Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సినారె సినీ గీతాలు – మానవతా మూల్యాలు

[29 జూలై 2026 న డా. సి. నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా, ‘సినారె సినీ గీతాలు – మానవతా మూల్యాలు’ అనే రచనని అందిస్తున్నారు శ్రీ కుంతి.]

సి.నా.రె.. పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఆయన 1931వ సంవత్సరం జూలై 29వ తేదీన కరీంనగర్‌ ‌జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీ పేటలో జన్మించారు.

నవ్వని పువ్వు, అజంతా సుందరి (గేయ నాటికలు); జాతిరత్నం, నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు (చారిత్రక కావ్యాలు); అక్షర గవాక్షాలు, మధ్య తరగతి మందహాసం, మంటలూ- మానవుడూ, ఉదయం నా ‘హృదయం’, మార్పు నా తీర్పు, ఇంటిపేరు చైతన్యం, రెక్కలు, నడక నాతల్లి, ‘కాలం అంచుమీద’, కవిత నా చిరునామా, నిరంతరం ఆరోహణ, దృక్పథం, కలసాక్షిగా (వచన కవితా సంపుటాలు); విశ్వంభర (సమగ్ర వచన కావ్యం) భూమిక, మట్టి మనిషి, ఆకాశం (దీర్ఘ వచన కావ్యాలు) సమదర్శనం (ముక్తక కావ్యం), ప్రపంచపదులు (విశిష్ట కావ్యం), తెలుగు గజళ్లు, సమీక్షణం, మావూరు మాట్లాడింది (వ్యాస సంపుటాలు), మీరాబాయి, శిఖరాలు – లోయలు (అనుసృజనలు), ముచ్చటగా మూడు వారాలు – ‘మలేసియా తెలుగువాణి’, సోవియట్‌ ‌రష్యాలో పదిరోజులు, పాశ్చాత్య దేశాల్లో 50 రోజులు (యాత్రా సాహిత్య గ్రంథాలు); పగలే వెన్నెల (చలనచిత్ర గీతాల సంకలనం), ‘పాటలో ఏముంది – నా మాటలో ఏముంది?’ (సినిమా పాటల విశ్లేషణ), ‘సి.నా.రె. ఛలోక్తులు’ వంటి వారి గ్రంథాలన్నీ ప్రసిద్ధాలు.

సినిమా పాటలు ఆత్మానందానికి, సరదాకు, కాలక్షేపానికి అని సాహిత్యరంగంలో ఒక అపోహ ఉంది. అయితే తెలుగు సినిమా పాట మొదలైనప్పటి నుండి దాదాపు దాదాపు 2010 వరకు అత్యున్నత సాహితీ స్రష్టలు, గొప్ప సృజనాత్మక కవులు సినీ రంగాన్ని ఏలడం వలన సినిమా పాటలు కూడా తెలుగు సాహిత్యం నిలిచి పోయే స్థాయిలో వచ్చాయి. అందులో లబ్ధప్రతిష్ఠులైన సినీ కవిత్రయం అయిన సముద్రాల, మల్లాది, పింగళి, మరియు శ్రీశ్రీ, దేవులపల్లి, దాశరథి, ఆత్రేయ, ఆరుద్ర, కొసరాజు, వేటూరి, సిరివెన్నెల వంటి వారు సినీ కవితకు ఎన్నో సొబగులు అద్ది వాటికి సాహితీ గౌరవాన్ని చేకూర్చారు.

పద్యాలైన పాటలైనా గేయాలైనా గజల్స్ అయినా వచన కవిత్వమైన కావ్యమైనా తన అక్షరాలను జాతి జనుల పాడుకునే మంత్రాలుగా చేయగలుగడం సినారె గారి ప్రత్యేకత. కేంద్ర సాహిత్య అకాడమీ, నంది అవార్డు, జ్ఞానాపీఠ్, పద్మభూషణ్ వంటి గొప్ప అవార్డుల రత్నలను తన కీర్తి కిరీటంలో పొదుగుకున్న వీరి సినీ గీతాలు వ్యక్తిత్వ వికాస పాఠాలు.. ఉన్మూఖీకరణ మార్గ సూచికలు.. శాంతి జీవన మార్గనికి దీప కళికలు. వారి ప్రతీ అక్షరం తెలుగు వారి సంపద.

