Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-124

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

చవితి నాటి చంద్రుడు

ట్టమైన మబ్బులు నిండు గర్భిణిలాగా కదలలేక, కదలలేక నెమ్మదిగా కదులుతున్నయి. ఇప్పుడో, ఇంకాసేపటిలో వర్షం దంచి కొట్టేలా ఉంది.

కారు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు దూసుకుపోతోంది. అసలే కుర్రకారు. పైగా కొత్త కారు. అందునా కొత్త దంపతులు. మహా జోరు మీద ఉన్నారు.. రహదారి మీద ఉన్నారు.

కారు మలుపు తిరుగుతున్నది. అతను ఒడుపుగా చక్రం తిప్పాడు.

“నువ్వు చక్రం తిప్పటంలో సిద్ధహస్తుడవనే, మీవాళ్ళు నీకా పేరు పెట్టారు” అన్నదామె.

“నేను చక్రం తిప్పబట్టే కదా, నువ్వు నా పక్కన చేరావు” అన్నాడు అతను.

అతనిది కృష్ణలంక. ఆమెది సీతమ్మధార. అడవిలోని ఉసిరికాయ, సముద్రంలోని ఉప్పు కలిసినట్లు, ఇద్దరూ చెరో చోటు నుంచి వచ్చి హైటెక్ సిటీలో అయిదో అంతస్తులోని ఒక కంపెనీలో, ఒకే రోజు పక్కపక్కన చేరారు.

వయసులో ఉన్నప్పుడు కళ్లు నిరంతరం దీని కోసమో అన్వేషిస్తూ ఉంటాయి. ఎక్కడో ఒక చోట చూపు నిలిచి పోతుంది. అంతే అన్వేషణ ఆగిపోతుంది.

రోజూ ఆఫీసుకు రాగానే స్నేహ హస్తాన్ని చాచేవాడు. అరవిరిసిన దిరిసెన పువ్వులాంటి సుతిమెత్తని చేతిని అందించేది. ముంజేతిపై వాలిన చిలకలా వాలుచూవులూ వచ్చి చేరేవి. సయ్యాటలాడి నెయ్యానికి రమ్మన్న కనుసైగలూ వెంటాడుతుండేవి.

లంచ్ చేస్తున్నప్పుడూ వలపుల ఊహలు నంజుకునేవారు. క్షణాలూ, నిముషాలే కాదు, రోజులూ, నెలలూ అలా రెపలాడకుండా అనిమేషంగా చూస్తుండగానే గడిచి పోయాయి.

“ప్రేమ అంటే ఒకరి వైపు మరొకరు చూస్తూ కూర్చోవటం కాదు. ఇద్దరూ ఒకే వైపు చూడటం..” అన్నాడు అతను.

“పక్కన నువ్వుంటే చూపు పక్కకు మరలదు గదా” అన్నదామె.

“అయితే మరి నువ్వు ‘ఊ’ అను, నేను ‘ఊ ఊ’ అంటాను” అన్నాడు.

అమె ‘ఊ’ అన్నది కిలకిలా నవ్వుతూ.

“నువ్వు నవ్విన చోట నాకు నవరత్నాలు దొరుకుతాయి” అన్నాడు.

పెద్దవాళ్ల అభ్యంతరం అల్లా కట్నకానుకల దగ్గరే. స్పీడ్ బ్రేకర్ ఎదురైంది. అతను నేర్పుగా చక్రం తిప్పాడు. అంతే.. వంశీకృష్ణకీ, మధులతకీ సుముహుర్తం నెట్టుకొచ్చింది. అంగరంగ వైభవంగా వివాహం అయింది.

కారు వేగంగా దూసుకు పోతూనే ఉంది.

“ఏమన్నా మాట్లాడు” అన్నాడు డ్రైవ్ చేస్తూనే, భార్య భుజం మీద చెయ్యివేసి.

“నేనొకటి అడుగుతాను. నిజం చెప్పాలి” అన్నది మధులత.

