[ప్రసిద్ధ రచయిత శ్రీ సలీం రచించిన ‘చంద్రునికో నూలుపోగు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[భూగ్రహవాసులని ఓ గాజుగదిలో బందీలుగా ఉంచి సాల్మోనియన్‍లకు ప్రదర్శనగా ఉంచుతారు. తమని అలా బంధించి ఉంచినందుకు, వింత జంతువులను చూడడానికి వచ్చినట్టు సాల్మోనియన్‍లు వచ్చి చూస్తున్నందుకు రాబర్ట్ బాధపడతాడు. ఇంతలో కొందరు ఆ గాజు గదిపై రాళ్ళతో దాడి చేయగా, సందర్శకుల గుంపుని అజమాయిషీ చేస్తున్న సైనికులు వాళ్ళని గుర్తించి, లాక్కెళ్ళి పోతారు. తమని శత్రువులుగా ఎందుకు బావిస్తున్నారో అర్థం కావడం లేదని రాబర్ట్ అంటే, అది గుంపు మనస్తత్వమని చెప్తాడు అయాన్ష్. లేజర్ గన్స్ సంగతి వాళ్ళు అడగకుండానే చెప్పి ఉండాల్సిందని సకూరా అంటే, వాళ్ళు నమ్మరని అంటాడు అయాన్ష్. అడవిలో గాలిస్తున్న సైనికులకు ఓ గుబురు పొద చుట్టూ ఉన్న చెట్ల కాండాల మీద అయాన్ష్ వాళ్ళు ఆంగ్లంలో రాసిన అక్షరాలు కనబడతాయి. అవేంటే వాళ్ళకి అర్థం కాక సైన్యాధ్యక్షుడికి సమాచారం అందిస్తారు. అతను అక్కడికి వెళ్ళి ఆ రహస్య లిపిని జాగ్రత్తగా పరిశీలించినా, అతనికేమీ అర్థం కాదు. వెంటనే కారాగారానికి వెళ్ళి ప్రదర్శనని నిలిపి వేయించి, ఏలియన్స్‌ని పిలిపించి, ఆ రహస్య లిపి గురించి అడిగితే, అవి ఇంగ్లీష్ భాషలో రాసిన అక్షరాలని చెప్తాడు అయాన్ష్. ఆ కోడ్ లోని రహస్యమేమిటో చెప్పమంటాడు సైన్యాధ్యక్షుడు. అవి తమ పేర్లలోని మొదటి అక్షరాలని, వాటిలో ఏ రహస్యమూ లేదని చెప్తాడు అయాన్ష్. సైన్యాధ్యక్షుడు వెళ్ళి గ్రహాధిపతిని కలుస్తాడు. జరిగినదంతా చెప్తాడు. నేల కింద వెతికించమని గ్రహాధిపతి చేసిన సూచనతో, తొందరగానే గొయ్యిలోపల దాచిపెట్టిన స్టీల్ కంటెయినర్‌ని బైటికి తీయిస్తాడు సైనికాధికారి. నిపుణులను పిలిపించి, దానిలో ఉన్న లేజర్ గన్స్‌ని పరీక్షింపచేయిస్తాడు. గ్రహాధిపతి ఏలియన్స్‌ని తన వద్దకు పిలిపించుకుని సంజాయిషీ అడుగుతాడు. జరిగినదంతా దాచకుండా చెప్తాడు అయాన్ష్. ఆ వివరాలని నమ్మని గ్రహాధిపతి వారికి మరణశిక్ష విధిస్తాడు. తమ గ్రహంలో తమ అన్నగారి మూడు రోజుల పర్యటన ఉన్న దృష్ట్యా, ఆయన వెళ్ళాకా, శిక్షని అమలు చేయమని చెప్తాడు. ఇక చదవండి.]
నిక్స్ గ్రహంలో సిసిరస్ నివాసగృహం.. సమయం ఉదయం ఏడు గంటలు..
“మనం ఈ రోజు సాల్మోనియస్ గ్రహానికి వెళ్ళక తప్పదంటారా?” అల్పాహారం తింటున్న సమయంలో సిసిరస్‌ని అడిగింది అతని భార్య.