అగ్నిని వెదచల్లగల వీరి కవిత్వం అమృతం కురిపించగలదు. సినారె గారు సినీ పాటకు కొత్త ఒరవడి, ఉరవడి సృష్టించారు. అన్నీ ప్రక్రియలలో వీరిది అందె వేసిన చేయి అయినా ఈ కవికి సినీ గేయ రచన మాత్రం వెన్నతో పెట్టిన విద్యగా చెప్పవచ్చు. సినారె సినీ కవిత్వం నవరసభరితం, సరళం-సమాస భూయిష్టం, సామాజికస్పృహ, సాంఘిక నిబద్ధతాభరితం. వారు కథా మరియు సందర్భ, సన్నివేశానుగుణంగా ప్రణయ, శృంగార, అంగార, వేదాంత, కరుణ, కౌటుంబిక గీతాలు రచించారు. అయితే నేటి మానవ జీవనానికి అతి ముఖ్యమైన మానవతా విలువలు వారి గీతాల్లో ఎలా ప్రతిపాదించబడ్డాయో, వర్ణించబడ్డాయో క్లుప్తముగా చెప్పడం ఈ వ్యాసోద్దేశ్యం.

మానవుడు నైతికవిలువలతో మానవతాదృక్పథంతో సమాజానికి హితంగా జీవించడమే మానవత్వం.. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలనేవి మానవతా విలువలు. ఇవి మనిషికి తప్పకుండా ఉండవలసిన విలువలు. మనిషికి పంచ ప్రాణాలు ఎంత ముఖ్యమో.. జీవించడానికి ఈ విలువలు అంతే ముఖ్యము. ముఖ్యంగా సత్యం–ధర్మం–శాంతి–ప్రేమ–అహింస అనే పంచమానవ విలువలు ఆయన పాటలలో ఉపదేశాలుగా కాక, జీవితానుభవాలుగా వ్యక్తమవుతాయి.

సమానత్వ చైతన్యం, మానవతా కర్తవ్యం, సహనం, ఐక్యత,స్నేహం, కరుణ, మమత,క్షమ, దయ, ద్వేషరాహిత్యంవంటి ఉన్నత భావాలు వారి గీతాల్లో అడుగడుగునా దర్శనమిచ్చి మానవ మనుగడకు చక్కని మార్గదర్శకమై నిలుస్తాయి.

“ఎన్ని తెన్నుల కైత కన్నె విహరించిననూ.. పాటలోనే నాదు ప్రాణాలు గలవందు” అని గర్వంగా తెలిపిన వారి పాటల్లో ఈమానవతా విలువలు ఎలా నాట్యమాడాయో చూద్దాం

సత్యం-

నిజాయితీగా మాట్లాడటం, ఆచరించడం, మోసం చేయకుండా ఉండటంఅన్న అంశాలను.. వారు ఎప్పుడు అవకాశంగా వచ్చినా పాటల్లో ఉంచారు.

నిండు సంసారం – చిత్రంలో “ఎవరికీ తలవంచకు, ఎవరినీ యాచించకు.. గుండె బలమే నీ ఆయుధం..” అన్న గీతం

మనిషి నిజాయితీతో జీవించాలి. అసత్యం, మోసం, దుర్మార్గాలకు దూరంగా ఉండాలి. ఆత్మగౌరవంతో సత్యమార్గంలో నడవమని ప్రబోధిస్తుంది. సత్యాన్ని పాటించే వ్యక్తి ఎప్పుడూ భయపడడు. నిజాయితీ జీవితానికి ఈ పాట ప్రతీక.

మాతృదేవోభవ – చిత్రంలో “మనసే కోవెలగా మమతలు జల్లు కురియగా..” అన్న గీతం

మనసులోని నిజమైన భావాలు, స్వచ్ఛమైన అనుబంధాలు జీవితాన్ని పవిత్రంగా మారుస్తాయి. హృదయ నిర్మలత్వం, నిజమైన భావోద్వేగాలే సత్యానికి పునాది అని తెలుపుతుంది.

తల్లా? పెళ్ళామా? – చిత్రంలో “తెలుగు జాతి మనది – నిండుగా వెలుగు జాతి మనది..” అనే గీతం సమాజం పట్ల బాధ్యత, నిజాయితీ, ఆత్మగౌరవాన్ని బోధిస్తుంది. వ్యక్తి తన మూలాలను, తన నిజస్వరూపాన్ని మరవకూడదనే సందేశం అందులో ఉంది.

