[శ్రీమతి శైలజామిత్ర రచించిన ‘భారతమాత ప్రశ్న’ అనే దీర్ఘ కవితని అందిస్తున్నాము. ఇది 9వ భాగం.]
~
యువతతో సంభాషణ
యువకుడా..
నీ కళ్లలో
నేను రేపటిని చూస్తున్నాను.
నీ అడుగుల్లో
నా భవిష్యత్తు నడుస్తోంది.
నీ చేతిలో
మొబైల్ ఉంది.
కానీ..
నీ హృదయంలో
దేశం ఉందా?
వేల సమాచారాలు
నీ వేలి ముద్రల్లో ఉన్నాయి.
కానీ..
ఒక నిజం కోసం
నీవెన్ని ప్రశ్నలు అడిగావు?
కోపం రావడం తప్పు కాదు.
కానీ..
ఆ కోపానికి
దిశ ఉండాలి.
నీ కలం..
ఖడ్గం కంటే పదునైంది.
నీ ఆలోచన..
వేల నినాదాల కంటే గొప్పది.
చరిత్రను
పుస్తకాలలో మాత్రమే చదవకు.
నీ జీవితంలో
కొత్త చరిత్ర రాయ్.
చెట్టు నాటితే..
భూమి నీ పేరును గుర్తుంచుకుంటుంది.
ఒక మనిషిని నిలబెడితే..
కాలమే నీకు నమస్కరిస్తుంది.
మతం కోసం కాదు..
మానవత్వం కోసం నిలబడు.
పార్టీ కోసం కాదు..
ప్రజల కోసం నిలబడు.
ద్వేషాన్ని పంచడం
చాలా సులభం.
ప్రేమను నిలబెట్టడం..
అదే నిజమైన ధైర్యం.
నేను భరతమాతను..
నిన్ను చూసి
భయపడటం లేదు.
నువ్వు
నీ శక్తిని మరిచిపోతావేమో
అనే భయం మాత్రమే.
లేచి నిలబడు..
నినాదాల కోసం కాదు.
నిజాల కోసం.
చప్పట్ల కోసం కాదు.
మార్పు కోసం.
“యువత చేతుల్లో దేశం సురక్షితం..
యువత మనసుల్లో మానవత్వం ఉంటే.”
“రేపటి భారతం పాఠ్యపుస్తకాల్లో పుట్టదు..
నేటి యువకుడి నిర్ణయంలో పుడుతుంది..”
(సశేషం)
శైలజా మిత్ర 1966, జనవరి 15 వ తారీఖున చిన్నగొట్టిగల్లు గ్రామం, చిత్తూరు జిల్లాలో జన్మించారు. వీరు ఎం.ఏ. తెలుగు (ఉస్మానియా విశ్వవిద్యాలయం), ఆంగ్లంలో ఎం.ఏ. (వెంకటేశ్వర విశ్వవిద్యాలయం) తిరుపతిలో, జర్నలిజం (రచన జర్నలిజం కాలేజీ, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా చేసారు. నేటినిజం అనే డైలీ పత్రికలో స్టాఫ్ రిపోర్టర్ గా దాదాపు 10 సంవత్సరాలు; అల్ ఇండియా రేడియో, ఎఫ్.ఎం.లో డీఈవోగా 3 సంవత్సరాలు, వెలుగు పత్రికలో అడ్మినిస్ట్రేటర్‌గా ఐదు సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం విమల సాహితి వెబ్ పత్రిక ప్రధాన సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు.
వీరి సాహితీ జీవితం 1995లో ప్రారంభమైంది. ఇప్పటివరకు 11 కవితా సంపుటాలు, 4 కథా సంపుటాలు, 4 నవలలు, 12 అనువాదాలు రచించారు. 775 పుస్తక సమీక్షలు, 29 భక్తి–సామాజిక వ్యాసాలు, 11 ఇంటర్వ్యూలు, భావతరంగిణిలో 26 సాహితీ లేఖలు ప్రచురించారు. సాహిత్య ప్రస్థానంలో దాదాపు యాభైకి పైగా అవార్డులు అందుకున్న శైలజా మిత్రగారికి ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయితగా ‘కీర్తి పురస్కారం’ ప్రదానం చేసింది. ఉత్తమ విమర్శకురాలుగా అమృతలత గారి ‘అపురూప పురస్కారం’ పొందారు. వీరు రచించిన ‘రాతిచిగుళ్ళు’ కవితాసంపుటికి ‘ఉమ్మడిశెట్టి’ మరియు ‘శ్రీశ్రీ’ ఉత్తమగ్రంథ పురస్కారాలు లభించాయి. ఆల్ ఇండియా లాంగ్వేజ్ అండ్ లిటరరీ కాన్ఫరెన్స్ వారు ప్రతిష్ఠాత్మక ‘సాహిత్యశ్రీ’ బిరుదు ప్రదానం చేశారు.