“అర్ధాంగివి కదా.. అడుగు..”

“పెళ్లికి ముందు నువ్వు గ్రంథసాంగుడవని విన్నాను..”

“గ్రంథమే లేదు, సాంగు లెక్కడివి?”

“అబద్ధాలాడితే, ఆడపిల్లలు పుడతారు”

“ఏమీ లేదుగానీ, మా పక్కింటి అమ్మాయితో ఫ్రెండ్‌షిప్. అంతే”

“అందంగా ఉంటుందా?”

“ఎప్పుడూ ఎవరు ఆనందంగా నవ్వుతుంటారో, వాళ్లు ఎప్పుడూ అందంగానే ఉంటారు. ఎదురుపడిన ప్రతిసారీ ఎవరు చిరునవ్వు చిందిస్తారో వాళ్లను మించిన మంచి మనిషి మరొకరు ఉండరు. కుసుమ మేలిమి బంగారంలా మెరిసిపోతుండేది. ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నట్లు ఉండేది. మనిషి బంగారం అయితే, మనసు మరువపు మొలక..

మా ఇద్దరిదీ ఒకటే వయసు. ఒకటే క్లాస్. రోజూ వాళ్లింటి మేడమీదో మా ఇంటి పెరటి లోనో కబుర్లు కలబోసుకునే వాళ్లం. కుసుమ కలికి చూపులతో, మొలక నవ్వులతో, కులుకు నడకలతో, పరువాల సరస సల్లాపాలతో సంవత్సరాలు గడిచిపోయాయి..

రోజూ ఒక రోజా పువ్వు ఇచ్చేవాడిని. తలలో దోపుకునేది. రోజూ ఒక పుస్తకం ఇచ్చేవాడిని. చివరిపేజీ చదివి ఇచ్చేసేది. నీతో కలిసి ప్రపంచంలోని ఏడు వింతలూ చూడాలని ఉంది అని అంటే – ఎందుకూ, ఎనిమిదో వింత నువ్వు ఉన్నావు గదా, నిన్ను చూస్తున్నాను గదా – అని విరగబడి నవ్వేది. నిజంగానే కుసుమ కూడా నాకు ఎనిమిదో వింత లాగానే కనబడేది.

హృదయం చతురస్రాకారంగా ఉండకుండా, వృత్తాకారం ఎందుకు ఉందని పిచ్చి ప్రశ్న వేస్తే, ‘చతురస్రాకారంగా ఉంటే, వీధి కార్నర్‍లో ఎదురయ్యే  ప్రతి వెధవా, హృదయంలోని ఒక కార్నర్‍లో వాడి మోహపు మూటను దాచేసుకుంటాడ’ని.. అని అంటూ మళ్లీ అదే కిలకిల.. గలగల..

జీవితంలో నీకు అమితమైన ఆనందాన్ని కలిగించేది ఏది – అని వెర్రిముహం వేసుకుని అడిగితే, జన్మ నిచ్చిన తల్లిదండ్రుల కళ్లల్లో మిలమిలా మెరిసే సంతోషాన్ని చూడటం కన్నా, విలువైనవీ, వెల లేనిది ఇంకొకటి ఏముంటుందని.. అనేది.

మధ్య మధ్య రెండు మూడు రోజులు మూతి ముడిచేది. నిన్నగానీ, మొన్నగానీ నిన్ను గానీ నేను గానీ ఏమన్నా అన్నానా? అని అమాయకంగా అడిగితే, – ఏమీ అనలేదనే ఈ అలక – అంటూ వాలు చూపులతో పాటే వాలుజడనూ విసురుగా కొట్టేది నా మొహాన..” అని ఆపాడు.

కొద్ది క్షణాలు అగి అన్నాడు.

“ఎన్నని చెప్పను? అప్పటి జ్ఞాపకాలన్నీ నచ్చిన నెచ్చెలి మెచ్చి ఇచ్చిన చెలువపు చలువలు..” అని అన్నాడు.

