[శ్రీ దేశరాజు రచించిన ‘క్లౌడ్ బరస్ట్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో న్యాయనిర్ణేతల ప్రశంసలు పొందిన కథ.]
ఆకాశం విరిగి పడుతున్నట్టుగా కురుస్తోంది వాన. మెయిన్ రోడ్డు మీద మోకాళ్ల లోతు నీళ్లు. డ్రైనేజీలు పొంగి పొర్లుతుంటే, ఆ మురికి నీటి వాసన ముక్కు పుటాలను అదరగొడుతోంది. దానికి తోడు ట్రాఫిక్ జామ్. కాళ్లతో తోసుకుంటూ వాహనాలు నడిపేవారు నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. అంతా హార్లన్లు, రణగొణ ధ్వని. ముందు ఖాళీ వుంటే ఎవడైనా వెళ్తాడు. వెళ్లే దారిలేకే ముందువాళ్లు ఆగారనే ఇంగిత జ్ఞానం ఎవరికీ లేదు. మెట్రో పిల్లర్ల కింద, షాపుల దగ్గర ఆగినవారు వర్షం ఏమేరకు తగ్గిందో అని చేతులు బయటపెట్టి చూస్తున్నారు.
ఇంతలోనే అనుకున్నంతా అయ్యింది. ట్రాఫిక్‌లో ఆగిన బైక్ టక్కున నిశ్శబ్దంలోకి జారుకుంది. అతడు హెల్మెట్ తీసి బండి అద్దానికి తగిలించి, ముఖం మీద నీళ్లు తుడుచుకున్నాడు. భుజాల మీంచి డెలివరీ బ్యాగ్ బెల్టులు తీసి, బైక్ మీద దాన్ని బ్యాలెన్స్ చేస్తూ, బండి పక్కకు తీసి గట్టిగా కిక్ కొట్టాడు. స్టార్ట్ కాలేదు. నాలుగైదుసార్లు కొట్టినా కాలేదు. అతడు నిస్పృహగా చూశాడు. ట్రాఫిక్‌లో పక్కనే ఆగిన వ్యక్తి
“బా వంచి కొట్టు. నీళ్లు పోయుంటాయి” అని సలహా ఇచ్చాడు. వెంటనే బండి మీదున్న డెలివరీ బ్యాగ్ తీసి వర్షం పడుతోందని ఆగినవాళ్ల ముఖాల్లోకి చూసి, ఫర్వాలేదనుకున్నవాడి బండి మీద పెట్టాడు. కొట్టగా కొట్టగా బండి స్టార్ట్ అయ్యింది. “థ్యాంక్స్ అన్నా” అంటూ తన బ్యాగ్ వెనక్కు తీసుకుని, రైజింగ్ ఏమాత్రం తగ్గించకుండా బైక్‌పై సాగిపోయాడు.
చుట్టూ వున్న ఆఫీసుల్లోని అద్దాల్లోంచి వర్షాన్ని చూస్తున్నవారు కూడా ఆదుర్దాగానే వున్నారు. ‘ఇప్పుడప్పుడే ఈ ట్రాఫిక్ క్లియర్ అవ్వదు. ఇవాళ ఇంటికెళ్లేసరికి అర్థరాత్రే’ అన్నది వారి ఆందోళన. వర్షం అంత త్వరగా తగ్గేలా లేకపోవడంతో షాపుల దగ్గర, మెట్రో పిల్లర్ల కింద నిలబడినవారిలో చాలామంది వర్షం తగ్గకపోయినా వాహనాలు తీసుకుని తడుస్తూ వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. దాంతో రోడ్ల మీద మళ్లీ హడావిడి మొదలైంది. అందరినీ తప్పించుకుంటూ వీలైనంత వేగంగా వెళ్లి ఓ గేటెడ్ కమ్యూనిటీ లోపల సెక్యూరిటీ దగ్గర ఆగాడతడు. అతడి కంగారుతో ఏమీ సంబంధం లేదన్నట్టు సెక్యూరిటీ వాడు నిదానంగా ఫ్లాట్ నెంబర్ కనుక్కుని, అతడి ఫోన్ నెంబర్, పేరు కనుక్కుని వాటిని సగం తడిసిన పుస్తకంలో రాసుకున్నాడు.
