Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-118

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ఆకురాలు కాలం

స్సు బయల్దేరడానికి సిద్ధంగా ఉంది.

ప్రయాణీకులంతా ఎవరి సీట్లో వాళ్లు కూర్చున్నారు. సాగనంపటానికి వచ్చిన బంధువులు వీడ్కోలు చెబుతున్నారు. కండక్టర్ టిక్కెట్లు చెక్ చేసుకుంటున్నాడు

సరస్వతమ్మ కొంగున మూట కట్టుకున్న టిక్కెట్లు తీసి కండక్టర్‌కి చూపించి మళ్లీ వాటిని భద్రంగా దాచుకుంది. ఆమె పక్కన కూర్చున్న ఆమె పసిపిల్లతో ప్రయాణం చేస్తోంది. అందుచేత భర్త ఎన్నో జాగ్రత్తలు చెబుతున్నాడు. నిద్రలో పిల్ల ఒళ్లోంచి జారి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని హితవు చెబుతున్నాడు. కొంచెం కనిపెట్టి చూస్తుండమని, పరిచయం లేకపోయినా సరస్వతమ్మకీ చెప్పాడు. మరేం ఫర్వాలేదని సరస్వతమ్మ అతనికి అభయం ఇచ్చింది. అతను దిగిపోయాడు. బస్సు బయల్దేరింది.

“నీ పేరేమిటమ్మా?” అని అడిగింది సరస్వతమ్మ.

“సంధ్య” అన్నదామె.

ఇద్దరూ పరిచయాలు చేసుకున్నారు. సంధ్య భర్త ఇంజనీరుగా పని చేస్తున్నాడు. ఆమె అత్తగారు, మామగారు హైదరాబాదులో ఉన్నారు. ఆడబిడ్డ పురిటికి పుట్టింటికి వచ్చింది. అత్తగారికి సాయంగా ఉండేందుకు సంధ్య హైదరాబాదు వెళ్తోంది.

‘నీ అత్తగారు అదృష్టవంతురాలు’ అనుకున్నది సరస్వతమ్మ మనసులోనే.

బస్సు ఊరు దాటి వచ్చేసింది. చలిగాలి రివ్వున కొడుతోంది. కిటికీ అద్దాలు మూసేసింది సంధ్య – పసిపిల్లకు చలిగాలి తగుల్తోంది- అంటూ. సంధ్య తన అత్తగారి గురించీ ఆడబిడ్డ గురించీ చెబుతోంది.

“ఈ కాలంలో మా అత్తగారి లాంటి వాళ్లు ఎక్కడో గాని ఉండరు. ఆమె కూతుళ్లనే, కోడళ్లనీ సమానంగా చూస్తుంది. కూతురుకు రెండు వేలు పెట్టి చీర కొంటే, మాకూ అంతా ఖరీదు పెట్టి చీరలు కొంటుంది. కొడుకులంటే ఆమెకు ప్రాణం. వాళ్లకు ఎంత డబ్బు వస్తోంది, దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారూ, అన్నీ ఆమెకు లెక్కే. దుబారా తగ్గించుకుని నగలు చేయించుకోమని కోడళ్ళకు హితబోధ చేస్తుంటుంది. అందుకే మేము కూడా ఆమెను అంత ప్రేమగానూ చూస్తాం” అని సంధ్య చెప్పింది.

సరస్వతమ్మకు ఆమె చెబుతున్నదంతా వింతగా ఉన్నది. ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంత అన్యోన్యంగా ఉన్న కుటుంబాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయింది.

ఆమెకు తన అనుభవాలన్నీ గుర్తుకు వస్తున్నయి.

ఆమెకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు దగ్గర ఆరునెలలూ, చిన్న కొడుకు దగ్గర ఆరునెలలూ ఉండేందుకు ఒప్పందం కుదిరింది. పెద్ద కొడుకు దగ్గర ఉండే ఆరునెలలూ రేపటితో పూర్తి అవుతాయి. అందుచేత ఇవాళ రాత్రే ఆమెను బస్సు ఎక్కించి చిన్న కొడుకు దగ్గరకు పంపిస్తున్నాడు.