కర్ణ – చిత్రంలో “గాలికి కులమేది? ఏదీ నేలకు కులమేది? మింటికి మరుగేది ఏదీ? ఏదీ కాంతికి నెలవేదీ..

పాలకు ఒకటే తెలివర్ణం” అన్న గీతం లో వర్ణ వ్యవస్థ నిరసిస్తూ.. “ఏదీ ప్రతిభకు కలదా స్థలబేధం వీరుల కెందుకు కులబేధం అది మనసుల చీల్చెడు మతబేధం” అన్న సత్యాన్ని ధైర్యంగా ప్రకటించారు.

నేరం నాది కాదు ఆకలిది – చిత్రంలో “మంచిని సమాధి చేస్తారా.. మనలో పాపం చేయనివాడు ఎవడో చెప్పండి..” అన్న గీతంలో వాక్యం.. ఇది బైబిల్‌లోని “Let him who is without sin cast the first stone” భావనను గుర్తుచేస్తుంది. మనుషుల అసంపూర్ణతను గుర్తించడం కూడా ఒక సత్యం.

ఆత్మ బంధువు – చిత్రంలో “మంచువంటి మల్లెవంటి మంచి మనసుతో.. జీవించరాని బ్రతుకులెందుకు

మనిషి మదిలోని మమతా లేని చదువు లెందుకు. ..చదువు రానివాడివని దిగులుచెందకు..” అన్న గీతంలో మనిషి ఎలా జీవించాలో ..చదువుకున్న మనిషి ఎలాఉండాలో అన్యాపదేశంగా చెబుతాడు.

మానవుడు దానవుడు – చిత్రంలో “ఎవరు వీరు? దేశమాత పెదవిపైన మాసిన చిరునవ్వులు.. మనసులేని పిడికిలిలో నలిగి పడిన పువ్వులు.. ఎవరు వీరు? ఆకలి కమ్ముడువోయిన అపరంజి బొమ్మలు.. చెక్కిలివన్నెలు చెరిగిన చిగురాకు రెమ్మలుఎవరు వీరు?.. పొరపాటున అబలలుగా పుట్టిన విధివంచితలు..  ఎవరు వీరు? కన్నెలుగానే పాపలగన్న వింత తల్లులు.. రొమ్ముకింద మమతలణచుకున్న పాలవెల్లులు. కసిదాగిన కళ్ళు, సలసల కాగిన కన్నీళ్ళు నిప్పులు మింగి నిజమును తెలిపి నవ్వలేక, ఏడ్వలేక నిట్టూర్చే శవాలు-”

ఈ గీతంలో సమాజం దాచిపెట్టిన వాస్తవాలను కవి బయటపెడతారు. సత్యం అంటే కేవలం నిజం చెప్పడం కాదు; సమాజం చూడదలచని నిజాన్ని చూపించడం కూడా. ఈ పాట గురుదత్ గారి ప్యాస చిత్రం లోని పాటను గుర్తుకు తెస్తుంది.

ధర్మం-

కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం, న్యాయం చేయడం, తల్లిదండ్రులను గౌరవించడం, సమాజ నియమాలను పాటించడం ధర్మం.

బాలమిత్రుల కథ – చిత్రంలో “గున్నమామిడి కొమ్మమీద – గూళ్ళు రెండున్నాయి” అన్న గీతం బాలగీతంలా కనిపించినా, ఇందులో సహజీవనం, బాధ్యత, పరస్పర ఆధారిత జీవన విధానం ప్రతిఫలిస్తాయి. సమాజంలో ప్రతి వ్యక్తి తన పాత్రను నిర్వర్తించడమే ధర్మం అనే భావన కనిపిస్తుంది.

గోరంత దీపం – చిత్రంలో “గోరంత దీపం.. కొండంత వెలుగు.. చిగురంత ఆశ.. జగమంత వెలుగు  కరిమబ్బులు కమ్మే వేళ.. మెరుపు తీగే వెలుగూ.. కారు చీకటి ముసిరే వేళ.. వేగు చుక్కే వెలుగు”

ధర్మం అనేది పెద్ద కార్యాల్లోనే కాదు, చిన్న మంచి పనుల్లో కూడా ఉంటుంది. ఒక చిన్న దీపం చీకటిని తొలగించినట్లే, చిన్న సత్కార్యాలు సమాజాన్ని మార్చగలవని ఈ గీతం చెబుతుంది. నిజానికి ఇది జాతీయ అవార్డు దక్కాల్సిన గీతం.

