[ఆర్.సి. కృష్ణస్వామిరాజు గారు వ్రాసిన ‘చింతల చేను’ అనే నవలను విశ్లేషిస్తున్నారు ‘కళారత్న’ డా. కంపల్లె రవిచంద్రన్.]
గ్రామీణ భారత పునాదుల పాలిట విచ్ఛిన్నకర ప్రకంపనలను నమోదు చేసిన సీస్మోగ్రాఫ్ – ‘చింతల చేను’!
మన పాత ఐదు రూపాయల కరెన్సీ నోటును ఎప్పుడైనా నిశితంగా గమనించారా? దాని ముఖభాగం మీద శాంతికి, గ్రామీణ స్వయం సమృద్ధికి, యంత్రాల మితిమీరిన వాడకానికి వ్యతిరేకమైన మహాత్మా గాంధీ చిరునవ్వు చిందిస్తుంటారు. కానీ, ఆ నోటును వెనక్కి తిప్పి చూస్తే? పొగలు కక్కుతూ, నేలను దున్నే ఒక ‘ట్రాక్టర్’ దర్శనమిస్తుంది. ఇది కేవలం ఒక కాగితం ముక్క కాదు, కరెన్సీ నోటు కూడా కాదు; అది ఆధునిక భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద తాత్విక సంఘర్షణకు ప్రతీక. గాంధీ కలలుగన్న ‘గ్రామ స్వరాజ్యం’ ఒక వైపు, నెహ్రూ ఆశించిన ‘యాంత్రీకరణ’, పారిశ్రామీకరణ మరొక వైపు. ఈ రెండిటి మధ్య ఊగిసలాడే భారతీయ రైతు ఆత్మఘోషకు, ఆశల పల్లకికి అక్షర రూపమే ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారి నవల ‘చింతల చేను’.
గాంధీజీ దృష్టిలో గ్రామం అంటే స్వయం పోషకమైన ఒక యూనిట్. “యంత్రాలు మనిషి చేతులను బద్ధకం చేస్తాయి, అవి గ్రామీణ కుటీర పరిశ్రమలను చంపేస్తాయి” అని ఆయన హెచ్చరించారు. ఆయన రాట్నం వడకడాన్ని ప్రోత్సహించారు కానీ, భారీ యంత్రాలను కాదు. కానీ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం నెహ్రూ నాయకత్వంలో ‘ఆధునిక దేవాలయాలు’గా భావించబడే భారీ ప్రాజెక్టులు, ట్రాక్టర్ల వైపు అడుగులు వేసింది. ఆ ఐదు రూపాయల నోటుపై ఉన్న గాంధీ-ట్రాక్టర్ల సహజీవనం ఒక ఆశచూపే వైరుధ్యం.
సరిగ్గా ఆ వైరుధ్యం, ఘర్షణ నుంచే ‘చింతల చేను’ కథానాయకుడు గుణశేఖరుడి ప్రయాణం మొదలవుతుంది. రాయలసీమలోని కరువు కోరల్లో చిక్కుకున్న ఒక సగటు రైతుకు గాంధీ చెప్పిన ‘అహింస’, ‘పరిమితులు’ ఆకలిని తీర్చలేవు. అందుకే అతను ఆ ఐదు రూపాయల నోటు వెనుక ఉన్న ‘ట్రాక్టర్’ను తన విముక్తి మార్గంగా ఎంచుకున్నాడు. గాంధీ గారి ఆదర్శం గొప్పదే, కానీ గుణశేఖరుడి వాస్తవం వేరు. కరువు నేలని దున్నాలంటే ఎద్దుల కన్నా యంత్రమే మిన్న అని నమ్మే ‘పోస్ట్-మోడరన్’ రైతు అతను. ఈ నవల.. ఆ ట్రాక్టర్ చప్పుడులో వినిపించే గుణశేఖరుడి గుండె చప్పుడు.
ఆర్.సి. కృష్ణస్వామి రాజుగా ప్రసిద్ధులైన రచయిత – రాచకొండ చెంగల్రాజు కృష్ణస్వామి రాజు రచించిన ‘చింతల చేను’ నవల కేవలం ఒక రైతు కథ కాదు. ఇది మారుతున్న గ్రామీణ ముఖచిత్రానికి, ముఖ్యంగా రాయలసీమ చిత్తూరు ప్రాంత వాస్తవికతకి, సగటు మనిషి ఆశలకు అద్దం పట్టే ఒక సాంఘిక దస్తావేజు. నవలలో కథానాయకుడు గుణశేఖరుడు ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కొనాలని నిర్ణయించుకోవడం వెనుక ఉన్నది అత్యాశ కాదు, అది ఒక అనివార్యమైన అస్తిత్వ పోరాటం.
మహాత్ముడు “నిజమైన భారతదేశం గ్రామాల్లో ఉంది” అన్నారు. గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. కానీ రాయలసీమలోని పల్లెల్లో పరిస్థితి వేరు. ఇక్కడ నీరు లేదు, కూలీలు దొరకరు, కాలం కరుణించదు. ఇలాంటి దీన స్థితిలో ఉన్న రైతుకు, గాంధీ గారు చెప్పిన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు ఆత్మహత్యతో సమానం. అందుకే గుణశేఖరుడు గాంధీ మార్గాన్ని వదిలి, నెహ్రూవియన్ ఆధునికత అయిన ‘ట్రాక్టర్’ వైపు మళ్ళాడు. ఇది అతని ధిక్కారం కాదు, బతకాలనే ఆరాటం. అతను ఆశపడటంలో తప్పు లేదు. ఎందుకంటే, “Poverty is not natural, it is man-made” అని నెల్సన్ మండేలా అన్నట్లు, గుణశేఖరుడి పేదరికాన్ని జయించడానికి అతనికి కనిపించిన ఏకైక ఆయుధం ట్రాక్టర్.
నవలలో గుణశేఖరుడు ట్రాక్టర్ కొనడానికి అప్పు చేస్తాడు. ఆ అప్పు తీసుకోవడంలో ఒక గొప్ప సాహసం ఉంది. 5 రూపాయల నోటుపై ఉన్న ట్రాక్టర్ బొమ్మను చూసి, “అది మన దేశ ప్రగతికి చిహ్నం కదా, మరి నా ఇంటి ప్రగతికి ఎందుకు కాకూడదు?” అని అతను ప్రశ్నించుకుని ఉంటాడు. ఇది ఆధునిక భారతదేశపు ‘కల’. గాంధీ గారు యంత్రాలు మనిషిని బానిసలుగా మారుస్తాయని భయపడ్డారు. ‘చింతల చేను’లో ఆ భయం నిజమవుతుంది. ట్రాక్టర్ గుణశేఖరుడికి స్వేచ్ఛను ఇవ్వకపోగా, అప్పుల ఊబిలోకి నెడుతుంది, శారీరకంగా గాయపరుస్తుంది. అంటే, గాంధీ గారి హెచ్చరిక ఇక్కడ నిజమైంది. కానీ, గుణశేఖరుడి ప్రయత్నాన్ని మనం తప్పుబట్టలేము. అతను మారుతున్న కాలంతో పాటు పరిగెత్తాలని చూసిన ఒక సామాన్యుడు.
ఈ నవలలో గుణశేఖరుడి ఆశలను మనం ‘Post-modern context’ లో అర్థం చేసుకోవాలి. నేటి ప్రపంచంలో వ్యవసాయం అనేది కేవలం ‘జీవన విధానం’ కాదు, అది ఒక ‘పరిశ్రమ’. లాభనష్టాల బేరీజు లేనిదే మనుగడ సాధ్యం కాదు. గుణశేఖరుడు ఆశపడింది లగ్జరీ కోసం కాదు, కేవలం ‘Survival’ కోసం. అతని ట్రాక్టర్.. అతని ఆత్మగౌరవానికి ప్రతీక.
కృష్ణస్వామి రాజు గారు ఈ నవల ద్వారా మనకు ఒక ముఖ్యమైన ప్రశ్నను వేస్తున్నారు: “టెక్నాలజీ (ట్రాక్టర్) మనకు కావాలి, కానీ అది మనల్ని మింగేయకుండా ఎలా వాడుకోవాలి?” గాంధీ గారి నైతికత (Ethics), ఆధునిక యంత్రాల అవసరం (Need for Machines) రెండూ కలిసి నడిచే మధ్యేమార్గాన్ని మనం ఇంకా కనుగొనలేదని ఈ నవల నిరూపిస్తుంది. గుణశేఖరుడి విరిగిన చేయి, మన విరిగిన వ్యవసాయ వ్యవస్థకు ఒక మెటాఫర్ (Metaphor).
ఆదర్శాలు, సత్యాలు సర్వకాలీనం కాదు, సార్వజనీనం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ ప్రఖ్యాత రచయిత లియో టాల్ స్టాయ్ సుప్రసిద్ధమైన కథ – “How Much Land Does a Man Need?” (ఇంగ్లీషు అనువాదం) తీసుకుందాం. పాఖోమ్ అనే రైతుకు భూమి మీద విపరీతమైన ఆశ. ఎక్కువ భూమి ఉంటే తనకు ఏ కష్టాలు ఉండవని, అపజయాలు దరిచేరవని నమ్ముతాడు. ఈ క్రమంలో అతను బాష్కిర్ అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ వారు ఒక వింత ఒప్పందం పెడతారు: ఒక రోజులో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపు అతను ఎంత దూరం నడిచి మళ్ళీ బయల్దేరిన చోటుకే వస్తాడో, ఆ చుట్టుకొలత లోపల ఉన్న భూమి అంతా అతనికే ఇస్తామని చెబుతారు.
ఎక్కువ భూమిని సొంతం చేసుకోవాలనే ఆశతో పాఖోమ్ ఏమాత్రం విశ్రాంతి లేకుండా, ఆకలి దప్పులు మరచి పరుగెత్తుతాడు. సూర్యుడు అస్తమించే సమయానికి ఎలాగోలా తిరిగి వెనక్కి వస్తాడు కానీ, ఆ విపరీతమైన అలసట భరించలేక అక్కడే కుప్పకూలి ప్రాణాలు వదులుతాడు. చివరికి అతని పనివాడు అక్కడే ఆరడుగుల భూమి తవ్వి పాఖోమ్‌ను పాతిపెడతాడు.