పెద్దకొడుకు దగ్గర ఉన్నంత కాలం ఆమెకు ముళ్ల మీద ఉన్నట్లే ఉంటుంది. కోడలిది చాలా చిత్రమైన మనస్తత్వం. పైకి చాలా ప్రేమగా ఉన్నట్లు కనిపిస్తుంది.

కానీ ఆ నటన అంతా కొడుకు ఎదురుగా ఉన్న కాసేషే. వాడు అటు తిరగగానే కోడలు తూటాల్లాంటి మాటలతో గుండెను తూట్లు పొడుస్తుంది.

పొద్దులే నిద్దర లేవగానే కాఫీలు తాగటం దగ్గరే మొదలవుతుంది రాద్ధాంతం.

కొడుకు, కోడలు, పిల్లలూ, వాళ్లందరితో కల్పి కబుర్లు చెప్పు కోవాలని సరస్వతమ్మ ఆశ. కానీ కోడలు అత్తగారిని దగ్గరకు చేరనివ్వదు. అందుచేత ఆమె ముందు గదిలోనో, వీధి గుమ్మం దగ్గరో ఉండిపోతుంది.

కోడలు చడీచప్పుడు కాకుండా కాఫీ కప్పు ఆ దరిదాపుల్లో ఎక్కడో పెట్టేసి వెళ్తుంది. ఆ కప్పు అక్కడ పెట్టిన విషయమూ సరస్వతమ్మకు తెలియదు.. అరగంట తరువాత కోడలు గొంతు కంచుగంటలా ఖంగున మ్రోగుతుంది.

“చూశారా, ఆమె రాజసం? కాఫీ ఇచ్చి అరగంట అయినా ఆమె తాగలేదు. ఇవ్వకపోతే ఇవ్వలేదంటుంది. ఇస్తేనేమో దానివంక కూడా చూడదు. పోనీ అక్కర్లేకపోతే వద్దని చెప్పొచ్చుగదా. పనిమనిషి కన్నా ఇచ్చేదాన్ని” అంటూ స్తోత్రం చదువుతుంది.

సరస్వతమ్మ బిత్తరపోయి, మంచి నీళ్లలాంటి కాఫీ గొంతులో పోసుకుని కాఫీ కప్పు పెరట్లో నూతిగట్టు మీద పెట్టేస్తుంది.

ఆమె ఎప్పుడు స్నానం చేయాలన్నదీ వివాదాంశమే. అందరికన్నా ముందు స్నానానికి వెళ్తే “ఇప్పుడు నీకేం తొందర వచ్చింది? పిల్లాడు స్కూలుకు వెళ్లాలి. ఆయన ఆఫీసుకు వెళ్లాలి. నువ్వే ఆఫీసుకు వెళ్లాలని తొందర పడుతున్నావు?” అంటూ గొంతు పెంచి అడుగుతుంది. వాళ్ళందరూ వెళ్లిపోయేదాకా ఆగి, అప్పుడు స్నానానికి బయల్దేరితే, అప్పుడూ వ్యాఖ్యానాలు తప్పవు. “పన్నెండు గంటల దాకా గోళ్లు గిల్లుకుంటూ కూర్చోకపోతే, పెందరాళే స్నానాలు ముగించుకోవచ్చుగదా. ఇంత మంది ఆడాళ్లను చూశాను గానీ, మీ అంత బద్ధకస్తురాలని నేనెక్కడా చూడలేదు” అంటుంది.

