Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరిగిన పుటలు

[శింగరాజు శ్రీనివాసరావు గారు రచించిన ‘చిరిగిన పుటలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

సంక్రాంతి పండుగ రోజున కూడ తిరుచానూరులో భక్తుల రద్దీ తగ్గలేదు. మునుపటి రోజులలో పండుగనాడు ఇంటివద్ద వుండి బంధువులతో కలిసి సరదాగ గడపడం ఒక ఆనవాయితీగా వుండేది. రోజులు మారాయి.. ‘ఇంటికన్నా గుడి పదిలం’ అని, పిల్లలతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, పండుగకు ఇంటికి వచ్చే బంధువుల నుంచి తప్పించుకునే సరికొత్త ఆలోచనలోకి వచ్చారు అందరు. అందుకనే పండుగరోజున కూడ పాపం దేవుళ్ళకు విశ్రాంతి దొరకడం లేదు.

“పండుగపూట కూడ అమ్మడానికి వెళ్ళాలా..” అని ఏడుపు ముఖం పెట్టిన నన్ను, బ్రతిమాలి పిండివంటలను అమ్ముకుని రమ్మని పంపింది అమ్మ. అవి అమ్ముకుంటే తప్ప పూటగడవని జీవితాలు మావి. నిద్రలేవగానే అందరు దేవుడి పటానికి నమస్కరిస్తారు. కాని నేను మాత్రం నిద్రలేస్తూనే అమ్మ ముఖం చూస్తాను. ఆమె ముఖం చూస్తే చాలు, ఆ రోజంతా ఎంతో సంతోషంగా గడిచిపోతుంది. చిన్నతనంలో నా తోటిపిల్లలు వాళ్ళ నాన్నల గురించి గొప్పలు చెబుతుంటే, “నాన్న ఎక్కడమ్మా?” అని అడిగేవాడిని. అమ్మ సమాధానం చెప్పకుండా దాటేసేది. అప్పుడు తాతయ్య కల్పించుకుని, “విష్ణు.. సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడిగి అమ్మను బాధపెట్టకురా. మీ నాన్న ఎవరో, ఎక్కడ వుంటారో నువ్వు కాస్త పెద్దయ్యాక చెబుతాను” అన్నాడు. అంతే.. అప్పటినుంచి నేను నాన్న గురించిన ప్రస్తావనే తీసుకురాలేదు. అమ్మే నాకు అన్నీ అనుకుని బ్రతికాను.

“బాబు.. ఏమిటవి?” అని ఎవరో అడగడంతో వర్తమానంలోకి వచ్చాను.

“అరిసెలు, చక్రాలు, బొబ్బట్లు, జంతికలు సర్…” అని చెప్పాను.

“అరిసెలు ఎంత?”

“ప్యాకెట్ వందరూపాయలు సర్”

“సరే.. రెండు ప్యాకెట్లు యివ్వు”

“అలాగే సర్” అని అతనికి రెండు ప్యాకెట్లు ఇచ్చి డబ్బులు తీసుకున్నాను.

మరల “అరిసెలు, చక్రాలు..” అని అరుస్తూ, అందరినీ అడుగుతూ తిరుగుతున్నాను. ఎవరు ఎంత విసుక్కున్నా కోపాన్ని ప్రదర్శించక “ఒక్కసారి కొని చూడండి సార్.. ఈసారి వచ్చినపుడు మీరే నన్ను వెతుక్కుంటు వస్తారు. ప్లీజ్ సర్..” అని బ్రతిమాలుతున్నట్లుగా అడుగుతున్నాను. ఈ విద్య నాకు అమ్మనుంచే అబ్బింది. సాయంత్రం అయేసరికి తెచ్చిన సరుకు చాలావరకు అయిపోయింది. రోజుకంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయి. ఇక నాలుగు జంతికల ప్యాకెట్లు మిగిలాయి. చలిరోజులు కనుక అయిదుగంటలకే సూర్యుడు సర్దుకుని ఇంటికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. చీకటిపడుతుండడంతో చలిగాలి మొదలయింది. మిగిలినవాటిని కూడ అమ్మేస్తే అమ్మ సంతోషిస్తుందనుకున్నాను. ఒక గ్లాసు టీ త్రాగి తరువాత మొదలుపెడదామనుకుని టీబంకు దగ్గరికి వెళ్ళి,

“గణేషన్నా.. ఒక స్ట్రాంగ్ టీ ఇవ్వు” అని అడిగాను.

