[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
అక్కచెల్లెళ్లు – అసూయలు
బలరామయ్యకి నలుగురు అడపిల్లలు. ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. ఎవరి సంసారాలు వాళ్లకు ఉన్నయి.
ఆ పిల్లల పెళ్లిళ్లు చేయటానికి ఆయన పడిన పాట్లు అన్నీ ఇన్నీకావు. పెద్దమ్మాయి విషయానికొస్తే ఆయన పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేకపోయింది. చదువుకుని ఐ.టి. కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, ఆ కంపెనీలో పని చేసే కొలీగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ పెళ్లి అతని తల్లిదండ్రులకు బొత్తిగా ఇష్టం లేదు. అయినా సరే, ఆ కుర్రాడు, తల్లిదండ్రులను ఎదిరించి బలరామయ్య పెద్దకూతురు శ్రావణిని వివాహం చేసుకున్నారు. వాళ్లిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. కానీ బలరామయ్యదీ, ఆయన వియ్యంకుడిదీ సమాన హోదా కాదు, వియ్యంకుడు బాగా పబ్లిక్ కాంటాక్ట్స్ ఉన్న గవర్నమెంటు డిపార్ట్‌మెంట్‌లో పాడిగేదె లాంటి పోస్ట్‌లో చిరకాలంగా పని చేసినందువల్ల నాలుగు తరాలకు సరిపడినంత సంపాదించాడు. బలరామయ్య ఒక పనికి మాలిన శాఖలో ఎవరికీ అక్కర్లేని పోస్టులో పనిచేశాడు. వియ్యానికైనా, కయ్యానికైన సమానత్వం ఉండాలన్నది వియ్యంకుడి నిశ్చితాభిప్రాయం. తన స్థాయికి తగిన గొప్పింటి పిల్లను చేసుకుంటే, అది తనకూ గొప్పగా ఉంటుందని ఆయన ఆలోచన. కానీ కొడుకు ఈ పిల్ల వలలో పడిపోయాడు. ఇక వియ్యపురాలు ఈ కోడల్ని పూచిక పుల్ల కన్నా హీనంగా చూస్తుంది. తన ఇంటికి రానివ్వదు. పిలిచినా పలకదు. అంతేకాదు కొడుక్కి ఏ మందో, మాకో పెట్టి వశపరచుకున్నదన్న అనుమానంతో, కోడలి మీద చేతబడులూ క్షుద్రపూజలూ కూడా చేయించినట్లు కూడా కర్ణాకర్ణిగా వినపడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా పెద్ద కూతురి జీవితంలో సుఖశాంతుల మాట దేవుడెరుగు, మనశ్శాంతి కూడా కరువైందని బలరామయ్య దంపతులు దిగులు పడిపోయారు.
రెండో కూతురు కళ్ళాణి పెళ్లి చేయటానికి ఆయన కాళ్ల చెప్పులు అరిగేలా తిరిగాడు, పెళ్లి ఈడు ఉన్న అబ్బాయి ఉన్నాడని తెల్సిన ఇంటి కల్లా వెళ్లాడు. కొంతమంది అయితే ఇన్ని లక్షల కట్నం ఇవ్వగలిగితేనే, మా ఇంటి గేటు తీసుకుని లోపలికి రండి, లేకపోతే, మా ఇంట్లోకి రావద్దని తెగేసి చెప్పి, వీధిలోనుంచే పంపి వేసినప్పుడు, అవమానాలను దిగమింగుకున్నాడు. పిల్ల కుందనపు బొమ్మలా ఉంటుంది. ఇంటికి దీపం ఇల్లాలే – అనీ అంటారు. ఆందుచేత కళ్యాణిని ఎవరు చేసుకుంటారో గానీ ఆ ఇంట్లో శ్రీమహాలక్ష్మి ఖడేరావుగా స్థిరంగా నిలిచిపోతుందనీ అన్న వాళ్లున్నారు. కళ్యాణం వచ్చినా, కక్కు వచ్చినా ఆగదని అన్నారు గదా. అలాగే ఒక అబ్బాయి అమెరికా