కోడళ్లు కాపురానికి రాక ముందు వంటింట్లో ఆమెదే పెత్తనం, తన చేతుల మీదుగా పదిమందికి పెట్టిన తరువాతనే తను తినేది. ఇప్పుడామె వంటింట్లోకి అడుగు పెట్టటానికి వీల్లేదు. మంచినీళ్లు తాగాలన్నాకే అడిగి ఆమె ఇస్తేనే తాగాలి. భోజనం విషయంలోనూ అంతే. కోడలు కంచంలో ఇంత అన్నం, కూర పడేసి ఎటో వెళ్లిపోతుంది. గంట సేపటి దాకా ఆ చుట్టు పక్కల ఎక్కడా కనిపించదు – తనంతట తాను వడ్డించుకున్నా యుద్ధమే. అంతటితో ముగించి చెయ్యి కడుకున్నా తప్పే.

సరస్వతమ్మతో ఎవరూ మాట్లాడరు. కొడుకు దగ్గర కూర్చొని కష్టసుఖాలు చెప్పుకుంటే, ఆమెకు ఎంతో తృప్తిగా ఉంటుంది. ఇంట్లోనే ఉంటున్నా కొడుకును కళ్లారా చూసుకొనే అవకాశమే కరువై పోయింది. ఎప్పుడైనా ఆమె కొడుకు దగ్గరకు వెళ్తే చాలు ఆమె వచ్చేస్తుంది. “ఏమిటీ, నా మీద ఏదో కంప్లయింట్స్ చేస్తోంది?” అంటూ.

కాసేపు కొడుకూ, కోడలూ ఘర్షణ పడతారు. వాడు బయటకు వెళ్లాక ఇంక ఆ కోపం అంతా అత్తగారి మీద చూపించేస్తుంది. తన గురించి వాళ్లిద్దరూ గొడవ పడటం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం ఉండదు

సరస్వతమ్మ పల్లెటూరిలో తన ఇంట్లో ఉన్నంత కాలం తృప్తిగా నిశ్చింతగా బ్రతికింది. భర్త నీడలో రోజులు ప్రశాంతంగా గడిపేసింది. ఆ మహారాజు వెళ్లి పోయిన తరువాత కూడా ఆమె ఆ ఇంట్లోనే ఒంటరిగా ఉండాలనుకుంది. కానీ కొడుకులు, కోడళ్లూ వచ్చి కూర్చుని ఒత్తిడి చేశారు. “నువ్వు ఒక్కదానికీ ఇక్కడ ఏం ఉంటావు? నీకు తలనొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా పలకరించేవాళ్లు ఎవరున్నారు? నీకూ వయస్సు అయిపోయింది. ఇంక మా దగ్గర ఉంటేనే బావుంటుంది” అని కొడుకులు ఇద్దరూ చెరో పక్కన చేరి చెబుతుంటే, కోడళ్లు ఇద్దరూ ఎదురుగా నిలబడి వత్తాసు పలుకుతుంటే, వాళ్లందరి మాటా కాదన లేకపోయింది.

ఇల్లు అమ్మేశారు. వచ్చిన డబ్బు కొడుకు లిద్దరూ చెరి సగం తీసుకుని బ్యాంకులో వేసుకున్నారు. ఆమెకు కొడుకుల వాకిళ్ల ముందు కూర్చోక తప్పలేదు.

ముసలివాళ్లు, పసివాళ్లు సమానం అని అంటారు. మనవళ్లూ మనవరాళ్లతో కాలక్షేపం చేయాలని సరస్వతమ్మ ఆకాంక్ష. కానీ కోడలు పిల్లల్ని ఆమె దగ్గరకు చేరనివ్వదు.

“మీ అలవాట్లూ బుద్ధులూ పిల్లలకు వస్తే చచ్చిపోతాం. ఇప్పటికే మీతోనే వేగలేక చస్తున్నాం. ఇంక పిల్లల్ని కూడా మీలా ఎందుకు తయారుచేస్తారు?” అని కోడలు ముఖానే కుండబద్దలు కొటినట్లు చెప్పేస్తుంటే, ఆమె చేయగలిగేదేముంది?

