[శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి రచించిన ‘భారతీయ నవలాదర్శనం’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు డా. కాళిదాసు పురుషోత్తం. ఇది 3వ, చివరి భాగం.]
పన్నాలాల్ పటేల్, ఉమాశంకరజోషి ప్రభావంతో రచయితగా జీవితం ఆరంభించారు. వీరి ప్రసిద్ధ గుజరాతీ నవల ‘మానవినీ భావై’ (జీవితమే ఒక నాటకం) నవలకు వీరికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. వేమూరి ఆంజనేయ శర్మ ఈ నవలను సరళమైన భాషలో తెలుగులోకి అనువాదం (1971) చేశారు. అందరికీ ఆహారం అందించే పేదరైతుల కథే ‘జీవితమే ఒక నాటకం’ నవల.
వృద్ధుడైన రైతు కాళా తన జీవితాన్ని నెమరు వేసుకోవడంతో ఈ నవల మొదలవుతుంది, కాళా జీవితంలో బీభత్సాన్ని సృష్టించిన క్షామం, దాని పర్యవసానంగా భయంకర పరిస్థితులూ పఠితలకు దిగ్భ్రాంతి కలిగిస్తాయి. ఆనాటి క్షామం పరిస్థితులు పల్లెల్లో ఎలా ఉన్నాయో రచయిత స్వయంగా చూచి నవలలో చిత్రించారు.
ఈ నవల ప్రతివారూ చదివి ఆనాటి దుర్భర దయనీయ జీవితాన్ని తెలుసుకోవలసినదే. రైతు కాళా చివరి వరకు భోజనం కోసం యాచించడు. గంజి కేంద్రాలకు వెళ్ళడు. మళ్ళీ చినుకులు పడడంతో క్షామం ముగిసినట్లు సూచనతో, రైతు కాళాలో మళ్ళీ ఉత్సాహం, జీవనేచ్ఛ మేల్కొనడంతో నవల ముగుస్తుంది. నేను కూడా ఈ నవల చదివి, ‘పలవరించి’, ఊరకుండలేక ఆంధ్రజ్యోతి పత్రిక వివిధలో పెద్ద వ్యాసమే రాశాను. సాహితీపరులంతా తప్పక చదవాల్సిన గొప్ప నవల ‘మానసినీ భావై’ (జీవితమే ఒక నాటకం).
కుందనిక కపాడియా గుజరాతీ సాహిత్యంలో ప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి. ఈమె నవల ‘సాత్ పగ్లాన్’ ఆకాశమాన్’ తెలుగులో ‘విముక్తి’ పేరుతో అనువదించబడింది.
విముక్తి నవలలో రచయిత్రి, చాలా స్త్రీల సమస్యలను చర్చించారు. “రచయిత్రి ఆ సమస్యలతో పోరాడి విముక్తి చెందే మార్గాన్ని చెప్పిన తీరు, ఆమె ఓర్పు, అనుభవాన్ని మాత్రమే కాక, జీవితం పట్ల ఆమెకు గల ప్రేమను కూడాను తెలియజేయడం ఈ నవలలో ఈ నవలలోని విశేషం.” ఈ నవలలో ప్రధాన పాత్ర వసుధ తన చుట్టూతా స్త్రీల అనుభవాలను చూచి తెలుసుకొన్న తర్వాత, ధైర్యం తెచ్చుకుని నియంతలాంటి భర్తను ఎదిరిస్తుంది. అతడు వసుధను ఇంట్లోంచి వెళ్ళి పొమ్మంటాడు. వసుధకు అప్పటికి యాభయి దాటాయి. అదీ ఆమెకు ఆ ఇంట్లో స్థానం.
పైకి ఎంతో సంతోషంగా ఉన్న కాపురాల్లో లోలోపల స్త్రీలపై జరుగుతున్న హింసను నవలలో ప్రధాన పాత్ర వసుధ గ్రహిస్తుంది. సుమిత్ర పాత్ర కూడా అటువంటిదే. వివాహంలో వంచనకు గురైన ఆమె స్త్రీల కోసం పని చేస్తుంది.