“ఓసిరస్ అంత ప్రేమగా పిలిచినప్పుడు వెళ్ళకపోతే బావుంటుందా చెప్పు? నిక్స్‌కి సాల్మోనియస్‌కి మధ్య ఉన్న స్నేహబంధం ఈనాటిదా? మా తాతల నాటిది. ఐనా ఎందుకు నీకక్కడికి రావడం ఇష్టం ఉండదు?” నవ్వుతూ అడిగాడు సిసిరస్.
“స్నేహబంధమే అయితే నాకూ అభ్యంతరం ఉండేది కాదు. రక్త సంబంధం కూడా ఉందిగా. అందుకే నాకు రావడం ఇష్టం ఉండదు. ఓసిరస్ మిమ్మల్ని అన్నా అని పిలుస్తుంటే కంపరంగా ఉంటుంది. ఆరున్నర అడుగుల ఎత్తుండే మీకు మూడున్నర అడుగుల మరుగుజ్జు తమ్ముడుండటం ఏమిటి? నా మనసొప్పుకోదు.”
“తప్పు. అలా అనకూడదు. ఆ గ్రహంలో గురుత్వాకర్షణశక్తి అధికంగా ఉండటం వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల అక్కడి మనుషులు మూడున్నర అడుగులు మించి ఎదగరు. మనతో పోలిస్తే తక్కువ ఎత్తున్నారనే కారణంతో వాళ్ళను తక్కువ చేయడం, చులకనగా మాట్లాడటం తప్పు కదా. నువ్వు గ్రహాధిపతికి భార్యవి. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మనమే సంస్కారం మర్చిపోయి మాట్లాడటం భావ్యమా?” కించిత్ బాధ పడుతూ అన్నాడు.
ఆమెకు తను చేసిన తప్పేమిటో అర్థమైంది. “క్షమించండి. ఉత్తమురాలైన మీ తల్లిగారిని తల్చుకున్నప్పుడల్లా మీ తండ్రిగారు చేసిన పని సక్రమమనిపించదు. ఆ కోపంలో నోరు జారాను.”
“ఏది సక్రమం? ఏది అక్రమం? నా చిన్నప్పుడు మా తండ్రిగారు ఆ గ్రహంలో పర్యటించడానికి వెళ్ళారట. అక్కడున్న వారం రోజులు ఓ సాల్మోనియన్ స్త్రీ వారికి పరిచర్యలు చేసిందట. ఉదాత్తమైన ఆమె వ్యక్తిత్వానికి ఆకర్షితులై మా తండ్రిగారు ఆమెను పెళ్ళి చేసుకున్నారు. వాళ్ళకు ఓసిరస్ జన్మించాడు. తల్లిదండ్రుల ఉన్నతమైన లక్షణాలన్నీ ఓసిరస్‌కి అబ్బాయి. చాలా మంచివాడు. ఉన్నత సంస్కారం కలవాడు. నేనంటే అతనికి ప్రాణం. యింకెప్పుడూ అతని గురించి తప్పుగా మాట్లాడకు. నేను బాధపడ్తాను” అన్నాడు సిసిరస్.
వాళ్ళిద్దరూ సాల్మోనియస్ గ్రహాన్ని చేరుకోగానే, అధికారలాంఛనాలతో స్వాగతం పలికాడు ఓసిరస్. వాళ్ళు విడిది చేసిన భవనంలో సమస్త సౌకర్యాలూ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అతను చేసిన అతిథి మర్యాదలకు సిసిరస్, అతని భార్య చాలా సంతుష్టులైనారు.
మూడు రోజుల వినోద, విహారాల తర్వాత వాళ్ళు తిరిగి తమ గ్రహానికి వెళ్ళాల్సిన సమయం దగ్గరపడింది.
ఓసిరస్ తన సోదరునితో చేస్తున్న ఆత్మీయ సంభాషణ మధ్యలో తమ గ్రహానికి నలుగురు ఏలియన్స్ రావడం గురించి, వాళ్ళ దగ్గరున్న లేజర్ గన్స్ గురించి వివరంగా చెప్పాడు.
“ఎక్కడో ఉన్న భూగ్రహం నుంచి ఏలియన్స్ ఇక్కడికొచ్చారా? ఆశ్చర్యంగా ఉందే. ఎందుకొచ్చారని అడిగావా? వాళ్ళేం సమాధానం చెప్పారు?” అని అడిగాడు సిసిరస్.
