[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారి ‘కలర్‍పుల్ కదంబం’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారి కొత్త పుస్తకం ‘కలర్‍పుల్ కదంబం’! ఏప్రిల్ 2018 నుంచి జనవరి 2021 సంచిక మాసపత్రికలో ‘రంగుల హేల’ పేరుతో నెల నెలా వ్రాసిన 32 కాలమ్స్ సంపుటి!
ఈ కాలమ్స్‌లో రచయిత్రి సినిమాల గురించి, పాటల గురించి, స్నేహితుల గురించి, కుటుంబ సంబంధాల గురించి, పుస్తకాల గురించి, పాఠకుల గురించి, రచయితల గురించి, ప్రకృతి గురించి, మనలో ఉండాల్సిన భావుకత గురించి, చిన్ననాటి సంఘటనల గురించి అద్భుతంగా చెప్తారు. చదువుతున్న పాఠకులు ఆ యా ఇతివృత్తంతో లీనమైపోతారు. రచయిత్రి చెణుకులు, చురకలు వేస్తారు, చమక్కులు ప్రదర్శిస్తారు, నవ్విస్తారు, ఆలోచింపజేస్తారు, కొన్నిసార్లు సున్నితంగా హెచ్చరిస్తారు. ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్నీ రేకెత్తిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే – సంతోషంగా ఉండడం ఎలా అన్నది ఈ పుస్తకంలో చెప్తారు.
హాస్యం మేళవించిన కాలమ్‌లు పాఠకులకు ఒక రకమైన ‘రిలీఫ్’ ఇచ్చి, వారి మూడ్‌ని తేలికపరుస్తాయని రచయిత్రికి తెలుసు. అందుకే వీలైనప్పుడు, సందర్భానుసారంగా రచనల్లో చమత్కారం, సమయస్ఫూర్తి జోడించి పాఠకుల ముఖాలపై చిరునవ్వులు పూయిస్తారు. హాస్యస్ఫోరకంగా చెప్పడం పాఠకుల ఆసక్తిని పెంచుతుంది.
క్లిష్టమైన విషయాలను చెప్పే సందర్భంలో సూటిగా చెబితే, కొందరు నొచ్చుకోవచ్చు. అందుకే, కానీ వ్యంగ్యం లేదా చమత్కారంతో చెబితే, పాఠకులు ఆ విషయాన్ని ఆలోచిస్తూనే ఆస్వాదిస్తారు. అలాంటి దృష్టాంతాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
భావుకత మెండుగా ఉన్న రచయిత సాధారణ విషయాలను కూడా చాలా అందంగా, కవితాత్మకంగా వర్ణించగలరు. ఇది పాఠకుడికి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇలా వర్ణనా వైవిధ్యం సాధించారు గౌరీలక్ష్మి.
చిన్ననాటి జ్ఞాపకాలు, అమ్మ ప్రేమ, వాన చినుకులు, లేదా పాత స్నేహాల గురించి రాసేటప్పుడు భావుకత ఉంటేనే పాఠకుడు తనను తాను ఆ రచనలో చూసుకోగలడన్నది తెలిసినదే. “ఇది నా గురించే రాశారు” అని పాఠకుడు అనుకున్నప్పుడే ఆ కాలమ్ సక్సెస్ అయినట్లు. ఈ పుస్తకం చదువుతున్న పాఠకులు అలా అనేక సందర్భాలలో అనుకుంటారు.
~
సినిమాలనీ జీవితాన్ని పోలుస్తూ, ఒక్కోసారి జీవితం కన్నా సినిమానే మెరుగంటారు ‘జీవితం సినిమా కాదు’లో. జీవితంలా కాకుండా సినిమా బావుంటుంది. మనల్ని మురిపిస్తుంది. మన బాధల్ని మరిపిస్తుంది. ఏదో లోకంలోకి లాక్కెళ్లి మైమరపిస్తుందంటారు రచయిత్రి.
‘పాటల పూలు’లో పాటల ఉద్యానవనంలోని కుసుమాలవంటివని అంటూ, పాటలు మనకెలా ఉపయోగపడతాయో చెప్తారు. “కొన్ని పాటలు చిట్టి చిట్టి భగవద్గీతలే! కొన్ని మనలో జోష్‌ని పెంచుతాయి. కొన్ని క్లిష్ట సమయాల్లో దారి చూపుతాయి – నేస్తాల్లా భుజమిచ్చి తలవాల్చుకోమంటాయి. మరి కొన్ని గుండె చెదిరిన వేళ తల్లిలా ఓదారుస్తాయి. అవసరమైనపుడు సూచనలిచ్చి సలహాలిస్తాయి” అంటారు. జీవితాన్ని సులభంగా, తేలిగ్గా జీవించి పారెయడానికీ పాటలు ఉపకరిస్తాయంటారు.
