Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భూమి నుంచి ప్లూటో దాకా… -7

విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్.

అధ్యాయం 16: లా గరె అమృత’ నుంచి ‘లా డెర్నియర్’కు

ది అన్ని ఇతర రైల్వే స్టేషన్ల లానే ఉంది.

‘లా గరే అమృత’ చంద్రునిలో అతి పెద్దది. ఇది చంద్రగ్రహం రాజధాని నగరం నుండి ఉత్తర ధ్రువానికి వెళుతుంది. ప్రశాంత సముద్రం చివరలో చీకటి వైపు ప్రారంభమయ్యే చోట ఉన్న ‘లాడెర్నియర్’ స్టేషన్ చివరిది.

సాయంత్రం 6.00 గంటలకు ‘లా గరే అమృత’ నుండి బయల్దేరే సదరన్ ఎక్స్‌ప్రెస్ కోసం నేను, కుజగ్రహవాసి వాన్ కు జాక్, గనీమీడ్‌కి చెందిన ఏనిమాయిడ్, టైటాన్‌వాసి డిమిట్రి చంద్రగ్రహ నివాసి చాంద్ ఆఫ్ మూన్ కోసం ఎదురుచూస్తున్నాం. ఈ స్టేషన్ భూగర్భ నగరం యొక్క చివరన ఎత్తయిన ప్రదేశంలో నిర్మించబడింది. ప్రయాణికులు అక్కడికి ఎస్కలేటర్లపై వెళతారు. ఈ స్టేషన్ ప్రవేశమార్గం కోడి గుడ్డు ఆకారంలో ఓ పొడుగాటి గొట్టంలా ఉంది. దీన్ని లావా ట్యూబ్‌లో నిర్మించారు. చంద్రుడిలో ఉన్న అనేక లావా ట్యూబులలో రైళ్ళు ప్రయాణిస్తాయి. మేగట్నిక్ లెవిటేషన్ వ్యవస్థలో నిర్మితమైన మాగ్నటిక్ ట్రాక్ పైన రైలు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అందువల్ల వాయు ప్రయాణంతో పోలిస్తే రైలు ప్రయాణమే సౌకర్యవంతంగా ఉంటుంది. చంద్రునిపై తక్కువ గురుత్వాకర్షణ ఉండడం, మరియు గాలి లేని కారణంగా – భూమి మీద రైళ్ళు ప్రయాణించే వేగానికి అనేక రెట్లు అధిక వేగంతో ఇక్కడి రైళ్ళు ప్రయాణిస్తాయి. ప్రతీ బోగీని సీల్డ్ స్ట్రక్చర్‌గా నిర్మించి, లోపల భూమి గురుత్వాకర్షణ కల్పించి, ఆక్సీజన్ సరఫరా చేయడంతో – కాస్మిక్ రేడియేషన్, ప్రాణవాయువు సరఫరా, గురుత్వాకర్షణ సమస్యలు పరిష్కరించబడ్డాయి. భూమిపై రైళ్ళలో లానే ఇక్కడి రైళ్ళ బోగీలలో ఉన్న బెర్తులపై కూర్చోవచ్చు, నడవచ్చు, మాట్లాడుకోవచ్చు, నిద్రపోవచ్చు.

మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన మనిషి మాకు రిజర్వు చేయబడిన స్లీపర్ కంపార్ట్‌మెంట్‍ని చూపించాడు. ఆహార పొట్లాలను అందించాడు. మేము చాలా ఎక్కువ సామాన్లతో ప్రయాణిస్తున్నాం.

అవును, మేము లా డెర్నియర్ స్టేషన్‌లో దిగాకా మా ఇబ్బందులు మొదలవుతాయి. చీకటి వైపున ఉన్న క్రేటర్లలకి మా అంతట మేముగా వెళ్ళాలి. అందుకని మాకు చంద్రుని రోవర్ క్రాప్ట్, ఆక్సిజన్ సిలిండర్లు, పొజిషనింగ్ పరికరాలు, బ్యాటరీతో పనిచేసే దీపాలు, లేజర్ గన్స్, నిల్వచేయబడిన ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు టిన్‌లు, మరియు టిన్‌లలో ఫలాలు, త్రాగునీరు 15 రోజులకి సరిపోయంతగా సరఫరా చేయబడ్డాయి. ప్రతి ఒక్కరూ అతని ఆక్సీజన్ సిలిండర్, నీరు, ఆహారం, బట్టలు మోసుకువెళ్ళాలి.

చంద్రుడి చీకటి భాగంలో ఎక్కడికి వెళ్ళాలి?

ఇది బాగా వేధించే ప్రశ్న. విశ్వశక్తిని ప్రయోగించగల వ్యక్తుల బృందంగా మేము పరిష్కారం కనుగొనాల్సిన ప్రశ్న.

అన్నీ తెలిసిన యురేకస్‌ని అడిగాను, చంద్రుడి చీకటి వైపున విద్యుదయస్కాంత శక్తిని గుర్తించగలమా అని. గ్రహాంతర దుష్ట తాంత్రికులు జరిపిన కొన్ని విద్రోహ చర్యలు లేదా వ్యక్తీకరణల వల్ల అక్కడక్కడా విద్యుదయస్కాంత ‘అలజడి’ సంభవించింది, కానీ అది చంద్రుడి చీకటి వైపున కాదు.

“వాళ్ళకి చంద్రుని చీకటి భాగంలో విద్యుదయస్కాంత సంకేతాలు లభించడం లేదు, పైగా వాళ్ళు వాటి కోసం శోధించడం లేదు. సంకేతాలు చాలా బలహీనంగా ఉన్నాయి, ఎందుకంటే చీకటి భాగంలో కాస్మిక్ రేడియేషన్ సంకేతాలను నియంత్రిస్తుంది. అయితే నేను లా గ్రాంగియన్ పాయింట్ ఎల్11 వద్ద ఉపగ్రహంపై హ్యాకింగ్ చేసి వాళ్ళని గుర్తించగలను” చెప్పింది యురేకస్

“అది ఏమిటి? “

“సౌర వ్యవస్థలో ఎల్-వన్ నుంచి ఎల్. ఫైవ్‌కి విద్యుదయస్కాంత సంకేతాలు లభ్యమయ్యే ఐదు పాయింట్లు ఉన్నాయి. ఎల్11 లోని ఉపగ్రహం చంద్రుని వెలుపల ఉన్న అన్ని సిగ్నల్స్ మరియు డేటాను చురుకుగా నమోదు చేస్తుంది.”

“సరే. నాకు అర్థమైంది. అయితే, చంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ తెలుసుకోలేనిది నువ్వు కనుగొన్నావన్న మాట.”

“అవును. ఇటు చూడండి!” అంటూ యురేకస్ తన ఛాతి భాగం చూపించింది. యురేకస్ లోహపు ఛాతి మెరుస్తూ కాంతివంతంగా ఉంది. దాని మీద చంద్రుడి చీకటి భాగంలోని ప్రకృతి దృశ్యం కనిపించింది. మరియా అని పిలవబడే, నల్లటి అగ్నిపర్వత ధూళి ప్రదేశాలు, ఇంకా నిర్మానుష్యమైన క్రేటర్స్. ఉన్నట్టుండి ఓ ఇగ్లూ ఆకారపు నిర్మాణంలో చీకటి చుట్టూ 10 ఎరుపు రంగులో వెలుగు చుక్కలు కనబడ్డాయి. మళ్ళీ మళ్ళీ కనబడ్డాయి. కింద పేర్కొన్న తేదీలులో అవి బాగా వెలిగి ఆరిపోయినట్లుగా తెలుస్తోంది. ఆ డేటాతో చంద్ర అక్షాంశం మరియు రేఖాంశాలు సరిపోతున్నాయి. డేటా గత 2 నెలల కాలానిది. క్షీణించిన ఎరుపు వెలుగు చుక్కలన్నీ చాలా వరకు ఒకే చోట ముగిసాయి.