మనిషికి నిజంగా కావాల్సింది ఆరడుగుల నేల మాత్రమేనని, హద్దుల్లేని ఆశ మనిషిని నాశనం చేస్తుందని ఈ కథ ద్వారా చెబుతాడు టాల్ స్టాయ్. ఈ కథ 19వ శతాబ్దపు రష్యా సమాజంలో ఉన్న కఠినమైన వర్గ విభజనను మనకు గుర్తు చేస్తుంది. పాఖోమ్ లాంటి సామాన్య రైతులు నిత్యం దోపిడీకి గురైతేనే, ధనవంతులు ఇంకా ధనవంతులుగా కొనసాగగలరనే దుర్మార్గమైన వ్యవస్థ అక్కడ ఉండేది. ఈ సామాజిక స్థితిగతుల నుండి బయటపడి, తన హోదాను పెంచుకోవడం కోసమే పాఖోమ్ భూమిని సంపాదించాలని కలలు కంటాడు. కానీ, ఈ కథ కేవలం ఆ ఆశతోనే ముగిసిపోదు. ఆస్తుల ద్వారానే భద్రత లభిస్తుందని నమ్మడం వల్ల మనిషి ఎంతగా పతనం అవుతాడో చూపిస్తుంది. భూమి మీద పెంచుకున్న ఆ వ్యామోహం పాఖోమ్‌ను క్రమంగా హింసాత్మకంగా, అందరినీ అనుమానించే వ్యక్తిగా మారుస్తుంది. చివరకు అతను ఇతరులను పీడించే స్థాయికి చేరుకుంటాడు. భూమిని ఒక సరుకుగా చూడటాన్ని టాల్‌స్టాయ్ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ప్రకృతి వనరులను కొనడం, అమ్మడం అనే ప్రక్రియలో ఒక రకమైన సహజ సిద్ధమైన ‘చెడు’ దాగి ఉంటుందని ఆయన ప్రతీకాత్మకంగా వివరిస్తారు.
ఈ సందేశం సర్వకాలీనమా, సార్వజనీనమా, సర్వదేశీయమా? ఈ కథ రాసిన రచయిత టాల్ స్టాయ్ 19 వ శతాబ్దపు రష్యన్ కులీనుడు, పెద్ద జమీందారు. కరువు కాటకాలతో, పేదరికంతో అల్లాడే ప్రాంతాల్లో ఉండే భూమి లేని రైతుల పరంగా చూస్తే ఈ కథకి ప్రాసంగికత లేదు.
“Human rapaciousness often is like a runaway horse that cannot be controlled. It drags one down the precipice of destruction. But what happens when the person is so poor that he lives a life of deprivation? When he does not have enough for a happy and fulfilling life. He cannot make two ends meet and take care of his family. Will wanting more be considered greed? Will stretching himself to the fullest to achieve his desired objective is wrong, even if he has to sacrifice his life for it? Or other societal norms? Will the same morality hold water? Is morality universal? Or does it vary according to the situation and class of the person?” అంటాడు ప్రముఖ బెంగాలీ రచయిత బరుణ్ రాయ్.
మనిషి సామాజిక, ఆర్థిక స్థితిగతులను బట్టి భూమికి ఇచ్చే విలువ మారుతూ ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలామందికి భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదు, అది వారి ప్రాథమిక న్యాయం, ఆత్మగౌరవం. అట్టడుగు వర్గాల దృష్టిలో అసలు సమస్య ‘మనిషికి ఎంత భూమి చాలు?’ అనేది కాదు, ‘ఉన్న భూమి అందరికీ సమానంగా ఎందుకు పంపిణీ కావడం లేదు?’ అనేది.
ఈ కోణంలోంచి చూడాలి, గుణశేఖరుడు ట్రాక్టర్ కోసం పడిన తపన.
***
తెలుగు నవలా సాహిత్య చిత్రపటం తరచుగా ఒక సీస్మోగ్రాఫ్ (భూకంప లేఖిని) వలె పనిచేస్తూ, గ్రామీణ భారత పునాదులను విచ్ఛిన్నం చేసే లోతైన సామాజిక-ఆర్థిక ప్రకంపనలను నమోదు చేస్తూ వస్తోంది. అట్టడుగు వర్గాల వ్యవసాయదారులను మొదటిసారిగా కథా వస్తువుగా మార్చిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారి ‘మాలపల్లి’ (1922) నాటి సంస్కరణాభిలాష నుండి, కేశవరెడ్డి గారి ‘మూగవాని పిల్లనగ్రోవి’ (1993) లోని మ్యాజికల్ రియలిజం వరకు, వ్యవసాయ ఇతివృత్తం భూస్వామ్య పోరాటాల చిత్రణ నుండి అస్తిత్వ సంక్షోభాల లోతైన అన్వేషణగా పరిణామం చెందింది. ఈ శక్తివంతమైన సాహిత్య పరంపరలో ఆర్.సి. కృష్ణస్వామి రాజు ‘చింతల చేను’ ఒక కీలకమైన అడుగు. తెలుగు సాహితీ యవనికపై తనదైన ముద్ర వేసిన రచయితలలో ఆర్.సి. కృష్ణస్వామి రాజు అగ్రగణ్యులు. ‘జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేల’ అన్నట్లుగా, ఆయన ప్రతిభ గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం నేపథ్యం కలిగిన ఎల్.ఐ.సి రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆర్.సి. కృష్ణస్వామి రాజు, తన రచనల్లో సామాజిక ఖచ్చితత్వాన్ని ప్రదర్శిస్తారు. ఆయన పూర్వ రచనలైన ‘మేకలబండ’ మరియు ‘మునికిష్టడి మాణిక్యం’లలో గ్రామీణ సహజత్వాన్ని లోతైన తాత్విక చింతనతో మిళితం చేశారు; అక్కడ జంతువులను లేదా పిల్లలను మాధ్యమంగా చేసుకుని పెద్దల లోకంలోని లోపాలను విమర్శించారు. అయితే, ‘చింతల చేను’లో ఆ మాధ్యమం ఒక యంత్రంగా (ట్రాక్టర్) మారింది. ‘మా తెలుగు తల్లికి’ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి గారికి ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వడం ద్వారా రచయిత తన సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటుకున్నారు. నవల మాత్రం ఆధునిక ఆర్థిక భారాల కింద నలిగిపోతున్న అదే సంస్కృతి యొక్క విషాదాన్ని ఆవిష్కరిస్తుంది. తాజా నవల ‘చింతల చేను’ కేవలం ఒక కథ కాదు; ఇది రాయలసీమ పల్లె గుండె చప్పుడు. ఇది ఒక ‘వ్యథార్థ జీవిత యథార్థ దృశ్యం’.
ఈ నవల నేపథ్యంగా చిత్తూరు జిల్లా (రాయలసీమ) ఉండటం అనేది కేవలం యాదృచ్ఛికం కాదు, అది అనివార్యం. కరువుకు నిలయమైన ప్రాంతంగా లేదా ‘రాళ్లసీమ’ (రాళ్ల భూమి) గా పిలవబడే రాయలసీమ, అక్కడి ప్రజల బతుకుల వలె అప్పులతో నిండిన మట్టిని నేపథ్యంగా కలిగి ఉంది. ‘చింతల చేను’ అనే శీర్షికలోనే తెలుగు భాషకు సహజమైన ఒక ద్వంద్వార్థం ఉంది: ‘చింత’ అంటే ఎడారి లాంటి ఆ భూముల్లో పెరిగే ‘చింతచెట్టు’ అని అర్థం, అదే సమయంలో ‘చింత’ అంటే ‘దుఃఖం’ లేదా ‘వేదన’ అని కూడా అర్థం. ఆ విధంగా, ఈ ‘చింతచెట్ల చేను’ అక్షరాలా ‘వేదనల చేను’గా మారుతుంది. ఈ భౌగోళిక ప్రాంతంలో సాగు చేయడం అంటే వేదనను అనుభవించడమేనన్న నవలా ప్రధాన సూత్రాన్ని ఈ అర్థాల సంగమం మనకు స్పష్టం చేస్తుంది.
సాహిత్యం అనేది సమాజానికి దర్పణం వంటిది. ఆ దర్పణంలో మన ముఖాలు మనం చూసుకున్నప్పుడు, కొన్నిసార్లు ఆనందం, మరికొన్నిసార్లు విషాదం తారాడుతుంటాయి. వెలుగునీడలు, తెలుపునలుపులూ కనిపిస్తాయి. ‘చింతల చేను’ నవలలో కూడా కనిపించేవి అవే ద్వంద్వాలు. విషాదాన్ని దిగమింగుకుని బతికే మనిషి మొండి ధైర్యం. ఈ నవల చదువుతుంటే, ఇంతకుమునుపు ఏ రచయిత వైరుధ్యభావనల గురించి చర్చించుకున్నామో, అదే ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి: “Art is not a handicraft, it is the transmission of feeling the artist has experienced.” అవును, కృష్ణస్వామికి కళ అనేది చేతివృత్తి కాదు, అనూచానంగా రాలేదు, పోనీ అభ్యాసం కూసువిద్యలా అబ్బలేదు. కళాకారుడు అనుభవించిన అనుభూతిని ప్రసారం చేయడమే ఆయన రచనా వ్యాసాంగం. దాని ప్రకారమే చిత్తూరు జిల్లా పల్లెల్లో తాను చూసిన, స్పృశించిన జీవితాలను అక్షరబద్ధం చేశాడు, తన ‘చింతల చేను’ రచనలో.
గతంలో ఆయన రచించిన ‘మునికిష్టడి మాణిక్యం’ నవలలో బాలల అమాయకత్వాన్ని, జిజ్ఞాసను అద్భుతంగా ఆవిష్కరించాడు. ఇప్పుడు ‘చింతల చేను’ ద్వారా పెద్దల ప్రపంచంలోని సంక్లిష్టతలను, ముఖ్యంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతు బతుకును మన కళ్లకు కట్టాడు. గుణశేఖరుడు అనే సామాన్య రైతు ప్రయాణం – ప్రసిద్ధ రచయిత జాన్ స్టెయిన్‌బెక్ చిత్రించిన అమెరికన్ రైతుల వెతలతోనూ, ఇటాలియన్ నియో-రియలిజం చిత్రాలలోని పేదరికంతోనూ సరిపోలడం విశేషం.