పరిస్థితుల్ని మనం మార్చలేనప్పుడు వాటికి అనుగుణంగా మారిపోవడం మనల్ని బలవంతుల్ని చేస్తుందంటారు ‘నీ గతమే నీ బలం’లో. “నీ దారిలో ఎన్ని ముళ్ళున్నా, రాళ్లున్నా, వాగులున్నా, వంకలున్నా ఆ దారే కదా నిన్నిక్కడికి చేర్చింది” అంటూ గతాన్ని సగర్వంగా తలచుకోమంటారు. ఇందులో వ్రాసిన ఒక చిన్న కవిత ఎంతో స్ఫూర్తిమంతంగా ఉంటుంది.
‘రియాలిటీ చెక్’లో మనమంతా అందరి దగ్గర నటిస్తూనే ఉంటామని, ఒక్కరి దగ్గర మాత్రం సహజంగా ఉంటామని చెప్తారు. ఆ ఒక్కరు ఎవరో కాలమ్ చదివితే తెలుస్తుంది.
ఒకప్పుడు, విద్యార్థులను ఎంతగానో ప్రోత్సహించే టీచర్ల లాంటి వాళ్ళు, పుస్తకాలకు ముందుమాటలు రాసేవారంటూ మొదలవుతుంది ‘ముందుమాటలూ – మొట్టి కాయలూ’. ప్రస్తుత కాలంలో కవులు, రచయితలు తమ పుస్తకాలకి ముందుమాటలు వ్రాయించుకోవాలంటే ఎదుర్కుంటున్న ఇబ్బందులని ఈ వ్యాసం ప్రస్తావిస్తుంది. ఇందులో చెప్పినవన్నీ నిష్ఠుర నిజాలని అంగీకరించాల్సి వస్తుంది.
కొందరు స్త్రీల స్వభావాలు ఎలా ఉంటాయో ‘పిసినారి పద్మలూ – దర్జా దమయంతులూ’లో చెప్తారు. పొదుపరితనం పీక్స్‌లోకి వెళ్ళి పిసినారితనంగా రూపాంతరం చెందినట్టు పద్మల్లాంటి వాళ్లు గ్రహించరు. పొదుపు వాళ్లని ఒక వ్యసనంలా పట్టుకుంటుంది. అదే సమయంలో దయయంతుల్లాంటివాళ్ళు డబ్బుని లెక్క చేయక, ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తూ, దర్జా ఒలకబోస్తారు. మనం కూడా ఒకసారి పద్మ లాగా మరోసారి దమయంతిలాగా ప్రవర్తిస్తూ ఉంటాం. మరీ పద్మల్లా కాకుండా పూర్తిగా దమయంతుల్లా కాకుండా మధ్య రకంగా సంయమనం పాటిస్తూ ఉండాలని రచయిత్రి సూచిస్తారు.
మన జీవితంలో గత అనుభవాలు కొన్ని వాసనలతో కలిసిపోయి మన మెదడులో నిక్షిప్తమై ఉంటాయంటారు ‘సువాసనలూ – జ్ఞాపకాలూ’లో. ఆ వాసనలు కీ బటన్‌లా పని చేస్తూ ఒకోసారి మనల్ని గతంలోకి లాక్కెళుతూ ఉంటాయంటారు. కొన్ని హృద్యమైన అనుభావలను ప్రస్తావించి, ప్రాణం లేని వాసనలు, ప్రాణంతో గుండెల్లో పదిలంగా ఉండే అనుభవాల్ని మన మదిలో ఎంత చక్కగా రీలు తిప్పుతాయోనని వ్యాఖ్యానిస్తారు. ఇది చదువుతుంటే, పాఠకులు కూడా తమ గతంలోకి వెళ్ళడం ఖాయం!
