Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-63

ఒక దీపం వెలిగింది

రిగ్గా పది గంటలకు కాన్ఫరెన్స్ మొదలవుతుంది.

మృదుల తొమ్మిది గంటలకు రెడీ అయి రూంలో నుంచి బయటకు వచ్చింది. పక్క రూమ్‍లో ఉన్న అమరేంద్ర కోసం చూసింది. అతను రూమ్‍లో లేడు. అప్పుడే కిందకు దిగినట్లున్నాదు.

మృదుల లిఫ్ట్‌లో నుంచి కిందకు వచ్చి రెస్టారెంట్ వైపు నడిచింది.

రెస్టారెంట్ – కాన్ఫరెన్స్‌కు వచ్చిన ఆహ్వానితులు, డెలిగేట్స్‌తో కిటకిటలాడిపోతోంది. దూరం నుంచి అమరేంద్ర విష్ చేశాడు. ఆమె అటువైపు వెళ్ళి అతని దగ్గర కూర్చుంది.

ఆమె కోసం కాఫీ ఆర్డర్ చేశాడు.

“లేట్‍గా నిద్ర లేచారా ఏమిటి?” అని అడిగాడు.

“రాత్రి నిద్రపట్టలేదు. కన్ను మూత పడలేదు..” అన్నది మృదుల. “నిన్న చీఫ్ గెస్ట్ స్పీచ్ వినేసరికే తలనొప్పి వచ్చింది. ఏం చెప్పాడో తెలియదు.. అరుపులు, కేకలు..”

“ఆయన స్పీచ్ అలాగే ఉంటుంది. బంగాళాఖాతంలో తుఫానులాగా తూర్పు గోదావరి వైపు రాబోయి, ఒరిస్సా వైపు మళ్ళి, పశ్చిమ బెంగాల్‍కు చేరుతుంది” అన్నాడు అమరేంద్ర.

అమరేంద్ర రెండు రోజుల కిందట ఈ కాన్ఫరెన్స్‌కు వచ్చాకనే పరిచయం అయ్యాడు. రెండు రోజుల నుంచీ ఇద్దరూ కలిసే కాన్ఫరెన్స్‌కు వెళ్తున్నారు. అతను ఆమెను తనకు తెల్సిన మిత్రులకు పరిచయం చేస్తున్నాడు.

కాఫీ తాగి బయటకు వచ్చేటప్పటికి వెహికల్స్ రెడీగా ఉన్నాయి. కాన్ఫరెన్స్ హాలుకి వెళ్ళారు.

ఆ వేళ అమరేంద్ర ఇచ్చిన ప్రసంగం బావుందని అందరు మెచ్చుకున్నారు. అతిథులందరికీ అక్కడే లంచ్ ఏర్పాటు చేశారు. లంచ్ చేస్తున్నప్పుడు మృదుల అమరేంద్రతో అన్నది –

“మీ సజెషన్స్ బావున్నాయి. అన్ని పాయింట్స్ కవర్ చేశారు. షార్ట్ అండ్ స్వీట్..”

“థాంక్స్.. ఈ స్వీట్ తీసుకోండి” అన్నాడు అమరేంద్ర నవ్వుతూ.

“మీకో రహస్యం చెప్పనా? ఇక్కడికొచ్చే దాకా అవన్నీ నాకూ తెలియదు. హోటల్లో దిగగానే ఏం తోచక మీటింగ్ కోసం వాళ్ళు ఇచ్చిన సమాచారం, బ్రోచర్స్ తిరగేశాను. వాటి మీద నాకు తోచినవి చెప్పాను. అంతే..” అనీ అన్నాడు.

ఆ రోజుతో మూడు రోజుల కాన్ఫరెన్స్ అయిపోయింది. ఒకరోజు చుట్టుపక్కల ప్రాంతాల సందర్శన కార్యక్రమం ఉంది. కొంతమంది మధ్యాహ్నం ఫ్లయిట్‍కు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు.

రూమ్‍కు రాగానే “మీ ప్రోగ్రాం ఏమిటి?” అని అడిగింది మృదుల.

“కాసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం అలా బీచ్‍కి వెళ్ళొద్దామని..”

“నేనూ వస్తాను” అన్నదామె.

అయిదింటికి షాపింగ్‍కి బయల్దేరారు.