“అన్నా.. త్వరగా కానియ్యే.. ఆర్డర్ లేటైతోంది” అన్నాడతను చిరాకును దాచుకుంటూ.
వర్షం గోలలో వినపడలేదో లేక వినపడినా విననట్టే వున్నాడోగానీ సెక్యూరిటీ వాడు ఏమీ పట్టించుకోకుండా, ఫోన్ తీసుకుని అతడి ఫొటో తీసుకున్నాడు. ‘హమ్మయ్యా’ అనుకుని అతడు బండి ముందుకు ఉరికించబోతుంటే, “ఏయ్.. ఆగాగు” అని గట్టిగా కేకలు వేశాడు.
“వెహికల్స్ లోపలికి అలౌడ్ లేదు. రైట్ సైడ్ ముందుకు వెళ్లి అక్కడ పార్క్ చేసుకుని వెళ్లు” అన్నాడు.
“లేదే.. ఇప్పటికే బా లేటయ్యింది. ఇయ్యాళ కొత్తగా చెప్తావేంది. ఎన్నిసార్లు పోలే బండీమీన” అన్నాడు.
“అరె.. చెప్తే నీక్కాదా? నిన్ను ఆపితే నాకేమైనొస్తదా? కనస్ట్రక్షన్ నడుస్తోంది. లోపల పార్కింగ్ లేదు. ఇక్కడ పెట్టుకుని జల్దీ పో” అన్నాడు సెక్యూరిటీవాడు డబాయింపుగా.
ఇక చేసేది లేక బండి పక్కకు తిప్పుకుని వెళ్లాడు. దారి మారడంతో లిఫ్ట్ ఎక్కడుందో తెలియలేదు. వెతుక్కుని నాలుగో ఫ్లోర్‌కి వెళ్లి, ఫ్లాట్ నెంబర్ చూసుకుని బెల్ కొట్టాడు.
ఓ కుర్రాడు విసురుగా తలుపు తీశాడు.
“టూ మచ్ డిలే. ఫస్టిన్నింగ్స్ అవుతున్నప్పుడు ఆర్డర్ పెడితే, సెకండ్ ఇన్నింగ్స్ అయిపోతుంటే తెచ్చావ్” అన్నాడు చిరాగ్గా.
“ట్రాఫిక్ మస్తుంది సార్. వెహికల్ కూడా కొంచెం కరాబ్ అయ్యింది” అని ఆర్డర్ ఇచ్చేసి వెనుదిరిగాడు.
‘అమ్మాబాబూ సంపాదిస్తుంటే, దొబ్బి తింటూంటారు. ఈళ్లకేం తెలుస్తాయి కష్టాలు’ అనుకుంటూ మరో ఆర్డర్ డెలివరీ చేయడానికి ఫోన్ చెక్ చేసుకుంటూ లిఫ్ట్‌లో కిందకు వెళ్లిపోయాడు.
ఆర్డర్లన్నీ డెలివరీ ఇచ్చేశాడు. ఆ ట్రాఫిక్, వానతో చిరాగ్గా అనిపించడంతో ఇంక కొత్త ఆర్డర్స్ యాస్సెప్ట్ చేయకుండా ఇంటిదారిపట్టాడు.
అదో రెండు గదుల అద్దె ఇల్లు. పేరుకు రెండు గదులు. అందులో ఒకటి వంట గది. అంటే, గదేమీ కాదు. గ్యాస్ స్టౌ పెట్టుకోవడానికి గట్టు, వంట సామానులు పెట్టుకోవడానికి రెండు సిమెంటు అల్మారాలు వున్నాయి. వాటిలో ఒక దానిలో మాత్రమే వంట సామానులు పెట్టుకుని మరో దాంట్లో, నీళ్ల బిందెలు పెట్టుకున్నారు. మనిషి నిలబడి వంట చేసుకోడానికి ఫర్లేదు. విసురుగా వెనక్కు తిరిగితే గోడ తగులుతుంది. అయినా, ఆ ఖాళీలోనే చాప వేసుకుని అతడి తల్లి పడుకుంటుంది. ముందు గది అంతా మంచం ఆక్రమించేసింది. కేవలం నడవడానికి మాత్రం దారి వుంది. ఆ గదిలోనే ఓ గోడకు టీవీ తగిలించి వుంటుంది. ఓ వారగా కట్టిన దండెం మీద గుట్టలు గుట్టలుగా బట్టలు వేలాడుతూంటాయి. ఓ మూలకున్న ప్లాస్టిక్ అల్మారాలో కొబ్బరి నూనె సీసాలు, పిల్ల టానిక్ సీసాలు, అద్దం, పౌడర్ డబ్బాలు వుంటాయి. అందరూ చాలాసేపు ఆ మంచం మీదే కూర్చుని టీవీ చూస్తారు కాబట్టి వాళ్ల తలలు ఆనుకునే దగ్గర గోడంతా జిడ్డు పట్టి వుంటుంది.