“చాలా విచిత్రమైన కట్టు కథలాంటిదేదో చెప్పారు అన్నగారూ. వాళ్ళ గ్రహానికున్న చంద్రుణ్ణి ఎవరో దొంగిలించబోతున్నారట. ఆ ప్రయత్నాన్ని భంగం చేయడం కోసమే లేజర్ ఆయుధాల్ని తయారుచేసుకున్నారట. చంద్రుడి మీదకి ప్రయాణమైనారట. కానీ స్పేస్‌షిప్‌లో కంట్రోల్ బోర్డ్ పని చేయకపోవడం వల్ల, పొరపాటున మన గ్రహాన్ని చేరుకున్నారట. ఇందులో ఏదైనా నమ్మేలా ఉందా చెప్పండి. వాళ్ళు మా గ్రహాన్ని ధ్వంసం చేయడానికొచ్చిన శత్రువులని మంత్రి మండలి తీర్మానించింది. ప్రస్తుతం వాళ్ళని కారా గారంలో బంధించి ఉంచాం” అన్నాడు ఓసిరస్.
సిసిరస్‌కి వెంటనే తమ నిక్స్ గ్రహానికున్న చంద్రుళ్ళలో ఒక చంద్రుణ్ణి బహుమతిగా ఇవ్వమని అడిగిన అజుపస్ గుర్తొచ్చాడు. తమ గ్రహాన్ని ఆక్రమించుకోవాలనే దుర్బుద్ధితో చేసిన యుద్ధం గుర్తొచ్చింది. దాంతో పాటు ఈ మధ్య తమ గూఢచారులు అందించిన రహస్య సమాచారం కూడా గుర్తొచ్చింది.
“వాళ్ళు చెప్తున్నది నిజమే. వాళ్ళు నిరపరాధులు. వెంటనే వాళ్ళను విడుదల చేయించి, మా ముందు ప్రవేశ పెట్టించు” అన్నాడు సిసిరస్.
“చంద్రుణ్ణి దొంగిలించడమేమిటి అన్నగారూ.. మీరెలా నమ్ముతున్నారు?” ఆశ్చర్య పోతూ అడిగాడు.
అజుపస్ చేసిన దుర్మార్గాల గురించి సిసిరస్ తన తమ్ముడికి వివరంగా చెప్పాడు. తమ గూఢచారులు అందించిన రహస్య సమాచారం ప్రకారం ఏదో గ్రహానికున్న చంద్రుణ్ణి వాళ్ళ గ్రహానికి లాక్కురావడానికి అజుపస్ ప్రయత్నిస్తున్న విషయం కూడా చెప్పాడు.
“మరి స్పేస్‌షిప్ కంట్రోల్ బోర్డ్ పనిచేయకపోవడం కూడా నిజమేనా?” అని అడిగాడు ఓసిరస్.
“నిజమే. అది కూడా అజుపస్ నిర్వాకమే. స్పేస్‌షిప్‌లో ఉన్న లేజర్ గన్స్‌తో పాటు స్పేస్‌షిప్‌ని, అందులో ప్రయాణిస్తున్న శాస్త్రవేత్తల్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో కంట్రోల్ ప్యానెల్ని హ్యాక్ చేశారు. అదృష్టం కొద్దీ స్పేస్‌షిప్ మీ గ్రహానికున్న గురుత్వాకర్షణ ప్రభావానికి లోనై మీ నేల మీద పడింది. ఆ నలుగురూ తెలివిగా కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు” అన్నాడు సిసిరస్.
“నాక్కూడా వాళ్ళు నిరపరాధులనే అన్పించింది. దానిక్కారణం వాళ్ళ వద్ద ఉన్న లేజర్ ఆయుధాలు.. వాటినుంచి వెలువడే కిరణాలు మిస్సైల్స్‌లా విధ్వంసం సృష్టించకుండా టార్గెట్‌ని ముక్కలు చేస్తాయని తెలిసినపుడే నా అనుమానం బలపడింది. వాళ్ళు మా గ్రహానికి నష్టం చేసే ఉద్దేశంతో వస్తే, అటువంటి ఆయుధాలు ఎందుకు తెచ్చుకుంటారు? ఆ కిరణాల ప్రయోజనం వేరే ఉండొచ్చనిపించింది. ఈ విషయం మీతో సంప్రదించడం కోసమే శిక్షను వాయిదా వేశాను. మీ వల్ల నిజమేమిటో వెల్లడైంది. నిరపరాధుల్ని శిక్షించానన్న అపవాదు నుంచి నన్ను రక్షించారు” అన్నాడు ఓసిరస్.
