[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘చిరునవ్వు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
పకపక నవ్వించిన సుఖం
పగలబడి నవ్వేలా చేసిన సంతోషం
కాలం ఏలుబడిలో
క్రమక్రమంగా కరిగిపోయియి
కనుమరుగయిపోయాయి
ఎక్కడో ఎప్పుడో
ఎందుకో పరిచయమైన దుఃఖం
కొద్దికొద్దిగా దగ్గరైపోయింది
వదల లేనంతగా అల్లుకుపోయింది
ఒంటిని శిథిలం చేస్తూ
మనసును సొమ్మసిల్లి పోయేలా చేస్తోంది
కానీ
అప్పుడెప్పుడో చిన్నగా
పెదాలపై మొలిచిన చిరునవ్వు
అలాగే అతికి ఉంది
అసలేమీ చెదిరిపోకుండా
నిన్నా మొన్నటిలానే నిలిచి ఉంది
ఆయుధాలు అందిస్తోంది
బలగాలను సమకూరుస్తోంది
వ్యూహాలకు ప్రతివ్యూహాలూ రచిస్తోంది
బతుకును బలంగా ముందుకు తోస్తూ
పోరాటానికై ప్రోత్సహిస్తోంది
కరిగిపోవడం
కనుమరుగై పోవడం
సుఖసంతోషాలకే కాదు
దుఃఖానికీ తప్పదన్న సత్యాన్ని
దఫదఫాలుగా నొక్కి వక్కాణిస్తోంది
ఆ నవ్వు
అరవిరిసిన పెదాలపైన నిలిచిన
ఆ చిరునవ్వు
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