సరస్వతమ్మ ఇంట్లో వాళ్ళతోనే కాదు, ఇరుగు పొరుగు వాళ్లతోనూ మాట్లాడ కూడదు. ఎప్పుడన్నా ఓ అయిదు నిముషాలు పక్కింటామెతో మాట్లాడితే “ఏమిటీ? మంతనాలు సాగిస్తున్నావు?” అంటూ దీర్ఘాలు తీస్తుంది.

కొడుకు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో సంతోషంగా కాలం గడపాలని ఆశపడి, స్వంత ఇల్లు అమ్ముకుని, ఉన్న ఊరును వదులుకుని వచ్చినందుకు, ఇక్కడ గడ్డిపోచకన్నా హీనం అయిపోయింది.

ప్రతి చిన్న విషయానికీ కోడళ్ల చేత మాటలు పడుతూ, అవమానాలు పొందుతూ, మానసికంగా, శారీరకంగా క్రుంగిపోయింది.

ఎవరూ పలకరించే దిక్కు లేనందువల్ల, తనలో తానే పిచ్చిదానిలా గొణుక్కుంటున్నది.

ఇప్పుడు షిఫ్ట్ మారింది.

పెద్దకొడుకు దగ్గర నుంచీ చిన్నకొడుకు ఇంటికి వస్తోంది. బస్సులోనే పక్కన కూర్చున్న సంధ్య తమ కుటుంబంలోని అత్తకోడళ్ల అన్యోన్యం గురించి చెప్పినప్పుడు, సరస్వతమ్మకు తాను పోగొట్టుకున్న స్వర్గం అదేననిపించింది.

తెల్లవారేటప్పటికి బస్సు హైదరాబాదు చేరింది. సరస్వతమ్మ వస్తున్నట్లు చిన్నకొడుక్కి వారం రోజుల ముందే ఉత్తరం రాశారు. కొడుకు కోసం ఓ అరగంట ఎదురు చూసి, ఆటో ఎక్కింది.

ఇంట్లోకి వచ్చిన్న తల్లిని కొడుకు పలకరించాడు. కోడలు ఆ మాత్రం కూడా పలకరించలేదు. చిన్న కోడలు ఉద్యోగం చేస్తోంది. తొమ్మిది గంటల కల్లా ఆఫీసుకు వెళ్లిపోతుంది. సాయంత్రం ఆరుగంటలకు ఇల్లు చేరుతుంది. సరస్వతమ్మ వంట చేయాలి. అందులోనూ ఆమెకు స్వేచ్ఛ లేదు. “ఇదేమిటి? పంచదార అప్పుడే అయిపోయింది? మంచినూనె మొన్ననే తెప్పించాను. ఇంతింత పారబోస్తే ఎలాగా? సంపాదించే వాళ్లకు తెలుస్తుంది వాటి విలువ ఏమిటో? తిని కూర్చునే వాళ్లకు ఏం తెలుస్తుంది?” అంటూ రాగాలు తీస్తుంది.

వంట చేయటం ఆమెకు కొత్త కాదు. నలభై ఏళ్ల అనుభవం ఉంది. ఈ వయసులో నిష్కారణంగా కోడలు చేత మాటలు పడాల్సి వస్తోంది. ఇంటికి ఎవరైనా బంధువులూ, స్నేహితులూ వచ్చినప్పుడు కోడలు అందరి ముందూ మరింత చులకనగా మాట్లాడుతుంది.

తన స్థాయి పనిమనిషి స్థాయికి దిగజారిపోయిందని తెల్సినప్పటి నుంచీ సరస్వతమ్మకు దుఃఖం పొంగి పొర్లుతోంది.

ఎవరితో చెప్పుకోవాలో తెలియక మౌనంగా కన్నీరు తుడుచుకుంటోంది. “ఏం జరిగింది?” అని చిన్నకొడుకు అడిగినా, తన బాధ ఇదీ అని చెప్పుకోలేని పరిస్థితి.

