Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భయానికి అవతలివైపు

[డా. మధు చిత్తర్వు రచించిన ‘భయానికి అవతలివైపు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

నక్షత్రాలు నల్లటి అలలు లేని సముద్రపు గర్భంలో తెల్లని ముత్యాలలా చెల్లాచెదురుగా మెరుస్తున్నాయి. ప్రగతి అంతరిక్ష నౌకలో కెప్టెన్ విక్రమ్ సేన్ ఒంటరిగా ఇంజన్ రూమ్‌లో కూర్చుని వున్నాడు. అంతరిక్ష యంత్రపు ఇంజన్ల నిరంతర ధ్వనులతో నిండిపోయిన ఆ గది అతనికి ఒక ఆలయం లాంటిది. ఆ ధ్వని వున్నా నిశ్శబ్దం వెంటాడుతూనే ఉంటుంది. నిశ్శబ్దం బరువుగా అనిపించే స్థలం. శబ్దాలు జీవితంలో భాగంగా మారిపోయే స్థలం. విక్రమ్ వ్యోమగామి మాత్రమే కాదు, ఒక తత్వవేత్త కూడా. ఈ సుదూర అంతర గెలాక్సీ ప్రయాణాలు కెప్టెన్‌గా అతనికి ఒక నిశ్చలమైన దృక్పథం అలవాటు చేశాయి. అది అతనికి మార్కస్ ఆరిలియస్ స్టొయిక్ తత్వాన్ని అర్థం చేసుకుని అవలంబించే పద్ధతి వల్ల ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కునే మానసిక స్థైర్యం కలిగించేటట్లు చేసింది. ఇప్పుడు ఈ అనంత యాత్రలో అవధి లేని అంతరిక్ష అన్వేషణలో అతనికి ఎంతో ఉపయోగకరంగా అనిపించింది. అతని మనసులో మార్కస్ ఆరీలియస్ మాటలు ప్రతిధ్వనించాయి:

“నీ మనసుపై నీకే అధికారం ఉంది; బయటి సంఘటనలపై కాదు. దీన్ని గ్రహిస్తే, నిజమైన శక్తి నీలోనే ఉద్భవిస్తుంది.”

కొద్ది సేపటి క్రితమే ఇంజన్ సెన్సార్లు మానిటర్లలో వెలుగుల కదలికలను గుర్తించాయి. ‘పెర్సియస్ రిఫ్ట్’ నుండి వస్తున్న విస్తారమైన, తెలియని జీవులు. అవి ఏలియన్స్ లేదా గ్రహాంతర జీవులు కావచ్చు. అవి వందల సంఖ్యలో వున్నాయి. అంతరిక్ష నౌక లోపలి క్యాబిన్ భాగంలో వ్యోమగాములందరూ తమ తెరలపై ఆందోళనగా చూస్తున్నారు. వారందరినీ తెలియని భయం ఆవహిస్తోంది. వారిలో వారు మెల్లగా, రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. “మన నాశనం దగ్గరలోనే ఉంది.. ఇన్ని వందల గ్రహాంతర జీవులని ఎప్పుడూ ఇంత దగ్గరగా వేగంగా రావడం చూడలేదు. ఏ ప్రమాదం వస్తుందో! వారిని ఎదుర్కొనే ఆయుధాలు తగినన్ని మనకు లేవు అని తెలుసు కదా. మనకు వినాశనం తప్పదేమో!”

విక్రమ్ మాత్రం అనుకున్నాడు: “తెలియని జీవులని చూస్తే భయం సహజం, కానీ విపరీతమైన ఆందోళన, గాభరా మనిషిని ఎక్కువగా ప్రమాదంలో పడేస్తాయి.”

అతని పక్కన ఆదిత్య రావు మెల్లగా వచ్చి నిలబడ్డాడు. వయసు ఇరవై మాత్రమే. ఆలివ్ ఆకుపచ్చ యూనిఫారం, ఎర్రటి హెల్మెట్ లో బలంగా ఆకర్షణీయంగా వున్నాడు, కానీ చేతులు వణుకుతున్నాయి ముఖంలో ఆదుర్దా ఒత్తిడి స్పష్టంగా కనబడుతోంది.