లా డెర్నియర్ రైల్వే స్టేషన్! ఇప్పుడు మెరుస్తున్న ఎర్రటి వెలుగు చుక్కలు ఒక పెద్ద గుమ్మటం  ఆకారంలోని ఇగ్లూ లోపల ఉన్నాయి!

గతానుభవపు భావన.

ఆ ఇగ్లూని ఇంతకుముందు నేను నా పీడకలలో చూశాను.

అప్పుడు ఒక భయంకరమైన రహస్యోద్ఘాటన నా మనసులో మెదిలింది.

“ఎందుకు? గ్రహాంతరవాసులు అక్కడే ఎందుకు ఉంటున్నారు? ఎందుకు ఇప్పుడే చురుకుగా ఉన్నారు? వాళ్ళు తరచూ లా డెర్నియర్ స్టేషన్ ద్వారా చంద్రుడి యొక్క ప్రకాశించే వైపుకు వస్తున్నారు…”

“ఆ ఇగ్లూ కట్టడంలో వాళ్ళు నిరంతరం విశ్వశక్తిని ఉపయోగిస్తూ, చురుకుగా ఉంటున్నారు. బహుశా మనుగడ కోసం ఉష్ణాన్ని, శక్తిని సృష్టించడానికి కావచ్చు. అద్భుతం… నమ్మశక్యంగా లేదు! వాళ్ళు కుజగ్రహపు తాంత్రికుల కన్నా వందల రెట్ల శక్తివంతులైన ఇతర గ్రహాంతర తాంత్రికులై ఉండాలి. బలవత్తరమైన విశ్వశక్తి!” ఆశ్చర్యంగా చెప్పాను.

“అవును మాస్టర్! వాళ్ళ విశ్వశక్తిది 10,000 నుంచి 15,000 నక్షత్రాల స్థాయిగా అంచనా వేయవచ్చు. వాళ్ళు ఈ వ్యవస్థ నుండి రాలేదు. బహుశా ఆల్ఫా మరియు ప్రాక్సిమా సెంటారి జంటతారల చుట్టూ ఉండే కెప్లర్ సిస్టం నుండి వచ్చి ఉంటారు, ఐది ఇక్కడికి 4.5 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది… నేను వారి గురించి అధ్యయనం చేసాను. కెప్లర్ బి గ్రహంలో చాలా పరిణమిత జీవ రూపాలు ఉన్నాయి. కానీ వాళ్ళంతా పిసియుఎఫ్‌లు. దుష్టశక్తులు. ఆల్ఫా వ్యవస్థలోనూ, సౌర వ్యవస్థలోనూ ఉండే గ్రహాలలో ఒక రహస్య సామ్రాజ్యాన్ని విస్తరించే ఉద్దేశమున్న దళాలు.” వివరించింది యురేకస్.

“నిజమే యురేకస్! నా పీడకల సరైనదే అయితే, ఈ దుష్ట శక్తులు ఇప్పుడు సమూరాకు సహాయపడుతున్నాయి. వాళ్ళు సయోనీని కూడా పునర్జీవింపజేశారు. నేను కలలో చూసిందంతా సరియైనదని నేను భావిస్తున్నాను. “

యురేకస్‌కి నవ్వటం రాదు. “మాస్టర్! నాలో కలలను విశ్లేషించే సాఫ్ట్‌వేర్ ఉంది. మీరు మీ కలలో లేదా పీడకలలో చూసినట్లయితే అది ఒక ఉపచేతన భయం కావచ్చు. కాబట్టి దానినుంచి  నిగమనం చేయడంలో జాగ్రత్తగా ఉండండి.  ఒక పీడకల యొక్క యథార్థతకు నేను హామీ ఇవ్వలేను” అంది.

” కావచ్చు. కానీ మనం అక్కడికి వెళ్ళి చూసొద్దాం. అయితే ఈ విషయాన్ని మంత్రిగారికి చెప్పాలా వద్దా? లేదా మనంతట మనమే వెళ్దామా?”

“ముందు మనం వెళ్ళి ఆ ప్రాంతాన్ని గమనిద్దాం. మనకి నిర్ధారణ అయినప్పుడు మాత్రమే చంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిద్దాం. మనం లా డెర్నియర్ దాటి చంద్రుడి చీకటి భాగంలోకి ప్రవేశిద్దాం. మనం విశ్వశక్తిని ఉపయోగించి అదృశ్య రూపంలో వెళ్దాం. మన దగ్గర ఎలాగూ గాడ్జెట్లు, ఆయుధాలు ఉన్నాయి. ధృవీకరించుకుని తిరిగి వచ్చేద్దాం” అన్నారు వాన్ కు జాక్, చాంద్.

డిమిట్రీ, ప్రకృతి ఏమీ మాట్లాడలేదు.

“ఆల్ఫా వ్యవస్థకి చెందిన 10000 నక్షత్రాల స్థాయి ఉన్న శక్తివంతులైన గ్రహాంతర మాంత్రికులతో మనం పోరాడగలమా? మంత్రిగారికి ఎందుకు చెప్పకూడదు? “

“మనం పోరాడడం లేదు” అన్నాడు వాన్ కు జాక్. “పైగా, చాంద్ ఇక్కడే ఉన్నాడు. అతను మా సంధానకర్త కదా. అతను మాతో వస్తాడు…!”

“మనం వెళ్ళి చూసి, నిర్ధారిద్దాం. ఇది నాకు చాలా పేరు తెస్తుంది. ఇది ప్రమాదకరమైనదే కానీ…”

“హే హనీ, అక్కడికి వెళ్దాం. అక్కడ ఏముందో చూద్దాం. చీకటిలోనే తిరిగి వచ్చేద్దాం. నాకు పిల్లి కళ్ళు ఉన్నాయి. అదృశ్య రూపాన్ని నిరవధికంగా ఉపయోగించగల శక్తి ఉంది. కానీ మీ ఆవిడ ప్రకృతే కాస్త బలహీనంగా ఉంది…” అంది డిమిట్రీ.

“లేదు. నేను కూడా సరదాలో భాగంగా ఉండాలనుకుంటున్నాను!!” చెప్పింది ప్రకృతి.

ఇది నాకు చాలా కఠినమైన నిర్ణయం. ఇదేమీ సరదా పర్యటన కాదు. అసలు చంద్రగ్రహపు నేలలే  కఠినమైనవి అనుకుంటే, చీకటి భాగం మరింత కష్టంగా ఉంటుంది. కుజుడి మీద రోవర్స్‌పై ప్రయాణించినట్టే, చంద్రుడి మీద కూడా రోవర్ క్రాఫ్ట్ ద్వారా ప్రయాణించవలసి ఉంటుంది. స్పేస్ సూట్లు ధరించి ఆక్సిజన్ సిలిండర్లు మోసుకుంటూ మేము శాటిలైట్ ఫోన్ల ద్వారా ఒకరితోఒకరం మాట్లాడుకోవాలి. దుష్ట గ్రహాంతరవాసుల కోసం అన్వేషించాలి. కానీ అమృతా కాలనీ లోని హోటల్‌లో ఉండడానికి ఆమెను ఒప్పించడం నాకు కష్టమైంది. మేమిక్కడికి వచ్చింది సందర్శనకి కాదు, షాపింగ్ కోసం కాదు, చంద్ర నాగరికత గురించి తెలుసుకునేందుకు కాదు.

ఒక భారతీయ గ్రామీణ భార్య ఎంత పట్టుదలగా ఉంటుందో, నా ప్రియమైన ప్రకృతి కూడా అంతే మొండిగా ఉంటుంది.

ఆమె ఎర్రని పెదవులు వణుకుతున్నాయి, నల్లటి కళ్ళలో దృఢనిర్ణయం కనబడుతోంది.

