[అనుకృతి గారు రచించిన ‘చివుక్కు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
కాలింగ్ బెల్ మోగిన చప్పుడికి, ఉలిక్కిపడి లేచాడు రత్నాకర్. టైం చూసాడు 7.30.
ప్రక్కన మాలతి దుప్పటి కప్పుకుని వుంది, లేచి తలుపు తీసాడు. లోపలికి వచ్చిన రాజమ్మ అలవాటైన పని చకచకా చేసుకుపోసాగింది.
లోపలికి వెళ్ళి మాలతి నుదిటిమీద చేయి వేసి చూసాడు, జ్వరం లేదు. రోజూ ఆరు కానివ్వదు, లేచి పని మొదలు పెట్టేస్తుంది, ఇంక కార్తీక, శ్రావణ, ధనుర్మాసాలలో తెల్లవారుఝామునే లేచి, పూజ పూర్తి చేసుకుని, మళ్ళీ అన్నీ సవ్యంగా అందేలా చేస్తుంది. మాలతి కళ్లు తెరచి, “నాకు వంట్లో బాగోలేదు, లేవాలని లేదు, పిల్లల సంగతి చూడండి” అంటూ మళ్ళీ దుప్పటి కప్పేసుకుంది.
రాజమ్మ గిన్నెలు తోమి వచ్చేలోపు టీ పెట్టి ఇచ్చి, పిల్లల్నిలేపాడు. శ్రీజకి ఎనిమిది, వరుణ్‌కి ఆరు. గబాగబా, గుడ్లూ ఉల్లిపాయల కూర చేసి, రైస్ కుక్కర్లో అన్నం వండి, వాళ్ళ బాక్సుల్లో సర్దాడు.
కౌసల్య లేచి వచ్చింది. “మాలతి లేవలేదురా” అన్నది. రత్నాకర్ మాట్లాడకుండా తల్లికి టీ ఇచ్చి, తాను వచ్చేలోగా స్నానం చేసి రెడీగా ఉండమని పిల్లలికి చెప్పి, హోటల్‌కి వెళ్ళాడు, అందరికీ టిఫిన్స్ తేవటానికి.
జడ వెయ్యటం దగ్గిర చిక్కొచ్చిపడింది. తల్లిలా కాకుండా, నాయనమ్మ జుట్టు చిక్కు గట్టిగా లాగేసరికి, ఒక్కసారిగా అరిచి, దువ్వెన లాక్కుని తల్లి దగ్గరకు పరిగెత్తింది శ్రీజ. మాలతి కూతురికి మౌనంగా జడలు వేసి, మళ్ళీ పడుకుంది.
రత్నాకర్‌కి విషయం అర్ధమయ్యింది, మాలతికి ఒంట్లో బాగోలేకపోవటం కాదు, ఎందుకో చాలా కోపంగా వున్నదని. పిల్లలు బుద్ధిమంతుల్లా, తల్లి ఇస్త్రీ చేసిపెట్టిన యూనిఫామ్ వేసుకుని స్కూల్‌కి వెళ్లిపోయారు.
అయినా మాలతి లేవలేదు, చేసేదిలేక రత్నాకర్ తయారై, మాలతితో “పిల్లలు స్కూల్‌కి వెళ్లారు, నీక్కూడా టిఫిన్ టేబుల్ మీద పెట్టాను, తినేసి రెస్ట్ తీసుకో”, అన్నాడు.
మాలతి ‘వూ,’ అనలేదు, ‘ఆ’ అనలేదు.వెళ్ళేటప్పుడు తల్లితో, “అన్నం, కూరా చేసాను, తనకు ఒంట్లో బాగోలేదు, నువ్వేమీ అనకు.” అని చెప్పి వెళ్ళాడు.
రోజూ ఒంటిగంట కల్లా రెండోసారి వేడి వేడిగా అన్నం వండి, వడ్డించే కోడలు ఇవ్వాళ్ళ ఇలా ముసుగుతన్ని పడుకుందేమిటి? అడుగుదామంటే ఏదో సంకోచం, గదిలోకి వెళ్ళలేక చల్లారిపోయిన అన్నమే గొణుక్కుంటూ తిన్నది.