ఈ నవలలో మరో పాత్ర ‘అలోప’ వసంత ఋతువులోని సుగంధంలాటి స్త్రీ. పిల్లలు కలగలేదనే కారణగా భర్త ఆమెకు దూరమవుతాడు. రకరకాల అణచివేతల వల్ల ఎందరో మహిళలు జీవితంలో పైకి రాలేకపోయారని, ఈ నవలలో రచయిత్రి స్త్రీల విముక్తిని గురించి చెప్పిన భాగం ఆలోచనాక్మకంగా ఆదర్శవంతంగా ఉందని వీరలక్ష్మీదేవి వ్యాఖ్యానించారు.
స్వరూప్, అతని భార్య ‘ఆనంద’ గ్రామాన్ని నెలకొల్పుతారు. అక్కడికి పురుషాధిక్యంలో అణచివేతకు గురైన స్త్రీలు ఒక్కొక్కరు చేరి స్వేచ్ఛగా జీవిస్తారు. ‘ఒక అందమైన, సమృద్ధమైన, సార్థక జీవిత విధానాన్ని’ సామూహికంగా ఏర్పరచుకుని స్వేచ్ఛగా జీవిస్తారు. స్త్రీవాదాన్ని ఒకానొక ప్రకృతి తత్వంగా వచ్చిన ఘనత రచయిత్రి కుందనిక కపాడియాకు దక్కింది.
‘భారతీయ నవలాదర్శనం’ సంపుటంలో వీరలక్ష్మీదేవి – ఇస్మత్ చుగ్తాయి ఉర్దూ నవల తెలుగు అనువాదాన్ని పరిచయం చేశారు. ఈ అనువాదాన్ని ‘వక్రరేఖ’ పేరుతో తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది. 75 ఏళ్ళ క్రితం రాయబడిన నవలే అయినా, సమకాలీన సమాజానికి అన్వయిస్తుంది. రచయిత్రి చుగ్తాయిది అంత ముందుచూపు అని వీరలక్ష్మీదేవి ప్రశంసిస్తారు. బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్న కాలం నాటి నేపథ్యంలో ఈ నవల సాగుతుంది.
కథానాయిక షమ్మత్ ఎక్కడా రాజీ పడకుండా చేసిన జీవితయానమే ఈ నవల. దీన్ని విమర్శకులు ఇస్మత్ చుగ్తాయి ఆత్మకథ అన్నారు. కథానాయిక ఉమ్మడి కుటుంబం సభ్యుల మధ్య ఒంటరిగా పెరగడం దురదృష్ట సంఘటన. తనను ఎంతో ప్రేమగా సాకిన అక్క పెళ్ళయి, అత్తవారింటికి వెళ్ళిపోతుంది. ఇక షమ్మన్ అభద్రతతో, స్వీయ మానసిక ఏకాంతంలో పెరిగి పెద్దదవుతుంది.
కాలేజీ చదువులకు హాస్టల్లో ఉండగా ఆమెకు లోకం అంటే ఏంటో తెలుస్తుంది. ఆమె ఇంగ్లీషు బాగా నేర్పుకొని అ భాషపై పట్టు సాధిస్తుంది. కవిత్వం రాస్తుంది. ఉపన్యాస కళలో నేర్పు సంపాదిస్తుంది.
షమ్మన్ బాల్యంలో తనకు లభించని ప్రేమాభిమానాలు వెతుక్కుంటూ తన ప్రయాణం కొనసాగిస్తుంది. ఎన్నో ఎదురు దెబ్బలు ఈ బ్రతుకు ప్రయాణంలో! ఎక్కడా రాజీపడదు షమ్మన్! ఆత్మాభిమానాన్ని వదులుకోదు. ముద్దసాని రాంరెడ్డి చేసిన ఈ నవలానువాదం మూలానికి న్యాయం చేకూర్చిందని వీరలక్ష్మీదేవి ప్రశంసించారు.