“నేను మీకు సాయపడగలను హనీ! నేను మీతో వస్తాను.” చెప్పింది ప్రకృతి.

***

రైలు బయల్దేరింది. త్వరలోనే మేము పీడనం ఉన్న కంపార్ట్‌మెంట్లలో కూచుని విపరీతమైన వేగంతో ప్రయాణిస్తున్నాం. ఇక స్పేస్ సూట్లను తొలగించవచ్చు, ఆక్సిజన్ సరఫరా ఉంది. గ్రావిటీ సాధారణమైంది. రైలు విపరీతమైన వేగంతో ప్రయాణిస్తుడంతో కిటికిలోంచి చంద్రుడి ప్రకృతి దృశ్యాలు చూడలేము. అందుకని ఓ తెరపై మానిటర్ ద్వారా బయట స్థలాలు మరియు స్థలాకృతిని చూపిస్తారు.

బూడిద రంగు క్రేటర్లు, పర్వతాలు మరియు అప్పుడప్పుడు రైల్లో ప్రయాణించే సైనికులు, వాతావరణ శాస్త్రవేత్తలకు కోసం ఉన్న చిన్న స్టేషన్లను దాటుకుంటూ రైలు వేగంగా సాగుతోంది. ఎర్త్ ఫుడ్‌ని ఆర్డర్ చేశాము. దాంతో పాటు కాస్త రెడ్ వైన్ కూడా. ప్రయాణాన్ని, భోజనాన్ని ఆస్వాదించాము. ముఖ్యంగా ఏనిమాయిడ్‌కి రెడ్ వైన్ బాగా నచ్చింది.

చాంద్ ఒక పాట పాడితే, వాన్ కుక్ జాక్ కుజగ్రహపు నృత్యంలోని చిన్న అంశాలను ప్రదర్శించాడు.

డిమిట్రీ అప్పుడప్పుడు వ్యాఖ్యానిస్తూ, నిట్టూరుస్తూ ప్రయాణాన్ని ఆస్వాదిస్తోంది. “టైటాన్ మీద మాకు ఎటువంటి రైళ్లు లేవు. మాకు భూగర్భ లిఫ్టులు మాత్రమే ఉన్నాయి. నాకు రైళ్ళంటే చాలా ఇష్టం. భూమిపైన విడుదలైన రైలు సినిమాలు కూడా నాకెంతో ఇష్టం – 20వ శతాబ్దానికి చెందిన  ‘ది గ్రేట్ ట్రైన్ రాబరీ’, ‘ఓరియంట్ ఎక్స్‌ప్రెస్’ లాంటివి. ఇక్కడ పైరేట్స్ దాడి చేయరనే ఆశిస్తున్నాను. హా! హ! హ!” అంటూ నవ్వింది.

మా రైలు చంద్రుని ఉపరితలంమీద మాగ్నెటిక్ ట్రాక్ పైన బిలాలు, కొండల మధ్య తన శరీరాన్ని వంపులు తిప్పుతూ పాకే నీలి-నలుపు జీవిలా వేగంగా కదులుతోంది. కాసేపట్లో మా బృందం సభ్యులందరూ కలలు రాని నిద్రలోకి జారుకున్నారు.

నేను తప్ప. నేను కళ్ళద్దాలు ధరించి ఇంటర్‌గెలాక్టిక్ నెట్ బ్రౌజ్ చేయసాగాను. ఇది సీట్లకి జోడించిన గాజు తెరలలో నేరుగా కనిపిస్తుంది.

నేను ఆల్ఫా సెంటారీ సిస్టమ్ మాంత్రికులు, విశ్వశక్తి, అండర్‌గ్రౌండ్ ఆర్గనైజేషన్స్, సౌర వ్యవస్థలో దాచబడి ఉన్న అద్భుత వస్తువులు, చంద్రునిపై దాచబడి ఉన్న ‘మిర్రర్ ఆఫ్ కమ్యూనికేషన్స్’  యొక్క శోధించాను.

ఇంటర్ గెలాక్టిక్ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెప్పింది:

“వేలాది సంవత్సరాల క్రితం అనుభవజ్ఞులైన మాంత్రికుల సంఘం (ఎస్.ఎస్.డబ్ల్యూ – సిండికేట్ ఆఫ్ సీనియర్ విజర్డ్స్) ద్వారా దాచబడిన పురాతన అద్భుత వస్తువులలో చంద్రునిపై ఉన్న ‘మిర్రర్ ఆఫ్ యూనివర్సల్ కమ్యూనికేషన్స్’  ఒకటి. ఇది ఆధునిక ఉపగ్రహము లేదా ఇంటర్నెట్ పరికరాల వంటిది. మిల్కీ వే గెలాక్సీలో ఎక్కడ ఏ ప్రాంతంనైనా వీక్షించగల సామర్థ్యం కలిగి ఉంది. సుదూరంగా ఉన్న తాంత్రికులతో సంభాషణ చేయించగల సామర్థ్యం ఈ అద్దానికి ఉంది. దుష్ట తాంత్రికుల నుండి రక్షించడానికి చంద్రునిపై దాచబడింది. ఆధునిక చంద్రుడి యొక్క మ్యాప్‌లలో పేర్లు ఉన్న ఐట్కెన్ పర్వతం లేదా మలేపెర్ట్ పర్వతంపై దాచబడి ఉండవచ్చు. ఇది స్వచ్ఛమైన, నిస్వార్థమైన, చెడు కోరికలు లేని పిసియుఎఫ్‍కి మాత్రమే కనబడుతుంది. వారే ఎంపిక జేయబడిన వ్యక్తి అని అనుభవజ్ఞులైన మాంత్రికులు చెబుతారు. ఎవరు మాంత్రికులు, ఎవరు ఎంపిక జేయబడిన వ్యక్తి ఎవరు అనే విషయాలలో వివాదం ఉంది. ఒకే విధమైన విశ్వ స్పందనతో విశ్వశక్తిని ఉపయోగించగల సామర్థ్యాన్ని కలిగిన జన్యు నిర్మాణం లేదా ఉత్పరివర్తనాలను ఒకరు లేదా చాలా మంది పొంది ఉండవచ్చు. అయితే, ఇటువంటి ప్రతిపాదనలకు ఏ ఆధారమూ లేదు. అమృత ఔషధం, వెండి కొవ్వొత్తి, జుపిటర్ వాండ్ వంటి ఇతర అద్భుత వస్తువులు వరుసగా కుజుడు, భూమి మరియు గనీమీడ్‍లపై దాచబడి ఉన్నాయి.

ఎన్సైక్లోపెడియాలో ఇటువంటి లింకులు మరియు శీర్షికలు చాలా ఉన్నాయి.

అవన్నీ నిజమని నాకు తెలుసు.

ఎందుకంటే, మౌంట్ ఒలంపస్‍పైన అమరత్వం ప్రసాదించే అమృత ఔషధం, ఆమ్రపాలిలోని భైరవాలయంలో వెండి కొవ్వొత్తిని నేను ఇప్పటికే గుర్తించాను.

ఇప్పుడు నేను మలపేర్ట్ పర్వతం, ఐట్కెన్ పర్వతం కోసం వెతకటం ప్రారంభించాను.

నేను బాగా నిరుత్సాహపడ్డాను, ఎందుకంటే ఆ రెండు పర్వతాలు చంద్రుని యొక్క ప్రకాశించే భాగంలో ఉన్నాయి. అవి చీకటి వైపున లేవు.

మరిక మేము చంద్రుడి చీకటి వైపు ఎందుకు వెళ్ళడం? ఏమైనా ప్రయోజనం ఉంటుందా?

అధ్యాయం 17: లా డెర్నియర్ స్టేషన్

ఎట్టకేలకు మేము చంద్రుడి చీకటి భాగం అంచులలో ఉన్న లా డెర్నియర్ స్టేషన్‌‍కు చేరుకున్నాము.

