Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిరుజల్లు-87

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

పల్లవి

ల్లవి పుస్తకం చదువుతోంది. అందులో ఒక వాక్యం దగ్గర ఆగిపోయింది. “రోడ్స్ అండ్ గాడ్స్ హావ్ నో ఫీలింగ్స్” అన్న వాక్యం ఆమె దృష్టిని ముందుకు సాగనివ్వ లేదు.

రోడ్స్ జడ పదార్ధాలు కాబట్టి వాటికి ఫీలింగ్స్ ఉండవు. మరి దేవుళ్ల మాట ఏమిటి? దేవుళ్లు అనుభూతులకు అతీతంగా ఉంటారు కాబట్టి వాళ్లకూ ఫీలింగ్స్ లేనట్లే లెక్కా?

పల్లవికి దేవుడి మీద కోపం లేదు. అలా అని భక్తీ లేదు. దేవుడు ప్రతి చోట ఉండలేక, తనకు బదులుగా ప్రతి ఇంట్లోనూ ఒక మాతృమూర్తిని ఉంచాడని అంటారు. తల్లి దేవుడికి ప్రతి రూపం గనుక పల్లవికి తల్లి మీద ప్రేమ లేదు.

పల్లవికి తల్లి మీద కోపం ఎందుకు?

“నా పరిస్థితుల్లో ఉంటే మీరూ మా అమ్మను అసహ్యించుకుంటారు” అంటుంది పల్లవి.

చంద్రికకు మూడో సంతానం పల్లవి. ఇద్దరు ఆడపిల్లల తరువాత మగ పిల్లవాడు పుట్టాలని చంద్రిక కోరుకుంది.

చంద్రిక అత్తగారు చండశాసనురాలు. “ఇప్పటికి రెండుసార్లు ఆడపిల్లలను కన్నావు. ఈసారి కూడా ఆడపిల్లను కన్నావంటే, ఈ ఇంట్లో ఉండే యోగ్యత ఉండదు. నిన్ను గెంటేసి, నా కొడుక్కి మరో పెళ్లి చేస్తాను” అని అత్తగారు పాడుతున్న పాట చంద్రిక మనసులో ఆనుక్షణం మెదులుతూనే ఉంది.

“ఏది ఏమైనా సరే, మూడో కాన్పులో మగపిల్లవాడు పుట్టాలి” అని చంద్రిక కనిపించని దేవుళ్లనూ, కనిపించిన చెట్టునూ, పుట్టనూ మొక్కుకుంది. కొడుకు పుడితే, వాడికి నీ పేరే పెడతానని దేవుళ్లందరకీ ఆశపెట్టింది. కొండంత ఆశతో పుట్టబోయే కొడుకు కోసం ఎదురు చూసింది.

కానీ –

ఆమె ఆశలన్నింటినీ వమ్ము చేస్తూ ఈసారీ ఆడపిల్లే పుట్టింది చంద్రికకు. తన బ్రతుకు ఏమైపోతుందోనన్న భయం పట్టుకుంది. “ఈ ముదనష్టపు దాని మోహం చూస్తేనే పాపం..” అని చంద్రిక చీదేసింది.

పసిపిల్ల మీద అంతులేని ద్వేషం మొదలైంది. తన జీవితం నాశనం చేయటానికి అవతరించిన దయ్యం లాగానే కనిపిస్తున్న పసికందును దగ్గరకు తీసుకోనటానికి కూడా ఆమెకు మనస్కరించటం లేదు. పసిపిల్ల గొంతు ఎండిపోయేలా ఏడుస్తున్నా, దగ్గరకు తీసుకొని లాలించి పాలు ఇవ్వాలన్న విషయాన్నీ పట్టించుకోవటం లేదు.

పల్లవికి తల్లీ, తండ్రీ, ఇద్దరు అక్కలు, నాయనమ్మ, తాతయ్యా ఇంకా చాలామంది ఆయిన వాళ్లూ ఉన్నారు. కానీ దిక్కులేని పిల్లలాగా పని వాళ్ల చేతుల మీదనే పెరిగింది.

ఇంకో రెండేళ్లు పోయాక, చంద్రిక మళ్లీ గర్భవతి అయింది. అత్తగారు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. చంద్రిక మళ్లీ ముక్కోటి దేవుళ్లమూ మొక్కుకుంది. కొడుకు పుడితే నీ పేరే పెట్టుకుంటానని సుబ్రమణ్యస్వామికి చెప్పుకుంది.

