[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
తీర్పు నువ్వే చెప్పాలి
అపర్ణ ఆ షాక్ నుంచి తేరుకోలేక పోతోంది. ఎంత సర్ది చెప్పుకుందామన్నా మనసు అంగీకరించటం లేదు. తక్షణ కర్తవ్యం ఏమిటో గూడా గోచరించటం లేదు. పెనుతుఫానులో చిక్కకున్న నావలాగా ఉంది పరిస్థితి. తిండి తినబుద్ధి కావటం లేదు.. కంటికి కునుకే కరువైంది. కుదురుగా ఒకచోట కూర్చోలేక పోయింది. నుంచో లేకపోతోంది. మనసు మొద్దుబారి పోయింది. ఏమిటిలా ఉన్నావని అడిగితే “నా బాధ ఇదీ” అని చెప్పలేక పోతోంది. గొంతులో గరళాన్ని దాచుకున్నట్లు, మింగలేక, కక్కలేక నానా యాతనా పడిపోతోంది.
అపరకు ఆనంద్ వివాహం అయి నిండా ఏడాది అయిందాని లేదో. ఇప్పటిదాకా వాళ్ల సంసారం సాఫీగానే సాగిపోతోంది. సంసారం ఆనందుత్సాహోత్సావాలతో, పగలు రేయిగా, రేయిపగలుగా, ప్రతి రోజూ ఒక పండగ లాగా గడిచిపోతోంది. ఉద్యోగం చేయాలి కాబట్టి ఆనంద్ భార్యను విడవలేక, విడవలేక విడిచి వెళ్తున్నాడు. ఆఫీసు నుంచి ఆరగంటకోసారి ఫోన్ చేసి, అందులోనే ముద్దులు మూట గడుతున్నాడు. ఇంతింత అనరాని మోహమ్ము తనువును తొందర చేయుచున్నదంటాడు. చేరువలో ఉంటే చేతులు ఊరుకోవు. అక్కున చేర్చి ఆలింగనములు, వదనమంతా తడిసి ముద్దయినట్లు చుంబనములు, తనువంత మొలకలెత్తే గిలిగింతలు.. హారములు లేకున్ననేమి నీ స్థన ప్రదేశమంత మనోహరమైన స్థానం పృధ్విలోనే లేదంటాడు. చిలక పలుకులు, కులుకుల నడకలు మదిలో మన్మథ దీపాన్ని వెలిగిస్తున్నాయంటాడు. తనువుతో తనువును చేర్చి ఆటలు, పాటలు, కోలాటాలు.. అలాగా అపర్ణ కాపురానికి వచ్చినప్పటి నుంచీ ఒక్క రోజు అయినా భర్తను విడిచి ఉండలేదు. ఆమెకు అతనే ప్రియుడు విభుడూ కాగా, అతనికి ఆమె ప్రేయసి, వలచి వచ్చిన ఊర్వశి అయింది. అంతగా ప్రేమించే భర్త దారికి నందుకు ఆమె మనసు ఆనందంతో నిండిన నందనవనం అయింది.
ఇదిలాగే ఉంటుందని అనుకుంది. జీవితమంతా నవ్వుల నదిలో పువ్వుల వానలో సాగే పడవ ప్రయాణం అనుకుంది.
కాలం గురి చూసి గుండెల్లోకి విచ్చుకత్తిని విసురుతుందని ఊహామాత్రంగానైనా ఆమెకు అనిపించలేదు.
ఆనంద్కు ఫోన్ వచ్చింది. ఆమె వింటూనే ఉంది. అవతల నుంచి ఎవరో శర్వాణి వన్నెల విసనకర్ర వల విసిరింది. ఆనంద్ మొహమంతా అమందానంద కందళిత హృదయారవిందం అయింది. వాళ్ల మాటల్ని బట్టి అది పాత పరిచయమేనని అర్థమైంది.