అస్సామీ రచయితల్లో వీరేంద్రకుమార భట్టాచార్యకు మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు లభించింది. పది నవలలు, రెండు కథా సంకలనాలు, ఒక కవితా సంకలనం ఈయన వెలువరించారు.
ప్రాకృతమైన నమ్మకాలను, సంప్రదాయాలను తరతరాలుగా తమతో మోసుకొస్తున్న అనేక తెగలు, ప్రజాసమూహాలు అస్పాంలో ఉన్నాయి. అడవులూ, పర్వతాలు, ఆదివాసీలు – భారతదేశ జనాభాలో వీరొక భాగం. అస్సామీ భాషలో డాక్టర్ వీరేంద్రకుమార వ్రాసిన ‘యారు ఇంగమ్’ నవలను వారే ఆంగ్లంలోకి అనువదించారు. ఈ నవలను తెలుగులోకి అనువాదకులు సవ్యంగా అనువదించలేదని వీరలక్ష్మీదేవి వ్యాఖ్యనించారు. ఏమైనా అస్సాం జీవితం, సంన్కృతితో పరిచయం చేసుకోడానికి ఇదొక గవాక్షం.
ఈ నవలలో రచయిత మూడు మార్గాలను సూచించారట. ఆదివాసీలు వాళ్ళ బ్రతుకులేవో వాళ్లు బ్రతకడం – ప్రధాన జనజీవన స్రవంతిలో కలవనీయకుండా వేరుగా ఉంచటం. ఇది పాశ్చాత్యుల మార్గం. రెండోది అదివాసీలు చదువుకొని తమ జీవన విధావాన్ని, సంస్కృతిని పూర్తిగా విడిచిపెట్టి ప్రభుత్వాద్యోగాలు చేస్తూ పట్టణాలలో స్థిరపడడం. మూడోది మధ్యేమార్గం, రచయిత ఈ మార్గాన్నే ఎన్నుకున్నారు.
రకరకాల కారణాల వల్ల ఈశాన్య రాష్ట్రాలలో మిలటరీ క్యాంపులు శాశ్వతంగా ఉండిపోవడం, ఆదివాసీల తెగలు ఒకరితో ఒకరు ఘర్షణలకు దిగడం, కొందరు ప్రభుత్వం మీద తిరుగుబాటుకు దిగడం – ఈ నిరంతర సంక్షుభిత వాతావరణం స్త్రీల జీవితాలపైన తీవ్రమైన ప్రభావం చూపిందని రచయిత ఈ నవల ఇతివృత్తం ద్వారా ప్రదర్శించడమే కాక, అక్కడి ప్రజల జీవితం, వారి సంస్కృతి, భోజనం అలవాట్లు వివరించారు. “పోరాటాల అవసరాన్నీ, రూపాలను చెప్పడం ద్వారా ఈ నవల ఉత్తమ స్థాయిని చేరింది” అని వీరలక్ష్మీదేవి వ్యాఖ్యానించారు.
ఇందిరా గోస్వామి ఆధునిక అస్సామీ రచయితల్లో, కవయిత్రుల్లో అగ్రశ్రేణికి చెందినవారు. జ్ఞానపీఠ సత్కార గ్రహీత. 19వ శతాబ్ది ప్రారంభ కాలం నుంచీ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినంత వరకు సుమారు 150 సంవత్సరాలు అస్సాం కామరూపలో జరిగిన సంఘటనలు ఈ నవలలో చిత్రించబడ్డాయి. భారతదేశం అంతటా భూస్వామ్య వ్యవస్థ క్రమంగా బీటలు బారింది. భూస్వాముల వారసులు ‘ఆ నష్టాన్ని మోస్తారు’.
