[ప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘చంద్రునికో నూలుపోగు’ అనే నవలని ధారవాహికగా అందిస్తున్నాము.]
వెన్నెల పుచ్చపువ్వులా కాస్తోంది.
పెరట్లో పెంచుకున్న అందమైన పూలతోటలో వాలు కుర్చీల్లో సేద తీరుతున్నారు అయాన్ష్, అతని భార్య మహిక.
“ఎందుకు నీకు వెన్నెలంటే అంతిష్టం? ప్రతి పౌర్ణమిరోజు భూమ్మీద మనింట్లో ఈ తోటలో కూచుని వెన్నెట్లో తడవడం కోసం, చంద్రుడి నుంచి ప్రయాణం చేసి రావడమంటే కష్టం కదా. నీతో పాటు నన్నూ లాక్కొస్తావు. అక్కడ ఇండియన్ మూన్ రీసెర్చ్ స్పేస్ ఏజెన్సీలో మనం చేస్తున్న పనులకు ఆటంకం కలగదా?” అంది మహిక.
“చంద్రుడి మీద ఇస్రో సహకారంతో ఏర్పాటు చేసిన స్పేస్ ఏజెన్సీలో పని చేయడం కోసం మనల్ని నియమించిన రోజే నెలలో మూడు నాలుగు రోజులు భూగ్రహానికి వెళ్ళి రావడం కోసం చీఫ్ సైంటిష్ట్ నుంచి అనుమతి తీసుకున్నాను. మనలాంటి శాస్త్రవేత్తలకు శనాదివారాలు శెలవలంటూ ఏమీ ఉండవుగా. నెలలో కనీసం మూడు నాలుగు రోజులైనా సేద తీరకపోతే మనసుని లగ్నం చేసి పని చేయలేం” అంటూ నవ్వాడు అయాన్ష్.
‘ఎంతందంగా ఉందో ఆ నవ్వు.. వెన్నెలకన్నా చల్లగా ఉంది’ అనుకోకుండా ఉండలేకపోయింది మహిక. ఆ నవ్వు చూసేగా తను ప్రేమలో పడిపోయింది. ఇస్రోలో సైంటిస్ట్‌గా ఉద్యోగంలో చేరిన కొత్తలో అయాన్ష్‌తో పరిచయమైంది. అతను తనకన్నా రెండేళ్ళు సీనియర్. ఇప్పుడతని వయసు నలభై ఎనిమిదేళ్ళు. జుట్టు చెంపల దగ్గర తెల్లబడింది. కొద్దిగా బరువు పెరిగాడు. అంతే. అంతకు మించి ఏ మార్పూ లేదు, మత్తెక్కించే ఆ నవ్వుతో సహా.. ఆమె పెదవుల మీద కూడా సన్నటి నవ్వు మెరుపులా మెరిసి మాయమైంది.
“ఎందుకు నవ్వావు? రిలాక్స్ కావడమనేది శరీరానికే కాదు మనసుకి కూడా అవసరం కదా. అందులో నవ్వడానికి ఏముందని?”
“అదేదో చంద్రుడి మీద కూడా రిలాక్స్ కావొచ్చుగా. శాస్త్రవేత్తల కోసం ఎంత అధునాతనమైన కాలనీని కట్టించి యిచ్చారో కదా. మన విశాలమైన క్వార్టర్లో నేను కూడా రకరకాల పూల మొక్కల్ని పెంచుతున్నా కదా. అక్కడ మన కోసమని ఉయ్యాల కూడా వేయించాను. హాయిగా అందులో కూచుని వూగుతూ, పూల పరిమళాల్ని ఆస్వాదిస్తూ, కబుర్లు చెప్పుకుంటే సరిపోదా? దానికోసం ఇన్ని లక్షల మైళ్ళ దూరం ప్రయాణించి, ఇంత కష్టపడి రావాలా?” అని అడిగింది.
“అక్కడ విశాలమైన, అందమైన, అధునాతనమైన యిల్లుంది. ఆకర్షణీయమైన పూలమొక్కలున్నాయి. ఉయ్యాలుంది. నువ్వున్నావు. కానీ వెన్నెల లేదుగా. వూహ తెల్సినప్పటి నుంచి వెన్నెల రాత్రుళ్ళని ఎంతగా ఇష్టపడ్డానో.. నీతో ప్రేమలో పడకముందే నేను వెన్నెలని ప్రేమించాను తెలుసా? నా ప్రేయసి వెన్నెల.”