ఈ నవల తిరుపతికి సమీపంలోని ఒక పల్లెటూరిలో, మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. కథానాయకుడు గుణశేఖరుడు. అతనికి ఒక ఆశ. తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని, తన కుటుంబాన్ని పేదరికం నుండి గట్టెక్కించాలని. ఆ ఆశకు ఆలంబనగా ఒక ట్రాక్టర్. ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇది కేవలం యంత్రం కాదు, అతని భవిష్యత్తుకు బాటలు వేసే రథం అని అతను నమ్ముతాడు. కానీ, ఆ ట్రాక్టర్ కొనడానికి అతను సిద్ధిరాజు అనే వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేయాల్సి వస్తుంది. ఇక్కడే కథలోని అసలైన సంఘర్షణ మొదలవుతుంది. అప్పు అనేది రైతు మెడలో వేలాడే కత్తి లాంటిదని మనందరికీ తెలుసు. షేక్స్‌పియర్ తన ‘హ్యామ్లెట్’ (Hamlet) నాటకంలో అంటాడు ‘Neither a borrower nor a lender be’. అప్పు ఇవ్వడం గురించి పక్కనపెడితే, అప్పు చేయకుండా బతుకు బండి లాగడం – గుణశేఖరుడికే కాదు, మూడో ప్రపంచదేశాల్లోని ఏ రైతుకీ వీలుపడదు.
ఇక చేసిన అప్పు తీర్చడానికి గుణశేఖరుడు పడే పాట్లు, అతను ఎదుర్కొనే మనుషులు, వారి విచిత్ర మనస్తత్వాలు ఈ నవలకు ప్రాణం పోస్తాయి. ట్రాక్టర్ నడపడం ద్వారా వచ్చే ఆదాయం కోసం అతను రకరకాల రైతుల పొలాల్లో పని చేస్తాడు. కానీ, అందరూ నిజాయితీగా డబ్బులు ఇవ్వరు. పని చేయించుకుని పూర్తి డబ్బులు చెల్లించిన నిజాయితీపరుడు – ఏలుమలై; పని జరిగిపోయాక, సగం డబ్బులు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటాడు సుబ్బరాముడు, ఇక నరసరాజు – అసలు డబ్బే ఇవ్వలేకపోయిన నిస్సహాయుడు. ఈ పాత్రల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని అనిశ్చితిని, అంతరాలనీ అద్భుతంగా చిత్రించాడు రచయిత. ఒక రైతు మరో రైతుకు సహాయం చేయలేని దుస్థితిని కళ్ళకు కట్టినట్లు చూపించాడు.
గుణశేఖరుడి పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచేది అతని కుటుంబం. గుణశేఖరుడి తల్లి నారాయణమ్మ పాత తరం మనిషి. ఆమెకు ఆధునిక యంత్రాలపై పెద్దగా నమ్మకం లేకపోయినా, కొడుకు మీద ఉన్న ప్రేమతో మద్దతు ఇస్తుంది. ఆమె మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూనే, కొడుకు విజయం కోసం పరితపిస్తుంది గుణశేఖరుడి భార్య. హైమవతి సంసార సాగరాన్ని ఈదడంలో భర్తకు తోడుగా నిలుస్తుంది. అప్పుల భయం ఆమెను వెంటాడుతున్నా, పైకి ధైర్యం ప్రదర్శిస్తుంది. వీరి కొడుకు బాలాజీ – అమాయకత్వానికి ప్రతిరూపం. ట్రాక్టర్ వస్తే తమ కష్టాలన్నీ తీరిపోతాయని, కారులో తిరగవచ్చని కలలు కనే పసివాడు. ఈ నలుగురి మధ్య జరిగే సంభాషణలు, వారి మధ్య ఉండే అనుబంధం, భయాలు, ఆశలు.. ఇవన్నీ మన ఇళ్ళలో జరుగుతున్నట్లే అనిపిస్తాయి. బాలాజీ తన మట్టి హుండీని పగులగొట్టి, అందులోని చిల్లరను తండ్రికి ఇచ్చే సన్నివేశం పాఠకుల గుండెలను పిండేస్తుంది. ఇది ‘ఉడుత సాయం’ అని బాలాజీ అనడం, అతనిలోని పరిణతిని చూపిస్తుంది.
ఈ కథలో ట్రాక్టర్ ఒక జడ పదార్థం కాదు. అది ఒక పాత్ర. ఆ పాత్ర ‘చింతల చేను’ను కేవలం ఒక ప్రాంతీయ సాహిత్యంగా పరిమితం చేయకుండా, దానిని అంతర్జాతీయ వ్యవసాయ మరియు అస్తిత్వ సాహిత్య స్రవంతిలో నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది. పైన ప్రస్తావించిన జాన్ స్టెయిన్‌బెక్ కథల్లోని ఓక్లహోమా, విట్టోరియో డి సికా గారి యుద్ధానంతర రోమ్ నగరం, మున్షీ ప్రేమ్‌చంద్ చిత్రించిన ఉత్తర భారత రైతు జీవితాలు మరియు ఆంటోన్ చెకోవ్ రచనల్లోని రష్యన్ స్థబ్దతను గుర్తుచేసుకుంటూ, కథానాయకుడు గుణశేఖరుడి పోరాటంలోని సార్వత్రికతను మనం ఇక్కడ గుర్తిస్తాం. అంతేకాకుండా, నీషే (Nietzsche) ప్రతిపాదించిన రుణ నైతికత (debt morality), ఆల్బర్ట్ కామూ (Camus) అబ్సర్డిజం వంటి తాత్విక చట్రాల ద్వారా, ఆధునిక ఆర్థిక ఒత్తిళ్ల మధ్య చిక్కుకున్న ఒక రైతు మానసిక స్థితిని మనం విశ్లేషించవల్సి ఉంటుంది.
‘చింతల చేను’ నవలలోని ప్రధాన సంఘర్షణ గుణశేఖరుడు ఒక ‘సెకండ్ హ్యాండ్’ ట్రాక్టర్‌ను కొనాలని తీసుకున్న నిర్ణయం చుట్టూ తిరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఈ ట్రాక్టర్ నవలకు ఒక ‘గురుత్వాకర్షణ కేంద్రం’ (Gravitational Center) వంటిది; దీని చుట్టూనే ఆ కుటుంబపు ఆశలు, ఆశయాలు మరియు వినాశనం పరిభ్రమిస్తాయి. దీని ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలంటే, మనం దీనిని జాన్ స్టెయిన్‌బెక్ రాసిన ‘The Grapes of Wrath’ నవలతోనూ, వ్యవసాయ యాంత్రీకరణ చరిత్రతోనూ పోల్చి చూడాలి. స్టెయిన్‌బెక్ తన నవలలో ట్రాక్టర్‌ను ఒక ‘చప్పిడి ముక్కు రాక్షసి’ (Snub-nosed monster) గా అభివర్ణించాడు. అది మనిషికి, మట్టికి మధ్య ఉన్న అనుబంధాన్ని తెంచివేసే ఒక యాంత్రిక మృగం! స్టెయిన్‌బెక్ కథనంలో ట్రాక్టర్ డ్రైవర్ తన వర్గానికే ద్రోహం చేసే ఒక ‘సీటులో కూర్చున్న రోబో’. ఆ యంత్రం “భూమిని దున్నుతుంది, కానీ మనుషులను భూమి నుండి వెళ్లగొడుతుంది (But this tractor does two things – it turns the land and it turns us off the land)”. అలా దాని రెండు ముఖాల్నీ చూస్తాడు స్టెయిన్‌బెక్. అక్కడ ట్రాక్టర్ అనేది బ్యాంకులకు ఒక ఆయుధం, రైతులను సాగు నుండి వెలివేసే పెట్టుబడిదారీ వ్యవస్థకు భౌతిక రూపం.
ప్రఖ్యాత ఆఫ్రో – అమెరికన్ రచయిత చినెవ అచెబె రచించిన ‘థింగ్స్ ఫాల్ అపార్ట్’ (Things Fall Apart) నవలలో మతప్రబోధకుడు ‘ఇనుప గుర్రం’ అంటే సైకిల్ మీద వస్తాడు. ఆ సైకిల్ విచ్ఛిన్నకర ఆధునికతకు ఒక గుర్తు అని అన్యాపదేశంగా చెబుతాడు రచయిత. అది ఒక ‘ట్రోజన్ గుర్రం’ లాంటిది. అది ఒక పాస్టర్‌ని కాదు మోసుకొచ్చింది, linear, individualistic, ఇంకా mechanized ప్రాపంచిక దృక్పథం ఉన్న విదేశీ తర్క దృష్టిని. అది Umuofia సమాజానికి ఉండే ఆ ఉమ్మడి జీవన సౌరభానికి, ప్రకృతితో ముడిపడిన అక్కడి నైసర్గిక పద్ధతులకు ఇది పూర్తిగా విరుద్ధం. యాంత్రికమైన, కేవలం వ్యక్తిగత ప్రయోజనాల చుట్టూ తిరిగే ఆలోచనా ధోరణిని మన ముందుకు తెస్తుందని చినెవ అచెబె భావన. ఆ ‘ఇనుప గుర్రం’ (సైకిల్) ఒక నిర్ణీతమైన దారిలోనే సాగుతుంది. ఇది వలసవాద ధోరణికి నిలువుటద్దం. ఆ నేల మీద ఉన్న పూర్వీకుల జీవన గమనాన్ని ఇది అస్సలు పట్టించుకోదు. దాని ఉనికి ఒక భావజాల దురాక్రమణ లాంటిది. స్థానిక జీవన విధానాలను తక్కువ చేసి చూపే ఒక సాంకేతిక ఆధిక్యతకు ఇది నిదర్శనం. క్రైస్తవ మతం ఈ వాహనం మీద రావడం అంటే అది కేవలం విశ్వాసానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఒక వ్యవస్థీకృత దాడికి సంకేతం. ఆధ్యాత్మికంగా లొంగదీసుకోవడం ద్వారా ఒక సంస్కృతిని, రాజకీయ అస్తిత్వాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం ఇది. అభివృద్ధి అనే ముసుగులో వలసవాద అధికారం ఏ విధంగా ఒక సహజమైన సమాజాన్ని ముక్కలు చేసిందో ఈ చిహ్నం స్పష్టంగా వివరిస్తుంది. ఈ నవలకి సుమారు 50 ఏళ్ల ముందే గాంధీ మహాత్ముడు తన ‘హింద్ స్వరాజ్’ లో హెచ్చరించింది కూడా అదే. కాలచక్రం దశాబ్దాలుగా ఒక శతాబ్దం తిరిగి పోస్ట్ మోడ్రన్ గుణశేఖరుడి యుగానికి వచ్చినప్పుడు, ట్రాక్టర్ అనే ‘యంత్రభూతపు కోరలు’ తోమకతప్పదనే కఠోర వాస్తవాన్ని ప్రకటించాడు రచయిత కృష్ణస్వామి రాజు. ఆ ట్రాక్టర్ చప్పుడులో గుణశేఖరుడి గుండె చప్పుడు వినిపించాడు.