“కెప్టెన్!” ఆదిత్య అన్నాడు, “షీల్డులు బలంగా ఉన్నాయి. కానీ అవి చెదిరితే.. మనం అణు ఆయుధాలను ఉపయోగించాల్సి వస్తుంది.”

విక్రమ్ ప్రశాంతంగా చూశాడు.

“మరణానికి మనిషి భయపడవలసిన అవసరం లేదు; జీవితం మొదలు పెట్టకపోవడమే నిజమైన భయం.”

ఆదిత్య నిశ్శబ్దంగా తల వంచాడు. అతని హృదయం ఇంకా తెలియని భయాల నీడల్లోనే ఉంది. డాక్టర్ ఇషాణి మెహతా గదిలోకి ప్రవేశించింది. ఆమె కళ్ళు తీక్షణంగా ఏదో పరిశీలించి అలిసిపోయినట్లు ఉన్నాయి. ఆమె చేతిలో గ్రహాంతర జీవుల బయాలజీ స్కాన్లు ఉన్న కంప్యూటర్ పరికరం వుంది (టాబ్లెట్). “ఈ జీవులు యంత్రాలు కావు,” అంది ఆమె.

“ఇవి జీవించి ఉన్నాయి. వీటి శక్తి తరంగాలు సంభాషణలా ఉన్నాయి. కానీ వీటి దిశ, ప్రయాణం మన వైపే వుంది. ఇవి మనపై దాడి చేయబోతున్నాయి, అని గట్టిగా అనుకుంటున్నాను.”

ఆదిత్య పెదాలు బిగించి రహస్యం చెప్పినట్లే అన్నాడు “అంటే ఇవి రాక్షసులే.”

ఇషాణి అంగీకరించనట్లు తల అడ్డంగా ఊపింది. “లేదు. ఇవి ఏలియన్స్ లేదా అన్య జీవులు లేదా గ్రహాంతరవాసులు. రాక్షసులు అని పిలవడం భయానికి లొంగిపోవడమే. మనం వీటిని అర్థం చేసుకోవాలి!”

విక్రమ్ తల ఊపాడు. “జ్ఞానం ముందు, హింస తర్వాత. కానీ జ్ఞానానికి ముందు మనం ఏ ప్రమాదాన్ని అయినా ఎదుర్కొనే సంసిద్ధత కలిగి వుండాలి.”

ప్రగతి అంతరిక్ష నౌక సెన్సార్లు వెలిగాయి. ఆ జీవులు, ఆశ్చర్యంగా చిన్న చిన్న గ్రహాలంతటి పరిమాణంలో వున్నాయి. వాటి శరీరాలు ప్రకాశించే వెలుగుల నీలపు ఎర్రటి కాంతులతో మెరుస్తున్నాయి.

ఆదిత్య మళ్లీ మెల్లగా అన్నాడు: “అద్భుతంగా ఉన్నాయి.. కానీ భయంకరంగా..!”

ఇషాణి దగ్గరగా చూసింది. “వాటి వెలుగులు భాషలా ఉన్నాయి. ఇవి మాట్లాడుతున్నాయి!!!”

విక్రమ్ కళ్ళు మూసుకున్నాడు.

“మనము వింటున్నది అభిప్రాయం మాత్రమే, నిజం కాదు. మనము చూస్తున్నది దృక్కోణం మాత్రమే, సత్యం కాదు.”

సిబ్బంది అంతా నౌకలోని వార్ రూమ్ అనబడే యుద్ధమందిరంలో చేరారు. అణు ఆయుధాలు పంపబడడానికి సిద్ధంగా ఉన్నాయి. కెప్టెన్ ఒక్క ఆర్డర్ ఇస్తే చాలు మీటలు నొక్కడానికి సిద్ధంగా వున్నారు.

ఆదిత్య టేబుల్‌పై తన చేతితో చరిచి గట్టిగా మాట్లాడాడు. “మనము వేచి ఉండలేం! ఇవి ముందుగా దాడి చేస్తే మనం అంతం అయిపోతాం! కెప్టెన్, ఫైర్ ఆర్డర్ ఇవ్వండి!”

ఇషాణి అంది. “మనమే ముందుగా దాడి చేస్తే, అవి హానికరమని నిరూపించబడక ముందే వాటిని నాశనం చేసినట్లు అవుతుంది.”.