“ఈ మూడు రోజుల నుంచీ నాకు మంచి కంపెనీ ఇచ్చారు. అందుకు కృతజ్ఞతా సూచకంగా, మన ఈ కొద్దిపాటి స్నేహానికి చిహ్నంగాను ఏదైనా చిన్న గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. ఏం ఇవ్వమంటారో చెప్పండి..” అంది మృదుల.

“మీ కంపెనీ లభించటం వల్ల టైమ్ చాలా సరదాగా గడిచింది. ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముంటుంది?” అన్నాడు అమరేంద్ర

కాసేపు తర్జన భర్జన తరువాత ఆమె అతనికి ఒక సూట్ కొనిపెడితే, అతను ఆమెకు బంగారు ఉంగరం కొని ఇచ్చాడు.

సాయంత్రం బీచ్‍లో ఎగిసిపడే అలలకు ఎదురుగా కూర్చుని చేతి గాజులు సవరించుకుంటూ, “ఇత దూరం వచ్చారు గదా, మీ శ్రీమతికి ఏమీ కొనలేదేం?” అని అడిగింది.

“నాకా అదృష్టం లేదు”

“ఏమి?”

“ఆమె నాకు అందనంత ఎత్తుకు వెళ్ళిపోయింది. మేం కల్సి ఉన్నది కొద్ది కాలమే అయినా, జీవితాన్ని ఉద్వేగపూరితం చేసింది. చిరు దరహాసాలతో వసంతాలు పూయించింది. నయనానందంగా తిరుగుతూనే అతి దారుణంగా రోడ్డు ప్రమాదంలో మరణించింది..” అన్నాడు అమరేంద్ర.

చీకటి పడింది. బీచ్ నిర్మానుష్యం అవుతోంది. సముద్ర ఘోష భయంకరంగా ఉంది. అలలు మరింత ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి.

“అవన్నీ గుర్తు చేశాను.. సారీ..” అన్నది మృదుల.

“మీరు గుర్తు చేయటానికి నేను మర్చిపోయిందెప్పుడు? పెద్దలు కుదిర్చిన సంబంధమే అయినా, మా మధ్య ఏర్పడిన ప్రేమ బంధం విడదీయరానిది. జీవితం అంటే ఏమిటో తెలియజెప్పింది. ఇల్లు అంటే ఎలా ఉండాలో వివరించింది. ఇల్లు అనేది తండ్రి సామ్రాజ్యం – తల్లి ప్రపంచం – పిల్లల భూతల స్వర్గం. ఆ కోటలో అడుగుపెట్టాక, గొప్పవాళ్ళు  పసిపిల్లలు అయిపోతారు. పసిపిల్లలే గొప్పవాళ్ళు అయిపోతారు.

పురిటికి పుట్టింటికి బయల్దేరింది. విడవలేని కౌగిలి నుంచి విడిపించుకొని వెళ్ళిపోయింది. వియోగాన్ని ఎలా భరించగలను అని అడిగాను. విడిపోతున్నది మళ్ళీ కలుసుకోవటానికే గదా అన్నది. కల్సుకోవటానికే అయినప్పుడు విడిపోవటం దేనికని అడిగాను. ఆ కలయిక మరింత మధురంగా ఉండేదుకు.. అంటూ ఒకే ఒకసారి మాత్రం నాతో అబద్ధం చెప్పి వెళ్ళిపోయింది.. ఆమె జ్ఞాపకాలే వెంటాడుతూ ఉంటాయి. వాటిని మర్చిపోయినట్లు కనిపించటానికి పగలంతా క్షణం తీరిక లేకుండా తిరుగుతుంటాను. రాత్రికి ఇల్లు చేరి, జ్ఞాపకాల మూట విప్పుతాను. పక్కన వచ్చి కూర్చుంటుంది. ఊరడిస్తుంది. ఓదారుస్తుంది. సలహాలు చెబుతుంది. ఆకాశ లోకాల అంచుల దాకా తీసుకువెళ్తుంది. తెల్లవారి లేవగానే మళ్ళీ మొదలు. ఒంటరితనం. దిగులు. వాటిని కప్పిపుచ్చుకునేందుకు దేన్నీ సీరియస్‍గా తీసుకోక పోవటం.. అలా అలవాటు అయింది..” అని చెప్పాడు.

ఎదురుగా సముద్ర ఘోష. చుట్టూ చీకటి.. చలి..

వాళ్ళు హోటల్‍కు తిరిగి వచ్చేటప్పటికి బాగా లేటయింది.

