[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
అత్తవారిచ్చిన..
చిట్టిబాబుకి గవర్నమెంటు ఉద్యోగం ఉంది. పై సంపాదనా ఉంది. చేతి నిండా డబ్బు గలగలలాడుతుంటుంది. అందుచేత బేఫికర్ ఆద్మీ. జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలన్నదే జీవిత ధ్యేయం.
ఈ పూలరంగడి లాంటి వాడికి ఏడాది కిందటే పెళ్లి అయింది. కొత్త అల్లుడి హోదాలో పండగకి అత్తవారింటికి వెళ్లాడు.
అత్తవారు కూడా ఉన్నవాళ్ల కిందే లెక్క. చేయవల్సిన మర్యాదలన్నీ చేశారు. చెప్పినవన్నీ విన్నాడు. పెట్టినవన్నీ తిన్నాడు. అంతా బాగానే ఉందిగానీ, చిట్టిబాబుకి సాయంత్రం అయ్యేసరికి గాలి మళ్లుతుంది. కొద్దిగా అయినా పుచ్చుకుంటే గానీ ప్రాణం కుదుటపడదు.
అందుచేత అలా షికారుగా వెళ్లొస్తానని బయలుదేరాడు. బావమరిది కూడా వస్తానన్నాడు. ఏవేవో చెప్పి మొత్తం మీద ఒంటరిగానే బయటపడ్డాడు. అలా ఊరు చూడటానికి బయలుదేరిన వాడి చూపులు దేనికోసమో వెతుకుతున్నాయి. డేగ ఎంత ఎత్తుకు ఎదిగినా, దాని చూపు పెంట కుప్పుల మీదే ఉంటుంది అన్నట్లుగా, ఆ ఊరిలో ఎన్నో గుళ్ళూ, గోపురాలు, సినిమా హాల్స్, పార్కులు, చెరువులూ, చెట్లూ చేమా ఎన్ని ఉన్నా అతని దృష్టి బార్ అండ్ రెస్టారెంట్స్ వైపు మళ్లింది. అప్రయత్నం గానే అందులోకి అతని కాళ్లు నడిచాయి.
తొందరగానే కార్యక్రమం ముగించుకుని అత్తగారింటికి చేరుకున్నాడు. వీలున్నంత వరకూ మామూలుగానే ఉండేందుకు ప్రయత్నించాడు.
కానీ అత్తగారు పోలీసుకుక్క లాంటిది. వాసన పట్టేసింది. తాగుడు దుర్వ్యసనం వల్ల కుటుంబాలు ఎలా కూలిపోతాయో సోదాహరణలతో సహా వివరించింది. అత్తగారు చెప్పినవన్నీ విన్నాడు. నిజమేనని ఒప్పుకున్నాడు.
ఇంక తాగనని మాట ఇచ్చాడు. నువ్వు మాట నిలబెట్టుకుంటే, హీరో హోండా బండి బహుమతిగా కొని ఇస్తానని చెప్పింది. దానితో చిట్టిబాబు మరింత రెచ్చిపోయి, హాట్ కాదు గదా, కూల్ డ్రింక్ కూడా ముట్టనని, ఒట్టి మంచి నీళ్లు తప్ప, చివరకు కొబ్బరి నీళ్లు కూడా ముట్టనంటే, ముట్టనని ఆమె ముందు లోక భీకర రీతి ప్రతిజ్ఞ చేశాడు.
అత్తగారున్నూ కడుంగడు సంతసించి ఆ మర్నాడే షోరూంకు తీసుకుపోయి, కొత్త బండి కొని ఇచ్చి, జాగ్రత్తగా వాడుకోమని చెప్పింది. ప్రాణప్రదంగా చూసుకుంటానని చెప్పాడు.
అచ్చటా ముచ్చటలన్నీ ముగిసినాక, చిట్టిబాబు సొంత ఊరికి తిరిగొచ్చాడు.
ఆఫీసులో మిత్రబృందం అంతా చుట్టూ చేరిన పిమ్మట అత్తగారు ఎంత దయార్ద్ర హృదయురాలో వివరించాడు. అల్లుడు అడిగితే గానీ, అలిగితే గానీ, అత్తగారి దగ్గర నుంచి చింతాకు అంత అయినా రాలిపడని రోజుల్లో అడిగే అడగక ముందు అంత ఖరీదైన బండి కొని ఇవ్వటం ఎంతటి గొప్ప విషయమో విపులంగా చెప్పాడు.
అతని మిత్ర బృందం కూడా మీ అత్తగారికి సరిలేరు వేరెవ్వరూ అంటూ బహు విధములుగా కీర్తించారు. ఖచ్చితంగా అత్తగారి మనశ్శాంతి కోసం పార్టీ ఇవ్వాలని పట్టుబట్టారు.
ఆఫీసు ముగిసాక, చిట్టిబాబు కొత్త బండి మీద బయల్దేరాడు. వెడలెను కుడి ఎడమల మరికొన్ని బండ్ల మీద సహచర బృందం వెన్నంటి రాగా.
కొత్త బండి బార్ ముందు పార్క్ చేసి సపరివార సమేతంగా పైకి వెళ్లాడు. ఇది సెలబ్రేషన్ కాబట్టి రోజూ కన్నా రివాజు కన్నా కొంచెం ఎక్కువగానే పుచ్చుకున్నాడు.
కళ్లూ, కాళ్లూ గిర గిర తిరిగిపోతున్నాయి. ఎలాగో బిల్లు చెల్లించి, కిందకు వచ్చాడు పాత అలవాటు ప్రకారం ఆటోలో ఇల్లు చేరి ఒళ్లు తెలియకుండా పరుపుమీద వెల్లకిలా శవంలా పడిపోయాడు.
మర్నాడు మధ్యాహ్నం నిద్ర లేచాడు. క్రమంగా నెమ్మది నెమ్మదిగా నిన్న రాత్రి జరిగినవన్నీ గుర్తుకొచ్చినయి. ఒక్క ఉదుటన ఆ బార్ ముందరకి వెళ్ళి చూశాడు.
అత్తగారిచ్చిన కొత్త బండి అక్కడ లేదు. ఎవరో కొట్టేశాడు. చిట్టిబాబు చింతాక్రాంతుడైనాడు. మిత్రులు ఉన్నది దేనికి? ఓదార్చటానికే గదా.
ఆ సాయంత్రం మళ్లీ అదే బార్‌లో అంతా సమావేశం అయినారు. బాధలు మర్చిపోవటానికి విస్కీని మించిన మంచి ఔషధం లేదన్నారు.
అత్తగారి ముందు చేసిన కఠోర ప్రతిజ్ఞ గుర్తొచ్చింది. గ్లాస్ ముట్టలేనన్నాడు.
మిత్రులు ఓదార్చారు.
“ఓరీ, మళ్లీ పండగ రాదా, మళ్లీ అత్తగారు పిలవదా, మళ్లీ మందు ముట్టవద్దని కోరదా, మళ్లీ నీవు ప్రతిజ్ఞ చేయవా, మళ్లీ కొత్త బండి కొని ఇవ్వదా? ఇట్టి అనివార్యమైన దానికోసం చింతించవలదు” – అని అతని చేత ఛీర్స్ చెప్పించారు.
శ్రీధర పేరుపొందిన కథ, నవలా రచయిత. అత్యంత చమత్కార భరితమైన సంభాషణలతో అందమైన రచనలు చేసే శ్రీధర ఇటీవల “ఇచ్చట జూదమాడంగరాదు” అనే నవలను ప్రచురించారు.