ఏదన్నా చెబితే ఇద్దరి మధ్యా యుద్ధమే జరుగుతుంది. తన వల్ల వాళ్ల మధ్య స్పర్ధలు రావటం ఆమెకు ఇష్టం లేదు. ఈ జీవన సంధ్యలో ఎక్కడో ఒక చోట కాలక్షేపం చేయాలని అనుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది.

వృద్ధులకు ఆశ్రమాల లాంటిది ఏదో ఉందని తెల్సి, దాని అడ్రసు కనుక్కుని వెతుక్కుంటూ వెళ్లింది.

“కొడుకులూ, కోడళ్లు ఉన్నవాళ్ల కోసం కాదమ్మా ఇది. పైగా, ఎవరైనా కాస్త పలుకుబడి గల వాళ్లు రికమండేషన్ చేస్తేగాని చేర్చుకోము” అన్నారు ఆ ఆశ్రమం వాళ్లు.

సూర్యం తన ఊరివాడే. తనకు తెల్సిన వాడే. మంచి పొజిషన్‍లో ఉన్నాడని అతని దగ్గరకు వెళ్లి అడిగింది.

“ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నిశ్చింతగా రోజులు గడపవచ్చునని అనుకున్నాను. వాళ్ళంతట వాళ్లు వచ్చి పోరుపెట్టి, ఉన్న ఇల్లు అమ్మేసి, ఆ డబ్బు ఇద్దరూ పంచేసుకున్నారు. ఇప్పుడు నేను వాళ్లకు భారం అయినాను. పొమ్మని అనలేక, ఇంట్లో నుంచి తరిమేసేందుకు చేయవల్సినదంతా చేశారు. ఎవరిని కష్టపెట్టటం నాకు ఇష్టం లేదు. నువ్వూ నా కొడుకు లాంటి వాడివేనని ఆదుకుంటావని వచ్చాను. ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించు. నీకు పుణ్యముంటుంది” అని వేడుకుంది.

“ఇది చాలా సున్నితమైన సమస్య. నేను నీ విషయంలో జోక్యం చేసుకుంటే, మీ కొడుకులకూ, కోడళ్లకూ నేను శత్రువునై పోతాను. నన్ను ఏమీ అనలేక, ఆ కోపం అంతా నీ మీదనే చూపిస్తారు. అందుచేత ఈ అయిదొందలు ఉంచు. ఇంతకన్నా నేనేం చేయలేను” అన్నాడాయన.

“వద్దు నాయనా, నేను నీ దగ్గర మాట సాయం కోసం వచ్చాను. నిన్ను యాచించటానికి రాలేదు” అన్నది సరస్వతమ్మ. ఆయన ఆమెను గేటు దాకా వచ్చి సాగనంపాడు.

“ఎక్కడికి వెళ్తావమ్మా” అని అడిగాడు.

“చెట్టునుంచి రాలిపోతున్న ఆకును ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే ఏం చెబుతుందిరా సూర్యం. నేనూ అంతే” అన్నదామె నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ.

ఆమెకు తెల్సింది బస్ స్టాండ్ ఒక్కటే.

శ్రీశైలం బస్సు ఎక్కింది. సాయంత్రానికి అక్కడికి చేరుకుంది. దేవుడి దర్శనము చేసుకుంది.

సత్రంలో అరుగు మీద పడుతుంది ఓపిక లేక.

“ఏమండీ, ఇక్కడ పడుకోకూడదండీ. లేవాలి మీరు” అన్నారు ఎవరో.

ఆమె లేవలేదు ఇంక.

నేను ఎవరికీ సమస్య కాకూడదు – అనుకుంటూ తెలియని చోటుకు వెళ్ళింది. కానీ తట్టి లేపినా లేవలేదు. ఆమె ఎవరో ఏమిటో తెలియక, ఎవరికి కబురు చెయ్యాలో తెలియక, అక్కడి వాళ్లకు ఒక సమస్య అయింది.

Exit mobile version