“మరి నీవు ప్రేమిస్తున్నట్లు ఆమెకు ఎందుకు చెప్పలేదు?” అని అడిగింది  మధులత.

“ఎప్పటి కప్పుడు చెప్పాలను కుంటూనే.. చెప్పాలని నెమరు వేసుకున్నవి కొన్ని, తీరా దరి చేరినప్పుడు, చెప్పినవి కొన్ని, చెప్పీ చెప్పనివి కొన్ని చెప్పలేకపోయినవి కొన్ని.. ఈ ఊగిసలాటలో ఉండగా అమ్మా, నాన్నా, సిలికాన్ వ్యాలీ నుంచి ఒక నలకూబరుడు వంటి వాడిని, కుబేరుడు వంటి వాడిని తీసుకొచ్చారు, వాడు కుసుమ మెడలో తాళికట్టి, తాడు కట్టి తనతో లాక్కుపోయాడు. సమక్షంలో పెరిగిన చెరకు తోట, విరిగి పోయింది. పెదవి దాటని మాటలు, గొంతు పెగలని పాటలు, క్రీనీడలుగా సాగిన ఆటలు.. అన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయినయి. పరుగులు తీసిన కోరికల శారికలు అలసి సొలసి విశ్రమించాయి.”

“అంత చనువుగా ఉన్నారు గదా. ఆమెకు మాత్రం తెలియదా?’’ అని అడిగింది మధులత.

“పురుషుడు ఎప్పుడూ తాను ప్రేమించిన స్త్రీలోనే యావత్ ప్రపంచాన్నీ చూస్తాడు. కానీ స్త్రీ అలా కాదు తాను ప్రేమించిన పురుషునితో పాటు యావత్ ప్రపంచాన్ని చూస్తుంది. ఈ విభిన్నమైన దృక్పథం వల్లనే జీవన గమ్యాలూ, మార్గాలూ వేరవుతూ ఉంటాయి..” అన్నాడు అతను

“అయితే గట్టి దెబ్బే తగిలి ఉంటుంది. తేరుకోవటానికి చాలా కాలం పట్టి ఉండాలే?..”

“తారల్లా తళుక్కున మెరిసి పోతుంటారు తరుణలు. అయితే ఆశలన్నీ అలల మాదిరే. ఎదిగినా, ఒదిగినా క్షణం సేపే. కొంతకాలం గుండెనిండా ఘనీభవించిన తమస్సు. నిప్పుల్ని నమిలి నెమరేసిన మనస్సు. ఒక రోజు రైల్వేస్టేషన్లో ఒక దొంగను చూశాను. వాడికి నాది అని చెప్పుకోవటానికి ఏమీ లేదు. పైగా అందరూ తిడుతున్నారు. అయినా నిశ్చింతగా నవ్వుకుంటూ తిరుగుతున్నాడు. అవును. వాడిలా అందరూ ఎందుకు నిశ్చింతగా ఉండలేక పోతున్నారు? నవ్వలేకపోతున్నారు. అంత నిర్వికారంగా బ్రతకగలగటం గొప్ప విశేషమే అనిపించింది. అదే టర్నింగ్ పాయింట్ అయింది..”

“మళ్లీ ఎప్పుడన్నా ఆమెను చూడాలనిపిస్తుంటుందా?” అని అడిగింది మధులత.

“జీవితంలో మేం మళ్లీ కల్సుకోక పోవటమే మంచిది. ఒక మనిషి మీద ఒక అభిప్రాయం ఏర్పడినాక, ఆ మనిషి చూపులో, మాటలో, నవ్వులో, నడకలో, నడతలో, ప్రతి కదలికలోనూ అదే భావం స్ఫురిస్తూ ఉంటుంది. అయినా అదీ నా మంచికే అనుకుంటాను. ఒక కునుమం చెయ్యి జారిందన్న దిగులు లేదు. ఇవాళ ఈ పారిజాతం లాంటి మధులతను చేజిక్కించుకున్నాను. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన నవ అమృత భాండాన్ని నా కోసం మోసుకొచ్చిన మోహనాంగివి నీవు..” అని అన్నాడు.

