Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గుంటూరు జిల్లా యాత్ర – 45: సొలస

గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 45” వ్యాసంలో సొలస లోని శ్రీ రంగనాయక స్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి.

త్తుల బావి దగ్గరనుంచి వచ్చిన దోవలోనే 4 కి.మీ. ప్రయాణం చేసి సొలస చేరాము. ముందు ఆ ఊరు మీద నుంచే వెళ్ళాముగానీ, అక్కడి ఆలయం గురించి తెలియక చెంఘీజ్ ఖాన్ పేట వెళ్ళాము. అక్కడ పూజారిగారు చెప్పారు. సొలసలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం కూడా పురాతనమైనదేనని. అందుకే మళ్ళీ వెళ్ళాము.

రంగనాథస్వామి ఆలయాలు మన తెలుగు రాష్ట్రాలలో తక్కువ. తమిళనాడులోని శ్రీరంగపట్టణం రంగనాథుడు స్వయంగా అవతరించిన క్షేత్రం. ఆ స్వామి తన ఉనికిని అనేక ప్రదేశాలలో ప్రకటించాడు. వాటిలో విశిష్టమైన ఆలయం ఒకటి యడ్లపాడు మండలంలోని సొలస.

ప్రాచీనమైన ఈ గ్రామం కొండవీటి రెడ్డిరాజుల కాలంలో అత్యంత వైభవంగా వుండేది. క్రీ.శ. 1616 నుంచి 1618 వరకు కొండపల్లి ప్రాంతాన్ని పాలించిన జూపల్లి రంగపతిరావు రామేశ్వరం నుంచి పనివారిని రప్పించి, రంగనగరమనే (రంగ పట్టణం) పేరుతో ఒక గ్రామాన్ని నిర్మించాడు. ఆ రంగనగరమే నేటి సొలస. రంగపతిరావు తన ఆరాధ్య దైవమైన రంగనాధుణ్ణి ఈ గ్రామంలో ప్రతిష్ఠించి, ఆలయాన్ని నిర్మించాడని శాసనాల వలన తెలుస్తోంది.

ఆలయం గురించి అనేక గాథలు ప్రచారంలో వున్నాయి. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా కీకారణ్యం. నాదెండ్ల ప్రాంతంలో వున్న కొందరు పశువుల కాపర్లు తమ పశువుల కోసం ఇక్కడ విశాలమైన చెరువును తవ్వించారు. కాలక్రమేణా ఆ చెరువు దగ్గరో పశువుల కాపర్లు ఇళ్ళు నిర్మించుకోగా అక్కడ ఒక గ్రామం తయారయింది. పశువుల కాపర్ల నాయకుడి పేరు వలసయ్య. అతని పేరు మీదే ఆ గ్రామానికి వలస అనే పేరు వచ్చిందనీ, కాలక్రమేణా అది సొలస అయిందనీ అంటారు.

రెడ్డి రాజుల అనంతరం ముష్కరులు తమ దండయాత్రలలో దేవాలయాలని, అందులోని విగ్రహాలని ధ్వంసం చెయ్యసాగారు. ఆ సమయంలో ఆ దాడులనుంచి రక్షించుకోవటానికి అనేక చోట్ల దేవతా విగ్రహాలను భూ స్ధాపితం చేశారు. అలాగే ఇక్కడ కూడా జరిగింది. తర్వాత 1885లో రావి కోటయ్య అనే రైతు తన పొలాన్ని దున్నుతుండగా ఈ విగ్రహం తిరిగి బయల్పడింది. అప్పటికే శిధిలావస్థలో వున్న ఆలయాన్ని పునర్నిర్మించినవారు అరవపల్లి కోటయ్య, రామస్వామి అనే భక్తులు. వారు ఆలయాన్ని పునరుధ్ధరించటమేగాక, స్వామి సేవల నిమిత్తం 150 ఎకరాల భూమిని కూడా కానుకగా ఇచ్చారని స్ధల పురాణంవల్ల తెలుస్తోంది. పునర్నిర్మింపబడ్డ ఈ ఆలయంలో రావి కోటయ్యగారి పొలంలో దొరికిన విగ్రహాన్ని 1885 వ సంవత్సరంలో జూన్ నెల 14వ తారీకున ప్రతిష్ఠించారు. అప్పటినుంచి నిత్య పూజలు జరుగుతున్నాయి.

