[అబ్బూరి ఛాయాదేవి గారు వ్రాసిన ‘బోన్సాయి బతుకు’ అనే కథ ఏం చెప్పింది, దాన్ని స్త్రీవాదులు ఎలా అర్థం చేసుకున్నారో విశ్లేషిస్తున్నారు శ్రీమతి శరచ్చంద్రిక.]
‘బోన్సాయి బతుకు’ కథను అబ్బూరి ఛాయాదేవి గారు 1974లో ‘కల్పన’ అనే మాస పత్రికకి ఈ కథ వ్రాసారు.
కథలో ముఖ్య పాత్రలు ఎవరు అంటే వయసులో పదేళ్ళ వ్యత్యాసం కలిగిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు.
కథా నేపథ్యం ఏంటంటే ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ళ మధ్య జరిగిన ఓ సంభాషణ.
కథా సన్నివేశము భారత రాజధాని ఢిల్లీలో జరుగుతుంది.
కథ ఉత్తమపురుష దృక్కోణంలో ఉంటుంది. రచనా శైలి చాలా సులువుగా ఆనాటి ఓ సామాన్య స్త్రీకి కూడా అర్థమయ్యేలా ఉంటుంది.
కథలోని అక్క పాత్ర పల్లెటూర్లో నివసిస్తూ ఉంటుంది. ఆవిడ పెద్దగా చదువుకోదు. ఎందుకంటే ఐదవ తరగతి తోటే చదువు మాన్పించి ఆవిడకి చిన్నప్పుడే పెళ్ళి చేసేస్తారు. బావగారు, అంటే ఆ అక్క భర్త చదువుకున్న వాడైనా కొన్ని ఆదర్శభావాలు కలిగినవాడు. అందువల్ల పల్లెటూరిలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతారు. ఆ విధంగా వాళ్ళు ఆ పల్లెటూరిలో జీవనం సాగిస్తూ ఉంటారు. చెల్లెలు అక్క కంటే ఓ పదేళ్ళు చిన్నది కావడం మూలాన కాలమాన పరిస్థితులు మారి, కాలేజీలో చదువుకుని, ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అక్క, ఆమె భర్త ఉత్తర భారత్లో ఉన్న కాశీ, హరిద్వారం తీర్థయాత్రకి వెళుతూ, పెళ్ళయి భర్తతో ఢిల్లీలో కాపురం చేస్తున్న చెల్లెలు ఇంటికి వస్తారు.
చెల్లెలు మాటల మధ్యలో ఉద్యోగము, ఇంటి పని రెండూ చేయడం కష్టమనిపించి ఉద్యోగం మానేయాలనిపిస్తుంది అని చెప్తుంది. కానీ అక్క అందుకు సమాధానంగా, ఆడవారు ఉద్యోగం చేస్తే ‘కరివేపాకు కొనుక్కోవాలన్నా దేహీ’ అంటూ మగవారి మీద ఆధార పడకుండా గడిచిపోతుంది అంటూ చెల్లెల్ని ఉద్యోగం మానివేసే ఆలోచనలు రానివ్వద్దని చెబుతుంది.
ఢిల్లీలో చెల్లెలి ఇంటిలో బాల్కనీ లోని కుండీలలో చెల్లెలు పెంచుతున్న బోన్సాయి మొక్కలని చూసి ఆశ్చర్యపోతుంది అక్క. ఇంతలో గాలివాన మొదలవుతుంది. ఆ వానకి బోన్సాయి చెట్లని కూడా చూరు కిందకి లాగుతుంది చెల్లెలు.
ఆ వానకి రోడ్డు మీద జనం పెద్ద తురాయి చెట్టు కింద సేదదీరటం చూపించి, ‘నీ బోన్సాయి చూడు. చూట్టానికి కుదురుగా ముచ్చటగానే ఉంది. సంసారపు స్త్రీలాగా. కానీ ఎంత సుకుమారమో చూడు. కాస్త తుఫానుకి కూడా తట్టుకోలేడు. తనే ఒకరి మీద ఆధారపడినప్పుడు మరొకరికి నీడ కూడా ఏమివ్వగలదు? మగవాడికి ఆడదానికి పెంపకంలో ఉన్న తేడా వల్లనే కదా ఆడదాని బ్రతుకు కూడా బోన్సాయిగా అయింది’ అని అంటుంది అక్క.
