[చీమనహళ్ళి రమేశబాబు గారు రచించిన కన్నడ కథని అనువదించి ‘దాగుడుమూతలు’ పేరుతో అందిస్తున్నారు శ్రీ చందకచర్ల రమేశ బాబు.]
శేఖర్ ఉదయం లేవగానే తను రోజూవారి రాసుకునే డైరీ కోసం వెతకసాగాడు. రోజూ ఇదే వరసైపోతోంది అని గొణుక్కుంటూ టేబల్, సోఫాల పైనా క్రిందా వెతికాడు. మళ్ళీ రూములోకి వెళ్ళి అన్ని చోట్లా వెతికాడు. నిన్న ఉదయం ఇక్కడే మంచం పైనే ఉంచాను కదా, ఎక్కడికి పోయింది అనుకుంటూ హాల్లోకి వచ్చాడు. వంటింట్లో పాత్రల చప్పుడవుతోంది. భార్యకు వినబడేలా “ఈ ఇంట్లో ఒక చోట పెట్టిన వస్తువు ఇంకెక్కడికో మాయమవుతుంది. చేతులు ఊరుకోవాలి కదా” అని గొణిగాడు. పాత్రల చప్పుడు మరింత ఎక్కువయ్యింది. దాంతో పాటు “రోజూ ఉదయం ఇదే అయ్యింది మీది. నలభైకే ముసలోళ్లయ్యారు. మతిమరుపు, బిపి, అన్నిట్లోనూ ముసలితనమే..” అనే మాటలు బిగ్గరగా బయటికి వచ్చాయి. ఇది ఇంకెక్కడికో దారి తీసేలా ఉందనుకుని కూతురి రూముకు వెళ్ళాడు. తను ముద్దుగా నిద్దరోతూ కనిపించింది. తను హత్తుకుని పడుకున్న టెడ్డీ బేర్‌ను లాగెయ్యాలనిపించింది. దగ్గరగా వెళ్ళి దాని తలపై చెయ్యి పెట్టాడు. కూతురు “పప్పా! నీది రోజూ ఇదే కథ అయింది. ప్లీస్..” అంటూ పక్కకు ఒత్తిగిల్లింది. ఆమె కౌగిలిలో టెడ్డీ బేర్ ప్రసన్నంగా నవ్వుతున్నట్టనిపించింది. దాని పట్ల ఒక రకమైన అసూయ కలిగి మొహం ముడుచుకుపోయింది. మళ్ళీ హాల్లోకి వచ్చి, టేబల్ పైనున్న నిన్నటి పేపరులోని ‘సంపాదకీయమైనా చదువుదాం’ అనుకుని తీసుకున్నాడు. డైరీ దాని కిందే కనిపించింది. రాత్రి పేపర్ చదివి టేబల్ పైనున్న డైరీ పైన తనే పెట్టింది. పడుకునేటప్పుడు డైరీని తీసుకొచ్చి మంచం పైని దిండు కింద పెట్టుకోవాలి అనుకున్నాడు. ‘అన్నీ మరచిపోవడాలే’ అనుకుంటూ రూములోకి వెళ్ళాడు.
