Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-59

ఆ ఆర్తనాదం నాదే

కోర్టు హాలు నిశ్శబ్దంగా ఉంది. అయినా జడ్జి అడిగిన ప్రశ్నలు ఆశాలతకు వినిపించటం లేదు. బోనులో నిలబడ్డ ఆమె కళ్ళకేమీ కనిపించటం లేదు. చెవులకు ఏమీ వినిపించటం లేదు. నిర్లిప్తంగా చూస్తోంది. మొఖం మీద కాలం గీసిన గీతలు ఆమెకు అకాల వార్ధక్యాన్ని తెచ్చిపెట్టాయి.

“నీవు హత్య చేసిన మాట నిజమేనా?” అని జడ్జి మళ్లీ అడిగాడు.

ఆలోచనా లోచనాల్లో నుంచి ఆశాలత జడ్జి వైపు దృష్టి సారించింది.

“నాకు మరణ శిక్ష విధించండి. వీలైనంత త్వరగా నన్ను ఉరి తీయండి” అన్నది.

“నీకు ఏ శిక్ష విధించాలో నిర్ణయించాల్సింది కోర్టు. అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు” అన్నాడాయన.

“ఏం అడిగారు?” అన్నది ఆశాలత అప్పుడే నిద్రలో నుంచి మేల్కొన్నట్లుగా.

“నువ్వు హత్య చేశావా?”

“చేశాను.”

“ఎందుకు చేశావు?”

“ఏమీ తోచక.”

“ఇది కోర్టు. ఇక్కడ హాస్యాలు, పరిహాసాలూ పనికిరావు. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. ఎందుకు హత్య చేశావు?”

“అదొక పెద్ద కథ. చెప్పే ఓపిక నాకు లేదు. వినే తీరిక మీకు లేదు.”

“హత్యకు దారి తీసిన కారణాలు రికార్డు చెయ్యాలి. అందుచేత నువ్వు ఆ కథ చెప్పకా తప్పదు. నేను వినకా తప్పదు..”

ఆశాలత దీర్ఘంగా నిశ్వసించింది. గ్లాసుతో మంచి నీళ్లూ తెప్పించుకుని తాగి, ఆ కథ చెప్పటం మొదలు పెట్టింది.

***

అదొక ఎదిగీ ఎదగని పల్లెటూరు. వాళ్లంతా ఎదిగీ ఎదగని మనుష్యులు. జరుగుబాటు ఉన్న వాళ్లు పదిశాతం మంది. అంటే, తిండికి లేని వాళ్లు తొంభై శాతం మంది ఉన్నారు. ఈ తొంభై శాతం మంది, ఆ పది శాతం మందికి అడుగులకు మడుగులొత్తుతూ బ్రతకవల్సిందే.

ఆ అమ్మాయి నిరుపేద ఇంట్లో దురదృష్టమనే పేగును మెడకు వేసుకుని పుట్టింది. ఏడాది తిరగక ముందే తండ్రి చనిపోయాడు. కన్నీటి తడి ఆరకముందే తల్లి ఒక మోతుబరి ఇంట్లో పనికి కుదిరింది. ఆ తల్లి ఆశలన్నీ కూతురు మీదే, చంద్రబింబంలా ఎదుగుతున్న కూతుర్ని చూసుకొని తన కష్టం మర్చిపోయేది. ఎంతగా అన్నిట్లో వెనక బడి ఉన్నా, ఆ పిల్ల చదువులో అందరికన్నా ముందుండేది. స్కూల్లో టీచర్లు మెచ్చుకునే వాళ్లు. ఇరుగు పొరుగు వాళ్లు ఈ చదువుల సరస్వతిని అడిగేవాళ్లు. ‘పెద్దయ్యాక నువ్వేమవుతావే?’ అని.

“నేను డాక్టరు నవుతాను” అని ఆ పిల్ల అనేది భవిష్యత్తు మీద బోలెడంత భరోసాతో.

“వామ్మో, నువ్వు డాక్టరయ్యాక సూరమ్మత్తకు డబ్బులు తీసుకోకుండా పెద్దాపరేషను సేత్తావా?” అని అడిగేది పొరిగింటామె.