ఈ కథ తిరిగి ‘నాకు నచ్చిన నా కథ’ అన్న శీర్షికలో 2002లో, ఆంధ్రప్రభలో ప్రచురితమయింది.
కథ ముందు రచయిత్రి చెప్పిన వివరణ:
“మహావృక్షం కాదగిన చెట్టుని కళ పేరుతో చిన్న పూలకుండీలో పెంచడం చూడగానే, సంప్రదాయబద్ధంగా గృహానికి పరిమితం చేయబడిన స్త్రీల జీవితం గుర్తుకొచ్చింది. కుటుంబంలో ఆడపిల్లల పట్ల చూపిస్తున్న వివక్షని, స్త్రీల బానిస బతుకుల్ని సున్నితంగా, సహజంగా, సంక్షిప్తంగా చూపించాను ఈ కథానికలో. ఆ వివక్షపై నిరసనకి సూచన ఈ కథ ముగింపు.
తెలుగు రచనల్లో ‘స్త్రీవాదం’ ఇంకా ప్రాచుర్యం పొందని రోజుల్లో స్త్రీవాదానికి మూలమైన ఒక అంశాన్ని తీసుకుని రాసిన ఈ కథ ఒక దశాబ్దకాలం తరువాత స్త్రీవాదుల దృష్టిని ఆకర్షించింది.
నాకు నచ్చిన ఈ కథ నా జీవితంలోని ఆత్మీయులకు సంబంధించిన కథ. నాకు ఆత్మీయమైన కథ”
‘ఆనాటి ఆడవారిని పెంచడంలోనే చూపిస్తున్న వివక్షని, ఒక బోన్సాయి చెట్టు పెంపకంతో పోల్చి, ఆ విధంగా స్త్రీని అశక్తురాలుని చేసారు’ అని రచయిత్రి చెప్పినట్టు స్పష్టమవుతుంది.
ముందుగా, భారతీయ జీవనవిధానం గురించి ప్రస్తావిస్తాను. ఒక భారతీయ వైదిక వివాహం జరిగినపుడు, ఆ వివాహ సమయంలో ‘ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి’ అంటూ ప్రమాణం చేస్తాడు వరుడు. అంటే, తన జీవితంలోకి ఆహ్వానిస్తున్న ఆ స్త్రీకి అంత్యంత గౌరవం ఇస్తున్నట్లే కదా. అదే విధంగా, భారతీయ చరిత్రలో యుద్ధాలు చేసిన భారతీయ స్త్రీల కథల గురించి, శాస్త్రాలు చదువుకున్న మొల్ల, గార్గి లాంటి స్త్రీల గురించి వింటాము.
అంటే భారతీయ జీవన విధానంలో, ఆడపిల్ల పెంపకంలో వివక్ష లేనట్టే అని స్పష్టమవుతుంది. మరి ఇటువంటి భారతీయ సమాజంలో ఆడవారి పైన వివక్ష అనే సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడ వచ్చింది అన్న విషయాన్ని చారిత్రిక పరంగా కూడా పరిగణించాలి. భారతదేశంపై దండయాత్రలు చేసిన వలసదారులు (colonizers) భారతీయరాజులతో యుద్ధాలు చేసినపుడు, భారతీయరాజులు ఓడిపోయిన పక్షంలో ఈ వలసదారులు ఆ రాజ్యంలోని భారతీయ స్త్రీలని బానిసలుగా చెరపట్టేవారు. ఆ స్త్రీలని అత్యంత దారుణంగా హింసించేవారు. అటువంటి పరిస్థితులలో స్త్రీలు ఇల్లు వదిలి బయటికి రాకుండా కట్టుదిట్టం చేయడం అనే మార్పు భారతీయ జీవన విధానంలో ఒక భాగమయి ఉండచ్చు.