***
ఆఫీసుకి వెళ్ళినా రత్నాకర్ ఆలోచిస్తూనే వున్నాడు. సొంత ఇల్లు, కట్టాడూ అంటే అది మాలతి తండ్రీ, ముగ్గురన్నలూ ముద్దుల చెల్లికి చేసిన సపోర్ట్ తోనే. నాన్న పోయాక అమ్మ తన దగ్గిరే ఉంటూంది.
మాలతికి ఐదెకరాల పొలం ఇచ్చాడు తండ్రి, అన్నీ పంపిస్తాడు అంటే వడ్లు పట్టించి అవసరమైనప్పుడల్లా ఆర్టీసీ బస్సు ద్వారా బియ్యం పంపిస్తాడు. అడపా దడపా వాళ్ళ ఊరినుండి ఎవరు వచ్చినా నెయ్యి, కంది పప్పు, పెసలు, ఎండుమిర్చి అన్నీ పంపిస్తాడు.
ఇంకా ఆయనో, అన్నలో వచ్చినప్పుడు జున్నుపాలు, కుండ పెరుగు తెస్తారు.
మాలతి వుద్యోగం చేయదల్చుకోలేదు, పిల్లలు చిన్నవాళ్లు, వాళ్ళ నాన్న పంపేవన్నీ, జాగ్రత్తగా ఖర్చు చేస్తుంది. తన పొలం పుట్టింటి వాళ్ళే చేస్తారు, పంట మీద వచ్చిన ఆదాయాన్ని సంవత్సరానికి రెండుసార్లు ఇస్తారు.. ఒక రకంగా మాలతి విషయంలో తను చాలా అదృష్టవంతుడే.
అమ్మ తూలి మాట్లాడినా సహిస్తుంది, పెద్దగా పట్టించుకోదు కానీ ఈ రోజు ఎందుకో బాధపడుతోంది, కారణం ఆలోచిస్తున్నాడు.
నిన్న ఆదివారం, వూళ్ళో వున్న చిన్నక్క యామిని భర్తా పిల్లలతో సహా వచ్చేసింది. పిల్లలతో కలిపి మొత్తం తొమ్మిదిమందికి ఆదివారం స్పెషల్స్ చేయాల్సి వచ్చింది మాలతికి. క్రికెట్ చూస్తూ గడిపారు తానూ, బావగారు. అమ్మా, అక్కా కబుర్లే కబుర్లు, పిల్లలు ఆటలు.
పనిచేసుకుంటూనే ఆలోచిస్తున్నాడు, మాలతి కోపానికి కారణం తెలిసింది, నిన్న బావగారు “మాలతి ఒక్కతే లోపల పనిచేస్తోంది, వెళ్లి ఏమన్నా సాయం చెయ్యి” మందలింపుగా అన్నాడు అక్కతో.
అమ్మ వెంటనే, “అమ్మాయికి ఆఫీస్‌లో పని, ఇంట్లో పని. కనీసం ఈ రోజైనా రెస్ట్ తీసుకోనివ్వండి” అన్నది. మాలతి మనసు ఆ మాటతో చివ్వుక్కుమని ఉంటుంది, తనకు మాత్రం రెస్ట్ అవసరం లేదా?
***
ఆరింటికి ఇంటికెళ్ళేసరికి మాలతి వంట చేస్తోంది, “మాలతీ, రెస్ట్ తీసుకోకపోయావా” అన్నాడు.
“పొద్దున్న రెస్ట్ ఖరీదు 300”, అన్నది మొహం తిప్పుకుని.
“సారీ మాలతీ, ఇకనుండి నేను ప్రతి పనిలో హెల్ప్ చేస్తాను, అక్క మనకి నిత్య అతిథి, ఏమి చెయ్యను? అమ్మ మాటలు పట్టించుకోకు.” అన్నాడు.
అంతే, గంగ వెల్లువై అతని భుజాన్ని తడిపింది.
అనుకృతి అనే కలం పేరుతో రచనలు చేసే బి. భవాని కుమారి గారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 34 ఏళ్ళు లెక్చరర్‌గా పని చేసి 2014లో రిటైరయ్యారు. 2019లో వీరి మొదటి కథ ‘తొలకరి’ సాక్షి ఆదివారం అనుబంధం ‘ఫండే’లో ప్రచురితమైంది. ఆ తరువాత రాసిన అనేక కథలు పలు వెబ్ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి.