విక్రమ్ చేతిని పైకెత్తి గంభీరంగా అన్నాడు. అతను ఇప్పుడు ఒక సంక్షోభాన్ని ప్రశాంతంగా ఎదుర్కొంటున్న తత్త్వ విజ్ఞానిలా వున్నాడు.

“భయం నీడలను శత్రువులుగా చూపిస్తుంది; ధైర్యం సత్యాన్ని ఎదురుచూడమని నేర్పిస్తుంది.”

అంతరిక్ష నౌక సిబ్బంది ఎవరూ మాట్లాడలేదు.వారి నిశ్శబ్దంలో భయం ఆదుర్దా ప్రస్ఫుటంగా కనిపించాయి. సమాచార నిపుణురాలు ఇషాణి ఆ వెలుగుల నమూనాలను డీకోడ్ చేయడం అర్థం చేసుకోవడం కంప్యూటర్ కృత్రిమ మేధస్సుతో చేయడం మొదలు పెట్టింది. కొన్ని గంటల ‘యూనివర్సల్’ సమయం గడిచింది. ఆ వెలుగులు అర్థంలేని యాదృచ్ఛికమైన దీపాలు వెలుగులు కావు. క్రమంగా ఆమె ముఖకవళికలు ప్రశాంతంగా మారాయి. ఒక మంచి వార్త తెలిసినట్లు చిరునవ్వు నవ్వింది.

“వీటి భాషణాలు తత్త్వశాస్త్రం లాంటివి,” ఆమె చెప్పింది. “జీవన చక్రం, అంతం, ఆరంభం గురించి మాట్లాడుతున్నాయి. ఇవి మరణాన్ని గురించి తెలుసుకున్నాయి, కానీ మరణానికి భయపడడం లేదు.”

విక్రమ్ ఆశ్చర్యపోయాడు. “అయితే ఆలోచనల్లో ఇవి మనకు బంధువులే.”

కొంచెం సేపటికి జీవులు నౌక చుట్టూ ఆగాయి. వాటి నుంచి వచ్చే వెలుగులు ఒకే రీతిలో మెరిశాయి. హఠాత్తుగా నౌక బయటి రక్షణ షీల్డులు కంపించాయి. నౌకని ఏవో బలమైన శక్తి తరంగాలు తాకాయి. ఆదిత్య భయంతో బిగ్గరగా అరిచాడు. “కెప్టెన్! ఇది నిస్సందేహంగా మన మీద దాడి!”

విక్రమ్ ప్రశాంతంగా అన్నాడు: “లేదు. ఇవి ప్రశ్నలు! సంభాషణలు మాత్రమే!” అతను నౌక సిబ్బంది లోని రక్షణా సిబ్బందికి అణు ఆయుధాలను తాత్కాలికంగా లాక్ చేయమని ఆదేశించాడు.

ఇషాణి తన కంప్యూటర్ నుండి వెలుగులతో గ్రహాంతర జీవులకి ప్రతిస్పందించింది. అవి మళ్ళీ వెలుగుల సంకేతాలను పంపాయి. గంటల తరబడి ఆ వెలుగుల సంకేతాలను, ఇషాణి మానవ భాషలోకి అనువదించింది. వాటి సారాంశం వివరించింది.

“ఇవి మీ ఉద్దేశ్యం ఏమిటి? అని అడుగుతున్నాయి.”

విక్రమ్ వెలుగులతో సమాధానం ఇచ్చాడు: “ప్రకృతితో ఏకమై జీవించడం, ధర్మం అనుసరించడం, జ్ఞానం పొందడం.”

గ్రహాంతర జీవులు ఆగాయి. వాటి వెలుగులు మృదువుగా మారాయి. వాటి తర్వాతి సంకేతం భారంగా ఉంది.

ఇషాణి అనువదించింది: “మీ ఉద్దేశ్యం ధర్మమైతే, ఆయుధాలను వదిలేయండి!”.

ఆదిత్య భయపడ్డాడు. “అది ఆత్మహత్య! ఆయుధాలు లేకుండా మనకి రక్షణ లేదు. మనం ప్రమాదంలో పడతాం. పూర్తిగా వినాశనం అవడానికి కూడా అవకాశం వుంది”.

కెప్టెన్ విక్రమ్ లేచి నిలబడ్డాడు.