గుమ్మంలోకి వెళ్లే సరికి తల్లి ఎదురొచ్చింది. డెలివరీ బ్యాగ్ తీసి ఆమె చేతికి ఇచ్చాడు. టోపీ, పైన వేసుకున్న కంపెనీ జాకెట్టు తీసి లోపలకు విసరబోతుంటే బుడిబుడి అడుగులు వేసుకుంటూ బిడ్డ వచ్చింది. వెంటనే అవి దాని చేతికిచ్చి “ఏంది చిట్టీ ఇంకా బజ్జోలే?” అని తల మీద ఆప్యాయంగా చేయివేసి అటూఇటూ ఊపాడు. అది కిలకిల నవ్వి లోపలకు పరుగెట్టింది. అతడు గుమ్మంలో వున్న బ్లూ డ్రమ్ములోంచి నీళ్లు తీసుకుని కాళ్లు, చేతులు, ముఖం కడుక్కుని లోపలకు వెళ్లాడు. ఇంతలో భార్య వచ్చి మంచి నీళ్లిచ్చి, జాలిగా అతడి ముఖంలోకి చూసింది. అప్పటి వరకూ వున్న అలసట ఆమె ముఖం చూడగానే చిరాగ్గా మారింది.
“ఏందే, అలా బిత్తిరిపోయి చూస్తున్నావ్? తిండేం పెట్టవా?” అని అరిచాడు.
ఆమె అలవాటుగా, ఆ అరుపులు పట్టించుకోకుండా “వట్టుకొస్తనా” అని గ్లాసు తీసుకుని వెళ్లిపోయింది.
అతడు బట్టలు మార్చుకుని నిక్కరు, టీ షర్ట్ వేసుకునే సరికి కంచంలో అన్నీ వడ్డించుకు వచ్చింది. మంచం మీద కూర్చుని కంచం అందుకోగానే చేతికి వేడిగా తగిలింది. వెంటనే ‘ఛా అనవసరంగా దీనిమీన అరిసా’ అని మనసులో అనుకుంటూ ఆవురావురుమని తిన్నాడు. కంచం తీసుకెళ్లడానికి వచ్చిన కోడలి వైపు తల్లి అదోలా చూడటం అతడు గమనించాడు. తను చూడటం లేదనుకుని భార్య తల అడ్డంగా ఊపడం కూడా గమనించాడు. ‘ఇద్దరూ కలిసి ఏం తీసుకొస్తున్నారో పీకల మీదకి’ అనుకున్నాడు.
“ఈయేల పిల్ల నా దగ్గర పనుకుంటుందిలేవే” అంది పెద్దావిడ.
“నీకే ఆ కిచెన్‌లో ప్లేస్ సరిపోదు. మళ్లా అది కూడా ఎందుకమ్మా? మాతోనే పడుకుంటుందిలే” అన్నాడు అతడు కలుగజేసుకుని.
“నానమ్మకి భయమేస్తదంట డాడీ. అందుకే ననూ తోలుపలుకోమంది” అంటూ కూతురు ముద్దుగా పలికింది.
అతడు భార్య వైపు చూశాడు. ఆమె తలదించుకుని వుంది. ‘ఇదేదో ముందస్తు ఏర్పాటులా వుంద’ని అతడికి అర్థమై, మౌనంగా వుండిపోయాడు.