“ఏరా.. విష్ణు.. ఎలా వుంది గిరాకి. అన్ని అమ్మేశావా?” అడిగాడు గణేషన్న.

“ఇవాళ బోణి మంచిగా తగిలిందన్నా..అన్నీ అమ్మేశాను. ఇక జంతికలు మాత్రమే ఉన్నాయి”

“ఎన్ని పాకెట్లున్నాయిరా”

“నాలుగు”

“సరే..ఇటిచ్చెయ్. మీ వదినకు జ్వరంగా ఉండి పండుగకు ఏమి చెయ్యలేక పోయింది. వాటిని తీసుకెళ్ళి పిల్లలకిస్తాను”

“సరే అన్నా” అని ఆ ప్యాకెట్లు ఇచ్చేసి, గణేష్ ఇచ్చిన టీ తీసుకున్నాను.

“అవునురా.. ఈ మధ్య నువ్వొకడివే వస్తున్నావు. పిన్నికి ఆరోగ్యం బాగులేదా?” డబ్బులిస్తూ అడిగాడు గణేష్.

“అదేం లేదన్నా. ఇరవై సంవత్సరాల నుంచి ఒక్కతే కష్టపడింది గదా. ఇక విశ్రాంతి తీసుకోమని చెప్పి అమ్మను ఆపేశాను. బిజీ సీజనులో తప్ప అమ్మను రావద్దని చెప్పాను”

“మంచిపని చేశావురా. నా చిన్నప్పటినుంచి వసుంధర పిన్నిని చూస్తున్నా. ఒళ్ళు దాచుకునే మనిషి కాదురా. కష్టపడి పనిచేసి నిన్నింత వాణ్ణి చేసింది. ఇకనుంచి ఆమెను విశ్రాంతి తీసుకోమను”

“సరే అన్నా..సరుకు అయిపోయిందిగా..ఇక ఇంటికి వెళతాను” అని చెప్పి బయలుదేరాను.

***

రోజులాగే తయారయి సంచి తీసుకుని బయలుదేరాను.

“అమ్మా.. వెళ్ళొస్తా”

“ఈరోజు నేనూ వస్తానురా”

“వద్దమ్మా.. నువ్వు విశ్రాంతి తీసుకో. ఈ మధ్య ఆరోగ్యం కూడ బాగుండడం లేదు నీకు”

“ఒక్కదానికే ఇంట్లో విసుగుపుడుతున్నదిరా”

“బోరు కొట్టకూడదనే కదమ్మా పుస్తకాలు తెచ్చి పెట్టాను. పుస్తకాన్ని మించిన స్నేహితుడు లేదంటారు. అలవాటుపడితే చాలు.. రమ్మన్నా బయటకు రావు”

“అది కాదురా”

“అమ్మా.. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తాతయ్యకు మాటిచ్చాను. పేదరికంలో పుట్టిపెరిగిన నిన్ను, అత్యాశకు పోయి డబ్బున్న వారికి ఇచ్చి కట్టబెట్టానని, వారి స్వార్థానికి నీ జీవితం బలయిపోయిందని, తన తెలివితక్కువతో నీ బ్రతుకును నాశనం చేశానని చెప్పి, ఇకనుంచైనా తనకు మంచి జీవితాన్ని ఇవ్వరా.. అని మాట తీసుకున్నారు. కాబట్టి..”

“చాలు నాయనా.. ఆయన చెప్పడం.. నువ్వు ఆచరించడం.. సరే వెళ్ళిరా. నీతో వాదించే ఓపిక నాకు లేదు” అన్నది అమ్మ.

