[శ్రీ ప్రమోద్ ఆవంచ గారి ‘సివిక్ సెన్స్ – కామన్ సెన్స్’ అనే రచనని అందిస్తున్నాము.]
కొన్ని ప్రయాణాలు ఆహ్లాదకరంగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. జీవిత ప్రయాణంతో పోలిస్తే ఈ ప్రయాణాలు ఉత్సాహానిస్తాయి. రకరకాల మనుషులు, వాళ్ళ ప్రవర్తన ఒకసారి చికాకు తెప్పిస్తుంది, మరొకసారి వాళ్ళతో మాటలు కలిపి, కదిలిస్తే ఎన్నో తెలియని విషయాలు, ఇంకా నేర్చుకునే అవకాశం ఉండే అంశాలు ఉంటాయి.
ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ అనే మాటకు అర్థమే మారిపోయింది. మాట్లాడే స్వేచ్ఛ, ప్రశ్నించే స్వేచ్ఛ, హక్కుల గురించి నిరసన తెలిపే స్వేచ్ఛలు గత పదేళ్ళలో స్వేచ్చా వాయువులు పీల్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అణిచివేయబడ్డాయి. ఇదిలా ఉంటే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా భావించే స్వేచ్ఛను తప్పుగా అర్థం చేసుకున్న సగటు అమాయకపు మనిషి పబ్లిక్ ప్లేసుల్లో, బస్సుల్లో, రైళ్లల్లో, రోడ్డు పైన ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, కొన్ని ఖాళీ రోడ్లల్లో తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు.
మినిమమ్ సివిక్ సెన్స్, ట్రాఫిక్ సెన్స్ లేకుండా నేనొక్కడినే కాదు నాతో పాటు, నా చుట్టూ ఇంకా చాలా మంది మనుషులు ఉన్నారన్న కనీస విచక్షణను కోల్పోతున్నాడు. నేను ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తాను కాబట్టి వాటితోనే ప్రారంభిస్తాను..
బస్సుల్లో సెల్ ఫోన్లే సమస్య. పక్కన తోటి ప్రయాణికుడు, ఇతర ప్రయాణికులు ఉన్నారన్న మినిమమ్ సివిక్ సెన్స్ లేకుండా పెద్ద గొంతుకతో కొందరు మాట్లాడుతుంటారు. మనం ఇబ్బంది ముఖంతో వాళ్ళ వైపు చూసామనుకోండి.. అంతే ఆ సదరు వ్యక్తి స్వరం ఇంకా తీవ్ర స్థాయికి చేరుతుంది. కావాలని మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మరీ ఫోన్ మాట్లాడుతుంటారు. కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ వైపు ఇబ్బందిగా చూస్తే గొంతు స్థాయిని తగ్గించుకుంటారు.
సెల్ ఫోన్లతో అతి ముఖ్యమైన సమస్య యూ-ట్యూబ్ వీడియోలు, రాజకీయ నాయకుల ప్రసంగాలు, సినిమా క్లిప్పింగ్స్ చూస్తూ పక్కనున్న వారే కాకుండా బస్‌లో ఉన్న వారందరికీ వినిపించేలా ఆడియో వాల్యూంను పెంచి వింటుంటారు. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, ప్రయాణికులలో అరవై శాతం మంది ఎవరికి ఇష్టమైనది వాళ్ళు చూసుకుంటూ తోటి ప్రయాణికులు ఉన్నారన్న విషయమే మర్చిపోతారు.
మొదట చెప్పిన సదరు ప్రయాణికులు ఫోన్ కాల్ వచ్చినప్పుడే పెద్ద గొంతుకతో మాట్లాడి ఆ తరువాత కొంత సేపటికి ఫోన్ కట్టేస్తారు, అది కొంత వరకు భరించగలం. కానీ యూ ట్యూబ్ వీడియోలు చూసే వాళ్ళు హై వాల్యూంతో వింటూ, చూస్తూ మిగితా ప్రయాణికులను గమ్యం చేరేంత వరకు ఇరిటేట్ చేస్తారు.