రంగనాథ క్షేత్రాన్ని గురించి చెప్పుకుంటున్నాము గనుక రంగనాథుని అవతరణ గురించి వైష్ణవ సాంప్రదాయం వారు చెప్పుకునే గాథ కూడా తెలుసుకుందాము. ఒకసారి వైకుంఠంలో భూదేవి శ్రీమన్నారాయణుని చూసి భూలోకంలో స్వామి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారని అడుగుతుంది. దానికి స్వామి నిష్కామ భక్తితో, వాంఛా రహితంగా వున్నవారంటే తనకి ఎక్కువ ప్రేమ అని చెబుతాడు. అప్పుడు భూదేవి తనకి భూలోకంలో జన్మించే అవకాశం ప్రసాదించమని, పెరుమాళ్ సేవ చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటుంది. స్వామి తథాస్తు అంటాడు. భూదేవియొక్క ఆ కోరికతోనే గోదాదేవిగా అవతరిస్తుంది. స్వామి రంగనాథుడిగా అవతరించి గోదాదేవిని చేబడతాడు.

ఆలయం

ఆలయం రకరకాల రంగులతో ఆకర్షణీయంగా వున్నది. ప్రధాన ఆలయం గోపురం పై సుదర్శన చక్రం వుంది. ధ్వజ స్తంభం పంచ లోహ మిశ్రిత రేకుతో తాపడం చేసి వుంది. గర్భాలయం ద్వారం పై గజలక్ష్మీ అమ్మవారి విగ్రహం చెక్కబడి వుంది. ఆలయంలో స్తంభాలన్నీ కూడా వివిధ రంగుల హంగులతో, చెక్కిన రాతి ఆకృతులతో చూపరులను ఆకర్షిస్తూ వున్నాయి. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా జయ విజయులు కాపలా కాస్తుంటారు. గర్భాలయంలో శ్రీదేవి, భూదేవి సేవిస్తూ వుండగా శేష శయనుడైన శ్రీ రంగనాథస్వామిని దర్శించుకోవచ్చు. స్వామి సర్వాలంకార శోభితుడు. స్వామి ఆండాళ్ కోసం శ్రీరంగంలో వెలసిన స్వామి. శ్రీరంగానికి అధినేత కనుక స్వామికి రంగనాథుడనే పేరు వచ్చింది.

       

ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహాలు రెండు వున్నాయి. ఒకటి ఉపాలయంలో స్ధానక భంగిమలో నల్లరాతిది. దాని పక్కనే ఉత్సవ మూర్తి. ఇంకొకటి ఆకర్షణీయమైన రంగులతో తీర్చిదిద్దిన విగ్రహం ఆలయ గోడమీద వున్నది.

ఇక్కడ ఇంకొక విశేషమేమిటంటే క్షేత్రపాలకుడు గణపతి. సాధారణంగా వైష్ణవ క్షేత్రాలలో క్షేత్రపాలకులుగా శైవ మతానికి సంబంధించిన దేవతలు వుండరు. ఇక్కడి గణపతి భూ ఆకృతిలో గుండ్రని రూపంలో భక్తులను అనుగ్రహిస్తూ వుంటాడు. భాద్రపద మాసంలో వినాయక చవితికి ఇక్కడ 11 రోజులు ఉత్సవాలు ఘనంగా చేస్తారు.

దక్షిణాదిలో వైష్ణవ సాంప్రదాయం అనుసరించేవారికి శ్రీరంగనాథుడు ప్రామాణిక దైవం. శ్రీ రంగ క్షేత్రం ప్రామాణికంగా ఆ యా క్షేత్రాలలో అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ పరంపరలోనే ప్రతి రంగనాథ క్షేత్రాన్ని శ్రీ వైష్ణవులు శ్రీరంగంగానే భావిస్తారు.

ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు వైఖానస ఆగమం ప్రకారం జరుగుతాయి. నిత్య పూజలు, బ్రహ్మోత్సవాలతోబాటు శ్రీ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన అన్ని పర్వ దినాలు ఘనంగా జరుగుతాయి. సంక్రాంతి పండుగలో భోగి నాడు గోదా కళ్యాణం అతి వైభవంగా జరుగుతుంది. నామపారాయణ, సంకీర్తనలు వగైరాలు అత్యుత్సాహంగా జరుపుతారు భక్తులు.

శ్రీరంగనాథస్వామి దర్శనానంతరం 10-30 కి బయల్దేరి నాదెళ్ళ మీదుగా (నాదెళ్ళలో ఆలయం మూసి వుంది) 10-50 కి పెదనందిపాడు చేరాము. వచ్చే వారం ఆ వివరాలు.

Exit mobile version