“కవులు మాట్లాడాల్సిన మాటల్ని నీ నోటి ద్వారా వినడమే ఆశ్చర్యంగా ఉంది అయాన్ష్. నువ్వు ఆస్ట్రో ఫిజిక్స్‌లో రీసెర్చ్ చేశావు. ఇప్పుడు ప్రతిష్ఠాత్మకమైన మూన్ రీసెర్చ్ స్పేస్ ఏజెన్సీలో పేరెన్నికగన్న శాస్త్రవేత్తవి. నీకు ఈ వెన్నెలంటే యింత పిచ్చి ఇష్టం ఏమిటి? చంద్రుడు ఓ గ్రహ శకలం మాత్రమే.”
“ఖగోళ శాస్త్రవేత్తనైనంత మాత్రాన ప్రకృతితో ప్రేమలో పడకూడదని ఎక్కడైనా రూలుందా? నాకు మన భూగ్రహం అంటే ఎందుకిష్టమో తెలుసా? కనువిందు చేసే ఎంతందమైన సరస్సులు, నదులు, సముద్రాలు, జలపాతాలు ఉన్నాయో కదా. చంద్రుడి మీద ఇవన్నీ ఎక్కడున్నాయి? నాకు మన భూగ్రహం అంటే యిష్టం. అందులో మన వూరంటే ఇష్టం. ఇక్కడ ఉదారంగా కురిసే వెన్నెలంటే ఇష్టం. మత్తెక్కించే చల్లదనంతో మనల్ని అల్లుకునే ఈ వెన్నెలని ఆస్వాదించని బతుకెందుకు? స్వర్గం అంటూ ఎక్కడో లేదు మహీ. ఇప్పుడు మనిద్దరం అనుభవిస్తున్న ఈ వెన్నెల జల్లుని మించిన స్వర్గం ఇంకెక్క డుంటుంది?”
“సర్లే. మెటలర్జీలో డాక్టరేట్ చేసి, రకరకాల లోహాల్ని తయారుచేయడంలో, వాటిని శుద్ధి చేయడంలో ప్రయోగాలు చేసుకునే నాకు ఇవన్నీ అర్థం కావులే. వింతగా కూడా అన్పిస్తుంది. నీకు గుర్తుందా? మనం ప్రేమించుకునే రోజుల్లో నువ్వు మొదటి సారి ‘నాకు వెన్నెట్లో తడవడమంటే ఇష్టమని’ చెప్పినపుడు ఎలా నవ్వానో? ఇప్పుడూ అలానే నవ్వొస్తో ఉంటుంది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాకూ ఇష్టమే వెన్నెట్లో ఆడుకోవడం.. ఇప్పుడు లేదు.”
“వెన్నెలని ఇష్టపడటానికీ వయసుకీ సంబంధం ఉండదు మహీ. కొన్ని ఇష్టాలు వయసుతో పాటే పెరుగుతాయి. నువ్వంటే నాకున్న ప్రేమ వయసుతో పాటే పెరిగింది కదా. వెన్నెలంటే ప్రేమ కూడా అలానే పెరిగింది.”
“ఒకవేళ ఈ చంద్రుడు అకస్మాత్తుగా మాయమైపోతే ఏం చేస్తావు?” అతన్ని ఉడికిస్తూ అంది.
“అసంభవం.. అలా ఎన్నటికీ జరగదు” అన్నాడు అయాన్ష్.
“నువ్వేగా ఒకసారెప్పుడో చెప్పావు.. చంద్రుడు మన భూమినుంచి దూరంగా జరిగిపోతున్నాడని. అలా దూరం జరిగి జరిగి, మరో గ్రహం యొక్క గురుత్వాకర్షణకు లోనై, శాశ్వతంగా భూమికి దూరమయ్యే ప్రమాదం ఉంది కదా.”
“లేదు. అది కేవలం అభూత కల్పన మాత్రమే. చంద్రుడు భూమి నుంచి దూరంగా జరుగుతున్న మాట నిజమే. సంవత్సరానికి ఒకటిన్నర అంగుళం చొప్పున జరిగిపోతున్నాడు. ఆ లెక్కన చంద్రుడు శాశ్వతంగా కన్పించకుండా పోవడానికి యాభై బిలియన్ సంవత్సరాలు పడ్తుంది. అసలప్పటికి భూమి, చంద్రుడు, సూర్యుడు, మిగతా గ్రహాలు కూడా లేకుండా పోవచ్చు.”