తాత మనవడు – చిత్రంలో “అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం.. ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం.. వింత నాటకం” అన్న గీతం సంపద, స్వార్థం కోసం బంధాలను మరచిపోవద్దు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడమే నిజమైన ధర్మం అని చెబుతుంది. తల్లిదండ్రుల పట్ల కర్తవ్యం, సమాజం పట్ల బాధ్యతలను గుర్తు చేస్తుంది.

అదే విధంగా “అమ్మను మించి దైవమున్నదా?”, “అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి..” అన్న గీతాలలో కుటుంబంలో ఉండే అమ్మ, అన్నల పాత్రల ధర్మమును వివరిస్తూ బంధాల విలువను తెలుపుతుంది.

కోడలు దిద్దిన కాపురం – చిత్రంలో “నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు – జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు.. సత్యం కోసం సతినే అమ్మినదెవరు – హరిశ్చంద్రుడు

తండ్రి మాటకై కానలకేగినదెవరు – శ్రీ రామచంద్రుడు.. అన్న సేవకే అంకితమైనదెవరన్న – లక్ష్మన్న

పతియే దైవమని తరించిపోయినదెవరమ్మా – సీతమ్మ..” అన్న గీతంలో

ధర్మం అనేది మతాచారం కాదు; సమాజానికి బాధ్యత అని చెబుతారు. ఈ పాట మొత్తం ధర్మశాస్త్రం లాంటిది.

“ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం – అనుసరించుటే ధర్మం” ధర్మం అంటే ఆదర్శాలను అనుసరించడం..

“మానవతయే మన దైవం – మంచితనమే మన ధర్మం – ఈ ఒక్క పాదం సినారె ధర్మ తత్వాన్ని పూర్తిగా చెబుతుంది.

మైనరుబాబు – చిత్రంలో “కారున్న మైనరు కాలం మారింది మైనరు – ఇక తగ్గాలి మీ జోరు – మా చేతికి వచ్చాయి తాళాలు. నీ వెంట నేనొస్తే.. నీ డబ్బు చూస్తాను నా వెంట నువ్వు వచ్చావా.. లోకాన్నే చూస్తావు.. లోకాన్నీ చూడందే.. నువు మనిషివి కాలేవు.. లోకాన్నీ చూడందే.. నువు మనిషివి కాలేవు.. మావాడివైతే కలకాలం బతికుంటావు..” అన్న గీతంలో ..నిజానికి ఇది సామాజిక వ్యంగ్యగీతం. ఇందులో రాచరికం, బూర్జువా విధానాలు పోయి జనస్వామము, సామ్యవాదం వచ్చాయి అన్న భావన కూడా కనిపిస్తుంది.

“లోకాన్ని చూడందే నువు మనిషివి కాలేవు – అన్న వాక్యం ద్వారా సమాజాన్ని అర్థం చేసుకోవడం కూడా ధర్మమే అని చెబుతాడు.

శాంతి –

ఏ సమాజంలోనైనా భిన్న నమ్మకాలు, విభిన్న తాత్విక దృక్పథాలు తప్పక ఉంటాయి. వాటిమధ్య ఐక్యతను సాధించడానికి ఉపయోగపడే సాధనమే సహనం. మనిషిలోని సహనం సామాజిక శాంతికి కారణమవుతుంది. మనిషిలోని అసహనం సమాజంలోని అల్లకల్లోలాకు కారణమవుతుంది. శాంతియుత నైతిక జీవనం సంఘంలో ప్రభవించడానికి సహనం తప్పని సరి.

మానవవాదం ఐక్యతను ప్రసాదిస్తుంది. ఐక్యత సహనం వల్ల కలుగుతుంది.

పూజా ఫలం – చిత్రంలో “పగలే వెన్నెల-జగమే ఊయల – కదలే ఉఃహాలకే కన్నులుంటే..”

