Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-129

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

బావా రావా

ర్ధరాత్రి దాటింది.

పగలంతా వాగి, సంధ్యవేళకు తాగి, రాత్రి వేళకు సుష్టుగా తిని, ఎక్కడి వాళ్ళక్కడ సొమ్మసిల్లి నిద్రపోతున్నారు, మోకాళ్ళు, మోచేతులూ ముడుచుకుని మడుచుకొని లుంగలు చుట్టుకుపోయి.

సాగర్‍కు మాత్రం నిద్ర రావటంలేదు. లేచి ఆరుబయట కొచ్చి కూర్చున్నాడు. వెన్నెల తెల్ల చీర మీద చెట్ల నీడల మాసికలు. అప్పటిదాకా అందరికీ లాలిపాడి నిద్రపుచ్చిన గాలి కూడా ఇప్పుడు కునికిపాట్లు పడుతోంది కాబోలు, ఎక్కడా ఆకు అయినా కదలటం లేదు.

సాగర్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. మొన్నటితో పరీక్షలు పూర్తి అయినాయి. ఇంకా చదవాలని ఉన్నా, మామయ్య ఎంతవరకైనా చదివిస్తానని అంటున్నా, సాగర్ తేల్చుకోలేక పోతున్నాడు. మామయ్య ఔదార్యంలో ఎలాంటి లోటూ లేదు. అమ్మా, నాన్నా ఒక్కసారిగా కూడబలుక్కుని వెళ్లిపోయాక ఈ అయిదేళ్ల నుంచీ మామయ్య నీడనే బ్రతుకుతున్నాడు.

అమ్మనీ, నాన్ననీ తీసుకుపోయి, దేవుడు ఒక రకంగా అన్యాయం చేసినా మామయ్య ఆశ్రయం చూపించి మరో రకంగా మేలు చేశాడు. ఇక్కడ అంతా బాగానే ఉంది.

ఇంతలో జయశ్రీ గొంతు వినిపించింది.

“ఈ చలిలో, మంచులో అర్ధరాత్రి ఆరుబయట ఏం చేస్తున్నావ్? రేపు నీకు ఏ జలుబో, జ్వరమో వస్తే మేం నీకు చాకిరీలు చేయలేక చావాలి” అని కిటికీ దగ్గర నిలబడి అరిచింది.

ఒకసారి నిస్సహాయంగా అటు చూసి, తప్పు చేసిన వాడిలా తల దించుకుని గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. తనకు ఆరుబయట కూర్చునే స్వేచ్ఛ లేదా అన్నదాని కన్న అర్ధరాత్రి కూడా తనను గమనించి చూస్తూనే ఉందన్న విషయమే మింగుడు పడటం లేదు.

అయిదేళ్ళ నుంచీ జయశ్రీ తనకొక అంతు చిక్కని పజిల్ లాగా కనిపిస్తోంది. అర్థం అయినట్లూ, కానట్లూ ఉంది.

ఎప్పటికో నిద్రపట్టింది. అందుచేత లేచేటప్పటికి పొద్దెక్కింది.

గదిలోకి వచ్చి జయశ్రీ గళం విప్పింది.

“అర్ధరాత్రి దాకా జాగారాలూ, బారెడు పొద్దు ఎక్కేదాకా గురకలు. చదవేస్తే ఉన్న మతి పోయిందని, రోజు రోజుకి వచ్చే కొత్త అలవాట్లు మహత్తరంగా ఉన్నాయి.”

సాగర్ ఉలిక్కిపడి లేచాడు.

తెల్లవారిందన్నమాట. గదిలో మొదలైన కృష్ణలీలా తరంగాలు. బద్ధకపు దుప్పటిని మడత పెట్టి లేచి బాత్రూంలోకి వెళ్ళాడు. పేస్ట్ కనిపించలేదు. దగ్గర్లో ఏదో పొడిలాంటిది కనిపిస్తే, దానితో పని అయిందని అనిపించాడు.

“పౌడర్‌తో పళ్ళు తోముకోవటం ఏమిటో? అన్నీ దరిద్రపు అలవాట్లు” అన్నది జయశ్రీ, పేస్ట్, బ్రష్ అక్కడ పడేసి వెళ్తూ.

కొంచెం నొచ్చుకున్నా జయశ్రీ అన్నదానిలో తప్పేం లేదు.