“యాభై బిలియన్ సంవత్సరాలకేనా?” ఆశ్చర్యంగా అడిగింది.
“యాభై బిలియన్ సంవత్సరాలంటే ఎంతనుకుంటున్నావు? చాలా చాలా ఎక్కువ. మన భూమి, చంద్రుడు, మిగతా గ్రహాలు ఐదు బిలియన్ సంవత్సరాలకు మించి ఉనికిలో ఉండవు.”
“ఏమౌతుందప్పుడు?”
“సూర్యునిలో ఉన్న ఇంధనం ఐదు బిలియన్ సంవత్సరా తర్వాత పూర్తిగా ఖర్చయిపోతుంది. అప్పుడు సూర్యుడు రెడ్ జయంట్‌లా మారిపోతాడు. దాని పరిమాణం బాగా పెరిగిపోతుంది. ఎంతలా పెరుగుతుందంటే భూమితో పాటు మిగతా గ్రహాల్ని కూడా తన లోపలికి లాక్కునేంత. అప్పటివరకు చంద్రుడు మనల్ని వీడి ఎక్కడికీ పోడు.”
“అలా కాకుండా వేరే కారణాల వల్ల చంద్రుడు మనల్ని విడిచి వెళ్ళే అవకాశం లేదంటావా?”
“ఉంది. భూమి చంద్రుణ్ణి తన గురుత్వాకర్షణ శక్తి ద్వారా తన చుట్టూ ఓ కక్ష్యలో తిరిగేలా పట్టి ఉంచుతోంది. ఒకవేళ భూమ్యాకర్షణ కన్నా మరింత బలమైన గురుత్వాకర్షణ కలిగిన కాస్మిక్ పదార్థం ఏదైనా చంద్రుడికి సమీపంగా వచ్చినపుడు, చంద్రుడు దాని వైపుకి లాగబడే అవకాశం ఉంది.”
“అప్పుడు చంద్రుడు ఏమైపోతాడు?”
“రెండు అవకాశాలున్నాయి. ఒకవేళ కాస్మిక్ పదార్థం యొక్క గురుత్వాకర్షణ అత్యంత బలంగా ఉంటే చంద్రుడు వేగంగా దాని వైపుకి ఆకర్షించబడి, మీటియోరైట్ భూమ్మీద పడినట్టు, దాని మీద పడి ముక్కలైపోవచ్చు. లేదా చంద్రుడి గురుత్వాకర్షణ కూడా దాన్ని తట్టుకునే స్థాయిలో ఉంటే మన భూమి చుట్టూ తిరిగినట్టు చంద్రుడు ఆ కాస్మిక్ పదార్థం చుట్టూ ప్రదక్షిణలు చేయవచ్చు.”
“నీకు వెన్నెలంటే ఎంత పిచ్చి ఇష్టమో చూస్తుంటే నాకు భయమేస్తోంది అయాన్ష్. ఒకవేళ అలా జరిగి, చంద్రుడు మనకు దూరమైపోతే నువ్వు పిచ్చివాడివైపోతావేమో” అంది మహిక.
అయాన్ష్ వెన్నెల కురిసినట్టు నవ్వాడు. “నేను ఖగోళ శాస్త్రవేత్తని. పిచ్చివాడినెందుకౌతాను? వలేసి, చంద్రుణ్ణి జారిపోకుండా పట్టుకుని, లాక్కొచ్చి, మళ్ళా మన గ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసేలా కట్టి పడేస్తాను” అన్నాడు.
మహిక కూడా శబ్దం రాకుండా నవ్వింది. “నాకు తెలుసులే. నువ్వంత ప్రతిభావంతుడివని” అంది.
“ఐనా వొంటిని సుతారంగా తాకుతోన్న వెన్నెలని ఆస్వాదించకుండా ఈ హైపోథెటికల్ చర్చ ఏమిటి మన మధ్య? అదుగో ఆకాశంలో చంద్రుడు ఉజ్వలంగా వెలిగిపోతున్నాడు చూడు. వెన్నెల జలపాతాలు మన భూమ్మీదకు దుముకుతున్నాయి చూడు. మొదట ఈ అలౌకికమైన అనుభూతిని ఆస్వాదిద్దాం” అన్నాడు.
“అర్ధరాత్రి కావస్తోంది. నాకు నిద్రొస్తోంది. నువ్వు ఆస్వాదించుకో మహాశయా. గుడ్‌నైట్” అంటూ మహిక లేచి, యింట్లోకి వెళ్ళిపోయింది.