స్త్రీలు కూడా ఆ వ్యవస్థ యొక్క దురాచారాలకు బలయ్యారు. బ్రాహ్మణుల కంటే అధికులుగా భావించబడే ఈ గోసాయి కుటుంబాల స్త్రీల దుస్థితి మరింత దయనీయం. ఆ స్త్రీల జీవితాలు ముగిసిన తీరు ఎంతో దుర్భర విషాదభరితంగా ‘విషాద కామరూప’ నవల చిత్రించింది. ఈ నవలలో పాత్రలు రచయిత్రి బంధువులు, ఆత్మీయులైన వ్యక్తులే. ఒక కాలంలో వైష్ణవ మఠాలు, వాటి ఆస్తులపై పెత్తనం చేసే గోసాయితుల చేతుల్లో ఆ మఠాల ఆస్తులు, పొలాలు, గ్రామాలూ ఉండేవి. ఈ గోసాయి మఠాధిపతులు ఊళ్ళలో న్యాయం చెప్పి, అమలుచేసే అధికారం కూడా కలిగి ఉండేవాళ్ళు.
ఆ రోజుల్లో అస్సాం రాష్ట్ర ప్రజలను నల్లమందు వ్యసనం పట్టి పీడించింది.
ఈ నవలలో కథానాయకుడు ఇంద్రనాథ్ ప్రజలు ఈ వ్యసనం వల్ల రోగగ్రస్థులై దరిద్రులవుతున్నారని గమనిస్తాడు. ముసలిదయి, పిచ్చి పట్టినట్లు విచ్చలవిడిగా సంచరిస్తున్న ఏనుగును ఇంద్రనాథ్ సానుభూతితో సంరక్షిస్తాడు. శిథిలమవుతున్న అస్సాంలోని భూస్వామ్య వ్యవస్థకు ఈ ముసలి ఏనుగు ప్రతీకలాగా అనిపిస్తుందని వీరలక్ష్మీదేవి వ్యాఖ్యానిస్తారు.
ఇంద్రనాథ్ వృద్ధురాలైన తల్లి, విధవరాలైన పిన్ని, చిన్న గోసాయినీ కూడా అతని ఇంట్లో అతనితోనే ఉంటారు. ఊళ్ళో జరిగే ఉత్సవాలలో ప్రమాదవశాత్తు చిన్న గోసాయి చనిపోతాడు. అప్పుడు పెద్ద గోసాయి భూములు, ఆస్తులు వాటాల ప్రకారం చిన్నగోసాయినీకి అప్పగిస్తాడు. వితంతువయినా చిన్న గోసాయినీ భూముల అజమాయిషీ చూసుకుంటుంది. ఇంద్రనాథ్ చెల్లె గిరిబాలను రజస్వల కాక పూర్వము ఒక వ్యసనపరుడికిచ్చి పెళ్ళి చేస్తాడు. ఈ నవలలో సుమారు వందేళ్ళ నాటి గోసాయీల కుటుంబాల బ్రాహ్మణుల స్త్రీల దయనీయ గాథను రచయిత్రి పడుగు పేకల్లాగా అల్లింది. పతనావస్థకు చేరిన భూస్వామ్య సంస్కతిని రచయిత్రి నవల ద్వారా వివరించారు. అందరూ తప్పక చదవవలసిన నవల.