అందరూ పడుకున్న కాసేపటికి భార్య తాను మళ్లీ తల్లి కాబోతున్నట్టు చెప్పింది. అతడికి చాలా సంతోషం వేసింది. భార్య మురిపెంగా ఏవేవో చెబుతుంటే ఓ చేత్తో ఫోన్ తిప్పుతూ, నవ్వుకుంటూ వింటున్నాడు. ఇంతలో బయటేదో పెద్ద గొడవ మొదలైంది.
“ఇంక పిల్లను తెచ్చేసుకో, అమ్మకు కష్టమవుతుంది. నేను బయటకు వెళ్లి వస్తా” అని లేచాడు.
నాలుగు ఇళ్ల అవతల జనం మూగి వున్నారు. హడావిడిగా వెళ్లాడు. ఎవరికో బాగా దెబ్బలు తగిలి వున్నాయి. రక్తం కారుతోంది. అందరూ హడావిడి చేసి ఎవరెవరినో తోడిచ్చి ఆసుపత్రికి పంపారు.
ఎక్కడో క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వడానికి వెళితే, అప్పటికే తాగేసి వున్న వాళ్లంతా ఆర్డర్ తీసుకుని, డబ్బులు ఇవ్వకుండా బాగా కొట్టారనీ, ఎలాగో తప్పించుకుని బయటపడ్డాడని అక్కడి వాళ్ల మాటలను బట్టి తెలిసింది. ఇక అక్కడి నుంచీ రకరకాల మాటలు. వాళ్లెవరో తెలుసుకుని అంతు తేల్చాలని కొందరు, పోలీస్ కంప్లయింట్ ఇవ్వాలని కొందరు, ఏం చేసినా పీకేదేం లేదు వదిలేసి పొండని కొందరు రకరకాలుగా సాగాయి.
మొన్న ఈ గిగ్ వర్కర్స్ అందరూ స్ట్రయిక్ చేసినప్పుడు రక్షణ, సామాజిక భద్రత కల్పిస్తామని ప్రభుత్వంవారు ఏవో పడికట్టు మాటలు చెప్పారు. సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అవేవీ అమలయ్యేవి కావని, కాస్త విషయాలు తెలిసినవాళ్లు బాధపడ్డారు.
అతడు లోపలకు వచ్చి, మంచంపై వాలాడు. కానీ, నిద్రపట్టలేదు.
అతడిలోని ఆందోళన, అలసట ఆమెకు అర్థమైంది. “ఎందుకివన్నీ, మానేయరాదు. ఏదైనా ఒకచోట చేసే జాబు చూసుకుంటే, కొంచెం మంచిగా వుంటుంది కదా” అంది ప్రేమగా.
కానీ, అతడికి ఆ ప్రేమలో నిస్సహాయత కనబడింది. “జాబొస్తే చేయక వూరుకుంటానా? అన్ని వదిలేసుకుంటే పైసలు ఎట్లొస్తాయనుకున్నావ్? మీరు ముగ్గురే అనుకుంటే, మళ్లొకరు తోడవుతున్నారు కదా, ఏం పెట్టాలి అందరికీ?” అంటూ కేకలేశాడు.
ఆ కేకలకు తల్లి లేచింది. “ఏంట్రా, ఊరికే పిల్లల్లెక్క. పండుకోరా మీరు” అంది.
“మేం పడుకుంటాంలేగానీ, నువ్వేంది అప్పుడే లేచావ్?” అని అడిగాడతడు.
“టైము చూడు నాలుగున్నరైంది. ఇయాళ నీళ్లొస్తాయి. పట్టుకోవాలి” అని వీధిలోకి వెళ్లిపోయింది.
అతడు కాసేపు అటూఇటూ దొర్లాడు. నిద్రపట్టలేదు. సంతోషంగా వున్న పెళ్లం మీద, అనవసరంగా అరిచాననిపించింది.
కాసేపటికి లేచి, గబగబా బయల్దేరిపోయాడు.
“పొద్దుగాల ఎక్కడికి పోతున్నావురా?” అని తల్లి అరుస్తున్నా వినకుండా బైక్ స్టార్ట్ చేశాడు.
స్టోర్ దగ్గరకు వచ్చేసరికి చాలామంది వున్నారు. కొందరు ఎదురుగా బండి దగ్గర ఛాయ్ తాగుతున్నారు. వారిలోంచి ఒకడు గట్టిగా పిలిచాడు.