***
నలభై రెండేళ్ళు ఇస్రోకి తన సేవలందించి, నాలుగేళ్ళ క్రితం పదవీ విరమణ పొందిన ఖగోళ శాస్త్రవేత్త ఆర్యమిహిరకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. దానిక్కారణం టెలిస్కోప్లోంచి ఆస్టరాయిడ్ బెల్ట్‌ని వీక్షిస్తున్న సమయంలో తనక్కనిపించిన ఓ చిన్న తేడా..
అసలు నిజంగానే తేడా ఉందా లేక తను భ్రమ పడ్డాడా అనే ఆలోచన అతన్ని మనశ్శాంతిగా కూచోనివ్వడం లేదు.
అతను స్కూల్లో చదువుకునే రోజుల్నుంచి విశ్వాంతరాళంలోని రహస్యాల్ని తెల్సుకోవాలన్న ఆసక్తితో వాళ్ళ యింట్లోని లైబ్రరీలో ఉన్న ఆస్ట్రానమీ పుస్తకాలన్నీ చదివేశాడు. అతని నాన్న యూవర్శిటీలో ఆస్ట్రానమీ సబ్జెక్ట్‌ని బోధించే ప్రొఫెసర్ కావడం వల్ల యింటినిండా అలాంటి పుస్తకాలు చాలా ఉండేవి. తన పేరుని ఆర్యభట్ట, వరాహమిహిరల పేర్లు రెండూ కలిసివచ్చేలా ఆర్యమిహిర అని పెట్టడంలోనే తన నాన్నకు భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలంటే ఎంత గౌరవమో అతనికి అర్థమైంది. అందుకే తను కూడా గొప్ప ఖగోళ శాస్త్రవేత్త కావాలని కలలు కన్నాడు.
ఇస్రోలో సైంటిస్ట్‌గా చేరిన క్షణం నుంచి అహర్నిశలూ తన వృత్తికి అంకితమై పని చేసి, ఛైర్మన్ స్థాయికి ఎదిగాడు. తన హయాంలో ఇస్రోని నాసాకి దీటుగా తయారుచేశాడు. చంద్రుడిమీద మొట్టమొదటి స్పేస్ ఏజేన్సీని నెలకొల్పిన దేశంగా భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంలో అతని కృషి ఎంతో ఉంది. శాస్త్రవేత్తల కోసం చంద్రుడి మీద కాలనీ నిర్మించిన ఘనత కూడా అతనిదే. ఆ తర్వాత అమెరికా, రష్యా, చైనా, జపాన్ లాంటి దేశాలు తమ స్పేస్ ఏజన్సీలని అక్కడ నెలకొల్పడంలో అతని సలహాలు తీసుకున్నాయి.
అందుకే అరవై యేళ్ళకే పదవీ విరమణ పొందాల్సి ఉన్నా భారత ప్రభుత్వం అతని పదవీ కాలాన్ని మరో ఆరేళ్ళకు పొడిగించింది. ఆ తర్వాత మరో నాలుగేళ్ళు పొడిగిస్తామని ప్రభుత్వం చెప్పినా మృదువుగా తిరస్కరించాడు. అరవై ఆరేళ్ళ వయసులో అతను స్వచ్ఛందంగానే పదవీ విరమణని కోరుకున్నాడు. దానిక్కారణం అతనికి ఆసక్తి, ఉత్సుకత లేక కాదు. తన కింద పనిచేసిన వాళ్ళకు అవకాశం లభించాలంటే తను తప్పుకోక తప్పదన్న ఆలోచన..
తను పదవి నుంచి వైదొలగినా, తన యింట్లోనే శాస్త్ర పరిశోధనలు చేసుకోడానికి వీలు కల్పించమని ప్రభుత్వాన్ని కోరడంతో, అతనుంటున్న యింటిపైన విశాలమైన ప్రయోగశాలను ఏర్పాటు చేసి, అతనికి బహూకరించింది ప్రభుత్వం. నాసా అంతరిక్ష పరిశోధనల కోసం వాడే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కన్నా మరింత శక్తివంతమైన టెలిస్కోప్‌ని అతని ప్రయోగశాలలో ఏర్పాటు చేసింది.