అయితే, ‘చింతల చేను’లో ట్రాక్టర్ పాత్ర మరింత సంక్లిష్టంగా, అస్పష్టంగా (Ambivalent) ఉంటుంది. గుణశేఖరుడికి ఈ ట్రాక్టర్ మొదట్లో వినాశనకారిగా అనిపించదు, అదొక ‘ఆశా నౌక’. అది ఆధునికతకు చిహ్నం; శారీరక శ్రమ నుండి, ఎద్దుల బండి పరిమితుల నుండి విముక్తి పొందే ఒక మార్గం. ఇక్కడ ట్రాక్టర్ రైతును భూమి నుండి వెల్లగొట్టడానికి కాదు, రైతును భూమిపై నిలబెట్టడానికి వచ్చింది. గుణశేఖరుడు ట్రాక్టర్‌ను ప్రేమిస్తాడు. అది తన పేదరికాన్ని పారద్రోలే ఆయుధమని నమ్ముతాడు. అతను తన భూమి నుండి వెలివేయబడకుండా ఉండటానికి, అంటే తన ఉనికిని కాపాడుకోవడానికి అవసరమైన పెట్టుబడిని సంపాదించడానికే ఈ ట్రాక్టర్‌ను ఆశ్రయిస్తాడు. కానీ, విధి వైపరీత్యం ఏమిటంటే, అదే ట్రాక్టర్ చివరికి అతనికి శాపంగా మారుతుంది. ఇంకా విషాదం ఎక్కడ ఉందంటే – చివరికి ఈ రెండు దృక్పథాలూ ఒకే చోట కలుస్తాయి. గుణశేఖరుడు తన విధికి తనే యజమాని కావాలని ట్రాక్టర్ కొంటాడు, కానీ ఆర్థిక వాస్తవికత అతన్ని ఆ యంత్రానికే ‘సేవకుడిని’ చేస్తుంది. దాని కోసం సిద్ధిరాజు దగ్గర అప్పు చేయడం ద్వారా అతను అక్షరాలా ‘వెట్టి’కి (Indentured) లోనవుతాడు. విముక్తికి సాధనం కావాల్సిన ట్రాక్టర్, అతన్ని అట్టడుగుకు తొక్కే భారం అవుతుంది. స్టెయిన్‌బెక్ ట్రాక్టర్ ఎలాగైతే ‘నేలను ప్రేమించదో’, గుణశేఖరుడి సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కూడా ఒక పరాయి జీవిలా ప్రవర్తించి, చివరికి తంజావూరు సుబ్రహ్మణ్యం కయ్యల్లో అతని చేయి విరిగేలా చేస్తుంది. రక్షకుడు – భక్షకుడిగా మారిన వైనం ఇది. తనను కాపాడుతుందని నమ్మి తెచ్చుకున్న యంత్రమే, తన జీవనాధారమైన చేతిని విరిచేయడం. సూక్ష్మంగా చూస్తే, ఈ సంఘటన ద్వారా రచయిత యాంత్రీకరణ వెనుక ఉన్న ప్రమాదాల్ని ప్రదర్శించాడు రచయిత. యజమానిపై యంత్రం చేసిన ఈ భౌతిక దాడి, ఆధునిక వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న ‘పారిశ్రామిక ప్రమాదానికి’ ఒక పదునైన రూపకం.
ట్రాక్టర్ కొనుగోలు అనేది సంప్రదాయ వ్యవసాయ విలువల నుండి ‘సాంకేతిక వ్యామోహం’ (Fetishism of Technology) వైపు మారిన దిశను సూచిస్తుంది. నవలలో చిత్రించిన గ్రామీణ మనస్తత్వంలో ట్రాక్టర్ అనేది ఒక ‘హోదా’కు చిహ్నం; ఆధునిక జీవితపు ఊరేగింపులో చేరడానికి అది ఒక టికెట్. అది కేవలం ఒక పనిముట్టు మాత్రమే కాదు, అది ఒక ‘పెట్టుబడి’. అయితే, అది ‘సెకండ్ హ్యాండ్ పెట్టుబడి’. ఈ పదం ఇక్కడ చాలా ముఖ్యం. గుణశేఖరుడు ఆధునికత ఇచ్చే మెరిసే కొత్తదనాన్ని కొనుగోలు చేయలేడు; ధనిక వర్గం వదిలేసిన పాత సాంకేతికతను మాత్రమే అతను అందుకోగలడు. అతను యాంత్రీకరణ అనే కలని కొంటాడు కానీ, నిర్వహణ ఖర్చులు మరియు పాత యంత్రం ఇచ్చే అనిశ్చితి వల్ల మొదటి నుండే వెనుకబడిపోతాడు.
ఇది భారతదేశంలోని చిన్నకారు రైతులపై పడుతున్న యాంత్రీకరణ ప్రభావానికి అద్దం పడుతుంది. యంత్రం తనంతట తాను ఉత్పత్తిని ప్రారంభించే ముందే డబ్బును మింగేయడం మొదలుపెడుతుంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ వెంకటముని ఇచ్చే ఒత్తిడి దీనికి ఉదాహరణ. ఎద్దుల వంటి సేంద్రీయ వనరులు తాము పండించే పంట వ్యర్థాలనే తిని పెరుగుతాయి, కానీ ట్రాక్టర్ మాత్రం ‘నగదు’ను (Cash) ఆహారంగా తీసుకుంటుంది. ఇది రైతును మార్కెట్ ఆర్థిక వ్యవస్థతో మరియు వడ్డీ వ్యాపారులతో మరింత బలంగా బంధిస్తుంది.
నవలలో ట్రాక్టర్ అనేది భౌతిక పరమైన ప్రతినాయకుడు (Physical Antagonist) అయితే, ‘అప్పు’ అనేది ఈ కథకు ఒక అతీంద్రియ వాతావరణం (Metaphysical Atmosphere) వంటిది. రచయిత ఈ కథనాన్ని అప్పులు, వడ్డీలు, చెల్లింపులు మరియు ఎగవేతల కలయికతో కూడిన ఒక ‘జీవన చలనచిత్రం’గా అభివర్ణించారు. ఫ్రెడరిక్ నీషే ప్రతిపాదించిన రుణ నైతికత గురించి పైన ప్రస్తావన వచ్చింది కదా. నీషే తన ‘ఆన్ ద జెనియాలజీ ఆఫ్ మొరాలిటీ’ (On the Genealogy of Morality) గ్రంథంలో ఒక ఆసక్తికరమైన వాదన చేస్తాడు. ‘అపరాధ భావం’ (Guilt/Schuld) అనే ప్రాథమిక భావన ‘అప్పు’ (Debt/Schulden) అనే ఆర్థిక మూలం నుండి పుట్టిందంటాడు. సమాజంలో రుణదాతకు, రుణగ్రహీతకు మధ్య ఉన్న బంధమే అత్యంత పురాతనమైన సామాజిక సంబంధం; ఇది కేవలం డబ్బు చెల్లింపు మీద మాత్రమే కాదు, శిక్ష అనే భయం మీద కూడా ఆధారపడి ఉంటుంది.
గుణశేఖరుడి ఉనికి ఈ సంబంధం చుట్టూనే అల్లబడింది. సిద్ధిరాజుకు అప్పు పడటం వల్ల అతని అస్తిత్వమే మారిపోయింది (Ontological shift). అతను ఇప్పుడు కేవలం ఒక రైతు లేదా తండ్రి మాత్రమే కాదు; అతను ఒక ‘బాకీదారుడు’. ఈ స్థితి అతనిలో ఒక ‘అపరాధ మనస్సాక్షి’ని (Bad conscience) కలిగిస్తుంది. నవల పొడవునా మనకు కనిపించే ‘వ్యథ’ (Agony) అనేది తీర్చలేని అప్పు వల్ల కలిగే మానసిక రూపమే. డబ్బు చెల్లించలేనప్పుడు, రుణదాత తన విలువను రాబట్టుకోవడానికి అప్పు తీసుకున్నవాడిపై క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాడని, అతని ‘బాధను’ లేదా ‘శరీరాన్ని’ చెల్లింపుగా భావిస్తాడని నీషే అంటారు. ఫ్రెడరిక్ నీషే తన ‘ఆన్ ద జెనియాలజీ ఆఫ్ మొరాలిటీ’లో చెప్పినట్టుగా, ‘అపరాధభావం’ అనేది ‘అప్పు’ అనే ఆర్థిక మూలం నుండి పుట్టింది. అప్పు తీర్చలేని స్థితిలో, ఆ వ్యక్తి అనుభవించే బాధనే రుణదాత తనకు దక్కిన పరిహారంగా భావిస్తాడు. షేక్స్‌పియర్ సృష్టించిన షైలాక్ (Shylock) పాత్ర ఈ సిద్ధాంతానికి నిలువెత్తు నిదర్శనం. అప్పు తీసుకున్న ఆంటోనియో నిర్ణీత సమయంలో డబ్బు తిరిగి ఇవ్వకపోతే, బదులుగా అతని శరీరం నుండి ‘ఒక పౌండ్ మాంసాన్ని’ కోసి తీసుకుంటానని షైలాక్ ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇక్కడ డబ్బు కంటే కూడా, అప్పు తీసుకున్నవాడిపై రుణదాతకు ఉండే క్రూరమైన అధికారం కనిపిస్తుంది. నీషే వాదన ప్రకారం—డబ్బు చెల్లించలేనప్పుడు ఆ ‘బాధను’ అనుభవించడమే ఒక పరిహారంగా మారుతుంది. షైలాక్ కోరిన ఆ మాంసం ముక్క, మనిషి శరీరాన్ని ఒక ఆస్తిగా లేదా సరుకుగా మార్చిన వైనాన్ని మనకు చూపిస్తుంది. సమాజంలోని అత్యంత ప్రాచీనమైన రుణదాత-రుణగ్రహీత బంధం ఎంతటి హింసతో, అణిచివేతతో మొదలైందో ఈ రెండు ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ సిద్ధిరాజు నేరుగా గుణశేఖరుడి మాంసాన్ని కోరకపోయినా, అప్పు తీర్చడానికి పడే మానసిక ఒత్తిడి, సామాజిక అవమానం మరియు చివరికి ఆ ట్రాక్టర్ పనుల్లో విరిగిన గుణశేఖరుడి చేయి – ఇవన్నీ ఆ అప్పుకు ‘శారీరక చెల్లింపు’లే (Corporeal payment). ఆ విరిగిన చేయి, అతనిపై ఉన్న అతీంద్రియ రుణ భారానికి భౌతిక సాక్ష్యం.