“అది ధర్మం కాని పని అయితే చేయకు; అది సత్యం కాని మాట అయితే పలకకు.”.

అణు ఆయుధాలను ‘డిజార్మ్’ అంటే విడుదల కాకుండా చేయమని ఆదేశించాడు.

జీవులు దగ్గరికి వచ్చాయి. ఆదిత్య ఊపిరి బిగపట్టాడు.

కానీ వెలుగులు సమన్వయంగా మెరిశాయి. ఇషాణి అనువదించింది: “మీరు జ్ఞానాన్ని ఎంచుకున్నారు. మీరు మా శత్రువులు కాదు. మీకు అపాయం కలుగజేయము. మీరు బంధువులు.”

ఆదిత్య టెన్షన్ తగ్గిపోయింది. కానీ అలసటగా కూలబడ్డాడు. “అదృష్టం! ఏదయినా తేడా వస్తే మనం మాడి చనిపోయేవాళ్లం.!”

విక్రమ్ అతని భుజంపై చేయి పెట్టాడు ఓదార్పుగా.

“అవును. కానీ మరణం శత్రువు కాదు. భయపడి వెనక్కి తగ్గడమే శత్రువు.”

ఇషాణి చిరునవ్వు చిందించింది. “ఇవి మనను పరీక్షించాయి. మనం ఉత్తీర్ణులయ్యాం.!”

తరువాత విక్రమ్ తన డైరీలో రాసుకున్నాడు.

“అంతరిక్షం విస్తారమైనది. ఎన్నో ఏలియన్స్, లేదా గ్రహాంతర జీవులు మనకు తెలియనివి, అర్థం చేసుకోవలసినవీ వున్నాయి. కానీ భయం ఎప్పుడూ ఒకటే. భయాన్ని జయించడం అంటే మనసును జయించడం. హింసకు బదులు ధర్మాన్ని ఎంచుకోవడం అంటే సత్యంగా జీవించడం.”

అతను మెల్లగా జపించాడు:

“ఈ క్షణంలోనే జీవితం ముగియవచ్చు. ఆ భావమే నీ ఆలోచన, నీ మాట, నీ కార్యాన్ని నిర్ణయించనివ్వు.”

తర్వాత సంస్కృత శ్లోకాన్ని నిశ్శబ్దంగా పలికాడు:

ధైర్యం ధారయ మనసి నిత్యం
కర్తవ్యం కురు ధర్మమార్గే।
మృత్యోరపి న భయం అస్తి
సత్యం జీవితం అమృతం చ॥

అర్థం:
ఎల్లప్పుడూ ధైర్యాన్ని మనసులో ఉంచుకో. ధర్మమార్గాన్ని అనుసరించి కర్తవ్యం నిర్వహించు. అప్పుడు మరణం అంటే కూడా భయం వుండదు. సత్యమే జీవితం, సత్యమే అమరత్వం అవుతుంది కూడా.

***

వివరణలు:

  1. మార్కస్ ఆరిలియస్ రోమన్ చక్రవర్తి.క్రీస్తు పూర్వం 160 లో రోమ్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అతను ఎన్నో యుద్థాలు, ప్లేగ్ లాంటి మహామారి వ్యాథులనీ ఎదుర్కొన్నాడు. అతడు రాసిన మెడిటేషన్స్ అనే గ్రంథంలో అతని ఆలోచనలు భద్రపరిచారు. ఇవే అతనిని స్టోయిక్ వేదాంతానికి మూలపురుషుని గా చేశాయి.
  2. పెర్సియస్ రిఫ్ట్ అనేది సైన్స్ ఫిక్షన్‌లో తరచు వుపయోగించబడే అంతరిక్ష ప్రాంతం.ఇది కల్పన. కానీ ఇది నిజంగా అంతరిక్ష శాస్త్రంలో వున్న పెర్సియస్ కాన్స్టెలేషన్ అనే సుదూర నక్షత్రసమూహం మీద ఆధారపడి సృష్టించినది. ఇది భూమికి 256 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో వుంది. ఇక్కడ వేల కొద్దీ గెలాక్సీలూ, డార్క్ మేటర్, నక్షత్రసమూహాల ఢీకొట్టుకునే కలయికలు (collision) జరుగుతూ వుంటాయని అంతరిక్ష పరిశోధనా శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
Exit mobile version