అతనా రోజు రాత్రి ఆస్టరాయిడ్స్‌ని గమనించడంలో నిమగ్నమైనాడు. అప్పుడే అతని దృష్టి వింత ఆకారంతో కన్పిస్తున్న ఓ ఆస్టరాయిడ్ మీద పడింది. మార్స్‌కి జూపిటర్‌కి మధ్య ఉండే ఆస్టరాయిడ్ బెల్ట్ లోని ఆస్టరాయిడ్స్‌ని అతను కొన్ని వందల సార్లు పరిశీలించి ఉంటాడు. రకరకాల ఆకారాల్లో ఉండే చిన్నా పెద్దా గ్రహశకలాలు.. వాటన్నిటిలోకి పెద్ద గ్రహశకలం తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల వ్యాసంతో ఉన్న సీరీస్.. అన్నిటి కంటే చిన్నవి ధూళి కణాల పరిమాణంలో ఉండి మిగతా ఆస్టరాయిడ్స్‌తో పాటు దీర్ఘ వృత్తాకార కక్ష్యలో సూర్యుని చుట్టూ పరిభ్రమస్తూ ఉంటాయి.
ఆ ఆస్టరాయిడ్ వింతగా కన్పించడానికి కారణం అది సంపూర్ణమైన గోళాకారంలో ఉండటమే. సీరీస్‌తో పాటు ఆరొందల కిలోమీటర్ల వ్యాసం ఉన్న వెస్టా, పల్లాస్ లాంటి పెద్ద ఆస్టరాయిడ్స్ తప్ప మిగతావన్నీ క్రమరహిత ఆకారాల్లోనే ఉంటాయి. దాదాపు గోళాకారాలు సంతరించుకున్న ఆస్టరాయిడ్స్‌లో కూడా ఉపరితలం మీద గుంటలు, బిలాలు కన్పిస్తాయి. కానీ ఆర్యమిహిరకు కన్పించిన వింత ఆస్టరాయిడ్ యొక్క ఉపరితలం నున్నగా ఉండటమే అతనికి మరింత ఆశ్చర్యాన్ని కలుగచేసింది.
‘ఇదెలా సంభవం? నాకు తెల్సిన ఖగోళ నియమాలకు విరుద్ధంగా ఈ ఆస్టరాయిడ్ పరిపూర్ణమైన గోళాకారాన్ని ఎలా సంతరించుకుంది? దాని ఉపరితలంలో ఒక్క బిలం కూడా లేకుండా ఎలా ఏర్పడింది?’ అంటూ తీవ్రంగా ఆలోచించసాగాడు.
ఏదైనా ఆస్టరాయిడ్ గోళాకారాన్ని పొందాలంటే దాని గురుత్వాకర్షణ శక్తి అత్యంత బలంగా, ప్రభావవంతంగా ఉన్నపుడే అది సాధ్యపడ్తుంది. కానీ తనకు కన్పించిన వింత ఆస్టరాయిడ్ పరిమాణం చాలా చిన్నది. అంత చిన్నగా ఉన్న గ్రహశకలానికి గురుత్వాకర్షణ బలంగా ఉండే అవకాశం లేదు.
అతనికి చప్పున ఓ అనుమానం వచ్చింది. అసలది నిజంగానే గ్రహశకలమా లేక ఏలియన్ గ్రహాలనుంచి ఎవరైనా ప్రయోగించిన విధ్వంసక క్షిపణినా? ఆ ఆలోచన హేతుబద్ధంగా అన్పించలేదు. క్షిపణి గోళాకారంలో ఎందుకుంటుంది? ఐనా ఏలియన్లు అంతరిక్షంలోని దేన్ని ధ్వంసం చేయాలన్న ఉద్దేశంతో క్షిపణుల్ని ప్రయోగించి ఉంటారు? అలా చేయడం వల్ల వాళ్ళకు ఒనగూడే ప్రయోజనం ఏమిటి?
ఓ అరగంట తర్వాత మళ్ళా ఆ వింత ఆస్టరాయిడ్ని మరింత పరిశీలనగా చూశా డు. ఆ అరగంట వ్యవధిలో అది మిగతా ఆస్టరాయిడ్లతో పాటు దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరగలేదు. దీర్ఘ వృత్తాకారానికి టాంజెన్షియల్‌గా ప్రయాణిస్తోంది. అంటే దాని లక్ష్యం భూమి కావొచ్చు. వెంటనే అతనికి భయమేసింది. ఏంటా వస్తువు? ఎవరు ప్రయోగించారు? వాళ్ళ ఉద్దేశం ఏమిటి?