మార్క్సిస్ట్ దృక్కోణంలో చూస్తే, ‘చింతల చేను’ నవల భూస్వామ్య వ్యవసాయ వ్యవస్థ నుండి పెట్టుబడిదారీ వ్యవస్థ వైపు జరుగుతున్న పరిణామాన్ని చూపిస్తుంది. ఇక్కడ సామాజిక సంబంధాలన్నీ కేవలం ‘డబ్బు’ ద్వారానే నిర్ణయించబడతాయి. టీ దుకాణం యజమాని నుండి కూలీల వరకు ప్రతి ఒక్కరూ ఆర్థిక లావాదేవీల వలయంలో చిక్కుకున్న పాత్రలే. పెట్టుబడిదారీ వ్యవస్థలో మనుషుల మధ్య సంబంధాలు ‘వస్తువుల మధ్య సంబంధాలు’గా (Relationships between things) మారిపోతాయని మార్క్స్ వాదించారు. నవలలో గుణశేఖరుడికి మరియు ఎలుమలై లేదా సుబ్బరాముడు వంటి ఇతర పాత్రలకు మధ్య ఉన్న సంబంధం కేవలం ‘ట్రాక్టర్ పని గంటల’ మార్పిడికే పరిమితమైంది. సుబ్బరాముడు సగం డబ్బు మాత్రమే ఇచ్చినప్పుడు లేదా నరసరాజు అసలు ఇవ్వనప్పుడు, అది కేవలం ఆదాయ నష్టం మాత్రమే కాదు; గుణశేఖరుడి మనుగడకు అవసరమైన సామాజిక ఒప్పందం విచ్ఛిన్నమవ్వడం. డేవిడ్ గ్రేబర్ తన ‘డెట్: ది ఫస్ట్ 5000 ఇయర్స్’ లో వివరించినట్టు, ప్రభుత్వం విఫలమైన చోట సిద్ధిరాజు వంటి అనధికారిక రుణ వ్యవస్థలు రాజ్యమేలుతాయి. ఇది ఒక వ్యక్తిగత సమస్యగా అనిపించినా, ఇది వ్యవస్థాగతమైన హింస.
అప్పుల్లో ఉన్న రైతు మానసిక స్థితిని సోరెన్ కీర్కెగార్డ్ చెప్పిన ‘నిస్పృహ’ (Despair) కోణంలో చూడవచ్చు. కీర్కెగార్డ్ దృష్టిలో నిస్పృహ అనేది ‘మరణాంతకమైన వ్యాధి’ (Sickness unto death). గుణశేఖరుడిలో ‘అనివార్యత వల్ల కలిగే నిస్పృహ’ (Despair of necessity) కనిపిస్తుంది; అంటే అప్పు తీర్చలేని అశక్తత అతన్ని క్రంగదీస్తుంది. మరోవైపు, ట్రాక్టర్ కొంటే జీవితం మారిపోతుందనే ‘అతి ఆశ’ వల్ల కలిగే నిస్పృహ (Despair of possibility) కూడా ఉంది.
అతను ట్రాక్టర్ కొనడానికి ప్రేరేపించిన ఆ ‘ఆశ’ను కీర్కెగార్డ్ ‘క్షణికమైన ఆశ’ (Immediate hope) అని అంటారు. ఎప్పుడైతే ట్రాక్టర్ పాడైపోయి, వాయిదాలు చెల్లించలేకపోయారో, అప్పుడు అతనిలోని అసలైన నిస్పృహ బయటపడుతుంది. అప్పుల ఊబిలో ఉన్న ఆందోళనకు, అద్భుతం జరుగుతుందనే భ్రమకు మధ్య గుణశేఖరుడు పడే ఈ కొట్టుమిట్టాడుడు, అక్షరాలా వ్యవసాయ చక్రంలోని ‘విత్తడం’ (ఆశ) మరియు ‘కరువు’ (నిస్పృహ)లను పోలి ఉంటుంది.
***
ఆర్.సి. కృష్ణస్వామి రాజు రచనల్లోని ప్రత్యేకత ఏమిటంటే, ఆయన పాత్రలను సృష్టించరు, సమాజం నుండి ఏరుకుంటారు. ఈ నవలలో మనకు కనిపించే పాత్రలన్నీ మన చుట్టూ తిరిగే మనుషులే. రచయిత మాటల్లో చెప్పాలంటే, ఇది ‘పాత్రల ఊరేగింపు’ – ఈ నవలలో రకరకాల మనుషులు, వారి విభిన్న ప్రవృత్తులు కనిపిస్తాయి. వడ్డీ వ్యాపారి సిద్ధిరాజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక అనివార్యమైన చెడు. వసూళ్లలో కఠినంగా ఉండే ఇతన్ని అందరూ ‘కాబూలీ వాలా’ అని పిలుస్తుంటారు. మరోవైపు, ఇన్సూరెన్స్ ఏజెంట్ వెంకటముని ఆధునిక ఆర్థిక సాధనాలను పల్లెలకు పరిచయం చేసే కీలక మధ్యవర్తిగా కనిపిస్తాడు. ఇక ఊరి వార్తలన్నింటికీ కేంద్ర బిందువు మీనాక్షయ్య టీ కొట్టు. అందరికీ సలహాలిచ్చే పెద్దమనిషిగా ఆయన అక్కడ మనకు తారసపడతారు.
గ్రామీణ సృజనాత్మకతకు బాలచంద్రుడు ఒక నిదర్శనం. బైక్‌కు ట్రాలీని అమర్చి ఆటోలా మార్చి నడుపుతూ తన వినూత్న ఆలోచనలను చాటుకుంటాడు. కళ పట్ల అంకితభావం ఉన్న నీలిరాజు లాంటి కవులు కుప్పంలో శిక్షణ పొంది, ఉచితంగా పుస్తకాలు పంచుతూ కనిపిస్తారు. చెన్నైలో చదువుకునే మిసిమి ఊరికి వచ్చినప్పుడు ‘లాఫింగ్ క్లబ్’ వంటి ఆధునిక భావాలను పరిచయం చేస్తుంది. వీరందరి మధ్య, ఎలుకతో సోదె చెప్పే జోస్యగాడు నేటికీ పల్లెల్లో కొనసాగుతున్న మూఢనమ్మకాలకు ఒక ప్రతిరూపంగా నిలుస్తాడు.
ఇందులో రచయిత వాడిన భాష పూర్తి మాండలికమని అనడానికి లేదు. మాండలికపు సొబగులు తెలిసిన రాయలసీమ రచయితలలో ఆర్.సి. కృష్ణస్వామి రాజు ఒకడు. ఆయన రచనలు అన్నింటిలో ఆ సొబగులు తొణికిసలాడుతుంటాయి. భాష కేవలం భావ వ్యక్తీకరణ సాధనం మాత్రమే కాదు; అది పాత్రల మూలాలను, వారి సామాజిక వర్గాన్ని, ఇంకా వారు అనుభవించే వాస్తవికతను ప్రతిబింబించే ఒక బలమైన అస్తిత్వ ఆనవాలు. భౌగోళికంగా తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉండటం వల్ల ఈ యాసపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన స్రవంతి మీడియా మరియు సాహిత్యంలో తరచుగా కనిపించే కోస్తాంధ్ర ప్రామాణిక భాషకు భిన్నంగా, అట్టడుగున పడి ఉన్న ఈ మాండలికాన్ని వాడటం అనేది ఒక రకమైన ‘సాహిత్య రాజకీయ చర్య’. అంటే, పరిధుల మీద ఉన్న ఒక భాషా సంస్కృతికి అగ్రపీఠం వేయడమే. చిత్తూరు జిల్లా మాండలికాన్ని ఎంతో సహజంగా వాడతాడు కృష్ణస్వామి. పాత్రలు మన పక్కనే నిలబడి మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ‘చింతల చేను’ నవలలో ఆయన విభిన్నమైన ప్రక్రియ ప్రయోగించాడు – మట్టి వాసనల మాండలికాన్ని శిష్ట వ్యావహారికంతో మేళవించి ఒక ప్రామాణిక భాషని వాడాడు. స్థానిక ప్రజల భాషని యథాతథంగా వాడటం ఏ రచయితకీ సాధ్యంకాదు. ఆ సంభాషణల్లో బూతులు చాలా సహజంగా చొరబడి ఉంటాయి. వాటిని సహజత్వం పేరిట వాడటం సభ్యత కాదు, కళ కిందకి రాదు. కేవలం మౌఖికతకి సంబంధించిన శాబ్దిక అంశమే కాదు, ఏ సంభాషణలో అయినా శబ్దంతో పాటు దృశ్యం కూడా కలగలిసి ఉంటుంది; ముఖ కవళికలు, హావభావాలు, కనుసైగలు, చేయి కదలికలూ – అన్నీ కలగలిసినదే సంభాషణ; కాబట్టి దృశ్యప్రధానమైన కళారూపాల్లో మాత్రమే సాధ్యమయ్యే మాండలిక భాషాప్రయోగం, రచనలో తీసుకురావడం కష్టం. ఆ ఎరుకతోనే కావొచ్చు, ‘చింతల చేను’ నవలలో ఫక్తు మాండలికం భాషని కృష్ణస్వామి వాడలేదనిపిస్తోంది. ఈ నవలలోని పదజాలం అంతా ఆ ప్రాంతపు వ్యవసాయ మూలాల నుండి పుట్టినది. ‘కయ్యలు’ (చిన్న పొలాలు), ‘అంగడి’ (షాపు/సంత) వంటి పదాలు కేవలం మాండలిక సౌందర్యం కోసం వాడినవి కావు; అవి ఒక నిర్దిష్ట ఆర్థిక స్థితికి సంకేతాలు. ‘కయ్యలు’ అనే పదం భూమి విచ్ఛిన్నతను సూచిస్తుంది – అంటే భూమి చిన్న చిన్న ముక్కలై, సాగుకు అనువుగా ఉన్నా, రైతు బతుకు గడవడానికి అవి సరిపోవని అర్థం. అలాగే ‘అంగడి’ అనేది కేవలం వస్తువులు కొనే చోటు కాదు; అది సామాజిక సంబంధాలకు మరియు ‘అప్పుల’ లావాదేవీలకు కేంద్ర బిందువు.