మేము గ్రావిటీ సూట్లను ధరించి, మా సంచులను భుజాన వేసుకుని, నడుంపై ఆక్సిజన్ సిలిండర్లు, ఆహార పదార్థాలు మోసుకుంటూ స్టేషన్‍లో దిగినప్పుడు మా మధ్య ఒక భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది, అది మా వృత్తిగత నైపుణ్యం కూడా.

ఈ పరిస్థితి – ఈ బృందంలో బహుశా నాకూ, ప్రకృతికి మాత్రమే కొత్తయి ఉండవచ్చు. వాన్ కు జాక్, చాంద్ విరళ వాతావరణంలో ఈ రకమైన పరిశోధనాలకు, తక్కువ గురుత్వాకర్షణకు, తక్కువ ఆక్సిజన్‌కి అలవాటు పడి ఉన్నారు. డిమిట్రీ, ఏనిమోయిడ్ – టైటాన్, గనీమెడ్‌లలోని భూగర్భ కాలనీల నుండి వచ్చినవారు. వాళ్ళ కళ్ళు తీక్షణమైనవి, వినికిడి చురుకైనది. అద్భుతమైన విశ్వశక్తిని ఉపయోగించగలగడం వారి అదనపు బలం.

ప్లాట్‌ఫాం మీద భయం గొలిపే నిశ్శబ్దం ఆవరించి ఉంది. దీపాలు మందంగా వెలుగుతున్నాయి. ప్లాట్‌ఫాం నిర్జనంగా ఉంది, ఒంటరి రైల్వే గార్డు తప్ప అక్కడెవరూ లేరు. రైలు శుభ్రపరుచుకోడం కోసం, ఇంధనం నింపుకోడానికి హ్యాంగర్‌కి వెళుతుంది. ఆ మర్నాడు అమృతా కాలనీకి వెళ్తుంది.

తరువాత బహుశా మరో వారం పాటు ఇక్కడికి ఇంకో రైలు రాదు. నిర్జనమైన లా డెర్నియర్ స్టేషన్! ఈ బండి వెళ్ళిపోయాకా ఈ స్టేషన్‌ని పర్యవేక్షించే సిబ్బంది – లా డెర్నియర్ అని పిలవబడే లావా ట్యూబ్ లోపలికి వెళ్ళిపోతారు.

ఇక్కడ నుండి మేము లూనార్ రోవర్ క్రాఫ్ట్ ద్వారా చంద్రుడి మీద ఉన్న మరో వైపుకు వెళ్ళవలసి ఉంటుంది, అయితే పూర్తి చీకటిలో.

“చంద్రుని చివరికి వైపుకి స్వాగతం” అంటూ మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ఒక అధికారి ఒకరు మాకు స్వాగతం పలికాడు. అతను పొడవుగా ఉన్నాడు. ఆక్సిజన్ హెల్మెట్, గ్రావిటీ సూట్ ధరించి ఉన్నాడు. అతనితో పాటు సైనికుల్లా అనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులున్నారు.

గుమ్మటంలా ఉన్న స్టేషన్ లోపలి వైపుకి దారితీస్తూ… అతను “వేడిగా టీ ఏమైనా తాగుతారా? కాస్త స్నాక్స్ ఏవైనా తింటారా?” అని అడిగాడు. అక్కడ స్నాక్స్ మరియు కాఫీ మరియు టీ డిస్బర్సింగ్ యంత్రంతో ఒక చిన్న ఫలహారశాల ఉంది.  అక్కడున్న ఓ ముగ్గురు – నలుగురు సందర్శకులకు నీలం-నలుపు లోహపు చర్మంతో ఉన్న ఓ రోబో స్నాక్స్, టీ అందిస్తోంది. పొడవాటి చెవులు, తలపై యాంటెన్నాలను చూస్తుంటే ఆ రోబో చంద్ర గ్రహానికి చెందినదే అని తెలుస్తోంది.

“రండి హనీ రండి! కూర్చోండి. మీరంతా అలసి పోయి ఉంటారు. మా రైళ్లు వేగవంతమైనవే అయినా అన్నింటికన్నా సుదీర్ఘ దూరం నడుస్తాయి.” అన్నాడతను.

ధన్యవాదాలు అంటూ గొణిగి, మేమంతా ఓ బల్ల చుట్టూ కూర్చున్నాం. మా సామాన్లను అతని సిబ్బంది మోసుకొచ్చి లోపల పెట్టారు.

“మీ సామాన్లని క్లోక్ రూమ్‌లోనే ఉంచమని కోరుతున్నాను. ప్రయాణం చేయడానికి మేమందించే రోవర్ క్రాఫ్ట్ ఉపయోగించండి. అక్షాంశాల వివరాలు అందిస్తాం. ఆహారం మరియు నీరు ఒక వారం పాటు సరిపోతాయి. మీరు తిరిగి వెళ్ళడానికి కనీసం ఐదు రోజులు ముందు ఇక్కడకి చేరుకుంటే బావుంటుంది. మీరు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు, అక్సీజన్ నింపుకోవచ్చు, ఇతర పదార్థాలన్నీ సమకూర్చుకుని వెనక్కి మళ్ళవచ్చు” అని చెబుతూ అతను సానుభూతితో నవ్వాడు.

“అక్కడంతా చీకటిగా, చల్లగా ఉంటుంది. చాలా తక్కువ గురుత్వాకర్షణ ఉంది. ఎప్పుడూ ఉల్కాపాతం జరుగుతునే ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటున్న చోట ఉన్న అగ్నిపర్వతం ఎప్పుడైనా బద్దలవ్వచ్చు. అయిన ఫెన్ ఎటర్నల్ మౌంటెన్ అనే ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం సమీపంలోని మరియా అనే ప్రాంతంలో సంకేతాలు బలంగా ఉన్నాయి. ఆ దుష్టులు అక్కడే ఉన్నారు. “

“ఇక్కడి నుంచి ఎంత దూరం?” డిమిట్రీ అడిగింది.. తెలివిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపేలా.

“450 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మా బృందాలు అక్కడికి వెళ్ళాయి, కానీ సౌర వ్యవస్థ వెలుపలి గ్రహాలకు చెందిన ఈ దుష్టులు ఎక్కువగా అదృశ్యరూపంలో తిరుగుతుంటారు. వారు అక్కడే ఉన్నారు కానీ కనిపించరు.”

“కానీ మీరెందుకు వాళ్ళని చూడలేరు?” ప్రకృతి అడిగింది. “లూనార్ పారానార్మల్ మంత్రిత్వ శాఖ తగినంత అధునాతనంగా లేదా?” అంది.

రక్షణాత్మక ముసుగు ధరించి ఉన్న మంత్రిత్వ శాఖ అధికారి ముసుగులోంచే నవ్వాడు. ముసుగుని తొలగించాడు. “ఇక్కడ ముసుగు అవసరం లేదు. ఫలహారశాలలో పీడనం ఉంది, చూశారుగా..” అన్నాడు ఏకస్వరంలో. అలా చెప్పడం చాలా అనుభవజ్ఞుడైన, అలసటతో ఉన్న వయోధిక ప్రభుత్వ పరిశోధకుడికి మాత్రమే సాధ్యమవుతుంది.