మనం మన చుట్టూ గోడ కట్టేసుకుని ఒంటి పిల్లి రాకాసిలా ఎవరి నోట్లోనూ పడకుండా ప్రశాంతంగా బతికేద్దామంటే మాత్రం వీలు కాదని చెప్తుంది ‘కట్ చేసి అతికితే సరి!’. బంధుమిత్రులను తట్టుకోవాలంటే, ‘అందరూ మనవాళ్లే కానీ ఎవరూ మన వాళ్ళు కాదు’ అన్న తత్త్వం వంట బట్టించుకోవాలని అంటారు రచయిత్రి. సుఖ జీవన పయనం ఎలా సాగాలో సూచిస్తారు.
‘మనం పురోగమిస్తున్నామా?’ అని ప్రశ్నించి, సౌకర్యాల పరంగా పురోగతి సాధించిన, భావాజాలాల, ఆచారాల విషయంలో తిరోగమనంలో ఉన్నామని అంటారు. మానవులందరికీ ఆనందకరమైన జీవితం కావాలంటే ‘నువ్వు బ్రతుకు, పక్కవాడిని బ్రతకనియ్యి అన్న చిన్న సూత్రం చాలదా!’ అని రచయిత్రి వేసిన ప్రశ్న, పాఠకుల హృదయాలను సూటిగా తాకుతుంది, ఆలోచింపజేస్తుంది.
‘పండితుల అపండితత్వాలు’లో సందర్భ శుద్ధి లేకుండా ఎలా పడితే అలా మాట్లాడకూడదని, తాము చెప్తున్నదాంట్లో ఔచిత్యం గ్రహించి మాట్లాడాలని సూచిస్తారు రచయిత్రి. ఇందుకు ఉదాహరణలుగా రచయిత్రి చెప్పినవి చదివాకా, ఆమె అభిప్రాయంతో పాఠకులు ఏకీభవిస్తారు.
చుట్టూ జరుగుతున్న అనేక సంఘటలకూ, వింటున్న రకరకాల వార్తలకూ అలవాటుపడిపోయి, ఇవన్నీ చదివి చదివీ మనం మొద్దు బారిపోయామంటారు ‘సున్నితత్వాలు – కఠినత్వాలు’లో. మనకున్న లోకజ్ఞానంతో మనల్ని మనం పరిస్థితులకు/పరిసరాలకు అనుగుణంగా మలచుకుని ఆటో సజెషన్స్ ఇచ్చుకోకపోతే మన మనుగడ కష్టమైపోతుందంటారు.
మనుషులే కాదు, వస్తువులు కూడా పగపడతాయనీ, పగ తీర్చుకుంటాయని అంటారు ‘పగలూ – ప్రతీకారాలూ’లో. మనం గరళకంఠులుగా మారి చిరునవ్వులు అతికించుకోవాల్సిన సందర్భాలని వివరిస్తారు.
వాణిజ్య ప్రకటన అంటే, అందమైన పదాల పొందిక అంటారు ‘సెల్లింగ్ పాయింట్స్’లో. మనుషుల్లో ఉండే సెల్లింగ్ పాయింట్స్ గురించి చెప్పి, కొందరి చుట్టూ జనాలు ఎందుకు తిరుగుతారో చెప్తారు. వారిలోని మంచి లక్షణం ఓ సెల్లింగ్ పాయింట్ అనీ, దాని వల్ల వారికి నలుగురిలో గుర్తింపు దొరకటమే కాక, పది మంది వారితో స్నేహం చేస్తారని అంటారు. ప్రేమ అందిస్తేనే ప్రేమ దొరుకుతుందంటూ ముగిస్తారు.
కొత్త కొత్త ఆధ్యాత్మిక సిద్ధాంతాలు చదివి సరికొత్త జ్ఞానాన్ని సముపార్జించడం ఎలా ప్రమాదంగా పరిణమిస్తుందో ‘అరకొర జ్ఞానం’ చెబుతుంది. ఎంతో కొంత తెలివి మరియు తేటలతో జీవనాన్ని కాస్త జాగ్రత్తగా సాగించాలన్న సూచన చేస్తారు రచయిత్రి.
గుడ్డి ప్రేమలు, వ్యక్తులపై మితిమీరిన అభిమానాలు వల్ల కలిగే ఇబ్బందులని ప్రస్తావిస్తారు ‘బైట నుంచి ప్రేమిద్దాం’లో. విచక్షణ అనే జ్ఞానం నేత్రం తెరిచి ఉంచడం అవసరమనీ, మనం మనంగానే ఉందామనీ; ఉచితజ్ఞతను పాటిద్దామంటూ విలువైన సూచన చేశారు గౌరీలక్ష్మి.