ప్రకృతి, సౌందర్యం, మనస్సు ప్రశాంతతను కలిపిన అరుదైన కవితాత్మక గీతం. బాహ్య పరిస్థితుల కంటే అంతరంగ ప్రశాంతత గొప్పదని సూచిస్తుంది.

గోరంత దీపం – చిత్రంలో “గోరంత దీపం కొండంత వెలుగు-” ఈ పాట మొత్తం శాంతి తత్వమే.

“మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు

దహియించే బాధల మద్యన సహనమే వెలుగు” కవిగారు బాహ్య గందరగోళంలో అంతరంగ ప్రశాంతతను వెతకమని సూచిస్తున్నారు.

సహనం శాంతికి మూలం. బాధల మధ్య మనశ్శాంతిని నిలబెట్టుకోవడం నిజమైన ఆధ్యాత్మిక పరిపక్వత అని సినారె చెప్పిన గొప్ప జీవన సందేశం ఇది. మనసులో ప్రశాంతత, కలహాలు లేకుండా జీవించడం. కోపం వచ్చినప్పుడు సహనంతో స్పందించడం, మనం సాధించాల్సిన పనులు అని ఈగీతం తెలియజేస్తుంది.

తల్లా? పెళ్ళామా? – చిత్రంలో “తెలుగుజాతి మనది – నిండుగా వెలుగు జాతి మనది” అన్న గీతంలో సామాజిక శాంతి కోసం ప్రాంతీయ విద్వేషాలను అధిగమించమని పిలుపు నిచ్చారు.

అమెరికా అబ్బాయి – చిత్రంలో .. “ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ.. రాయప్రోలన్నాడు ఆనాడూ.. అది మరిచిపోవద్దు ఏనాడూ..” అన్న గీతంలో.. “వెన్నెలదీ ఏ మతమురా..? కోకిలదీ ఏ కులమురా..? గాలికి ఏ భాష ఉందిరా..? నీటికి ఏ ప్రాంతముందిరా..? గాలికీ నీటికీ లేవు భేధాలూ.. మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలూ” అని ప్రశ్నిస్తారు. అంతేకాదు శాంతికి మూలం ప్రేమఅని కవి సందేశాన్ని ఇస్తారు.

ప్రేమ –

మానవవాదంలో ప్రేమకి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. అది సూర్యరశ్మిలా వెలుతురును మలయమారుతంలా చల్లదననాన్ని ,వెన్నెలల హాయిని ఇస్తుంది. ప్రేమ అంటే సినిమా ప్రేమ, యువతీయువకుల వయసు పొంగులో పుట్టే ఆకర్షణ ప్రేమా కాదు. నిస్వార్ధమైనది. భగవత్తత్వంలో నిబిడీకృతమైనది. యేదీ ఎవరి నుండి ఆశించనిది ప్రేమ.. రామ సేతువు వద్ద ఉడత చూపినది.. శబరి రామునికి ఎంగిలి పండ్లు తినిపించినది.. కృష్ణునికై గోపికలు బృందావనంలో కన్నీరు కారుస్తూ ఎదురుచూసినది.. గుహుడు, అక్రూరుడు, విదురుడు చూపినది.. ప్రేమ.

మానవుల పరస్పర అవగాహన, గౌరవం, సహాయ సహానుభూతుల నుంచి పుట్టేది ప్రేమ.

ఇది మనిషిలోని అనాగరిక ఆటవిక ప్రవృత్తిని రూపుమాపి, నిస్వార్ధ తత్వాన్ని పెంపొందింపజేసి మనిషిని మనిషిగా చేస్తుంది. ప్రేమే ప్రధానం, ప్రేమే దైవం, ప్రేమే ప్రాణం. ప్రేమలో జీవం.. అయితే ఈ ప్రేమ సంకుచితమైనదిగా ఉండకూడదు. విశాలమైనదిగా ఉండాలి. ప్రేమ వైయుక్తికం, శారీరకం నుండి విశ్వవ్యాప్తం, ఆధ్యాత్మికం కావాలి.

ఈ ప్రేమ ముందు భుజబలం, ధనబలం, జనబలం, జ్ఞానబలం మొదలైనవేమీ సాటికావు. నేటి అమానుష సంఘటనల వెనుక కారణం ప్రేమ లేకపోవడమే. అందుకే Start the day with love, spend the day with love, fill the day with love, end the day with love.. అంటారు.