అంతా అయ్యాక అపర్లతో – “నా చిన్నప్పటి స్నేహితురాలు. ఒకే ఇంట్లో పక్కపక్క పోర్షన్స్లో ఉండేవాళ్లం” అన్నాడు ఒకే కంచంలో తిని, వెన్నెట్లో పెరట్లో వేపచెట్టు క్రీనీడల్లో నవారు మంచం మీద ఒకరి మీద మరొకరు కాళ్లు చేతులూ వేసుకుని పడుకుని నిద్రపోయేవారట. పెద్దయ్యాక విధి ఇద్దర్నీ విడదీసిందిట. అమెరికా నుంచి వచ్చిందిట, పాత ప్రియురాలి పిలుపు ఆనంద్కు ఇంద్ర పదవికి పలికిన స్వాగతంలా తోచింది. ‘వెళ్లకపోతే అఫెండ్ అవుతుందా ఫ్రెండ్’ అనుకుంటూ హడావుడిగా ముసాబై, భోజనం అయినా చేయకుండా, కాఫీ అయినా తాగకుండా, పరుగు పరుగున పరుగెత్తుకుంటూ వెళ్ళాడు.
అలా వెళ్లిన వాడు నాలుగు రోజుల దాకా జాడ కూడా తెలియనివ్వలేదు. అపర్ణ నిద్రాహారాలు మానేసి గుమ్మం వైపే చూస్తూ కూర్చుంది. ఫోన్ పనిచెయ్యలేదు. మనసు శూన్యంతో నిండిపోయింది. ఎదురు చూపులతోనే కళ్ళు కాయలు కాసాయి.
“నిన్ను విడిచి నిముషమైనా ఉండలేను” అన్న మాటలన్నీ అర్థమే లేని వ్యర్థమైన పదాలు అయినయి. ఇంత విరుద్ధమైన ప్రవర్తన గల వ్యక్తులు ఉంటారని ఆమె నమ్మలేక పోతోంది.
వలపు పాటల ఆటలన్నీ అయిపోయి అలసి సొలసి ఇంటికి వచ్చాక అపర్ణ అడిగింది “ఎవత్తె అది?” అని. “మర్యాదగా మాట్లాడు. షీ ఈజ్ మై సోల్మేట్. అమెరికాలో ఉన్నా నా గురించే పలవరించి, కలవరించిన బెస్ట్ ఫ్రెండ్. నా కోసమే వచ్చి హోటల్లో దిగింది. కంపెనీ ఇవ్వటం నా కనీసధర్మం” అన్నాడు. “ఏం కంపెనీ? కట్టుకున్న భార్యనూ, ఇల్లూ అన్నీ వదిలేసి, ఎవత్తో వచ్చిందని దానితోనే రాత్రింబగళ్లు ఊరేగుతారా? అన్నీ మర్చిపోయేంత పారవశ్యమా దాన్ని చూస్తుంటే? ఏముంది దాని దగ్గర?” అని నిలదీసింది అపర్ణ.
“అవునూ, అవునూ, అవునూ.. పారవశ్యమే. నువ్వెవరో తెలియక ముందు నుంచీ, మొదటిసారి నీ ముఖం చూడక ముందు నుంచీ మేం ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచీ భార్యాభర్తలుగానే పెరిగాం. పెళ్లి చేసుకోలేకపోవటం మా దురదృష్టం” అన్నాడు ఆనంద్.
అపర్ణ కోషం నషాళానికి అంటింది. “సిగ్గు లేదా, అలా మాట్లాడటానికి?” అని అడిగింది.
“అవును. మేం చేస్తున్నది తప్పేనని తెల్సు. ఇందువల్ల వచ్చే పాపం మూటగట్టుకోవటానికి అయినా సిద్ధంగానే ఉన్నాం గానీ, దొరికిన అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేం” అని తెగేసి చెప్పాడు.
“నీతి, నియమం, మంచీ చెడూ, కట్టుబాట్లూ అన్నీ మర్చిపోయి, అదేదో ఘనకార్యం చేసినట్లు మాట్లాడుతున్నారు. ఇంకో విషయం చెప్పనా? ఫ్రెండ్స్ మీకే కాదు, నాకూ ఉన్నారు. ఇలాంటి అవకాశాలు కల్పించుకోవటం గొప్ప ఏమీ కాదు. మీరు చేసిన పనే నేను చేస్తే భరించగలరా?” అని అడిగింది అపర్ణ.