ఒకరోజు నాకు మెట్రో రైలులో జరిగిన అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటాను.. రైలులో నా పక్కన వ్యక్తి నార్త్ ఇండియన్లా ఉన్నాడు, సెల్ఫోన్లో పాటలు పెట్టుకుని వింటునన్నాడు, నేను కొంచెం వాల్యూం తక్కువ చేయండనీ తెలుగులో అడిగాను.. నో తెలుగు హిందీలో చెప్పు, అయినా నా ఫోన్ నాఇష్టం నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నాడు హిందీలో.. ఇది మీ ఇల్లు కాదు, చేస్తే వాల్యూం తక్కువ చేయండీ లేకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి అని కొంచెం గట్టిగానే చెప్పాను. నా వైపు విసురుగా చూస్తూ, పాటలు ఆపేసి, ఎవరికో ఫోన్ చేసి పెద్దగా మాట్లాడడం మొదలు పెట్టాడు.. ఏమనాలో తెలియక నేను, ఇటు పక్కన కూర్చున్న వ్యక్తి.. ఇద్దరం నవ్వుకున్నాం.
ఇంకా ట్రాఫిక్ విషయానికి వస్తే ప్రాబ్లం హారన్. ఈ హారన్‌తో శబ్ద కాలుష్యం వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రధాన కూడళ్లలో గ్రీన్ సిగ్నల్ పడగానే వెనుక వరుసలో ఉన్న వాహనదారులు హారన్ కొడుతూ ఆ ప్రాంతాన్ని భరించలేని శబ్దాలతో పొల్యూట్ చేస్తుంటారు. అప్పట్లో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వాహనం నడపగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా సులువుగా ఏ వాహనానైనా నడపవచ్చని అందరూ అంటుండేవాళ్ళు
అయితే అక్కడ వాళ్ళు హారన్ కొడుతూ అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుతుంటారు. ఒక్క ఓల్డ్ సిటీలోనే అని కాదు అన్ని ప్రాంతాల్లో హారన్ కొట్టడం అనేది ఒక ఇన్వాలంటరీ యాక్షన్. తెలంగాణా ప్రాంతాల్లో నేను ఈ మధ్య కాలంలో చూసింది మిర్యాలగూడలో, అక్కడ వాహనదారుల చేతి వేలు హారన్ మీదనే ఉంటుంది. అవసరం ఉన్నా లేకున్నా ఇన్‌వాలంటరీగా హారన్ కొడుతూనే ఉంటారు.
కొన్ని సందర్భాల్లో మరీ విచిత్రంగా ఉంటుంది కొందరి ప్రవర్తన.. చూస్తే నవ్వు వస్తుంది, కొందరు వాహనదారులు స్పీడ్ బ్రేకర్‌కి కూడా హారన్ కొట్టడం అనేది వింత. అంటే పాపం వాళ్ళు కావాలని హారన్ కొట్టరు.. అంతే అలా జరిగిపోతుంది వాహనం ఏ కారణం చేతనైనా స్లో అయినప్పుడు హారన్ కొట్టాలని, మస్తిష్కం సిగ్నల్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఇది ఇన్వాలంటరీ చర్య. మన మెదడులో సింపతిటిక్, పారా సింపతిటిక్, వాలంటరీ, ఇన్వాలంటరీ అనే ప్రక్రియలు నిరంతరం జరుగుతుంటాయి. మెదడులో అడ్రినలిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ అయినా కూడా మన శరీరంలో కొన్ని చర్యలు జరుగుతుంటాయి, దాని మూలంగా మనకు తెలియకుండానే కొన్ని పనులు చేస్తుంటాం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా పెరుగుతుంటాయి. దానికి కారణం టెన్షన్.. ఈ టెన్షన్‌కి మెదడులోని డోపమైన్ రిసెప్టార్స్ ఇన్ బాలెన్స్ కావడమే కారణం. మనం కొంతదూరం డ్రైవ్ చేసి, వెంటనే బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటే బీపీ అబ్నార్మల్ గా ఉంటుంది..