అదే సమయంలో కారాగారంలో ఉన్న నలుగురు భూగ్రహవాసులు మాట్లాడుకుంటున్నారు.
“ఈ రోజే మన జీవితాల్లో ఆఖరి రోజు. రేపు శిక్ష అమలు చేస్తారు. మనం తెచ్చిన లేజర్ గన్స్‌ని మన మీదే ప్రయోగించడం దారుణం కదా. ఇంతకూ మనల్ని ఎన్ని ముక్కలు చేస్తారంటావు?” అన్నాడు రాబర్ట్.
“రెండు ముక్కలు కాగానే ప్రాణం పోతుంది. ఆ తర్వాత ఎన్ని ముక్కలు చేస్తే మనకేంటి? నేను రేపు రాబోతున్న చావుని గురించి ఆలోచించడం లేదు. చంద్రుణ్ణి కాపాడుకోలేకపోతున్నందుకు బాధపడ్తున్నాను” అన్నాడు అయాన్ష్.
“నువ్వు ఆశావాదివి కదా. అద్భుతాలేవో జరగొచ్చని అన్నావుగా. ఏమీ జరగలేదేం” అంది సకూరా.
“అద్భుతమేదైనా జరగడానికి ఓ క్షణం చాలు. రేపు కదా శిక్ష అమలు చేసేది. చాలా సమయం ఉంది. ఈ లోపల ఏమైనా జరగొచ్చు. గుర్రం ఎగురా వచ్చు” అంటూ నవ్వాడు అయాన్ష్.
“గుర్రం ఎగురుతుందో లేదో తర్వాత సంగతి. రేపు గుర్రం గుండెల్లోకి లేజర్ కిరణాలు దూరి, ప్రాణాల్నే హరించబోతున్నాయి. యింకెక్కడి గుర్రం? ఎక్కడికి ఎగరడం మిత్రమా” అన్నాడు రాబర్ట్.
అప్పుడే కారాగారం లోపలికి సైన్యాధ్యక్షుడు వస్తూ కన్పించాడు. ఎప్పుడూ శత్రువుని చూసినట్టు చూసే అతని క్రూరమైన చూపులో ఇప్పుడు మార్పుండటాన్ని అయాన్ష్ గమనించాడు.
అతను వాళ్ళ ముందుకొచ్చి నిలబడి స్నేహపూర్వకంగా నవ్వాడు. “మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు క్షమించండి. మీరు నిరపరాధులని రుజువైంది. మిమ్మల్ని విడుదల చేయవల్సిందిగా గ్రహాధిపతి గారి ఆజ్ఞ” అన్నాడు.
నమ్మలేనట్లు నలుగురూ మొహామొహాలు చూసుకున్నారు. అప్పటివరకు చావు ముంచుకొస్తుందని ఆందోళన పడ్తున్న రాబర్ట్ మొహం ప్రసన్నంగా మారింది. సకూరా అయాన్ష్ వైపు మెచ్చుకోలుగా చూసింది. అయాన్ష్ హాయిగా నవ్వుతూ “చూశారా అద్భుతం జరిగింది. ఆశ మనిషిని బతికిస్తుంది” అన్నాడు.
“బయల్దేరండి. మిమ్మల్ని పిల్చుకు రమ్మని గ్రహాధిపతిగారు, వారి అన్నగారైన సిసిరస్ గారు ఆదేశించారు. వారు మీ కోసం ఎదురుచూస్తున్నారు” అన్నాడు సైన్యాధ్యక్షుడు.
ఓసిరస్ వాళ్ళను సాదరంగా ఆహ్వానించాడు.
“నిజం తెల్సుకుని మమ్మల్ని విడుదల చేసినందుకు మీకు ధన్యవాదాలు” అన్నాడు అయాన్ష్.
“మీరు ధన్యవాదాలు తెలపాల్సింది నాక్కాదు. మా అన్నగారైన వీరికి” సిసిరస్ వైపు చూపిస్తూ అన్నాడతను. “వీరివల్లనే మాకు మీరు చెప్పిందంతా నిజమని అర్థమైంది” అన్నాడు.