“మా మంచి అమ్మ” అని అమ్మ నుదుటి మీద ముద్దుపెట్టి బయలుదేరబోతుంటే ఎవరో తలుపుకొట్టిన చప్పుడయింది.

“ఎవరు..” అంటూ తలుపుతీశాను.

ఎదురుగా వయసుమళ్ళిన వ్యక్తి..పెరిగిన తెల్లనిగడ్డంతో, బక్కచిక్కిన శరీరంతో, ఏదో వ్యాధితో బాధపడుతున్న వాడిలా కనిపించాడు.

“ఎవరు కావాలి?”

“వసుంధరగారి ఇల్లు ఇదేనా?” అడిగాడతను. స్వరంలో ఏదో వణుకు.

“అవును..మీరెవరు?”

“నేను లోపలికి రావచ్చా..”

“మీరెవరో చెప్పండి ముందు”

“నేనెవరో ఆమెకు తెలుసు” అని లోపలికి అడుగుపెట్టాడతను.

“ఎవర్రా అతను” అంటూ వచ్చింది అమ్మ.

“ఎవరోనమ్మా.. నీకు తెలుసని అంటున్నాడు”

“నాకు తెలుసా..” అని వచ్చిన వ్యక్తిని పరికించి చూసి ఉలిక్కిపడినట్లు అడుగు వెనుకకు వేసింది అమ్మ.

“వసు.. నన్ను గుర్తుపట్టలేదా.. నేను శ్రీహరిని” అన్నాడతను.

“మీరిక్కడికి ఎలా వచ్చారు?” ఆశ్చర్యంగా అడిగింది.

“విధివిలాసం అంటే ఇదే. జీవితం ముగిసిపోయే సమయంలో చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశాన్ని ఆ ఏడుకొండలవాడు నాకిచ్చాడు” అతని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.

“ఎవరండి మీరు.. విధివిలాసమేమిటి.. ప్రాయశ్చిత్తమేమిటి. అసలు మా అమ్మ మీకెలా తెలుసు?” అర్థంగాక అడిగాను.

“బాబు.. నేను..” ఏదో చెప్పబోయాడతను.

“విష్ణు.. నీ చిన్నతనంలో ఇతను మన పక్క ఇంట్లో ఉండేవారు. మనం ఇక్కడ వున్నామని ఎవరో చెప్పివుంటారు. అందుకే ఇలా వచ్చారు. నువ్వెళ్ళు నాన్నా.. జనం ఉన్నప్పుడే కదా అమ్మకాలు బాగుండేది” అని బలవంతంగా నన్ను బయటకు పంపింది. ఏదో అడగబోయి కూడ అమ్మమాటకు తలవంచి వెళ్ళిపోయాను.

కొంతదూరం వెళ్ళాక ఎందుకో అమ్మ చెప్పిన మాటలలో నిజం ఉందనిపించలేదు. ఏదో దాస్తున్నదని అనిపించి వెంటనే వెనక్కుతిరిగి వచ్చాను. లోపలినుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. కొద్దిగా తెరచివుంచిన కిటికి దగ్గర నిలబడి చూస్తూ వారి సంభాషణ వినసాగాను.

