[తెలుగు సాహితీ వనం – శ్రీమతి గడ్డం కృష్ణకుమారి స్మారక మినీకథల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న కథ.]
నిశిరాత్రి 2 గంటల సమయం. హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ వార్డు బయట హరిణి, పిల్లలు కళ్ళు వాచిపోయేలా ఏడుస్తున్నారు. గత 48 గంటల నుంచి ఆమె భర్త అరవింద్ వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్నాడు. అతని చుట్టూ ఉన్న గొట్టాలు, యంత్రాల శబ్దాలు హరిణి గుండెల్లో భయాన్ని నింపుతున్నాయి. ‘తనకు ఏదైనా అయితే, పిల్లలు, నేను ఏమైపోతాం? నా గతేమిటి భగవంతుడా! అరవింద్‌ను బ్రతికించు,’ అని దేవుడిని దీనంగా ప్రార్థిస్తోంది.
ఎనిమిదేళ్ల క్రితం, బంధువుల అభ్యంతరాలను లెక్కచేయకుండా అరవింద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ కారణంగానే వారిద్దరికీ బంధువులు దూరమయ్యారు. అయినా అరవింద్ ఎప్పుడూ దేనికీ లోటు లేకుండా చూసుకున్నాడు, పిల్లలే అతని ప్రపంచం.
ఆఫీసు నుంచి వస్తూ యాక్సిడెంట్‌కు గురైన అరవింద్‌ను చూసి ఆమె ప్రపంచం కుప్పకూలిపోయింది.
“మేడం, శతవిధాల ప్రయత్నించాం, ఇంకో పది నిమిషాలు అంతే,” అన్న డాక్టర్ మాటలు పిడుగుపాటులా వినిపించాయి. ఉలిక్కిపడి బోరున ఏడుస్తూ గదిలోకి పరిగెత్తింది.
“ఏమండీ, నా వైపు చూడండి. నన్ను వదిలేసి వెళ్ళిపోతారా?” అని దీనంగా అడిగింది. “పిల్లలు ఏమయిపోతారు?”అంటూ ఏడుస్తున్న హరిణిని చూసి
“మేడం, ఆయన ఏదో చెప్పాలని అనుకుంటున్నారు” అన్నది నర్స్. హరిణి ఆత్రుతగా దగ్గరికి వంగింది.
అరవింద్ బలవంతంగా కళ్ళు తెరిచాడు. చివరగా శక్తిని కూడదీసుకుని అతి కష్టమ్మీద మాటలు పలికాడు: “ఒకటో తారీకు.. లక్ష్మికి డబ్బులు.. లడ్డూలు.. లక్ష్మికి డబ్బులు.. లడ్డూలు.. ఇవ్వండి.” ఆ వాక్యం పూర్తవగానే అతని కళ్ళు మూసుకుపోయాయి. యంత్రాల శబ్దాలు ఆగిపోయాయి.
అరవింద్ కార్యక్రమాలు ఇరుగుపొరుగు వారి సాయంతో పూర్తి చేసింది. హరిణికి బంధువుల అండ లేదు. ఇప్పుడు తనూ, పిల్లలు బతకాలంటే ఏదో ఒక ఉద్యోగం చేయాలి. కానీ అరవింద్ చివరిగా అన్న మాటలు ఆమెను స్థిమితంగా ఉండనివ్వట్లేదు.
‘నా గురించి, పిల్లల గురించి ఒక్క మాట కూడా అనకుండా, ఎవరి పేరో స్మరిస్తూ చనిపోవడం ఏమిటి?’ ఆమె మనసులో అనుమానం మొదలైంది. ‘లక్ష్మి ఎవరు? తనకు తెలియకుండా ఎవరితోనైనా సంబంధం ఉందా?’ ఛీ! అరవింద్ అలాంటివాడు కాదే. అయినా ఆ మాటల అంతరార్థం ఏమిటో బోధ పడలేదు. ఆ మాటలు ఆమెను ప్రతిక్షణం తొలిచేస్తున్నాయి.
స్థిమితంగా ఉండనివ్వట్లేదు.
15 రోజులకి క్రితం తామిద్దరి మధ్య జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది.