ఈ కథ వ్రాసినప్పుడు రచయిత్రి స్త్రీవాద దృక్పధంతో రచించి ఉండకపోవచ్చు. ఏ కథైనా రచయిత జీవితంలో తారసపడ్డ ఒక అనుభవం నుండే పుట్టుకు వస్తుంది. కథపై రచయిత్రి చెప్పిన వివరణలో ‘నా జీవితంలోని ఆత్మీయులకు సంబంధించిన కథ’ అనడం అది బలపరుస్తుంది. రచయిత్రి తన జీవితంలో జరిగిన ఏదైనా అనుభవంలో నుండీ వచ్చిన ఈ కథని, స్త్రీవాదులు ఆ భావజాలానికి తగ్గట్టు ఉన్నదనిపించి ఆ కోవలోకి చేర్చారు అన్నది నా అభిప్రాయం.
అక్క పాత్ర ‘మాకు మల్లే కరివేపాకుకి కానీ డబ్బు దగ్గర్నుంచీ మొగుడి మీద ఆధారపడకుండా’ అంటుంది. ఇక్కడ కథలో అసంగతంగా అనిపించిన విషయం ఏంటంటే → పల్లెటూరిలో ముఖ్యంగా పాడి, పంటా ఉండి పెరట్లో కూరలు పండించుకునే అక్కకి కరివేపాకు కొనవలసిన అవసరం ఏముంటుంది అని.
రచయిత్రి కథ పేరును ‘బోన్సాయి బతుకు’ పెట్టడం పై ఆ పోలిక స్త్రీ పెంపకంపైనున్న వివక్ష గురించి తెలియజేయడానికి అన్నారు. అయితే కథలో, ఆ బోన్సాయి బతుకు పోలిక అనేది → చదువుకుని, పట్నంలో ఉద్యోగం చేసే చెల్లి పాత్రకి అన్వయిస్తుంది అంటాను నేను. ఒక బోన్సాయి చెట్టుకు కాయలు వచ్చినట్టుగా చెల్లి పాత్రకి ఆర్థికబలం ఉంటుంది. కానీ ఇంటా బయటా అన్నీ చేసుకోవడం వలన, గాలిదుమారానికి తట్టుకునే శక్తి లేని బోన్సాయి చెట్టులాగానే, ఆవిడ స్పష్టంగా ‘ఇల్లూ-వాకిలీ సరిగ్గా చూసుకోకుండా ఆఫీసులో వ్యవహారాలు చూడబోవడం ఆడదానికి తలకి మించిన పనే’ అని చెబుతుంది. ఇక్కడ చెల్లెలి విషయంలో ఇంకొకటి గమనించాలి. అక్క ఉత్తరం రాగానే, మరిది ఆ ఉత్తరం లాగేసుకుంటాడు. ఆ ఉత్తరం అతని చేతిలో పెట్టి కాఫీలు చేయడానికి వంటింట్లోకి వెళ్తుంది. అంటే ‘స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నా, కొన్ని పనులు స్త్రీ మాత్రమే చేయాలి’ అని కథలోని ఆ సన్నివేశం పాఠకులకి చెబుతుంది.
అక్క విషయం తీసుకుంటే, పల్లెటూరిలో స్వచ్ఛమైన వాతావరణంలో నివసించే ఆమెకి ఏ ఉద్యోగ ఒత్తిడి లేదు. అందుకే ఆమె ఆలోచనాతీరు ఒక వటవృక్షం లాగానే ఉంది. ఎందుకంటే ఏ విషయమైనా చెప్పడంలో అక్కకి చాలా స్పష్టత ఉంది. కూతురిని కాలేజీ చదువులకు పంపాలన్న పట్టుదలతో ఉండటమే ఒక ఉదాహరణ. కానీ ఆ సంగతి ఆవిడకి బోధ పడలేదు. చిన్నప్పటి నుండీ ‘చదువుకోలేదు’ అని నూరిపోయడం వలన, ఆ ఆత్మ న్యూనతా భావం కలిగి ఉంటుంది. అదే ఆత్మ న్యూనతా భావం ‘దేహి అని ఒకళ్ళని అడగకుండా, మొగుడి మీద ఆధారపడకుండా దర్జాగా బతకగలవు’ అని అక్క అనేలా చేస్తుంది.