సినారె గారి దృష్టిలో ప్రేమ అనేది కేవలం స్త్రీ–పురుష సంబంధం కాదు. అది స్నేహం, మాతృత్వం, మానవత్వం, సామాజిక సౌభ్రాతృత్వం, జాతీయ ఐక్యత వరకు విస్తరించింది.

ధర్మ దాత – చిత్రంలో.. “చిరు నవ్వు కిరణాలు చిందించు మోము.. కన్నీరు మున్నీరుగా చూడలేను.. చిరు నవ్వు కిరణాలు చిందించు మోము.. కన్నీరు మున్నీరుగా చూడలేను… నిను గన్న నీ తల్లి కనుమూసె గాని.. నిను గన్న నీ తల్లి కనుమూసె గాని.. నిను వీడి క్షణమైన నేనుండ గలనా.. నిను వీడి క్షణమైన నేనుండ గలనా..” అన్న గీతంలో (నాయకుడు పాడే పాట అయినా) తల్లి ప్రేమ, ఆప్యాయత, మమకారానికి ప్రతిరూపంగా నిలుస్తూ, నిస్వార్థ ప్రేమ ఎంత పవిత్రమో తెలియజేస్తుంది. ప్రేమతో పలికే ప్రతి పలుకూ సత్యంగా ఉంటుంది.

స్వాతి ముత్యం – చిత్రంలో “వటపత్ర శాయికి.. వరహాల లాలి.. రాజీవ నేత్రునికి.. రతనాల లాలి.. వటపత్ర శాయికి.. వరహాల లాలి.. రాజీవ నేత్రునికి.. రతనాల లాలి..” గీతంలో ప్రేమకు మారు రూపమైన తల్లి ప్రేమ ఆశీర్వాదం కనిపిస్తుంది.

మాతృ దేవత – చిత్రంలో “మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ. త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ – కన్నకడుపున చిచ్చురాగిలెనా కరువు పాలౌను దేశం, తల్లిని మించిన దైవం లేదని తరరాల సందేశం.”

ఈ పాటలో స్త్రీ యొక్క ఔన్నత్యం చాటడం ద్వారా స్త్రీ జాతి పట్ల ప్రేమాగౌరవాలు పెంచుతారు.

నా పేరే భగవాన్ – చిత్రంలో “స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం.. గుండెనే పలికించితే.. కోటి పాటలు పలుకుతాయ్.. మమత నే పండించితే మణుల పంటలు దొరుకుతాయ్ బాధలను ప్రేమించు భాయీ..లేదు అంతకు మించి హాయ్.. స్నేహమే.. హొయ్!” ఈ పాటలో స్నేహం విలువను… “ఉన్ననాడు లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను”.. అన్న వాక్యంలో ప్రేమ భౌతిక సంపదల కంటే గొప్పదని చెబుతున్నారు.

స్నేహం – చిత్రంలో “నీవుంటే వేరే కనులెందుకూ.. నీ కంటి వేరే బ్రతుకెందుకూ.. నీ బాటలోనే అడుగులు నావే.. నా పాటలోనే.. మాటలు నీవే” అన్న పాటలో స్నేహితుడు ఒక్కడున్నా చాలు కష్టాలు దాటవచ్చు అని చెబుతారు.

బాల మిత్రుల కథ – చిత్రంలో “గున్నమామిడి కొమ్మ మీద” అన్న పాటలో.. “రంగూ రూపు వేరైనా.. జాతి రీతి ఏదైనా” అన్న పాటలో.. చిలక–కోయిలల రూపంలో గల వైవిధ్యంలో ఏకత్వాన్ని చూపించారు. ఇది ప్రేమ యొక్క సామాజిక రూపంగా భావించాలి.

గులేబకావళి కథ – చిత్రంలో “నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని.. కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి” ప్రేమను కేవలం ఆకర్షణగా కాకుండా ఆరాధన స్థాయికి తీసుకెళ్లిన గీతం. ప్రేమలో పరస్పర గౌరవం, ఆత్మీయత, అంకితభావం ప్రతిఫలిస్తాయి.

