Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శివరాజు సుబ్బలక్ష్మి శతజయంతి సభ – నివేదిక

[శివరాజు సుబ్బలక్ష్మి శతజయంతి సభ – నివేదిక అందిస్తున్నారు శ్రీమతి వారణాసి నాగలక్ష్మి.]

హుముఖ ప్రజ్ఞాశాలి శివరాజు సుబ్బలక్ష్మిగారి శతజయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో 27.12.2025 తేదీన సాహిత్య అకాడెమీ ఏర్పాటు చేసిన సదస్సు, రఘు గారు వక్తలని వేదిక మీదికి ఆహ్వానించడంతో మొదలయింది. సదస్సుకి అధ్యక్షులు తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు, కీలకోపన్యాసకులు కాత్యాయనీ విద్మహే గారు. గౌరవ అతిథిగా ఆహ్వానితులైనవారు ద్రోణంరాజు బుచ్చివెంకట సుబ్బారావుగారు సుబ్బలక్ష్మి గారి కుమారుడు. ఆయన తన కుటుంబంతో బెంగుళూరు నుంచి వచ్చారు. వారి బంధువులు కొంతమంది వచ్చారు. తన స్వాగతోపన్యాసంతో మృణాళిని చుండూరు గారు మొదటి సెషన్ ప్రారంభిస్తూ ‘సుబ్బలక్ష్మిగారి గురించినవేవీ నేను మాట్లాడను, ఎందుకంటే ఆ పనికి వేరే వక్తలున్నారు’ అంటూ మృణాళినిగారు సాహిత్య అకాడమీలో సుబ్బలక్ష్మి గారి మీద మోనోగ్రాఫ్ తీసుకువద్దామంటే ఇతర సభ్యులు/అధికారులు ఆవిడకంత స్టేచర్ లేదనడం గురించి నొచ్చుకుంటూనే చెప్పారు. వందేళ్ల క్రితం స్త్రీలు సాహిత్యంలో అయినా ఇతర కళా క్రీడా రంగాల్లో అయినా తమ ప్రతిభ ప్రకటించుకోవాలంటే ఎంత కష్టం! అయినా ఒక రంగం కాకుండా సాహిత్యం, చిత్రలేఖనం రెండింటిలోనూ తన ప్రత్యేకతని రికార్డ్ చేసిన సుబ్బలక్ష్మి గారి గురించి అలాంటి అభిప్రాయం ఏర్పడిందంటే దానికి కారణాలేమిటో తెలుసుకోవలసిన అవసరం ఉంది. సరే కనీసం శతజయంతి సదస్సు అయినా ఏర్పాటు చేసినందుకు సంతోషం కలిగింది. అకాడెమీ తరఫున ఎందరో రచయితలకి చేసిన శతజయంతి సభలు ఇంతవరకు ఒక్క రచయిత్రికైనా జరిగినట్టు వినలేదు. ఇదే ప్రారంభమనుకుంటాను. సరే ఎప్పుడో ఒకప్పుడు మొదలంటూ అయిందని మళ్ళీ సంతోషం కలిగింది. నాకు ఇందులో పాల్గొనే అవకాశం కల్పించిన అకాడమీ వారికి మనసులో ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఈ శతజయంతి సదస్సులో పత్ర సమర్పణలకి ఎవరికీ ఏ సబ్జక్ట్ ఇవ్వాలనేది ఎలా నిర్ణయించుకున్నారో, ఇతర ఏర్పాట్లు ఎలా చేశారో చెప్పి, అన్ని ఏర్పాట్లలో శివరాజు వెంకట సుబ్బారావు గారి సహకారానికి ధన్యవాదాలు చెప్తూ ముగించారు. ఏనుగు నరసింహారెడ్డి గారు క్లుప్తంగా మాట్లాడాక కాత్యాయని గారు కీలకోపన్యాసం ఇచ్చారు. అందరికీ తెలిసిన విషయమే- మృణాళిని గారు, కాత్యాయనీ విద్మహే గారు ప్రసంగిస్తుంటే ఎంతసేపైనా అలా వింటూ ఉండిపోవచ్చు. వారి విశ్లేషణ, భాష, ప్రసంగపు శ్రావ్యత దేనికదే గొప్పగా ఉంటాయి. ఇక ఇద్దరూ వేదిక మీద ఉన్న కార్యక్రమం అంటే ఇంక చెప్పనక్కర్లేదు.