ఈసారి దేవుళ్లు కరుణించారు. చంద్రికకు కొడుకు పుట్టాడు. ఇంట్లో అందరి మొహల్లో వెయ్యి కాండిల్ దీపాల్లా వెలిగిపోయాయి. దారిన పోతున్న వారినందరినీ పిల్చి “మనవడు పుట్టాడు” అని గొప్పగా చెప్పుకున్నారు.

సుబ్రమణ్యానికి అన్నీ రాజబోగాలు జరిగాయి. వాడ్ని అక్షరాలా నెత్తి మీద పెట్టుకొని చూశారు.

రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు ఆ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలూ, ఒక మగపిల్లవాడూ ఉంటే, మగ పిల్లవాడిని చూసినంత ప్రేమగా ఆడపిల్లను చూడటం లేదు. అందులో మళ్లీ మొదటి ఇద్దరి ఆడపిల్లను చూసినంత ఆప్యాయతగా పల్లవిని చూడటం లేదు. పల్లవి కనిపిస్తే తిట్లు దండకాలు మొదలు అయ్యేవి. ఇంట్లో ఎవరికేం జరిగినా పల్లవే కారణమని నిందిచేవాళ్లు.

ఎవరన్నా ఏమన్నా అంటే, పిల్లలు సహజంగా తండ్రికి చెప్పుకుంటారు. కానీ పల్లవిని తండ్రే కసురుకుంటాడు. పల్లవిని తల్లీ అసహ్యించుకుంటోంది. నాయనమ్మ, తాతయ్య దగ్గరికే రానివ్వటం లేదు. పల్లవికి అందరూ శత్రువులే. దేవుడితో చెప్పుకుందామంటే, దేవుడే అన్యాయం చేశాడు. దీనికి అంతటికీ కారణం ఆయనే.

సుబ్రమణ్యాన్ని ఖరీదైన కాన్వెంట్ స్కూలులో చేర్పించారు. పల్లవిని ఫీజు కట్టనవసరం లేని గవర్నమెంటు స్కూలులో పడేశారు. సుబ్రమణ్యం స్కూలుకు వెళ్లేందుకు కారు కొన్నారు. పల్లవి స్కూలుకు నడిచే వెళ్లేది. పల్లవిని అందరితో కల్సి చదువుకోనిచ్చే వాళ్లు కాదు. అందరితో కల్సి భోజనం చేయనిచ్చే వాళ్లు కాదు. మిగిలిన పిల్లలతో కల్సి సినిమాలకూ షికార్లుకూ వెళ్లనిచ్చేవాళ్లు కాదు. చిన్నప్పటి నుంచీ ఇంట్లోని పనిమనుషులతో ఉంటూ, వాళ్లతో పాటు ఇంటి పనులు చేయటం పల్లవి డ్యూటీ అయిపోయింది.

పల్లవి చదువులో మిగిలిన వాళ్లందరికన్నా మెరుగ్గానే ఉండేది. ట్యూషన్లు చెప్పించకపోయినా, మిగిలిన పిల్లల దగ్గర నుంచీ అన్నీ నేర్చుకునేది.

సుబ్రమణ్యాన్ని అతిగా గారాబం చేసేవాళ్లు. అందరి దృష్టీ వాడి మీదనే. గంట గంటకీ వాడికి పాలు, పండ్ల రసాలు, పుష్టికరమైన ఆహారం, వేళకు తండి, నిద్ర, ఖరీదైన బట్టలు.. ఇచ్చేవాళ్లు. వాడు అడిగింది క్షణాల మీద తెప్పించేవాళ్లు. అతి గారాబం వల్ల, మంకుతనం, మొండితనం ఎక్కువ అయినయి. చదువు ఒంటబట్టలేదు. “వాడు చదవకపోయినా ఫర్వాలేదు. పది తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది. కష్ట పడాల్సిన ఖర్మ వాడికేమిటి?” అని నాయనమ్మ అంటుంటే, మిగిలిన వాళ్లు వంత పాడేవాళ్లు.

ఆ ఇంట్లో రెండు గ్రూపులు ఏర్పడినయి. సుబ్రమణ్యాన్ని ఆకాశానికి ఎత్తే, వాడి తల్లీ, తండ్రీ, నాయనమ్మా, తాతయ్య. వాళ్లందరిదీ ఒక గ్రూపు.

పల్లవిని తమతో, కలుపుకొని, ఆమెను ఆకాశానికి ఎత్తే పనివాళ్లది ఒక గ్రూపు.

అయిన వాళ్లంతా సుబ్రమణ్యం చేసే అల్లరి పనులు చూసి, వాడు ప్రయోజకుడు అవుతున్నడని అతని గ్రూపు వాళ్లు సంతోషిస్తే, పల్లవి మంచి మార్కులు తెచ్చుకుంటూన్నప్పుడల్లా పనివాళ్ల గ్రూపు సంబర పడిపోయేవాళ్లు.