“అట్టాగే సేత్తా” అనేది అమ్మాయి.

అందమైన లేత లేత కలల వర్షంలో తడుస్తూనే ఆ అమ్మాయి అరుగుల మీద బొంగరాలు తిప్పుతూ బాల్యాన్ని గడిపేసింది.

యవ్వనం తొంగి చూస్తోంది.

టెంత్ క్లాస్ పాస్ అయింది.

ఆ విషయం తల్లికి చెప్పటానికి పరుగు పరుగున వచ్చింది.

“మీ యమ్మ ఇంట్లో నేదు. మీ యమ్మ కాడికి తీసుకెళ్తారాయె” అంటూ ఎంకటేసు ఆ అమ్మాయిని ఏపుగా ఎదిగిన పంటపొలంలోకి తీసుకెళ్లాడు.

తనువూ, మనసూ, వయసూ – వీటికి వేటికీ అర్థాలు తెలియని గులాబీ మొగ్గలాంటి అమ్మాయిని ఆ రాక్షసుడు తన కబంధహస్తాల్లో బంధించి నలిపేస్తుంటే, ఉక్కిరి బిక్కరి అయిపోయి, ప్రాణభయంతో కెవ్వున అరిచిన అరుపు ఆ చేల మధ్య చెట్ల మధ్యా ప్రతిధ్వనించింది.

ఆ ఆర్తనాదం నాదే.

ఆ ముష్కరుని అఘాయిత్యానికి బలై, చీలికలు, పీలికలు అయిన దుస్తులతో గాయపడిన మానాన్నీ, అభిమానాన్నీ దాచుకోలేక, రక్తాశ్రవులతో కొంపచేరిన ఆ పిల్లను చూసి అందరూ తలో మాటా అన్నారు.

“ఆడికేంటి? అచ్చోసిన ఆంబోతు. ఈ ఇసయం నలుగురి నోళ్లల్లో పడితే, దాని బతుకే బుగ్గయిపోతది” అన్నారు అందరూ.

“సదివింది సాల్లే. ఎదిగిన పిల్లవు. తల్లికి సేదోడు, వాదోడుగా ఉండు” అని హితవు చెప్పారు.

తల్లి ఆరోగ్యం దెబ్బతిన్నది. తల్లి పని చేసే చౌదరిగారింట్లో పని చేయటానికి వెళ్లిందా అమ్మాయి. వంచిన తల ఎత్తకుండా ఇంటెడు చాకిరీ చేసుకుపోతున్న ఆ అమ్మాయి ఆ ఇంట్లో అందరికీ నచ్చింది. చౌదరిగారి రెండో కొడుక్కి మరింత బాగా నచ్చింది. చీటికీ మాటికీ తన గదిలోకి పిలిపించుకునేవాడు ఏదో ఒక వంకతో.  ఆ అమ్మాయి ఏమీ మాట్లేడేది కాదు. కాని వయసే వయసును పూసుకుని రాసుకుని తిరిగేది. కళ్లల్లో కళ్లు పెట్టి చూసేవాడు. చేతిలో చెయ్యి వేసేవాడు. దోమ వాలిందనో, చీమ పాకిందనో ఆ పిల్లను ఎక్కడెక్కడో తడిమి చూసేవాడు. చిన్న చిన్న బహుమతులు ఇచ్చేవాడు.

“నేను పనిమనిషిని బాబూ. మీకు సేవ చేయటానికి వచ్చాను” అనేదా అమ్మాయి.

“నాకు పర్మినెంటు పనిమనిషిగా ఉండిపో. నీకు భర్యగా ప్రమోషన్ ఇస్తాను. ఆ తరువాత మనిద్దరం ఒకరికోకరం ఎన్ని సేవలు అయినా చేసుకోవచ్చు” అనేవాడు.

