Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-119

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

ప్రియంవద

ప్రియంవద చీకట్లో కూర్చుంది. చీకట్లోకి చూస్తోంది. జీవితంలోని సుఖదుఃఖాలకు దూరమై, వెలుగూ, వెన్నెలా కనుమరుగై పోయాక, ఇంక అంధకారమే గదా మిగిలింది.

ప్రియంవదకు భర్తతో సహచర్యం మూడునాళ్ళ ముచ్చటే అయింది. జగదీష్ మిలటరీ ఆఫీసర్. ఒడ్డూ పొడుగూ ఉండి, కొరమీసాలు తిప్పుతూ సీరియస్‌గా చూస్తూ, చూసే వాళ్లకు అరివీర భయంకరుడిలా కనిపించినా, ఆమె దగ్గర కొస్తే మాత్రం, సరస సల్లాపాలతో చిలిపి వేషాలన్నీ వేసేవాడు. డ్రెస్ వేసుకుంటే, సింహంలా ఉంటాడు. ఆమె దగ్గరికొచ్చినప్పుడు మాత్రం శృంగార చక్రవర్తి అయిపోతాడు.

ఒకసారి అతను మిలటరీ ఆఫీసర్స్ క్లబ్‌కు వెళ్తున్నాడు. ఏ డ్రెస్ వేసుకుంటే బావుంటుందా అని ఆలోచిస్తున్నాడు.

“నేనూ మీతో వస్తాను” అన్నది ప్రియంవద.

“నువ్వు రావటానికి వీల్లేదు. ఏ షర్ట్ వేసుకోమంటావో చెప్పు” అన్నాడు జగదీష్.

“నన్ను తీసుకు వెళ్తానంటేనే”

“నువ్వు రావటానికి వీల్లేదు. ఏ షర్ట్ వేసుకోను?”

“మీకు నేను ఎక్కువా? షర్ట్స్ ఎక్కువా?” అన్నది అలిగి.

“షర్టే ఎక్కువ. నువ్వు లేకుండా ఎక్కడికైనా వెళ్లగలను. కానీ షర్ట్ లేకుండా ఎక్కడికి వెళ్లలేను” అన్నాడు నవ్వుతూ రెండు చేతులతో చుట్టేస్తూ.

అదేం మహాత్యమో గానీ, ఆయన దగ్గరకు తీసుకుంటే చాలు, ఎంతటి కోపం అయినా ఇట్టే మాయమైపోతుంది.

తన కంటి వెలుగు, ఈ ఇంటి వేలుపు.. జగదీష్ ఇంత అర్థాంతరంగా వెళ్లిపోయాడంటే నమ్మబుద్ధి కావటం లేదు.

తనను ప్రేమగా అక్కున చేర్చుకుంటూ అనేవాడు “ఇంత అందాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్నప్పుడు, నా అంత అదృష్టవంతుడు లేడనిపిస్తుంది.”

“కానీ మిలిటరీ ఆఫీసర్లకి, భార్య కన్నా డ్యూటీయే ఎక్కువ కదా. ఇప్పుడు ఫోన్ వస్తే చాలు, పరుగెడుతారు” అనేది ప్రియంవద.

“ఊహు, దేవుడు పిలిచినా నిన్ను వదిలిపోలేను” అనేవాడు ఆమెను మరింత దగ్గరగా గుండెలకు హత్తుకుంటూ.

ప్రియంవద నిట్టూర్చింది. ఓర్వలేని దేవుడే పిలిచాడు. మంచివాళ్లను దేవుడు త్వరగా తన దగ్గరకు రప్పించుకుంటాడు.

కాశ్మీర్‌లో.. బార్డర్‌లో.. విధి నిర్వహణలో.. ఇరు పక్షాల కాల్పులు.. చనిపోయే ఉంటాడు. జగదీష్‌తో పాటు మరో నలుగురు.. శవాలు దొరకలేదు. కనక చనిపోయినట్లు స్పష్టం కాలేదు. ‘మిస్సింగ్’ అని మాత్రం తెలియజేశారు. అంటే ఏ లోయలోనో పడిపోయి ఉంటారని నిర్ణయానికి వచ్చారు.

మిస్సింగ్.. జగదీష్‌ను పోగొట్టుకున్నాక, ప్రియంవదకు జీవితం నిరర్థకం అనిపించింది. ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియకుండానే ఆరునెలలు గడిపింది.

ఇప్పుడు ఆమె ఒక ప్రాణమున్న బొమ్మ. ఈ బొమ్మ నవ్వలేదు. ఆలోచించలేదు. తిరిగే గడియారం ముళ్ళతో పాటు లేచి యాంత్రికంగా ఇంట్లో తిరుగుతూ వేళకు ఇంటి పనులు చేసుకుంటూ పోతోంది.