“మీరు చేసిన పనే నేను చేస్తే పీకలు తెగిపోతాయి. హత్యలు జరిగిపోతాయి. ఇంత నిర్భయంగా, నిబ్బరంగా, మీరు అక్రమ సంబంధం కొనసాగిస్తుంటే, భరించలేక పోతున్నాను. మీరంటేనే అసహ్యం కలుగుతోంది. మీరు నిలబడిన చోట నిలబడాలన్నా, కనబడాలన్నా కంపరం పుడుతోంది. ఇంక నీ దోవ నీది. నా దోవ నాది – ఈ క్షణమే వెళ్లిపోతున్నాను. మళ్లీ ఈ ఇంట్లో అడుగుపెట్టను. ఇంక ఆ పశువుకీ మనిషికీ తేడా తెలియని ఆడ జంతువు తోనే ఊరేగు, ఎవరు మొహాన కాండ్రించి ఉమ్మేసినా సరే..” అని చెప్పి సూట్కేస్తో బయటకు వచ్చింది.
ఒంటరిగానే, పుట్టింటికి వచ్చింది.
ఇక్కడి వాతావరణ మంతా అపర్ణకు కొత్తగా ఉంది – ఇదివరలో తల్లీదండ్రీ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వయసుతో పాటు వచ్చిన హుందాతనం, గాంభీర్యం, మంచీ మర్యాద వాళ్లల్లో ఉట్టి పడుతుండేవి. ప్రేమాభిమానాలు కనబరచటంలోనూ ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ లా ఉండేవాళ్లు. నీతి నియమాలకూ, సత్సాంప్రదాయాలకూ, కట్టుబాట్లుకూ మారుపేరులా ఉండేవారు. వాళ్ల బుద్ధులూ, ఆలోచనలే అపర్ణకూ అయాచితంగానే వచ్చాయి.
ఇప్పుడు ఎందుకో ఇద్దరూ ఎడ మొహం, పెడ మొహంగా ఉంటున్నారు. వాళ్ల మధ్య మాటలే కరువయ్యాయి. ఆయన తిండి కూడా తినకుండా పొద్దుటే వెళ్లిపోతాడు. అర్ధరాత్రి ఎప్పుడో వచ్చి కళ్లు మూసుకుని పడుకుంటాడు. తల్లి ఒక విరాగిని లాగా, మర మనిషిలాగా, యాంత్రికంగా తన పనులు చేసుకుంటుంది. జీవితం మీద ఆసక్తి కోల్పోయి, నిరామయంగా ఆకాశం వంక చూస్తూ కూర్చుంటుంది. తనలో తనే ఏదో గొణుక్కుంటుంది పిచ్చిదాని లాగా.
ఈ మార్పుకు కారణం ఏమిటని తల్లిని అడిగింది.
ఆమె కాసేపు మౌనంగా ఉండి తరువాత నెమ్మదిగా చెప్పింది.
“నలుగురికి బుద్ది చెప్పవలసిన వయసులో ఆయన ఇవాళ అందరిలో తలదించుకునే పని చేస్తున్నాడు. పొద్దు వాటారుతున్న వయసులో. ఆయన మరో స్త్రీ వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నాడు. దానితోనే ఉంటున్నాడు. సంపాదన అంతా దానికే ధార పోస్తున్నాడు. అది ఈయన్ను వశపరుచుకున్నది కూడా ఆ డబ్బు కోసమే. ఎక్కడో చాటుమాటున ఎప్పుడో ఒకసారి కకుర్తి పడితే, ఏదో మనసు చాపల్యం అని సరిపెట్టుకునేదాన్ని. కానీ లోకానికి కూడా వెరవకుండా ఏకంగా దానితోనే కాపురం పెట్టేస్తే ఏం చేయాలి నేను? ఊరు పొమ్మంటూ, కాడు రమ్మంటున్న సమయంలో ఈ వక్రబుద్ధి పుట్టింది. ఆయన్ని క్షమించనూ లేను. ఈ వయసులో తెగించి తెగతెంపులు చేసుకుని విడిపోయి వేరుగా ఉండనూ లేను. ఎటూ తేల్చుకోలేని ఈ కేసులో నువ్వే తీర్పు చెప్పాలి” అని ఆమె కూతురుని అడిగింది.
తను తెగ తెంపులు చేసుకున్నట్లుగా, తల్లిని బాంధవ్యం తెంచుకోమని తీర్పు చెప్పలేకపోతోంది అపర్ణ.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.
