[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
అమర గాయకుడు
కోటీశు ఎవరికి పుట్టాడో తెలియదు. ఎప్పుడు పుట్టాడో తెలియదు. నా అన్న వాళ్లు ఎవరూ లేకుండానే గాలికి తిరుగుతూ బ్రతికాడు. పెరిగాడు.
పేదరికాన్ని పేగున వేసుకుని పుట్టినందున, వాడికి చదువు అబ్బలేదు. చదువు లేనందున కుదురైన ఉద్యోగం లేదు. కుదురైన ఉద్యోగం అంటూ లేనందున ‘ఇది నా ఊరు’ అని చెప్పుకోవటానికి లేదు.
చిన్నప్పుడు రైలు ప్లాట్‌ఫారాల మీద తిరుగుతుండేవాడు. రైల్లో అడుక్కుంటూ, పాటలు పాడుకుంటూ తిరిగే ముష్టివాళ్లతో కొన్నాళ్లు కల్సి తిరిగేవాడు. వాళ్లతో కల్సి ‘కైలాసవాసా, వీశా’ అంటూ గొంతు కలిపేవాడు. అలా పాటలు పాడటం అలవాటైంది.
కొన్నాళ్లు రైల్లో టీ అమ్ముతూ గడిపాడు. మరికొన్నాళ్లు ఎవడో చేరదీస్తే వేడి శనక్కాయలు అమ్మాడు, చిల్లర డబ్బులు ఇస్తే చాలు, ఎవడే పని చెబితే అది చేసేవాడు, చీకూ, చింతా లేదు. ఏదో అయి పోవాలన్న ఆశ లేదు. అంచేత నిరాశా లేదు.
కొన్నాళ్లకు హైదరాబాద్ నగరం చేరాడు. హోటల్లో కప్పులు కడిగాడు. సినిమా హాల్లో చీపురుతో ఊడ్చి శుభ్రం చేసేవాడు. ఇదుగో ఇప్పుడే సినిమా చూడటం వ్యసనంగా మారింది. ఆ సినిమా పాటలను పాడటం వాడికున్న ఒకే ఒక వ్యాపకం అయింది.
సంగీతజ్ఞానం ఏ మాత్రం లేకపోయినా ఒకటికి రెండు సార్లు విని, ఆ పాటలను అచ్చుగుద్దినట్లు పాడేవాడు. క్రమంగా నలుగురి దృష్టిలో పడ్డాడు. “ఒరే బాగా పాడుతున్నావురా” అని ఎవరన్నా అంటే ఏనుగు ఎక్కినంత సంబర పడిపోయేవాడు. మరిన్ని నేర్చుకోవాలన్న తపన ఎక్కువైంది. తెల్లవారు ఝామున దగ్గర్లోని గుడి మెట్ల మీద కూర్చునే వాడు. గుడి పైన ఉన్న మైక్‌లో నుంచి భక్తి పాటలు వింటూ తనూ పాడేవాడు.
అడుక్కనో, బ్రతిమిలాడుకునో, డబ్బులు సంపాదించి, వచ్చిన ప్రతి సినిమా చూసేవాడు. ఆ సినిమాల్లోని పాటల మీడే ఉండేది వాడి దృష్టి అంతా.
ఇలాగా గుడిమెట్ల మీద, పెళ్లి పందిళ్లల్లో, సంగీత కచేరీలలో అందరికన్నా ముందు వరసలో కూర్చుని పాలులు వినేవాడు. వినటం, పాడటం, అదే వాడి ప్రపంచం. అడిగినా, అడగక పోయినా అందరి ముందూ శ్రావ్యంగా పాడుతునే ఉండేవాడు. నిద్ర పోతున్నప్పుడు తప్ప, మిగతా సమయంలో ఏ పని చేస్తున్నా తనలో తను ఆలాపనలోనే ఉండేవాడు. ఒకరిద్దరి సహాయంతో సంగీత కార్యక్రమాల్లో పాల్గొనాలన్న ప్రయత్నాలు చేసినా అవి ఏవీ ఫలించలేదు.
నగరంలో రద్దీగా ఉండే కూడలి ప్రదేశాల్లో రాత్రి పది గంటలకు షాపులన్నీ మూసివేసి వెళ్లి పొయ్యాక, కొందరు ముష్టివాళ్లు పేవ్‌మెంట్స్ మీద పడుకునేందుకు చేరేవాళ్లు. వాళ్లే ఈ మహా గాయకుడికి దొరికిన శ్రోతలు.