“నా పేరు ‘విన్‌స్కీ’. నేను 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. దుష్టులను… అదే మీరు అనే చెడ్డ పిసియుఎఫ్‌లను వెతికి పట్టుకుని నాశనం చేస్తున్నాను. వాళ్ళల్లో అనేక రకాల వాళ్ళున్నారు, శక్తివంతమైన, దుష్టులు, ఎగరగలిగే సామర్థ్యం ఉన్న వారు, ఆక్సీజన అవసరం లేని వాళ్ళు, ఆల్ఫా సెంటారి వ్యవస్థ యొక్క జన్యుపరివర్తన జరిగినవాళ్ళు, 100,000 కంటే ఎక్కువ నక్షత్రాల స్థాయి ఉన్న మాంత్రికులు… ఏ ఆకారంలోని ఏ వస్తువులనైనా సృష్టించగలిగిన వాళ్ళు, చీకటిలోనూ చూడగలిగినవాళ్ళు. కణ పదార్థం, జన్యువులను పొందడానికి మానవులను తినే వారు… ఉన్నారు. ఇదంతా చాలా వికృతమైనది. విసుగు కలిగించేది, మార్మికమైనది. దాచబడి ఉంటుంది, నిగూఢమైనది, వివరాలు వెల్లడించబడనిది. ఆ దుష్ట శక్తులు నాగరిక మానవ కాలనీలపై దాడి చేస్తున్నారు. దౌష్ట్యం వారి భాష.. వాళ్ళ శక్తి చెడ్డది. వారి ఉద్దేశాలేమిటో తెలియవు. వాళ్ళంతా ఐకమత్యంగా ఉండి కొన్నిసార్లు గెలుస్తున్నారు. కొన్నిసార్లు వాళ్ళ సామ్రాజ్యాలు ఒక శతాబ్దం లేదా రెండు శతాబ్దాల పాటు కొనసాగాయి, అరుణ భూములలో లాగా వాళ్ళు స్థిరపడి శాంతియుతంగా ధ్యానం చేయటం, సమాజాన్ని ఏర్పరుచుకోవడం వంటివి చేశారు. ఉన్నట్టుండి ఒక్కోసారి ఏదో జరుగుతుంది, వారు ఏ కారణం లేకుండా ఇతర కాలనీపై దాడులు ప్రారంభిస్తారు. వారు రహస్యంగా అన్ని గ్రహాలకి ప్రయాణిస్తారు. వారికి మంత్రివర్గాలలోనూ, కస్టమ్స్ లోనూ, స్పేస్ ప్లాట్‌ఫాంల మీద, ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలోనూ ఏజెంట్లు ఉంటారు. వారికి టెలిపతీ ద్వారా భావప్రసారం చేయగలిగే శక్తి ఉంది. బలహీన మనస్కులని గుర్తించి కలలు లేదా మానసిక సంకేతాల ద్వారా లొంగదీసుకుని వాళ్ళతో తమ పనులు చేయించుకుంటారు. కాబట్టి నిరంతర నిఘా ఒక్కటే మనల్ని కాపాడగలదు. శాస్త్రీయ ఆధారాల గురించి నేను ఆలోచించడం మానేశాను, ప్రశ్నించడం ఆపేశాను.

…వచ్చిన సమస్యను వచ్చినట్టు స్వీకరించండి. ఎదుర్కోండి. పరిష్కరించండి. కాని రహస్యంగా ఉంచండి. ఎందుకంటే కాలనీ యొక్క ప్రధాన నాగరికత, ప్రశాంతత చెదిరిపోకూడదు… “

మేమంతా నిశ్శబ్దంగా ఉండిపోయాం. విషయాలన్నీ నాకు అవగతమవుతున్నాయి.

నేనో సాధారణ మానవుడిని, ఒక పిసియుఎఫ్‌ని. వీటన్నిటిని ఎదుర్కోవాల్సి వస్తోంది.

చాంద్ అన్నాడు: “వాళ్ళంతా ఇగ్లూ వంటి ఆకారంలో ఉన్న ఇంట్లో ఉన్నారని అనుకుందాం. మా నాయకుడు హనీ స్వప్నంపై మేము ఆధారపడి ఉన్నాం. ఆల్ఫా వ్యవస్థ నుండి వచ్చిన ఈ దుష్టశక్తుల బృందం – అరుణ భూముల ముసలి బలహీన చక్రవర్తి సమూరాకి ‘మిర్రర్ ఆఫ్ కమ్యూనికేషన్’ వెతకడంలో సహాయం చేస్తున్నాయని అనుకుందాం. అదొక విషయంలోనే కాదు, అన్ని విషయాలలోనూ వాళ్ళు సమూరాకి సాయం చేస్తుండవచ్చు! స్వచ్ఛమైన మరియు నిస్వార్థ‌మైన పిసియుఎఫ్ మాత్రమే దానిని కనుగొనగలడు. సర్… ఇవన్నీ మీకు కూడా తెలుసు కదా…”

“అవును! అవును! ఇప్పుడు ఈ మిషన్ కోసమే భూగ్రహానికి చెందిన హనీ ఆమ్రపాలిని నియమించారు. ఇతను అక్కడికి వెళ్లినట్లయితే… వారు ‘మిర్రర్ ఆఫ్ కమ్యూనికేషన్’ని కనుగొనటానికీ, తమ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఇతన్ని పట్టుకుంటారు. ఇదంతా నాకు తెలుసు. అనుభవజ్ఞులైన మాంత్రికుల సంఘం, అద్భుత వస్తువులు, ఎన్‌సైక్లోపెడియా, వగైరా వగైరా… ఏదైనా సరే నాకు అనవసరం. మీరు మిషన్ పై అక్కడికి వెళ్తారని నాకు తెలుసు. వారిని పట్టుకోండి, చంపండి లేదా చావండి లేదా విశ్వశక్తి యొక్క జాలంలో చిక్కుకుపొండి. పదార్థం అనేది విశ్వమంతటా ఒకటే. ఇదే మంచీ, చెడులుగా జీవుల్లోకి ఘనీభవిస్తుంది. అవును. ఇక్కడ హనీ, ప్రకృతి ఉండడం మంచిదే… వారు సాధించగలరు. కానీ నాకు తెలియదు… నేను దీనికన్నా దారుణమైన విషయాలను చూశాను. ఆల్ఫా వ్యవస్థకి చెందిన దుష్ట, జన్యు పరివర్తన చేయబడిన తాంత్రికులు భయంకరమైన శక్తులు కలిగి ఉన్నారు. వాళ్ళ రుచులు భిన్నమైనవి. వారు శక్తుల కోసం.. అక్షరాలా.. మిమ్మల్ని తింటారు. ఒకసారి మీరు చంద్రుడి చీకటి వైపు వెళితే, పాపం.. మీ శరీరాలు మిగలవని భావిస్తున్నాను. మీ ఆత్మలు మాత్రమే ఉంటాయి.

ఆపై  పిసియుఎఫ్‌ల ఆత్మలను దుష్ట శక్తులు పీల్చుకుంటాయి. అక్కడికి వెళితే మీరు నాశనమవుతారు. అక్కడ ఉంటే మీరు బాధపడతారు. కానీ ఈ పని మీరు చేయాలని మంత్రిత్వశాఖ ఆశిస్తోంది. ఏదో సామెత చెప్పినట్టు ఇదంతా గందరగోళంగా ఉంది.”

“ముందు నుయ్యి… వెనుక గొయ్యి” అంటూ వాన్ కు జాక్ సంభాషణలో జోక్యం చేసుకున్నాడు. “చీకటి వైపు ఉన్న మరియాకీ.. ప్రకాశవంతమైన ప్రశాంత సముద్రానికి మధ్య…” అన్నాడు.

“మీరు సులువుగా మోసపోతారు! కుజ, చంద్ర, భూగ్రహాల నుంచి వచ్చిన నా మిత్రులారా! మీరు అక్కడికి వెళతారు, ఎందుకంటే మీరో గొప్ప మిషన్‌లో ఉన్నారు. మీరు ఉన్నతులనీ, స్వచ్ఛమైన వారని మిమ్మల్ని ఎంపిక జేసి ఇక్కడికి పంపింది ఎర్త్ కౌన్సిల్. హాహ్హహ… హాహ్హహ.. ఇప్పటికి మూడు జట్లు వెళ్లి విఫలమయ్యాయి, వాళ్ళంతా మరణించారు. ఇప్పుడు మీ వంతు”.