“వసు.. నేను నీకు ద్రోహం చేశాను. విధికృతమో, కండకావరమో తెలియదు..కానీ జరగవలసిన పొరపాటు జరిగిపోయింది. నాకు ఇష్టంలేకుండా పేదపిల్లను తెచ్చి బలవంతంగా  అంటగట్టాడని మా నాన్న మీద కోపం, నీ పట్ల అసహ్యంగా మారింది. ఆ నిర్లక్ష్యంలో నువ్వు చూపించే ప్రేమ, నా కోసం పడుతున్న తపన, నన్ను నీవైపుకు మళ్ళించలేక పోయాయి. ‘బుద్ధిః కర్మానుసారిణి’ అన్నట్లు, నా తలరాత నన్ను మరో అమ్మాయికి దగ్గరచేసి నిన్ను దూరం చేసుకునేలా చేసింది. అందం, డబ్బు, జతకలిసి వస్తుంటే వదులుకోవడం వెర్రితనం అనుకుని, నిన్ను గెంటివేసి, లావణ్యను అక్కున చేర్చుకున్నాను. మీ నాన్నగారు వచ్చి ప్రాధేయపడినా మనసు కరగలేదు. పూలమ్మినచోట కట్టెలమ్మలేక, జరిగిన అవమానానికి తలెత్తుకోలేక, మీరు ఊరు వదిలి వెళ్ళారని తరువాత తెలిసింది. కాలగమనంలో పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి. మితిమీరిన లంచగొండితనంతో వున్న ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను. కట్టుకున్న భార్య నుంచి ఆస్తి దక్కకుండా ఆమె తండ్రి కట్టడిచేశాడు. సంపాదనలేని భర్తను భరించలేనని, ఇద్దరు బిడ్డలను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది లావణ్య. అప్పటికే భార్యను కోల్పోయిన లావణ్య మేనమామ ఆమెను పెళ్ళి చేసుకుంటాననేసరికి, నాకు విడాకులు ఇచ్చి నన్ను వదిలించుకుంది లావణ్య. నా జీవితం చెల్లాచెదరు కావడంతో దిగులుపడి అమ్మ, నాన్న కాలంచేశారు. భరించలేని ఒంటరితనం నన్ను వెక్కిరించింది. ఒక్కసారి బిడ్డలను చూసొద్దామని వెళ్ళిన నా ముఖంమీదే తలుపువేసి, ఇక నా యింటి గడప తొక్కొద్దని చీదరించుకున్నది లావణ్య. కాలం గడిచేకొద్ది ఒంటి కొవ్వు కరిగి, అహంకారం దిగిపోయింది. వయసుతోపాటు రోగాలు చుట్టుముట్టాయి. మనశ్శాంతి కోసం క్షేత్రాలు తిరగడం మొదలుపెట్టాను. పుణ్యం సంపాదించుకోవాలని కాదు, ఏ క్షేత్రంలోనైనా నువ్వు తటస్థపడక పోతావా..అనే ఆశతో. ఎంత ప్రయత్నించినా నీ జాడ దొరకలేదు. ఏ దారి కనపడక ఏర్పేడు ఆశ్రమానికి చేరుకుని కాలం గడుపుతున్నాను. నెలకు ఒకసారి తిరుపతికి వచ్చి నీ కోసం వెతికేవాడిని. ఫలితం లభించలేదు. నా బాధ గమనించిన నాతోటి ఆశ్రమవాసుడు ఒకమాట చెప్పాడు. ‘తిరుపతిలో వెదకడం కంటే అలమేలుమంగాపురంలో వెదకడం సులభం. తిరుపతికి వచ్చిన ప్రతివారు అమ్మవారి దర్శనానికి వెళతారు. నువ్వు వెదికే వ్యక్తి అక్కడ నీకు తారసపడవచ్చు. విసుగుచెందక ప్రయత్నించు. అమ్మ నీకు మేలుచేస్తుంది’ అన్నాడు. అందుకే పదిరోజులనుంచి ఇక్కడే వుంటూ, అన్నప్రసాదం తింటూ గడుపుతున్నాను. వారంక్రితం అరిసెలు అమ్ముతూ ఒక అబ్బాయి కనిపించాడు. అతనిలో నీ పోలికలు కనిపించాయి. వాడు మన కొడుకేమో అన్న అనుమానం కలిగింది.  ఇతరులు పిలిచే పిలుపుతో వాడి పేరు విష్ణుక్రాంత అని తెలిసింది.  నిన్న టీ బంకు వద్ద అబ్బాయి తల్లి పేరు ‘వసుంధర’ అని తెలిసింది. తప్పకుండ వాడు మన కొడుకే అయివుండవచ్చుననే అనుమానంతో,  వాడిని అనుసరించి వచ్చి ఇంటిని చూశాను. అనుమానం నివృత్తి చేసుకుందామని ఉదయాన లేచి వెతుక్కుంటు వచ్చాను. నిన్ను చూశాక వాడు మన కొడుకేనని నిర్ధారణ అయింది” చెప్పడం ఆపాడతను. అమ్మ నుంచి ఏ స్పందన లేదు.