నుంచి వచ్చి చూడడం, వారం రోజుల్లో ముహూర్తం పెట్టుకుని, పెళ్లి చేసుకుని, పాస్‌పోర్ట్, వీసా అన్నీ తెప్పించుకుని కళ్యాణిని భూమండలం అవతలవైపుకి తీసుకుపోవటం – అన్నీ కలలో జరిగినట్లు జరిగిపోయాయి. కళ్యాణిని పెళ్లి చేసుకున్న అబ్బాయి, అతని తల్లిదండ్రులూ మంచికి మారుపేరుగా నిలబడతారు, దేవుడు, భక్తి, సంప్రదాయాలూ, వంటివన్నీ వాళ్ల ఒంట్లో జీర్ణించుకునిపోయాయి. ఉన్నంతలో దానాలూ, ధర్మాలకూ లోటు రానివ్వరు. బలరామయ్య దంపతులను ఎంతో గౌరవంగా చూస్తారు. “మా వంశం నిలబెట్టటానికి, మీ కన్న బిడ్డను మాకు ఇచ్చారు. ఇంతకన్నా చేయగల గొప్ప సాయం ఏముంటుంది?” అని ఒకటికి రెండు సార్లు గుర్తు చేసుంటారు. కళ్యాణి, అవసరమైనప్పుడు తండ్రికి డబ్బు పంపిస్తుంటుంది. ఏడాదికి రెండేళ్లలో ఓసారి వస్తుంది. టాక్సిల్లోనే తిరుగుతుంది. చెల్లెళ్లకు ఉన్న వారం పది రోజులూ తన దగ్గరున్న ఖరీదైన చీరలూ, నగలూ, డబ్బూ ఇస్తూ ఉంటుంది. కనుక రెండో పిల్ల జీవితం అలా పైలా పచ్చీసులా సాగిపోతోంది.
బలరామయ్య కొన్నాళ్లు ప్రయత్నాలు చేయగా, చేయగా మూడో కూతురి పెళ్లి కూడా జరిగిపోయింది. సులోచన మొగుడు ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తాడు. అయితే అతను జల్సారాయుడు. ‘భూమ్మీద సుఖ పడితే తప్పు లేదురా’ – అని పాడుకుంటూ ఉంటాడు. నిత్యాగ్నిహోత్రుడు. క్రమం తప్పకుండా వారం వారం చతుర్ముఖ పారాయణం చేస్తాడు. రాత్రి ఇంటికి వస్తూ రెండు పెగ్గులు బిగించి, వాసన రాకుండా, కిళ్లీ నమలటం అలవాటు చేసుకున్నాడు. చాలీ చాలని సంపాదనతో తంటాలు పడుతుంటే, ఈ అలవాట్లు ఏమిటని సులోచన అడిగితే, “ఏంటే నోరు లేస్తోంది? నీ బాబు సొమ్ముతో ఏమన్నా తాగుతున్నానా? నా కష్టార్జితం నా ఇష్టం. నువ్వెవతివే నన్ను అడగటానికి” అంటూ రెచ్చిపోతాడు. ఇంకో మాట మాట్లాడితే చెయ్యి ఎత్తి రెండు తగిలిస్తాడు. దానితో సులోచన వచ్చి పుట్టింట్లో పడిపోతుంది. వచ్చి ఇంక టేపు ఆన్ చేస్తుంది. “చిన్నబావ చూడు. ఎంత మంచాడో. తెచ్చినదంతా చిన్నక్క చేతిలో పోస్తాడు. దాన్ని పువ్వుల్లో పెట్టుకుని పూజిస్తాడు. విమానాల్లో తిప్పుతాడు. కార్లల్లో తిరుగుతుంటుంది. వేల ఖరీదు అయ్యే చీరలు కడుతుంది.. నాకు ఈ వెధవ సంబంధం తెచ్చారు.. తిండికి ఠికాణా లేదు. తాగుబోతు వాడిని తెచ్చి కట్టపెట్టారు. ఒక సరదా లేదు. ఒక సంతోషం లేదు. ఛ. దరిద్రం” అని బర్రున చీదేస్తుంది.
“మేము పిల్లల్ని కన్నాం గానీ, వాళ్ల తలరాతలను కన్నామా?” అని బలరామయ్య భార్య బాధ పడుతుంది. ఈ చిరాకులూ, పరాకులూ అన్నీ నిత్యం కళ్లతో చూసిన నాలుగో కూతురు “నాన్నా, నాకు సంబంధాలు చూడొద్దు. నేను పెళ్లి చేసుకోను” అని చెబుతోంది.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.