గదిలోకి వెళ్లాక అయిదు నిముషాల తరువాత కాఫీ కప్పుతో వచ్చింది.

“వంటింట్లోకి వచ్చి కాఫీ కావాలని అడగలేవా? శోభనం పెళ్లి కొడుకులా గదిలో మంచం ఎక్కి కూర్చుంటే, అన్నీ తెచ్చి అందివ్వాలా?” అని దీర్ఘాలు తీసింది.

సాగర్‍కి కాఫీ మింగుడు పడలేదు.

కిటికీలోనుంచి చూస్తే జయశ్రీ పెరట్లో పూల మొక్కల దగ్గర నిలబడి పూలు కోస్తోంది.

వాళ్లు కలవాళ్లు. వాళ్లు ఏంచేసినా చెల్లుతుంది.

“శివరాత్రి వచ్చిందంటే, చలి శివశివ అంటూ వెళ్లి పోతుంది. ఇంక వేసవి కాలం వచ్చినట్లే. స్నానానికి వేన్నీళ్లు ఎందుకు?” అని నిన్న అన్నది.

అందుకని ఇవాళ చన్నీళ్లతో స్నానం చేస్తుంటే, అదీ తప్పే.

శలవులు గదా అని స్నేహితుడి ఇంటికి బయల్దేరాడు.

“పరీక్షలు అయిపోగానే నువ్వొక వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా అనుకుంటున్నావా? చదవాల్సింది బోలెడంత ఉంది. వీధులు ఎక్కడికి పోవు. అక్కడే ఉంటయి” అని జయశ్రీ గదిమితే, కిమ్మనకుండా గదిలోకి వెళ్లి పుస్తకం తెరిచాడు.

పిల్లలు గది బయట ఆడుకుంటుంటే, జయశ్రీ వాళ్లను తరిమేసింది.

“లోపల కాబోయే కలెక్టరు గారు అద్యయనం చేస్తున్నారు. మీరు అవతలకి వెళ్లి ఆడుకోండి” అన్నది.

పన్నెండు గంటలకు భోజనం తెచ్చిపెట్టింది.

“ఆకలిదప్పులు కూడా గుర్తుండవా? అంత ఏకాగ్రతతో చదివేస్తున్నావా గ్రంథాలన్నీ.. లేకపోతే అదొకత్తె ఉంది కదా, ఎవడి కోసం తెచ్చిపెడుతుంది అనా? నేనేమీ నువ్వు కట్టుకున్న పెళ్ళాన్ని కాదు. నీకు ఎప్పుడేమి కావాలో గమనించి అన్నీ అమర్చిపెట్టడానికి. వేళకు లోపలికి వచ్చి భోజనం చెయ్యలేవా?” అన్నది.

నిన్న వంటింట్లోకి వెళ్తే మరో రకంగా అన్నది. “ఇష్టం వచ్చినప్పుడల్లా మింగి వెళ్ళటానికి ఇది తమరి తాతగారు నడుపుతున్న హోటలు కాదు”.

కోపంతో విసుక్కుంటూనే చేయవల్సిన మర్యాదలన్నీ చేస్తోంది. జయశ్రీ ఆంతర్యం అతనికి అంతు చిక్కటం లేదు. వేళకు పాలు, పళ్లరసాలూ ఇస్తుంది. పరీక్షల సమయంలో రాత్రి పదకొండు గంటలకు లేచి తన కోసం యాపిల్ ముక్కలు కోస్తూ చెయ్యి కోసుకుంది.

“నీకు జాలి లేదు. దయ లేదు. గుండె లేదు” అంటూ విరుచుకుపడింది..

ఇదిలా ఉండగా, “అమ్మాయి మీద నీ అభిప్రాయం ఏమిట్రా?” అని మామయ్య అడిగాడు.

“దేనికి మామయ్యా?”.

“వేసవిలో మీ ఇద్దరికీ పెళ్లి చేద్దామని”

“నాకొక వారం రోజులు టైం ఇవ్వు మామయ్యా” అన్నాడు. ఇదంతా జయశ్రీ చాటునుంచి వింటూనే ఉంది.

‘అయిదేళ్ల నుంచి ఎంత సేవ చేసింది? ఎంత ఆరాటపడింది? ఆలోంచించు కోవాలట. ఆలోచించుకో, చించుకో, చించుకో. చీలికలు, పీలికలు అయ్యేదాకా చించుకో’ అనుకున్నది.