ఇప్పటి పాకిస్థాన్ లోని సింధు రాష్ట్రానికి చెందిన పోపటి రామచంద్ హీరానందాణి అనే ఆమె ఆత్మకథ ‘నా జీవితపు వెండి బంగరు పుటలు’. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
హీరానందాణి సింధీ భాషలో గొప్ప రచయిత్రి, చిత్రలేఖనంలో కూడా పేరు తెచ్చుకొన్నారు. ఈ చిన్న పుస్తకాన్ని ఏకబిగిన చదివేసినట్లు వీరలక్ష్మీదేవిగారు అన్నారు. దేశవిభజన వల్ల సింధు పాకిస్థాన్ లోకి పోయింది. దేశవిభజన, ప్రత్యేకంగా తన మాతృభూమి పాకిస్థాన్ లోకి చేరిపోవడం వల్ల సింధీ కుటుంబాల్లో కలిగిన సంక్షోభం, ఆటుపోట్లు, దుర్ఘటనలు అన్నీ హీరానందాణి స్వయంగా అనుభవించారు. ఆమె పెద్ద కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రభుత్వోద్యోగి. హృద్రోగంతో హఠాత్తుగా చనిపోతే కుటుబం దిక్కలేనిదయింది. మెట్రిక్యులేషన్ తరగతి చదువుతున్న రచయిత్రి 14 ఏళ్ళ వయసులో టీచరుగా చేయవలసి వచ్చింది. దేశవిభజనతో ఉన్నపాటున తను ప్రాణంగా ప్రేమించిన పుస్తకాలతో సహా అన్నీ విడిచిపెట్టి వట్టి చేతులతో దేశం విడిచి పోవలసి వచ్చింది. చనిపోతూ తండ్రి ఆదేశం ప్రకారం. కుటుంబభారం మోస్తూ, సంగీత పాఠాలు చెప్తూ, టీచరుగా చేస్తూ ఆమె కళాశాల అధ్యాపకురాలుగా ఎదిగారు.
ఆ కాలంలోనే ఆమె సాధు వాస్వాణి వేదాంత వచనాలు విని స్ఫూర్తి పొందారు. దాదీహరీ వాస్వాణీ అనే ఉపాధ్యాయురాలి ప్రభావం తనపై ఉందని ఆమె రాసుకున్నారు. ఆ రోజుల్లో సింధీ కుటుంబాలలో ఆడపిల్లల మీద చాలా ఆంక్షలుండేవి. ఆమె ఒక యువకుడిని ప్రేమిస్తుంది, అతడు చివరలో మరొకరిని పెళ్ళాడాడు. ఆమె మళ్ళీ ఎవరినీ ప్రేమించలేదు. దేశవిభజనతో తొక్కుకుంటూ తోసుకుంటున్న రైల్లో ఎలాగో భారత్ చేరి, ఆమె చివరగా బొంబాయిలో స్థిరపడుతుంది.
ఈ పలాయనాన్ని వర్ణిస్తూ తాను సజీవంగానే మరణం అంచుల వరకూ వెళ్ళినట్లు రాసుకున్నారు.
నశించిపోతున్న సింధు సంస్కృతి కోసం, సింధీ భాష కోసం జీవితమంతా పోరాడిన పోపటి రామచంద్ హీరానందాణి స్వీయ కథ చదవడం గొప్ప అనుభవం అని, హృదయాన్ని కదలించే అనుభూతులు రచనలో దండిగా ఉన్నాయని, అనువాదం అని అనిపించినంత మంచి అనువాదమనీ శ్రీమతి వీరలక్షీదేవి ఈ పుస్తక పరిచయం ముగిస్తూ అన్నారు.
ఈ నవలా పరిచయాల రచన సార్థకమయింది. ఈ పుస్తకాన్ని చదివినవారు రచయిత్రి పరిచయం చేసిన అనేక నవలలు తప్పక సంపాధించి చదువుతారు.
వీరలక్ష్మిదేవి గారు పరిచయం చేసిన తెలుగు రచనల ప్రస్తావన ఈ వ్యాసంలో విడిచిపెట్టాను, సాహితీపరులు చాలా మందికి ఆ పుస్తకాలతో పరిచేయం ఉండే ఉంటుందనే విశ్వాసంతో.
***
రచన: వాడ్రేవు వీరలక్ష్మీదేవి
పేజీలు: 520
వెల: ₹ 350
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
ఆన్‍లైన్‌లో:
https://www.telugubooks.in/products/bharateeya-navala-darshanam
(సమాప్తం)
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు.
రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్‌లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి.
2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ.
2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ).
పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.