శేఖర్ ప్రతి రోజూ ఉదయం ఐదు గంటలకే లేచి మొహం కూడా కడుక్కోకుండా వెనుకటి రోజు జరిగిన సంఘటనల గురించి రాసి పెట్టడం అలవాటు. ఉదయాన్నే ఇలా డైరీ కనబడకపోతే తల్లడిల్లి పోతాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నా వారంలో రెండు మూడుసార్లయినా మరచిపోవడం, వెతుక్కోవడం జరుగుతోంది. డైరీ రాయడం అయిపోతే మిగిలిన పనులన్నీ సజావుగా జరిగి, సమయానికి సరిగ్గా పన్లోకి వెళ్లవచ్చు. డైరీ తరువాత వాకింగ్, అలాగే పాలు తేవడం, పేపర్ చదవడం, కారు కడగడం, తరువాత స్నానం, టిఫిన్, కాఫి.. ఇలా మిగిలిన పనులన్నీ వేగంగా సాగిపోతాయి. ఈ రోజు కూడా ఆఫీసుకు ఆలస్యమే అనుకుంటూ పేజీలు తిప్పసాగాడు. నిన్న మధ్యాహనం లంచ్ బ్రేక్‌లో నాన్నకు ఫోన్ చేసి మాట్లాడాలనుకున్నాడు. మరచిపోయాడు. మళ్ళీ ఇంటికొచ్చాక ఫోన్ చేయాలనుకున్నాడు. కానీ, చిన్న చిన్న పనులు, పేపర్ చదవడంలోపడి మరచిపోయాడు. మళ్ళీ గుర్తుకు వచ్చింది పడుకునే ముందు. అప్పుడు చేయడమెందుకులే అనుకుని మానుకున్నాడు. అతడు తన తండ్రితో మాట్లాడడమే వారంలో రెండు రోజులు. ఆదివారం కాక వారం మధ్యలో ఎప్పుడైనా ఒకసారి. అది కాకుండా నెలలో ఒక సారి భార్య, కూతుర్లతో కలిసి ఆయనకు ఇష్టమైన తిళ్ళను తీసుకుని వెళ్ళొస్తాడు.
శేఖర్ తండ్రి వృద్ధాశ్రమంలో ఉంటారు. నర్స్, డాక్టర్, కేర్ టేకర్, సంతులిత ఆహారం, వ్యాయామానికి అని ఒక మాస్టర్, అదే వయస్సు వాళ్ళ సాహచర్యం.. ఇలా అన్నీ ఉన్న వృద్ధాశ్రమం. అందులో చేరాలని తీర్మానించింది కూడా ఆయనే. ఎందుకో ఆయనకు కొడుకు ఇంట్లో ఉండడం ఇరుకనిపించింది. ఎవరూ ఏమీ అనేవారు కాదు. కానీ ఏదైనా కావాలన్నప్పుడు, లేదా కావలసింది టైముకు దొరకనప్పుడు ఇబ్బంది అనిపించేది. తనను నిర్లక్ష్యం చేస్తున్నారు అనిపించేది. వయసు ప్రభావం అనుకున్నా మళ్ళీ అదే అనుమానం లోపల కాల్చేది. దాంతో పాటు బిపి ఉండడం వల్ల గొణగడం జరిగేది. ఈ విషయాల్లోనే ఒకట్రెండు సందర్భాలలో కొడుకు, కోడళ్ళతో గొడవపడడం కూడా జరిగింది. మనుమరాలు కూడా ఆయన వైపు వేలెత్తి చూపింది. ఇక అక్కడ ఉండడం ఆయనకు ఇబ్బందిగా మారింది. అలాగే కొనసాగితే ఎవరి ఆరోగ్యానికి కూడా మంచిది కాదనకుని ఆ తీర్మానానికి వచ్చారు. వృద్ధాశ్రమం ఖర్చును తను భరిస్తానని శేఖర్ అన్నాడు. కాని ఆయన ‘ఇప్పుడు నాకు నెలకు డెబ్బై వేలు పించను వస్తుంది: దాన్నేం చేసుకోను? ఎలాగూ నేనుపోయాక మిగిలిన డబ్బుకు నువ్వే వారసుదారుడవు కదా’ అంటూ ఆ ఖర్చును తన నెత్తికెత్తుకున్నారు. శేఖర్‌కు కూడా అది సబబే అనిపించింది. తాము శ్రమించి గడించిన డబ్బును ఖర్చుపెట్టుకోవడంలో ఉన్న ఆనందానికి విలువ కట్టడం కష్టం అనుకుని గమ్మునయ్యాడు. ఆయన వృద్ధాశ్రమంలో చేరాక ఎలాగైనా తను ఆయనను నిలవరించి ఉండవచ్చేమో అనిపించింది. అదొక పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఒక రెండు క్షమాపణ మాటలు ఆయన నిర్ణయాన్ని మార్చేవేమో? కాని, ఆయన నిర్ణయం విన్నప్పుడు తను కోరుకున్నది కూడా అదేనేమో అనిపించింది. భార్య మాత్రం “నాకూ, దీనికి ఏం సంబంధం లేదు. ఆయన లేకపోతే నాకు సంతోషమే. కాని ఉంటే నేనేమీ అనను. అది మీ తండ్రీ కొడుకుల మధ్య విషయం. మామ కోడళ్ళ మధ్యది కాదు. నాకూ చాలా తలనెప్పులున్నాయి. ఆఫీసు, ఇల్లు, కూతురు, మీరు.. ఎన్నని చూసుకోను? బ్రతుకంతా హడావిడే అయిపోయింది.” అనింది. శేఖర్ వద్ద మాట్లాడడానికి మాటలు కరువయ్యాయి.