“విశ్వ చరిత్రలో కనీవిని ఎరుగని ఇటువంటి దుర్మార్గానికి పూనుకుంది మా పొరుగు గ్రహం వాళ్ళే కాబట్టి నాకైనా నిజం తెలిసింది. లేకపోతే మీరు చెప్పేది నేను కూడా నమ్మేవాణ్ణి కాదు” అన్నాడు సిసిరస్.
“మా చంద్రుణ్ణి కాజేయాలని వాళ్ళు ఎందుకనుకున్నారు?” అని అడిగాడు అయాన్ష్.
“నిఫిలిక్స్ గ్రహానికి చంద్రుడు లేడు. మా గ్రహానికి రెండు చంద్రుళ్ళు ఉండటంతో మా గ్రహాన్ని ఆక్రమించాలనే దురుద్దేశంతో అజుపస్ మాతో యుద్ధం చేసి, ఓడిపోయాడు. అతని కన్ను మీ భూగ్రహానికున్న చంద్రుడిమీద పడింది. దాన్ని పొందే మార్గాలకోసం ఎన్నో పరిశోధనలు చేసి, చివరికి ఆస్టిరాయిడ్ లాంటిదాన్ని తయారుచేసి, ప్రయోగించారని మా గూఢచారుల ద్వారా తెల్సింది. మీరా ఆస్టిరాయిడ్‌ని పోలిన ఉపకరణాన్ని ధ్వంసం చేయబోతున్నారని తెల్సుకుని, మీ స్పేస్‌షిప్ లోని కంట్రోల్ ప్యానెల్ని హ్యాక్ చేసి మిమ్మల్ని చంపడానికి పన్నాగం పన్నాడని కూడా వేగుల ద్వారా మాకు సమాచారం అందింది. మీరు చాలా అదృష్టవంతులు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని, ప్రాణాల్తో బైటపడ్డారు” అన్నాడు సిసిరస్.
“బతికున్నందుకు మాకేమీ సంతోషంగా లేదు. మా చంద్రుణ్ణి కాపాడుకోలేకపోతే మేము బతికుండి ఏమిటీ ప్రయోజనం?” బాధగా అన్నాడు అయాన్ష్.
“ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ప్రయాణానికి సిద్ధం కండి. మిమ్మల్ని మీ చంద్రుడి మీదికి చేర్చే బాధ్యత మాది” అన్నాడు సిసిరస్.
“ప్రయోజనం లేదు. అంత సమయం ఎక్కడుంది? చంద్రుణ్ణి కాపాడుకోడానికి కేవలం రెండు రోజులే మిగిలున్నాయి. స్పేస్‌షిప్‌లో మేము చంద్రుణ్ణి చేరుకోడానికి అంత కన్నా చాలా ఎక్కువ సమయం పడ్తుందిగా” నిస్పృహగా అన్నాడు అయాన్ష్.
“మీరు వెళ్ళడానికి స్పేస్‌షిప్‌ని ఏర్పాటు చేస్తామనుకుంటున్నారా?” అంటూ సిసిరస్ మెత్తగా నవ్వాడు. “మేము శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎంతో పురోగతిని సాధించాం. వాటిలో టెలీపోర్టింగ్ కూడా ఒకటి. మిమ్మల్ని మీ లేజర్ ఆయుధాలతో పాటు చంద్రుడి మీదికి టెలీపోర్ట్ చేస్తాం. మిగిలిన సమయం చాలనుకుంటాను అజుపస్ ప్రయత్నాన్ని భగ్నం చేయడానికి” అన్నాడు.
అప్పటివరకు నిరాశలో మునిగి ఉన్న భూగ్రహవాసుల మొహాల్లో ఒక్కసారిగా ఉత్సాహం ఉప్పెనలా పొంగింది.
“మీ మాటలు వింటుంటే మా ప్రాణాలు లేచొస్తున్నాయి. మీకూ, ఓసిరస్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. మాతోపాటు మా భూగ్రహవాసులందరూ మీకు కృతజ్ఞతగా ఉంటారు” చెమ్మగిల్లిన కళ్ళతో అన్నాడు అయాన్ష్.
మొదట నలుగురినీ టెలీపోర్ట్ యంత్రం లోపల నిల్చోబెట్టి, గమ్యస్థానం ఏమిటో, ఎంత దూరంలో ఉందో ఫీడ్ చేసి, నీలం రంగులో కన్పిస్తున్న మీటను నొక్కారు. వెంటనే వాళ్ళు అదృశ్యమైపోయారు. తర్వాత లేజర్ ఆయుధాలున్న స్టీల్ కంటెయినర్‌ని యంత్రం లోపల పెట్టి మీటను నొక్కారు.