“కొయ్, కొయ్” అన్నది మధు లత

కారు సూర్యాపేట వచ్చింది.

హోటలు ముందు కారు ఆపి, పార్క్ చేసి లోపలికి వెళ్లారు.

***

హోటలు పెళ్లి వారి ఇల్లు లాగా సందడిగా ఉంది.

టిఫెన్లు, కాఫీలు అయినయి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ చిన్నచిన్న షాపులు ఉన్నాయి. మధులత నాలుగు చాక్లెట్లు తీసుకుంది.

కారు మళ్లీ బయల్దేరింది.

వర్షం ప్రారంభం అయింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. మధులత ఒక చాక్లెట్ వంశీ నోటికి అందించింది. ముందుకు వంగాడు. చాక్లెట్ అతని ఒడిలో పడింది. అది తీసుకోబోయాడు.

కారు వేగంగా వెళ్లి మందు ముందున్న లారీని గుద్దేసింది.. కారు ముందు భాగం సగం వరకు నుజ్జునుజ్జు అయింది. అంతా కను రెప్పపాటులో జరిగిపోయింది.

మధులత ‘వంశీ’ అని అరిచింది. అతను ముందుకు వంగి, చక్రం మీద వాలి పోయాడు. బాధతో గిలగిలాడుతున్నాడు. పెద్దగా అరుస్తున్నాడు.

ట్రాఫిక్ మొత్తం ఆగిపోయింది.

వెనక వసున్న కార్లు నిలిచిపోయినయి. అందులోనుంచి జనం దిగి చుట్టూ మూగారు.

ఆమె కిందకు దిగగలిగింది. వానలో తడుస్తూ నిలబడింది. చుట్టూ చేరిన వాళ్లు వంశీని దించేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యపడలేదు. ముందు భాగం కొంత వరకు నొక్కుకుపోయినందు వలన సాధ్యం కాలేదు.

పావుగంట తరువాత పోలీసులు వచ్చారు. అరగంట తరువాత అంబులెన్స్ వచ్చింది. మెకానిక్‍లను పిలిపించారు. కష్టపడి వంశీని కారులోనుంచి బయటకు తీశారు. అంబులెన్స్ లోకి ఎక్కించారు.

దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స లాంటిది చేశారు. అతను బాధతో విలవిల్లాడి పోతున్నాడు.

అతడ్ని హైదరాబాదుకు తీసుకువచ్చింది.

నిమ్స్‌లో చేర్చారు. సీనియర్ డాక్టర్లు వచ్చి, చేయవల్సిన పరీక్షలూ, చికిత్సలూ అన్నీ చేశారు.

ఆమె ముక్కోటి దేవుళ్లకూ మొక్కుకుంటోంది. ఏడుకొండలవాడికి అంగ ప్రదక్షణాలు చేస్తానన్నది. పంచారామాలకు వెళ్లి పాలాభిషేకాలు చేయిస్తానన్నది. ఆంజనేయుడికి ఆకుపూజ చేయిస్తానన్నది. సుబ్రహ్మణ్యేశ్వరుడికి, సాయిబాబాకు కూడా దండాలు పెట్టుకుంది.

మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయన్నారు. మోకాలి దాకా కాలు తీసెయ్యాలన్నారు.

విధి రాతను ఎవరూ తప్పించలేరని వేదాంతమూ చెప్పారు. ఇలాంటి సమయాల్లోనే స్థితపుజ్ఞుడవు కావాలనీ అన్నారు.

సగం కాలు తీసేశారు.

చంకలోని కర్రతో మెల్లగా నడవటం నేర్పారు.

***

ఆరునెలలు గడిచాయి.

కుసుమ అమెరికా నుంచి వచ్చింది. మర్నాడు వంశీకి జరిగిన ప్రమాదం గురించి తెల్సింది.