శేఖర్ రాయాలని అనుకున్నదంతా డైరీలో రాసి దాన్ని దిండు క్రింద పెట్టాడు. దిండు పైనున్న అల్లిక ఆకర్షణీయంగా నవ్వుతూ కనిపించింది. చిన్నతనంలో అమ్మ ఇంటి ముందు వేస్తున్న ముగ్గు గుర్తుకు వచ్చింది. ఆమె ఉండుంటే ఇప్పుడేం చేస్తుండేది? తన భర్తతో పాటు వెళ్ళేదా లేక కొడుకుతో ఉండిపోయేదా అని ఆలోచన కలిగింది. తామంతా ఆమెకు ముగ్గులోని చుక్కలు. గీతలు గీస్తూ చుక్కల్ని కలిపేది మాత్రమే తెలుసున్న తను దీన్ని ఎలా జీర్ణించుకునేది అనే ఆలోచన సతాయించసాగింది. కిటికీనుండి గాలి జోరుగా దూసుకుని వచ్చింది. ఆషాఢ మాసం గాలికి కళ్ళల్లో దుమ్ము పడి కళ్ళు మసకవుతాయి. అప్పుడే ఆరు సంవత్సరాలయ్యాయి. దుమ్ము పడకున్నా కళ్ళు మసకగా అవసాగాయి. కళ్ళు తుడుచుకుని పాపకు హర్లిక్స్ కలిపి ఇద్దామనుకుని పాలు తేవడానికి తలుపు తెరిచాడు. అక్కడే తన చిన్న ఇంట్లో ఉన్న కుక్కపిల్ల కుయ్యిమంది. ఒకసారి దాని వైపు ఆప్యాయంగా చూశాడు. అది తోక అల్లాడించింది. తలుపు తీసి బయటకు వదిలాడు. తలుపు తీస్తుండాగానే అది బయటికి పరిగెత్తింది. అంతలో భార్య “అర్ధ లీటరు ఎక్కువ తెండి. పాస్తా చేద్దాం.” అని ఆర్డరేసింది. అంత డబ్బు జేబులో లేదు అనుకుంటూ మళ్ళీ లోపలికి నడిచాడు. అంతగా అయితే ఫోన్ పే చెయ్యొచ్చు కదా అని అనిపించి ఆగాడు. అలాగే, ‘ఒకవేళ ఆప్ పనిచెయ్యకపోతే? ఈ టెక్నాలజిలను నమ్మలేము, అదికూడా అవసరం ఉన్న సమయాల్లో పనిచెయ్యకపోవడం జరుగుతుంది’ అనుకుని రూములోకి వెళ్ళాడు. అక్కడ తన పర్సునుండి ఒక వంద రుపాయల నోటు తీసి జేబులో పెట్టుకుని మళ్ళీ బయటికి వెళ్ళాడు.
గేటు దాటి బయటికి వస్తుండగా పక్క రోడ్డు పెద్దవయసు దంపతుల వాకింగ్ దృశ్యం కన్నులకు పండగలా అనిపించింది. ప్రతి రోజూ ఇదే సమయానికి చేతులు పట్టుకుని అదీ ఇదీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కాలనీ అంతా నడిచే ఆ దంపతులు తమకంతా ఏదో సందేశం ఇస్తున్నట్టు అనిపించింది. లేదా తమను వెక్కిరించినట్టు అనిపించింది. ఈ సమయంలో తన తండ్రి కూడా స్నేహితులతో ఆశ్రమంలో వాకింగ్ చేస్తుంటారేమో? లేదా ఒంటరిగానా? ఎందుకో కళ్ళు మసకబారాయి. తల వంచుకుని నడవనారంభించాడు. వృద్ధ దంపతులు నవ్వు వీపును తట్టుతున్నట్టనిపించింది.
