Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా – 5: పిల్లల మఱ్ఱి

పిల్లల మఱ్ఱి

న్యంకొండనుంచి 8 కి.మీ.లు, మహబూబ్‌నగర్ పట్టణానికి 4 కి.మీల దూరంలో వున్నది ఈ మర్రి చెట్టు. ఇది జిల్లాకే ప్రతిష్ఠాత్మకమైన పెద్ద ఊడల మర్రి. ఈ జిల్లాలో ఈ మర్రి ఎంత బలంగా పాతుకుపోయిందంటే, మహబూబ్‌నగర్ అంటే పిల్లల మర్రి, పిల్లల మర్రి అంటే మహబూబ్‌నగర్ గుర్తొచ్చేంత. ఈ చెట్టు మొదలు ఏదో, తర్వాత వచ్చిన ఊడలు ఏవో కూడా తెలుసుకోవటానికి వీలు లేనంతగా ఊడలు వ్యాపించాయి. ఈ మహావృక్షాన్ని చూడటానికి దూర ప్రాంతాలనుంచి కూడా యాత్రీకులు వస్తుంటారు. పాఠశాలలనుంచి విద్యార్ధులను విహార యాత్రకి ఇక్కడికి తీసుకువచ్చి ఈ చెట్టు విశేషాలను తెలియజేస్తారు. సుమారు 700 సంవత్సరాలనాటి ఈ మర్రి చెట్టు పరిమాణంలో భారతదేశంలోనే మూడవది. దూరం నుంచి చూస్తే ఈ చెట్టు దట్టమైన చెట్లతో నిండిఉన్న చిన్న కొండలాగా ఉంటుంది అనేవాళ్ళు కానీ, ప్రస్తుతం అంతగా లేదు.

ఈ మహావృక్షం వైశాల్యాన్ని కొలవాలంటే అడుగులు, మీటర్లు బొత్తిగా సరిపోవు. ఇది మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించింది. ఒకే చెట్టు అన్ని ఎకరాల్లో విస్తరించటమంచే అద్భుతమే కదా. మర్రికి పిల్లలు అంకురించడంతో ఇది పిల్లల మర్రిగా మారింది. వందల సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడి ఇది మహావృక్షమైంది. ఈ చెట్టు యొక్క ప్రధాన కాండం ఎక్కడుందో చెప్పడం కష్టం. దీని పుట్టుకకు సంబంధించిన ఆధారాలు కూడా లేవు. ఇక్కడొక జంతు ప్రదర్శనశాల, మ్యూజియం, ఆక్వేరియం ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందడం వల్ల ఇక్కడ అభివృధ్ధి చురుకుగా సాగుతోంది.

పిల్లల మర్రి మ్యూజియాన్ని 1976లో అప్పటి రాష్ట్ర ముఖ్య మంత్రి జలగం వెంగళరావు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమైన అందమైన శిల్పాలను ఈ పురావస్తుశాఖ మ్యూజియంలో ఉంచారు. వివిధ పురాతన కాలాల్లో పరిణామం చెందిన శిల్ప శైలిని, అప్పటి మానవులు ఉపయోగించిన వస్తు సామాగ్రిని ఈ మ్యూజియంలో చూడవచ్చు. హిందూ, బౌద్ధ, జైన మత ధోరణులకు అద్దం పట్టే అనేక శిల్పాలున్నాయి. మధ్య రాతి యుగానికి చెందిన శిథిలమైన వస్తువులు షోకేసుల్లో భద్రపర్చారు. చాళుక్యుల కాలం నుంచి విజయనగర కాలం నాటి వరకు రూపుదిద్దుకున్న అనేక శిల్పాలున్నాయి.

ఆటస్థలం, జింకల పార్కు, మినీ జూ

విహార యాత్రకు వచ్చే వారి కోసం ఇక్కడ మినీ జూ పార్కు ఉంది. రకరకాల పక్షులు, నెమళ్ళు, కుందేళ్ళు, కోతులు మున్నగునవే కాకుండా, చేపల అక్వేరియం కూడా పర్యాటకులను ఆకట్టుకొంటున్నది. పిల్లల కోసం ఆటస్థలం ఉంది. ఇక్కడే జింకల పార్కు కూడా ఉంది. పురావస్తుశాఖ, అటవీశాఖాధికారులు పిల్లలమర్రిని 1976లో తమ శాఖల పరిధిలోకి తీసుకున్నారు.

శ్రీ రాజ రాజేశ్వరీదేవి ఆలయం

శ్రీశైలం పాజక్టు నీటిముంపు కారణంగా కృష్ణా నదీ తీరంలోని ఈర్లదిన్నె గ్రామం నీట మునగగా, 1981లో అక్కడ వున్న రాజరాజేశ్వరీ మాత ఆలయంలోని విగ్రహాన్ని పిల్లలమర్రికి తీసుకువచ్చారు. ఈర్లదిన్నెలోని ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర రాజుల శైలిలో నిర్మింపబడింది. ఇక్కడ పాలరాతితో దేవాలయాన్ని నిర్మించి 1983లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు.

రెండేళ్ళ క్రితందాకా చెట్టుకిందకి వెళ్ళి అంతా తిరిగి చూసి దాదాపు రోజంతా అక్కడే గడిపేవారు దర్శకులు. అయితే కొంతకాలం క్రితం వెళ్ళినవాళ్ళు ఇదివరకులాగా చెట్టు కిందకి వెళ్ళనివ్వటం లేదు, చుట్టూ ఫెన్సింగ్ కట్టారు.. దూరం నుంచే చూసి రావాలి అన్నారు. మరమ్మత్తుల కోసం ఆ ఏర్పాటు చేశారని కొందరన్నారు. ప్రత్యేకించి అక్కడికే వెళ్ళాలనుకున్నవాళ్ళు కనుక్కుని వెళ్ళండి.

Exit mobile version