[శ్రీమతి శైలజామిత్ర రచించిన ‘భారతమాత ప్రశ్న’ అనే దీర్ఘ కవితని అందిస్తున్నాము. ఇది 7వ భాగం.]
~
రైతు–సైనికుడి గాథ
ఒకడు..
మట్టిని దున్నాడు.
మరొకడు..
సరిహద్దును కాపాడాడు.
ఒకడు
విత్తనాన్ని నాటాడు.
మరొకడు
ప్రాణాన్ని నాటాడు.
ఒకడు
ఆకలిని ఓడించాడు.
మరొకడు
శత్రువును ఓడించాడు.
ఇద్దరూ
సూర్యోదయానికే లేస్తారు.
ఇద్దరూ
రాత్రిని మరిచిపోతారు.
ఇద్దరి చేతుల్లోనూ
గాయాలే.
ఒకరి గాయానికి
నాగలి కారణం.
మరొకరి గాయానికి
తూటా కారణం.
పొలంలో
రైతు చెమట పడితే..
దేశం తింటుంది.
సరిహద్దులో
సైనికుడి రక్తం చిందితే..
దేశం నిద్రపోతుంది.
అయినా..
రైతు అప్పుతో
నిద్రపోతాడు.
సైనికుడు
ప్రాణాన్ని పణంగా పెట్టి
నవ్వుతాడు.
ఒకడు
వాన కోసం
ఆకాశం వైపు చూస్తాడు.
మరొకడు
దేశం కోసం
సరిహద్దు వైపు చూస్తాడు.
ఇద్దరి ప్రార్థన ఒక్కటే..
“భారతం బాగుండాలి.”
నేను భారతమాతను..
నా రెండు భుజాలు..
రైతు.
సైనికుడు.
ఒక భుజం విరిగితే..
ఆకలి.
మరొక భుజం విరిగితే..
బానిసత్వం.
వారి చెమటకు
ధర చెప్పొచ్చు.
వారి త్యాగానికి
ధర చెప్పగలవా?
“రైతు పొలంలో ఓడితే..
దేశం ఆకలితో ఓడుతుంది.”
“సైనికుడు సరిహద్దులో పడిపోతే..
మన స్వేచ్ఛ నిలబడలేను.”
(సశేషం)
శైలజా మిత్ర 1966, జనవరి 15 వ తారీఖున చిన్నగొట్టిగల్లు గ్రామం, చిత్తూరు జిల్లాలో జన్మించారు. వీరు ఎం.ఏ. తెలుగు (ఉస్మానియా విశ్వవిద్యాలయం), ఆంగ్లంలో ఎం.ఏ. (వెంకటేశ్వర విశ్వవిద్యాలయం) తిరుపతిలో, జర్నలిజం (రచన జర్నలిజం కాలేజీ, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా చేసారు. నేటినిజం అనే డైలీ పత్రికలో స్టాఫ్ రిపోర్టర్ గా దాదాపు 10 సంవత్సరాలు; అల్ ఇండియా రేడియో, ఎఫ్.ఎం.లో డీఈవోగా 3 సంవత్సరాలు, వెలుగు పత్రికలో అడ్మినిస్ట్రేటర్‌గా ఐదు సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం విమల సాహితి వెబ్ పత్రిక ప్రధాన సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.
వీరి సాహితీ జీవితం 1995లో ప్రారంభమైంది. ఇప్పటివరకు 11 కవితా సంపుటాలు, 4 కథా సంపుటాలు, 4 నవలలు, 12 అనువాదాలు రచించారు. 775 పుస్తక సమీక్షలు, 29 భక్తి–సామాజిక వ్యాసాలు, 11 ఇంటర్వ్యూలు, భావతరంగిణిలో 26 సాహితీ లేఖలు ప్రచురించారు. సాహిత్య ప్రస్థానంలో దాదాపు యాభైకి పైగా అవార్డులు అందుకున్న శైలజా మిత్రగారికి ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయితగా ‘కీర్తి పురస్కారం’ ప్రదానం చేసింది. ఉత్తమ విమర్శకురాలుగా అమృతలత గారి ‘అపురూప పురస్కారం’ పొందారు. వీరు రచించిన ‘రాతిచిగుళ్ళు’ కవితాసంపుటికి ‘ఉమ్మడిశెట్టి’ మరియు ‘శ్రీశ్రీ’ ఉత్తమగ్రంథ పురస్కారాలు లభించాయి. ఆల్ ఇండియా లాంగ్వేజ్ అండ్ లిటరరీ కాన్ఫరెన్స్ వారు ప్రతిష్ఠాత్మక ‘సాహిత్యశ్రీ’ బిరుదు ప్రదానం చేశారు.
