Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భారతమాత ప్రశ్న-1

[శ్రీమతి శైలజామిత్ర రచించిన ‘భరతమాత ప్రశ్న’ అనే దీర్ఘ కవితని అందిస్తున్నాము. ఇది 1వ భాగం.]

నేనే ఈ నేల..
హిమాలయ శిఖరాలపై మంచుబిందువై మెరిసింది నేనే.
గంగమ్మ అలలలో గుండెచప్పుడై పారింది నేనే.
గోదావరి గర్భంలో గానమై పలికింది నేనే.
కృష్ణవేణి ఒడ్డున కన్నీటి చుక్కై నిలిచింది నేనే.

నా ఒడిలో
రాముడు నడిచాడు..
బుద్ధుడు కరుణను నాటాడు..
అశోకుడు ఖడ్గాన్ని వదిలి ధర్మాన్ని ఎత్తుకున్నాడు.
గాంధీ సత్యాన్ని చేతికర్రగా మార్చుకున్నాడు.
భగత్‌సింగ్ చిరునవ్వుతో ఉరితాడును ముద్దాడాడు.

అయినా..

ఈ రోజు
నా గుండెల మీద
ఎన్ని గీతలు!
ఎన్ని గోడలు!
ఎన్ని ముళ్లు!

పుట్టిన పసిబిడ్డకు
కులం తెలియదు.
కానీ పెద్దల చేతుల్లో పడగానే
పేరుకన్నా ముందుగా
కులం నేర్పిస్తారు.

ప్రార్థనకు వెళ్లే అడుగులకు
మతం తెలియదు.
కానీ దేవుడి పేరుతో
మనిషిని మనిషికి దూరం చేస్తారు.

జెండా ఎగిరేటప్పుడు
మూడు రంగులు కలిసే ఉంటాయి.
కానీ జెండా కింద నిలబడిన
మనసులు మాత్రం
మూడు వేల ముక్కలవుతాయి.

నా గర్భంలో పుట్టిన వారే..
నా ఒడినే పంచుకుంటున్నారు.
నా మట్టిని ముద్దాడిన వారే..
నా గుండెను గాయపరుస్తున్నారు.

అప్పుడు నేను అడిగాను –

“మీరు భారతదేశంలో పుట్టారా..
లేక భారతదేశమే మీలో పుట్టిందా?”

“దేశాన్ని చీల్చేది సరిహద్దు కాదు..
మనసులో మొలిచిన స్వార్థమే.”

(సశేషం)

Exit mobile version