పాల బూత్ వద్ద చాలా జనం ఉన్నారు. మాటలు, నవ్వులు, అసహనం, నిరాశ ఆ జనాల మధ్యలో ఇరుక్కున్నట్టనిపించింది. కొంత జనం తగ్గనీ అనుకుని వెనిక్కి జరిగి నుంచున్నాడు. గాలి జోరుగా వీచడం వల్ల ఎవరో తోసినట్టయింది. కొంచెం తూలాడు. ఎడమ చేతిని తిప్పుకుని వీపు నిమురుకున్నాడు. వృద్ధ దంపతుల నవ్వు గుర్తుకు వచ్చింది. ఇలాంటి బిజీ నగరంలో ఒక వృద్ధ జంట అంత సంతోషంగా ఉండడానికి వీలవుతుందా అని అబ్బురపడ్డాడు. ప్రపంచపు అద్భుతాల జాబితాకు వీళ్ళని కూడా చేర్చాలి అనుకుంటూ కొంచెం పక్కకు చూశాడు. ఒక కుక్క తన నాలుకను చాపి ఊపిరాడే శబ్దం చేస్తూ కనిపించింది. ఒక్క క్షణం అలాగే నిలబడ్డాడు. ఎలాంటి తప్పు చేశాను అనుకుంటూ వేగంగా ఇంటి వైపు నడవసాగాడు. ఇంటికి రాగానే తలుపు తెరిచి భార్యతో “ కుక్క పిల్ల వచ్చిందా?” అని అడిగాడు. ఆమె ఆశ్చర్యంగా శేఖర్‌ను చూడసాగింది. అతడికి అర్థమయ్యింది. మళ్ళీ బయటికి పరిగెత్తాడు. తమ రోడ్డు, అటూ ఇటూ రోడ్లు తిరిగి చూసి మళ్ళీ ఇంటికి వచ్చి భార్యతో “మన డాటి తప్పిపోయింది.” అంటూ గసపోసుకోసాగాడు. ఆమె విస్తుపోయింది. కూతురు “డాటి తప్పిపోయిందా.. మీకెవ్వరికీ దాని గురించిన శ్రద్ధ లేదు. పాపం, మాట్లాడలేని ప్రాణి అది. ఏం చేస్తుందది, ఎక్కడ తింటుంది? నువ్వున్నావు చూడు పప్పా? ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు. తాతతో పాటు నువ్వు కూడా వెళ్ళాల్సింది. అయ్యో.. డాటి..” అంటూ శేఖర్ పైన అరిచి బయటికి పరిగెత్తింది. భార్య అడిగింది “మీతో పాటు వాకింగ్‌కు తీసుకెళ్లలేదా?” అని. “తీసుకెళ్లాలి అనుకునే దాన్ని బయటకు వదిలాను. అంతలో మరచి..” మాటలు ఆగిపోయాయి. గొంతు పెగల్లేదు.
