[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
ఆశల పంచవన్నెల రామచిలుక
ఇంకా రెండు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఎప్పటి లాగే – అదే ఆనందం. అదే ఆర్భాటం. కొత్త సంవత్సరం వచ్చినప్పుడల్లా ఈ ఏడాది ఏదో తవ్వి తలకెత్తుతుందన్న ఆశ. అదో భ్రమ.
కొందరు అదృష్టవంతులు ఉంటారు. సుఖము ఫాలమునందు రాసుకుని పుట్టినవారు. అలాంటి వారికి నిత్యమూ వసంతమే. కానీ అందరి సంగతీ అలా కాదు గదా. మళ్లీ అవే పాత కథలు. పాత వెతల కొనసాగింపు. అవే నెలవులు. అవే కొలువులు.
‘హాపీ న్యూ ఇయర్’ అని యాంత్రికంగా అనటమే గానీ, కొత్తగా వచ్చి కౌగలించుకునే హాపీనెస్ ఏమీ ఉండదు. చిరునవ్వు వెనుక ఏదో బెరుకు, ఏదో దిగులు. ఏదో పగులు.
అందమైన సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు. రుతువుల హారతులు వెలిగిస్తూ, వెలుగు చీకట్ల తెరలు దించుతూ, ఎండలూ, వానలూ, వాయుగుండాలూ, వరదలూ వచ్చి పోతూనే ఉంటాయి.
తెల్లవారితే మనిషి చేస్తాడు. నడి రోడ్డున నడుస్తాడు. బ్రతుకు మార్గంలో పరుగుపందెంలో అందర్నీ ఓడించి, ముందుకు సాగేందుకు, ఒకింత ద్వేషం, రవ్వంత మోసం – షరామామూలే.
కాలాన్ని నమ్మినా, నమ్మకపోయినా, దానికున్న విలువ గొప్పది. డబ్బు పోయినా తిరిగి సంపాదించుకోగలమన్న ధీమా ఉంటుంది. కానీ పోయిన కాలాన్ని తిరిగి సంపాదించుకోలేం. ఒకడు ‘టైమ్ ఈజ్ మనీ’ అంటాడు. అది నిజమే. రోజూ కొన్నిగంటల పాటు శ్రమపడి ఎంతో కొంత డబ్బు సంపాదించుకుంటాడు. మరొకడు ‘ఐ హావ్ టు కిల్ ది టైమ్’ అంటాడు. విలువైన సమయాన్ని నిరర్ధకమైన పనులతో గడిపేస్తుంటాడు. ఒకడు వాడి టైమ్ మాత్రమే గాక, ఇతరుల టైమూ వేస్ట్ చేస్తుంటాడు. గంట సేపు ఉపన్యాసం చెబుతాడు. అందులో వినదగినదీ, కొత్తగా తెల్సుకోవాల్సినదీ ఏమీ ఉండదు. ఆ సభలో వందమంది ఉంటే, అందరి సమయమూ, వేస్ట్ చేసినట్లే.
కాలం తెచ్చే మార్పులు ఎన్నో. పదేళ్ళ పిల్లాడు ఉంటాడు. వాడికి తల్లీ తండ్రీ చాలా గొప్పగా కనిపిస్తారు. ‘అమ్మ చేయలేని పని లేదు. నాన్నకు తెలియని విషయం లేదు’ అని అనుకుంటారు. అదే ఇరవై ఏళ్లు వచ్చేటప్పటికీ, వాడి పరిధి పెరుగుతుంది. ఎన్నో విషయాల తెలుసునని అనుకుంటాడు. అమ్మ ఏదన్నా చెప్పబోయినా, ‘నీకేం తెలియదు అమ్మా’ అని అంటాడు. మురికొన్ని సంవత్సరాలకు తల్లీ, తండ్రీ భారమై పోతారు. కొత్తగా వచ్చిన భార్యాబిడ్డలు ముఖ్యమై పోతారు.
మరి కొన్ని రోజులకి బార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. బాధ్యతలూ, వైరుధ్యాలూ, ఇద్దరి మధ్యా కలతలు రేపుతాయి. కల్సి సుఖంగా ఉండనూ లేరు. ధైర్యం చేసి విడిపోనూ లేరు. నిత్యం సంఘర్షణ.
కాలం ఎలాంటి మిత్రులనయినా శత్రువులను చేస్తుంది. శత్రువులను మిత్రులను చేస్తుంది. కాలం గాయాలను చేస్తుంది. కాలం గాయాలు మాన్పుతుంది.
కాలం ఎంత చిన్నదో, అంత అనంతమైనది.
అందాల కోసం, ఆనందాల కోసం, ఆస్తుల కోసం, సకల ఐశ్వర్యాల కోసం పడే ఈ ఆరాటం, ఈ అలుపెరుగని పోరాటం ఇదే జీవితం.
నిరుటి నిరాశా భూతాల గురించి ఇంక మర్చిపోదాం. భవిష్యత్ సంతోష సమారంభాలకు సమాయత్తమవుదాం. ఎక్కడి నుంచో వచ్చి ముంజేతి మీద వాలిన ఈ ఆశల పంచవన్నెల రామచిలుకను ప్రేమతో దువ్వుదాం.
నూతన సంవత్సరం సురుచిర కాంక్షలు తీర్చే కామధేనువు కావాలని ఆశిద్దాం.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.