చిత్తూరు మాండలికానికి కొన్ని ప్రత్యేకమైన ధ్వని లక్షణాలు ఉన్నాయి. క్రియల చివర వచ్చే మార్పులు, తమిళ వాక్య నిర్మాణ ప్రభావం దీనికి ఒక రకమైన ‘మట్టి వాసన’ను, ‘గ్రామీణ సహజత్వాన్ని’ ఇస్తాయి. బయటి వారికి ఇది నాగరికం కాదనిపించినా, స్థానిక ప్రజలకు మాత్రం ఇది అత్యంత ప్రాణప్రదమైన భాష. ఉదాహరణకు, పేర్ల చివర ‘రంగమామలు’ (రంగ మామ) వంటి బంధుత్వ వరుసలు చేర్చడం వల్ల అక్కడ ఒక బలమైన సామాజిక బంధం కనిపిస్తుంది. అయితే, ఈ బంధమే ఒక్కోసారి ఊపిరి సలపనివ్వదు. ఊరంతా ‘మామ’, ‘అన్న’ అయినప్పుడు, రైతు చేసే అప్పు అనేది ఒక వ్యక్తిగత విషయం కాకుండా ‘సామూహిక పరువు’కు సంబంధించిన సమస్యగా మారి వేధిస్తుంది. రచయిత కృష్ణస్వామి ఆ ప్రాంతపు భౌతిక సంస్కృతిని ప్రతిబింబించే సామెతలను, పదబంధాలను అద్భుతంగా వాడారు. ఒక కారు ఎంత శుభ్రంగా ఉందో చెప్పడానికి వాడిన ‘పాలు పోసి పాలు ఎత్తుకునేంత శుభ్రంగా’ అనే వర్ణన గ్రామీణ ఇమేజరీకి ఒక గొప్ప ఉదాహరణ. రైతు ఇంట్లో పాలు అనేది అత్యంత పవిత్రమైనది, విలువైనది. అటువంటి పాలను కింద పోసి మళ్ళీ తీసుకోవచ్చు అన్నంత శుభ్రతను, యంత్రాల యజమాని కలిగి ఉన్న విలాసంతో పోల్చడం ఇక్కడ విశేషం. ఇది ఒక వర్గ వైవిధ్యాన్ని చూపిస్తుంది: రైతుకు పాలు అనేది ‘ఉత్పత్తి’; కారు యజమానికి శుభ్రత అనేది గ్రామీణ దుమ్మును ఎదిరించే ‘హోదా’. అంతేకాకుండా, ఈ మాండలికం తనలో నిగూఢంగా ఉన్న ‘వ్యథ’ను (వేదనను) మోస్తుంది. చిత్తూరు యాసలోని లయ (Rhythm) ఆ ప్రాంతపు కఠినమైన భూభాగాన్ని పోలి ఉంటుంది. ఇది వేడిలో, కొరతలో పుట్టిన భాష. ఈ మాండలిక – శిష్టవ్యావహారిక సమ్మిశ్రిత భాష ద్వారా, రచయిత పాఠకులను చిత్తూరు జనారణ్యంలోకి, అక్కడి గ్రామీణ జీవితపు ‘పరవళ్ళు తొక్కే’ ప్రవాహంలోకి తీసుకెళ్తారు.
అలా స్థానికతలో సార్వజనీనతని సాధించే ఆ ప్రయత్నం వల్ల కాబోలు ‘చింతల చేను’ నవల చదువుతుంటే, ప్రపంచ సాహిత్యం, ముఖ్యంగా ‘నియో-రియలిజం’ ఉద్యమానికి చెందిన చిత్రాలు, నవలలు గుర్తుకు వస్తాయి. పేదరికం, నిరుద్యోగం, సామాన్యుడి పోరాటం ఇతివృత్తంగా సాగే ఈ రచనలను పోల్చి చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ఆ క్రమంలో మున్షీ ప్రేమ్‌చంద్ రాసిన ‘గోదాన్’ (ఆవు దానం) నవలకు, ‘చింతల చేను’కు మధ్య ఉన్న పోలికలు అత్యంత అద్భుతమైనవి, తిరుగులేనివి కూడా. ‘గోదాన్’లో కథానాయకుడు హోరీ ఒక ఆవును కొనుగోలు చేయాలని ఆశిస్తాడు. సంప్రదాయ గ్రామీణ వ్యవస్థలో ఆవు అనేది కేవలం పశువు మాత్రమే కాదు, అది సామాజిక హోదాకు మరియు ఆధ్యాత్మిక పుణ్యానికి చిహ్నం. ఆ ఆవును పోషించే క్రమంలో హోరీ పడిన అప్పులే చివరికి అతని ప్రాణాలను బలిగొంటాయి. ‘చింతల చేను’లో ఆవు స్థానాన్ని ‘ట్రాక్టర్’ ఆక్రమించింది. ఈ మార్పు భూస్వామ్య-మతపరమైన ప్రపంచం నుండి పెట్టుబడిదారీ-యాంత్రిక ప్రపంచం వైపు జరిగిన పరిణామాన్ని సూచిస్తుంది. ధర్మానికి మరియు జీవనాధారానికి ప్రతీక అయితే, ట్రాక్టర్ ‘అభివృద్ధి’కి మరియు లాభానికి ప్రతీక. హోరీ ఆవు కోసం, జరిమానాల కోసం అప్పులు చేస్తాడు; గుణశేఖరుడు ట్రాక్టర్ కోసం సిద్ధిరాజు దగ్గర అప్పు చేస్తాడు. వడ్డీ అసలును మించిపోయే ‘విషవలయం’లో ఇద్దరూ చిక్కుకుంటారు. హోరీ – గుణశేఖరుడు ఇద్దరూ వ్యవస్థను ఎదిరించే విప్లవకారులు కాదు; ఆ వ్యవస్థలోనే రాణించాలని ప్రయత్నించి, అదే వ్యవస్థ చేత అణచివేయబడ్డ సామాన్యులు. అంతిమంగా ఫలితం – హోరీ రోడ్డు పనుల శ్రమలో చనిపోతే, గుణశేఖరుడు పొలంలో పని చేస్తూ చేయి విరగ్గొట్టుకుంటాడు. తన ఆశయాల కోసం చేసిన అప్పులను తీర్చడానికి రైతు తన శరీరాన్నే శ్రమ రూపంలో పణంగా పెట్టాల్సి వస్తోంది.
విట్టోరియో డి సికా దర్శకత్వం వహించిన ఇటాలియన్ చిత్రం ‘బైసికిల్ థీవ్స్’ ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయి. ఆ కథలో ఆంటోనియో అనే నిరుద్యోగికి ఒక ఉద్యోగం దొరుకుతుంది. కానీ ఆ ఉద్యోగం చేయాలంటే అతనికి ఒక సైకిల్ కావాలి. ఎంతో కష్టపడి భార్య పరుపులు అమ్మి సైకిల్ కొనిస్తుంది. కానీ, విధి వక్రీకరించి ఆ సైకిల్ దొంగిలించబడుతుంది. ఆ సైకిల్ కోసం అతను, అతని చిన్న కొడుకు బ్రూనో పడే ఆవేదన వర్ణనాతీతం. ఇక్కడ ‘చింతల చేను’లో గుణశేఖరుడి పరిస్థితి కూడా అంతే. ఆంటోనియోకి సైకిల్ ఎలాగో, గుణశేఖరుడికి ట్రాక్టర్ అలాగ. సైకిల్ పోతే ఆంటోనియో బతుకు ఎలా ఛిద్రమవుతుందో, ట్రాక్టర్ ద్వారా ఆదాయం రాకపోతే, లేదా ట్రాక్టర్ వల్ల ప్రమాదం జరిగితే గుణశేఖరుడి కుటుంబం కూడా అలాగే కుప్పకూలిపోతుంది. రెండు కథల్లోనూ పనిముట్టు అనేది జీవనాధారంగా, ఆశల సౌధంగా చూపబడింది. ఆ పనిముట్టు చేజారితే (లేదా పనికిరాకుండా పోతే) మనిషి ఆత్మగౌరవం ఎలా దెబ్బతింటుందో రెండు కళారూపాలూ హృద్యంగా చెబుతాయి. ‘బైసికిల్ థీవ్స్’లో తండ్రీకొడుకుల బంధం ఎంత ముఖ్యమో, ‘చింతల చేను’లో గుణశేఖరుడు-బాలాజీల బంధం కూడా అంతే ముఖ్యం. తండ్రి పడే కష్టాన్ని, అవమానాలను కొడుకు సాక్షిగా చూడడం గుండెను కదిలించే అంశం. బాలాజీ తన తండ్రిని హీరోగా ఊహించుకుంటాడు, కానీ వాస్తవంలో తండ్రి పడే పాట్లు చూసి మౌనంగా రోదిస్తాడు.
ఆల్బర్ట్ కామూ (Albert Camus) రాసిన ‘ద మిత్ ఆఫ్ సిసిఫస్’ (The Myth of Sisyphus) రాయలసీమ రైతు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన తాత్విక చట్రాన్ని అందిస్తుంది. గ్రీకు పురాణాల ప్రకారం, సిసిఫస్ ఒక భారీ బండరాయిని కొండపైకి నెట్టాలి; కానీ అది పైకి చేరగానే మళ్ళీ కిందకు దొర్లిపోతుంది. అతను నిత్యం అదే పనిని పునరావృతం చేస్తూ ఉండాలి. గుణశేఖరుడికి ఆ ‘బండరాయి’ మరేదో కాదు, ‘వడ్డీ రేటు’. అతను ట్రాక్టర్‌తో కష్టపడి వడ్డీని కడతాడు (రాయిని పైకి నెట్టడం), కానీ కస్టమర్లు డబ్బులు ఇవ్వకపోవడమో లేదా యంత్రం పాడవ్వడమో జరుగుతుంది (రాయి కిందకు దొర్లడం). దీనివల్ల అసలు మొత్తం అలాగే ఉండిపోతుంది, అతని కష్టం వృథా అవుతుంది. రాయలసీమ రైతు నిజమైన ‘అబ్సర్డ్ హీరో’. వర్షం పడదని తెలిసినా, ధరలు పడిపోతాయని తెలిసినా అతను మళ్ళీ మళ్ళీ విత్తనాలు (వేరుశెనగ, టమాటా, ఉల్లి) నాటుతూనే ఉంటాడు. ఫలితం ఉండదని తెలిసినా చేసే ఈ పునరావృత పోరాటమే ‘అసంబద్ధత’ (Absurdity) కి అసలైన నిర్వచనం. నిరాశలో ఉన్నప్పుడు మనిషి ఆత్మహత్య కంటే ‘తిరుగుబాటు’ (Revolt) చేయాలని కామూ వాదిస్తారు. అయితే, భారతీయ రైతుల ఆత్మహత్యలను చూస్తే ఆ ‘బండరాయి’ వారి మోయగలిగే స్థాయిని మించిపోయిందని అర్థమవుతుంది. సిసిఫస్ సంతోషంగా ఉన్నాడని కామూ ఊహించవచ్చు కానీ, మన సామాజిక వ్యవస్థ రైతుకు ఆ సంతోషాన్ని ఇవ్వడం లేదు. గుణశేఖరుడు అప్పు చేసి ట్రాక్టర్ కొనడం అనేది తన పేదరికంపై అతను చేసిన ఒక తిరుగుబాటు; కానీ ఆ తిరుగుబాటును వ్యవస్థ అత్యంత క్రూరంగా అణచివేస్తుంది.