ప్రేమ అనేది ఒక ఇంద్రజాలం లాంటిది. సకలేంద్రియాలనూ సమ్మోహనం చేస్తుంది. ఆ సమయం ఏం చేస్తున్నారో వాళ్లకి తెలియదు. ఆ ఊళ్లో వాళ్ల ఆటలు సాగవని తెల్సి, సిటీకి పారిపోయారు. నెల రోజులు పాటు ఆనందోత్సాహాలతో రస తరంగిణులపై పయనిస్తూ ఉండిపోయారు. ఆ పారవశ్యంలో ఉండగానే తమ ఊరి వాళ్ల కంటబడ్డారు.

చౌదరిగారు ఇద్దర్నీ ఊరికి లాకొచ్చి అబ్బాయిని గదిలో బంధించారు. ఆ అమ్మాయిని వలువలు విప్పేసి, చెట్టుకు కట్టేసి నోటి కొచ్చినట్లు తిడుతూ వాతలు తేలేలాగా చావగొడితే, ఆ అమ్మాయి కెవ్వుమని అరిస్తే, ఆ అరుపులకు ఊరి ఊరంతా ఉలిక్కిపడింది.

ఆ ఆర్తనాదం నాదే.

అందరూ నివ్వెరపోయి చూశారే తప్ప “అదేమిటి” అని అడిగేవాడే లేడు. ఆ గోల సర్దు మణగటానికి ఆరు నెలలు పట్టింది. ఆ అమ్మాయి ఇంటి గడపదాటి బయట కాలు పెట్టలేకపోయింది. ఈ దారుణాలు చూడలేక ఆ పిల్ల తల్లి ఈ లోకం విడిచి వెళ్లిపోయింది. శిధిలమైన పూరి కొంపలో గాయపడిన మనసులో, తలెత్తుకుని తిరగలేని స్థితిలో పలకరించే దిక్కు లేకుండా ఉన్న ఆమె ఏం తింటోందో, ఎలా ఉంటోందో పట్టించుకునే వాడే కరువయ్యాడు.

ఎదురింటి అరుగు మీద మిషన్ కుట్టే సాయిబు ఒక్కడే ఆమెను పలకరించే దిక్కు అయ్యాడు.

“ఈ ఊళ్లో తప్పు చెయ్యని వాడెవడు? వాళ్లంతా పెద్ద మనుష్యులే అయినప్పుడు నువు సెడ్డదానివి ఎలా అయ్యావు? ఈ ఊరు నిన్ను వెలివేసింది. కానీ ఇదే ప్రపంచం కాదు. ఈ ఊరి పొలిమేరలు దాటి వెళ్తే బయట బోలెడంత మంది మనుషులు.. సిటీలో నాకు తెల్సినామె, నీలాంటి వాళ్ల కోసం ఆశ్రమం నడుపుతోంది. అక్కడ నీకు ఏ లోటూ ఉండదు” అని హితవు చెప్పాడు.

ఆమె వరదలో కొట్టుకుపోతోంది. ఆ సమయంలో గడ్డిపోచ దొరికింది. సాయెబుతో సిటీకి వచ్చింది. వాడు ఆమెను దమయంతి దగ్గరకు తీసుకెళ్లాడు కథంతా చెప్పాడు.

“నూతిలో కప్పలా అక్కడే పడి ఉంటే బతుకు లేదు. అక్కడ నుంచి బయటపడి మంచి పని చేశావు. గతాన్ని మర్చిపో. రేపటి నుంచీ నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంబించు. ఇది మహానగరం. ఇక్కడ బాగు పడటానికి, చెడిపోవటానికి ఎన్నో మార్గాలున్నయి. ఎవడి గురించి ఎవడూ పట్టించుకోడు” అని ధైర్యం చెప్పింది దమయంతి.

సాయెబు వెళ్లిపోయాడు.

దమయంతి అసలు రూపం నాలుగు రోజుల తరువాత బయట పడింది. అదొక వ్యభిచారపు కొంప. పెనం మీద నుంచి గెంతి పొయ్యలో పడినట్లు అయింది. రోజూ రంపపు కోత. నరకయాతన ఎలా భరించగలదు? ఎవడో వచ్చి గదిలో తోసి వాతలు తేలేటట్లు కొట్టాడు. భరించలేక వేదనతో నిస్సహాయంగా కెవ్వుమని అరిచింది.