దానికి ఆమె “అదేం మతిమరుపు మీది.. అరవై అయినట్టు చేస్తారు. రండి వెతుకుదాం.” అంటూ బయటకు నడిచింది. శేఖర్ భార్యను వెంబడించాడు. వీళ్ల ఆత్రం, గాబరా గమనించిన కొంత మంది, వీళ్లను ఆపి సంగతి ఏమని అడిగితే వాళ్లకి జవాబు చెప్పి ముందుకు సాగారు. “ఉండండి. మా లే ఔట్ గ్రూపులో వేస్తాను.” అన్న ఒకాయన మాటలు వాళ్ళకు చేరలేదు. శేఖర్ తన అఫీసుకు ఫోన్ చేసి “ఈ రోజు రావట్లేదు. మా కుక్కపిల్ల తప్పిపోయింది.” అని చెబుదామనుకుని మొబైల్ తీశాడు. తరువాత గుర్తుకొచ్చింది ఈ రోజు శనివారం అని. ఎలాగూ సెలవే అనుకుని నడవసాగాడు. మొదట తమ కాలనీలోని అన్ని రోడ్లలోనూ, ఖాళీ సైట్లలోనూ వెతికారు. ఒక చోట దట్టంగా పెరిగిన మొక్కలున్న సైట్లోకి దిగి ఆ మొక్కల మధ్యలో తొంగిచూడసాగాడు. అంతలో ఎవరో ఒకాయన “సార్. సైట్ మీదా? అమ్ముతారా? మంచి రేటు ఇప్పిస్తా?..” అని అడిగాడు. శేఖర్‌కు జోరుగా అరవాలనిపించింది. అది వీలుకాకుండా వాడి వైపు గుర్రుగా చూశాడు. వాడు “ఇతడెవరో పిచ్చివాడులా ఉంది” అనుకుంటూ వెళ్ళిపోయాడు.
శేఖర్ తరువాత తన కాలనీలోని అన్ని మురిక్కాలవల్లోనూ తొంగి చూశాడు. దాంతరువాత అన్ని ఇళ్ళకూ వెళ్ళి “మా కుక్కపిల్ల ఏమైనా వచ్చిందా?’ అని అడిగాడు. కొంచెం సేపటికి భార్య, కూతురు కూడా వచ్చారు. అందరి మొహాలు వేలాడుతున్నాయి. డాటిని పోగొట్టుకున్నాక తమ జీవితంలోనే ఉత్సాహం కోల్పోయినంతగా క్రుంగిపోయి కనిపించారు. అంత ఆత్మీయత పెంచుకున్నారు డాటి పైన. కూతురు శేఖర్‌ను మళ్ళీ తనదైన శైలిలో తిట్టింది. ఆమె గొంతుకు భార్య కూడా స్వరం కలిపింది. అతడు కొంచెం సేపు వీచే గాలికి మొహం పెట్టి కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ తెరిచేతంలో తడిగా ఉన్నాయి. మరి కొంచెం సేపు అక్కడే నిలుచుని, మళ్ళీ తన ఎలెక్ట్రిక్ స్కూటీ వేసుకుని పక్కన ఉన్న కాలనీల్లోకి దూసుకుపోయాడు. అక్కడక్కడా స్కూటీని ఆపి మురిక్కాలవలల్లోకి, ఖాళీ సైట్లలోకి తొంగిచూడడం చేయసాగాడు. మళ్ళీ ఎవరైనా దొరికితే ఇలాంటి “కుక్కపిల్లని ఏమైనా చూశారా? కనిపిస్తే మాకు తెలపండి” అంటూ ముందుకు వెళ్లడం చేస్తూ ఉన్నాడు. అతడి చెదరిన వెంట్రుకలు, దిగులు, గాబరా నిండిన కళ్ళు, అస్పష్టంగా ఉన్న మాటలు చూసేవాళ్ళకి అతడేమైనా మనసికంగా అస్వస్థుడా అనిపించసాగింది. ఇక్కడ ఉండవచ్చు అనుకుంటూ అక్కడికి వెళ్తాడు, లేదు అనుకుంటూ తిరిగి వస్తాడు. మళ్ళీ ఇంకో చోట కూడా అలాగే చేస్తాడు. ఈ అపార్ట్‌మెంటులోకి వెళ్ళుంటుందేమో అనుకుంటూ అటు పరుగెడతాడు. వెటర్నరీ ఆస్పత్రికేమైనా వెళ్ళిందా అంటూ వేగంగా అక్కడికి వెళ్తాడు. ఇలా రెండు గంటలు తిరిగేటప్పటికి స్కూటర్లోని ఛార్జ్ అయిపోయి