Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చెమట తవసాన-4

[కార్మికులపై శ్రీమతి శైలజామిత్ర రచించిన ‘చెమట తవసాన’ అనే దీర్ఘ కవితని అందిస్తున్నాము. ఇది 4వ భాగం.]

10.
నగరం మీద గుడిసె నీడ
ఆకాశాన్ని తాకే భవనాలు అతడి చెమటతో నిండినవే,
రాజధాని వీధుల్లో పరచుకున్న రోడ్లు అతడి మోసినవే.

మున్సిపాలిటీ రికార్డుల్లో
అతడి పేరే కనబడదు.
అతడు నిర్మించిన నీడలకే
తన గుడిసెకి చోటు దొరకదు.

భవిష్యత్ నకశాలు గీసే వారికి పేరు ఉంటుంది-
అతడికి మాత్రం ఒక అడుగుజాడగాని గుర్తింపు ఉండదు.

వాడు వేసిన ఇటుకల మధ్య
తన శ్వాస ఉక్కిరిబిక్కిరి అయిపోయినా-
దాని మీదే ఇంకొకరికి భవిష్యత్తు రూపం కనిపిస్తుంది.

నగరం అతడి చెమటను గ్రహించదు,
కాని చెమట లేకుండా ఈ నగరమే లేకపోతుంది.
కూలిన గోడలు మళ్ళీ లేస్తాయి,
అతడి విరిగిన నడుము మాత్రం ఇక ఒక్కడికి తెలియదు.

ఎక్కడో బోర్డుపై ‘ఇంజనీర్’
పేరు మెరిసిపోతుంది,
కాని అతడి నలిగిన చేతులు మాత్రం కంచె దాటవు.
పేరు పెట్టే హక్కు ఉండదు అతనికి
పునాది గట్టి నిలబెట్టే బాధ్యత మాత్రం అతనిదే.

ఆయన జీవితం ఒక నిర్మాణ ఖాతాలో లేదు,
సమాజపు అస్తిత్వమే
ఆయన అస్థిపంజరంపై బతుకుతోంది.

స్పీకర్లలో విన్న ప్రతి జాతీయ గీతంలో
అతడి శ్రమ ధ్వని ఉండదు,
దేశం నిలబడే నేల అతడు గట్టిపరచినదే.

గుడిసె తలుపు వెనక అతడు ఒక రాజుకి తండ్రిగా ఉంటాడు,
బయట ప్రపంచంలో మాత్రం
అతడికో మురికివాడ జీతగాడి గుర్తింపు మాత్రమే.

11.
వలస జీవి రహదారి కవిత్వం
ఇతడు వలస వేసిన పక్షిలా
వచ్చిన పట్టణంలో ఓ గూడు కట్టాడు.
కాని ఆ గూడు తనది కాదు –
సాయంత్రం తర్వాత దాన్ని వదిలిపెట్టాల్సిందే.

తన శ్రమ తాత్కాలికం,
తన స్థానం తాత్కాలికం,
తన గుండె మాత్రం శాశ్వతంగా ఒంటరి.

ఎక్కడ ఉంటానో తెలియని వీధుల్లో
తన జీవితం ఓ వడిగాలి వలే చలించిపోతుంది.
చూసే వారికి అది కేవలం పని-
అతడి శ్వాసకి అది బతుకు.

ఒక చిన్న నిమిషం తలనెత్తిన కల
తరువాతి నిమిషమే వలస పడుతుంది.
తన గూడు రేపటి సబ్బందంగా మారుతుంది,
తన అడుగులు ఎప్పటికీ స్థిరపడవు.

వాడు ఉండే చోటు తాత్కాలికమే అయినా –
అతడు అక్కడ వేసిన చెమట శాశ్వతమవుతుంది.

బస్సు రేకులు, బాట సాయింత్రాలు,
తన్నుకొనే గాలిలో వాడి తలదాచుకున్న మూల..
అది భద్రత కాదు,
ఓ రోజుకి తాత్కాలిక భయం తప్పించుకునే తెర.

తన పేరు తపాలా చిరునామాలో లేదు,
తన పిల్లలకు పాఠశాల అడ్రెస్ తెలియదు.
ఇతడి ఒంటరితనం –
ఒక చిరునామా లేని జీవితం.

12.
తన జీవితంలో స్కూల్‌కు దారే కనిపించలేదు,
తన బిడ్డల పాదాలు
చదువుల తలుపు తట్టాలని ఆశించేవాడు.