పిల్లలు పెరిగి పెద్ద వాళ్లు అయ్యారు. వాళ్ల సమస్యలూ పెద్దవి అయ్యాయి.

సుబ్రమణ్యం చదువులో బాగా వెనకబడ్డాడు. ముందుకు వెళ్లాలని అడ్డుదోవలు వెతికి, పరీక్షల్లో కాపీలు కొట్టబోయి, పట్టుబడి మూడేళ్లు పాటు డిబార్ అయినాడు. “ఈ విద్యావిధానం నాకు నచ్చలేదు” అన్నాడు వాడు.

“దిక్కుమాలిన చదువులు చదివి ఎవర్ని ఉద్ధరించాలి” అని మనమడిని కమ్ముకొచ్చింది నాయనమ్మ. వాడి చదువుకు అక్కడితో బ్రేక్ పడింది.

“ఎంత చదివినా వీడు అయ్యేది గుమస్తాయేగా.. అదే బిజినెస్‌లో దిగితే వాడికింద పది మంది పని చేస్తారు” అన్నాడు తాతయ్య.

పల్లవి మాత్రం రాంక్ తెచ్చుకుంది. అయినా అదేమంత పట్టించుకోవాల్సినంత గొప్ప విషయం కానట్లు వాళ్లు భావించారు. పని మనుషులు మాత్రం పల్లవి రాంక్ తెచ్చకున్నందుకు మురిసిపోయారు.

పల్లవిని పై చదువులు చదివించటానికి ఇంట్లో వాళ్లు ఎవరూ ఆసక్తి చూపలేదు. చందాలు వేసుకొని అయినా పల్లవి ఎంత వరకు చదివితే అంత వరకూ చదివించాలని పనివాళ్ల గ్రూపు నిర్ణయించుకున్నది. అందుకు ప్రయత్నాలూ ప్రారంభించారు.

సుబ్రమణ్యం బిజినెస్ చేస్తానంటూ వేలకు వేలు తీసుకెళ్తున్నాడు. అతనికి ఇప్పుడు బోలెడు మంది మిత్ర బృందం తోడు అయింది. వాళ్లందరితో కల్సి తిరుగుతూ, డబ్బు తగలేస్తున్నాడు. డబ్బు ఇవ్వకపోతే తల్లీనీ, తండ్రినీ తిట్టి, కొట్టీ డబ్బు పట్టుకుపోయి జల్సాలకు ఖర్చు చేస్తున్నాడు.

పల్లవి ఇంజనీరింగ్ చదివింది. ఉద్యోగంలో చేరింది. తనను ఇంత వరకూ ఆదుకున్న వాళ్లందరికీ డబ్బు పంపిస్తోంది.

మూడేళ్లల్లో అందరి బాకీలు తీర్చేసింది.

అందర్నీ చూడటానికి ఇంటికి వచ్చింది.

అక్కలూ, తమ్ముడూ అసూయపడే స్థితికి చేరింది. వాళ్లు ఆప్యాయతగా దగ్గరకు రాబోయినా, పల్లవి చొరవ చూపలేదు. తల్లి ఎదురొచ్చి ప్రేమగా కౌగిలించుకున్నా, ఆమెలో ప్రతిస్పందన లేదు. నాయనమ్మ, తాతయ్యతోనూ ముక్తసరిగానే మాట్లాడింది.

డైనింగ్ టేబుల్ దగ్గర వడ్డించినా వాళ్లతో కల్సి భోజనం చేయలేదు.

“నేను ఈ ఇంట్లో పనివాళ్లతో కల్సి, వాళ్లల్లో ఒకరిగా పెరిగాను. నాకు నిజమైన ప్రేమ వాళ్ల దగ్గర నుంచే లభిస్తుంది.” అంటూ వాళ్లతోనే కల్సి భోజనం చేసింది.

ఒక్కొక్క పనిమనిషినీ తనతో తీసుకుపోయి, తన సంపాదనతో వాళ్లను పోషించాలని నిర్ణయించుకున్నట్లు పల్లవి చెప్పినప్పుడు తల్లీ, తండ్రీ ఆశ్చర్యపోయారు.

“దేవుడి దయవల్ల ఈ స్థితికి వచ్చావు” అని అన్నది చంద్రిక.

పల్లవి అడ్డుపడింది. “ఏ దేవుడూ నన్ను ఆదుకోలేదు. నన్ను ఆదుకున్న వాళ్లు వీళ్లే” అన్నదామె పని వాళ్ల మధ్యన కూర్చుని.

Exit mobile version