కాలెత్తేసింది. “థత్” అనుకుంటూ దాన్నొక తన్ను తన్నాడు. దాన్ని ఒక పక్కకు ఆపి, అక్కడే నిలబడి, అక్కడ్నుంచి తనకు ఎరికలో ఉన్న వాళ్లందరికీ ఫోన్లు చేసి చెప్పాడు: అలాగే కుక్కపిల్ల ఫోటోను వాట్సప్‌లో పంపాడు. అలా కొంచెం సేపు నిల్చుని, ఇక ఇంతకంటే తనకు చేతకాదని అనుకుని స్కూటీని తోసుకుంటూ ఇంటి దారి పట్టాడు. ఇంటికి రాగానే సోఫాలో కూలబడ్డాడు. కూతురు “డాటి దొరకలేదా నాన్నా?” అని అడిగింది. లేదన్నట్టు తలూపాడు. కూతురు గొంతుపెంచింది. ‘అది లేకుండా తను బ్రతకలేను’ అంది. భార్య ‘మరోసారి వెతకరాదా’ అనేలా చూసింది. తను ఇంత అలసి ఇంటికొస్తే ఒక గ్లాసెడు మంచినీళ్ళైనా అడగే శ్రద్ధను చూపని తనవాళ్ళ వైపు ఒకసారి చూసి మరింత క్రుంగిపోయాడు. ప్రాధాన్యత, అవసరం.. ఇలాంటి మరిన్ని పదాలు పెద్ద బండరాళ్ళలా తన పైకి వచ్చినట్టు ఉలిక్కిపడ్డాడు. నిదానంగా లేచి, తనే ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని తాగి, మళ్ళీ సోఫాలో కూలబడ్డాడు. అలాగే ఒరిగి కళ్ళు మూసుకున్నాడు.
ఆ అడవి కొవ్వు పట్టి ఉంది, చెట్లతో, ఇతర ప్రాణి పక్షులతో. అతడు అలాంటి అడవిలో అడుగు పెట్టాడు. సింహాలు, పులులు, చిరుతలు, నక్కలు, మొసళ్ళు.. అన్నీ తమంతకు తాము నిమ్మళంగా ఉన్నాయి. అతడి నడక వాటి నెమ్మదికి భంగం కలిగేలా లేదు. చెట్ల వైభవోపేతమైన ఎత్తు ముందు అతడు కనబడకుండా నడుస్తున్నాడు. కొండలు, లోయలని ఎక్కి దిగాడు. ప్రవహించే నదుల ఒడిలోకి దూకి జయించినవాడిలా ముందుకు సాగాడు. అడవి వ్యాకోచించసాగింది. క్షణక్షణానికి పెద్దదవుతున్నట్టు అనిపించసాగింది. మధ్యలో ఉన్నానా.. ఇంకా మొదల్లోనే ఉన్నానా లేదా చివర్న ఉన్నానా అనే గందరగోళంలో పడిపోయాడు. మళ్ళీ నడక కొనసాగించాడు. మరో కొండ. మధ్యలో నోరు తెరిచినట్టు కనిపించే గుహ. దాని ఆకర్షణీయమైన నోట్లోకి దూసుకుని వెళ్ళాడు. అందులో అతడి ముద్దు డాటి. దాని పక్కలో అతడి తండ్రి. డాటి మొరుగుతూ అతడి పైకి దూసుకుని వచ్చింది. తండ్రేమో ఒక రాతి ఆయుధాన్ని తీసుకుని అతడి వైపు వచ్చాడు. తప్పించుకోవాలని వెనిక్కి తిరిగిన శేఖర్ గుహలోని రాయి తట్టుకుని నేలపై పడ్డాడు. అరణ్యమంతా అతడి పైన పడినట్టు అనిపించింది. మళ్ళీ లేచాడు. అంతా బయలు. గ్రాఫిక్స్ ఇంద్రజాలమేమో అన్నట్టు చుట్టూ పలు అంతస్తుల మేడలు లేచి నించోసాగాయి. అతడి పైన కూడా! అతడు సమాధి అయ్యాడు. అతడు చనిపోయినట్టు సోఫాలో పడున్నాడు. భార్య “ఎవరో ఫోన్ చేస్తున్నారు చూడండి.” అంటూ లేపింది. కలలోని గాబరాతోనే లేచి కూర్చున్నాడు. మొబైల్ తీసుకుని చూశాడు. పక్క కాలనీ స్నేహితుడు. ఫోన్ చేసి అడుగుతూనే భార్యతో “డాటి దొరికింది.” అంటూ బయటికి పరిగెత్తాడు.