“నిన్ను దూరం చేసుకున్న తరువాత నా జీవితంలో జరిగినదేమిటో చెప్పాను. వింటున్నావా వసూ..” మరల అతనే అడిగాడు.

“చెప్పడం పూర్తయిందా.. ఇంకా ఏమైనా మిగిలివుందా” అమ్మ మాటల్లో నిర్లక్ష్యం.

“నా బాధ నీకు అర్ధంకావటం లేదా..” అతని మాటల్లో ఆవేదన.

“వయసు ఉడిగిపోయాక చెప్పే మెట్టవేదాంతాలను వినే ఓపిక, తీరిక నాకు లేదు. వెతుక్కుంటూ వచ్చారు కనుక మీరు మాకు అతిథి. కాఫీ తాగుతారా?” అడిగింది అమ్మ.

“నా తప్పులను క్షమించలేవా వసుంధరా..”

“భార్యలు ఇలా ఉండాలి.. అని సుభాషితాలు చెప్పే మీ మగవాళ్ళు, భర్తలు ఎలా ఉండాలి..అన్న సుభాషితాన్ని తెలుసుకోలేదు.

“భార్యాయాం సఖా భర్తా

రక్షణేశు పితాస్మృతః..

గౌరవేశు గురుర్భాత్వా

సుఖదుఃఖ సమోభవేత్…”

భర్త అనేవారు స్నేహితునిగా, తండ్రిగా, గురువుగా, సుఖదుఃఖాలను సమంగా పంచుకుంటూ ఆదర్శంగా ఉండాలంటారు. ఆ విధంగా మీరు ఏనాడైనా ప్రవర్తించారా? కనీసం నన్ను మనిషిగానైనా చూశారా?” నిలదీసింది అమ్మ.

“తప్పు తెలుసుకుని తలవంచుకుని నిన్ను అభ్యర్థిస్తున్నాను. మన్నించలేవా వసుంధరా”

“మానవధర్మం పాటించేవారి తప్పులను క్షమించవచ్చు. కానీ మీరు పాటించింది జంతుధర్మం. చేసింది నయవంచన. వాటికి క్షమాభిక్షలుగానీ, ప్రాయశ్చిత్తాలుగానీ ఉండవు”

“ఏమిటి వసుంధరా నువ్వనేది”

“అవును.. మగ జంతువు, ఆడ జంతువుతో కలిశాక తన దారిన తాను వెళ్ళిపోతుంది. ఆడ జంతువు తన కడుపున పడిన బిడ్డను మోసి, కని, అది స్వతంత్రంగా బ్రతికేదశ వచ్చేవరకు పోషించే బాధ్యతను మోస్తుంది. మన విషయంలో జరిగింది అదే కదా. కడుపుతో వున్న నన్ను నిర్దాక్షిణ్యంగా ఇంటినుంచి గెంటివేశారు. తరువాత ఏమయిపోయానోనని కూడ మీరు తెలుసుకోలేదు. మరి మీది జంతుధర్మం కాదా. ‘ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ..నాతిచరామి’ అన్న ప్రమాణాన్ని, అవహేళన చేసి నన్ను వదిలించుకోవడం నయవంచన కాదా. ఏనాడైతే మీరు మరో ఆడదాని చేయి పట్టుకున్నారో, ఆనాడే మీరు నా మనసులోనుంచి దూరమయ్యారు. ఇక మీ గురించి నాకు అనవసరం. కాఫీ ఇస్తాను.. తాగి వెళ్ళండి”