ఒక్కో పాఠ్యపుస్తకం అతనికి దేవాలయ శబ్దం,
ఒక్కో స్కూల్ బ్యాగ్‌లో అతడి కలలు కదలికలయ్యేవి.
తన చేతుల్లో మట్టితో నిర్మించిన గోడలు
పిల్లల కలల గోడలవ్వాలని తపించేవాడు.

తన చర్మం కాస్త నలుపు,
తన పుట్టుక కాస్త తక్కువ వర్గం,
అతడి ఆశ –
ఏ వర్ణానికి తలవంచనిదై పోయింది.

తను చదవలేకపోయిన ప్రతి అక్షరం,
తన బిడ్డ తల మీద రక్షణగా నిలవాలని కోరుకున్నాడు.
తన పేరుకే సంతకం వేయలేని వాడు
తన బిడ్డ పేరు స్కూల్ బోర్డులో మెరవాలని కలలుగన్నాడు.

ప్రతి నెల ఫీజు కట్టే క్షణం
అతడి గుండె ఒక్కసారి వణికినా-
అది బాధ కాదు,
ఒక కొత్త తరం ఆశకి సమర్పించిన తపస్సు.

బుక్ స్టాల్ ఎదుట బిడ్డ చేతిలో పట్టిన పుస్తకాన్ని చూస్తూ
అతడు మూగగా నవ్వుతాడు-
కనిపించని లోపల మాత్రం ఓ పుస్తకం వాసనలా కన్నీరు కలుగుతుంది.

తన చేతుల్లో పగిలిన రేతి గడ్డలతో
తన పిల్లల భవిష్యత్తు పునాది వేసేవాడు.
ఆ పునాది మీద నిర్మించబడే కలల ఇల్లు –
తన పేరు లేకుండానే గౌరవంగా నిలవాలని కోరేవాడు.

చదువు అతడి గొంతులో లేదు,
అతడి మనసు మాత్రం
ఓ గురుకులం మందిరంగా మారిపోయింది.
వాడు తాను చూడని అక్షరాల్లో
తన బిడ్డల కోసమే ఆత్మను నింపుకున్నాడు.

13.
ఒకప్పుడు నినాదాల్లో గట్టిగా అరవగలిగిన వాడు
ఇప్పుడు జెండాల మౌనానికి బలి అయ్యాడు.
సంఘాలు పోస్టర్లకే మిగిలిపోయాయి,
చట్టాలు పుస్తకాలకే పరిమితమయ్యాయి.

తన శబ్దం సమాజానికి పరిగెత్తే మెడుపైన బరువు,
తన ప్రశ్నలు వ్యర్థ ప్రయాణాల్లా నిర్లక్ష్యించబడినవి.
పెదవి కదిలితే పని పోతుందనే భయం
అతన్ని మాటలన్నీ మింగిపెట్టే వాడిని చేసింది.

ఒకప్పుడు ర్యాలీలో ముందుగా నడిచిన పాదాలు
ఇప్పుడు దారిలో చివరికి ఉండేందుకు అలవాటు పడిపోయాయి.
ఆరెంజ్ రంగు జెండా ఎత్తిన చేతులు
ఇప్పుడో మురికినీటిలో తడిచిన కూలీ సంచిని మోస్తున్నాయి.

తన గొంతు ఒకప్పుడు నినాదం,
ఇప్పుడు ఫోన్ బెల్లు పక్కన అడ్డంగా పడిన మౌనం.
తన ప్రశ్న ఒకప్పుడు సభల శీర్షిక,
ఇప్పుడు గుట్టు నిండిన హామీ పత్రంలో చూపించని వాక్యం.

అతడు బహుశా ఇంకా నమ్ముతున్నాడు –
ఒక రోజు రోడ్డు మీదే పూల గూడు అవుతుందనే ఆశ.
కానీ ఆ ఆశకు మెగాఫోన్ లేదు, వేదిక లేదు.
విజయం ఎప్పుడు వస్తుందో తెలియదు
కానీ మౌనం ఎప్పుడో అతడి గుండెను ఆక్రమించింది.

మాటలకీ పూటకీ మధ్య
తన భయం ఒక్క మెదడులో శాశ్వతంగా స్థానం ఏర్పరుచుకుంది.
ఒక వాక్యాన్ని అరిచే ముందు,
వాడు తన వేతనాన్ని ఊహించుకుంటాడు.

తన శబ్దాన్ని వినిపించేందుకు
ఇప్పుడు కాలం వినపడదు –
కానీ అతడి మౌనం మాత్రం కాలానికి బానిసగా మారిపోయింది

14.
తప్పు అతడి కాదు,
శిక్ష మాత్రం అతనిదే.
తన జననమే చట్టానికి అభ్యంతరమైపోయినట్లుంది.

