమేశ్వరుని ఆదేశం ప్రకారం దేవ గురువు బృహస్పతి సలహా మీద వాటినన్నిటినీ ఆశ్వయుజ శుధ్ధ దశమి రోజున వివిధ దేవతలచే ఒకే ముహూర్తములో ప్రతిష్ఠ చేయించి వాటి పెరుగుదలని అరికట్టారు. అవే పంచారామాలు. ఈ ఆరామాలు ప్రతిష్ట చేసిన వారి పేరుతో ప్రసిధ్ధికెక్కాయి. ఇక్కడ శివ లింగాన్ని ఇంద్రుడు ప్రతిష్టించాడు కనుక ఇది అమరారామం అయింది.
ఇంక ఆలయం గురించి తెలుసుకుందామా?
ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజ స్తంభాలు వున్నాయి. ఇక్కడ ప్రణవేశ్వర, అగస్తేశ్వర, కోసలేశ్వర మొదలగు శివ లింగాలేకాక ఇంకా అనేక దేవతా మూర్తులున్నాయి. రెండవ ప్రాకారంలో వున్న కాలభైరవుడు ఈ క్షేత్ర పాలకుడు. మూడవ ప్రాకారంలో నైరుతిలో శ్రీశైల మల్లికార్జునుడు, వాయువ్య దిశలో కాశీ విశ్వేశ్వరుడు, ఈశాన్యంలో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీ కాళ హస్తీశ్వరుడు ప్రతిష్ఠింపబడ్డారు. భౌగోళికంగా ఆ పుణ్య క్షేత్రాలు అమరావతికి ఆ దిక్కుల్లోనే వుండటం గమనించదగ్గ విషయం. శివ కేశవులకు బేధము లేదని నిరూపిస్తూ వేణు గోపాల స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలో వుంది.
ఇక్కడ అమ్మవారు శ్రీ బాల చాముండేశ్వరీ దేవి. భక్తుల ఈతి బాధలనుండి విముక్తి కలిగించి మనశ్శాంతిని, సుఖసంతోషాలను ప్రసాదించే చల్లని తల్లి.
పూర్వం దేవతలు దానవుల మీద యుధ్ధానికి వెళ్ళే ముందు ఈ క్షేత్రంలో కొన్ని సంవత్సరాలు వుండి, ఈ స్వామిని అర్చించి తగిన శక్తిని పొందారు. ఈ స్వామిని అర్చించినవారిలో శౌనకాది మహా మునులు కూడా వున్నారు.
ఇంత ప్రసిధ్ధి చెందిన ఈ ఆలయం కృష్ణవేణీ నదీ తీరాన వున్నది. భక్తులు కృష్ణవేణిలో పవిత్ర స్నానాలాచరించి, అమరేశ్వరుని దర్శించి సంతుష్టి చెందుతారు.
యుగాల పర్యంతం పంచాక్షరీ మంత్రోచ్చారణతో పవిత్రమైన ఈ ప్రాంతాన్ని దర్శించినంత మాత్రానే మనలోనూ నూతన శక్తి ప్రవేశిస్తుంది. అంత ఘన చరిత్ర కలిగినది అమరావతి.
వచ్చే వారం గుంటూరు జిల్లాలోని మరో సుప్రసిధ్ధ ఆలయాన్ని దర్శిద్దాము.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.