పెళ్లనగానే తెలుగువారి గుండెలు ఎందుకు గుభేల్‌మంటాయో ‘శుభకార్యాలూ – ఝండూ బామ్‌లూ’లో చెప్తారు. హిందీ సినిమాల్లో పెళ్ళి తంతు ఎలా ఉంటుందో చెప్తున్నప్పుడు నవ్వొస్తుంది. అద్భుతమైన అనుభవంగా మిగలవలసిన ఓ శుభకార్యం, ఎందుకు ప్రహసనంగా మారుతోందో ఆలోచించమంటారు.
సాహితీ విమర్శలో పాటించాల్సిన ఔచిత్యాన్ని ‘విమర్శ కషాయం’లో చెప్తారు. వర్క్ అఫ్ ఆర్ట్ అనేది అసంకల్పితంగా పుడుతుందని, దాన్ని తూకం వేసి తూచి, కొలతలు వేసి సృష్టించలేరని అంటారు. విమర్శకులు హృదయవాదులు అవ్వాలన్న సూచన స్ఫురిస్తుంది.
విపత్తు మనకి చాలా గుణపాఠాల్ని నేర్పిస్తుందంటారు ‘డిజాస్టరూ మంచిదే!’లో. జీవితంలో తగిలే ఎదురుదెబ్బలు మనల్ని మరింత దృఢంగా మార్చి, జీవితాన్ని ఆస్వాదించేలా చేస్తాయంటారు.
నిజంగా జీవించిన రోజులేవంటే, టీనేజ్ రోజులంటారు ‘కలర్‌ఫుల్ కదంబం’లో. ఆ జ్ఞాపకాలే జీవితంలో ఎప్పటికీ మన తలపుల్లో వాడకుండా నిలిచి ఉండే కలర్‌ఫుల్ కదంబం అంటారు. పుస్తకానికి శీర్షికగా రచయిత్రి ఈ వ్యాసం పేరునే ఎందుకెంచుకున్నారో, ఇది చదివితే అర్థమవుతుంది.
జీవితంలో ప్రాక్టికల్‌గా ఉండడం ఎంత అవసరమో ‘సెంటి-మెంటల్స్’ చెబుతుంది. ఎమోషన్స్ అవసరమే కానీ, అవి మన తార్కిక తెలివికి ప్రతిబంధకాలు కాకూడదని అంటారు రచయిత్రి.
‘ఆదత్ సే మజ్‌బూర్’లో మనకి తెలియకుండానే మనం మన అలవాట్లకి ఎంతలా లొంగిపోయామో చెప్తారు. మన అలవాట్లు అతిగా అటుగానీ, అతిగా ఇటు గానీ కాకుండా మధ్య మార్గంలో ఉండేలా మనమీద మనమే ఒక కన్నేసి నిఘా పెట్టుకోవడం తప్పనిసరని అంటారు.
సత్యమనేది హృదయగత సంస్కారాన్ని బట్టి దర్శనమిస్తుందని అంటూ, అది ఒక్కొక్కరికి ఒక్కోలా కనబడుతుందని వ్యాఖ్యానిస్తారు ‘పరమ సత్యం’లో. పరమ సత్యం ప్రమాదకారి అనీ, పరమశివుడు గరళాన్ని కంఠంలో దాచుకున్నట్టు మనం కూడా పరమ సత్యాన్ని హృదయంలో దాచుకోవాలనీ, నిరూపించే ప్రయత్నాలు చేయనవసరం లేదని అంటారు.
ఫీల్ అయ్యే రసజ్ఞత మనకి ఉండాలి గానీ అన్ని చోట్లా సస్పెన్స్ విరాజిల్లుతూనే ఉంటుందంటారు ‘సస్పెన్స్ సంబరాలు’లో. సస్పెన్స్ మహత్యం ఏమిటో వివరిస్తారు రచయిత్రి. ఇందులో టీవీ సీరియల్స్‌పై వేసిన చురకలు నవ్వు తెప్పిస్తాయి. “సీరియల్‌లోని పాత్రలకి తాము తయారు చేసుకున్న టీ కూడా తాగుతారని గ్యారంటీ లేనన్ని కష్టాలుంటాయి. రక రకాల అసాధ్యమైన సమస్యలు వస్తుంటాయి వాళ్ళకి. అందరి చేతుల్లోనూ గన్ లుంటాయి. ఎవరు ఎవరిని అంతం (షూట్ చేసెయ్యడం, తినే పదార్ధాల్లో విషం కలిపెయ్యడం) చెయ్యాలని కుతంత్రాలు చేస్తారో తెలీదు.”