అర్ధరాత్రి దాటింది. అతనికి నిద్ర రావడం లేదు. భూమి వైపుకు దూసుకొస్తున్న ఆ గోళాకార పదార్థం ఏమిటో, దాని లక్ష్యం ఏమిటో తెల్సుకునేవరకు తనకు ప్రశాంతంగా నిద్ర పట్టదని అతనికి అర్థమైంది.
దాని ద్రవ్యరాశిని లెక్కించిన వెంటనే అతని వెన్నులో వణుకు పుట్టింది. చంద్రుడి ద్రవ్యరాశితో సమానమైన ద్రవ్యరాశిని కలిగి ఉండటం ఎలా సంభవమో అతనికి అర్థం కాలేదు. అంత చిన్న వస్తువుకి దాదాపు మూడువేల నాలుగు వందల డెబ్బయ్ అయిదు కిలోమీటర్ల వ్యాసం ఉన్న చంద్రుడి ద్రవ్యరాశితో సమానమైన ద్రవ్యరాశి ఎలా ఏర్పడింది?
దాని లక్ష్యం భూమే అయితే, దాని ద్రవ్యరాశికి, అది ప్రయాణిస్తున్న వేగానికి, అది భూమిని ఢీ కొన్న వెంటనే అత్యంత వినాశనం కలిగించే భూకంపాలు, సునామీలు ఏర్పడతాయి. అగ్నిపర్వతాలు బద్దలౌతాయి. ప్రపంచం నీళ్ళలో మునిగిపోతుంది. భూమ్మీద జీవరాశి లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది.
అతనికి ఆ తర్వాత నిద్ర పట్టలేదు. ఆలస్యం చేయకుండా ఇస్రో ఛైర్మన్‌తో, నాసా అడ్మినిస్ట్రేటర్‌తో, అక్కడి చీఫ్ సైంటిస్ట్‌తో మంతనాలు జరిపాడు. వెంటనే ప్రపంచంలో ఉన్న ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్తలందరూ ఆ వింత వస్తువు కదలికల్ని జాగ్రత్తగా గమనించసాగారు.
మరో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో దాని గమన వేగాన్ని, ద్రవ్యరాశిని లెక్కలోకి తీసుకుని, భూమి సూర్యుని చుట్టూ తిరిగే భ్రమణ వేగాన్ని లెక్కిస్తే, ఆ వింత వస్తువు లక్ష్యం భూమి కాదని అర్థమైంది. అది ప్రయాణిస్తున్న దిశని మార్చుకోకుండా ప్రయాణిస్తే, సరిగ్గా ఇరవై ఒక్క రోజుల తర్వాత చంద్రునికి అతి సమీపంగా చేరుకుంటుందని నిర్ధారణకు వచ్చారు.
ఆర్యమిహిరకు అదే కొరుకుడు పడటం లేదు. చంద్రునికి సమీపంగా ప్రయాణించడం వల్ల, దాన్ని ప్రయోగించిన ఏలియన్లకు ఒనగూడే ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదు. మొదట అతనితోపాటు మిగతా శాస్త్రవేత్తలందరికీ ఓ విషయంలో స్పష్టత ఏర్పడింది. ఆ వస్తువు అంతరిక్షంలో సహజంగా ఏర్పడిన పదార్థం కాదు. ఎవరో దాన్ని నిర్మించి, రిమోట్ కంట్రోల్ ద్వారా దాని గమనాన్ని నియంత్రిస్తూ, ఓ నిర్దిష్టమైన లక్ష్యం వైపు ప్రయోగించిన స్పేస్ షిప్‌లా ఉంది. ఆ మరునాడు ప్రపంచంలోని ప్రముఖ ఖగోళ శాస్తవేత్తలందరూ హైద్రాబాద్ లోని ఓ అధునాతనమైన భవనంలో సమావేశమైనారు. వివిధ దేశాలనుంచి వచ్చిన ప్రతినిధులతోపాటు ప్రముఖ పత్రికల నుంచి వచ్చిన విలేకర్లు కూడా ఆ సమావేశ మందిరంలో ఆసీనులై ఉన్నారు.
(సశేషం)
సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. “రూపాయి చెట్టు”, “ఒంటరి శరీరం”, “రాణీగారి కథలు”, “నీటిపుట్ట” వీరి కథా సంపుటులు. “కాలుతున్న పూలతోట”, “అనూహ్య పెళ్ళి”, “గుర్రపు డెక్క”, “వెండి మేఘం” వంటివి వీరి నవలలు.