‘ఈయనగారి కోసం రంభా ఊర్వశి దీని నుండి భువికి దిగి వస్తారు కాబోలు.. అడ్రసు తెలీక వెతుక్కుంటారేమో? ఎదురెళ్లి తెచ్చుకో’ అనీ అనుకున్నది.

మర్నాడు సాగర్ కనిపించలేదు. ఆమె తండ్రి అతని కోసం వెతికించినా లాభం లేకపోయింది.

“బావ, ఇంక రాడు నాన్నా, శ్రమపడకు” అని చెప్పింది.

“ఎందుకని రాడు?”

“నేనే దూరం చేసుకున్నాను. బావ నా మీద కోపం పెంచుకున్నాడు” అని చెప్పింది.

పదిరోజుల తరువాత ఒక కవరు వచ్చింది. ఆత్రంగా చించి చదువుకుంది.

“జయా, మీకు చెప్పకుండా పారిపోయి వచ్చాను.

మనకు పెళ్లి చేయాలని మీ నాన్న అనుకుంటున్నాడు. నిజానికి నన్ను అడగవలసిన అవసరం లేదు. ఒరేయ్, వచ్చి పీటల మీద కూర్చో రా – అంటే నేను కాదనలేను.

నీకు ప్రతి చిన్నదానికీ కోపం తెప్పిస్తున్నాను. ఏం చేయవచ్చో, ఏం చేయకూడదో అనే సందిగ్ధంలో పడిపోయాను. నీ కత్తికి రెండు వైపులా పదునే. అందుకనే ఇప్పుడు నేను అక్కడ ఉంటే ఏం గొడవ జరుగుతుందో అని పారిపోయి వచ్చాను.

చిన్నప్పుడు ఎలా ఉండేదానివి? గలగలా పారే సెలయేరులా నవ్వుతుండేదానివి. నీ లేత చెక్కిళ్ల మీద సొట్టలు చూస్తూ, నుదుటి మీది ముంగురులు సవరిస్తూ, సుతిమెత్తగా నిన్ను సవరిస్తూ జీవితం గడపాలనుకున్నాను.

ఎందుకో నీలో క్రమంగా మార్పు వచ్చింది. చిరాకు పెరిగింది. చీటికీ మాటికీ చీదరించుకుంటున్నావు. అలా అని నన్ను నిర్లక్ష్యం చేయటం లేదు. తిడుతూనే అన్నీ వేళకు అమరుస్తున్నావు.

నీనుంచి దూరంగా వచ్చేశాక నేనెంత నిస్సహాయుడినో తెల్సి వచ్చింది.

పగిలిపోయిన అద్దం ముక్కా, హృదయం ముక్కా అతుకు పడవు. అయినా, నాలో నువ్వు, నీలో నేనూ ఉన్నప్పుడు నీ కోపం ఎవరి మీద?

నాకేమనిపిస్తోందా చెప్పనా? మనం ఇంకా దొంగాటలూ, దోబూచులూ ఆడుకునే చిన్నపిల్లలం, ఓడిపోతామని భయమేసినప్పుడు, ఏదో వంకతో తొండి ఆట ఆడుతున్నావని అలిగి ఆట మానేసి దూరంగా వెళ్లిపోతాం. కానీ మళ్లీ కల్సిపోకుండా ఉండలేం, ఆడుకోకుండా ఉండలేం.

నా మీద అలిగి నువ్వు ఏదో ఒకటి అని అటుగా వెళ్లినా, నేను ఇటుగా వచ్చినా ఇదంతా మనం ఆడుకునే దొంగాటలో భాగమే.

నాకు నువ్వూ, నీ సొట్ట బుగ్గలూ మాత్రమే నిత్యమూ, సత్యమూ అని, మిగతా జగత్తు యావత్తూ మిథ్య అనీ అనిపిస్తోంది. కనుక, ఓ మరదలు పిల్లా, పరవపు బొమ్మ, మరువపు రెమ్మా, సంపెంగ కొమ్మా.. నీ దగ్గరకు రాకుండా ఉండలేను, సిమ్లాలో, కొడైకెనాల్‌లో దొరకని ప్రశాంతత నాకు నీ ఒడిలోనే దొరుకుతుంది.”

ఆ ఉత్తరం మరిచి మడిచి, ‘రా బావా, నీ భామను నేను’ అనుకుంది.

ఎదురుగా సాగర్..

Exit mobile version