“వసు.. నేను చేసిన తప్పును దిద్దుకునే అవకాశాన్ని నాకు ఇవ్వలేవా. ఇప్పుడు నేను ఎవరూలేని ఒంటరిని. నీకు చేసిన అన్యాయమే నన్ను ఈ స్థితికి నెట్టింది. ఆర్థికంగా, శారీరకంగా చితికిపోయాను. నాకిప్పుడు ఓదార్పు కావాలి. నిర్మలమైన మనసున్న నీ దగ్గర మాత్రమే అది దొరుకుతుంది. అవసానదశలోనైనా నిన్ను, మన బిడ్డను తనివితీరా చూసుకునే భాగ్యాన్ని కలిగించు” అమ్మ చేయిపట్టుకుని అర్ధించాడు.

చేయి విదిలించుకుని దూరంగా జరిగింది అమ్మ.

“ఆనాడు, ఈనాడు నీలో నాకు కనిపించింది స్వార్ధమే. ఆడదంటే నీకు ఆటబొమ్మతో సమానం. నువ్వు మోహించిన ఆడదాని కోసం, నిండుగర్భిణిగా వున్న నన్ను నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టావు. కాళ్ళు పట్టుకుని బ్రతిమాలిన నా తండ్రిని ఛీదరించుకుని వెళ్ళగొట్టావు. మరల ఇప్పుడు వచ్చి నంగనాచి మాటలతో, లేని ప్రేమను వొలకబోస్తున్నావు. అందరూ ఛీకొడితే, మళ్ళినవయసులో  మంచాన పడితే చేసే దిక్కులేరని, నన్ను వెతుక్కుంటు వచ్చావు. ఇరవై సంవత్సరాలుగా గుర్తుకురాని నేను ఈరోజు గుర్తుకు వచ్చానంటే, అది స్వార్థం కాక మరేమిటి? ఒకనాటి అమాయకురాలైన వసుంధర చచ్చిపోయింది. ఇప్పుడు మీ ముందు నిలబడి ఉన్నది ఒక బండరాయి. ఏ భగవంతుడు వచ్చి కూడ నన్ను కరిగించలేడు.  భర్త వదిలేసిన ఆడదానిగా బ్రతకడానికైనా ఇష్టపడతానే తప్ప, భర్త అవసరాలకు మాత్రమే పనికివచ్చే బొమ్మలా బ్రతకలేను. ఆడిన నాటకం చాలు.. వాడు వచ్చేలోపు దయచేయండి” అమ్మ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి.

“వాడు వచ్చాక వాడితో ‘నేను నీ తండ్రినిరా’.. అని చెప్పి వెళతాను” ప్రాధేయపూర్వకంగా అడిగాడతను.

“వద్దు.. వాడికి మీ విషయం తెలియడానికి వీల్లేదు. అంతేకాదు.. మీ గురించిన ఏ వివరాన్ని ఇకముందు మాకు తెలియనివ్వకండి. మీరు కట్టిన తాళిని ఆసరా చేసుకుని ఇంట్లో అడుగుపెడదామని చూస్తున్నారేమో.. అది కుదరదు. నా బ్రతుకు పుస్తకంలో మీతో గడిపిన రోజులు.. చిరిగిన పుటలు. అవి అతకవు. ఏనాడైతే మీరు మరో ఆడదానితో కలిసి వెళ్ళిపోయారో, ఆ రోజే మీ రూపాన్ని నా గుండెల నుంచి తొలగించాను. మరి తాళి ఎందుకు ఉంచుకున్నావని అంటారేమో.. అది నా రక్షణ కోసం. మగమృగాలు నా వెంట పడకుండ ఉండడంకోసం. పెళ్ళయిన ఆడదంటే ఒక్క అడుగు వెనక్కువేస్తారు కనుక. అందుకే మీరు మాకిక కనపడకండి. నన్ను ఇలాగైనా బ్రతకనివ్వండి” అన్నది. కనిపించని బాధ ఏదో అమ్మ మనసులో రగులుతున్నట్లుంది.

