Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భారతమాత ప్రశ్న-6

[శ్రీమతి శైలజామిత్ర రచించిన ‘భారతమాత ప్రశ్న’ అనే దీర్ఘ కవితని అందిస్తున్నాము. ఇది 6వ భాగం.]

~

స్త్రీ కన్నీటి సాక్ష్యం

నేనే..

నీ తొలి శ్వాసను
నా గుండెలో దాచుకున్న తల్లి.

నీ తొలి అడుగును
నా వేళ్లు పట్టి నడిపించిన చేయి.

నీ తొలి మాటలో
‘అమ్మ’గా వికసించిన జీవితం.

అయినా..
నా పేరును
బలహీనతగా రాశావు.

నా మౌనాన్ని
భయంగా అర్థం చేసుకున్నావు.

నన్ను
దేవతగా పూజించావు.

అదే చేతులతో
దాసిగా నిలబెట్టావు.

పండుగలలో
కన్యాపూజ చేశావు.

రోజువారీ జీవితంలో
ఆమె స్వప్నాలను
మట్టిలో కలిపేశావు.

నా నవ్వును
ఇంటి గోడల మధ్య బంధించావు.

నా చదువుకు
సంప్రదాయం అనే సంకెళ్లు వేశావు.

నా అడుగులకు
అనుమతి అనే గుమ్మం కట్టావు.

నా స్వరాన్ని
‘సహనం’ పేరుతో
నిశ్శబ్దం చేశావు.

ఒక్కసారి ఆలోచించు..

నిన్ను మోసిన గర్భమే
ఈ దేశాన్ని మోస్తోంది.

నిన్ను పాలించిన చేతులే
ఈ నాగరికతను పెంచాయి.

ప్రతి వీరుడి వెనుక
ఒక తల్లి ఉంది.

ప్రతి మహాకవి వెనుక
ఒక స్త్రీ ప్రేరణ ఉంది.

ప్రతి విప్లవం వెనుక
ఒక మహిళ నిశ్శబ్ద త్యాగం ఉంది.

నన్ను కాపాడాలని అనకు..
నా గౌరవాన్ని
కాపాడడం నేర్చుకో.

నాకు స్వేచ్ఛ
దానం చేయకు..

అది నా జన్మహక్కు.

నేను భారతమాతను..
నాకు భర్త అక్కరలేదు

ఈ భూమిపై పుట్టిన ప్రతి బిడ్డ
నా హృదయ స్పందనే.

ఆమె కన్నీటి చుక్క
భూమిపై పడిన ప్రతిసారి..

నా గుండెలో
ఒక పర్వతం కూలిపోతుంది.

నా బిడ్డ
భయపడే దేశం..

ఎప్పటికీ
మహా దేశం కాలేదు.

“స్త్రీని గౌరవించిన ఇల్లు..
దేవాలయం కాకపోయినా పవిత్రమే.”

“ఆమె కన్నీరు బలహీనత కాదు..
ఒక నాగరికతకు చివరి హెచ్చరిక.”

(సశేషం)

Exit mobile version