విన్‌స్కీ, ముసలి చంద్రగ్రహవాసి అకస్మాత్తుగా దుష్టునిలాగా నవ్వసాగాడు. ఆ గదిలో సాధారణ ధ్వనులు, మామూలు సంభాషణలు మాత్రమే ఉండటం వలన ఆ నవ్వు… పీడనం నిండిన ఆ గదిలో ప్రతిధ్వనించింది.

కానీ అది భయంకరమైన నిశ్శబ్దం. వెలుపలంతా శూన్యం, చీకటి వైపు కూడా శూన్యమే. వెలుపల చంద్రదృశ్యం బయట కూడా శూన్యమే. హెల్మెట్లలో ఉన్న హెడ్ ఫోన్ల ద్వారా మాత్రమే సంభాషణలు జరుపగలం.

కానీ – మేమంతా మూర్ఖులమనీ, ఖచ్చితంగా నశించబోతున్నామని తెలిసినవాడిలా విన్‌స్కీ నవ్వుతూనే ఉన్నాడు.

అధ్యాయం 18: లా డెర్నియర్ స్టేషన్

లా డెర్నియర్ స్టేషన్ బయట వాతావరణం బూడిదరంగులో, నిర్జీవంగా నిర్జనంగా ఉంది. దూరంగా మాకు దట్టమైన కొండలు, పలచని నారింజ రంగుతో ప్రకాశిస్తున్న కొన్ని ప్రకృతి దృశ్యాలు కనబడుతున్నాయి. వాటి దిగువన మైదానంలో బిలాలు గోచరించాయి.

మా ప్రయాత్నాన్ని విమర్శించినప్పటికీ, విన్‌స్కీ వచ్చి మాకు వీడ్కోలు చెప్పాడు. చంద్రుని ఉపరితలం మీద ప్రయాణించటానికి అవసరమయ్యే అన్ని గాడ్జెట్లను అతను మాకు ఖచ్చితంగా అందించాడు.

ఏడురోజుల పాటు నడిచే రోవర్లను ఇంధనం, శక్తిలతో నింపాడు. గ్రావిటి స్యూట్స్, హెల్మెట్లు, బ్యాక్‍సాక్‌లో ఆక్సిజన్ సిలిండర్, ఫ్రోజెన్ బిస్కెట్లు, ప్రోటీన్ డైట్ చిక్కుళ్ళు, మంచినీళ్ళు అందజేశాడు. ముఖ్యంగా హెల్మెట్‌లకి కమ్యూనికేషన్ హెడ్‌సెట్స్ అమర్చాడు. జియో పొజీషనింగ్ సిస్టమ్ పరికరాలను మా సూట్లు, శిరస్త్రాణాలు, ఇతర శరీర భాగాలలో అమర్చాడు.

“మీరు చనిపోయినా లేదా ముక్కలుగా పేలినట్లయినా, మేము మిమ్మల్ని కనుగొని, తీసుకురాగలం” విన్‌స్కీ హాస్యమాడాడు.  అతని మాటలు ఇప్పుడు భయంకరంగా ఉన్నాయి, భీతి కల్పిస్తున్నాయి.

డిమిట్రీ కళ్ళలోండి నీలం రంగు కిరణం వెలువడి విన్‌స్కీ వైపు కదిలింది. అది విన్‍స్కీ ముఖాన్ని వెంట్రుకవాసిలో దాటిపోయింది. నీలి కిరణం వెళ్లి స్టేషన్ కిటికీలోని ఒక గాజు పలకపై పడి, రంధ్రం చేసింది.

రంధ్రం నుండి నెమ్మదిగా తెల్లని పొగ వెలువడింది.

మృత్యుభయంతో విన్‌స్కీ గావుకేక పెట్టాడు. వద్దు వద్దన్నట్టుగా చేతులను తిప్పాడు.

“నా ఒక్కదాని శక్తికే ఇది నిదర్శనం. నీలాంటి మూర్ఖులు మాటలతో నన్ను రెచ్చగొడితే జరిగేదిదే. నాకు నిజంగా కోపం వచ్చి, నేను చంపదలచుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు” అంది డిమిట్రీ క్రోధంతో బుసలు కొడుతూ. ఆమె తలపై యాంటెన్నాలో ఒన్న దీపం ఎరుపు రంగులో వెలిగిపోతోంది.

“ఓహ్! క్షమించాలి! మీకు శుభాకాంక్షలు. మీ ప్రయాణం సుఖంగా సాగాలి” అని మాకు వీడ్కోలు పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

“శభాష్ డిమిట్రి! అతనికి తిక్క కుదిరింది!” అరిచారు వాన్ కు జాక్, చాంద్.

మెచ్చుకుంటున్నట్టు కూతబెట్టాడు ఏనిమాయిడ్.

“సరే. బయల్దేరుదాం. ఒక్కొక్కరు వాహనాలెక్కండి. శోధన కోసం ఇదిగో కోఆర్డినేట్లు” అంటూ నిగూఢమైన గ్రహాంతరవాసులను గుర్తించడానికి వారికి నేను వాటిని చంద్రుడి అక్షాంశాలు, రేఖాంశాలను చూపించాను.

చంద్రుడి “ఇగ్లూ” హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేట్లని నేను ఉంచుకున్నాను, మిగతావాళ్ళు అన్ని దిశల కోఆర్డినేట్లను పొందారు. వ్యాసార్థం సుమారు 1000 కిలోమీటర్లు.

ఇక మా రోవర్ చంద్రుడి యొక్క చీకటి వైపు ప్రయాణమైంది. మా రోవర్ వెనుక ఆకాశంలో బూడిదలాంటి నీలం రంగు ధూళిమేఘం మరియు పొగ యొక్క కనబడ్డాయి.

చంద్రుడి యొక్క ప్రకాశవంతమైన వైపున సూర్యుడు అస్తమిస్తున్నాడు. తూర్పున పెద్దగా కనిపిస్తున్న భూగ్రహంలో నీలం రంగులో ఉన్న సగం ప్రకాశవంతమైన వైపున కనబడింది. చంద్రుడి ఆకాశంలో లక్షలాది నక్షత్రాలు ప్రకాశిస్తుంటే – చీకటి ఆకాశం ఒక పండుగలా వెలిగిపోయింది.

***

నా తెలివైన రోబో యు7776 గురించి చెప్పడం మర్చిపోయాను. మిగతా అందరూ తమ తమ రోవర్లలో వాళ్ళి కేటాయించిన దిశలలో వెళ్ళిపోయారు. నేనూ ప్రకృతి పక్కపక్కనే నిలుచున్నాము.

మేము కలిసి ఉండకూడదని చెప్పనవసరం లేదు. మాలో ప్రతి ఒక్కరం తమకు కేటాయించిన ప్రాంతంలో గ్రహాంతర దుష్టమాంత్రికులను గుర్తించాల్సి ఉంది.

ప్రకృతికి ఒక రోవర్, నాకొక రోవర్ ఉన్నాయి. తన స్యూట్‌కేస్‌లో దాచిపెట్టిన ఒక బ్యాగ్‌ని బయటకి తీసి నాకు ఇచ్చింది.

అది ఒక పెద్ద నీలి రంగు బ్యాగ్. దాంట్లో నా రోబో యురేకస్‌ని విడదీసి, వేరుచేసిన యాంత్రిక భాగాలు మరియు మరలు ఉన్నాయి.

మరో క్షణంలో మేమిద్దరం మరతలో భాగాలని బిగించాం, జెల్ పూసాము, రోబో వెనుక భాగంలో న్యూక్లియర్ బ్యాటరీ అమర్చాం. పవర్ స్విచ్ ఆన్ చేశాము.

రోబో కళ్ళు మెరిసాయి, ఐదు అడుగుల పొడవైన యు7776 క్రియాశీలకమైంది.