ఒక రోజు కూలి రాకపోతే –
ఆ కుటుంబం మీద శాపం పడినట్లే.
అతడి చేతులు ఎరుచుకున్నాయి –
కానీ ఏ ఒడిసి పట్టూ చట్టం చూపలేదు.

వాడు ఎప్పటికీ శిక్షితుడే –
ఉపాధి కోసం కాదు,
ఉదయం కడుపు నింపేందుకు కాదు-
కేవలం బతకడం కోసమే శిక్ష అనుభవించేవాడు.

ఆ శిక్షకి తీర్పు లేదు,
తనకు కోర్టు న్యాయం లేదు,
తన చెమటలో సమాధానం వెతుకుతూనే ఉన్నాడు.
ఏ మేజిస్ట్రేట్ కోరికలన్నీ తీర్చలేడు –
అతడి ఆత్మలో ప్రతిరోజూ వేసే వాదనలు ఎవరు వినాలి?

చట్టం అతడికి దూరమైంది –
చట్టాల బరువు మాత్రం అతడి వెన్నుపామును వంగజేసింది.
ఒక్కో నిబంధన అతడి చేతుల్లోని పగుళ్ల మధ్య
ఓ బందీ శబ్దంలా దాగిపోతుంది.

తన న్యాయాన్ని విన్నవించేందుకు –
తన పాదాలకే న్యాయస్థానంగా మార్చుకున్నాడు.
తన బాధ్యతలే అతనికి ఎలాంటి న్యాయపత్రాల కంటే గొప్పవి.
వాడు చేసిన దోషం ఏముంది?
బతుకుతానన్న ఒక చిన్న ప్రయత్నమేనా శిక్షకు కారణం?

తన జన్మే ఒక వర్గానికే చెందినదని –
సమాజం ఇచ్చిన శిక్ష అతడు ఎదిగిన ప్రతి అడుగునా గుర్తుచేస్తుంది.
స్కూల్ తలుపులు మూసుకున్నాయి –
ఇటుక తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.

వాడు వేరే దేశానికి పోయాడని కాదు –
ఇక్కడే ఉండి, పౌరుడిగా ఉంటూ
హక్కుల కోసం ఎదురు చూస్తున్న తపస్సి.

ప్రతి ఉదయం అతడి నిద్ర
ఎత్తుకున్న శిక్షను మళ్లీ మోయాల్సిందే.
ప్రతి రాత్రి నిద్రపోయే ముందు
తన నిష్కల్మషతకు న్యాయాధిపతి ఆయనే.

తన తలపాల్లే తీర్పు,
తన చెమటలే వాదనలు,
తన శ్వాసలే తీర్పు పఠనాలు.
ఈ న్యాయసర్వభౌమ వ్యవస్థలో
తన కొసరి జీవితం మాత్రమే
దోషిగా నిలబడింది.
వాడు విన్న ప్రతీ హక్కు నినాదం
తన జీవితం దాటి పోయిన ఓ రైలు శబ్దంలా వినిపిస్తుంది.
తన పిలుపులకు ఎలాంటి సమాధానమూ రాకపోయినా
తన పని మాత్రం సమయానికి పూర్తవుతూనే ఉంటుంది.

తనపై కేసు లేదు,
తనపైన ఆరోపణ లేదు,
కానీ జీవితమే ఒక జీవితఖైదుగా మలచబడింది.
అతడికి చెప్పడానికి పేరు ఉన్నా,
ఆ పేరు చెబితే పనిచేసే చేతులు తగ్గిపోతాయని భయం పాకింది.

తన పనితనం గుర్తించబడదు,
తన మౌనం తప్పించబడదు.
సర్టిఫికెట్ల కోసం చూసే సమాజంలో
తన చెమటతో ముద్రించిన నేలే అతడి గుణపాఠం.

వాడు మానవుడే అయినా
అతడి హక్కులు బడ్జెట్ లెక్కల్లో ఒక చిన్న నిబంధనకీ చేరవు.
తనపై విపత్తులు వస్తే
దయతో కాదు, సమర్ధనతో కాదు
ఒక్కసారి నవ్వి వదిలేస్తారు.

అతడి కన్నీళ్లు బహుళ స్వరాల గాత్రాలు కావు,
తన శోకం మీడియాకు చిరునవ్వు చూపించదు.
అతడి నిష్కల్మష జీవితం
వేడిగా పొర్లుతున్న బైలు పొడి లాంటి శిక్ష మాత్రమే.

(ఇంకా ఉంది)

Exit mobile version