“ఒరే, ఓ లవ్ సాంగ్ పాడరా?” అని ఎవరైనా అడిగితే చాలు, సంతోషంతో ముహం వీధి దీపం కన్నా మిన్నగా వెలిగిపోయేది. “తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసమూ, మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమూ” అంటూ పాడుతుంటే, నైట్ డ్యూటీలు చేసే పోలీసులు, ఆ అర్థరాత్రి కాలక్షేపం కోసం, ఈ గాయకుడి పాటలు వింటూ నిలబడే వాళ్లు. ముసుగుతన్ని పడుకున్న ముసలివాళ్లు “ఎహే, ఇంకాపు” అని విసుక్కునేవాళ్లు.
వీడి గానానికి మురిసిపోయిన, ఓ పోలీసు, వీడి వివరాలు కనుక్కుని, జాలిపడి, ఓ ఏటియం దగ్గర వాచమన్‌గా ఉద్యోగం ఇప్పించాడు. దానితో కొద్దిగా చేతుల్లోని డబ్బులు ఆడటం మొదలైనయి.
అక్కడా పాటలు పాడుకుంటూ కూర్చుంటే, ఓ ముష్టిది వీడి గానామృతానికి ఆనందపడిపోయి రోజూ వచ్చి వీడి పక్కన చేరేది.
“ఇంకోటి అను” అని ప్రోత్సహించేది. “ము.. ము.. ము.. ముద్దంటే చేదా?” అని పాడి అది అడగకపోయినా “అడగక ఇచ్చిన మనసే ముద్దు, అందీ అందని అందమె ముద్దు” అని ఎత్తుకునేవాడు.
ఆ ముష్టిది “ముద్దు గావాల్నా, దా, ఇస్తా..” అని వెకిలిగా నవ్వేది.
“ఛీ, నీయమ్మ.. కంపు నీ కాడ” అని విసుక్కునేవాడు, దాని దగ్గర చీప్ లిక్కర్ వాసన రావటం చూసి.
“ఎవళ్ల కంపు, ఆళ్లకి ఇంపు..” అని నవ్వేది పళ్లన్నీ వెళ్ళబెట్టి.
కొద్ది రోజులకి ఇద్దరి మధ్యా స్నేహం కుదిరింది. వాడి దగ్గర డబ్బు అడుక్కుని, వెళ్లి తాగి వచ్చేది.
గోడకి చేరబడి, “ఓ పాట పాడు మామా?” అనేది. ‘కళ్లల్లో నీరెందులకు? కలకాలం విలపించుటకు’ అని ఎత్తుకునేవాడు.
ఇదిలా ఉండగా బ్యాంకు ఉద్యోగి ఒకరు వీడిలోని ఈ ప్రతిభను గుర్తించి, ఒక టీ.వీ. వాళ్లు పెట్టిన పాటల పోటీలలో పాల్గొనే అవకాశం కల్పించాడు.
ఆ పాటల పోటీలో ప్రథమ బహుమతి గెల్చుకుని అందరి దృష్టిలో పడ్డారు.
ఆ పోటీలో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఒక సినిమా సంగీత దర్శకుడు వీడిని చేరదీశాడు.
ఎలాంటి సంగీత పరిజ్ఞానమూ లేకపోయినా, అన్ని పాటలనూ ఆద్వితీయంగా పాడటం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది.
ఆ సంగీత దర్శకుడి దగ్గర చేరిన తరువాత రెండేళ్లపాటు వీడు ఎవరికీ కనిపించలేదు.
ఆ తరువాత పక్క తాగుబోతుగా మారిపోయాడు. ఏ ముష్టివాళ్ల ముందు పాటలు పాడి మెప్పించాడో, ఆ ముష్టివాళ్ల వద్దకే రోజూ వచ్చి తాగి పడిపోయేవాడు.
అందరూ జాలి పడ్డారు.
ఒక రోజు తాగి వచ్చి పడిపోయిన వాడు ఇంక లేవలేదు.
ఆ గాయకుడు చనిపోయాడు.
గమ్మత్తుగా ఆ రోజూ ఆ నడికూడలిలోని షాపులన్నీ సంతాప సూచకంగా మూసేసారు – ఒక పెద్ద వస్త్రవ్యాపారి కూడా చనిపోయాడని. ఆయన జీవితంలో ఒక వెలుగు వెలిగిన మనిషి.
ముష్టి వాళ్లందరూ చందాలు వేసుకుని అమర గాయకుడి శవాన్ని స్మశానానికి తీసుకెళ్లారు.
కోట్లు గడించిన వస్త్రవ్యాపారి శవమూ, వీడి శరీరమూ రెండూ ఒకేసారి బండెడు కట్టెల మధ్య భగ్గుమన్నయి – చివరికి ఇద్దరూ అలా వెలిగిపోయారు.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.