లైటు వెలిగింది. ఆమె తలెత్తి చూసింది. మామగారు. లెఫ్టినెంట్ కల్నల్‍గా పని చేసి రిటైరయ్యారు. పేరుకే కాదు నిజంగానే ఆయన కోట్లుకు పడగలెత్తిన కోటేశ్వరరావు.

ప్రియంవద లేచి నిలబడింది. ఆయన సోఫాలో కూర్చుంటూ అడిగాడు “చీకల్లో కూర్చున్నావేమమ్మా?” అని. ఆమె సమాధానం చెప్పలేదు. ఎప్పుడో తప్ప నోరు విప్పి మాట్లాడటం లేదు.

“నిన్ను చూస్తుంటే, నా గుండె తరుక్కుపోతోంది. పోయిన వాడు తిరిగి రాడు. పోయినవాడి కోసం నువ్వు ఎన్నాళ్లని ఇలా ఎండిన మ్రోడులా మిగిలిపోతావు? జరగకూడనిది జరిగిపోయాక, ఇంక జరగవల్సినదేమిటో ఆలోచించుకోవాలి గదా. నిండా ముప్ఫయి ఏళ్లు కూడా లేవు. జీవితం అంతా ముందు ఉంది – నీ యవ్వనం అడవిన కాచిన వెన్నెల కావటం బాధగా ఉంది. నువ్వు ‘ఊ’ అంటే, నీకు మళ్లీ పెళ్లి చేయిస్తాను” అన్నాడు కోటేశ్వరరావు.

ప్రియంవద ఉలిక్కి పడింది. మామగారి నోటి నుంచి అలాంటి మాటలు రావటం ఆశ్చర్యంగా ఉంది.

మర్నాడు ప్రియంవద తండ్రి సత్యనారాయణ వచ్చాడు. కూతురుకు హితబోధ చేశాడు.

“ముసలాడు పెద్ద ఎత్తుగడలో ఉన్నాడు. ఆస్తిలో నీ వాటా ఇవ్వమని ఎక్కడ అడుగుతావోనని ముందు నుంచే కాళ్ళకు బంధం వేస్తున్నాడు. నీ వాటా ఇవ్వవల్సి వస్తుందని ఈ ప్లాన్ వేశాడు. నువ్వు ‘ఊ’ అంటే, నీ తరఫున లాయర్ నోటీసు తగిలిస్తాను – వాటా పంచి ఇవ్వమని.” అని కూతురుకు నూరిపోశాడు

మామగారి ఆంతర్యం అర్థమైంది. తండ్రి అభిప్రాయమూ తెల్సిపోయింది. కొడుకు పోయినందుకు ఆయనకు బాధ లేదు. కూతురు జీవితం ఎండిన మ్రోడులా మారినందుకు తండ్రికి దిగుల్లేదు. ఆ మ్రోడును నరికి కలప అమ్ముకుని అయినాసరే, డబ్బు సంపాదించాలని..

తొందరపడి నోటీసులు ఇవ్వవద్దని తండ్రిని కోరింది.

మరిది సత్యప్రకాష్ ఈ మధ్య ప్రియంవద మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. ఆమె కోసం చీరలు, పూలు తెస్తున్నాడు. అనుక్షణం నీడలా వెన్నంటి తిరుగుతున్నాడు. సినిమాలకు, షికార్లకూ రమ్మని అడుగుతున్నాడు.

ఒక రోజు కాఫీ అందించబోయిన చేతిని పట్టుకున్నాడు.

“నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా?” అని అడిగింది.

“జీవితం అనుభవించటానికేనని పశువులకూ తెల్సు”

“నేను నీకు వదినను. తల్లిలాంటి దానిని. వావివరుసలు మర్చిపోయి, కనిపించిన ఆడదాని చెయ్యి పట్టుకునేందుకు మనం కిన్నెరులం కాదు. కొమ్మ మీద నుంచి కొమ్మ మీదకు దూకే వానరులం కాదు. యుక్తాయుక్తాలు తెల్సిన నరులం..” అన్నది ప్రియంవద.

“ఈ యుక్తాయుక్తాలూ, నీతినియమాలు, కట్టుబాట్లూ అన్నీ మన కోసం మనం ఏర్పరుచుకున్నవే. వాటిని సమయానుకూలంగా మార్చుకోవటంలో తప్పు లేదు. ప్రతి రూలుకీ, ఒక సడలింపు, ఒక మినహాయింపు ఉంటుంది” అన్నాడు మరిది.