ఆంటోన్ చెకోవ్ నాటకాల్లో (The Cherry Orchard) గ్రామీణ ధనిక వర్గం ఎలా పతనమవుతుందో, జీవితం ఎలా స్తంభించిపోతుందో కనిపిస్తుంది. అక్కడి పాత్రలు రాని మార్పు కోసం వేచి చూస్తూ, ఒక రకమైన ‘విషాద-హాస్యం’లో చిక్కుకుపోతాయి. గుణశేఖరుడు నరసరాజు ఇచ్చే పేమెంట్ల కోసం వేచి చూస్తాడు; జ్యోతిష్యుడు చెప్పే ‘మంచి కాలం’ కోసం ఎదురుచూస్తాడు. ఈ నిష్క్రియాత్మక నిరీక్షణ (Passive waiting) అచ్చం చెకోవ్ పాత్రలనే గుర్తు చేస్తుంది. ఎలుకతో సోదె చెప్పే పాత్రల ప్రవేశం కథలో అసంబద్ధతను తీసుకువస్తుంది. ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టినప్పుడు మనుషులు మూఢనమ్మకాలపై (జ్యోతిష్యం, తాయెత్తులు) ఆధారపడటం వారి నిస్సహాయతకు నిదర్శనం. ‘ద చెర్రీ ఆర్చర్డ్’లో అప్పుల వల్ల ఆ తోటను ఎలా కోల్పోతారో, ఇక్కడ ‘చింతల చేను’ (పొలం) కూడా అప్పుల వల్ల చేజారిపోయే ముప్పు గుణశేఖరుడి కుటుంబంపై పొంచి ఉంటుంది. రష్యన్ మైదానాల నుండి రాయలసీమ పీఠభూమి వరకు రైతు వ్యథ ఒక్కటే అని ఇది నిరూపిస్తుంది.
మరోకోణంలో పాజిటివ్ గా చూస్తే – ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన ‘ది ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ’ గుర్తొస్తుంది. ఆ నవలలో శాంటియాగో అనే వృద్ధ జాలరి, ఒక పెద్ద చేపను పట్టుకోవడానికి సముద్రంలో ఒంటరి పోరాటం చేస్తాడు. చివరికి చేప దొరికినా, దాన్ని సొరచేపలు తినేస్తాయి. అతను ఒట్టి అస్థిపంజరంతో తిరిగి వస్తాడు. అప్పుడు అతను అంటాడు: “A man can be destroyed but not defeated” మనిషిని నాశనం చేయొచ్చు, కానీ ఓడించలేము- అనే సందేశమే గుణశేఖరుడి కథ కూడా. ట్రాక్టర్ ప్రమాదంలో అతని చేయి విరిగిపోవచ్చు, ఆర్థికంగా చితికిపోవచ్చు. కానీ, అతను ఓడిపోయాడా? లేదు. అతను మళ్ళీ లేస్తాడు. కుటుంబం కోసం, కొడుకు భవిష్యత్తు కోసం మళ్ళీ పోరాడతాడు. నారాయణమ్మ మాటల్లో ఆ ధైర్యం కనిపిస్తుంది. “పురిటి నొప్పి లేకుండా పుట్టబోదు బిడ్డ. ఎగబడి పోరాడకుంటే తిరగబడవు మన బతుకులు” అని గుణశేఖరుడు అంటాడు. ఇది హెమింగ్వే ఫిలాసఫీకి రాయలసీమ రూపం.
అమెరికన్ రచయిత వెండెల్ బెర్రీ వ్యవసాయం గురించి రాస్తూ, “Farmers farm for the love of farming” అంటాడు. అవును, రైతులు వ్యవసాయం చేసేది ప్రేమతోనే, వ్యవసాయం వృత్తి కాదు, అదొక జీవనవిధానం, సంస్కృతి. కానీ అదే సమయంలో, కార్పొరేట్ శక్తుల ప్రభావం, అప్పుల బాధలు రైతును ఎలా కృంగదీస్తాయో కూడా ఆయన విశ్లేషించాడు. ప్రఖ్యాత సోషల్ యాక్టివిస్టు వందనా శివ అంటారు – “Farmers can no longer carry the burden of debt”.
‘చింతల చేను’లో గుణశేఖరుడు, ఉల్లి రైతులు, టమాటా రైతులు పడే కష్టాలు ఈ ప్రపంచ స్థాయి వ్యవసాయ సంక్షోభానికి అద్దం పడతాయి. కర్నూలు జిల్లా నుండి వచ్చి ఉల్లిపాయలు అమ్ముకునే రైతు దంపతుల కథ, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక గొర్రెలకు టమాటాలు తినిపించే మునస్వామినాయుడి దీనస్థితి.. ఇవన్నీ కేవలం స్థానిక సమస్యలు కావు, ప్రపంచవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు.
‘చింతల చేను’ నవలను సమగ్రంగా విశ్లేషించాలంటే చిత్తూరు, ఇంకా రాయలసీమ సామాజిక స్థితిగతులను అర్థం చేసుకోవాలి. రాయలసీమ భౌగోళికంగా Rain-shadow region, ఇది చారిత్రాత్మకంగా కరువులకు నిలయం. గతంలో పండించే చిరుధాన్యాల (Subsistence farming) నుండి ఇప్పుడు వాణిజ్య పంటలైన వేరుశెనగ, టమాటా వైపు రైతులు మొగ్గు చూపారు. దీనివల్ల బోరుబావులు, ఎరువుల కోసం పెట్టుబడి పెరిగిపోయింది. ట్రాక్టర్ ఈ ‘పెట్టుబడి పెరిగిన వ్యవసాయానికి’ (Capitalization) నిదర్శనం. భూమి ఇచ్చే దిగుబడి కంటే ఈ యంత్రంపై పెట్టే పెట్టుబడి ఎక్కువగా ఉంటోంది. నవలలో మనకు కనిపించే “పెట్టుబడి ఎక్కువ – ఆదాయం తక్కువ” అనే సూత్రమే ప్రస్తుత వ్యవసాయ సంక్షోభానికి మూలం. సుబ్బరాముడు సగం డబ్బు ఇవ్వడం, నరసరాజు అసలు ఇవ్వకపోవడం వంటి అంశాలను గమనిస్తే.. వారు ప్రతినాయకులు కారు, వారు కూడా అదే సంక్షోభంలో చిక్కుకున్న బాధితులు. ఒకరి పంట పండకనో, ధర రాకనో మరొకరికి బాకీ పడటం అనే ఈ ‘గొలుసుకట్టు అప్పు’ (Chain of default) నవలలో ఒక కీలకమైన అంశం.
రైతుల మానసిక స్థితిని, వారు కష్టాలను తట్టుకోవడానికి ఎంచుకునే మార్గాలను రచయిత సంస్కృతితో ముడిపెట్టి చూపించారు. సోదె చెప్పే ‘జోశ్యగాడు’, నారాయణమ్మ చేసే పూజలు.. భౌతిక ప్రపంచంలో భద్రత లేనప్పుడు మనిషి దైవంపై ఎలా ఆధారపడతాడో చూపిస్తాయి. రాయలసీమ జానపదాల్లో గంగమ్మ, పోలేరమ్మ వంటి గ్రామ దేవతలను కరువు కాటకాల నుండి రక్షించమని వేడుకోవడం సహజం. చింతచెట్టు ఈ చెట్టుకు ఒక సాంస్కృతిక ప్రాధాన్యత ఉంది. జానపదాల్లో చింతచెట్టు దయ్యాల నివాసంగా, దాని కింద వేడి (Acidity) వల్ల ఏ మొక్కా మొలవదని నమ్ముతారు. రూపకార్థంలో చూస్తే, గుణశేఖరుడి కుటుంబం ‘అప్పు’ అనే చింతచెట్టు నీడన బతుకుతోంది; ఆ నీడలో ఏ ఆశలూ చిగురించవు. ఆ చెట్టుపై ఉన్న దయ్యాలు మరేవో కావు.. గతంలో తీరని అప్పులు, ఓటముల జ్ఞాపకాలు. రాయలసీమలో గొర్రెలు లేదా పశువులు అనేవి రైతుకు ఉన్న చివరి ఆస్తి. యాంత్రిక ప్రపంచంలో ఈ ప్రాణమున్న జీవాలు ఎలా ప్రమాదానికి గురవుతాయో, అవి ఎలా మనుషుల మధ్య వివాదాలకు కారణమవుతాయో రచయిత తన (మేకలబండ వంటి) ఇతర రచన ల్లో చూపినట్టే, ఇక్కడ కూడా ఆ సున్నితత్వాన్ని స్పృశించారు.
***
ఈ నవలలో కొన్ని సన్నివేశాలు పాఠకుల మనసులో చిరకాలం నిలిచిపోతాయి. ధర్మరాజు గుడి దగ్గర జరిగే ఎలుక జోస్యం సన్నివేశం నవలలో హాస్యాన్ని, అదే సమయంలో ప్రజల అమాయకత్వాన్ని చూపిస్తుంది. జ్యోతిష్కుడు ఎలుకను “మూషికరాజా, వినాయక వాహనమా, మీసాల రాజా, తమిళ రాజా” అని స్తుతించడం, దానికి రంగుల చొక్కా, నిక్కరు, గజ్జెలు వేయడం నవ్వు తెప్పిస్తుంది. కానీ, ఆ ఎలుక తీసే కార్డుపై మనుషులు తమ భవిష్యత్తును ఆధారపడడం వారి నిస్సహాయతను, అభద్రతా భావాన్ని తెలియజేస్తుంది. ఇది కేవలం మూఢనమ్మకం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి వేటినైనా నమ్ముతాడు అనే మానసిక స్థితికి నిదర్శనం.