ఆరాధన – చిత్రంలో “నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై-నా ప్రాణమై” అన్న గీతంలో ప్రేమ అనేది హృదయం నుండి పుట్టే ఆత్మీయ స్పందన. స్వార్థం లేని అనుబంధాన్ని ఈ గీతం అందంగా వ్యక్తం చేస్తుంది.

తాండ్రపాపారాయుడు – “అభినందన మందారమాల” గీతంలో ప్రేమ అనేది హృదయాలను కలిపే పవిత్రమైన బంధంగా వర్ణిస్తూ గౌరవం, విశ్వాసం, ఆత్మీయతతో కూడిన ప్రేమను ప్రతిబింబిస్తుంది. నిస్వార్థమైన అనురాగం, కరుణ, ఆప్యాయతను చూపుతుంది

మానవుడు – దానవుడు చిత్రంలో “ఎవరు వీరు..” ఈ పాటలో సమాజం నిర్లక్ష్యం చేసిన స్త్రీల పట్ల అపారమైన కరుణ కనిపిస్తుంది.

“ఈ ఆడపడుచులు మనజాతి పరువులు”.. అన్న వాక్యం.. ఇది ప్రేమను కేవలం భావోద్వేగం నుంచి మానవ గౌరవ స్థాయికి తీసుకెళ్తుంది.

అహింస

చూపులతోగాని, పలుకులతోగాని, ఆలోచనలతోగాని, క్రియలతోగాని ఎవ్వరినీ ఏ రకంగాను బాధింపకుండా ఉండటమే అహింస. మనకు కావలసిన అవగాహన ఇదే. ఇది ప్రేమ వల్లనే వస్తుంది. ప్రేమతో అన్ని సాధించవచ్చు. అన్ని విలువలనూ పొందవచ్చు. ఎవరినీ మాటతో, చేతతో, మనసుతో బాధపెట్టకపోవడం.

కోపం, ప్రతీకారం కంటే కరుణ, క్షమ గొప్పవని చెబుతుంది. వివాదం వచ్చినప్పుడు గొడవ కాకుండా సంభాషణ ద్వారా పరిష్కరించడం. ఇతరులకు హాని చేయకుండా ప్రేమతో జీవించడం అహింస సారం.

మేలుకొలుపు – చిత్రంలో “ చెడు అనవద్దు.. చెడు వినవద్దు.. చెడు కనవద్దు.. ఇది బాపూజీ పిలుపు.. ఇదే మేలుకొలుపు.. ఇదే మేలుకొలుపు.. ఇంటిని కాల్చే మంటల్లాగా ఎందుకు బ్రతకాలి? ఆ ఇంటికి చల్లని జ్యోతుల్లాగా ఎపుడూ వెలగాలి.. మానవతయే మన దైవం.. మంచితనమే మన ధర్మం… పరోపకారం పరమగుణం.. పరమగుణం.. సహనం మన ఆభరణం.. ఆభరణం..” ఇది గాంధేయ అహింసకు గేయరూపం.

నేరం నాది కాదు ఆకలిది – “మంచిని సమాధి చేస్తారా”.. అన్న గీతంలో “కక్షతో సాధించనిది క్షమాభిక్షతో సాధించాలి”.. అహింస యొక్క హృదయం క్షమ. మనిషి తనలోని క్రూరత్వాన్ని విడిచి మానవత్వాన్ని పెంపొందించుకోవాలి.

సీతయ్య – చిత్రంలో “ఇదిగో రాయలసీమ గడ్డ”.. అన్న గీతంలో “ఈ మట్టిలో నెత్తురు వదలొద్దురా”.. రక్తపాతం కంటే సామరస్యాన్ని ఎంచుకోమని పిలుపు.

అమెరికా అబ్బాయి – చిత్రం లో “ఏ దేశమేగినా”.. అన్న గీతం లో “గాంధీ చూపిన మార్గం విడవద్దు”

ఇక్కడ అహింసను జాతీయ విలువగా ప్రతిష్ఠించారు.

తల్లా? పెళ్లామా? – “తెలుగు జాతి మనది”.. ఈ గీతం విభేదాల కంటే ఐక్యతను ప్రోత్సహిస్తుంది. అహింస యొక్క మూలసూత్రం అయిన సహజీవనం, పరస్పర గౌరవం ఇందులో కనిపిస్తాయి.