మర్నాడు ఎనిమిది గంటలకు సైట్ సీయింగ్‍కు బయల్దేరుదా మనుకున్నారు.

అతను రెడీ అయివచ్చేటపటికి ఆమెకు జ్వరం, ఒళ్ళు నొప్పులు.

అతను తన ప్రోగ్రాం కాన్సిల్ చేసుకొని ఆమె దగ్గరే ఉండి మందులు మింగించాడు. తోడుగా ఉండి అవసరమైన వన్నీ చూశాడు.

మృదలకు పెళ్ళి అయిన కొత్తలో హరికృష్ణతో కల్సి బెంగుళూరుకు వెళ్ళింది. అక్కడా ఇలాగే రెండు రోజుల పాటు విసుగూ, విరామం లేకుండా తిరిగినందు వలన అలసిపోయి లేవలేకపోయింది.

“ఇవాళ ప్రయాణం చేయలేను. రేపు వెళ్దాం..” అన్నది.

“నీ కోసం ప్రోగ్రాం మార్చుకోలేను. కావాలంటే నువ్వు ఉండిపో. నేను వెళ్తాను..” అంటూ బయల్దేరాడు.

అదంతా గుర్తుకు వచ్చింది.

“ఇమ్తకీ మీవారు ఎక్కడున్నారు? వారికి ఫోన్ చేసి చెప్పారా?” అని అడిగాడు అమరేంద్ర.

“ఆ అవసరం లేదు. ఆయనతో విడిపోయాను.”

“మీలాంటి వాళ్ళను దూరం చేసుకున్న ఆ దురదృష్టవంతుడెవరో?” అని అడిగాడు అమరేంద్ర.

“వాళ్లది ఉమ్మడి కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములూ తల్లి తండ్రులతో కల్సి ఉంటున్నారు. ఈయన అందరికంటే చిన్నవాడు. వాళ్ళది ఉమ్మడి వ్యాపారం. డబ్బు లావాదేవీలన్నీ తండ్రి, తల్లీ చూసేవారు. అందుచేత వాళ్ళకు కాదని చెప్పగల ధైర్యం ఎవరికీ లేదు. అతని తల్లి పాత తరం మనిషి. అత్తగారి ప్రతాపం చూపించాలని అనుక్షణం కోడళ్ళను రాచిరంపాన పెట్టేది. సూటీ పోటీ మాటలతో హింసిస్తూనే ఉండేది. చివరకు కడుపు నిండా కూడు తినటానికి, కంటి నిండా నిద్రపోవటానికీ కూడా నోచుకోలేదు. డబ్బు కోసం అంత హీనంగా బ్రతకలేక ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసాను.. అందుకు విచారం లేదు. ఇవాళ నా కాళ్ళ మీద నేను నిలబడి నిశ్చింతగా బ్రతుకుతున్నాను..” అన్నది మృదుల.

మర్నాడు ఆమె బయల్దేరుతున్నది.

“ప్రయాణం చేయగలరా? పోనీ ఇంకో రోజు ఉండి విశ్రాంతి తీసుకోండి” అన్నాడు అమరేంద్ర.

“మీరంతా వెళ్ళిపోయాక, నేను ఒక్కదాన్నీ ఎలా ఉండను?” అన్నది మృదుల.

“మీకు తోడుగా నేను ఉంటాను” అన్నాడు అమరేంద్ర.

“నాకు తోడుగా మీరు ఉంటానంటే అంతకంటే కావల్సింది ఏముంది?” అన్నది మృదుల నవ్వుతూ.

“అమ్మయ్య. మళ్ళీ నవ్వారు.. అది చాలు..” అన్నాడు.

నిన్న వెళ్ళలేకపోయిన ప్రదేశాలన్నీ ఇవాళ చూసి వచ్చారు.

చీకటి పడింది.

అమరేంద్ర గదిలోకి వచ్చి కొవ్వొత్తి వెలిగించాడు.

“అమ్మయ్య. ఒక దీపం వెలిగించారు” అన్నది నవ్వుతూ.

“జీవితం ఎప్పుడూ అనుకోని మలుపులు తిరుగుతూనే ఉంటుంది. ప్రతి మలుపు లోనూ కొత్త వెలుగుతులు నిండుతూనే ఉంటాయి. ఎక్కడికక్కడ మనం సమాధానపడడమే మిగిలి ఉంటుంది” అన్నాడు ఆమెకు ఎదురుగా కూర్చుంటూ.

Exit mobile version