గుణశేఖరుడి ఇంటి ముందు బ్రహ్మకమలం పూసిన రాత్రి, ఊరంతా అక్కడికి చేరుతుంది. ఇది ఒక సామాజిక ఉత్సవంలా మారుతుంది. మిసిమి అనే అమ్మాయి అక్కడ లాఫింగ్ థెరపీ చేయించడం, అందరూ కలిసి ‘హాట్ సూప్ లాఫింగ్’, ‘మిల్క్ షేక్ లాఫింగ్’ చేయడం ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. కష్టాల్లో ఉన్నా నవ్వుకోవాలని, సామూహికంగా ఆనందాన్ని పంచుకోవాలని ఈ సన్నివేశం చెబుతుంది. పువ్వు విరిసే సమయం కోసం అందరూ ఆత్రంగా ఎదురుచూడడం, ఆ పువ్వును చూసి తమ కోరికలు కోరుకోవడం (గుణశేఖరుడు అప్పులు తీరాలని, బాలాజీ కారు కొనాలని, నారాయణమ్మ కాశీ వెళ్లాలని) వారి ఆశలకు ప్రతీక. ఎమిలీ డికిన్సన్ అంటుందిలా –
“Hope is the thing with feathers –
That perches in the soul –
And sings the tune without the words –
And never stops at all.”
అవును, ఆశ అనేది ఈకలు ఉన్న పక్షి లాంటిది, అది ఆత్మలో గూడు కట్టుకుంటుంది, మాటలు లేని పాటను పాడుతుంది, ఎప్పటికీ ఆగదు.
పశువులకు కూడా ఆధార్ కార్డు లాంటి “గోధార్” నంబర్ ఇవ్వడం, వాటి ముట్టె ఆధారంగా గుర్తింపునివ్వడం అనే అంశం నవలలో ప్రస్తావించబడింది. ఇది ఆధునిక సాంకేతికత గ్రామీణ ప్రాంతాలకు ఎలా విస్తరిస్తోందో, ప్రభుత్వ పథకాలు ఎలా ఉంటాయో వ్యంగ్యంగా, వాస్తవికంగా చూపిస్తుంది. కాటారెడ్డి ఆవులను తోలుకుపోతుంటే, గుణశేఖరుడు ఆశ్చర్యంగా చూడడం- పల్లెల్లో వస్తున్న మార్పు.
గుణశేఖరుడు చేయి విరిగిన తర్వాత, ట్రాక్టర్ నడపడానికి డ్రైవర్లను పెట్టుకుంటాడు. కన్నదాసన్ పనిమంతుడే కానీ తాగుబోతు. గుట్కాలు నములుతూ, తాగి ట్రాక్టర్ నడిపి గట్ల మీదకి ఎక్కించేస్తాడు. ఇది శ్రామిక వర్గంలోని వ్యసనాల సమస్య. సిద్దులయ్య కడప జిల్లా నుండి వచ్చిన ఇతను, అనుభవం ఉందని చెప్పి చేరతాడు కానీ, డ్రైవింగ్ రాక ఆవును గుద్దేస్తాడు. ఇది నిరుద్యోగం వల్ల మనుషులు ఎంతటి అబద్ధాలకైనా తెగిస్తారనే చేదు నిజాన్ని చెబుతుంది. ఈ సంఘటనలు గుణశేఖరుడిని మరింత ఇబ్బందుల్లోకి నెడతాయి. “పేదవాడి నెత్తినే పిడుగులు పడతాయి” అన్న సామెతను నిజం చేస్తాయి.
రచనా శైలి విషయానికొస్తే, ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారి రచనా శైలిలో ప్రధానంగా కనిపించేది ‘సరళత’, ఇంకా స్థానికత. ఆయన వాక్యాలు చిన్నవిగా, సూటిగా ఉంటాయి. వర్ణనలు కళ్ళకు కట్టినట్లు ఉంటాయి. నవలలో అక్కడక్కడా మెరిసే హాస్యం పాఠకుడికి ఉపశమనం కలిగిస్తుంది. నీలిరాజు కవితలు – “లుంగీ కొన్నాను ఆ లుంగీలోనే ఉన్నాను”, “డబ్బు డబ్బు డబ్బు.. ఎక్కువైతే జబ్బు” వంటి కవితలు సమకాలీన కవులపై, సమాజంపై వేసిన సున్నితమైన సెటైర్లు. నారాయణమ్మ సామెతలు- “చింతకాయలు ఎరుగని రాణి ఆ కాయలను చూసి ‘కొడవళ్ళా?’ అని అడిగిందంట” వంటి సామెతలు పల్లెటూరి హాస్య చతురతకు అద్దం పడతాయి.
ఇక రచయిత ప్రకృతిని వర్ణించే విధానం అద్భుతం. “నాన్నమ్మ ఒడి.. పువ్వు వలె మెత్తనమ్మ”, “నిండు పౌర్ణమి.. చల్లటి గాలి తెరలు తెరలుగా వీస్తోంది” వంటి వాక్యాలు కవిత్వమే. బాలాజీకి వచ్చే కలలు, అందులో తీవ్రవాదులతో పోరాటం వంటివి బాలల మనస్తత్వశాస్త్రవేత్తలు విశ్లేషించదగ్గవి. గుణశేఖరుడికి జరిగిన ప్రమాదం చాలా కీలకమైన ఘట్టం. తంజావూరు సుబ్రహ్మణ్యం పొలంలో బురదలో కూరుకుపోయిన ట్రాక్టర్‌ను బయటకు తీయడానికి ప్రయత్నిస్తూ, గుణశేఖరుడు తీవ్రంగా గాయపడతాడు. ఈ సంఘటన కథను మలుపు తిప్పుతుంది. శారీరకంగా గుణశేఖరుడు దెబ్బతిన్నాడు. ట్రాక్టర్ మరమ్మతులకు గురైంది. అప్పులు పెరిగిపోయాయి. సిద్ధిరాజు ఒత్తిడి ఎక్కువైంది. ఇన్ని కష్టాల మధ్య కూడా గుణశేఖరుడు ఆత్మహత్య చేసుకోలేదు. పారిపోలేదు. ‘ప్రాణాయామం’ చేస్తూ మనసును నిబ్బరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాడు. నవల ముగింపులో రచయిత ఒక బలమైన సందేశాన్ని ఇస్తారు. కష్టాలు శాశ్వతం కాదు. చింత చెట్టు ఎలాగైతే ఎండకు ఎండి, వానకు తడిసి, వంకరలు తిరిగినా దృఢంగా నిలబడుతుందో, మనిషి కూడా అలాగే నిలబడాలి. ‘చింతల చేను’ అనే పేరులోనే ఆ అర్థం దాగి ఉంది. చింత (చెట్టు) గట్టిదనానికి మారుపేరు. చింత (విచారం, ఆలోచన) కూడా జీవితంలో భాగమే. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ సాగడమే జీవితం.
ఆంటోనియో (Bicycle Thieves) సైకిల్ పోయిన తర్వాత జనంలో కలిసిపోయినట్లు, గుణశేఖరుడు కూడా తన కష్టాలతో రాజీపడి, కొత్త ఆశలతో ముందుకు సాగుతాడు. జేమ్స్ రెబ్యాంక్స్ (James Rebanks) తన ‘పాస్టోరల్ సాంగ్’ (Pastoral Song) పుస్తకంలో అంటాడు – “I know that if we are too proud, too stubborn, and too unbending, then we will be finished.” ఈ నవలా నాయకుడు గుణశేఖరుడు గర్విష్టి కాడు, మొండివాడు కానేకాదు, అందుకే వంగి, నెగ్గుతాడు.
‘చింతల చేను’ నవల కేవలం గుణశేఖరుడి కథ కాదు. ఇది మనందరి కథ. ఆశకు, నిరాశకు మధ్య ఊగిసలాడే ప్రతి మధ్యతరగతి మనిషి కథ. ట్రాక్టర్ అనేది ఇక్కడ ఒక ప్రతీక మాత్రమే. అది మన ఆశలకు, మన అత్యాశలకు, మన పోరాటాలకు రూపం.
ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారు తన సహజసిద్ధమైన శైలిలో, సొగసులతో ఈ నవలను ఒక గొప్ప సాహిత్య ప్రక్రియగా మలిచారు. ఇది చదువుతున్నంత సేపు మనం రాసపల్లి గ్రామంలో, ఆ చింత చెట్ల నీడలో, ఆ ట్రాక్టర్ చప్పుడు మధ్య ఉన్నామనే అనుభూతి కలుగుతుంది. ఈ నవలను చదవడమంటే, మన మూలాలను మనం వెతుక్కోవడమే. మన తాతముత్తాతలు పడ్డ కష్టాలను గుర్తుచేసుకోవడమే. చార్లెస్ డికెన్స్ అన్నట్లు: “No one is useless in this world who lightens the burdens of another”, మరొకరి భారాన్ని తగ్గించే వారెవరూ ఈ లోకంలో నిరుపయోగం కారు. కృష్ణస్వామి రాజు తన రచన ద్వారా రైతుల, సామాన్యుల భారాన్ని అక్షరరూపంలో పంచుకుని, వారికి ఒక గొంతుకనిచ్చారు. తెలుగు సాహిత్యంలో ‘చింతల చేను’ ఒకానొక క్లాసిక్ గా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, ‘చింతల చేను’ భారతీయ వ్యవసాయ సాహిత్య స్రవంతిలో ఒక గొప్ప చేరిక. ఇది పల్లెటూరిని రొమాంటిసైజ్ చేయకుండా , దానిని ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాలు’, ‘వేదనలతో కూడిన జీవితాల’ నిలయంగా ఆవిష్కరించింది. ఇది మనసును కదిలించే, ఆలోచింపజేసే, చివరికి కన్నీళ్లతో పాటు ఒక చిన్న చిరునవ్వును మిగిల్చే అద్భుతమైన రచన.
***
రచన: ఆర్. సి. కృష్ణస్వామిరాజు
ప్రచురణ: మువ్వ చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్
పేజీలు: 142
వెల: ₹ 100/-
ప్రతులకు:
ప్రముఖ పుస్తక కేంద్రాలు,
~
ఆర్ సి కృష్ణ స్వామి రాజు
ఫోన్ 9393662821.
‘కళారత్న’ డా. కంపల్లె రవిచంద్రన్