చంద్రుడి మీదున్న ఇండియన్ స్పేస్ ఏజన్సీ భవనంలో నలుగురూ మళ్ళా తమ రూపును సంతరించుకున్నారు.
“అద్భుతం! టెలీపోర్టేషన్ ప్రక్రియని మన శాస్త్రవేత్తలు ఎప్పుడు సాధించారు?” అంటూ స్పేస్ ఏజన్సీలో ఉన్న మిగతా సైంటిస్ట్‌లు ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబట్టి అడుగుతున్నా పట్టించుకోకుండా అయాన్ష్, మహిక బిగ్‌మాస్ చంద్రుడికి ఎంత దూరంలో ఉందో గమనించడంలో నిమగ్నమైపోయారు. రాబర్ట్, సకూరాలు స్టీల్ కంటెయినర్ లోంచి లేజర్ గన్స్‌ని తీసుకుని, షూట్ చేయడానికి తయారుగా నిలబడ్డారు.
“బిగ్‌మాస్ మన లేజర్ గన్స్ రేంజ్ లోకి ప్రవేశించింది. ఇంక ఆలస్యం చేయకూడదు” అంటూ అయాన్ష్, మహిక కూడా లేజర్ గన్స్‌ని తమ చేతుల్లోకి తీసుకున్నారు.
నలుగురూ తమ గన్స్‌ని బిగ్‌మాస్ మీదికి ఎక్కుపెట్టి, లేజర్ బీమ్స్‌ని ఆపకుండా వదలసాగారు. కొన్ని క్షణాల వ్యవధిలోనే బిగ్‌మాస్ పెద్ద పెద్ద ముక్కలుగా తెగిపోయింది. ఆ శకలాల్ని కూడా వదలకుండా నిరంతరాయంగా షూట్ చేశారు. అవి మరింత చిన్న చిన్న ముక్కలుగా విడిపోయాయి.
“మన చంద్రుడికి ప్రమాదం తప్పింది. మనం చంద్రుణ్ణి కాపాడుకున్నాం” సంతోషాతిరేకంతో అరిచింది మహిక.
“సక్సెస్.. ఆపరేషన్ సేవ్ ద మూన్ ఈజ్ ఏ గ్రాండ్ సక్సెస్” అంటూ పెద్దగా అరిచాడు అయాన్ష్.
రాబర్ట్, సకూరా అతనితో గొంతు కలిపారు.
భారతదేశ స్పేస్ ఏజన్సీలోని అందరి మొహాల్లో ఆనందం పున్నమి వెన్నెల్లా విచ్చుకుంది.
‘చంద్రుణ్ణి కాపాడుకున్నందు చాలా తృప్తిగా ఉంది. ఈ సమస్త మానవాళి కోసం చంద్రుడు చాలానే ఇచ్చాడు. దాంతో పోలిస్తే ఇప్పుడు తమ టీం సాధించిన విజయం పెద్ద విషయమేమీ కాదు. చంద్రుడిమీది ఇష్టంతో, గౌరవంతో, భక్తితో సమర్పించుకున్న ఓ నూలు పోగుతో సమానం’ అని అయాన్ష్ మనసులో అనుకున్నాడు.
తన ప్రయోగశాలలో ఉన్న శక్తివంతమైన టెలిస్కోప్ ద్వారా బిగ్‌మాస్ గమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న ఆర్యమిహిర, అది వేల వేల ముక్కలుగా విడిపోవడం గమనించిన వెంటనే, తన టీం సాధించిన విజయానికి గర్వపడుతూ ‘నా దేశం, మా భూగ్రహం, మా చంద్రుడు.. వీటి జోలికి ఏ ఏలియన్స్ దండెత్తి వచ్చినా వాళ్ళకు ఇదే గతి పడ్తుంది’ అని అనుకున్నాడు.
(సమాప్తం)
సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. “రూపాయి చెట్టు”, “ఒంటరి శరీరం”, “రాణీగారి కథలు”, “నీటిపుట్ట” వీరి కథా సంపుటులు. “కాలుతున్న పూలతోట”, “అనూహ్య పెళ్ళి”, “గుర్రపు డెక్క”, “వెండి మేఘం” వంటివి వీరి నవలలు.