“ఏంది దొరా, ఎప్పుడూ లేంది, ఇయాల పొద్దుగాల ఎలిపొచ్చినావ్?’ అన్నాడు.
“ఏం లేదు, ఊకే” అంటూ తను కూడా ఛాయ్ తాగాడు.
నెమ్మదిగా చెప్పాడు. భార్య మళ్లీ ప్రెగ్నెంట్ అని. స్నేహితుడు సంతోషంగా “వార్నీ గదీ సంగతి. మస్తు పైసలు కమాయించాలని వచ్చినావులే. సరే ఇవ్వన్నీ తియ్. సాయంకాలం బీర్ తాపిస్తున్నవా, లేదా? ఆ ముచ్చట జెప్పు” అన్నాడు.
“నువ్వడిగితే ఎప్పుడైనా కాదన్నానా?” అన్నాడతడు కూడా నవ్వుతూ.
అలా సరదాగా ప్రారంభమైన వాళ్ల ఆవేల్టి డెలివరీ సర్వీస్ మధ్యాహ్నం దాకా బాగా సాగింది.
మధ్యాహ్నం అతడు ఫుడ్ డెలివరీకి వెళ్తుండగా అకస్మాత్తుగా పెద్ద వాన. క్లౌడ్ బరస్ట్ అంట.
గబగబా బండి రోడ్డు పక్కన వదిలేసి షాపుల కిందకు పరుగెట్టాడు. అక్కడ తనలాగే చాలామంది నిలబడి వున్నారు. అందులో నాలుగురైదుగురు డెలివరీ బాయ్స్ వున్నారు. అందులో ఒకడు గుర్తుపట్టి “అన్నా బావున్నావా?” అని అడిగాడు.
“బావున్నా. నువ్వెట్లా వున్నావు? చాలా రోజులైపోయింద కలవక” అన్నాడు.
“ఔ గానీ, ఫుడ్ డెలివరీనా?” అని అడిగాడు.
అతడు ‘అవును’ అన్నట్టు తల ఊపి, ‘ఏం’ అన్నట్టు చూశాడు.
“ఏం లేదన్నా, ఫుడ్ బండికే వదిలేశావ్ కదా. నానిపోద్దేమోనని” అని విరగబడి నవ్వాడు.
అతడు మరో ఆలోచన లేకుండా గభాల్న బయటకు ఉరికి, బైక్ హ్యాండిల్‌కి తగిలించి వుంచిన ఫుడ్ పార్శిల్ కవర్‌లు పట్టుకుని వచ్చాడు.
“నీయబ్బ.. ముందు చెప్పవారా? బావున్నావా అంటూ.. పెద్ద పలకరింపులొకటి” అని గట్టిగా స్నేహితుడిని చరిచాడు.
స్నేహితుడు కూడా గట్టిగా నవ్వుతూ “మస్తు స్మెల్ వస్తందిరా? ఏంది బిర్యానీనా?” అని కవర్ అందుకుని లోపలకు చూసి, “ఎవడో బాగా బలిసినోడే, లేపోతే అంత దూరంకెల్లి ఆర్డర్ పెడతాడా?” అన్నాడు.
“ఏ.. లే అన్నా. ఆ బిర్యానీ మస్తు ఫేమస్. ఇప్పుడు చాలామంది ఆర్డర్ పెడుతున్రు” అన్నాడు పక్కనున్న మరో డెలివరీ బాయ్.
“అవునా” అని తన బ్యాగ్‌లో వున్న ప్లాస్టిక్ స్పూన్ తీసి “జర టేస్ట్ చూద్దాం” అని అతడి చేతిలో వున్న కవర్‌లోని బిర్యానీ డబ్బా ఓపెన్ చేయబోయాడు.
“ఏయ్.. వద్దురా బయ్. ఇలాంటి పనులు నాకు నచ్చవ్” అన్నాడతడు.
“అరె.. నేనేమైనా ముక్క తీసుకుంటానా ఏంది? రైస్ టేస్ట్ జూస్తా అంటున్నా” అంటూ చొరవగా డబ్బా మూత కొద్దిగా తెరిచి, స్పూన్‌తో బిర్యానీ రైస్ తీసుకుని నోట్లో వేసుకున్నాడు. వెంటనే సూపర్ అన్నట్టు చేత్తే సైగ చేశాడు.