‘అంటే.. గర్భవతిగా వున్నపుడే అమ్మను బయటకు పంపిన దుర్మార్గుడు ఇతనేనా..నేను నేలమీదకు రావడానికి కారణం ఈ స్వార్థపరుడా.. ఇన్నాళ్ళు అమ్మ నరకయాతన అనుభవించేలా చేసి, తగుదునమ్మా అంటూ ఇప్పుడు వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతున్నాడు. ఇతని మాటలకు అమ్మ మెత్తబడలేదు. అబలగా కాకుండ ఆత్మగౌరవం వున్న వ్యక్తిగా ప్రవర్తిస్తున్నది’ అనుకుని ఆలస్యం చేయకుండ తలుపును నెట్టుకుని లోపలకు వెళ్ళాను.

“విష్ణు.. అప్పుడే వచ్చావేందిరా” అమ్మ మాట తడబడింది. నేను అతనివైపుకు నడిచాను.

“బాబు.. విష్ణు.. నేను..” ఏదో చెప్పాలని అతని ప్రయత్నం.

“అంతా విన్నాను. మిమ్మల్ని తండ్రి అని చెప్పుకోవడానికి కూడ అసహ్యం వేస్తున్నది నాకు. ఎవరినైతే జీవితంలో చూడకూడదనుకున్నానో, అటువంటి మనిషిని చూడవలసి వచ్చినందుకు నా తలరాతను నేనే తిట్టుకుంటున్నాను. దయచేసి బయలుదేరండి. ఇక ఎప్పుడు ఇక్కడకు రాకండి.” నాలో కోపం తారాస్థాయికి చేరింది.

“వెళ్తాను విష్ణు. మరణించేలోపు ఒక్కసారి మిమ్మల్ని కలిసి, క్షమాభిక్ష కోరి, నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాను. కాని నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదని తెలుసుకున్నాను. ఎవరికీ అందనంత దూరం వెళ్ళిపోతాను. అజ్ఞాతంగానే బ్రతుకుతాను” అతని కళ్ళు వర్షిస్తున్నాయి. బలహీనమైన దేహాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు.

“విష్ణు.. నేను తప్పు చేశానా? ఇన్ని రోజులకు చేరువకాబోతున్న తండ్రి ప్రేమను నీకు దూరం చేశానా?” అమ్మ కళ్ళల్లో కన్నీటి తెర.

“తల్లి కడుపున మోస్తే, తండ్రి భుజాన మోస్తాడంటారు. ఆయన భుజం స్పర్శ నాకు తెలియదమ్మా. అటువంటప్పుడు ఆయన ప్రేమ నాకు దూరమైందని ఎందుకు బాధపడతాను. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని నువ్వేనమ్మా. ఆయన మాటలకు మెత్తబడి పోతావేమోనని భయపడ్డాను. ఏ దేవతో నీలో ప్రవేశించి మంచినిర్ణయం తీసుకునేలా చేసింది. అమ్మా.. నాకు, నువ్వు.. నీకు, నేను. చాలమ్మా” అమ్మను మంచం మీద కూర్చోబెట్టి, ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాను. బిడ్డ తండ్రికి దూరమైనా బ్రతకగలడు, కాని తల్లి లేకుండ బ్రతకలేడు. దానికి కారణం ఒక్కటే.. తండ్రిలేని లోటును కనపడనీయకుండ పెంచగలదు తల్లి. కానీ తండ్రికి అది సాధ్యంకాదు. అది స్త్రీలకు భగవంతుడిచ్చిన వరం. ఈ జన్మకు ఇది చాలు నాకు. ఏదో తెలియని ఆనందం కన్నీటివర్షమై పొంగింది.

“చిన్నా.. ఏడవకురా. ఏ శక్తి కూడ నన్ను, నీకు దూరం చేయలేదు, ఒక్క నా మరణం తప్ప” అంటున్న అమ్మ నోటికి చేతిని అడ్డు పెట్టాను, అమ్మ నోట అపశకునపు మాటలు రాకూడదని.

Exit mobile version