పక్క కాలని చివర ఉన్న స్మశానం కాంపౌండ్ పక్కన శేఖర్ డాటి తోకూపుకుంటూ ఒక వృద్ధుడితో ఆటలాడుతూ కనిపించింది. ఆయన దాన్ని ముద్దు చేస్తున్నాడు. శేఖర్ ఆ వ్యక్తి వైపు చూశాడు. సుమారు డెభై ఐదు ఉండవచ్చు ఆయనకు. చెదరిన తెల్ల వెంట్రుకలు, అదే రంగు పిల్లి గడ్డం, నెలల తరబడి స్నానం చేయని దేహం, ఉతకని మాసిన బట్టలు. తొడుకున్న చొక్కా, ప్యాంటు కూడా చాలా చోట్ల చిరిగి ఉంది. ఛాతీ పైన నాలుగైదు పూల మాలలు ధరించాడు. బహుశా పక్కనున్న సమాధి పైనున్న మాలల్ని తెచ్చుకునుండాలి. మొహం పైన మందహాసం. ఆ వ్యక్తి శేఖర్‌ను తేరిపార చూస్తూ “ఈ పిల్ల మీదేనా? పొద్దున్నుండి నాతోనే ఉంది. తీసుకు పొండి” అన్నాడు. శేఖర్ నింపాదిగా అతడి వైపు నడిచి తన డాటీని తీసుకుని మళ్ళీ ఆ వ్యక్తి వైపు చూడసాగాడు. అతడు మళ్ళీ “అమాయక ప్రాణి. ఇప్పుడు మనుషులు కాకపోతే ఎవరు దానికి దిక్కు? విలవిలాడుతుండింది. అసహాయకత కదా.. మనం చూసుకోవాలనుకుంటాయి.” అని చెప్తూ కూర్చునే ఉన్నాడు. శేఖర్‌కు అక్కడ నిలబడడానికి మనసొప్పలేదు. డాటితో పాటు ఇంటికి బయలుదేరాడు.
ఇంట్లో భార్య, కూతుర్ల సంతోషానికి మితి లేకుండా పోయింది. డాటిని ఎత్తుకుని ముద్దాడసాగారు. కూతురు తండ్రి దగ్గరకు వచ్చి “థ్యాంక్యూ పప్పా! లవ్ యు పప్పా!!” అంటూ హత్తుకుంది. అతడు గందరగోళంలో పడ్డాడు. చుక్కలను చేర్చే తల్లి చేతులు గుర్తుకు వచ్చాయి. ఆ రోజు పడుకునే దాకా తల్లీ కూతుళ్ళ సంబరమే సంబరం. కూతురైతే డాటి మరో పుట్టినరోజులా తనకిష్టమైన కేకును తెప్పించి, కోసి ఆనందించింది. ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు రేపు పొద్దున డైరీలో రాయడానికి ఒక విలువైన సమాచారం దొరికింది అని శేఖర్ అనుకున్నాడు. ఇదంతా రాయడానికి కొంచెం ఎక్కువ సమయమే కేటాయించాలి అని కూడా అనుకున్నాడు. కళ్ళు మూయడానికి ముందు ‘ఈ రోజు కూడా తండ్రికి ఫోన్ చేయడం మరచిపోయాను’ అనుకున్నాడు. రేపైనా తప్పకుండా చెయ్యాలి అనుకుని నిద్రలోకి జారుకున్నాడు.
