[శ్రీమతి శైలజామిత్ర రచించిన ‘భరతమాత ప్రశ్న’ అనే దీర్ఘ కవితని అందిస్తున్నాము. ఇది 2వ భాగం.]
~
రక్తం రంగు ఒక్కటే
యుద్ధభూమిలో
ఒక సైనికుడు పడిపోయాడు..
అతని రక్తాన్ని
నేల నిశ్శబ్దంగా తాగింది.
ఆ నేల
ఒక్క క్షణం కూడా అడగలేదు..
“నీ కులం ఏమిటి?”
“నీ మతం ఏది?”
“నీ భాష ఏది?”
ఎర్రగా జారిన రక్తం
ఒకే సమాధానం చెప్పింది..
“నేను ప్రాణాన్ని..
నాకు పేర్లు లేవు.”
ఆసుపత్రి గుమ్మం ముందు
ఒక తల్లి ఏడుస్తోంది.
లోపల
రక్తం కోసం వైద్యుడు పరుగెడుతున్నాడు.
రక్తం ఇచ్చిన చేయి
ఎవరిదో ఎవరికీ తెలియదు.
బతికిన ప్రాణం మాత్రం
ఒక నిజం నేర్పింది.
మనిషిని కాపాడేది
మతం కాదు..
మనిషే.
అగ్నిప్రమాదంలో కాలిపోతున్న ఇల్లు
మతాన్ని పిలవదు.
వరదలో కొట్టుకుపోయే బిడ్డ
కులాన్ని పట్టుకోదు.
భూకంపంలో కూలిపోయిన గోడల కింద
రాజకీయ పార్టీలు కనిపించవు.
అక్కడ వినిపించేది
ఒకే అరుపు..
“రక్షించండి!”
ఆ అరుపుకు
ఒకే భాష.
ఆ కన్నీటికి
ఒకే రుచి.
ఆ గుండెకు
ఒకే చప్పుడు.
జీవించి ఉన్నప్పుడు మాత్రమే
మనిషికి
వేల పేర్లు ఎందుకు?
చనిపోయాక
ఒక శవపేటికలో
అందరూ ఒక్కటే కదా!
నేను భారతమాతను..
నా పిల్లలందరి గుండెల్లో
ఒకే రక్తాన్ని ప్రవహింపజేశాను.
మీరే దానికి
విభేదాల రంగులు పూశారు.
అద్దంలో కనిపించేది
ముఖం మాత్రమే.
గాయం తెరిస్తే
కనిపించేది
మనిషే.
“రక్తం రంగు మారలేదు..
మారింది మనసు చూసే చూపే.”
“గుండె చప్పుడు ఒక్కటే..
దాన్ని విడదీసింది మనిషి అహంకారమే.”
(సశేషం)
శైలజా మిత్ర 1966, జనవరి 15 వ తారీఖున చిన్నగొట్టిగల్లు గ్రామం, చిత్తూరు జిల్లాలో జన్మించారు. వీరు ఎం.ఏ. తెలుగు (ఉస్మానియా విశ్వవిద్యాలయం), ఆంగ్లంలో ఎం.ఏ. (వెంకటేశ్వర విశ్వవిద్యాలయం) తిరుపతిలో, జర్నలిజం (రచన జర్నలిజం కాలేజీ, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా చేసారు. నేటినిజం అనే డైలీ పత్రికలో స్టాఫ్ రిపోర్టర్ గా దాదాపు 10 సంవత్సరాలు; అల్ ఇండియా రేడియో, ఎఫ్.ఎం.లో డీఈవోగా 3 సంవత్సరాలు, వెలుగు పత్రికలో అడ్మినిస్ట్రేటర్‌గా ఐదు సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం విమల సాహితి వెబ్ పత్రిక ప్రధాన సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.
వీరి సాహితీ జీవితం 1995లో ప్రారంభమైంది. ఇప్పటివరకు 11 కవితా సంపుటాలు, 4 కథా సంపుటాలు, 4 నవలలు, 12 అనువాదాలు రచించారు. 775 పుస్తక సమీక్షలు, 29 భక్తి–సామాజిక వ్యాసాలు, 11 ఇంటర్వ్యూలు, భావతరంగిణిలో 26 సాహితీ లేఖలు ప్రచురించారు. సాహిత్య ప్రస్థానంలో దాదాపు యాభైకి పైగా అవార్డులు అందుకున్న శైలజా మిత్రగారికి ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయితగా ‘కీర్తి పురస్కారం’ ప్రదానం చేసింది. ఉత్తమ విమర్శకురాలుగా అమృతలత గారి ‘అపురూప పురస్కారం’ పొందారు. వీరు రచించిన ‘రాతిచిగుళ్ళు’ కవితాసంపుటికి ‘ఉమ్మడిశెట్టి’ మరియు ‘శ్రీశ్రీ’ ఉత్తమగ్రంథ పురస్కారాలు లభించాయి. ఆల్ ఇండియా లాంగ్వేజ్ అండ్ లిటరరీ కాన్ఫరెన్స్ వారు ప్రతిష్ఠాత్మక ‘సాహిత్యశ్రీ’ బిరుదు ప్రదానం చేశారు.