ప్రతినెలా తనకు వచ్చిన జీతానంత తన చేతులతో పెట్టి తిరిగి ఐదువేలు తీసుకునేవాడు.
ఆరోజు “ఎందుకండీ మీకు ఏ చెడు అలవాట్లు లేవు కదా! ఐదువేలు ఏం చేస్తున్నారు?” అంటూ అడిగింది.
“హరిణి మొత్తం అంతా నీ చేతుల్లోనే పెడుతున్నాను కదా! ఇది నా పర్సనల్ ఖర్చు దాని గురించి అడగకు” అన్నాడు అరవింద్.
“నాతో చెప్పకూడనంత రహస్యమా” అన్నది హరిణి.
“వదిలేయమన్నానా ఇక ఆ డబ్బు విషయం అడగకు” అంటూ ఆఫీస్ కు వెళ్లిపోయాడు.
ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయింది. కానీ అది తలుచుకుంటే ఏదో అనుమానం కలుగుతోంది.
‘కానీ ముందు ఏదో ఒక ఉద్యోగం చేసి పిల్లల కడుపు నింపాలి’ అనుకొని సర్టిఫికెట్ల కోసం పైన అటక మీద ఉన్న పాత పెట్టెను లాగింది.
వెతుకుతుండగా భర్త ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలు కనిపించాయి. వాటిలో జాగ్రత్తగా మడతపెట్టిన ఒక లేఖ ఉంది.
“ప్రియమైన హరిణికి,” అంటూ మొదలైన ఆ లేఖ, ఆమె చేతిలో వణుకుతోంది. “నాకెవరూ లేరు. నీకు బంధువులు ఉన్నా లేనట్టే. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల బంధువులు దూరమయ్యారు, నన్ను క్షమించు. ఏ క్షణాన్న ఏమవుతుందో చెప్పలేము. నాలా నా బిడ్డలు అనాథలు కాకూడదు. నాకు ఏదైనా ప్రమాదం జరిగితే తల్లి తండ్రి నీవై పెంచు హరిణి.
అందుకే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. నీకూ, పిల్లలకూ ఎటువంటి ఇబ్బంది కలగదు. కానీ నాకోసం ఒక పని చేస్తావా? ఇందులో ఉన్న అడ్రస్‌కి వెళతావా? ప్లీజ్.
ఇట్లు
ప్రేమతో అరవింద్.”
‘ఎందుకు ఈ అడ్రస్‌కి వెళ్ళమన్నాడు? ఏముంది అక్కడ? ఎవరున్నారు అక్కడ?’ ప్రశ్నలతో నిండి పోయింది హరిణి అంతరంగం. వెంటనే ఆ అడ్రస్‌ను పట్టుకొని బయలుదేరింది.
***
ఆ చిరునామా ఒక చిన్న ఇరుకైన వీధిలో ఉంది. అక్కడ లక్ష్మి అనే పేరున్న ఆమెను కనుక్కోవడం చాలా సులభమయింది.
ఆమె ఒక ముసలామె చిన్న మిఠాయి దుకాణం నడుపుతుంది. దుకాణం చాలా పాతది, కానీ చక్కని సువాసనతో నిండి ఉంది.
“మామ్మా, నీకు అరవింద్ తెలుసా?” అని హరిణి అడిగింది.
“ఎవరమ్మా ఆ బాబూ?” అన్నది లక్ష్మి మామ్మ. హరిణి భర్త ఫోటో చూపించింది.
లక్ష్మి కళ్ళల్లో ఆప్యాయత తొణికిసలాడింది. “ఓహో, ఈ బాబేనా? అరవిందు బాబు! ప్రతి నెలా మొదటి తేదీన నా దగ్గర కొన్ని మిఠాయిలు కొని, ఆ పక్కనే ఉన్న అనాథ ఆశ్రమంలో పంచి పెడతాడు.”
హరిణి ఆశ్చర్యంతో చూసింది.
“ఎందుకు బాబూ?” అని నేను ఒకసారి అడిగాను.