మరుసటి రోజు లేవగానే తొందరగా అన్ని పనులు ముగించాడు. డైరీలో రాసి తీసిపెట్టాడు. ఆ రోజు డైరీలో మొదటిసారిగా డాటి ప్రస్తావన వచ్చింది. టిపిన్ చేసి ఆ రోజు పేపర్ చదవడం మొదలుపెట్టాడు. మూడవ పేజీకి వచ్చినప్పుడు ఒక ప్రకటనలో కనబడిన ఒక వ్యక్తి ఫోటో అతడిని ఆకర్షించింది. ఎక్కడో చూసినట్టుందే అనుకున్నాడు. నిన్న డాటిని తనకు అందించిన వ్యక్తి ఇతడే కదా అనిపించి మరొక్కసారి రెప్పలు విప్పార్చి చూడసాగాడు. అవును, అదే వ్యక్తి. అదే చిరునవ్వు. ఆ వ్యక్తి ఫోటో క్రింద “మానసిక అస్వస్థత కలిగిన సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల ఒక వ్యక్తి ఇల్లు వదిలి వెళ్ళారు. చూసినవాళ్ళు ఈ నంబర్‌ను సంప్రదించండి” అని కనిపించింది. శేఖర్‌కు ఆ మనిషి మానసిక అస్వస్థత కలిగినవాడు అనిపించలేదు. కొద్దిగా బాధపడ్డాడు. లేచి క్రితం రోజు అతడు కనిపించిన జాగా వైపుకు నడిచాడు. అతడు అక్కడ కనిపించలేదు. మాలనుండి విడివడిన పూలు స్మశానం వైపు వరసగా పరచబడ్డాయి. అది అతడు వచ్చినట్టా లేదా వెళ్ళినట్టా అని తెలిసేలా కనిపించలేదు. స్మశానం కాంపౌండు వద్ద నిలబడి కాళ్ళెత్తి చూశాడు. సమాధుల వరస అతడిని కలవరపరచింది. క్రితం రోజు పూడ్చిపెట్టిన ఒకట్రెండు సమాధుల పైనున్న పూల గుంపు అకారణంగా ఏడుస్తున్నట్టు అనిపించింది. అక్కడే పక్కనున్న మఠం బాగా వర్ధిల్లి నవ్వుతున్నట్టు అనిపించింది. అక్కడ నిలబడలేక ఇంటికి వచ్చేశాడు.
ఇంటికి వచ్చేటప్పటికి ఫోన్ రింగ్ వినిపించింది. నిరుత్సాహంగానే తీసి మాట్లాడాడు. అతడి మొహం మెల్లగా వికసించ సాగింది. ఐదు సంవత్సరాల క్రింత నగరం నుండి కొంచెం దూరంగా పది లక్షలకు తీసుకున్న సైటుకు లభించే మొత్తాన్ని విన్నతరువాత సంతోషపు పరమావధి చేరుకున్నాడు. శేఖర్ సైటు పక్కనే ఒక బహుళ జాతి కంపెని ప్రారంభమవుతోంది. తన సామ్రాజ్యాన్ని విస్తరించే ప్లానులో అది మరింత జాగాను ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. దాని ప్రభావం వల్లనే శేఖర్‌కు ఆ కంపెని రెండు కోట్ల ఆఫర్ ఇచ్చింది. అదే సంగతిని వినిపించుకుని శేఖర్ సంతోషపడ్డాడు. భార్యకు చెప్పడానికి వంటింట్లోకి నడిచాడు. అది విన్న భార్య “చివరికి లక్ష్మేదేవి కృపా కటాక్షాలు మన పైన పడ్డాయి” అంటూ ఆనందించింది. రూములో ఉన్న కూతురు “ఎందుకమ్మా? ఇన్ని రోజులు మనం బాగలేమా?” అని అడిగింది.
“ఏ.. నీకేం తెలుసే? నీ పెళ్ళి సమయం రానీ అప్పుడు తెలుస్తుంది. లక్షలు గుమ్మరించాలి.” శేఖర్ భార్య గొంతు పెంచి అన్నది.
రూములో నుండి “ఆ అవకాశం మీకు నేనివ్వను. నేనే వెతుక్కుంటాను.” అంటూ అంతే పెద్ద గొంతు బయటికి వినిపించింది. శేఖర్ తనకు వచ్చే రెండు కోట్లను దేన్లో మదుపు పెట్టాలి అనే అంచనాలో మునిగిపోయాడు.
***
కన్నడ మూలం: చీమనహళ్ళి రమేశబాబు
తెలుగు అనువాదం: చందకచర్ల రమేశబాబు