ముందుగా సుబ్బారావుగారు వారి అమ్మగారి గురించి మాట్లాడారు. ఆయన ప్రసంగం చతురోక్తులతో వాస్తవ సంఘటనలతో ఒక భార్యగా గృహిణిగా తల్లిగా ఆవిడ ఎలా ఉండేవారో చెప్తుంటే ఇలా ఆమె గురించి చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తిని పట్టుకుని ఈ సభకు తీసుకువచ్చిన మృణాళినిగారికి ధన్యవాదాలు చెప్పాలనిపించింది. ఈ సభకి వీరి ప్రసంగం highlight. తర్వాత కాత్యాయనిగారు మాట్లాడారు. ఆమె తన పీ.హెచ్.డి బుచ్చిబాబు గారి సాహిత్యం మీద చేశారు. పరిశోధనలో భాగంగా ఎన్నోసార్లు సుబ్బలక్ష్మి గారింటికి వెళ్లి ఆమెతో చాలా రోజులు గడిపారు. సుబ్బలక్ష్మిగారి ఆతిథ్యం, ఆమె ఇచ్చే కాఫీ, టిఫిన్లూ, భోజనాలూ, కమ్మని ఆదరపూర్వకమైన కబుర్లూ, బుచ్చిబాబుగారితో మమేకమైన ఆవిడ జీవితమూ అన్నిటి గురించీ కాత్యాయని గారు first person accountలో చెపుతుంటే ఒక్క పదం కూడా విడవకుండా వినాలనిపించింది. విషయమూ, చెప్పే విధానమూ, కంఠస్వరమూ, వక్త రూపమూ.. అన్నీ సొగసైనవే. నిన్నటి కార్యక్రమానికి ఆ ప్రసంగమే ప్రత్యేకాకర్షణ అనచ్చు. అది విన్నాక నాకైతే సుబ్బలక్ష్మి గారిని ప్రత్యక్షంగా కలుసుకుని, ఆమెతో కొంత సమయం ఆత్మీయంగా గడిపినట్టనిపించి మనసు నిండిపోయింది. Vote of thanks, సాహిత్య అకాడెమీ తెలుగు సలహా మండలి సభ్యులు రఘు గారు చెప్పారు.

తర్వాతి సెషన్ శీలా సుభద్రాదేవి గారి అధ్యక్షతన నడిచింది. సింగరాజు రమాదేవిగారు సుబ్బలక్ష్మిగారి నవలల మీద, మారుడి శామల గారు ఆవిడ కథల మీద చక్కని ప్రసంగాలు చేశారు. మహిళా సాహితీవేత్తల శత జయంతులు మోనోగ్రాఫ్ వెలువరించాల్సిన అవసరం మీద నిశ్శబ్దపోరాటం చేస్తున్న సుభద్రాదేవి గారు సుబ్బలక్ష్మి గారితో తన వ్యక్తిగత పరిచయం గురించీ, తన భర్త చిత్రాలతో ప్రచురించాలని ఆవిడ తలపెట్టిన ‘థింగ్స్ ఆఫ్ నేచర్’ పుస్తకంలో- సుబ్బలక్ష్మిగారి పెయింటింగ్స్ కూడా పొందుపరచాలని శీలా వీర్రాజుగారు చెప్పి ఒప్పించిన విషయం చెప్పారు. భర్తని అమితంగా ప్రేమించి, ఆయనే సర్వస్వంగా జీవించిన సుబ్బలక్ష్మి గారు తన కథలు, చిత్రాల గురించి కాత్యాయని గారికి కూడా చెప్పకుండా వదిలేసిన విషయం అంతకు ముందే కాత్యాయని గారు చెప్పారు. ఇది వినగానే శీలా వీర్రాజు, సుభద్రాదేవి దంపతుల వల్లే ఈ పుస్తకంలో సుబ్బలక్ష్మిగారి చిత్రాలు కూడా చేరి ఆ పుస్తకానికొక సమగ్రతనిచ్చాయని అర్ధమయింది.