వర్షం కొంచెం తగ్గగానే అందరూ ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. అతడు సాయంత్రం దాకా డెలివరీలు చేసి చీకటి పడ్డాక స్నేహితుడితో వైన్ షాపు పక్కన బీర్లు తాగి, ఇంట్లో వాళ్ల కోసం జిలేబీలు ప్యాక్ చేయించుకుని సంతోషంగా వెళ్లాడు.
కానీ, ఇంటికెళ్లేసరికి సీన్ రివర్స్ అయ్యింది. తల్లీ, భార్య ఎదురొచ్చారు. ఇద్దరి ముఖాలు వాడిపోయి వున్నాయి.
“పొద్దుగాలంతా పనిలోనే వుంటావా? అసలు ఫోన్ చూసేది లేదా నీకు? పెంపంచకంలో ఏం జరుగుతోందో తెలుసా అసలు?” అని గట్టిగా అరిచిన భార్య అంతలోనే ఏడుపందుకుంది.
అతడికి ఏం జరిగిందో అర్థం కాలేదు. హఠాత్తుగా చంటిది గుర్తుకు వచ్చింది. కంగారుగా చూశాడు. అది మంచం మీద గోడవారగా పడుకుని వుంది. ‘మరేమైంది?’ అనుకుంటుండగా, నిన్నటి సంఘటన గుర్తుకు వచ్చింది. ‘కొంపదీసి దెబ్బలు తిన్నవాడు పోలేదు కదా?’ అనుకున్నాడు.
తల్లి దిగులు ముఖం పెట్టుకుని వుంది. అడిగితే ఆమె కూడా ఏడుస్తుందేమోనని, ఇంట్లోంచి బయటకు వచ్చాడు.
కనబడిన వాళ్లని అడిగాడు.
“ఏ వాడికేం గాలే. ఆరు లక్షలు కర్సయితై అంటే ఇంట్లకి తీసుకొచ్చిన్రు. పైసల కోసం తండ్లాతన్రు. దొరికినంక మళ్ల దవాఖానకు పోతరు. కానీ, నువ్వేంది మస్తు పాపులర్ అయినవ్” అన్నాడు ఓ పెద్దాయన.
“అంటే?” అంటూ ముఖం ప్రశ్నార్థకంగా పెట్టాడు.
“ఇయ్యన్నీ మాటల్తోని గావ్రా. ఓసారి ఫోన్ జూడు నీకే తెలుస్తది” అన్నాడాయన.
గబగబా ఫోన్ తెరిచి చూశాడు. ఏమీ అర్థంగాలే. ఇంట్లోకి వచ్చాడు.
“గొడ్డు లెక్క పన్జెయ్యడం తప్పితే నీకేం తెల్వదు. అర్థం కాదు. మట్టి బుర్ర” అని తిడుతూ, భార్య తన ఫోన్‌లో వీడియో చూపించింది.
అది మధ్యాహ్నం తన చేతిలో వున్న పార్శిల్ నుంచి స్నేహితుడు ఫుడ్ టేస్ట్ చూస్తున్న వీడియో. అతడికి పిచ్చిలేచింది. అసలు అదెవడు తీశాడో అర్థం కాలేదు. పైగా దానికి చిలువలు పలువలు కల్పించి సోషల్ మీడియాలో వదిలారు. బోల్డన్ని షేర్లు, లెక్కలేనన్ని కామెంట్లు, తిట్లు.
అంతే, అతడు అక్కడే కుప్పకూలిపోయాడు.
ఆ అర్ధరాత్రి అక్కడ కూడా క్లౌడ్ బరస్ట్ జరిగింది. కాకపోతే, అది ఆ కుటుంబానికి మాత్రమే పరిమితమైంది.
దేశరాజు చక్కని కవి. సంక్లిష్టమయిన భావాలను సరళంగా లలితంగా కవితల్లో ప్రదర్శిస్తారు. జర్నలిజం వృత్తి అయినా కవితలల్లటం ప్రవృత్తి.
