కలలతీరాల వెంట ఒంటరిగా నడుస్తున్నాను!
కావ్యఖండికల నిండా అక్షరాల హరివిల్లులని నింపుతున్నాను!
నువ్వేమైనా కనిపిస్తావేమోనన్న చిన్నిఆశతో
అలుపెరగని పయనాన్ని సాగిస్తున్నాను!
స్వప్నాల నిండా నువ్వే..
స్వగతాల నిండా నువ్వే..
తలపుల పున్నమిల్లో మెరిసే నాయిక నువ్వే..
జీవితం సంబరాల మయమయ్యేలా
జ్ఞాపకాల చందనాల సుపరిమళం నువ్వే..
కళ్ళెదురుగా కానరాకపోయినా..బ్రతుకంతా జతగా నువ్వే కదా..
ఈ హృదయం అంతా నీదే కదా..
నా ఊపిరి రాగానికి జీవం నువ్వే కదా!!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.