“శుభోదయం మాస్టర్ హనీ! చంద్రుని మధ్యలో అక్షాంశం 00 మరియు రేఖాంశం 1800.  యురేకస్ 7776 మీకు రిపోర్ట్ చేస్తోంది. నేను అరుణ భూముల సామ్రాజ్యం శాస్త్రవేత్తలు రూపొందించిన 7వ తరం మారిటన్ రోబోలకు చెందినదాన్ని. మార్స్ చక్రవర్తి మీకు బహుమతిగా ఇచ్చిన రోబోని.  నేను మీ స్వర ఆదేశాలను తీసుకొని, డేటాను నిల్వ చేసి మీకు తార్కిక సమాచారం అందిస్తాను, మీకు మాత్రమే అందిస్తాను. మీరే భూగ్రహానికి చెందిన యొక్క హనీ ఆమ్రపాలి. మీ స్వరాన్ని నేను గుర్తించాలి. దయచేసి, అవును అని చెప్పండి!”

“అవును” అన్నాను. ఇది రోబోని స్విచ్ ఆఫ్ చేసినప్పుడు జరిగే ఓ క్రమం. ఎప్పుడో తప్ప ఇలా జరగదు.

చంద్ర ప్రభుత్వంలోని – పారానార్మల్ దళాలకు వ్యతిరేకంగా పోరాడే మంత్రిత్వ శాఖ – వారికి మాత్రమే తెలిసిన ఉత్తమ కారణాల వల్ల మాతో యు7776 ని తీసుకువెళ్ళడాన్ని నిషేధించించారు. అయినా నేను ప్రకృతితో చర్చించాను. మా పనిలో మాకు సహాయపడటానికి దాన్ని అక్రమ రవాణా చేయగలిగాం.

“మీ స్వరాన్ని గుర్తించాను మాస్టర్! ఇక ఆదేశాలివ్వండి!” అంది ఎప్పుడూ విధేయంగా ఉండే రోబో.

నేను మా మిషన్ యొక్క వివరాలను, చంద్రుడి యొక్క చీకటి వైపు యొక్క కోఆర్డినేట్లు ఇచ్చాను. దాన్ని నా మౌఖిక ఆదేశాలకు ప్రోగ్రామ్ చేసాను. నాకు తప్ప వేరెవరికీ కనిపించకుండా ఉండేలా, దాని శరీరంలో అతి తక్కువ విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉండేలా ప్రోగ్రామ్ చేశాను. అందువల్ల అది చంద్ర ప్రభుత్వం వారి నిఘా విభాగపు ఏ ట్రాకింగ్ వ్యవస్థకి దొరకదు. మంత్రిత్వ శాఖకి చెందిన విన్‌స్కీ రోబోని తీసుకెళ్ళేందుకు ఎందుకు అభ్యంతరం చెప్పాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.

కానీ నాకు అది అవసరం. అది అమూల్యమైనది.

“మాస్టర్, అర్థం చేసుకోండి! చంద్రుడి యొక్క కేంద్ర భాగానికి మీరిచ్చిన కోఆర్డినేట్లు సరిపోతాయి, బహుశా ఇది ‘మరియా సముద్రం’ కావచ్చు. నేను ఇప్పటికే ఈ రేఖాంశంపై తనిఖీ జరిపాను. గ్రహాంతర దుష్ట మాంత్రికుల విద్యుదాయస్కాంత వికిరణాలున్నాయి, వాటిని చంద్ర ప్రభుత్వంలోని – పారానార్మల్ దళాలకు వ్యతిరేకంగా పోరాడే మంత్రిత్వ శాఖ గుర్తించింది.”

“ఎలా?” అడిగాను. “రహస్య సమాచారాన్ని నువ్వెలా సంపాదించావు?”

సంతృప్తితో కూడిన యాంత్రిక మూలుగులు యురేకస్ నుండి వెలువడ్దాయి.

“ఓ మిలియన్ మేళవింపులను ప్రయత్నించి వాళ్ళ పాస్‌వర్డ్ పట్టుకున్నాను. మంత్రిత్వశాఖ వారి ఆర్కైవ్‌లో మ్యాపింగ్ సమాచారం – ‘చంద్రుడిపై గ్రహాంతర విద్యుదయస్కాంత సంకేతాలు’ అని ఉంది. కొన్ని క్షణాలు ఆపి, మళ్ళీ చెప్పసాగింది యురేకస్ “మీరు ఆశ్చర్యపోతారు మాస్టర్ హనీ, ఆ పాస్‌వర్డ్ ‘EmpREDPLAIN’.

ఇప్పుడు ఇది నాకు మరీ విస్తుగొల్పింది. ఇలాంటి పాస్‌వర్డ్‌ని వారెలా ఉపయోగించగలరు! ఇది మార్స్‌లోని రెడ్ ప్లెయిన్స్ చక్రవర్తిని… సమూరాని సూచిస్తోంది. అంటే తమ శక్తులను తిరిగి పొండడానికి ప్రయత్నిస్తున్న వృద్ధ తాంత్రిక చక్రవర్తి సమూరా గురించి వాళ్ళకి తెలుసన్న మాట!  ఆ రేడియో ధార్మికత అతని నుండి వచ్చినదేనని సూచించారు.

లేదా… సమూరా కోసం పనిచేసే గూఢచారి చంద్ర ప్రభుత్వపు మంత్రిత్వశాఖలో కూడా ఉన్నాడా? పాస్‌వర్డ్‌లు ఒక వ్యక్తి యొక్క ఉపచేతన భావనను, ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి యొక్క ఇష్టాన్ని బహిర్గతం చేస్తాయి. ఈ పాస్‌వర్డ్ ద్వారా చక్రవర్తి, అరుణ భూముల పట్ల గౌరవం స్పష్టంగా వెల్లడవుతోంది. లేదా నేను మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నానా?

“సరే! మనిద్దరం ఈ ప్రదేశానికి రోవర్లో ప్రయాణిద్దాం. కాస్త దూరంలో ఉంటూ ప్రకృతి మనలని వెంబడిస్తుంది. ఆమె లేజర్ గన్, విశ్వశక్తితో నాకు ఏ ప్రమాదం లేదా నాపై దాడి జరగకుండా నాకు రక్షణగా ఉంటుంది.”

వాన్ కుక్ జాక్, యానిమోయిడ్ మరియు చాంద్ వరుసగా ఉత్తర, దక్షిణ మరియు ఆగ్నేయ దిశలలో వెళ్లారు. మా వద్ద కమ్యూనికేషన్ పరికరాలు ఉన్నాయి. వారి కోఆర్డినేట్లు, లూనార్ పొజిషనింగ్ ట్రాకింగ్ సిస్టమ్ నంబర్లు నాకు తెలుసు. వాటిని నేను రోబోలోకి ఎక్కించాను.

ఈ విధంగా నేను జట్టు సభ్యులతోనూ సంప్రదింపులలో ఉంటాను. వారి స్థానాలను తెలుసుకుంటూ ఉంటాను. ఏ ప్రమాదం జరగకుండా యురేకస్ నన్ను అప్రమత్తం చేస్తుంది, ఎప్పటికప్పుడు వాటిని విశ్లేషిస్తుంది.

అప్పుడు మేం చంద్రుని చీకటి వైపుకి మా యాత్రను ప్రారంభించాలి. మేం ప్రారంభించిన చోట మందమైన కాంతి ఉంది.  ఉపరితలం పై ఎగిరే రోవర్ క్రాఫ్ట్‌ని ఆన్ చేయగానే చీకటి తీవ్రమైంది. గాలి వేగం ఉధృతమైంది. ఆకస్మికంగా ఉల్కలు రాలుతూ మా దృష్టికి ఆటంకం కలిగించాయి.

ప్రయాణం కఠినమైనది. శిలలు వానలా కురుస్తున్నాయి. గాలి అధిక వేగంతో ఉంది కానీ వింత ఏమిటంటే నేను శబ్దాన్ని వినలేకపోయాను.