గోరంత దీపం – “గోరంత దీపం కొండంత వెలుగు”.. అహింస అనేది కేవలం శారీరక హింస లేకపోవడం కాదు; కోపాన్ని సహనంగా, ద్వేషాన్ని కరుణగా మార్చడం. ఈ గీతం అదే సందేశాన్ని అందిస్తుంది.

బలి పీఠం – “మారాలి మారాలి.. . మనుషుల నడవడి మారాలి … మారాలి మారాలి.. మనుషుల నడవడి మారాలి.. మనసులోని బురద కడుగుకొని.. మనుషుల్లా బతికేవారు.. సమధర్మం చాటేవారు.. వారిదే ఈనాటి తరం.. వారిదే రానున్న యుగం… వారిదే ఈనాటి తరం.. వారిదే రానున్న యుగం..” అన్న గీతంలో ద్వేషం, హింస, స్వార్థం విడిచి మానవత్వంతో జీవించమని పిలుపునిస్తూ …ఛాందస భావాలు, ఆధిపత్య రాచరిక ధోరణులు విడనాడి సమభావం, మానవత్వం ప్రదర్శించకపోతే యేమి జరుగుతుందో బోధించారు.

తన పాటల ద్వారా వినోదం తో పాటు సామాజిక స్పృహను పంచిన ఈ సుకవిగారి గీతాలు.. హృద్యంగా చిరకాలం మనసులో నిల్చిపోయేలా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.

పైన పేర్కొన్న చిత్రాలలోని పాటలు సినారె సినీ గీతాల్లో మానవతా మూల్యాలు ఎత్తి చూపడానికి మచ్చు/మెచ్చుతునకలుమాత్రమే. వారి పాటలను గురించి చర్చిస్తూ పండిత పామర ప్రజాదరణ పొందిన గీతాలను స్మరించకపోతేకవిగారికి సరియైన అక్షర నీరాజనం కాదు.

కావున.. వారి ప్రసిద్ధమైన కొన్ని గీతాలు తెలుపుతూ ..ఈ వ్యాసాన్ని ముగిస్తాను.

చెల్లెలి కాపురం- చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన, దానవీర శూరకర్ణ – జయీభావ..విజయీభవ – ధన్య గాంధారి గర్భశుక్తి ముక్తాఫలా.. స్వాతి కిరణం – సంగీతసాహిత్య సమలంకృతే.. వంటి సంస్కృత సమాస భూయిష్ట గీతాలు..

కృష్ణ వేణి – కృష్ణవేణి తెలుగింటి విరిబోణి.. ఈ పాట నాయికను, కృష్ణా నదితో సామ్యాన్ని చూపుతూ రాసినది.

అల్లూరి సీతారామరాజు – వస్తాడు నారాజు – ఈ గీతం నాయకుడైన రాజును, నెలరాజుతో సామ్యము చెబుతూ రాసినది. మరియు

పగలే వెన్నెల.. జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే.., ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో.., మబ్బులో ఏముంది.. నా మనసులో ఏముంది.., మల్లియలారా మాలికలారా.., నిన్న లేని అందమేదో.., ఏ పారిజాతమ్ములీయగలనో చెలీ.., ఎంత వారు కానీ వేదాంతులైన కానే వాలు చూపు సోకగానే.. ఇలా పాటలు చెప్పుకుంటూ పోతే.. వ్యాసం గ్రంథంగా మారుతుంది.

తాత-మనవడు – చిత్రంలో ‘పుట్టిన రోజు పండగే అందరికీ.. మరి.. పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి.. ఎందరికి.. ఎందరికి..’ అన్న గీతంలో

“పువ్వెందుకు తీగపై పుడుతుంది?.. జడలోనో గుడిలోనో నిలవాలని.. ముత్యమేల కడలిలో పుడుతుంది?.. ముచ్చటైన హారంలో మెరవాలని.. ప్రతి మనిషీ తన జన్మకు పరమార్థం తెలుసుకుని.. తన కోసమే కాదు పరుల కొరకు బతకాలి.. తన కోసమే కాదు పరుల కొరకు బతకాలి.. తానున్నా లేకున్నా.. తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి” అని తెలిపారు..

ఆయన తెలిపినట్లుగా..

“వారున్నా లేకున్నా వారి పేరు మాత్రం తెలుగు సాహిత్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో మిగిలి పోతుంది.”

Exit mobile version