ఈ సెషన్ తర్వాత భోజన విరామమిచ్చి రెండింటికి మూడవ సెషన్‌లో పి. జ్యోతి గారు మా జ్ఞాపకాలు వ్యాస మాలికలో సుబ్బలక్ష్మి గారు పంచుకున్న విషయాల మీద మాట్లాడుతూ వాటిలో వ్యక్తమైన ఆవిడ విశిష్ట వ్యక్తిత్వం గురించి ఎన్నో సూక్ష్మ విషయాలు వెల్లడించారు. చిత్రకారిణిగా శివరాజు సుబ్బలక్ష్మి అనే అంశం మీద నేను మాట్లాడాను.

ఒక రచయిత్రిగా, చిత్రకారిణిగా కన్నా ఒక తెలుగు వ్యక్తిగా, మహిళగా సుబ్బలక్ష్మిగారి గురించి మాట్లాడుతున్నందుకు నాకు కలిగిన సంతోషం గురించి చెప్పాక ఆమె బాల్యం, చిత్రలేఖనం గురించీ, ఆమె చిత్రకారిణి కావడం వల్ల సహజంగా ఆమె రచనల్లో తళుక్కుమనే భావ చిత్రాల గురించి మాట్లాడాను. వాస్తవానికి ఆమెని తలచుకోగానే నాకు ‘శతపత్ర సుందరి’ అనే పదబంధమే గుర్తొచ్చింది. ఆమెకీ పేరు వాడవచ్చా అనే అనుమానం వచ్చి కనుక్కుంటే,‘అనేక కోణాల్లో ప్రతిభ వికసించిన మహిళను; బాహ్య సౌందర్యం కన్నా అంత: సౌందర్యం, సంస్కారం, సృజనాత్మకతలతో వెలిగే స్త్రీని; తన జీవితం ద్వారా చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తి కలిగించే స్త్రీని ‘శతపత్ర సుందరి’ అని అనవచ్చని చెప్పారు. శివరాజు సుబ్బలక్ష్మిగారు, ఇవన్నీ అతికినట్టు సరిపోయే మహిళని మనకి తెలుసు. ఆమె విషయంలో ఈ వివరణకి ఒక్క సవరణ చేసి తీరాలి, ఆమెలో అంతః సౌందర్యం కన్నా బాహ్య సౌందర్యం తక్కువ అనలేం. ఆమె బాహ్య సౌందర్యమూ అద్భుతమే కదా!

సుబ్బారావుగారు చెప్పినదాన్ని బట్టి ఆవిడకి తల్లినుంచి సంగీత వారసత్వం, శిక్షణ కూడా లభించాయి. ఎంతటి అపురూప వ్యక్తి ఆవిడ! ఆవిడ చిత్రాల్లో నేను గమనించిన విశేషాలు, ఆ దంపతుల చిత్రాల మధ్య పోలికలూ వైవిధ్యాల గురించీ, వారి జీవితంలోని అపురూప సంఘటనల గురించీ నాకు తెలిసినంతవరకూ చెప్పి ముగించాను.

మొత్తంమీద కార్యక్రమం ఆద్యంతం రసవంతమై, ఆహ్లాదకరంగా ముగిసింది.

Exit mobile version