వంశీకి ఫోన్ చేసింది. “రేపు హైదరాబాదు వస్తున్నాను” అన్నది.

“వద్దు, వద్దు. రావద్దు. నేను బాగానే ఉన్నాను” అన్నాడు వంశీ.

“నువ్వు రావద్దు అన్నా, నేను వస్తాను. నీకు నా మీద కోపం ఉండొచ్చు. కానీ, నీ మీద నాకు కోపం లేదు” అన్నది కుసుమ.

మర్నాడు కుసుమ, వంశీని చూడటానికి వచ్చింది. మధులత ఎదురెళ్లి ఆమెకు స్వాగతం చెప్పింది.

“ఎలా ఉండేవాడివి? ఎలా అయిపోయావు? రాజు ఎవడి కొడుకు అన్నంత ధీమాగా ఉండే నిన్ను, ఈ చక్రాల కుర్చీలో నిస్సహాయంగా ఉండటం చూడలేక పోతున్నాను” అన్నది.

వాతావరణం తేలిక పరచటానికి, జీవం లేని నవ్వుతో అన్నాడు – “ఇదీ ఒకందుకు మంచిదే అయింది. బరువు తగ్గాలని అనుకుంటూ వచ్చాను. దేవుడే కొంత బరువు తగ్గించాడు. అదీ గాక, నాకు అన్నిటికీ తొందర ఎక్కువని నువ్వు అంటుండే దానివి. ఇప్పుడేదీ తొందరగా చెయ్యలేను నెమ్మదిగానే చేస్తున్నాను..”

“ఇంత బాధను ఎలా తట్టుకున్నావో తెలియటం లేదు” అన్నది.

“ఇప్పుడు నేను నిలబడాలంటే, నా భార్య భుజం పట్టుకుని లేవాలి. ప్రతిసారి భార్య భుజం మీద చెయ్యి వేసే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పు?” అన్నాడు నవ్వుతూ.

కుసుమ నవ్వలేదు. ఆమెలో ఇదివరకటికీ, ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది.

“ఆఫీసుకు ఎలా వెళ్తున్నావు?” అని అడిగింది .

“వాళ్లు నన్ను రావద్దు అన్నారు. మధు తాను వెళ్లనంది. కనుక ఇద్దరం మానేసినట్లే..” అన్నాడు.

కుసుమ కాసేపు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది.

అరగంట తరువాత అమెరికాలోని భర్తకు ఫోన్ చేసింది.

“చిన్న సాయం చేయగలరా?” అని భర్తను అడిగింది.

“ఆజ్ఞ. మహారాణీ”

వంశీ గురించి చెప్పింది. ఇండియా నుంచి పని చేసేటట్లు ఓవర్ సీస్ జాబ్ ఏదన్నా ఇప్పించగలరా – అని అడిగింది. ఆయనకు నిన్ననే ప్రమోషన్ వచ్చింది. ఇంకో ఇద్దరు అసిస్టెంట్స్‌ను తీసుకునే అవకాశం ఉంది. వంశీ, మధులతకీ ఇద్దరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు కుసుమ భర్త.

“అది చాలా పెద్ద కంపెనీ, మీ ఇద్దరికీ చెరో పదివేల డాలర్లు అయినా జీతం ఉంటుంది” అని చెప్పింది కుసుమ.

మధులత ఆమె పాదాలకు నమస్కరించింది. కుసుమ మధులత కన్నీరు తుడిచింది. “ఊరుకో చెల్లీ” అంటూ ఓదార్చి వెళ్లింది.

ఆ రాత్రి ఇద్దరూ ఆరు బయట కూర్చున్నారు.

ఒకర్నొకరు కాక ఇద్దరూ ఒకేవైపు చూస్తున్నారు.

చవితినాటి చంద్రుడు బలహీనంగా నవ్వుతూ కనిపించాడు.

Exit mobile version