భర్తని ఇంటి ఖర్చుకి డబ్బు అడగటం ‘దేహీ’ అన్నట్లు అయితే, భార్యా భర్తా అనే రెండు వేరు వేరు entities అనడమే. ధర్మంతో ముడిపడి ఉన్న ఆ బంధాన్ని ఆర్థిక పరమైన విషయంతో విడదీయడమే. ఇక్కడ స్త్రీవాద కథల కోసం వెతికిన వారికి చాలా ముఖ్యమైన ‘పీడకుడు & పీడితుడు’ అన్న కోణం దొరుకుతుంది. అప్పుడు ఇటువంటి కథ ఒక స్త్రీవాద కథ క్రింద మారుతుంది.
ఒక భారతీయ కుటుంబ వ్యవస్థలో కుల వృత్తులు ఉండేవి. ఆడవారు కూడా మగవారితో పాటూ ఆ కులవృత్తి చేసేవారు. అందువల్లే అదే కులంలో కులవృత్తి తెలిసిన అమ్మాయిని పెళ్ళి చేసుకునేవారు (ఉదాహరణకి మల్లేశం సినిమా). ఈనాడు work from home అంటున్నాము. చేనేత వృతుల్లాంటివి, ఇంట్లో కూర్చొని ఆడవారు పని చేసేవారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ప్రసక్తి లేదు. ఎంతో మంది వైశ్య స్త్రీలు ఎంతో చాకచక్యంగా పచారీ కొట్టు నిర్వహించడం చూసాము. ఉదాహరణ, శ్రీరమణ గారి మిథునం కథలలో ‘ధనలక్ష్మి’ బిజినెస్ స్కూల్స్ లో పాఠాలు చెప్తోంది. ఈ కుల వృత్తుల వల్ల ఒక వృత్తి పైన ఇంకొక వృత్తి వారు ఆధారపడి ఉండేవారు. అందుకే కుటుంబాలు ఆర్థికబలంతో ఉండేవి. బ్రిటిష్ వారు వచ్చి నేర్పించిన ఆంగ్ల చదువులు, అందరినీ గుమాస్తాలను , కూలీలను చేసి కులవృత్తులకి దూరం చేసాయి. ఈనాడు పల్లెలు ఖాళీ అయ్యి , ఈ చేనేత కళాకారుల లాంటి వారు వలస కూలీలుగా మారిపోయారు. ఆ విధంగా ఎన్నో వృత్తులు ఈనాడు కనుమరుగయ్యాయి.
సమాజంలో మార్పు అనేది సహజమే. ఒకనాడు ఉద్యోగం అనేది optional గా ఉన్న స్త్రీకి, ఈనాడు mandatory గా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలని మంచి చదువులు చదివించాలి అంటే, బడి ఫీజులు కట్టడానికి ఒక్క జీతం సరిపోదు. కాన్సర్, covid లాంటి రోగాలు ఎప్పుడు వచ్చి కుటుంబంలో ఎవరి ప్రాణాలు హరిస్తాయో తెలియని పరిస్థితి. అందుకని ఈనాడు కుటుంబంలో భార్యాభర్తల ఇద్దరూ ఉద్యోగాలు చేయడం అనేది తప్పనిస్థితి అయ్యింది.
ఈ విధంగా సాహిత్యం ద్వారా, ‘ఒక స్త్రీ తన భర్త పై ఆధారపడి ఉండటమే తన ఆత్మ గౌరవాన్ని కించపరచుకున్నట్టు ‘ అంటూ ఒక కృత్రిమమైన మార్పు సృష్టించి, పీడకుడు & పీడితుడు అన్న భావజాలాన్ని భార్యాభర్తల బంధానికి ఆపాదించి, ఆ దిశగా సమాజాన్ని నెట్టి వేసిన ఈ స్త్రీవాదం → ఈనాడు TCS లాంటి పెద్ద సంస్థలో ఉద్యోగాలు చేసే చోట, మాత మార్పిడి & లైంగిక వేధింపులకు గురైన ఆడపిల్లలకు ఏ విధంగా రక్షణగా నిలుస్తోంది?