బాల్యమిత్రులని, కాలేజీ మిత్రులని చాలా కాలం తర్వాత కలవడం, మాట్లాడడం అన్ని సార్లు ఆనందాన్నివ్వదు అంటారు ‘పాత స్నేహాల కొత్త రూపాలు’లో.
‘డ్రీమ్ హస్బెండ్స్.. అండ్.. రియల్ హస్బెండ్స్’లో తమ భర్తలు ఎలా ఉండాలని ఆశించే భంగపడే ఆడవాళ్ల గురించి చెప్తారు. ‘ఊహా సుందరీమణులూ.. వాస్తవ భార్యామణులూ’లో భార్యలు ఎలా ఉండాలో ఆశించి భంగపడిన మగవాళ్ళ గురించి చెప్తారు.
‘ధృతరాష్ట్ర ప్రేమలు’లో ఎవరి పట్లా గుడ్డిప్రేమ పనికిరాదని చెప్తారు. యుక్తాయుక్త వివేకం కలిగి ఉండడం అందరికీ మంచిదని అంటారు. చర్చల్లో, వాదోపవాదాల్లో జ్ఞాన వివేకాల పంపిణీ జరగాలి కానీ అజ్ఞాన అవివేకాలు కాదంటారు మరో వ్యాసంలో.
పుస్తకంలోని చివరి వ్యాసం అన్నిటి కన్నా హైలైట్ అని నేనుకుంటాను. గొప్ప గొప్ప సినిమా పాటలని ప్రస్తావిస్తుంది ‘అమృత పుష్పాలు’ వ్యాసం. ఏ పాట ఏ సందర్భంలో మనల్ని ఎలా సేదదీరుస్తుందో, ఎంతలా ప్రేరణ కల్గిస్తుందో, మనసులో ఎంత ఉత్సాహాన్ని నింపుతుందో చెప్తారు. చిన్ననాటి సంగతులను మనోయవనికపైకి రప్పించి ఊరట కలిగిస్తాయి కొన్ని పాటలు. “ఈ అనంతానంత విశ్వంలో అంతులేని విషాదాలలో ఇంకా ఇతరేతర దుఃఖ విన్యాసాల్లో ఊరట పాటలే” అన్న రచయిత్రి అభిప్రాయంతో చదువరులు ఏకీభవిస్తారు.
~
ఒక కాలమ్ విజయవంతమవ్వాలంటే – నిర్దిష్టత, నిశిత పరిశీలన మరియు విశ్లేషణ, వైవిధ్యం, సమకాలీన అంశాలు, స్పష్టమైన భాష, వ్యక్తిగత ముద్ర, స్పష్టమైన ముగింపు తప్పనిసరి. వ్యక్తిగత ముద్ర వేయడం చాలా ముఖ్యం. పాఠకులు రచయితతో కనెక్ట్ అవడానికి ఇది చాలా అవసరం. అల్లూరి గౌరీలక్ష్మి గారి కాలమ్ ఇవన్నీ సమకూర్చుకుని కొనసాగిందనడంలో సందేహం లేదు.
ఇవి చదువుతుంటే, ఎందుకో, ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ మ్యూజింగ్స్ గుర్తొచ్చాయి. ఈ పుస్తకంలోని వ్యాసాలూ, ఆయన తన పాడ్‌కాస్ట్‌లో చెప్తున్నవీ జీవనసత్యాలే! కొన్నిసార్లు ఇవి చేదుగా అనిపించవచ్చు, కానీ ఆచరణలో అసాధ్యం మాత్రం కాదు. కొద్దిగా సాధన చేస్తే, జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు.
***
రచన: అల్లూరి గౌరీలక్ష్మి
ప్రచురణ: చంద్రకాంతీ పబ్లికేషన్స్
పేజీలు: 120
వెల: ₹ 120/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
పి.ఎస్. గోపాలరాజు,
జి-4, సి-బ్లాక్, వర్టెక్స్ ప్రిస్టైన్,
నిజాంపేట్ రోడ్, హైదర్‍నగర్,
హైదరాబాద్ – 500090.
ఫోన్: 9948392357
~
శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-alluri-gaurilakshmi-ck/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.