విదేశాల్లో చట్టాలు చాలా కఠినంగా అమలు చేస్తారు. లా ఆఫ్ టార్ట్స్ చట్టం కింద మనం ఏదైనా కంప్లైంట్ ఇస్తే కోర్టులో ఇమ్మిడియేట్‌గా చర్యలు ఉంటాయి. సదరు వ్యక్తికి గానీ, సంస్థకు గానీ భారీగా జరిమానా విధిస్తారు. సమస్యను ఒకటి రెండు రోజుల్లో పరిష్కరిస్తారు. ఇండియాలో కూడా లా ఆఫ్ టార్ట్స్తో పాటు మోటార్ వెహికల్ చట్టాలు ఉన్నాయి. కానీ మన కోర్టుల్లో వెంటనే పరిష్కారం కావు, అని సీనియర్ న్యాయవాది పాలకుర్తి యాదగిరి శర్మ అన్నారు. మోటార్ వెహికల్ చట్టంలో సౌండ్ పొల్యూషన్‌కి ఛాలాన్ విధించాలి కానీ కొన్ని వీఐపీ నివాసిత ప్రదేశాల్లో తప్పించి మరే ప్రధాన కూడళ్లలో ఇది కనిపించదు. సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వెహికల్ పొల్యూషన్.. ఇలా అన్నింటినీ ప్రజలు భరించాల్సిందే, తప్పదు. మరి ప్రజాస్వామ్య దేశం.
అందుకే మనం సమాజంలో మనుగడ సాగించాలంటే కొన్ని పద్దతులను, సామాజిక బాధ్యతలను, ఎవరికి వారు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఇష్టాలు, అభిరుచులు, పక్కనున్న వారికి ఇబ్బంది కారకాలు కాకూడదు. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు సెల్‌ఫోన్ వాడకూడదన్న నియమం ఏమీ లేదు. కానీ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఇయర్ ఫోన్స్ వాడడం, అవి లేకపోతే ఫోన్ మాట్లాడేటప్పుడు గొంతు స్థాయిని తగ్గించడం, ఫోన్ వాల్యూంని తగ్గించి వేరొకరికి ఇబ్బంది కలగకుండా వినడం, లాంటివి చేయడం అందరికీ శ్రేయస్కరం.
అంతే కాకుండా రష్ ఉన్నా లేకున్నా, రోడ్లపై అనవసరంగా హారన్ కొట్టకూడదనీ ప్రతి ఒక్క వాహనదారుడు తెలుసుకోవాలి.
ఈ విషయాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు, ముందుకు రావాలని కోరుకుంటూ..
హైదరాబాద్ లోని ప్రీతి యూరాలజి అండ్ కిడ్నీ హాస్పిటల్ లో ఎంజిఎంగా పనిచేసే శ్రీ ప్రమోద్ ఆవంచ, ప్రవృత్తి రీత్యా కవి. గత అయిదు సంవత్సరాల నుండి కవిత్వం రాస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా మూడు వందల కవితలు రాశారు. అందులో నూట ముప్పై కవితలతో 2021 సంవత్సరంలో ‘గుండె చప్పుళ్ళు’ అనే శీర్షికతో పుస్తకం ప్రచుచించారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రెండవ పుస్తకం ప్రింటింగ్ దశలో ఉంది.
వృత్తి రీత్యా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో తరచూ ప్రయాణించే ప్రమోద్ – ఏ ప్రదేశం వెళ్ళినా ఆ ప్రయాణం ముచ్చట్లు, తన అనుభవాలను అక్షరీకరిస్తుంటారు.