ఆ ఆర్తనాదం నాదే.

జీవన పోరాటంలో మరోసారి ఓడిపోయింది. ఈ ఓటమి మరింత వేదనాభరింతగా ఉంది. ఇష్టం లేని వాడి పరాయి వాడి చెయ్యి తగిలినా, కాలు తగిలినా చిరాకు పడతాం. అలాంటిది ఎవడో కామాంధుడు మీద పడి నలిపేస్తూ, చిత్రహింసలు పెటుతుంటే ఎలా భరించటం? ఎంత ఏవగింపు? ఎంత అసహ్యం?

దిక్కులేని వారికి దేవుడే దిక్కు. దేవుడు ఒక తలుపు మూసేసినా, మరో తలుపు తెరుస్తాడని అంటారు. అలా మరో తలుపు తెరుచుకొని వచ్చిన వ్యక్తి ప్రకాశరావు.

అతను వీలున్నప్పుడల్లా వచ్చేవాడు. గంటల కొద్దీ ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్పేవాడు. ఆమెను ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకుంటాననీ అనేవాడు. ప్రేమ అంటేనే ఆమెకు భయం పట్టుకుంది.

“కావాలని ఏ ఆడపిల్లా ఈ మురికి కూపంలోకి అడుగు పెట్టదు. పరిస్థితుల ప్రబావంతో గతిలేక, మరో మార్గం లేక, ఇక్కడ రోజులు వెళ్లబుచ్చుతున్న నీలాంటి స్త్రీకి ఒక్కరికి విముక్తి కలిగించినా ఈ జన్మ ధన్యమైపోతుంది. జీవితంలో ఎప్పుడు ఎవరికి ఎవరు ఎలా తారసపడతారో తెలియదు. నిన్ను మొదటిసారి చూసిన క్షణంలోనే నీ మీద నాకు సదభిప్రాయం ఏర్పడింది. నీ మనసు నిండా మంచితనం, నీకళ్లల్లో తొణికిసలాడే కారుణ్యం నన్ను పదే పదే నీ వైపుకు లాగుతున్నయి. నీ హృదయ వీణను సవరించి, అనురాగ గీతాలను ఆలపింప చేసే అదృష్టాన్ని కలిగించు” అనేవాడు.

ఒక రోజు కాదు. ఒక నేల కాదు. రెండేళ్ల పాటు విసుగు చెందని విక్రమార్కుడిగా ఆమెను అభ్యర్ధిస్తూ ఉక్కరి బిక్కరి చేశాడు. మొదట్లో కాదన్నా అతని మొండి పట్టుదల వల్ల క్రమంగా కరిగిపోయింది.

తనకూ ఒక ఇల్లూ, భర్త, సంసారం, పిల్లలూ అందమైన జీవితం కలదన్న దృశ్యం కళ్లముందు కదలాడింది.

ప్రకాశరావు ఆమెను పంజరంలో నుంచి బయటకు తీసుకెళ్లాడు. గుళ్లో పెళ్లి చేసుకున్నాడు. మెడలో మంగళసూత్రం కొత్తగా, వింతగా ఉంది.

తెగిన గాలిపటంలా, ఎటో కొట్టుకుపోయి ఏ తాటి చెట్టు మట్టకో చిక్కుకుపోయి చిరిగిపోయే తన జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్ధాన్ని కల్పించాడు. వెలయాలిని వివాహబంధంతో అతని ఇల్లాలిని చేశాడు. ఏ సంఘసంస్కర్తా చేయలేని గొప్ప పనిని అతి నిరాడంబరంగా చేసి చూపించిన ప్రకాశరావు ఆమెకు దేవుడికన్నా మిన్నగా కనిపించాడు.