“అవన్నీ మనల్ని మనం మభ్యపెట్టుకునేందుకు, సమర్ధించుకునేందుకు చెప్పే మాటలు. పాపం చేసిన వారిని భగవంతుడు క్షమించినా, అంతరాత్మ క్షమించదు” అన్నది ప్రియంవద.

జగదీష్ స్నేహితుడు చంద్రం ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు. ఒంటరిగా ఆమెతో మాట్లాడాడు. జరిగిన అన్యాయానికి విచారం వెలిబుచ్చాడు.

“వాడి దోవన వాడు వెళ్లిపోయాడు. మీ జీవితం ఎలా గడపాలనుకుంటున్నారు?” అని అడిగాడు.

“నేను ఆయన్ను మర్చిపోలేక పోతున్నాను. ఎప్పుడూ ఆయనే కళ్ళముందు మెదులుతున్నారు. ఆయన జ్ఞాపకాలతోనే జీవితం గడిచిపోతే చాలనుకుంటున్నాను” అన్నది ప్రియంవద.

“ఈ బాధను మర్చిపోవటానికైనా మీరు మళ్లీ పెళ్లి చేసుకోవాలి. మీ ఈడు వాళ్లకు చాలామందికి ఇంకా వివాహమే కాలేదు. మీకు అప్పుడే జీవితానందం అందని కుసుమం అయిపోకూడదు.”

“మీ ఉచిత సలహాకు థాంక్స్. ఎవరి జీవితం వాళ్లదే. ఇతరులతో పోల్చుకోకూడదు.”

“నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను.”

“లవ్ ఈజ్ ఏ కండిషన్ ఆఫ్ మైండ్, వెన్ ది మైండ్ ఈజ్ అవుటాఫ్ కండిషన్” అన్నది ప్రియంవద.

“మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని కల్పిద్దామనుకుంటున్నాను.”

“ఉన్న అర్థాలు చాలు. మీరు వెళ్లి రావచ్చు” అన్నది ప్రియంవద. అతను వెళ్లిపోయాడు.

కోటేశ్వరరావు ఆమెకు పెళ్లి సంబంధం కోసం పేపర్లో ప్రకటన ఇచ్చాడు.

“నేను పెళ్లి చేసుకోవాలనుకోవటం లేదు. నేనొక స్కూలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను” అన్నది.

“కానీ డబ్బు..?”

“మీరే ఇవ్వాలి. నా వాటా డబ్బుతో స్కూలు ఏర్పాటు చేస్తాను.”

“వాటాలు అడిగేదాకా వస్తే, నీకే ఇంట్లో స్థానం ఉండడని తెల్సుకో”

“మీరు ఇంట్లో స్థానం ఇవ్వకపోయినా, నాకు ఇంటి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది” అన్నది ప్రియంవద.

తండ్రి లాయర్‍ను సంప్రదిస్తున్నాడు.

ఒకరోజు రాత్రి సత్యప్రకాష్ ఆమెను బలాత్కారం చేయబోయాడు. కొట్టి, తిట్టి, రక్కి, రక్షించుకున్నది. అప్పటి నుంచీ గది తలుపులు బంధించుకుని కూర్చుంటోంది.

ఇంతలో మిలటరీ ఆఫీసర్స్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. జగదీష్ బ్రతికే ఉన్నాడనీ, శత్రువులు బందీగా పట్టుకున్నారనీ, విడిపించే ప్రయత్నాలు ఫలించాయనీ తెలియజేశారు.

రెండు వారాల తరువాత జగదీష్ ఇంటి కొచ్చాడు.

ప్రియంవదను దగ్గరకు తీసుకున్నాడు. భర్త గుండెలమీద వాలిపోయి ఏడ్చింది.

“నేనొక బందీలా ఉండిపోయాను ఇన్నాళ్ళు” అన్నాడు జగదీష్.

“నేనూ అంతే” అన్నది ప్రియంవద.

“ఎన్నిరకాలుగా హింసించారనుకున్నావ్?”

“నన్ను అంతే.”

“మళ్లీ నిన్ను చూస్తాను అనుకోలేదు.”

“నేనూను.”

“అసలు అలాగే ఉన్నావో, ఇంకెలా ఉన్నావో, ఏం మార్పులు వచ్చాయోనని భయపడ్డాను..”

“మీ ప్రియంవద ఎప్పటికీ మీదే. ఏ మార్పు ఉండదు” అని కన్నీరు కార్చింది.

జగదీష్ బలంగా ఆమెను గుండెలకు హత్తుకున్నాడు.

Exit mobile version