[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
శ్రీవారి చేతి వంట
వైద్యనాథరావుది అంతా అదో టైవు. అతని లైఫ్ స్టయిలే వేరు. గెస్టులు, బంధువులూ ఇంటికి రావటం అతనికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు. ఎవరైనా వస్తే లోలోపలే చిరాకు పడిపోతాడు. వాళ్లు వెళ్లే దాకా ముళ్ల మీద కూర్చునట్లే ఉంటుంది.
అతనికి భార్య నీలవేణి అంటే చాలా ఇష్టం. బ్యాంకులో పని చేస్తోంది. ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవుతుంటుంది. అతను పెందలాడే ఇంటికి వచ్చేస్తాడు. డ్రెస్ ఛేంజ్ చేసుకుని వంటింట్లోకి దూరిపోతాడు. గిన్నెలు శుభ్రం చేసి, షెల్ఫ్ సర్దేస్తాడు. కాఫీ పెట్టుకుని తాగేస్తాడు. బజారుకు వెళ్లి ఇంట్లోకి అవసరమైనవన్నీ తెచ్చేస్తాడు. వంట పని ప్రారంభిస్తాడు. నీలవేణి ఇంటికి వచ్చేటప్పటికి కూనిరాగాలు తీసుకుంటూ వంట పూర్తి చేసి, ‘మీల్స్ రెడీ’ అని వంటింట్లో నుంచి అరుస్తాడు.
ఆమె టీవీ ముందు నుంచి లేచి స్నానాదికాలు పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి టేబుల్ మీద అన్నీ సిద్ధంగా పెట్టేస్తాడు. ఆ ఘమఘుమలు చూసేటప్పటికే కడుపు నిండిపోతుంది. ప్రతి ఐటమ్ ఎంత రుచిగా ఉందో ఆమె వర్ణిస్తుంటే “వీడెవడు? నలుడూ, భీముడుని తలదన్నేవాడు” అంటూ జబ్బ చరుచుకుంటాడు.
అతను చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాడు. అందుచేత చిన్నతనం నుంచే వంట చేయటం అలవాటు చేసుకోక తప్పలేదు.
నీలవేణి పుట్టింట్లో గారాబంగా పెరిగింది. అక్కడున్నంత వరకు స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేకపోయింది. అయితేనేం, అదృష్టం కొద్దీ పాకశాస్త్ర నిపుణుడు భర్తగా దొరికాడు. షడ్రుచులతో భోజనం రెడీ చేస్తున్న భర్తను ప్రేమాభిమానాలతో ముంచెత్తుతుంటే, భార్య చూపించే ప్రేమకి అతను సంతోషిస్తున్నాడు.
“అదేంటి, అతను వంట చేస్తున్నాడు? ఆమెకు వంట రాదా?” అని బుగ్గలు నొక్కుకునే బంధువులు, స్నేహితులు తమ ఇంటికి రాకుండా ముందుగానే జాగర్త పడుతుంటారు.
వాళ్ల ఇంటికి ఎదురుగానే పాండురంగారావు ఫామిలీ ఉంటుంది. అతను దర్జాగా పేపరు తిరగేస్తూ, పుస్తకాలు చదువుతూ బిజీగా ఉండిపోయి, వేళకు తిండీ తిప్పలూ దొరకక పోయినా పెద్దగా పట్టించుకోడు. “మనం బ్రతకటానికి మాత్రమే తినాలి గానీ, తినటానికే బ్రతక కూడదు!” అంటూ ఫిలసాఫికల్ లెక్చర్ ఇస్తాడు. అతని భార్య చేతివంట అమృతతుల్యం. తిన్నవాళ్లంతా ‘అన్నదాతా సుఖీభవ’ అని ఆమెను ఆశీర్వదించేవారు. కానీ వారి ఆశీర్వచనాలు అంతగా ఫలించలేదు.
ఆమెకు జబ్బు చేసి ఆరు నెలలపాటు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇంతకాలం వంటింటి గురించి, ఇంటి గురించి, ఇల్లాలి గురించి పట్టించుకోని పాండురంగారావుకి ఇప్పుడు తప్పటం లేదు. దగ్గరుండి ఎంత ఆమె చెబుతున్నా ఎందుకో అతని వంట ఏమంత రుచిగా ఉండేది కాదు. ఒక్కక్కరి చెయ్యి పడితేనేగాని ఆ రుచి రాదు. అందరూ మాట్లాడుతారు. కానీ కొందరి ఉపన్యాసాలే వినసొంపుగా ఉంటాయి. అందరూ పాటలు పాడుతారు. కానీ కొందరి పాటలే శ్రావ్యంగా ఉంటాయి. వంట విషయంలోనూ అంతే.
పాకశాస్త్రం అనేది కూడా ఒక కళ. ఇది చాలావరకు తల్లినుంచి పిల్లలకు అబ్బుతుంది. వంట చేయటం ఆడవాళ్ళ డ్యూటీయే అనుకోకూడదు. హాటల్లో ‘పెసరా ఒకటి’ అని అరిచేది, లోపల పెసరట్టు తిరగేసేది, కుడిచేతిని బారెడు ఎత్తుకు ఎత్తి కాఫీ కలిపేది అందరూ మగవాళ్ళే. పెళ్లికి వచ్చిన వెయ్యి మందికి రకరకాల రుచులతో వంటలు సిద్ధం చేసేది మగవారే. ఇంకా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా వంటలు, బిర్యానీలు, ఫ్రూట్ సలాడ్లు, చైనీస్ వంటకాలు తయారుచేసేది మగమహారాజులే మరి.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.