గతాన్ని ఒక పీడకలలా మర్చిపోయేందుకు ప్రయత్నిస్తోంది. భవిష్యత్తు గురించి సుందర స్వప్నాలను కంటోంది. భార్యగా, ఇల్లాలుగా, కలలో కూడా ఊహించని వరం లభించిందని సంతోషిస్తోంది. మాతృత్వం కోసం, పండంటి పాపాయి కోసం మనసు ఉవ్విళ్లూరుతోంది.

ఈ మధ్య ప్రకాశరావు ఎందుకో అన్యమనస్కంగా ఉంటున్నాడు. దిగులు పడుతున్నాడు. అప్పుల్లో ఉన్నాడనీ, వాటి నుంచి బయటపడే మార్గం తోచటం లేదనీ చెప్పాడు.

అంతకు ముందు చెప్పేనవన్నీ కల్లబొల్లి మాటలేనని ఆమెకు అర్థం కావటానికి ఎంతో సమయం పట్టలేదు. అతనికి పెద్దగా చదువు గానీ, ఉద్యోగం గానీ లేదు. ఆస్తిపాస్తులు అంతకన్నా లేవు. కానీ షోకులకూ, సరదాలకూ విలాసాలకూ లోటు లేదు.

ఆమె ఉద్యోగం చెయ్యక తప్పదన్నాడు. ఒక హోటల్లో రిసెప్షనిస్ట్‌గా చేర్చాడు. వారం తిరగక ముందే ఆమెను హోటల్లో సెక్స్ డాన్సులు చెయ్యమన్నారు. ఇంకా ఏవేవో చేయాలన్నారు. ఆమె ఒప్పుకోలేదు. అతను ఒప్పుకున్నాడు.

ఆ ఉద్యోగం మానేస్తానంది. చంపేస్తానని కత్తి తీసి బెదిరించాడు. ఆ రోజు నుంచీ ప్రతి రోజూ బెతిరింపులే అనుక్షణం మానసికంగా చస్తూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రకాశరావు దగ్గరుండి తీసుకెళ్లేవాడు. అర్థరాత్రి దాకా చిందులు. ఆ పైన విందులు, పొందులూ..

ఆమె ఆశలన్నీ మరోసారి అడియాసలయ్యాయి. కోరికలన్నీ కాలి బూడిదయ్యాయి.

అతని అప్పులు తీరటమే కాదు, ఆస్తులు సమకూర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఇల్లు కొన్నాడు ఆమె ఆర్జనతోనే.

ఆమే రోజు రోజుకీ కృంగిపోతోంది. అయినా అతను ఆమె ఆరోగ్యం గురించి పట్టింటుకోలేదు. భర్తగా అతను ఆమె మీద కొన్ని హక్కులు సంపాదించాడు. వాటిని దుర్వినియోగం చేస్తున్నాడు.

డాక్టర్ భయంకరమైన ఎయిడ్స్ రోగం ఆమెకు పట్టిందని చెప్పాడు.

ప్రకాశరావు ఆమెను ఇంట్లో నుంచి బయటకు నడవమన్నాడు. ఆమె రక్త మాంసాలు ధారపోసి అతనికి కొని ఇచ్చిన ఇల్లు అది. ఆ ఇంట్లో నుంచి ఆమెను గెంటేసే స్థితికి వచ్చాడు, గెంటేశాడు కూడా.

ఆమె గుండె మండిపోయింది.

అర్ధరాత్రి నింగీ నేలా నిద్రపోతున్నప్పుడు, ఆమె దొడ్డి దారిన ఇంట్లోకి ప్రవేశించింది. ఆ ఇంట్లో నుంచి కెవ్వు మని కేకవినిపించింది.

ఆ ఆర్తనాదం మాత్రం నాది కాదు.

ఆశాలత చెప్పటం ముగించింది.

జడ్జి ఆమె దీనగాథకు జాలి పడినా, శిక్ష తప్పలేదు. కోర్టు ఆమెకు యావజ్జీవిత జైలు శిక్ష విధించింది. అంతకు ముందే ఎవరెవరో విధించిన శిక్షల వల్ల ఆమె కోర్టు బోనులోనే మృత్యువు ఒడిలోకి ఒరిగిపోయింది.

Exit mobile version