అప్పుడు ఆయన చెప్పిన మాటలు నా గుండెల్ని తాకాయి. ‘నేను చిన్నప్పుడు ఈ ఆశ్రమంలోనే పెరిగాను. నాకు తిండి పెట్టడమే ఎక్కువ అన్నట్లుగా భావించేవారు. నా చిన్నప్పటి నుంచి నిన్నూ, నీ మిఠాయి దుకాణాన్ని చూస్తూ ఉండేవాడిని. ఒక్క లడ్డూ అయినా తినాలన్నా నా కోరిక నెరవేరలేదు. అందుకే నాలాంటి ఆశ ఆ పిల్లలకు ఉంటుందని, నీ దగ్గర లడ్డూలు కొని పిల్లలకు పెడుతున్నానమ్మా’ అన్నాడు.
ఆ బాబు ఎంత బాగా ఆలోచించాడమ్మ. తనకు దొరకని వస్తువు వాళ్లకి అందించాలనే తపన అతనిలో చూశానమ్మా.
నేను చాలా ఆనందించానమ్మా. ఎంతమంది అలా ఆలోచిస్తారు.
తను, తన కుటుంబం అంటూ ఆలోచించే వాళ్లే తప్ప పరాయివాళ్ల గురించి ఆలోచించే తీరిక, ఓపిక ఎక్కడున్నాయమ్మా. స్వార్థపూరితమైన ఈ ప్రపంచంలో బ్రతుకుతూ కూడా ఆ బాబు అనాథ పిల్లల కోసం నా దగ్గర మిఠాయిలు కొని పంచుతాడు. ఈ రోజుల్లో పుట్టవలసిన వ్యక్తి కాదు అని అనిపించేదమ్మ.” అని కొన్ని క్షణాలు ఆగి,
“ఇంతకీ మీరు ఎవరమ్మా? ఆ బాబు ఎందుకు రాలేదు? అతని గురించి ఎందుకు అడుగుతున్నారు?” అన్నది మామ్మ.
“అతను నా భర్త. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో మరణించాడు, అతను చివరగా రాసిన ఉత్తరంలో వివరాలను పట్టుకొని ఇలా వచ్చాను” అన్నది.
“ఆ బాబు చనిపోయాడా” అని ఆశ్చర్యపోయింది మామ్మ.
లక్ష్మి మామ్మ గొంతులో బాధ, ప్రేమ రెండూ ఉన్నాయి.
హరిణి కళ్ళల్లో కన్నీరు ఆగలేదు. కానీ అది బాధతో కాదు. తన భర్త చివరి కోరిక తన కుటుంబం గురించి కాకుండా నిస్వార్థమైన దాతృత్వపు ఆలోచనలతో మరణించాడు. ఆమెకు గర్వంతో గుండె ఉప్పొంగింది.
”లక్ష్మి మామ్మా, ఇక నుంచి ఆయన కోరిక ప్రకారమే, ప్రతినెలా మిఠాయిలు నీ దగ్గర తీసుకొని పిల్లలకు ఇస్తాను,” అంది.
ఆ రహస్యం ఒక తీయని జ్ఞాపకంగా, తన భర్తపై అంతులేని గౌరవంగా, ఒక బాధ్యతగా మారి ఆమె హృదయం బరువెక్కింది. అరవింద్ ఆమెకు ఆస్తిని మాత్రమే కాదు మంచి మనసు అనే వారసత్వాన్ని కూడా ఇచ్చి వెళ్ళాడు.
కొల్లా పుష్ప విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు చెందినవారు. వీరికి బాల్యం నుండి పుస్తకాలు చదవడం అలవాటు. మూడేళ్ల నుంచి రచనలు చేస్తున్నారు.
40 సామాజిక కథలు, ఆధ్యాత్మిక యాత్ర విశేషాలు, వ్యాసాలు, వంటలు కూడా ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు పురస్కారాలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
చదరంగం ఆడటం, కొత్త రకం వంటలు చేయడం ఇష్టం.
చదరంగంలో జిల్లా స్థాయి పోటీలలో మొదటి బహుమతి అందుకోవడం విశేషం. అలాగే వంటలకు కూడా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. ఫోన్ నెంబర్ 83745 96096