ఇటువంటి పరిస్థితుల్లో నావిగేట్ చేయడం ఎంతో కఠినమైన పని. కానీ యురేకస్ దాన్ని సులభతరం చేసింది.

“మాస్టర్! భయపడవద్దు. ముందుకి వెళ్ళండి. త్వరలో ఇదంతా ఆగిపోతుంది” అని చెప్పింది. నా ఆందోళన తెలుసుకున్నట్టుగా, “ప్రకృతి గారు 5 కిలోమీటర్ల వెనుక ఉన్నారు, ఆమె మిమ్మల్ని అనుసరిస్తున్నారు, సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉన్నారు” చెప్పింది యురేకస్.

మా గమ్యస్థానం ఆ ఇగ్లూ! ఆల్ఫా వ్యవస్థకి చెందిన గ్రహాంతరవాసుల ప్రధాన కార్యాలయం! సమూరా దాగి ఉన్నాడని భావిస్తున్న స్థలం! ఇక్కడికి చేరడానికి మాకున్న సమయం కేవలం కొద్ది చంద్ర రోజులే.  ఆక్సీజన్, ఆహారం అయిపోవడానికి ముందే వాళ్ళ ఉనికి తెలుసుకోవాలి.

‘ఆ అద్దం ఎక్కడ ఉండి ఉంటుంది? ఎందుకు వాళ్ళు చీకటి వైపున దాక్కున్నారు?’ ఆలోచిస్తూ నేను పైకే అనేశాను.

మిర్రర్ ఆఫ్ కమ్యూనికేషన్‌ని ఎక్కడైనా దాచి ఉండవచ్చు కానీ వారు ఇక్కడ వచ్చిన కారణం అది మాత్రమే కాదు. కోల్పోయిన గ్రహాలను, రెడ్ ప్లెయిన్స్ తిరిగి జయించటమనేది వారి ఆశయం. వారు చంద్రునిపై విద్యుత్ వ్యవస్థలను విధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తారు, దానిని నిర్వీర్యం చేసి జయిస్తారు.

“ఎలా? హాస్యాస్పదం! కొంతమంది ముసలి పిసియుఎఫ్‍లు చంద్రుడి కాలనీలను ఎలా జయిస్తారు?”

“సౌర విద్యుత్ కేంద్రం చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఆర్బిటింగ్ ప్యానెల్‌లో ఉంది. అందులో ఒకటి పాడయినా, మొత్తం చంద్ర విద్యుత్ శక్తి దెబ్బతింటుంది. అప్పుడు ప్రభుత్వంలో కీలక హోదాలలో  ఉండి నిద్రాణంగా ఉన్న గూఢచారులు తిరుగుబాటును ప్రకటిస్తారు. ప్రభుత్వాలను అస్థిరపరుస్తారు. చంద్రుని చక్రవర్తిగా సమారాను ఆహ్వానించవచ్చు.”

“ఎంత చోద్యం? ఇదంతా ఎలా జరుగుతుంది? “

“విద్యుత్ శక్తి పునరుద్ధరణకు బదులుగా! విద్యుచ్ఛక్తి లేకుండా కాలనీలు కొన్ని రోజులు మాత్రమే మనుగడలో ఉంటాయి. మాస్టర్, నా తర్కానికి ఈ అవకాశం ఉందనిపిస్తోంది. అయితే ఇది ఒక్కటే కాదు!”

మేము ముందుకు దూసుకుపోతున్నాం. నా మనస్సు కూడా వేగంగా ఆలోచిస్తున్నది. రోబో యొక్క తర్కం నిజమైనదే అయితే, విశ్వవ్యాప్త సంభాషణకు హామీ ఇచ్చే తాంత్రికుల పురాతన అద్దం ఓ అసంబద్ధమైన, మూర్ఖపు వస్తువు అని అనిపించింది. ఆ మాటకొస్తే, శక్తులు గల వెండి కొవ్వొత్తి కూడా ఇంతే… కానీ శక్తి సామర్థ్యాలకి నేను ప్రత్యక్ష సాక్షిని!

కానీ మరిన్ని అధికారాలు పొందడం ద్వారా సమారా ఏం సాధిస్తాడు? ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడానికి అతను ఆయుధాలు, సైన్యాలు మరియు పూర్తి రాజకీయ వ్యవస్థలను పట్టుకోవాలి. అమృత ఔషధాలు, అద్దాలు, కొవ్వొత్తులు, మంత్రదండాల వంటి ఈ ఏడు వస్తువులు ఈ ప్రయోజనం సాధించలేవు.

లేదా దుష్ట గ్రహాంతరవాసులు సమూరకి ఎరవేసి తమ ప్రభావంలోకి లాక్కునే వ్యూహం ఉందా? అతనిలో ఉన్న పురాతన మాంత్రికుడికి ‘విశ్వశక్తి’ యొక్క ప్రామాణికమైన నియంత్రణతో అద్భుత వస్తువుల ద్వారా అధికారాలను తిరిగి పొందాలనుకుంటున్నారు. కానీ తెలివితేటలలో సమూరా కన్నా అధికులైన దుష్ట గ్రహాంతరవాసులు ఒక సామ్రాజ్యం సృష్టించడం కోసం – ఈ సాధారణ వస్తువులు పొందడానికి సమూరాని ఆకర్షించడం ద్వారా – అతనిని ఉపయోగించుకోవచ్చు.

ఇప్పుడు చంద్రునిపై ఆర్బిటింగ్ పానెల్స్‌తో కూడిన విద్యుత్ వ్యవస్థ ఉంది, ధ్రువాల వద్ద ఉండే శాశ్వత ప్రకాశం నుండి విద్యుత్ శక్తిని పొందుతోంది. చంద్రునిపై ఉన్న అన్ని వ్యవస్థలు… వాటర్ ప్లాంట్, రైల్వేలు, ఇతర దేశీయ వ్యవస్థలకు విద్యుచ్ఛక్తి అవసరం. విద్యుచ్ఛక్తి వ్యవస్థలపై అదుపు సాధిస్తే, ఎవరైనా చంద్రుడిని నియంత్రించవచ్చు.

ప్రభుత్వంలో కీలక పదవులలో రహస్య గూఢచారులను నియమించుకోడం ద్వారా రాజకీయ వ్యవస్థపై పట్టు సాధించవచ్చు.

ఇలా నా ఆలోచనలు నా మెదడులో తిరుగుతున్నాయి. రోవర్ వేగం పెంచుకుంటోంది, ఒక గంట సేపు ప్రయాణించాం.

అప్పుడు హఠాత్తుగా రోబో హెచ్చరిస్తూ కేక పెట్టింది.

“మాస్టర్! ప్రమాదం! ముందుకు వెళ్ళద్దు! పక్కకు తిప్పండి. కేవలం సెకన్ల సమయమే మిగిలింది…”

అంతే, కొన్ని క్షణాల్లో నల్లని సర్పిలాకారపు శిలావర్షం కురిసింది. నా రోవర్‌పై పిడుగు పడింది.

రోవర్‌ని నేను సకాలంలో ఆపలేకపోయాను.

విపరీతమైన శక్తితో పేలుడు సంభవించింది, నా తల దేనినో గుద్దుకుంది. నేను స్పృహ కోల్పోయాను. చైత్యన్యం కోల్పోయే ముందు నా కళ్ళ ముందు నక్షత్రాలు కనిపించాయి. నేను వాహనం నుండి పడిపోయాను. చెవులు అదిరిపోయేలా వెలువడ్డ ఆ ధ్వని ప్రభావానికి నా రోబో కూడా ముక్కలై పోయి ఉంటుందని అనుకున్నాను.

చివరి క్షణాలలో వెనుక రోవర్లో వస్తున్న ప్రకృతి గురించి ఆలోచించాను. “దేవుడా! ఆమెను రక్షించు!”…. ఇదే నా చివరి ప్రార్థన.

(సశేషం)

Exit mobile version